బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతుండగా.. ఈదురుగాలుల వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
శనివారం తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా ప్రధాన రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు విజయవాడలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు యానాంలో వచ్చే మూడు గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన ఉరుములు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి ఉరుములు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Back to Back spells of Heavy rains likely along #Vijayawada city and nearby areas like Amaravati, Mangalagiri during next 1 hour. The rains will definitely be of high intensity. ⚠️
— Andhra Pradesh Weatherman (@praneethweather) September 12, 2026
మరోవైపు... తెలంగాణలో శనివారం తెల్లవారుజాము నుంచే వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. హనుమకొండ, వరంగల్, జనగామ ప్రాంతాల్లో ఇప్పటికే విస్తారంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 9.30 గంటల వరకు యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్ ప్రాంతాలకూ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో రానున్న రెండు గంటల్లో విస్తారంగా మోస్తరు నుంచి తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్, ఆమనగల్ ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడక్కడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు నల్గొండ జిల్లాలోని ఘట్టుప్పల్, మునుగోడు, చండూరు, నల్గొండ పట్టణం, కంగల్, నాంపల్లి తదితర ప్రాంతాలకు విస్తరించి.. ఆ తర్వాత సూర్యాపేట వైపు కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కాలువలకు నిధులు కట్..
Fairly WIDESPREAD MODERATE RAINS across Hanmakonda, Warangal, Jangaon areas now, this will further cover Yadadri - Bhongir, Mahabubabad till 9.30 AM ⚠️🌧️
Enjoy the spell 🌧️ https://t.co/0maF5928UX— Telangana Weatherman (@balaji25_t) September 12, 2026
నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ రానున్న రెండు గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోనూ అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


