జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి హాకీ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్’ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. యువ హాకీ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటూ తమ ప్రతిభను చాటుతున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, తెలంగాణ హాకీ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు.
లీగ్ పోటీల్లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, రాయల్ హాకీ క్లబ్, బీహెచ్ఈఎల్ జట్లు గోల్ లేకుండా డ్రాగా నిలిచాయి. టీజీఆర్జేసీ స్కూల్, బోరబండ జట్టు రాక్‌రోవర్స్ క్లబ్, అంబర్‌పేట్‌పై 1-0తో విజయం సాధించింది. ఏసీ గార్డ్స్ యంగ్ బాయ్స్ జట్టు రాయల్ హాకీ క్లబ్, బీహెచ్ఈఎల్‌పై 5-0తో, గచ్చిబౌలి హాకీ క్లబ్ జట్టు టీజీఆర్జేసీ స్కూల్, బోరబండపై 5-0తో విజయం సాధించాయి. ఏసీ గార్డ్స్ యంగ్ బాయ్స్ జట్టు ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై 2-1తో, గచ్చిబౌలి హాకీ క్లబ్ జట్టు రాక్‌రోవర్స్ క్లబ్, అంబర్‌పేట్‌పై 5-0తో గెలుపొందాయి.
సెమీఫైనల్స్‌లో గచ్చిబౌలి హాకీ క్లబ్ జట్టు ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై 2-0తో విజయం సాధించింది. మరో సెమీఫైనల్‌లో ఏసీ గార్డ్స్ యంగ్ బాయ్స్ జట్టు టీజీఆర్జేసీ స్కూల్, బోరబండపై 1–0తో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో టీజీఆర్జేసీ స్కూల్, బోరబండ జట్టు ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై పెనాల్టీ షూటౌట్‌లో 3-1తో విజయం సాధించింది.
జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల్లో క్రీడలమంత్రి
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న ఉదయం 7:30 గంటలకు గచ్చిబౌలి హాకీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్ర క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన హాకీ దిగ్గజం, భారత మాజీ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి మంత్రి పుష్పాంజలి ఘటించనున్నారు.
అనంతరం ‘ఖేలో తెలంగాణ హాకీ లీగ్’ ఫైనల్ మ్యాచ్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. ఫైనల్‌లో గచ్చిబౌలి హాకీ క్లబ్, ఏసీ గార్డ్స్ యంగ్ బాయ్స్ జట్లు తలపడనున్నాయి. యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం, క్రీడల్లో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, క్షేత్రస్థాయిలో హాకీ క్రీడను అభివృద్ధి చేయడం, తెలంగాణలోని ఔత్సాహిక క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు తగిన వేదిక కల్పించడం ఈ క్రీడా వేడుకల ప్రధాన లక్ష్యమని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తెలియజేసింది.


