మందు 'బాబుకు పండగ' | New excise policy makes permit room mandatory for liquor shops | Sakshi
Sakshi News home page

మందు 'బాబుకు పండగ'

Sep 13 2026 3:11 AM | Updated on Sep 13 2026 3:10 AM

New excise policy makes permit room mandatory for liquor shops

మద్యంషాపులకు పర్మిట్‌ రూమ్‌ను తప్పనిసరి చేస్తూ కొత్త ఎక్సైజ్‌ పాలసీ

అక్టోబరు 1వ తేదీ నుంచి అమలు చేయనున్న చంద్రబాబు సర్కారు

మద్యం దుకాణాల రెన్యువల్‌ ద్వారా రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం  

రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ ద్వారా ఏడాదికి మరో రూ.200 కోట్ల ఆదాయం 

పాలసీలో ప్రజారోగ్యం, మహిళల భద్రత, శాంతిభద్రతలను విస్మరించిన ప్రభుత్వం 

టీడీపీ సిండికేట్‌కు మద్యం ధరలను అనధికారికంగా పెంచి విక్రయించే అవకాశం

ఎన్నికల హామీలకు మంగళం పాడిన నారా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించేందుకు కంకణం కట్టుకుంది. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా ఉన్న బెల్ట్‌ దుకాణాలు, అనధికార మద్యం విక్రయాలతో మందుబాబులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గుల్లవుతుంటే, ఇవి చాలవన్నట్టు మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లను తప్పనిసరి చేస్తూ ఎక్సైజ్‌ పాలసీని తీసుకురావడం సర్వత్రా విమర్శలను ఎదుర్కొంటోంది. దీని ద్వారా ఇకపై దుకాణాల వద్దే ‘సిట్టింగ్‌’ను అధికారికం చేయడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త విధానం గాంధీ జయంతికి ముందు రోజు అక్టోబరు 1వ తేదీ నుంచి అమలు చేస్తుండడంపై నిప్పులు చెరుగుతున్నారు.  

సాక్షి, అమరావతి:  తాజాగా మద్యం షాపులకు పర్మిట్‌ రూమ్‌ను తప్పనిసరి చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎక్సైజ్‌ పాలసీని తెచ్చి­ంది. దీంతో ఊరూరా బార్‌ అనే కొత్త పంథాకు ప్రభుత్వం తెరతీసినట్టయింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన 2026–27 ఎక్సై­జ్‌ పాలసీ, దాని అమలుకు తెచ్చిన నిబంధనల సవరణలను పరిశీలిస్తే మద్యం విక్రయాలను భారీగా పెంచి మందుబాబుల జేబులకు మరింత చిల్లు పెట్టేలా ఉంది. 

మద్యం దుకాణం ఏర్పాటు చేయాలంటే పర్మిట్‌ రూమ్‌ ఉండి తీరాలని తాజాగా విడుదల చేసిన జీఓ ఎంఎస్‌ నెంబర్‌ 580లో పేర్కొన్నారు. పర్మిట్‌ రూమ్‌ లైసెన్స్‌ పొందకుండా ఏ షాపు ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని రూల్‌ 14లో స్పష్టం చేశారు. పాలసీ మార్గదర్శకాల జీవో 579లోనూ ఇదే నిబంధనను పునరుద్ఘాటించారు. దీంతో రాష్ట్రంలోని 3,736 మద్యం దుకాణాలను అక్టోబరు 1వ తేదీ నుంచి నుంచి ఊరూ–వాడా– బార్లుగా మారే అవకాశం కల్పించారు. 

నాడు వైఎస్‌ జగన్‌ నియంత్రిస్తే.. నేడు బాబు విస్తరిస్తున్నారు 
మద్యం వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుదిట్ట చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనధికార బెల్ట్‌ షాపులతోపాటు పర్మిట్‌ రూమ్‌లనూ పూర్తిగా ఎత్తివేశారు. మద్యం షాపుల సమీపంలో కూర్చొని తాగే ఏర్పాటునూ రద్దు చేశారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం క్రమంగా మద్యం విక్రయాలతోపాటు వినియోగాన్ని విస్తరించేలా పాలసీలు తెస్తోంది. 

