రెక్కల కష్టం.. కుమిలిపోతోంది! | Employment Guarantee Scheme Workers Face Delayed Payments in Chandrababu Govt | Sakshi
Sakshi News home page

రెక్కల కష్టం.. కుమిలిపోతోంది!

Nov 24 2026 4:52 AM | Updated on Nov 24 2026 4:52 AM

Employment Guarantee Scheme Workers Face Delayed Payments in Chandrababu Govt

ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.493 కోట్లు

నెలల తరబడి కూలి డబ్బులు అందక పేదల అగచాట్లు

ఉపాధి హామీ, జీ రామ్‌ జీ కింద భారీగా కూలి బకాయిలు

అటు చంద్రబాబు కరువు కాటు.. ఇటు నిలిచిపోయిన కూలి డబ్బులు

గ్రామీణ పేదలకు కరువు పనులే దిక్కు

రాష్ట్రంలో 413 మండలాలు కరువు బారిన పడినట్లు ప్రభుత్వమే అధికారికంగా ప్రకటన 

విపత్తు వేళ కూలి డబ్బులివ్వకుండా బాబు సర్కార్‌ వేధింపులు

సాక్షి, అమరావతి: అటు కరువును సమర్థంగా ఎదుర్కోవడంలోనూ తీవ్ర వైఫల్యం.. ఇటు ఉపాధి కూలీలకు కనీసం కూలి డబ్బులు చెల్లించడంలోనూ అంతులేని నిర్లక్ష్యం! పెను విపత్తు వేళ చంద్రబాబు సర్కార్‌ అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు తీవ్రమైన కరువు కాటు మరోవైపు ఉపాధి హామీ కూలి డబ్బులు నెలల తరబడి అందకపోవడంతో గ్రామీణ నిరుపేదలు  ఆకలితో అలమటిస్తున్నారు. వలస వెళ్లేందుకూ పనులు దొరకడం లేదని ఆక్రోశిస్తున్నారు.

రాష్ట్రంలో ఈ ఏడాది 413 మండలాలు కరువు బారిన పడినట్లు చంద్రబాబు సర్కారే స్వయంగా ప్రకటించింది. తీవ్ర దుర్భిక్షం కారణంగా పల్లెల్లో వ్యవసాయ పనులు లేక కూలీలు కరువు పనులనే నమ్ముకున్నారు. కరువు విపత్తు వేళ ఉదారంగా పనులు కల్పించి ఆదుకోవాల్సిన బాబు సర్కార్‌ పేదల డొక్కలు మాడుస్తోంది. కరువు పనులకు హాజరైన కూలీలకు ఏకంగా రూ.493 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో పొట్ట కూటి కోసం పనులకు వెళ్లే వారంతా అవస్థలు ఎదుర్కొంటున్నారు. పేదలకు ఇవ్వాల్సిన కూలీ డబ్బుల చెల్లింపుల్లో చంద్రబాబు సర్కార్‌ తీవ్ర జాప్యం చేయటాన్ని నిలదీస్తున్నారు.

ఉపాధి లేదు.. హే రామ్‌!
లక్షల మంది నిరుపేదలకు చంద్రబాబు సర్కార్‌ నెలల తరబడి కూలీ డబ్బులు చెల్లించకుండా తొక్కి పెడుతోంది. ఒక్క ఉపాధి హామీ పథకం కిందనే ఈ ఏడాది ఏప్రిల్‌ – జూన్‌ నెలాఖరు మధ్య పనులు చేసిన కూలీలకు ప్రభుత్వం ఇంకా రూ. 137 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు వ్యవసాయ, కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

మరోవైపు జూలై 1 నుంచి ఉపాధి హామీ స్థానంలో కొత్తగా వచ్చిన వీబీ జీ రామ్‌ జీ పథకానికి సంబంధించి కూలీలకు మరో రూ. 356 కోట్లు మేర బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇలా నెలల తరబడి రూ.వందల కోట్ల మేర కూలీ డబ్బులు  అందని పరిస్థితి నెలకొనడంతో పేదలు ఇక్కట్ల పాలవుతున్నారు.

వలసలకూ అవకాశం లేక..
రాష్ట్రంలో కాలువల ద్వారా సాగునీరు అందే పరిస్థితి లేకపోవడం, సీజన్‌లో వర్షాలు కురవకపోవడంతో పంట పొలాలన్నీ బీడులుగా మారాయి. ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ప్రభుత్వమే రెండు విడతల్లో  413 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామాల్లో పేదలు ఎక్కువగా వీబీ జీ రామ్‌ జీ పథకం పనులపైనే ఆధారపడుతున్నట్లు వ్యవసాయ, కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

గ్రామీణ పేదలు తమ రెక్కల కష్టాన్నే నమ్ముకున్నారు. ఇంత కరువు ఇబ్బందుల్లో సైతం పేదల కూలీ డబ్బుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ కార్యకలాపాలు మందగించడంతో వలస వెళ్లేందుకు సైతం అవకాశం లేక పూర్తిగా వీబీ జీ రామ్‌ జీ పనులనే నమ్ముకున్నామని పేదలు ఆక్రోశిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement