న్యూఢిల్లీ: నోయిడాలో గత ఏప్రిల్‌లో జరిగిన కార్మికుల వేతన నిరసనల నేపథ్యలో కేసులు నమోదై, అరెస్టయిన పలువురు యువకుల జీవితాలు జైలు కారణంగా నిలిచిపోయాయి. ఐదు నెలలు గడిచినా కొందరికి బెయిల్ లభించకపోవడంతో చదువులు, ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వారి కుటుంబాలు న్యాయవాదుల ఫీజులు, బెయిల్ కోసం అవసరమైన మొత్తాన్ని సమకూర్చేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ‘ది ప్రింట్’ కథనం ప్రకారం.. ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నవారిలో 20–28 ఏళ్ల మధ్య వయసున్న కార్మికులు, విద్యార్థులు, కార్యకర్తలు అత్యధికంగా ఉన్నారు.
పరీక్షలకు వారం ముందు అరెస్టు
హర్దోయికి చెందిన 20 ఏళ్ల అన్షు కుష్వాహా ఫిబ్రవరిలో నోయిడాకు వచ్చాడు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలుస్తూనే బీఎస్సీ చదువును కొనసాగించాలనుకున్నాడు. నోయిడాలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో రోజుకు దాదాపు 10 గంటలు పనిచేసేవాడు. ఏప్రిల్ 14న నిరసనల సమయంలో మోథర్సన్ ఇంటర్నేషనల్ సమీపంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తన సెమిస్టర్ పరీక్షలకు మరో వారం మాత్రమే ఉందని, పరీక్షలు రాయలేకపోతానని పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని అన్షు తెలిపాడు.
మూడు ఎఫ్‌ఐఆర్‌లలో కేసులు
అన్షుపై మూడు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వాటిలో రెండు కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ మరో కేసులో ఇంకా బెయిల్ రాలేదు. అల్లర్లు, హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, అక్రమ నిర్బంధం, నేరపూరిత కుట్ర, అగ్ని లేదా పేలుడు పదార్థాలతో నష్టం కలిగించడం వంటి పలు అభియోగాలు నమోదయ్యాయి. ఐదు నెలలుగా జీతం లేకపోవడంతో పాటు న్యాయవాదుల ఫీజుల కోసం అతడి తండ్రి బంధువులు, పొరుగువారి నుంచి అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు.
న్యాయ ఖర్చుల కోసం అప్పులు
అన్షు తండ్రి పర్మానంద్ కుష్వాహా తన కుమారుడి కేసుల కోసం ఇప్పటికే పలువురు న్యాయవాదులకు డబ్బు చెల్లించినట్లు చెప్పారు. ఒక న్యాయవాదికి రూ.10 వేలు, మరో బెయిల్ కోసం రూ.15 వేలు, మరో కేసుకు రూ.14 వేలు చెల్లించినట్లు తెలిపారు. మరో కేసులో బెయిల్ కోసం నాలుగో న్యాయవాదిని నియమించేందుకు కూడా డబ్బు సమకూర్చుకోవాల్సి వస్తోందన్నారు. నిరసనలకు సంబంధించి పోలీసులు మొత్తం 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, కనీసం 11 మంది ఇంకా బెయిల్ పొందలేదని ‘ది ప్రింట్’ పేర్కొంది.
బెయిల్ వచ్చినా.. విడుదలకు మరో అడ్డంకి
28 ఏళ్ల అమన్ సోనీకి మూడు ఎఫ్‌ఐఆర్‌ల్లోనూ బెయిల్ లభించింది. అయితే బెయిల్ కోసం అవసరమైన ఐదుగురు ష్యూరిటీలను కుటుంబం సమకూర్చలేకపోవడంతో అతడు ఇంకా జైలులోనే ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందిన అమన్ 2025 అక్టోబరులో ఐటీఐ కోర్సు పూర్తి చేసిన తర్వాత మోథర్సన్ ఇంటర్నేషనల్‌లో ఉద్యోగం పొందాడు. కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న అతడి న్యాయ ఖర్చుల కోసం బావ రూ.1.7 లక్షలు అప్పు చేసినట్లు తెలిపారు. ష్యూరిటీల కోసం ఆస్తి పత్రాలు సమకూర్చడంలోనూ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
జైలులోనూ చదువు, పుస్తకాలు
ఈ కేసుల్లో విద్యార్థులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన 25 ఏళ్ల న్యాయ విద్యార్థిని అకృతి చౌధరిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్‌ఎస్‌ఏ) కింద కూడా చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ 2న అలహాబాద్ హైకోర్టు ఆమె నిర్బంధ ఉత్తర్వును కొట్టివేసి, రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయాన్ని జిల్లా మేజిస్ట్రేట్ సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాన్ని నిలిపివేసింది. జైలులో ఉన్నప్పటికీ అకృతి పుస్తకాలు చదవడం, బొమ్మలు వేయడం, ఇతర మహిళా ఖైదీలతో మహాభారతం గురించి చర్చించడం వంటి పనులు చేస్తోంది.
జైల్లోనే యూజీసీ-నెట్‌లో 99.3 పర్సంటైల్
24 ఏళ్ల హిమాంశు ఠాకూర్ హన్స్‌రాజ్ కాలేజీలో హిస్టరీ చదువుకున్నాడు. జైలులో ఉన్న సమయంలో యూజీసీ-నెట్ పరీక్షలో 99.3 పర్సంటైల్ సాధించి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించాడు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ ఇంటర్వ్యూకు వెళ్లాల్సిన సమయంలో అతడిని పోలీసులు అరెస్టు చేసి 11 ఎఫ్‌ఐఆర్‌లలో నిందితుడిగా చేర్చారు. ఎనిమిది కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ మరో మూడు కేసుల్లో నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు. పర్యావరణ, కార్మిక చరిత్రపై పరిశోధన చేయాలనుకుంటున్న హిమాంశు ప్రస్తుతం జైలులోనే తనకు అవసరమైన పుస్తకాలను చదువుతున్నాడు.
ఐదు నెలల జైలు.. భవిష్యత్తుపై అనిశ్చితి
నోయిడా నిరసనల కేసుల్లో అరెస్టయిన యువతకు జైలు శిక్ష మాత్రమే కాకుండా వారి చదువులు, ఉద్యోగాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితులపైనా ప్రభావం పడుతోంది. కొందరు పరీక్షలకు దూరమయ్యారు.. మరికొందరి ఉద్యోగాలు పోయాయి. కుటుంబాలు న్యాయ ఖర్చుల కోసం అప్పుల్లో కూరుకుపోతున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ నోయిడా వంటి నగరాలకు ఉద్యోగాల కోసం రావాలా, స్వగ్రామాల్లోనే ఉండాలా అనే సందిగ్ధతలో పలువురు కార్మికులు ఉన్నారు. అయినప్పటికీ జైలులో ఉన్న కొందరు యువత తమ చదువు, పుస్తకాలు, పరిశోధనపై దృష్టి కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: పితృపక్ష వేళ.. నేపాల్ మృతులకు నటుడు పిండప్రదానం


