జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై సస్పెన్స్‌.. చైనా వ్యూహం ఇదేనా? | Why Beijing waited until final 48 hours to confirm Xi Jinping India visit | Sakshi
Sakshi News home page

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటనపై సస్పెన్స్‌.. చైనా వ్యూహం ఇదేనా?

Sep 11 2026 12:51 PM | Updated on Sep 11 2026 1:01 PM

Why Beijing waited until final 48 hours to confirm Xi Jinping India visit

దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్‌ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు బీజింగ్‌ చివరి నిమిషంలో అధికారికంగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా అందరి చూపూ మోదీ-జిన్‌పింగ్‌ భేటీపై పడింది. అసలు ఇంత కీలకమైన పర్యటనను చైనా చివరి వరకు ఎందుకు సస్పెన్స్‌లో పెట్టింది? ఇదే ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

2019లో మహాబలిపురం అనధికారిక సమావేశం తర్వాత జిన్‌పింగ్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. గాల్వాన్‌ ఘర్షణ తర్వాత తీవ్రంగా దెబ్బతిన్న భారత్‌-చైనా సంబంధాలు ఇటీవల క్రమంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, జిన్‌పింగ్‌ పర్యటనకు కేవలం 48 గంటల ముందే అధికారిక ప్రకటన రావడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

చివరి నిమిషం వరకు ఎందుకు?
జిన్‌పింగ్‌ పర్యటనను ఆలస్యంగా ప్రకటించడం వెనుక ఎలాంటి అనిశ్చితి లేదని.. ఇది చైనా అనుసరించే దౌత్య వ్యూహంలో భాగమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సదస్సుకు ముందు జరిగే చర్చల్లో తనకు గరిష్ఠ స్థాయి వెసులుబాటు ఉండేలా బీజింగ్‌ వ్యవహరించిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. బ్రిక్స్‌ డిక్లరేషన్‌, సదస్సు అజెండా, మోదీ-జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీ వంటి కీలక అంశాలపై చివరి వరకు చర్చలు కొనసాగించేందుకు ఈ సస్పెన్స్‌ చైనాకు ఉపయోగపడిందనే విశ్లేషణలు ఉన్నాయి.

భేటీలో ఏం జరుగుతుంది?
అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మోదీ-జిన్‌పింగ్‌ భేటీలో సరిహద్దు పరిస్థితి, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గాల్వాన్‌ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా తొలగిపోలేదు. దీంతో ఈ సమావేశంలో ఇరువురు నేతలు ఇచ్చే సంకేతాలు అత్యంత కీలకం కానున్నాయి.

బ్రిక్స్‌ వేదికగా చైనా మరో వ్యూహం
బ్రిక్స్‌లో ఇప్పుడు 11 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సదస్సు ద్వారా గ్లోబల్‌ సౌత్‌లో తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చైనా భావిస్తోంది. రష్యా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా సహా కీలక దేశాల నేతలు పాల్గొంటున్న నేపథ్యంలో జిన్‌పింగ్‌ హాజరు చైనా దౌత్యానికి కూడా కీలకమే. అందుకే చివరి నిమిషం వరకు సస్పెన్స్‌.. ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడినట్టు తెలుస్తోంది. జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటన వెనుక అసలు ఫోకస్‌ బ్రిక్స్‌ సదస్సేనా? లేక మోదీతో కీలక ద్వైపాక్షిక డీల్‌కు రంగం సిద్ధమైందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement