ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్ రాజీనామా పెద్ద సంచలనంగా మారింది. ఇండియాలో IAS అధికారిగా రాణించిన ఆమె 13 ఏళ్ల కరియర్‌లో ఎన్నో విజయాలు, మరెన్నో కీలక మైలు రాళ్లు. 75 ఏళ్ల నాటి నీటి సమస్య పరిష్కారం మొదలు రాజీనామా వరకు దివ్యమిట్టల్ ప్రస్తానం వైరల్‌గా మారింది. ఇన్నేళ్ల సర్వీసు తరువాత రాజీనామా చేయడంతో మాజీ బ్యూరోక్రాట్ దంపతులు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు.
దివ్య మిట్టల్, ఆమెభర్త గగన్‌దీప్, లండన్‌లో లక్షల విలువైన ప్యాకేజీని వదిలిపెట్టి భారతదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, గగన్‌దీప్ సింగ్ ధిల్లాన్ తన మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఏఎస్ ర్యాంకును పొందగా, దివ్య మిట్టల్ 2012లో తన రెండవ ప్రయత్నంలో అఖిల భారత ర్యాంకు 68 సాధించారు. అలా డియోరియాలో కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆమె పలుమార్లు వార్తల్లో నిలిచారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడంతోపాటు, అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. కేవలం బీజేపీ ఎంఎల్‌ఏ ఆరోపణలు, ఫిర్యాదుల కారణంగా మే 6న డియోరియా నుండి బదిలీ చేశారా? లాంటి ప్రశ్నలు తలెత్తున్నాయి.
దివ్య మిట్టల్ ప్రత్యేకతలు, వివాదాలు
లండన్‌లో ట్రేడింగ్ వృత్తిని వదిలిపెట్టిన మరీ IAS అధికారి కావాలనే కల సాకారం కోసం ఆమె ఇండియాకు తిరిగి వచ్చారు. మీర్జాపూర్ జిల్లా కలెక్టర్‌గా (2023) పనిచేసిన సమయంలో జల్ జీవన్ మిషన్ కింద ఆమె చేసిన కృషి, సేవ ప్రత్యేకంగా నిలుస్తుంది.
దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, మీర్జాపూర్‌లోని లహరియా దాహ్ గ్రామానికి నీటి సౌకర్యాన్ని కల్పించింది మాత్రం దివ్య మిట్టలే అని మీర్జాపూర్ ప్రజలు ఇప్పటికీ చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఆమెను ఎంతో గౌరవిస్తారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మీర్జాపూర్ నుండి పోటీ చేసే అవకాశం ఉందా అనే ఊహాగానాలు వెలుగులోకి వస్తున్నాయి.
क्या जीवन में थक गए हो?
मेरी स्वरचित कुछ पंक्तियाँ आपके लिए - ‘रुकना मत’ pic.twitter.com/egSijXFKgT— Divya Mittal (@divyamittal_IAS) July 29, 2026
లహూరియా దాహ్ గ్రామానికి పైపుల ద్వారా నీటి సరఫరా లేదు. కానీ ఆమె కృషితో జల్ జీవన్ మిషన్ కింద ఆ గ్రామానికి 75 ఏళ్లలో తొలిసారిగా కుళాయి నీరు అందింది. ఈ విషయాన్ని ఆమె తన రాజీనామా లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొండ ప్రాంతం, పైప్‌లైన్‌లు విజయవంతంగా అందుబాటులోకి వచ్చాయి. 125 ఇళ్లకు కనెక్షన్లు, సుమారు 1,200 మంది నివాసితులు లబ్ధి పొందారు. సుదీర్ఘ తీవ్రమైన తాగునీటి సంక్షోభానికి తెరపడింది. అంతకుముందు, కాలానుగుణంగా వచ్చే నీటి ఊటపై, ఖరీదైన ప్రైవేట్ ట్యాంకర్లే ఆధారం. నీటి కోసం ప్రతీ రోజూ కాలి నడకన వెళ్లి అష్టకష్టాలు పడాల్సి వచ్చేది.
అయితే ఈ కార్యక్రమంలో ఆమెను ప్రోటోకాల్ పాటించలేదంటూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి యోగీ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఆయనను ఆహ్వానించలేదనే ఆరోపణల మధ్య ఆమెను బదిలీ చేశారన్న ఆరోపణలు గుప్పు మన్నాయి. ఆ తరువాత దివ్యను బదిలీ చేశారు. 'వెయిటింగ్ లిస్ట్'లో ఉంచారు. అంతేకాదు కొత్తగా వేసిన పైప్‌లైన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో నీటి సరఫరా మళ్లీ నిలిచిపోయింది. గ్రామాన్ని తిరిగి నీటి సంక్షోభంలోకి వెళ్లిపోయింది. నెలల తరబడి అధికారిక పోస్టింగ్ లేకుండా నిరీక్షణ జాబితాలో ఉన్న దివ్య మిట్టల్ చివరికి తన పదవికి రాజీనామా చేశారు.
వంతెన నిర్మాణంలో నిర్లక్ష్యం వహించినందుకు దివ్య ఒక PWD అధికారిని మందలించారు. ఆ సమయంలో, ఎండ తీవ్రతను ప్రస్తావిస్తూ, నీడలో కూర్చుని మాట్లాడాలని ADM ఆమెను కోరారు. దానికి ఆమె సరదాగా స్పందిస్తూ, " మిత్రమా, అది కేవలం ఎండ మాత్రమే కదా—కాస్త ఓపిక పట్టు, మనం కరిగిపోము కదా..." అని బదులివ్వడం పలువుర్ని ఆకట్టుకుంది. అంతేకాదు అక్రమ ఆక్రమణకు సంబంధించిన ఫిర్యాదుపై కనుంగో-లేఖ్‌పాల్‌ను మందలిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది."దీన్ని మీరు సర్కస్‌లా మార్చేశారు. ఈ వ్యవహారం మొత్తాన్ని విచారించి నివేదిక సమర్పించండి. ఇకపై ఇలాంటి పనులు చేయకండి. నిజంగానే, మిమ్మల్ని జైలుకు పంపిస్తాను." అంటూ తీవ్రంగా హెచ్చరించిన వైనం అప్పట్లో పెద్ద సంచలనం.
ఇదీ చదవండి: యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలం
అప్పుడు భర్త, ఇప్పుడు భార్య
ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్ భర్త గగన్ దీప్ సింగ్ కూడా వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో,2022లో తన పదవికి రాజీనామా చేశారు. వీరిద్దరూ అత్యున్నత స్థాయి అధికారులు, పైగా ఇప్పుడు ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేయడంతో వీరి భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ తర్వాత ఆమె భర్త దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాపారం చేసే ఒక సంస్థను స్థాపించారు. మరోవైపు గత నాలుగు నెలలుగా ఆమెకు ఎటువంటి కీలక బాధ్యతలు అప్పగించకపోవడంతో, ఇప్పుడు ఆమె తన భర్త వ్యాపారానికి సహకరించడం లేదా రాజకీయాల్లోకి అడుగుపెట్టడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అంచనా. కాగా గగన్ దీప్ సింగ్ హర్యానాలోని రేవారి జిల్లాకు చెందినవారు. గగన్ దీప్ సింగ్ 2011 బ్యాచ్‌కు చెందిన ఐటీఎస్ (ITS) అధికారి.
రాజీనామాకు ఆమె చెప్పిన కారణం
తన నిర్ణయం ఎలాంటి ఒత్తిడి లేదా ప్రేరేపణ ఫలితంగా తీసుకోలేదని, ఇది పూర్తిగా ఆలోచించి తీసుకున్న వ్యక్తిగత కుటుంబ నిర్ణయమని స్పష్టం దివ్య మిట్టల్ చేశారు. తన ప్రాధాన్యతలు, ఆసక్తులు, ఇద్దరు కుమార్తెలు, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆమె రచన, బోధన, సామాజిక సేవ వంటి రంగాలలోకి ప్రవేశించవచ్చని తెలిపారు. ‘‘ఐఏఎస్ ఉద్యోగం నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే, నా జీవితం మొత్తం కాదు" అని పేర్కొనడం గమనార్హం.
మోటివేషనల్ వీడియో వైరల్
‘‘అలసిపోతే, నిద్రపోండి, మీ హృదయం నిండిపోతే, ఏడవండి, కానీ ఆగిపోకండి’’ అంటూ దివ్య మిట్టల్ పాత స్ఫూర్తిదాయక వీడియో వైరల్ అవుతోంది.


