తిరుపతి సమీపంలోని పురాతన ఆలయాన్ని జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం
కొందరి ప్రయోజనాల కోసం ఆలయం ధ్వంసం
తిరుపతి సమీపంలో వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేసిన చంద్రబాబు ప్రభుత్వం
అగస్త్య మహాముని పూజలు చేసిన ఆలయమిది.. తొలి పల్లవుల కాలంలో అభివృద్ధి
స్థానికులు అభ్యంతరం చెబుతున్నా వినకుండా జేసీబీలతో కూల్చివేత
ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆలయం శిథిలాల వద్ద బైఠాయించిన వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన
బ్రిటిష్ పాలకులకు ఉన్న భక్తి కూడా చంద్రబాబు, పవన్‌కు లేదని మండిపాటు
పెట్టుబడిదారుల కోసం అలైన్‌మెంట్ మార్చారని ఆగ్రహం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: పుష్కరాలు, అభివృద్ధి పేరుతో గతంలో అనేక ఆలయాలను ధ్వంసం చేయించిన చంద్రబాబు.. ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో తిరుపతి సమీపంలోని అతి పురాతన, అతి విశిష్టమైన ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ధ్వంసం చేయించారు. సోమవారం స్వామి విగ్రహాన్ని గునపాలతో పెకలించి, గోపురం, ఇతర విగ్రహాలను జేసీబీలతో ధ్వంసం చేసి నేలపై పడేశారు. ఈ ఆలయాన్ని అలాగే ఉంచి, రోడ్డు విస్తరణ చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, కొందరి ప్రయోజనాల కోసం అతి పవిత్ర క్షేత్రాన్ని నేలమట్టం చేయడం చూసి స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
నిత్యం పూజలు చేసుకొనే ఆలయాన్ని కూల్చవద్దని స్థానికులు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం వినలేదు. ఆలయాన్ని గునపాలు, జేసీబీలతో కూల్చివేసింది. వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయం ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు.
వేల ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం
రేణిగుంట – కడప జాతీయ రహదారి ఆంజనేయపురం వద్ద వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అభయాంజనేయ స్వామి ఆలయం ఉంది. అగస్త్య మహాముని, ఆయన భార్య లోపాముద్ర, తాళ్లపాక అన్నమయ్య, కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, జయేంద్ర సరస్వతి స్వామి వంటి వారు ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు, అభిషేకాలు చేశారు. ఈ ఆలయంలో వివాహాలు చేస్తే ఆ కుటుంబానికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయనేది స్థానికుల నమ్మకం. తిరుమలకు వచ్చే భక్తులు కూడా ఇక్కడ స్వామిని దర్శించుకొని వెళ్తుంటారు. తొలి పల్లవుల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇంతటి విశిష్టత ఉన్న ఈ ఆలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం సోమవారం నేలమట్టం చేసింది.
స్వయంభువుగా వెలిసిన విగ్రహానికి గునపం పోటు
ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలసిన ఈ ఆలయంలోని మూలవిరాట్టును తొలగించే దృశ్యాలు ప్రభుత్వ కర్కశత్వాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. విగ్రహాన్ని తొలగించే సమయంలో ఎటువంటి ఆచార సంప్రదాయాలు పాటించలేదు. కనీసం పూజలు కూడా చేయలేదు. సిబ్బంది నేరుగా గర్భాలయంలోకి వెళ్లి స్వామి విగ్రహాన్ని గునపాలతో పెకలించారు. ఆలయ గోపురాన్ని, పైన ఉన్న శ్రీఆంజనేయస్వామి విగ్రహం, సీతారామ లక్ష్మణుల విగ్రహాలను జేసీబీతో లాగిపడేశారు. ఈ
దృశ్యాలు చూసి భక్తులు, స్థానికులు తీవ్ర ఆవేదన చెందారు.
ప్రభుత్వ తీరుపై భూమన ఆగ్రహం
ఆంజనేయస్వామి ఆలయం కూల్చివేత విషయం తెలుసుకున్న వైస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ధ్వంసం చేసిన ఆలయాన్ని పరిశీలించారు. శిథిలాల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. జాతీయ రహదారి డిజైన్‌లో మార్పులు చేసే అవకాశం ఉన్నప్పటికీ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అతి పురాతనమైన, విశిష్టత కలిగిన ఆలయాన్ని నేలమట్టం చేస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందూ ఆలయాల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఇదేనా అని ధ్వజమెత్తారు.
పరమ పవిత్రమైన ఆలయాన్ని అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం రోజున నేలమట్టం చేయడం హిందువుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడమేనని అన్నారు. కరకంబాడి వద్ద బడా పెట్టుబడిదారులు, ధనికుల స్థలాలు రోడ్డు విస్తరణలో పోకుండా ఉండేందుకే జాతీయ రహదారిని వారికి అనుకూలంగా మలుపు తిప్పారని, అందులో భాగంగానే ఆంజనేయస్వామి ఆలయాన్ని కూలగొట్టారని తెలిపారు. ఇది వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన అత్యంత దారుణమని కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు.


