సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మద్యం ప్రియులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలో కొత్తగా 121 రకాల లిక్కర్ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో అంతర్జాతీయంగా పేరున్న బ్రాండ్లను కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSBCL).. 18 ప్రముఖ సరఫరా సంస్థలకు చెందిన 121 కొత్త లిక్కర్ బ్రాండ్లను రాష్ట్రంలో ప్రవేశపెట్టే ప్రక్రియను చేపట్టింది. ఆయా బ్రాండ్లకు అనుమతులు ఇచ్చే ముందు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించేందుకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సెప్టెంబర్ 1లోగా అభ్యంతరాలు..
కొత్త లిక్కర్ బ్రాండ్ల ప్రవేశంపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకుంటే సెప్టెంబర్ 1వ తేదీలోపు తెలియజేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. అందిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తదుపరి అనుమతుల ప్రక్రియ కొనసాగనుంది. కొత్త బ్రాండ్లకు అనుమతులు లభిస్తే.. రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లలో వినియోగదారులకు మరిన్ని బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు 121 కొత్త రకాల లిక్కర్ రాష్ట్రంలోకి రానుండటంతో మద్యం ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.


