లైఫ్
ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు.. కార్పొరేట్ హబ్‌గా వెలుగుతున్న ముంబైలను దాటుకుని అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, స్కిల్స్ రేస్‌లో ఉత్తరప్రదేశ్ నెంబర్ వన్ పీఠాన్ని కైవసం చేసుకుంది! ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2026 విడుదల చేసిన తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం. 78.64 శాతం ఎం΄్లాయబిలిటీ రేటుతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా.. ఇందులో మహిళలే ఎక్కువ అర్హత గలవారిగా రికార్డు సృష్టించారు. ఉద్యోగానికి కావాల్సింది చేతిలోని డిగ్రీలు కాదు... స్కిల్స్ కూడా అవసరమే అని నిరూపించారు.
ఇన్నాళ్లూ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలదే హవా అనుకున్న ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేస్తూ, ఈసారి ఉత్తరప్రదేశ్ యువత ప్రతిభలో టాప్‌గేర్ వేశారు. మారుతున్న ఉద్యోగ అవసరాలకు తగినట్టుగా నైపుణ్యాలను పెంపొందించుకుని 78.64 శాతంతో ప్రథమ స్థానాన్ని సంపాదించుకుంది. వాణిజ్య రాజధాని మహారాష్ట్ర గట్టి పోటీనిచ్చినప్పటికీ 75.42 శాతంతో రెండో స్థానానికే పరిమితమైంది. కర్ణాటక ఐటీ పవర్ హౌస్‌గా ఉన్నప్పటికీ 73.85 శాతంతో నైపుణ్య వృద్ధిలో మూడో స్థానానికి చేరింది. కేరళ విద్యా శ్రేణిలో ముందంజలో ఉన్నా నైపుణ్యంలో 72.16 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీ 71.25 శాతంతో ఐదో స్థానంలో నిలిచింది.
జాతీయ సగటు పెరుగుదల
దేశ వ్యాప్తంగా యువత ఉద్యోగ అర్హత 2025లో 54.81% ఉండగా 2026 నాటికి 56.35% కి పెరిగింది. 2022లో ఇది 46.2% మాత్రమే ఉండేది. డిజిటల్ టెక్నాలజీల వినియోగం పెరగడం దీనికి ప్రధాన కారణం.
మహిళలే టాప్
ఉద్యోగార్హతలో మహిళలు (54%) మొదటిసారిగా పురుషులను (51.5%) వెనక్కి నెట్టారు! ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి వస్తున్న మహిళలు బ్యాంకింగ్, హెల్త్‌కేర్, విద్యారంగాల్లో సరికొత్త రికార్డులు çసృష్టి్టస్తున్నారు.
ఏఐ నైపుణ్యాలే ముఖ్యం
కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లలో అత్యధికంగా 80%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 78%, ఇన్స్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో 77% ఉద్యోగ అర్హత నమోదైంది. ఏఐ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి నైపుణ్యాలు ఉన్నవారికి డిమాండ్ ఉంది. గ్లోబల్ ఏఐ టాలెంట్‌లో 16% వాటా మన భారతీయులదే.
గిగ్ ఎకానమీ ధమాకా
2030 నాటికి దేశంలో 2.35 కోట్ల మంది ఫ్రీలాన్సర్లు, గిగ్ వర్కర్లు రాబోతున్నారనీ.. ‘ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఆఫీస్ డెస్క్’’ అనే సాంప్రదాయ పద్ధతికి కాలం చెల్లుతోందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. పాఠ్యపుస్తకాల్లో చదివే పాతకాలపు విషయాల కంటే, కంపెనీలలో నేరుగా ఉపయోగపడే ప్రాక్టికల్ స్కిల్స్ ఉన్నవారికే ఉద్యోగాల్లో గ్రీన్ సిగ్నల్ లభిస్తోంది.
అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కోడింగ్, ఏఐ టూల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకున్న యువత ఏ ప్రాంతంతోనూ సంబంధం లేకుండా ముందంజలో ఉంటరన్నమాట.
ఇవి కూడా చదవండి: ఆటల్లో రాణిస్తున్నారు!


