రాఖీ పండుగ: విరాట్‌ కోహ్లి అక్క పోస్ట్‌ వైరల్‌ | No Matter Where: Virat Kohli Sister Raksha Bandhan Post Is Viral | Sakshi
Sakshi News home page

రాఖీ పండుగ: విరాట్‌ కోహ్లి అక్క పోస్ట్‌ వైరల్‌

Aug 28 2026 2:33 PM | Updated on Aug 28 2026 3:04 PM

No Matter Where: Virat Kohli Sister Raksha Bandhan Post Is Viral

తల్లితో భావనా- భార్యతో విరాట్‌ (PC: Instagram)

టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి ప్రస్తుతం ఆటకు దూరంగా ఉన్నాడు. కుటుంబంతో కలిసి ఎక్కువగా లండన్‌లోనే నివాసం ఉంటున్న ఈ స్టార్‌ బ్యాటర్‌.. ఇటీవల ఢిల్లీకి వచ్చాడు. భార్య అనుష్క శర్మతో కలిసి విమానాశ్రయం నుంచి కోహ్లి బయటకు వెళ్తున్న దృశ్యాలు వైరల్‌ అయ్యాయి.

ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి సోదరి భావనా కోహ్లి ధింగ్రా తాజాగా పెట్టిన పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా దేశవ్యాప్తంగా రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎంతదూరంగా ఉన్నప్పటికీ చాలా మంది అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్లు రాఖీ పూర్ణిమ రోజైనా ఒక్క చోట చేరి ఈ పండుగ జరుపుకొంటారన్న సంగతి తెలిసిందే.

కోహ్లికి రాఖీ కట్టిన భావనా
ఇక భావనా సైతం తన అన్న- తమ్ముడితో కలిసి రాఖీ పండుగ సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా అన్న వికాస్‌ కోహ్లితో దిగిన సెల్ఫీని.. తమ్ముడు విరాట్‌ కోహ్లికి తాజాగా రాఖీ కట్టిన ఫొటోను భావనా ఈ సందర్భంగా ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు. ‘‘ఈ జీవితం మనల్ని ఎంత దూరం, ఎంత ఎత్తుకు తీసుకువెళ్లినా సరే.. నా ప్రార్థనల్లో మీరు ఎల్లప్పుడూ ఉంటారు’’ అని సోదరులపై ప్రేమను చాటుకున్నారు.

ఈ నేపథ్యంలో సోదరితో రాఖీ కట్టించుకునేందుకే కోహ్లి లండన్‌ నుంచి ఢిల్లీకి వచ్చాడేమోనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఢిల్లీకి చెందిన ప్రేమ్‌ కోహ్లి, సరోజ్‌ కోహ్లికి ముగ్గురు పిల్లలు సంతానం. తొలుత వికాస్‌ జన్మించగా.. తర్వాత భావనా, విరాట్‌ జన్మించారు.

ఆమె ఎవరంటే?
విరాట్‌ అక్క భావనా ఎంటర్‌ప్రెన్యూర్‌. వ్యాపారవేత్త సంజయ్‌ ధింగ్రాను పెళ్లాడిన ఆమెకు మెహక్‌, ఆయుశ్‌ సంతానం. విరాట్‌ కోహ్లికి చెందిన ఫ్యాషన్‌ లేబుల్‌ వన్‌8సెలక్ట్‌తో కలిసి భావనా పనిచేస్తున్నట్లు సమాచారం. కాగా విరాట్‌ వీలైనప్పుడల్లా తన సోదరి ఇంటికి వెళ్తాడు. 

ఇందుకు సంబంధించిన ఫొటోలను భావనా షేర్‌ చేయగా.. ‘భారత దిగ్గజ బ్యాటర్‌గా ఎదిగినప్పటికీ తన అక్కకు ఎప్పటికీ చిన్ని తమ్ముడినేనని విరాట్‌ నిరూపించాడు’ అంటూ అభిమానులు కోహ్లిపై ప్రశంసలు కురిపించడం పరిపాటి. తన అన్న వికాస్‌తోనూ కోహ్లికి మంచి అనుబంధం ఉంది. 

కాగా వన్డేల్లో అత్యధికంగా 54 శతకాలు బాదిన కోహ్లి.. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డే, ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న కోహ్లికి కుమార్తె వామిక, కుమారుడు అకాయ్‌ ఉన్నారు. వీరంతా ఎక్కువగా లండన్‌లోనే ఉంటున్నారు.

చదవండి: భారత జట్టులోకి వారసులు వచ్చారు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement