ఆటల్లో రాణిస్తున్నారు! | Bharati Mudi has been training tribal girls in football | Sakshi
Sakshi News home page

ఆటల్లో రాణిస్తున్నారు!

Aug 29 2026 3:37 AM | Updated on Aug 29 2026 3:37 AM

Bharati Mudi has been training tribal girls in football

అ–అమ్మ ఆ–ఆట

నేడు జాతీయ క్రీడా దినోత్సవం 

ఆటలు ఉత్సాహాన్నీ, భుజం తట్టి ధైర్యాన్ని ఇస్తాయి. ‘అమ్మాయిలకు ఆటలెందుకు!’ అనే రోజుల నుంచి ఆటల్లో ‘రాణిం‘చాలంటే వాళ్లే అనే రోజులు వస్తున్నాయి. ఫుట్‌బాల్‌ శిక్షకురాలు భారతీ ముదిని చూసినా అంట్లు తోమడం నుంచి ఆసియా క్రీడలకు వచ్చిన కవితను పలకరించినా, తైవాన్‌ అథ్లెటిక్స్‌ ఓపెన్‌లో రాణించిన మహిళా క్రీడాకారుల నైపుణ్యాలను వీక్షించినా పేదరికం వాళ్ల ప్రతిభకు  అడ్డురాదని అర్థమవుతోంది.

అన్నీ మంచి శకునములు!
పశ్చిమ బెంగాల్‌ బంకురా జిల్లాలోని దుముడుమి గ్రామానికి చెందిన భారతి ముది గత పదిహేడు సంవత్సరాలుగా గిరిజన బాలికలకు ఉచితంగా ఫుట్‌బాల్‌ నేర్పుతోంది. ఆమె దగ్గర శిక్షణ పొందిన ఎంతోమంది పేద గిరిజన బాలికలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారు.

‘మీ వల్లే మా అమ్మాయికి స్పోర్ట్స్‌ కోటాలో గవర్నమెంట్‌ ఉద్యోగం వచ్చింది. మిమ్మల్ని ఎప్పుడూ మరవలేము’ అని భారతితో అనే వారు చాలామంది ఉన్నారు. ఇంటి పనులు పూర్తి చేసుకొని సాయంత్రం గ్రౌండ్‌కు బయలుదేరుతుంది భారతి. అక్కడ ఆమె కోసం ఎంతో మంది అమ్మాయిలు ఎదురు చూస్తుంటారు.

ఎందరో ఫుట్‌బాల్‌ క్రీడాకారుల శిక్షకురాలు భారతి...
‘మీ పిల్లలకు ఉచితంగా ఫుట్‌బాల్‌ నేర్పిస్తాను’ అని ఒకప్పుడు ఇంటింటికీ తిరిగేది భారతి. ‘నీకు పనేమీలేదా!’ అని చాలామంది విసుక్కునేవారు. ఆ తరువాత మాత్రం ఆటల పట్ల భారతి అంకిత భావం నచ్చి పిల్లలను ఆమెతో పంపించడం ప్రారంభించారు. భారతి శిక్షణలో అమ్మాయిలు పాసింగ్, డ్రిబ్లింగ్, కికింగ్, డిఫెండింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటారు. ఫుట్‌బాల్‌లో పెద్ద స్థాయికి చేరుకోవాలని ఎన్నో కలలు కనేది భారతి. 

అయితే కుటుంబ బాధ్యతల నుంచి ఆర్థిక సమస్యల వరకు రకరకాల కారణాల వల్ల తన కల కలగానే మిగిలిపోయింది. ఆ కలను పిల్లల రూపంలో సాకారం చేసుకోవడానికి నడుం కట్టింది. కూతురు తానియతో కలిసి గ్రామంలో ఫుట్‌బాల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రారంభించింది. ఎంతోమంది గిరిజన అమ్మాయిలు ఈ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నారు. వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోదు. ‘నా దృష్టిలో ఫుట్‌బాల్‌ అనేది కేవలం ఆట కాదు. అంతకుమించి. ఆడపిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ఆట అది’ అంటుంది భారతి. తన దగ్గర శిక్షణ పొందిన అమ్మాయిలు భారత్‌ తరఫున అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనేది భారతి కల.

