సైబర్ నేరగాళ్ల ఆధిపత్య పోరుతో భారత్‌కు సైబర్ ముప్పు?
షైనీహంటర్స్–క్లాప్ ఆధిపత్య పోరుతో పెరుగుతున్న ఆందోళన
ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా సంస్థలపై సైబర్ దాడులు
భారత కంపెనీల డేటా పైనా అప్రమత్తత అవసరం
సాక్షి, న్యూఢిల్లీ: అక్రమంగా ఇంటర్నెట్ ద్వారా జరిగే ‘డార్క్‌వెబ్’ చీకటి వ్యాపార సామ్రాజ్యంలో రెండు సైబర్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు సాధారణ సంస్థలకు ముఖ్యంగా భారతీయ సంస్థలకు సైబర్ ముప్పుగా పరిణమిస్తోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారీ మోసాలు చేస్తూ పెద్ద ముఠాలుగా పేరుమోసిన షైనీహంటర్స్, క్లాప్(సీఎల్‌ఓïపీ) సైబర్ నేరముఠాల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు తాజాగా బహిర్గమయ్యాయి.
ఇటీవల క్లాప్‌కు చెందిన కీలక వెబ్‌సైట్‌ను షైనీహంటర్స్ హైజాక్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. ఈ నేపథ్యంలో భారత్‌లోని కార్పొరేట్ సంస్థల డేటా భద్రతపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాన్ని ఆ మాతృసంస్థ గుర్తించి సరిచేసేలోపే హ్యాకర్లు దానిని కనిపెట్టి దుర్వినియోగంచేయడాన్ని జీరో డే అంటారు. 2026లో ‘ఓరాకిల్ పీపుల్ సాఫ్ట్’లోని ఒక కీలక లోపాన్ని ‘షైనీ హంటర్స్’ ఇలాగే దుర్వినియోగం చేసినట్లు ‘గూగుల్ థ్రెట్ ఇంటిలెజెన్స్’ వెల్లడించింది. ఈ విషయంలో వందకుపైగా సంస్థలను ముందుగానే హెచ్చరించినట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘మాండియేంట్’ పేర్కొది.
ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంస్థలు వినియోగించే ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను సైబర్ ముఠాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ‘ఓరాకిల్ పీపుల్ సాఫ్ట్’లోని కీలక లోపాన్ని ఉపయోగించి ‘షైనీ హంటర్స్’ వందకుపైగా సంస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు ‘గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్’ తెలిపింది. మొదటి దశలో ఎక్కువగా అమెరికా విద్యా సంస్థలు లక్ష్యంగా ఉన్నప్పటికీ, తాజా దాడుల్లో టెక్నాలజీ, ఐటీ సేవలు, ఆరోగ్యం, వ్యవసాయం, రవాణా, ప్రభుత్వ రంగ సంస్థల వరకూ లక్ష్యం విస్తరించినట్లు వెల్లడించింది. దీంతో అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీలకూ ఈ దాడి బెడద దాపురించినట్లు వార్తలొచ్చాయి.
ఒరాకిల్ లోపమే వివాదానికి కేంద్రం?
ఓరాకిల్ ఈ–బిజినెస్ సూట్(ఈబీఎస్)పై జరిగిన సైబర్ దాడుతో ఈ పోరు మొదలైందని షైనీ హంటర్స్ ముఠా వెల్లడించిది. గత ఏడాది ఒరాకిల్‌పై ‘క్లాప్’ దాడిచేసిందని, ఒరాకిల్‌పై దాడికి క్లాప్ దుర్వినియోగం చేసి లోపాన్ని తొలుత తామే గుర్తించామని షైనీ హంటర్స్ వాదించింది. ‘షైనీ హంటర్స్’ ముఠా కార్పొరేట్ సమాచారం, ఉద్యోగులు లేదా వినియోగదారులకు సంబంధించిన డేటా, అంతర్గత సమాచారాన్ని దొంగిలించి ఆ తర్వాత వాటిని బహిర్గతం చేస్తామని బెదిరిస్తూ డబ్బు డిమాండ్ చేస్తుందని ‘గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్’ హెచ్చరించింది. 2026లో ఈ ముఠా ఫిషింగ్, ఉద్యోగుల ఆధారాలను దొంగిలించడం, ‘సాస్’ ఖాతాల్లోకి చొరబడటం వంటి నేరాలు చేసింది.
సైబర్ భద్రత కోసం పాటించాల్సిన కీలక సూచనలు...
→ ప్రతి ఆన్‌లైన్ ఖాతాకు ప్రత్యేకమైన, బలమైన పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఒకే పాస్‌వర్డ్‌ను వివిధ ఖాతాలకు ఉపయోగించకూడదు. పాస్‌వర్డ్‌తో పాటు అదనపు భద్రతా పొరను అందించే మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (Mఊఅ)ను అన్ని ముఖ్యమైన ఖాతాల్లో యాక్టివేట్ చేసుకోవాలి
→ మొబైల్ లేదా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, యాప్స్, బ్రౌజర్లు, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలి
→ ముఖ్యమైన ఫొటోలు, డాక్యుమెంట్లు, ఫైళ్లను క్రమం తప్పకుండా సురక్షితమైన క్లౌడ్ స్టోరేజ్ లేదా ఆఫ్‌లైన్ పరికరాల్లో బ్యాకప్ చేసుకోవాలి
→ యాంటీవైరస్, ఎండ్‌పాయింట్ ప్రొటెక్షన్ వంటి భద్రతా సాధనాలను యాక్టివ్‌గా ఉంచి, వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి
→ వై–ఫైకి బలమైన పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. భద్రత లేని పబ్లిక్ వై–ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి
→ తెలియని లాగిన్‌లు, అనుమానాస్పద పాప్‌అప్‌లు, గుర్తుతెలియని లావాదేవీలు లేదా సిస్టమ్‌లో అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే స్పందించి సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయాలి.
→ ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్, నకిలీ గుర్తింపుల ద్వారా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. అందుకే ఏ సమాచారం లేదా వ్యక్తిని నమ్మే ముందు
ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.
– సందీప్ ముదల్కర్, సైబర్ సెక్యురిటీ, ఫోరెన్సిక్ నిపుణుడు