2025 ఆగస్టు 12న జీవో 273 ద్వారా అవసరమైన చోట అనే పేరుతో పర్మిట్‌ రూమ్‌లను తిరిగి తెచ్చారు. అప్పుడు శాఖాపరంగా పరిశీలించి పర్మిట్‌ రూమ్‌లకు అనుమతులిస్తే.. ఇప్పుడు పర్మిట్‌ రూమ్‌ ఉంటేనే మద్యం షాపు లైసెన్స్‌ రెన్యువల్‌ అనే మెలికపెట్టడం గమనార్హం. దీని వల్ల మండల కేంద్రాలు, నగర పంచాయతీలు, పట్టణ కాలనీల్లో ఇలా మద్యం దుకాణం ఉన్న ప్రతిచోటా అక్కడే కూర్చొని మందు తాగే గది తప్పనిసరిగా ఉండనుంది. 

ఆదాయమే అసలు లక్ష్యం.. 
టీడీపీ సిండికేట్‌కు అక్రమ ఆదాయమే అసలు లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం మద్యం పాలసీని అమలు చేస్తోంది. మద్యం షాపులకు పర్మిట్‌ రూమ్‌ పేరుతో 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో ఏడాదికి రూ.5 లక్షలు, ఆపైన ఉన్న చోట రూ.7.5 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇలా రాష్ట్రంలోని 3,736 మద్యం షాపులకు పర్మిట్‌ రూమ్‌ తప్పనిసరి చేయడంతో రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ ద్వారా ఏడాదికి రూ.200 కోట్లకుపైగా ఆదాయం ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజారోగ్యం, మహిళల భద్రత, గ్రామా­ల్లో శాంతిభద్రతలు గురించి ప్రభుత్వ పాలసీలో పట్టించుకోలేదు.  

రెన్యువల్‌ పేరుతో మరో రూ.వెయ్యి కోట్లు 
ఇప్పుడు మద్యం షాపుల లైసెన్స్‌ మరో ఏడాదిపాటు రెన్యువల్‌ చేయడం వల్ల ప్రభుత్వానికి 38 శాతం అదనంగా ‘రెన్యువల్‌ ఆర్‌ఈటీ‘ చెల్లించాలి. ఓపెన్‌ కేటగిరీలో జనాభాను బట్టి రూ.23 లక్షలు, రూ.27.2 లక్షలు, రూ.35.5 లక్షలు. రిజర్వ్‌డ్‌ కేటగిరీలో రూ.11.5 లక్షల నుంచి రూ.17.8 లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 3,736 ఓపెన్‌ షాపుల్లో 340 రిజర్వ్‌డ్‌ షాపుల లెక్క తీసేస్తే రెన్యువల్‌ ఆర్‌ఈటీ రూపంలో రూ.వెయ్యి కోట్లు వరకు ఆదాయం వస్తుందని అంచనా.

మరింత పేట్రేగిపోనున్న టీడీపీ సిండికేట్‌.. 
ఇప్పటికే టీడీపీ సిండికేట్‌ మద్యం ధరలను ఎమ్మార్పీ కంటే రూ.5 నుంచి రూ.20లకు పెంచి విక్రయిస్తున్నారు. అదనంగా వసూలు చేస్తున్న మొత్తంలో ఎవరి వాటాలు వారికి వెళ్తున్నాయనేది బహిరంగ రహస్యం. తాజాగా రెన్యువల్‌ పేరుతో అదనంగా లైసెన్స్‌ ఫీజు, పర్మిట్‌ రూమ్‌కు ట్యాక్స్‌ వంటి కారణాలు చూపి మద్యం ధరలను అనధికారికంగా మరింత పెంచి విక్రయించే ప్రమాదం లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement