తాడిపత్రిలో టీడీపీ గూండాలు తగలబెట్టిన వాహనం, పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో టీడీపీ మూకల దాడిలో గాయపడిన బూసి రాజేష్
టీడీపీ గూండాలు, పోలీసుల దాష్టికాలు
ఎస్‌ఈసీ అండతో యథేచ్ఛగా దురాగతాలు
వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు
తాడిపత్రి దిగువపల్లిలో సర్పంచ్ అభ్యర్థి వాహనానికి నిప్పు
నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు అక్రమ నిర్బంధాలు
కోర్టు ఆదేశాలు ఉన్నా లెక్కచేయని ఖాకీలు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: పల్లెల్లో పచ్చ గూండాల రాక్షసకాండకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. నియంత్రించాల్సిన పోలీసులు పచ్చసేవకులుగా చెలరేగిపోతున్నారు. దాష్టికాలకు తలాడించడమే కాదు.. కోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ బెదిరింపులు, అరెస్టులు, నిర్బంధాలు, లాఠీచార్జిలతో పేట్రేగిపోతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఈసీ) అండతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు సాగిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక వెన్నుపోటు పార్టీ రౌడీలు అధికారమదంతో హింసాకాండకు తెగబడుతున్నారు.
విపక్షం బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. పోటీకి దిగితే ప్రాణాలుండవని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఫలితంగా పల్లెలు భీతిల్లిపోతున్నాయి. చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పచ్చమూకలు నిర్భీతిగా సాగించిన అరాచకాలు ప్రజాస్వామ్య వలువలు ఒలిచి నిస్సిగ్గుగా నడిబజారులో నిలబెట్టాయి. రాజ్యాంగ ప్రతిష్టను మంటగలిపాయి.
తాడిపత్రిలో జేసీ వర్గీయుల అరాచకం..
అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ వర్గీయుల దాష్టీకం కొనసాగుతోంది. తాడిపత్రి మండలం దిగువపల్లిలో సర్పంచ్ అభ్యరి్థగా నామినేషన్ దాఖలు చేయాలని భావిస్తున్న సంగటి విజయలక్ష్మీకి చెందిన వాహనానికి దుండగులు నిప్పంటించారు. తాడిపత్రి మండలం ఉస్సేనాపురం గ్రామంలో టీడీపీ మూకలు బీభత్సం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై దాడి చేశారు. ఆటోను ధ్వంసం చేశారు.

పెద్దపప్పూరు మండలం చాగల్లుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సూర్యనారాయణపై టీడీపీ రౌడీలు దాడి చేశారు. ఆయన వద్ద ఉన్న నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారు. అమ్మలదిన్నె గ్రామంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లిలో వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీటీసీ నాగయ్య ఒంటరిగా వెళ్తుండగా ఆదివారం రాత్రి టీడీపీ వర్గీయులు అడ్డగించి దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి.
⇒ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం మల్లవోలు గ్రామంలో వైఎస్సార్‌సీపీలో చురుగ్గా పనిచేస్తున్న చుక్కా రాజకుమార్, గంటెల బొర్రయ్యలను మూడు రోజులుగా పోలీసులు వెంటాడుతూ నామినేషన్ వేయనీయకుండా అడ్డుకుంటున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన సోమవారం ఉదయం వారిని అక్రమంగా అదుపులోకి తీసుకుని నిర్బంధించారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఖాకీల తీరుపై మండిపడుతున్నారు.
దాచేపల్లిలో వెన్నుపోటు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న పోలీసులు వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు నామినేçషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోవడం లేదు. దాచేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కొప్పుల రవికుమార్, అధికార ప్రతినిధి షేక్ జాకీర్‌హుస్సేన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు బూసి రాజేష్‌పై టీడీపీ మూకలు కర్రలతో దాడిచేశాయి.

⇒ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం పెద్దన్నపాడు, వలసపల్లె గ్రామాలకు చెందిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులతోపాటు మాజీ జెడ్పీటీసీ సభ్యులు తమ్మిశెట్టి బాలయ్య పెద్దన్నపాడు సర్పంచ్ అభ్యర్థి మార్తల సాంబశివారెడ్డి లతోపాటు 18 మందిని సోమవారం తెల్లవారు జామున పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ముద్దనూరు స్టేషన్‌కు తరలించి నిర్బంధించారు. వీరితో నామినేషన్ వేయించాలని కోర్టు నుంచి ఆదేశాలు ఉన్నా పోలీసులు బేఖాతర్ చేశారు. అధికార వెన్నుపోటు కూటమి కార్యకర్తల్లా వ్యవహరించారు.
ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని నామినేషన్ పత్రాలను లాక్కుని కూటమి నేతలు చింపేశారు. మద్దనూరు, కొండాపురం మండలాల్లోనూ కూటమి గూండాలు దాష్టీకాలకు పాల్పడ్డారు. జమ్మలమడుగు మండలంలోని ధర్మాపురంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు నామినేషన్ వేయకుండా కూటమి నేతలు అడ్డుకున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీ గూండాలు కర్రలు, కత్తులతో కలియతిరిగారు. అంబవరంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను బెదిరిస్తున్నారు.

⇒ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో నామినేషన్ల తిరస్కరణ వ్యవహారంలో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేసింది. తిరస్కరణకు గురైన సర్పంచ్ నామినేషన్లపై విచారణ కోసం ఆర్డీవో చిన్నయ్య సోమవారం ఉదయం 10 గంటలకు అభ్యర్థులను కార్యాలయానికి రావాలని ఆదేశించారు. దీంతో అభ్యర్థులు సమయానికి చేరుకున్నా ఆర్డీవో రాలేదు. అభ్యర్థులు పడిగాపులు కాయా ల్సి వచి్చంది.
⇒ వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు కొత్తపల్లె పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతు దారులు నామినేషన్ వేయకుండా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. పోలీసులూ వీరికి వంతపాడారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి తనయుడు మల్లేల మురళీధర్‌రెడ్డి, ఆయన సతీమణి మల్లెల ఉమ నిరసన చేపట్టారు. నామినేషన్ కేంద్రంలోకి దూసుకెళ్లాలని ప్రయత్నించిన అభ్యర్థులను రూరల్ సీఐ శివశంకర్ నాయక్, త్రీటౌన్ ఎస్‌ఐ నాగకీర్తనలతోపాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది బయటకు లాగేశారు.

గెలవాలంటే రౌడీయిజం చేయాలి
సర్పంచుల గెలుపులో కుప్పం, మంగళగిరికి మించిపోయాను మంత్రి మండిపల్లి వ్యాఖ్యలు
సాక్షి, మదనపల్లె: ఎదుటివారు ఏమనుకున్నా మనం గెలవాలంటే రౌడీయిజం చేయాల్సిందేనని అన్నమయ్య జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం మదనపల్లి మున్సిపల్ పాలకవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. దీనికి హాజరైన ఆయన సభలో ప్రసంగిస్తూ ‘20 ఏళ్ల రాయచోటి మున్సిపల్ చరిత్రలో గతంలో ఒక కౌన్సిల్ సీటు కోసం కొట్లాడిన తాను, ఇప్పుడు 44 మున్సిపల్ వార్డును గెలుచుకున్నా, 68 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నాను. సర్పంచుల విషయంలో అయితే కుప్పం, మంగళగిరిని మించిపోయినాం..72 సర్పంచులను దక్కించుకున్నాం.
26వ తేదీ జరిగే పోలింగ్‌లో మిగిలిన 11 సర్పంచులను గెలుస్తాం’ అని అన్నారు. ‘దీన్ని ఎదుటివారు రౌడీయిజం అంటున్నారు. నేను అనేది ఒకటే మనం అన్నీ చేయాలి. రౌడీయిజం చేయాలి, చెడ్డా చేయాలి, మంచి చేయాలి. మనం చేసే పనికి ఎదుటివాడు మన ముందు నిలబడకూడదు’ అంటూ ఆయన రాయచోటిలో ఏకగ్రీవంగా చేసుకున్న ఎంపీటీసీ, సర్పంచ్ పదవులను ఉద్దేశించి గొప్పగా చెప్పుకున్నారు. ‘ఎన్నికలు అయిపోయినాయి ఇక స్థలాలు, భూములు ఎక్కడ ఉన్నాయి అనేది వదిలిపెట్టండి’ అని వ్యాఖ్యానించారు.
పేరాడ తిలక్ గృహ నిర్బంధం
టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలోని మంత్రి అచ్చెన్నాయుడు స్వగ్రామం కోట»ొమ్మాళి మండలం నిమ్మాడలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల నామినేషన్‌కు వెళ్తున్న ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ను పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం ఉదయం కణితూరులోని తన ఇంటి వద్ద తిలక్‌ను నందిగాం ఎస్‌ఐ షేక్ మహ్మద్ ఆలీ ఇంటి నుంచి వెళ్లేది లేదంటూ హుకుం జారీ చేశారు. మంత్రి కుటుంబ సభ్యులు తమ పార్టీ వారిపై దాడులకు పాల్పడ్డారని, శాంతియుతంగా నామినేషన్ వేసేందుకు వెళ్తుంటే పోలీసులతో అడ్డుకుంటున్నారని తిలక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.


