శవాల దిబ్బల్లో ఆప్తుల కోసం అన్వేషణ.. మిన్నంటుతున్న రోదనలు! | Nepal Flood Tragedy Families Search Hospitals And Morgues For Missing Loved Ones As Death Toll Rises, Check Details Inside | Sakshi
Sakshi News home page

శవాల దిబ్బల్లో ఆప్తుల కోసం అన్వేషణ.. మిన్నంటుతున్న రోదనలు!

Aug 31 2026 9:34 AM | Updated on Aug 31 2026 1:48 PM

Nepal Bhotekoshi Flood Tragedy: Families Scour Hospitals for Missing Loved Ones

ఖాట్మండు: నేపాల్‌లోని భోటేకోశి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన వరద బీభత్సం వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కొట్టుకుపోయిన, శిథిలాల కింద చిక్కుకుపోయిన తమ వారి ఆచూకీ కోసం బంధువులు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఆస్పత్రులు, శవాగారాలు, సహాయక శిబిరాల చుట్టూ కన్నీటితో తిరుగుతున్నారు.

చేతిలో ఆప్తుల ఫొటోలు పట్టుకుని మార్చురీల్లోని గుర్తుతెలియని మృతదేహాలను పరిశీలిస్తూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. రసువాలోని అప్పర్ త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద పనిచేస్తున్న 20 ఏళ్ల ప్రవీణ్ వరద ఉధృతికి గల్లంతయ్యాడు. అతని సోదరుడు రామ్ బుధా ఖాట్మండు నుంచి హకుబేసికి చేరుకుని, ప్రాజెక్టు సొరంగంలోకి దిగేందుకు ప్రయత్నించాడు. అయితే ఛాతీ లోతు వరకు బురద పేరుకుపోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. జుమ్లాలోని తమ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో తోచక రామ్ కన్నీటిపర్యంతమయ్యాడు.

నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు, నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం నాటికి 788 మృతదేహాలను వెలికితీయగా, ఇంకా 2,502 మంది ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారిలో జలవిద్యుత్ ప్రాజెక్టుల కార్మికులు, ఇంజనీర్లు 933 మంది ఉండగా, 592 మంది విదేశీయులు, వారితో ఉన్న 127 మంది నేపాలీలు ఉన్నారు. రక్షణ దళాలకు చెందిన 45 మంది సైనికులు, 25 మంది నేపాల్ పోలీసులు, 12 మంది సాయుధ పోలీసు సిబ్బంది కూడా జాడలేకుండా పోయారు.

రసువా సరిహద్దు ప్రాంతమైన తిమురేలో పనిచేస్తున్న భర్త సునీల్ ఆచూకీ కోసం దాంగ్ ప్రాంతానికి చెందిన సరితా చౌదరి పోఖ్రా చేరుకుంది. వరద వచ్చే ముందు రోజు  ఫోన్ చేసి, దసరా పండుగకు ఇంటికి వస్తానని చెప్పాడని, అంతలోనే ఈ ఘోరం జరిగిందని ఆమె రోదిస్తూ తెలిపింది. పోఖ్రా అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో భద్రపరిచిన 102 గుర్తుతెలియని మృతదేహాల ఫొటోలను పరిశీలించేందుకు రోజుకు వెయ్యి మందికి పైగా బంధువులు వస్తున్నట్లు కాస్కీ పోలీసులు తెలిపారు.

రౌతహత్‌కు చెందిన 60 ఏళ్ల బిర్సిమాయ భరత్‌పూర్‌లోని శవాగారాల్లో తన కుమారుడు షేర్ బహదూర్‌ కోసం వెతుకుతోంది. నువాకోట్, గైండాకోట్, పోఖరా నగరాల్లోని ఆస్పత్రులను గాలించినా తన సోదరుడు రామేశ్వర్ జాడ దొరకలేదని నవరాజ్ లామా ఆవేదన వ్యక్తం చేశాడు. ‘కనీసం ఆచూకీ లేదా మృతదేహం దొరికే వరకు మా ఆశ చావదు’ అని కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అప్పులు చేసి మరీ ఇక్కడికి తరలివ‍చ్చి, వెతుకులాట కొనసాగిస్తున్న బాధితులు.. ప్రభుత్వం స్పందించి మృతదేహాల గుర్తింపు ప్రక్రియను ఒకే చోట సులభతరం చేయాలని, గల్లంతైన వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement