న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ- ఎన్‌సీఆర్ వ్యాప్తంగా ఈరోజు (సోమవారం) ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. పలు ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయి, వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. దక్షిణ ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం నమోదైంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేస్తూ, రోజంతా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అలాగే పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కూడా వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర సహా ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు వచ్చే అవకాశం ఉంది.


