11న బ్యాంకుల సమ్మె.. నాలుగు రోజులు బంద్‌! | Bank Strike September 11 Four-Day Banking Disruption | Sakshi
Sakshi News home page

11న బ్యాంకుల సమ్మె.. నాలుగు రోజులు బంద్‌!

Aug 24 2026 1:16 PM | Updated on Aug 24 2026 1:24 PM

Bank Strike September 11 Four-Day Banking Disruption

దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలులో జాప్యం, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI)పై విభేదాలు, పెన్షన్‌కు సంబంధించిన డిమాండ్లు పరిష్కారం కాకపోవడాన్ని నిరసిస్తూ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (UFBU) సెప్టెంబర్‌ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె అమల్లోకి వస్తే ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

నాలుగు రోజుల పాటు ప్రభావం?

సెప్టెంబర్‌ 11 శుక్రవారం. ఆ తర్వాత సెప్టెంబర్‌ 12 రెండో శనివారం, 13 ఆదివారం కావడంతో బ్యాంకింగ్‌ సేవలకు వరుసగా అంతరాయం ఏర్పడొచ్చు. మరోవైపు సెప్టెంబర్‌ 14న గణేశ్‌ చతుర్థి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు వరుసగా నాలుగు రోజులపాటు మూసి ఉండే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

సెప్టెంబర్‌లో మరో భారీ సమ్మె

సెప్టెంబర్‌ 11తో ఆందోళన ఆగదని యూనియన్స్‌ ఫోరం‌ స్పష్టం చేసింది. డిమాండ్లపై పురోగతి లేకపోతే సెప్టెంబర్‌ 28 నుంచి మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని ప్రకటించింది. ఈ సమ్మె సెప్టెంబర్‌ 28–30 తేదీల్లో జరగనుంది. సెప్టెంబర్‌ 28న అర్ధవార్షిక ముగింపు కార్యకలాపాలు ఉండటం వల్ల బ్యాంకింగ్‌ రంగంపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని యూనియన్లు భావిస్తున్నాయి. ఇక డిమాండ్లు పరిష్కారం కాకపోతే అక్టోబర్‌ 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని యూనియన్స్‌ ఫోరం‌ నిర్ణయించింది.

ఖాతాదారులు ఏం చేయాలి?

సెప్టెంబర్‌లో వరుస సమ్మె పిలుపుల నేపథ్యంలో చెక్కులు, నగదు లావాదేవీలు, బ్యాంకు శాఖల్లో చేయాల్సిన ఇతర అత్యవసర పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. అయితే UPI, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం వంటి డిజిటల్‌ సేవలు సాధారణంగా బ్యాంకుల సమ్మె ఉన్నప్పటికీ పనిచేసే అవకాశం ఉంటుంది. అత్యవసర లావాదేవీల కోసం ఖాతాదారులు ప్రత్యామ్నాయ డిజిటల్‌ మార్గాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.

ఇదీ చదవండి: ఈ వారం బ్యాంకులకు సెలవులు.. 4 రోజులు బంద్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement