ససారం: బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలో 12 ఏళ్ల క్రితం నమోదైన హత్య కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. హత్యకు గురైనట్లు భావించి కేసు నమోదు చేసిన సరస్వతీ దేవి జార్ఖండ్‌లో సజీవంగా కనిపించడంతో అప్పట్లో ఆమె భర్త, మామ, బావతో సహా ఎనిమిది మంది కుటుంబ సభ్యులపై నమోదైన కేసుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2014 ఆగస్టులో దేహ్రీలోని ముఫుస్సిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బల్రతి బిఘా-దహౌర్ ప్రాంతానికి చెందిన సరస్వతీ దేవి ఇంటి నుంచి అదృశ్యమైంది.
ఆమె తన బావతో కలిసి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే సమయంలో ఆగస్టు 22న ఖండా గ్రామం సమీపంలోని కాలువలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. సరస్వతీ దేవి సోదరుడు ఆ మృతదేహాన్ని తన సోదరిదిగా గుర్తించాడు. అనంతరం పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించి హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో సరస్వతీ దేవి భర్త అరుణ్ మెహతా, మామ దిలీప్ మెహతా, బావ గోవింద్ కుమార్‌తో పాటు మొత్తం ఎనిమిది మందిపై ఆరోపణలు నమోదయ్యాయి. వారిలో పలువురు జైలులో, కోర్టు విచారణల్లో సంవత్సరాల పాటు గడిపారు.
అయితే ఇటీవల సరస్వతీ దేవి జార్ఖండ్‌లో జీవించి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దేహ్రీ ముఫుస్సిల్ పోలీసులు.. గర్వా జిల్లాలోని కండి పోలీస్‌స్టేషన్ పరిధి లహరి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఆమెను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె తన పేరును కాంతి దేవిగా మార్చుకుని, రట్టు సింగ్ అనే వ్యక్తితో కలిసి నివసిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆమెను బిహార్‌కు తీసుకువచ్చి ససారం కోర్టులో హాజరుపరిచారు. దీంతో 2014లో కాలువలో లభించిన మృతదేహం ఎవరిది? దానిని సరస్వతీ దేవిగా ఎలా గుర్తించారు? గుర్తింపు ప్రక్రియలో ఏ విధానాలు అనుసరించారు? వంటి ప్రశ్నలు ముందుకొచ్చాయి. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
సరస్వతీ దేవికి ప్రస్తుతం 22 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు అతను చిన్నవాడు. జార్ఖండ్‌లో ఆమె సజీవంగా లభించడంతో 12 ఏళ్ల క్రితం నమోదైన హత్య కేసును పూర్తిగా పునఃపరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలువలో లభించిన మృతదేహం గుర్తింపును నిర్ధారించడమే ప్రస్తుతం పోలీసులకు ప్రధాన సవాలుగా మారింది.
ఇదీ చదవండి: మేరీకోమ్‌పై బిగ్ బాస్ అభిమానుల ఆగ్రహం


