2020 నాటి రాష్ట్ర ప్రభుత్వ జీవో 35కు సుప్రీంకోర్టు సమర్థన
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు సబబేనన్న త్రిసభ్య ధర్మాసనం
అక్రమ తవ్వకాలపై రాష్ట్రాలు జరిమానా విధించవచ్చని స్పషీ్టకరణ
అంజనీ స్టోన్ క్రషర్ స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేత
అక్రమ మైనింగ్‌పై వైఎస్ జగన్ సర్కార్ కఠిన చర్యలు
భారీ జరిమానాల విధింపుపై కంపెనీల అభ్యంతరాలు
హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు ఆ కంపెనీలకు చుక్కెదురు
నాటి ప్రభుత్వం జారీచేసిన జీవోకు అనుకూలంగా ఉత్తర్వులు
అక్రమ మైనింగ్ సమాజానికి పెద్ద రుగ్మతని వ్యాఖ్య
వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యను సమర్ధించిన సుప్రీంకోర్టు తాజా తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గనుల అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్‌కు సంబంధించి చట్ట నిబంధనల సవరణలు చేస్తూ అప్పటి జగన్ ప్రభుత్వం 2020 జూలై 1న జారీ చేసిన జీవో 35ను సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ జీవోను సమర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ‘అంజనీ స్టోన్ క్రషర్’ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ)ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. ‘అక్రమ మైనింగ్ అనేది సమాజాన్ని పీడిస్తున్న ఒక పెద్ద సామాజిక రుగ్మత. దీన్ని మనం అందరం తప్పనిసరిగా గుర్తించుకుని తీరాల్సిందే.
ఎటువంటి భయం, సిగ్గు లేకుండా విచ్చలవిడిగా పర్యావరణ విధ్వంసం కొనసాగుతోంది. ఇందుకు మనిషి అత్యాశే ప్రధాన కారణం. ఆ విధ్వంస పర్యవసానమే ఇప్పుడు మనకు మన కళ్ల ముందు కనిపిస్తున్న వినాశకరమైన ఫలితాలు’ అని ఇందుకు సంబంధించి వ్యాజ్యంలో గతంలో హైకోర్టు ధర్మాసనం వాŠయ్‌ఖ్యానించిన సంగతి తెలిసిందే.
హైకోర్టు తీర్పు చట్టబద్ధమే..
హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ‘పిటిషనర్ చట్టబద్ధమైన లీజుదారుడా కాదా అనే షోకాజ్ నోటీసులోని వ్యక్తిగత అంశాల లోతుల్లోకి మేము వెళ్లబోము. షోకాజ్ నోటీసు, జరిమానా మొత్తంపై సంబంధిత అధికారుల వద్దే సమాధానం చెప్పుకునే వెసులుబాటును హైకోర్టు డివిజన్ బెంచ్ ఇప్పటికే కల్పించింది. సుప్రీంకోర్టు గత తీర్పులు, ఎంఎండీఆర్ చట్టం–1957 నిబంధనలకు లోబడే 2020 జూలై 1 నాటి జీవో ఎంఎస్ నం. 35ను హైకోర్టు డివిజన్ బెంచ్ సరిగ్గా విశ్లేíÙంచింది’ అని స్పష్టంచేసింది.
గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం (ఎంఎండీఆర్ యాక్ట్)–1957లోని సెక్షన్ 21 ప్రకారం జరిమానాలు, శిక్షలు విధించే అధికారం కేంద్ర చట్టానికే పరిమితమని, ఏపీ ప్రభుత్వం జీవో 35 ద్వారా రూల్ 26ను సవరించి 10 రెట్ల జరిమానా విధించడం అధికార పరిధికి మించిన చర్యని, దానికి మించి నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు.
అంజనీ స్టోన్ క్రషర్ అప్పీల్ నేపథ్యం
2020లో జారీ అయిన జీవో 35 ద్వారా అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీఎంఎంసీ నిబంధనలను సవరించి, అక్రమ మైనింగ్‌పై సీనరేజ్ ఫీజుకు 5 నుంచి 10 రెట్ల జరిమానా విధించే అధికారాన్ని కల్పించిన నేపథ్యంలో అనకాపల్లి మండలం మార్టూరు ప్రాంతంలో అనుమతించిన పరిమితికి మించి కంకర, గ్రావెల్ తవ్వకాలు జరిపి, పర్మిట్లను దుర్వీనియోగం చేశారన్న ఆరోపణలపై 2020 చివరలో గనుల శాఖ విజిలెన్స్ విభాగం అంజనీ స్టోన్ క్రషర్ సంస్థకు రూ.4.5 కోట్లు, రూ.9.96 కోట్ల చొప్పున జరిమానా నోటీసులు జారీ చేసింది. ఇది కేంద్ర ఎంఎండీఆర్ చట్టం సెక్షన్ 21(2)కు విరుద్ధమంటూ సంస్థ 2021లో ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ప్రతికూల తీర్పుతో ఆ సంస్థ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు వైఎస్ జగన్ సర్కార్ కఠిన చర్యలు
⇒ రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ (ఎంఎంసీ) రూల్స్‌కు సంబంధించి చట్ట నిబంధనలకు సవరణలు చేస్తూ అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020 జూలై 1న జీవో 35 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం అక్రమ మైనింగ్‌కు పాల్పడినా, పర్మిట్ లేకుండా రవాణా చేసినా, భారీ జరిమానా, సీనరేజ్ ఫీజు విధించవచ్చు. అంతేకాక డిమాండ్ నోటీసు జారీ, మెరిట్ వసూలు, వాహనాలు, యంత్రాలు సీజ్ చేసే అధికారం గనుల శాఖ అధికారులకు ఉంటుంది.
⇒ ఈ నేపథ్యంలో భవనాల నిర్మాణాలకు అవసరమైన రాళ్లు, రహదారి మెటల్ కోసం అనుమతులకు మించి తవ్వకాలు చేసిన మైనింగ్ కంపెనీలకు జరిమానా నిమిత్తం అధికారులు డిమాండ్ నోటీసులు ఇచ్చారు.
⇒ దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలను సవాలు చేస్తూ పలు గ్రానైట్, క్రషర్స్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయించాయి. కేంద్ర చట్టమైన మైన్స్ అండ్ మినరల్ అభివృద్ధి, క్రమబద్ధికరణ చట్టం (ఎంఎండీఆర్) 1957కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం సవరించిన ఏపీ ఎంఎంసీ నిబంధనలు చెల్లవని పేర్కొన్నాయి. ఎంఎంఆర్‌డీ చట్టం కింద జరిమానాలు, శిక్షలు విధించే అధికారం కేవలం సంబంధిత క్రిమినల్ కోర్టులకు మాత్రమే ఉంటుంది తప్ప అధికారులకు లేదని ఆ కంపెనీలు వాదించాయి.
⇒ దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ రావు రఘునందన్‌రావు డిమాండ్ నోటీసులు జారీ చేసే పరిధి మాత్రమే అధికారులకు ఉందని జరిమానాలు, శిక్షలు విధించే అధికారం సంబంధిత కోర్టులకు మాత్రమే ఉంటుందంటూ 2020లో తీర్పునిచ్చారు. చట్ట నిబంధనలు ఉల్లంఘించారంటూ పలు కంపెనీలకు జరిమానా నిమిత్తం గనుల శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేశారు.
⇒ దీంతో తీర్పును సవాలు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసింది.
⇒ ఇదే సమయంలో ఎంఎంసీ నిబంధనల్లోని రూల్ 26(3)(2), 34(1) చట్టబద్ధతను సవాలు చేస్తూ అంజనీ స్టోన్ క్రషర్స్ రిట్ పిటిషన్ దాఖలు చేసింది.
⇒ ఈ వ్యాజ్యాలన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అక్రమ మైనింగ్, నిల్వ, రవాణాను అరికట్టేందుకు 2020లో అప్పటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట నిబంధనల సవరణలను హైకోర్టు సమర్ధించింది. ఆ సవరణలు చట్టబద్ధమైనవేనని తేల్చి చెప్పింది.
⇒ మైన్స్ అండ్ మినరల్ అభివృద్ధి, క్రమబద్ధికరణ చట్టం (ఎంఎండీఆర్), ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ (ఎంఎంసీ) రూల్స్‌ను ఉల్లంఘిస్తూ అక్రమ తవ్వకాలకు పాల్పడే కంపెనీలకు, వ్యక్తులకు జరిమానా విధించే అధికారం గనుల శాఖ అధికారులకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే శిక్ష విధించే అధికారం మాత్రం సంబంధిత న్యాయస్థానానికే ఉంటుందని తెలిపింది.
⇒ ఏపీ ఎంఎంసీ రూల్స్‌కు ప్రభుత్వం చేసిన సవరణలు కేంద్ర చట్టమైన ఎంఎంఆర్‌డీకి విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల అవి చెల్లుబాటు కావంటూ సింగిల్ జడ్జి ఇచి్చన తీర్పును ధర్మాసనం రద్దు చేసింది.
అక్రమార్కులను చట్టబద్ధ లీజుదారులతో సమానంగా చూడలేం
రాష్ట్ర ప్రభుత్వానికి నిబంధనలు రూపొందించే అధికారం లేదన్న వాదన ఎంఎండీఆర్ చట్టానికి, సుప్రీంకోర్టు గత తీర్పులకు విరుద్ధం. అక్రమంగా ఖనిజాలను తవ్వేవారిని, చట్టబద్ధమైన లీజుదారులతో సమానంగా చూడలేము. అక్రమ తవ్వకందారులపై విధించే మొత్తాన్ని ‘జరిమానా’ అని పిలిచినా లేక ‘అధిక నష్టపరిహారం’ అని పేర్కొన్నా దానిని నిర్దిష్టంగా చూడలేం. ఒక ఆస్తిలో చట్టబద్ధమైన అద్దెదారు నిర్ణీత అద్దె చెల్లిస్తాడు.
అదే ఆస్తిని ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే లేదా లీజు గడువు ముగిసినా కొనసాగితే మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం వసూలు చేస్తారు. దానిని శిక్ష అనలేం.. అది కేవలం నష్టపరిహారం మాత్రమే. సెక్షన్ 21 ప్రకారం మిమ్మల్ని జైలుకు పంపే చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవచ్చు, దానికి మీరు అంగీకరిస్తారా? క్రిమినల్ చర్య వేరు. సివిల్ చట్టం కింద నష్టపరిహారం వసూలు చేయడం వేరు.
– సుప్రీంకోర్టు సీజే ధర్మాసనం


