క్రెడిట్‌ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్‌కు అగ్నిపరీక్ష! | KSR Comments On Chandrababu And Lokesh Over Exam | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ వెనుక కాంట్రవర్సీ.. లోకేష్‌కు అగ్నిపరీక్ష!

Sep 11 2026 10:41 AM | Updated on Sep 11 2026 10:41 AM

KSR Comments On Chandrababu And Lokesh Over Exam

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు తన అనుభవ రాహిత్యం ఏమిటో ఇప్పటికైనా తెలిసి ఉండాలి. గాజు ఇంటిలో కూర్చుని ఎదుటివాళ్లపై రాళ్లు వేస్తే ఏమవుతుందో అర్దం అయి ఉండాలి. తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి బుకాయింపులు, అసత్యాలు వల్లె వేయడం వంటివి నేర్చుకున్నారు కాని, ఆయన మాదిరి ఎదుటివారిపై నెట్టివేయడం అలవాటైనట్లు  లేదు. అందువల్లే ఇప్పుడు లోకేష్ సవాళ్ల పర్వం నుంచి పనిచేసేవారికే రాళ్ల దెబ్బలు అంటూ సెంటిమెంట్ ప్రయోగించే యత్నం చేశారు. లేదంటే కోర్టుకు వెళ్లండని అంటున్నారు. కొందరు అభ్యర్దులు కోర్టులకు కూడా వెళ్లారు. కానీ అవి ఎప్పటికి విచారణకు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు.

ఏపీలో టీచర్ల ఎంపికలో ఎన్ని గందరగోళాలు జరిగాయో రోజురోజుకు తేటతెల్లమవుతున్నప్పటికీ, చర్చకు సవాల్ అంటూ లోకేష్ డాంబికంగా మాట్లాడి దెబ్బతిన్నారు. పదిసార్లు తాను చర్చకు సవాల్ విసిరినా మాజీ సీఎం జగన్ సిద్దం కాలేదని ఒక అసత్యపు ప్రచారం చేయడం ద్వారా ఈ స్కామ్ నుంచి బయటపడవచ్చని తొలుత అనుకున్నట్లున్నారు. కానీ నిజం నిప్పులాంటిది అంటారు. అది ఏదో ఒక రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. అలాగే క్రీడల కోటాలో నకిలీ సర్టిఫికెట్‌తో, పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందినవారి బాగోతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అక్కడితో ఆగకుండా ఇతర కేటగిరీలలో కూడా కొన్ని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించి టీచర్ ఉద్యోగాలు పొందినవారూ ఉన్నారు.  

తొలుత ఎస్‌ఈఆర్‌టీలో అవుట్ సోర్సింగ్  ఉద్యోగిగా పనిచేస్తూ మొదటి ర్యాంకు సాధించడం, ఆ తర్వాత అతనిని బ్లాక్ లిస్టులో పెట్టడం ద్వారా అక్కడ పరీక్ష  పత్రం లీక్ అయిందన్న అనుమానంతో మొదలైన ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ, తిరుగు లేని ఆధారాలతో స్కామ్ బయటపడిందన్న విషయం బోదపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాని, ఆయన పార్టీ నేతలు వీటికి సంబంధించి అనేక ప్రశ్నలు వేస్తున్నా వాటికి జవాబు ఇవ్వడంలో మంత్రి లోకేష్, టీడీపీ నేతలు విఫలం అయ్యారు. సవాళ్లు చేస్తూ టీడీపీ కేడర్లో ఒక నమ్మకం కలిగించడానికి లోకేష్ ప్రయత్నించారు. ఆయనను రక్షించడానికి చంద్రబాబు కృషి చేశారు. అందులో భాగంగానే లోకేష్ గురుపూజోత్యవం నాడు మాట్లాడుతూ పనిచేసే వాళ్లకే రాళ్ల దెబ్బలు అని అన్నారు. ఇక్కడ సమస్య ఏమిటి?.

డీఎస్సీ పెట్టింనందుకు కాదు.. అక్రమాలు జరిగినందుకు.. ఆ విషయాన్ని కప్పిపుచ్చాలనుకుంటే ఎలా కుదురుతుంది?. సమాజంలో  గౌరవంగా, నిజాయితీగా ఎలా బతకాలో నేర్పించింది తన తండ్రి చంద్రబాబు అని ఆయన అన్నారు. చంద్రబాబు సంగతి ఎలా ఉన్నా, యువకుడిగా ఉన్న లోకేష్ అసత్యాలు చెప్పడం మాని, అహంకారంతో ప్రవర్తించడం మాని, హుందాగా రాజకీయాలు చేస్తే ఆయనకే పేరు వస్తుంది. చంద్రబాబు రాజకీయ జీవితం గురించి నిత్యం అంతా మాట్లాడుకునేదే. జగన్‌కు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియదని అనడం ద్వారా ఏదో ఆత్మ సంతృప్తి చెంది ఉండవచ్చు కానీ, ఆయన విసిరిన సవాల్ గురించి లోకేష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?. డీఎస్సీ అన్న పదం రెండుసార్లు వాడినందుకే తప్పుపడుతున్న లోకేష్ తెలుగులో ఎన్ని తప్పులు మాట్లాడతారో మర్చిపోతే ఎలా?. అదే జగన్ తన టైమ్ లో జరిగిన ఏపీపీఎస్సీపై చేస్తున్న   అభియోగాలు, కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరారే!. తాను పదిసార్లు సవాల్ చేసినా చర్చకు రాలేదని, అసందర్భ వ్యాఖ్యలు చేస్తే ఏం ప్రయోజనం?. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి.

చంద్రబాబు నాయుడు తాను ప్రభుత్వపరంగా ఏ తప్పు చేసినా, తెలివిగా అధికారుల మీద తోసేసి తప్పించుకుంటారు. ఉదాహరణకు ఈ మధ్య ఆయా సభలలో అధికారులను నిలబెట్టి వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే యత్నం చేశారు. రోడ్లు బాగోలేదు కదా అని ప్రజలను ప్రశ్నించి అధికారులను నిందిస్తే ఏం లాభం. నిధులు ఇవ్వకుండా తమపై రుద్దడం ఏమిటా అని అధికారులు నెత్తి కొట్టుకుంటున్నారు. ఏదైనా స్కామ్ జరిగితే, అందులో తనకు ఇబ్బంది వస్తుందనుకుంటే వ్యూహాత్మకంగా సంబంధిత అధికారులపై చర్య తీసుకుంటామని డ్రామా నడిపిస్తారు. ఎవరో కొందరిని ఆ సమయానికి బలి చేసి కథ ముగిస్తారు. ఉదాహరణకు గాదె సాయికృష్ణ అనే నిందితుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలు పెట్టడం వల్ల మరణించిన ఘటనను కేవలం అక్కడి సీఐ, ఆ దిగువ ఉండే కానిస్టేబుళ్ల వద్దే  ఆపేశారు తప్ప, పై అధికారుల దాకా వెళ్లకుండా సిట్ పేరుతో కధ నడిపించేశారు. ఎందుకంటే అది పై దాక వెళితే  తనకు కూడా తలనొప్పి అవుతుందని తెలుసు కాబట్టి అన్నమాట.

రాజమండ్రి  పుష్కరాలలో పబ్లిసిటీ కారణంగా తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారన్న అభియోగాలు వచ్చాయి. ఆ ఘటనలో తను చిక్కుకోకుండా ఎలా తప్పించుకున్నారో అందరికీ తెలుసు. పైగా రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? అని ఎదురుదాడి చేశారు. తిరుమలలో 20 మంది ఎన్‌కౌంటర్ అయితే దేశవ్యాప్తంగా అది సంచలన ఘటన. దానిని కూడా ఎలా ముగించారో చూశాం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లను చంపడం తప్పుకాదన్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించారు. చంద్రబాబు ధోరణి అలా ఉంటుంది. వాగ్దానాలు చేయడం, వాటిని తుస్సు మనిపించడం, తాను అబద్దం ఆడుతున్నానని తెలిసినా, ప్రజలను నమ్మించడానికి వాటినే వల్లించడం వంటివి చంద్రబాబు చేయగలరన్న అభిప్రాయం వివిధ పక్షాల నేతలలో ఉంది. ఈ విషయం వరకు బాగానే నేర్చుకున్నట్లు  కనిపించిన లోకేష్, తన అనుభవ రాహిత్యంతో డీఎస్సీ అక్రమాల కేసులో ఇరుకున్నట్లయిందన్న విశ్లేషణ వస్తుంది.

వైఎస్‌ జగన్ ఈ అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా మీడియాకు  వివరించిన వెంటనే, ఆధారాలు ఉన్నట్లయితే తప్పక చర్చ తీసుకుంటామని, ఇందులో తనకు పాత్ర లేదని, అధికారులదే తప్పేమైనా ఉందేమోనని అని ఉంటే కొంతైనా తప్పించుకోగలిగేవారేమో. కానీ లోకేష్ మొత్తం వ్యవహారాన్ని తన భుజాన వేసుకుని డీఎస్సీ క్రెడిట్ అంతా తనదేనని ప్రొజెక్టు చేసుకునే క్రమంలో అందులోని డెబిట్ మొత్తం తన ఖతాలో వేసుకోవలసి వచ్చింది. ఇదే సమయంలో  యువగళం పాదయాత్ర సమయంలో తనతో పాటు ఉన్నవారికి క్రీడా కోటాలో టీచర్ ఉద్యోగాలు ఇప్పించారన్న ఆరోపణను వైఎస్సార్‌సీపీ చేస్తోంది. అది నిజమైతే వారికి టీచర్ల ఉద్యోగాలు ఇప్పించానన్న సంతోషం కన్నా, అది స్కాంగా మారి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయన్న టెన్షన్ లోకేష్‌కు ఏర్పడుతుంది. జగన్ వీటన్నిటిపైన ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పలేక ఎదురుదాడి చేస్తూ మరిన్ని అనుమానాలను చంద్రబాబు, లోకేష్ కలిగించారు.

చిత్రంగా ఉద్యోగాలు వచ్చిన టీచర్ల ఇళ్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను పంపించి మరిన్ని డౌట్లు క్రియేట్ చేసుకున్నారు. టీచర్ పోస్టుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నేరుగా ఆరోపిస్తున్న అభ్యర్దుల ఇళ్లకు వెళ్లి వారి నుంచి ఆధారాలు తీసుకుని చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది కదా!. ఎంపికైన టీచర్లందరిని వైఎస్సార్‌సీపీ తప్పుపట్టకపోయినా వాళ్లతో కర్నూలు, విశాఖపట్నం తదితర చోట్ల ర్యాలీలు తీయిస్తే  ఏం ప్రయోజనం?. చిత్తశుద్ది ఉంటే ఉద్యోగాలలో తమకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో కాని, ఇతరత్రా కాని కొందరు అభ్యర్దులు చెబుతున్న వాటిలో  నిజానిజాలు ఏమిటో తేల్చడానికి ఎందుకు లోకేష్ సిద్దపడలేకపోయారు. తాము జవాబు ఇవ్వలేకపోతుండటం, సంబంధిత అధికారులతో మీడియా సమావేశాలు పెట్టించారు. వారు మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక సతమతమయ్యారు. కొన్ని అంశాలలో విచారణ జరుగుతోందని, పరిశీలిస్తున్నామని తప్పించుకునే ధోరణిలో అధికారులు  చెప్పవలసి వచ్చింది.

జగన్ టైమ్‌లో సుమారు లక్షన్నర మంది సచివాలయాల ఉద్యోగాలను భర్తీ చేస్తే ఒక్క అక్రమం జరిగినట్లు కూడా ఆరోపణలు రాలేదు. గతంలో ఏ అంశంపైన అయినా, ఏ ఆరోపణ వచ్చినా, ఎలాంటి విచారణకైనా జగన్ ఆదేశించేవారు కదా!. ఆ ధైర్యం చంద్రబాబు, లోకేష్‌లలో ఎందుకు కొరవడుతోంది?. దీనికి తోడు సుప్రీంకోర్టు తాజాగా వేరే రాష్ట్రంలో టీచర్ల ఎంపిక కేసులో చేసిన వ్యాఖ్యలు కూడా వీరికి మరింత ఆందోళన కలిగిస్తుండవచ్చు. కాగా, ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించకపోవడం కూడా ఆసక్తికరమే. చిత్రంగా పవన్‌తో కలిసి టీచర్ నియామక పత్రాలు అందించామని చంద్రబాబు ఒక స్పీచ్‌లో చెప్పారు. కానీ అసలు ఆ ప్రోగ్రాంలో తండ్రి, కొడుకులు తప్ప పవన్ లేరు కదా అని సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయి. అంటే పవన్‌కు కూడా ఈ బురద అంటిస్తే బెటర్ అనుకున్నారా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ స్కామ్ నేపథ్యంలో పోలీసులను ప్రయోగించి అణచివేత చర్యలు, సోషల్ మీడియాలో పోస్టులు తొలగించడం వంటి చర్యలు చేస్తున్న కొద్దీ స్కామ్‌పై జనంలో మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement