హైవేపై హైటెన్షన్.. ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు | BJP MLA Chandrapal Singh Lodhi SUV skids UP Ganga Expressway | Sakshi
Sakshi News home page

హైవేపై హైటెన్షన్.. ప్రమాదంలో బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు

Sep 27 2026 7:31 AM | Updated on Sep 27 2026 7:31 AM

BJP MLA Chandrapal Singh Lodhi SUV skids UP Ganga Expressway

టైర్ ఒక్కసారిగా పేలింది.. క్షణాల్లో ఫార్చ్యూనర్ అదుపుతప్పింది.. రోడ్డుపై పాము మాదిరిగా స్కిడ్‌ అవుతూ దూసుకెళ్లింది.. చివరకు రోడ్డు పక్కనున్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఊహించని ఈ ప్రమాదంలో బులంద్‌షహర్‌ బీజేపీ ఎమ్మెల్యే చంద్రపాల్ సింగ్ లోధీ గాయపడ్డారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ ఎమ్మెల్యే చంద్రపాల్ సింగ్ లోధీ ఫార్చ్యూనర్‌లో ప్రయాణిస్తున్నారు. సియానా ప్రాంతంలో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తుండగా ఒక్కసారిగా వాహనం టైర్‌ పేలిపోయింది. దీంతో డ్రైవర్‌ వాహనాన్ని అదుపులోకి తీసుకురాలేకపోయాడు. ఫార్చ్యూనర్‌ వేగంగా స్కిడ్‌ అవుతూ రోడ్డుపక్కకు దూసుకెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే చంద్రపాల్ సింగ్ లోధీతో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. వెంటనే వారిని హాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరికీ చికిత్స కొనసాగుతోంది.

కెమెరాకు చిక్కిన ప్రమాదం..
ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఫార్చ్యూనర్‌ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై స్కిడ్‌ అవుతూ స్తంభాన్ని ఢీకొట్టిన దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రమాదం ఎంత వేగంగా జరిగిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఉన్నావ్‌లోని సోనిక్ టోల్ ప్లాజా వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. దాదాపు 36 గంటలుగా అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో టోల్ ప్లాజా పరిసరాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 6 అడుగుల మేర నీరు నిలిచినట్లు సమాచారం. టోల్ క్యాబిన్లు పూర్తిగా నీట మునిగాయి. అలాగే, నీరు ఇంజిన్‌లోకి చేరడంతో వాహనం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

నీటిని తోడేందుకు చర్యలు..
నీటిని బయటకు పంపేందుకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్వహణ సంస్థ మూడు జనరేటర్లను ఏర్పాటు చేసింది. ట్రాక్టర్ల సాయంతో జనరేటర్లను నడుపుతూ నీటిని తొలగిస్తున్నారు. సర్వీస్ రోడ్డు సమీపంలో జేసీబీతో గుంత తవ్వి టోల్ ప్లాజా వద్ద నిలిచిన నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ గంటల తరబడి ప్రయత్నాలు కొనసాగుతున్నా నీటిమట్టం పెద్దగా తగ్గలేదని సమాచారం. దీంతో ఉన్నావ్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ వైపు వెళ్లే వాహనదారులు నీటిమట్టం తగ్గే వరకు వేచి చూస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనాలు నీటిలో చిక్కుకుపోతాయన్న ఆందోళన ప్రయాణికుల్లో నెలకొంది.

ఇదీ చదవండి: ఎన్నికల వేళ బీజేపీకి బిగ్‌ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement