రాహుల్‌ గాంధీపై దేశానికి పెద్దగా ఆశలు లేవు.. యోగి ఆగ్రహం | Read Vedas First Yogi Slams Rahul Gandhi Over Manusmriti Remarks | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీపై దేశానికి పెద్దగా ఆశలు లేవు.. యోగి ఆగ్రహం

Aug 24 2026 1:23 PM | Updated on Aug 24 2026 1:29 PM

Read Vedas First Yogi Slams Rahul Gandhi Over Manusmriti Remarks

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మనుస్మృతిపై చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు. బాధ్యత గల ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అలా మాట్లాడాల్సింది కాదని అన్నారు. ఈ క్రమంలో.. సంప్రదాయాలు, సంస్కృతిని అవమానించేలా రాహుల్‌ వ్యాఖ్యలు చేస్తున్నారని, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని యోగి మండిపడ్డారు.

రాయ్‌బరేలీలో స్వాతంత్య్ర సమరయోధుడు రాణా బేని మాధవ్‌ బక్ష్‌ సింగ్‌ జయంతి సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. మహిళలు మనుస్మృతి సంకెళ్ల నుంచి బయటకు రావాలని వ్యాఖ్యానించారని యోగి ప్రస్తావించారు.

రాహుల్‌ గాంధీపై దేశానికి పెద్దగా ఆశలు లేవు. కానీ భారత పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ఆయనకు ప్రజాస్వామ్యంపై బాధ్యత ఉంది. దేశ సంప్రదాయాలు, వారసత్వాన్ని విమర్శించడం మీ జన్మహక్కు అని భావిస్తున్నారా?” అని యోగి ప్రశ్నించారు. మనుస్మృతి గురించి మాట్లాడే ముందు రాహుల్‌ గాంధీ భారతీయ గ్రంథాలను అధ్యయనం చేయాలని యోగి సూచించారు. మనువు, భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే అథర్వవేదం, శతపథ బ్రాహ్మణం, మత్స్య పురాణం వంటి గ్రంథాలను చదవాలని అన్నారు.

భారతీయ సంప్రదాయాలు, వారసత్వంపై అవగాహన లేకుండానే విమర్శలు చేయడం సరికాదని యోగి పేర్కొన్నారు. దేశ సంస్కృతిని అవమానించే వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

విదేశాల్లో భారత్‌పై విమర్శలు
రాహుల్‌ గాంధీ గతంలోనూ అంతర్జాతీయ వేదికలపై భారత సాంస్కృతిక వారసత్వాన్ని కించపరిచేలా మాట్లాడారని యోగి ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌ బయటకు వెళ్లినప్పుడు రాష్ట్రాన్ని, విదేశాలకు వెళ్లినప్పుడు దేశాన్ని అవమానిస్తున్నారని విమర్శించారు. దేశం ఉగ్రవాదంపై పోరాడుతున్న సమయంలో సైన్యాన్ని ప్రశ్నించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సరిహద్దుల్లో సైనికులు శత్రువులతో పోరాడుతున్నప్పుడు వారి చర్యలకు ఆధారాలు అడగడం సరికాదన్నారు.

కాంగ్రెస్‌పైనా ఫైర్‌
అయోధ్య విరాళాల చోరీ అంశం రాజకీయంగా పెను దుమారం రేపింది. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ వైఖరిపై యోగి విమర్శలు గుప్పించారు. అయోధ్యలో శ్రీరాముడి ఉనికిని ప్రశ్నించిన పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యం, సంస్కృతి గురించి మాట్లాడుతోందని అన్నారు. 1975లో విధించిన ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా రాయ్‌బరేలీలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మించిన రాణా బేని మాధవ్‌ బక్ష్‌ సింగ్‌ పేరుతో ఆడిటోరియంను యోగి ప్రారంభించారు. ఆయన పేరుతో పోస్టల్‌ స్టాంపును విడుదల చేసి, స్మారక సంచికను ఆవిష్కరించారు. రాయ్‌బరేలీ జిల్లాకు ఇది చారిత్రక రోజని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

రాహుల్‌ ఏమన్నారంటే..
ఆగస్టు 22న మహారాష్ట్ర పుణెలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్‌’ కార్యక్రమంలో మహిళల హక్కులు, స్వేచ్ఛపై మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. మనుస్మృతిలో మహిళల స్థానం గురించి ప్రస్తావించారు. “మనుస్మృతి ప్రకారం చిన్నతనంలో మహిళ తండ్రి ఆధీనంలో, యవ్వనంలో భర్త ఆధీనంలో, భర్త మరణించిన తర్వాత కుమారుల ఆధీనంలో ఉండాలని చెబుతుంది. మహిళ ఎప్పుడూ స్వతంత్రంగా ఉండకూడదనే ఆలోచనను నేను వ్యతిరేకిస్తున్నాను. ఇలాంటి భావనలు సిగ్గుచేటు” అని అన్నారాయన. అలాగే బీజేపీ, ఆరెస్సెస్‌లు మహిళలను చెరసాల బందీలుగానే చూస్తుంటాయని మండిపడ్డారు.  ఆ వ్యాఖ్యలనే ప్రస్తావిస్తూ.. యూపీ సీఎం యోగి ఇప్పుడు విమర్శలు గుప్పించారు.

 

ఇదీ చదవండి: సెల్ఫీ కోసం వచ్చినట్లు చేసి, ముద్దు పెట్టి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement