సహరన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో జరిగిన ఓ ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాల్సిన గౌరవ వందనాన్ని పొరపాటున ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి అందించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన అధికారులు సంబంధిత పోలీసు అధికారిపై చర్యలు తీసుకున్నారు.
సహరన్‌పూర్ సర్క్యూట్ హౌస్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు గౌరవ వందనానికి ఏర్పాట్లు చేశారు. అయితే న్యాయమూర్తి కంటే ముందే ఓవైసీ అక్కడికి చేరుకున్నారు. ఆయన వెంట భద్రతా సిబ్బంది ఉండటంతో పోలీసులు పొరపాటున ఆయనే న్యాయమూర్తి అని భావించారు. దీంతో ఓవైసీకి గౌరవ వందనం సమర్పించారు. ఆయన కూడా నిలబడి సెల్యూట్ స్వీకరించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సహరన్‌పూర్ సదర్ ప్రాంత సర్కిల్ అధికారి పవన్‌కుమార్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఆయనను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ (గ్రామీణ) మయాంక్ పాఠక్ వెల్లడించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఇతర పోలీసుల పాత్రపైనా విచారణ కొనసాగుతోంది. వైరల్ వీడియోలు, పోస్టులను తొలగించాలని కోరుతూ ఎక్స్ సామాజిక మాధ్యమ సంస్థకు పోలీసులు లేఖ రాశారు.


