స్కూల్లో ఉద్యోగినిని చితగ్గొట్టిన జెన్‌ ఆల్ఫా పిల్లలు.. మామూలుగా కాదు | Students accused of assaulting school staff | Sakshi
Sakshi News home page

స్కూల్లో ఉద్యోగినిని చితగ్గొట్టిన జెన్‌ ఆల్ఫా పిల్లలు.. మామూలుగా కాదు

Aug 24 2026 5:40 PM | Updated on Aug 24 2026 6:45 PM

Students accused of assaulting school staff

కోల్‌కతా: ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగినిని జెన్‌ ఆల్ఫా (2010 నుంచి 2024 మధ్య కాలంలో జన్మించిన) విద్యార్థులు కొందరు చితకబాదారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా బమన్‌గోలా ప్రాంతంలోని జగ్‌దలా హైస్కూల్‌లో ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ (టీసీ) జారీ విషయంలో ఓ పాఠశాల విద్యార్థికి, నాన్‌ టీచింగ్‌ మహిళా సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

గతంలో పాఠశాలలో చదివిన ఓ విద్యార్థి తన పేరులో సరిచేసిన అక్షరక్రమంతో టీసీ ఇవ్వాలని తమను కోరినట్లు నాన్‌ టీచింగ్‌ సిబ్బంది తెలిపారు. అయితే అధికారిక పాఠశాల రికార్డుల ప్రకారమే ఆ పత్రాన్ని జారీ చేయగలమని చెబుతూ ఆమె నిరాకరించారు.

దీంతో కొంతమంది విద్యార్థులు గదిలోకి ప్రవేశించి తనపై భౌతికంగా దాడి చేశారని బాధితురాలు ఆరోపించారు. తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడు అమిత్ హల్దర్, మరో సహాయ ఉపాధ్యాయుడు ఈ దాడికి విద్యార్థులను ప్రేరేపించారని ఆమె పేర్కొన్నారు. ఘటన అనంతరం చికిత్స కోసం ఆమెను బమన్‌గోలా ప్రాంతంలోని ముడిపుకూర్ గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

మరోసారి ఉద్రిక్తత
ఆసుపత్రిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాధిత మహిళ ఉద్యోగి మద్దతుదారులు ప్రతీకారంగా తాత్కాలిక ప్రధానోపాధ్యాయుడిపై, మరో ఉపాధ్యాయుడిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరో ఇద్దరు ఉపాధ్యాయులు నోని రాయ్, బిమల్ పాల్‌పై కూడా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

అంతేకాకుండా, తాను పాఠశాలలో నియమితురాలినైనప్పటి నుంచి పాఠశాలలో పలు ఆర్థిక అవకతవకలను గుర్తించినట్లు ఆమె ఆరోపించారు. ఇందులో టీచర్-ఇన్-చార్జ్ (టీఐసీ) ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన మధ్యాహ్న భోజన పథకంలోని అవకతవకలు కూడా ఉన్నాయని తెలిపారు.

ఉద్యోగినిపై స్కూల్‌ పిల్లల దాడి! వైర‌ల్ విడియో

ఆరోపించిన అవినీతికి వ్యతిరేకంగా తాను ప్రశ్నించినప్పుడు, తాత్కాలిక టీఐసీ తనను లైంగికంగా వేధించారని, అనుచిత ప్రతిపాదనలు చేశారని ఆమె ఆరోపించారు. అయితే హల్దర్ ఈ ఆరోపణలన్నింటినీ పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement