60 మంది నవజాత శిశువుల దుర్మరణం! | 60 newborn deaths in West Bengal | Sakshi
Sakshi News home page

60 మంది నవజాత శిశువుల దుర్మరణం!

Aug 27 2026 12:00 PM | Updated on Aug 27 2026 12:23 PM

60 newborn deaths in West Bengal

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆగస్టు మొదటి మూడు వారాల్లో ‘మాల్డా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్’లో ఏకంగా 60 మంది శిశువులు మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇందులో ఒకే వారంలో ఒకే రోజు 10 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ, ఆసుపత్రి పనితీరుపై సమగ్ర నివేదికను కోరడంతో పాటు ఉన్నత స్థాయి సమీక్షను ప్రారంభించింది.

ఆగస్టు నెలలో మృతి చెందిన మొత్తం 60 మంది శిశువులలో, ఏకంగా 44 మంది ఇతర ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లలో జన్మించి.. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన తర్వాత చివరిక్షణంలో ఎంఎంసీహెచ్‌కు రిఫర్ చేయబడినవారే కావడం గమనార్హం. మిగిలిన 16 మంది మాత్రమే ఆ ఆసుపత్రిలో జన్మించారు.  

ఒకే రోజు మృతి చెందిన పదిమంది పిల్లల్లోని ఆరుగురులో ఇద్దరు మాత్రమే ఎంఎంసీహెచ్‌లో జన్మించగా.. మిగతా ఎనిమిది మందిని ఇతర ఆసుపత్రుల నుండి అత్యవసర చికిత్స నిమిత్తం ఇక్కడి తీసుకువచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసేన్‌జిత్ బార్ ధృవీకరించారు. ఆ నవజాత శిశువులు తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కామెర్లు,పుట్టుకతో వచ్చే గుండె సంబంధిత సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందారని వైద్యులు తెలిపారు.

మెడికల్ కాలేజీకి రిఫర్ చేయబడటానికి ముందు ఆ పిల్లలకు ప్రాథమిక చికిత్స అందించిన ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు,పలు ఆరోగ్య కేంద్రాల పనితీరుపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు 16 ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లను అధికారులు తనిఖీ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వానికి ఒక ప్రాథమిక నివేదికను సమర్పించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.  

ఈ మొత్తం ఘటనపై జరిపిన విచారణలో వెల్లడవుతున్న అంశాలపై చర్చించేందుకు మాల్డా జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో గురువారం ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. చికిత్స పొందుతున్న నవజాత శిశువుల మరణాల పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతుండగా, పూర్తి స్థాయి విచారణ తర్వాతే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement