47 ఏళ్ల వయసులో చెప్పులు లేకుండా మారథాన్‌..గెలిచిన అమ్మ! | Maharashtra Woman Wins Marathon Running Barefoot For Daughters Education | Sakshi
Sakshi News home page

47 ఏళ్ల వయసులో చెప్పులు లేకుండా మారథాన్‌..గెలిచిన అమ్మ!

Sep 1 2026 1:20 PM | Updated on Sep 2 2026 12:25 PM

Maharashtra Woman Wins Marathon Running Barefoot For Daughters Education

తల్లి తన పిల్లల కోసం ఏదైనా చేయగలదు అని మరోసారి రుజువైంది. ఓ తల్లి తన కుమార్తెల కోసం మారథాన్‌లో పాల్గొంది. కనీసం అనువైన డ్రెస్‌, షూలు లేకపోయినా..పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దడమే తన ధ్యేయం అన్నట్లుగా రేసులోకి దిగింది. మరి ఆ తల్లి గెలిచిందా అంటే..

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా అంబాజోగైకి చెందిన వంటమనిషి రమాబాయి చెప్పలు లేకుండా మారథాన్‌లో పరిగిఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచేలా గెలిచింది. ఓ అమ్మ తలుచుకుంటే పిల్లల కోసం ఎంతటి అనితర సాధ్యమైనదైనా.. చేధించగలదని ప్రపంచానికి చూపించింది. ఇంతలా మారథాన్‌లో పాల్గొని గెలిచి తీరాల్సినంత అవసరం ఆమెకు ఎందుకంటే..

ముంబైలో జరిగిన ఒక ప్రమాదంలో భర్తని కోల్పోయింది రమాబాయి. దాంతో తన ఇద్దరు కుమార్తెలను ఒంటరిగా పెంచుతూ వారి బాగోగులను చూసుకుంటూ వచ్చింది. అయితే తన పిల్లలకు మంచి చదువు అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనేదే ఆమె ప్రగాఢ ఆకాంక్ష. అయితే ఆర్థిక వనరులు ఏమాత్రం సహకరించడం లేదామెకు. అయినా సరే ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అంతేగాదు కుమార్తె చదివే చోట అంబాజోగైలోని అకాడమీలో వంటమనిషిగా పనిలో చేరి కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తోందామె. 

ఆమె అకాడమీలో వంట చేస్తూ కాలం వెళ్లదీస్తుండగా, ఆమె కుమార్తెలు చదువులు, పోటీపరీక్షలపై దృష్టి సారిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా..ఇద్దరు కుమార్తెలకు మెరుగైన భవిష్యత్తు అందించాలనే పట్టుదలతో రమాబాయి ముందుకు సాగుతోంది. ఆ క్రమంలోనే ఒక స్థానిక సంస్థ నిర్వహించిన 'అమృత్ దౌడ్' మారథాన్‌లో పాల్గొంది రమాబాయి. ఆ మారథాన్‌లో అంతా ట్రాక్‌సూట్‌లు, షూలు ధరించిన యువ పోటీదారుల మధ్య సాధారణ చీర కట్టుకుని పాల్గొంది రమాబాయి. ఆమె మొదట చెప్పులు వేసుకుని పరుగుని ప్రారంభించింది. 

కానీ పరిగెత్తేటప్పుడు అవి జారిపోతుండటంతో వాటిని తీసేయక తప్పలేదు. దాంతో ఆమె చేతిలో చెప్పులు పట్టుకుని చీరను జాగ్రత్తగా సర్దుకుంటూ..చల్లని రోడ్డుపై పరిగెత్తిందామె. కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇదర పోటీదారుల కంటే వేగంగా దూసుకుపోయి..ముగింపు రేఖను చేరుకుంది. రమబాయి అచంచలమైన పట్టదలను చూసి ప్రేక్షకులు హర్షధ్వానాలతో అభినందించారామెను. 

రేసు తదనంతరం రమాయి మాట్లాడుతూ..ఈ పోటీలో చాలామంది పాల్గొన్నారని తెలసుని కానీ బహుమతి గెలవాలనే పట్టుదలతో ఉన్నానని చెప్పారామె. పరిగెత్తేటప్పుడు తాను నిరంతరం తన కుమార్తెల గురించి, వారి భవిష్యత్తునే ఆలోచిస్తూ పరుగు ప్రారంభించానని అన్నారామె. మరి గెలిచిన సోమ్ముని ఏం చేస్తావంటే..వారి పుస్తకాలు కొనడానికి ఉపయోగిస్తానని చెప్పింది. అంతేగాదు మరోఅద్భుతం ఏంటంటే ఇదే మారథాన్‌లో పాల్గొన్న ఆమె కుమార్తె  పూజా రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 

తానే తల్లిని పాల్గొనమని ప్రోత్సహించానని, కానీ ప్రథమ స్థానంలో నిలుస్తుందని అస్సలు ఊహించలేదని ఆనందంగా చెబుతోంది. ఇక పూజా పోలీస్ రిక్రూట్‌మెంట్ కోసం సిన్నద్ధమవుతోంది. ఇక ఆమె సోదరి బ్యాంక్‌ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతంది. చాలా కఠినమైన పరిస్థితులను తట్టుకుని మమ్మల్ని ఎంతో ప్రయాస పడి పెంచిందని చెబుతోంది ఆమె కూతురు పూజా. అంతేగాదు పూజా అంకితభావానికి ముగ్ధుడైన అకాడమీ డైరెక్టర్‌ ఆమె ఫీజును కూడా మాపీ చేశారు. 

కాగా, రమాబాయి కుటుంబం గతంలో వ్యవసాయ పనులపై ఆధారపడి జీవిస్తుండేది. అయితే పిల్లల చదువుకి సాయం అందించేందుకు ఇలా కూతురి అకాడమీలోనే చేరి వంటమనిషిగా పనిచేస్తోందామె. ఈ తల్లికి కుమార్తెల కలను నెరవేర్చడానికి మారథాన్‌ను ఒక అవకాశంగా ఉపయోగించుకుంది. పైగా ఆమె పోటీలో వేసిన ప్రతిఅడుగు అపురూపమైనది. ఎందుకంటే ఆ రేసులో వేసిన అడుగులన్నీ పిల్లలకు మంచి భవిష్యత్తుని అందించాలనే ఆశతో వడివడిగా నడిచినవే.

 

(చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! తల్లిదండ్రుల ఆచూకీ కోసం..ఆ పసివాడు..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement