పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం లేదని వైద్యులను సంప్రదించిన ఓ 26 ఏళ్ల వ్యక్తికి.. వైద్య పరీక్షల్లో ఊహించని విషయం బయటపడింది. సాధారణంగా పురుషుల్లో ఉండని గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి అవయవాలు అతడి శరీరంలో ఉన్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. అంతేకాదు.. రెండు వృషణాలు కూడా సాధారణ స్థానంలో లేకపోవడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇన్‌ఫెర్టిలిటీకి కారణమేంటో తెలుసుకునేందుకు చేసిన పరీక్షలతో ఈ అరుదైన పరిస్థితి వెలుగులోకి వచ్చింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడికి వీర్యంలో శుక్రకణాలు పూర్తిగా లేకపోవడం (అజూస్పెర్మియా) గుర్తించారు. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో గర్భాశయంతోపాటు ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి ముల్లెరియన్ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. దీనిని పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ (PMDS)గా నిర్ధారించారు.
అసలు PMDS అంటే ఏమిటి?
మగ శిశువు గర్భంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు.. వృషణాల నుంచి ఉత్పత్తయ్యే యాంటీ-ముల్లెరియన్ హార్మోన్ (AMH) ప్రభావంతో ముల్లెరియన్ డక్ట్స్ అనే ప్రారంభ నిర్మాణాలు సాధారణంగా కనుమరుగవుతాయి. అయితే ఈ హార్మోన్ తగినంతగా ఉత్పత్తి కాకపోవడం లేదంటే దానికి శరీరం సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈ నిర్మాణాలు అలాగే ఉండిపోవచ్చు. దీంతో జన్యుపరంగా పురుషుడైన వ్యక్తిలో సాధారణ పురుష బాహ్య జననాంగాలు ఉన్నప్పటికీ.. శరీరం లోపల గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్స్ వంటి అవయవాలు ఉండొచ్చు. ఈ అరుదైన పరిస్థితినే పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ అంటారు.
పిల్లలు కలగకపోవడానికి కారణమేంటి?
ఈ కేసులో ప్రధానంగా గుర్తించిన సమస్య.. వృషణాలు సాధారణ స్థానంలో లేకపోవడం. సాధారణంగా వృషణాలు శరీరం బయట ఉండే సంచిలో ఉంటాయి. అక్కడి ఉష్ణోగ్రత శరీరం లోపల కంటే కొంత తక్కువగా ఉంటుంది. శుక్రకణాల ఉత్పత్తికి ఈ పరిస్థితి అవసరం. అయితే వృషణాలు పొత్తికడుపులో లేదంటే గజ్జల ప్రాంతంలోని మార్గంలోనే ఉండిపోతే.. శుక్రకణాల ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితినే అన్‌డిసెండెడ్ టెస్టిస్ అంటారు. పీఎండీఎస్‌లో ఇది తరచుగా కనిపించే లక్షణాల్లో ఒకటి. అలాగని PMDS ఉన్న ప్రతి వ్యక్తికీ సంతానలేమి ఉంటుందని చెప్పలేం. వృషణాల పనితీరు, శుక్రకణాల ఉత్పత్తి, పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు వంటి అంశాలపై సంతాన సామర్థ్యం ఆధారపడి ఉంటుంది.
చికిత్స ఎలా ఉంటుంది?
వీర్యంలో శుక్రకణాలు కనిపించని సందర్భాల్లో.. వృషణాల్లో శుక్రకణాలు ఉత్పత్తి అవుతున్నాయా? అనే విషయాన్ని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైతే వృషణాల నుంచి నేరుగా శుక్రకణాలను సేకరించే ప్రయత్నం చేస్తారు. శుక్రకణాలు లభిస్తే ఐవీఎఫ్, ఐసీఎస్‌ఐ వంటి సహాయక పునరుత్పత్తి విధానాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. కొన్ని కేసుల్లో వృషణాల పనితీరు సరిగా లేకపోతే.. ఇతర సంతానోత్పత్తి మార్గాలను కూడా వైద్యులు సూచించవచ్చు. పీఎండీఎస్ ఉన్న కొందరు పురుషుల్లో సంతానోత్పత్తి సాధ్యమేనని వైద్య కేసు నివేదికలు చెబుతున్నాయి.
చాలా అరుదైన పరిస్థితి
పీఎండీఎస్ చాలా అరుదైన వైద్య పరిస్థితి. కొందరిలో చిన్న వయసులోనే వృషణాలు కిందికి దిగకపోవడం లేదంటే గజ్జల్లో హెర్నియా వంటి సమస్యల కారణంగా ఇది బయటపడుతుంది. మరికొందరిలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకపోవడంతో.. పెద్దయ్యే వరకు గుర్తించకపోవచ్చు. సంతానలేమి కోసం పరీక్షలు చేయించుకున్నప్పుడు అనుకోకుండా నిర్ధారణ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితిని కేవలం ‘వింత’గా చూడకుండా.. వృషణాల పనితీరు, హార్మోన్లు, జన్యు కారణాలు, పునరుత్పత్తి వ్యవస్థను పూర్తిగా పరిశీలించాల్సి ఉంటుంది. సరైన సమయంలో గుర్తిస్తే సంతానోత్పత్తి అవకాశాలను కాపాడేందుకు, భవిష్యత్ ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించేందుకు చికిత్సా మార్గాలను ఎంచుకోవచ్చు.
ఇదీ చదవండి: ఫాస్ట్‌గా తింటున్నారా? అయితే ఇది మీకోసమే!