అంట్లు తోమడం నుంచి ఆసియా క్రీడలకెళ్లిన కవిత
అద్భుత శక్తి సామర్థ్యాలు ఉన్న మహిళా కబడ్డీ క్రీడాకారులలో హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కవిత ఒకరు. పేదరికంలో పెరిగిన కవిత తన క్రీడాప్రతిభతో ఆసియా క్రీడలలో పాల్గొనే స్థాయికి చేరింది. మనాలి సమీపంలో కవిత తల్లిదండ్రులకు చిన్న టీ కొట్టు ఉంది. ఆ టీ కొట్టే వారి ఇల్లు. టీ కొట్టులో తన అక్క కల్పనతో కలిసి పాత్రలు కడగడం, నేల ఊడ్చడంలాంటి పనులు చేసేది, టీ తయారు చేసే కవిత చిన్నప్పటి నుంచి కబడ్డీలో అద్భుతైన ప్రతిభ చూపేది. ఆ ప్రతిభే ఆమెను అంతర్జాతీయ క్రీడాకారిణిగా మార్చింది.

టీ కొట్టు కాదు...అద్దె ఇంట్లో!
‘ఎక్కువ ఖర్చు అవసరం లేకపోవడంతో కబడ్డీని ఎంచుకున్నాను. నిజానికి నా కంటే మా అక్కే బాగా ఆడేది. అయితే టీ కొట్టులో అమ్మానాన్నలకు సహాయం చేయడం కోసం జాతీయ స్థాయిలో ఆడాలనే తన కలను వదులుకుంది’ అంటుంది కవిత. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా కవిత ఎదిగినా ఆమె తల్లిదండ్రులు మాత్రం ఒకప్పటి టీ కొట్టులోనే పనిచేస్తున్నారు. ‘ఒకప్పుడు మేము మా చిన్న టీ కొట్టులోనే ఉండేవాళ్లం. మాకంటూ ఇల్లు ఉండేది కాదు. అదే మా ఇల్లు. అద్దె ఇల్లు అయినా సరే, ఇప్పుడు మాకు ఓ ఇల్లు ఉంది. ఇదంతా మా అమ్మాయి చలవే’ అంటున్నారు కవిత తల్లిదండ్రులు.

తైవాన్‌ అథ్లెటిక్స్‌ ఓపెన్‌లో రాణించిన మన క్రీడాకారిణులు
తైవాన్‌ అథ్లెటిక్స్‌ ఓపెన్‌ 2025లో మన మహిళలు అద్భుతంగా రాణించి పతకాల పంట పండించారు. 800 మీ. 1500 మీ. పరుగు పందాల్లో డబుల్‌ గోల్డ్‌ సాధించిన పూజ, 400 మీ. హార్డిల్స్‌ స్వర్ణం సాధించిన విద్యా రామ్‌రాజ్‌లాంటి అథ్లెట్లు సత్తా చాటారు. 2024లో యూఎఫ్‌సీ ఫైట్‌లో విజయం సాధించిన తొలి భారతీయ మహిళగా పూజా తోమర్‌ చరిత్ర సృష్టించింది. ఇవి వ్యక్తిగత విజయాలు మాత్రమే కాదు...‘భారత క్రీడల భవిష్యత్‌ మహిళలదే’ అనే సందేశాన్ని ఇచ్చే మైలురాళ్లు!

మైలురాళ్లు
పురుషులకు దీటుగా మహిళలు రాణించగలరని 2024–2025లో క్రీడారంగంలో మహిళలు సాధించిన విజయాలు చెప్పకనే చెబుతున్నాయి. మన మహిళా  క్రీడాకారులకు సంబంధించి పారిస్‌ 2024 ఒలింపిక్‌ ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. మహిళల 10 మీటర్‌ల ఎయిర్‌ పిస్టల్, మిక్స్‌డ్‌ 10 మీటర్‌ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్స్‌లో కాంస్య పతకాలు సాధించి ఒకే క్రీడలో రెండు కాంస్య పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా మను భాకర్‌ చరిత్ర సృష్టించింది. ఇక అవనీ లేఖర తన స్వర్ణ పరంపరను కొనసాగిస్తూ పారిస్‌ 2024 షూటింగ్‌లో రెండవ పారాలింపిక్‌ స్వర్ణాన్ని గెలుచుకుంది. కేవలం పదిహేడేళ్ల వయసులో భారతదేశపు అతి పిన్నవయస్కురాలైన పారాలింపిక్‌ పతక విజేతగా నిలిచింది శీతల్‌దేవి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement