IND vs NZ: వాళ్లిద్దరి కోసం.. టీమిండియా మాస్టర్‌ ప్లాన్‌! | BCCI Clears Way For Auqib Nabi Gurnoor Before India Tour Of New Zealand | Sakshi
Sakshi News home page

IND vs NZ: వాళ్లిద్దరి కోసం.. టీమిండియా మాస్టర్‌ ప్లాన్‌!

Aug 28 2026 7:05 PM | Updated on Aug 28 2026 7:40 PM

BCCI Clears Way For Auqib Nabi Gurnoor Before India Tour Of New Zealand

PC: BCCI

శ్రీలంకపై టెస్టు సిరీస్‌ గెలిచిన టీమిండియాకు.. రెడ్‌బాల్‌ క్రికెట్‌లో తదుపరి న్యూజిలాండ్‌ రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది. ఐదు టీ20 మ్యాచ్‌లు, ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు టీమిండియా అక్టోబరు 22 నుంచి డిసెంబరు 1 వరకు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లనుంది.

వాళ్లిద్దరిపై ప్రత్యేక దృష్టి
ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు PTIతో మాట్లాడుతూ.. పేసర్లు గుర్నూర్‌ బ్రార్‌, ఆకిబ్‌ నబీలపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపాయి. ​కాగా వీళ్లిద్దరు శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పటికీ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. స్పిన్నర్లు ప్రభావం చూపే లంక పిచ్‌లపై.. వీరికి బదులు సీనియర్‌ పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణల సేవల్ని మేనేజ్‌మెంట్‌ ఉపయోగించుకుంది.

అయితే, కివీస్‌ గడ్డ మీద పరిస్థితులు వేరుగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అక్కడి పిచ్‌లు బౌన్సీగా ఉంటాయి. కాబట్టి గుర్నూర్‌తో పాటు ఆకిబ్‌ కోసం యాజమాన్యం ప్రత్యేక ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ..

ప్లాన్‌ ఇదే
‘‘గుర్నూర్‌ బ్రార్‌ను దులిప్‌ ట్రోఫీ ఆడమని సెలక్షన్‌ కమిటీ చెప్పింది. నార్త్‌ జోన్‌ జట్టులో ఇప్పటికే అర్ష్‌దీప్‌ సింగ్‌, అన్షుల్‌ కాంబోజ్‌ ఆడుతున్నారు. సునిల్‌ కుమార్‌ స్థానంలో గుర్నూర్‌ బ్రార్‌ తుదిజట్టులోకి వెళ్తాడు. ఇక ఆకిబ్‌ నబీని ఇంగ్లండ్‌లో కనీసం రెండు- మూడు మ్యాచ్‌లు ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది.

న్యూజిలాండ్‌లో పిచ్‌ పరిస్థితులు కాస్త భిన్నంగానే ఉంటాయి. అయితే, జట్టు ప్రణాళికల్లో ఆకిబ్‌ ఉన్నాడు. యూకే వీసా రాగానే అతడిని ఇంగ్లండ్‌కు పంపి కౌంటీల్లో ఆడించాలనే ప్లాన్‌ ఉంది’’ అని పేర్కొన్నాయి. కాగా ఇంగ్లండ్‌లో సర్రే తరఫున ఆకిబ్‌ నబీ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌ను 1-0తో గెలిచినప్పటికీ భారత్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 ఫైనల్‌ రేసులో ఇంకా వెనుకబడే ఉంది.

ఈ సైకిల్‌లో న్యూజిలాండ్‌తో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. వీటిలో కనీసం ఐదు గెలిస్తేనే భారత్‌ ముందుకు వెళ్తుంది. కాబట్టి కివీస్‌ పర్యటనలో సాధ్యమైనంత వరకు మెరుగ్గా ఆడేందుకు టీమిండియాను మేనేజ్‌మెంట్‌ ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: రాఖీ పండుగ: విరాట్‌ కోహ్లి అక్క పోస్ట్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement