న్యూఢిల్లీ: నేపాల్‌లో సంభవించిన భీకర వరదలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ పోస్టులో ఆయన ఉపయోగించిన ఒక పదంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించినప్పటికీ, ఈ పెను ప్రకృతి విపత్తును ‘డ్రామా’ అని సంబోధించడం చాలామందిని తీవ్రంగా కలచివేసింది. కేరళలోని తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ గురువారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘భారీ వినాశనాన్ని సృష్టించిన కొండ ప్రాంతాల్లోని ఆ డ్రామా గురించి ఏమాత్రం తెలియకుండానే నిన్న ఖాట్మండుకు విమానంలో ప్రయాణించాను’ అని రాసుకొచ్చారు. ఇంతటి తీవ్ర విషాదాన్ని వర్ణించేందుకు థరూర్ ‘డ్రామా’ అనే పదాన్ని వాడటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గొప్ప పదసంపద కలిగిన వ్యక్తి ఇంతటి సున్నితత్వ లేని పదాన్ని ఎలా ఉపయోగిస్తారని సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
నిఘంటువులోని క్లిష్టమైన పదాలు తెలిసినంత మాత్రాన ప్రయోజనం ఏమిటని, సమయోచితంగా ఎలా మాట్లాడాలో తెలియకపోతే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రకటనలోని సానుభూతే ఒక నాటకంలా కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఆంగ్ల భాషా నైపుణ్యానికి పెట్టింది పేరైన శశిథరూర్ నుంచి ఇలాంటి పదజాలాన్ని ఊహించలేమని వ్యాఖ్యానిస్తూ, వెంటనే ఆ పోస్టును సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంగ్లీషు భాషా సంస్కృతిలో డ్రామా అనే పదాన్ని తీవ్ర ఉత్కంఠ కలిగించే సంఘటనల విషయంలో కూడా వాడుతుంటారు. అయితే దీనిని ‘నాటకీయం’గా పలువురు భావించడంతో సమస్య తలెత్తింది. ఫలితంగా శశిధరూర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Took off for Katmandu yesterday, blissfully unaware of the drama that had taken place in the hills and caused such catastrophic damage. A severe, sudden flash flood struck northern Nepal’s Rasuwa district near the Tibet border, causing widespread destruction along the Bhote… pic.twitter.com/qxcDJgEK8C
— Shashi Tharoor (@ShashiTharoor) August 27, 2026


