అసలే కోతి.. ఆపై..! | monkey entered a liquor store in Ranchi and drank half a bottle of alcohol | Sakshi
Sakshi News home page

అసలే కోతి.. ఆపై..!

Sep 27 2026 5:23 AM | Updated on Sep 27 2026 5:23 AM

monkey entered a liquor store in Ranchi and drank half a bottle of alcohol

రాంచీ: కోతి పనులు చేయకురా అని చిన్నారులను పెద్దలు మందలిస్తూనే ఉంటారు. అయినా పిల్లలు వినరు. ఇక కోతులు అస్సలు వినవు. అవి చేసే గోలకు అంతే ఉండదు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఔర్‌మాంఝీ ప్రాంతంలోని ఒక మద్యం దుకాణంలో శనివారం కస్టమర్లు తక్కువగా ఉన్న సమయంలో ఒక కోతి హఠాత్తుగా దుకాణంలోకి దూరింది. దీంతో కౌంటర్‌లోని వ్యక్తులు భయంతో బయటకు పరుగులుతీశారు. 

కోతి మాత్రం నింపాదిగా దుకాణంలో చక్కగా పేర్చిన బీర్, విస్కీ, రమ్, వోడ్కా బాటిళ్లను తేరిపార చూసి మూత తీసి ఉన్న ఒక ‘మ్యాజిక్‌ మూమెంట్స్‌’బ్రాండ్‌ వోడ్కా బాటిల్‌ను అమాంతం తాగేసింది. కొద్ది నిమిషాలకే మద్యం మత్తు దానికి ఎక్కడం మొదలైంది. అప్పటిదాకా మద్యం సీసాల కార్టన్ల మీద గెంతుతూ హడావుడి చేసిన కోతి కొద్ది నిమిషాలకే వాటిపై నిద్రపోయింది. మధ్యమధ్యలో కళ్లు తెరుస్తూ ఎవరినీ దగ్గరికి రానివ్వలేదు. 

కోతిచేష్టల తాలూకు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మద్యం దుకాణాదారుడు వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చి కోతిని బయటకు తీసుకెళ్లారు. దుకాణంలో మర్కటం హడావుడి వీడియో చూసిన నెటిజన్లు జోకులు పేల్చారు. కోతి వీడియోను కామెడీగా మార్చిన వాళ్లను కొందరు పర్యావరణవేత్తలు తప్పుబట్టారు. అటవీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఇది గర్భంతో ఉన్న కోతి. దప్పిక వేళ ఎక్కడా తాగేందుకు నీరు దొరక్కపోవడంతో దుకాణంలోని సీసాల్లో ఉన్నవి నీళ్లు అని భావించి లోపలికి వచ్చి ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement