సౌదీలో హౌతీల బీభత్సం.. ఇద్దరు భారతీయులకు గాయాలు! | Two Indian Nationals among 11 Injured in Houthi attack on tallest tower | Sakshi
Sakshi News home page

సౌదీలో హౌతీల బీభత్సం.. ఇద్దరు భారతీయులకు గాయాలు!

Nov 25 2026 7:09 AM | Updated on Nov 25 2026 7:16 AM

Two Indian Nationals among 11 Injured in Houthi attack on tallest tower

రియాద్‌: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి దాడికి పాల్పడ్డారు. నగరంలోని కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న 80 అంతస్తుల పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్‌) టవర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో మొత్తం 11 మంది గాయపడగా.. వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.

సౌదీ పౌర రక్షణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన వారిలో ఇద్దరు సౌదీ పౌరులు, ఇద్దరు భారతీయులు, ముగ్గురు నేపాల్‌కు చెందినవారు, నలుగురు ఈజిప్టు పౌరులు ఉన్నారు. అయితే గాయపడిన భారతీయుల పేర్లు, వారి పరిస్థితి తీవ్రతకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు. రియాద్‌లోనే అత్యంత ఎత్తైన భవనంగా గుర్తింపు పొందిన ఈ 80 అంతస్తుల టవర్‌పై వారంలోపే ఇది రెండో దాడి. నవంబర్ 19న జరిగిన గత దాడిలో 385 మీటర్ల ఎత్తైన ఈ భవనంలోని కనీసం ఐదు అంతస్తులు దెబ్బతిన్నాయి. అయితే అప్పుడు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. నవంబర్ 8న కూడా రియాద్‌లోని ఆర్థిక జిల్లాలో ఉన్న అరాంకో పరిపాలనా భవనంపై హౌతీలు దాడి చేయడంతో దాని బయటి భాగం, అద్దాలు దెబ్బతిన్నాయి.

ఈ దాడిని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల ప్రతినిధి ‘పిరికిపంద ఉగ్రవాద చర్య’గా అభివర్ణించారు. దాడి జరిగిన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు యెమెన్‌లోని అల్ హుదైదా గవర్నరేట్‌లో సోమవారం సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వైమానిక దాడులు జరిపినట్లు హౌతీ నియంత్రణలోని యెమెన్ అధికారులు ఆరోపించారు. టెలికమ్యూనికేషన్ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్, టెలికాం సేవలకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియా, యెమెన్ హౌతీల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. సుదీర్ఘకాలం కొనసాగే సంఘర్షణను ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందని సౌదీ ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్ జదాన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సన్నిధానాన్ని దర్శించుకున్న నాలుగు లక్షల భక్తులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement