విజయభారతి సయానీకి వినతిపత్రం ఇస్తున్న సబిత, సునీత, చిత్రంలో వాణీదేవి, లక్ష్మి, సత్యవతి, లలితారెడ్డి జగదీశ్‌రెడ్డి, వద్దిరాజు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, దామోదర్‌రావు తదితరులు
మహిళా ప్రజాప్రతినిధులమని కూడా చూడలేదు
చీర లాగి అవమానించారు.. గొంతు నొక్కి దాడికి పాల్పడ్డారు
జాతీయ మహిళా కమిషన్, ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబిత, సునీత తదితరులు
దాడికి సంబంధించిన ఫొటోలు, వీడియోల అందజేత
రాజకీయాలతో సంబంధం లేదు.. తక్షణం డీజీపీ నుంచి నివేదిక కోరతాం
బీఆర్‌ఎస్ మహిళా బృందానికి మహిళా కమిషన్, ఎన్‌హెచ్‌ఆర్‌సీ భరోసా
సాక్షి, న్యూఢిల్లీ: ‘నడిరోడ్డుపై.. పట్టపగలు అందరూ చూస్తుండగా మహిళా ప్రజాప్రతినిధుల చీరలను లాగారు. గొంతు నొక్కి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తెలంగాణలో పోలీసులు మాపై అత్యంత క్రూరత్వంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలపై పోరాడతామని మమ్మల్ని ప్రజలు చట్టసభలకు పంపారు. కానీ, ఈరోజు మాకు జరిగిన అన్యాయంపై మేం రోడ్డెక్కి న్యాయం కోసం, సమస్య పరిష్కారానికి పోరాడాల్సి వస్తుంది.
ఆఖరకు ఢిల్లీ వరకూ వచ్చి మీకు మా బాధను చెప్పుకోవాల్సి వచి్చంది’అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి జాతీయ మహిళా కమిషన్ వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే.. ప్రజాప్రజానిధులను గాయపరుస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించి మా సమస్యను పరిష్కరించాలని, తెలంగాణలో పోలీసుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు రెండు కమిషన్లకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి, పోలీసులు వ్యవహరించిన తీరుపై శుక్రవారం ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ కిశోర్ రహత్కర్, ఎన్‌హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లకు రాజ్యసభ ఫ్లోర్‌లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ దామోదర్, మాజీమంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్‌ఎస్ లీగల్ సెల్ బృందం నుంచి బీఎస్ ప్రసాద్, సోమా భరత్, లలితారెడ్డి తదితరులతో కలిసి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
100 గంటలు దాటినా ఎఫ్‌ఐఆర్ లేదు
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి సభకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. నల్ల దుస్తులు ధరించడాన్ని కారణంగా చూపారని, అయితే తమ దుస్తులపై ఎలాంటి అభ్యంతరకరమైన రాతలు లేవని స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పురుష పోలీసులు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందన్నారు. చీర, జుట్టు పట్టుకొని లాగారని, ఇతర ఎమ్మెల్యేలను కిందపడేసి తొక్కారన్నారు. ‘మా మనసులు గాయపడ్డాయి. మహిళలుగా మాకు అవమానం జరిగింది.
శాసనసభ్యులుగా మా హక్కులకు భంగం కలిగింది’అని సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి జరిగి 100 గంటలు దాటినా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని, తిరిగి తమపైనే కేసులు పెట్టడం రాజకీయ నాటకమని విమర్శించారు. ‘మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేయించి తిరిగి వారిపైనే కేసులు నమోదు చేయడం బాధాకరం. మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా చీరలు లాగారు’అంటూ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. మహిళా ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు మగ పోలీసుల్ని విధుల్లో పెట్టడం, మగ ప్రజాప్రతినిధులను అడ్డుకునేందుకు మహిళా పోలీసులను పెట్టి ప్రభుత్వం రాజకీయం చేసిందని మండిపడ్డారు.
మాకు రాజకీయాలతో సంబంధం లేదు
దాడికి గల వీడియోలు, ఫొటోలు, న్యూస్ క్లిప్పింగులన్నీ మహిళా కమిషన్, ఎన్‌హెచ్‌ఆర్‌సీకి మహిళా ప్రతినిధి బృందం అందచేసింది. వాటిని పరిశీలించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ కిషోర్ రహత్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాకు రాజకీయాలతో సంబంధం లేదు. అసెంబ్లీకి వెళుతున్న మహిళా ప్రజాప్రతినిధులను మగ పోలీసులు అడ్డుకోవడం ఏమిటి? చీర లాగడం, గొంతు నులమడం అన్నీ పరిశీలించాం.
ఇది మేం అంత ఈజీగా వదిలిపెట్టే ఇష్యూ కాదని మాకు అర్థమైంది. తక్షణం డీజీపీ నుంచి వివరణ కోరతాం.. ఆ తర్వాత మేం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం’అంటూ ఆమె భరోసా ఇచ్చారు. ‘ఈ తరహా ఘటనలు జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో కమిషన్ ఏం చేస్తుంది? ఏం చేయాలి అనేది స్పష్టంగా ఉంటుంది. కచి్చతంగా చర్యలు అయితే తీసుకుంటాం’అంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీ తాత్కాలిక చైర్‌పర్సన్ విజయభారతి సయానీ భరోసా ఇచ్చారు.


