ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి స్థాపించిన అమెరికాకు చెందిన ఒక టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ భారతదేశంలో ఆపిల్ (Apple) సంస్థపై కోర్టులో దావా వేసింది. తమ పేటెంట్ పొందిన కాంటాక్ట్-షేరింగ్ టెక్నాలజీని ఆపిల్ అనుమతి లేకుండా ఉపయోగించుకుంటోందని ఆ సంస్థ ఆరోపించింది. దీనిపై నష్ట పరిహారం చెల్లించడంతోపాటు, భారతదేశంలో ఆపిల్ ఈ ఫీచర్‌ను ఉపయోగించకుండా నిషేధం విధించాలని బాంబే హైకోర్టును ఆశ్రయించింది.
ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి గౌరవ్ గోయల్ 2018లో 'జీజీ టెక్నాలజీస్ ఇంక్' (GG Technologies Inc.)ను స్థాపించారు. రెండు స్మార్ట్‌ఫోన్‌లను దగ్గరకు తీసుకురావడం ద్వారా కాంటాక్ట్ వివరాలను ఇచ్చిపుచ్చుకునే 'స్టే చ్' (StayTouch) అనే యాప్‌ను ఈ సంస్థ రూపొందించింది. మ పేటెంట్ టెక్నాలజీలోని ప్రధాన అంశాలను ఆపిల్ ఎలాంటి అనుమతి లేదా లైసెన్సింగ్ ఒప్పందం లేకుండానే తన 'నేమ్‌డ్రాప్' ఫీచర్‌లో వాడుకుంటోందని జీజీ టెక్నాలజీస్ ఆరోపించింది. 2023లో ఆపిల్ ఈ ఫీచర్‌ను తీసుకురావడానికి చాలా ఏళ్ల ముందే తాము ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశామని ఆ సంస్థ వాదిస్తోంది. ఈమేరకు బాంబే కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. నష్టపరిహారంగా రూ. 1,500 కోట్లు (సుమారు 162 మిలియన్ డాలర్లు) చెల్లించాలని, అలాగే ఆపిల్ 'నేమ్‌డ్రాప్' (NameDrop) ఫీచర్‌ను నియంత్రిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరింది.
స్టేటచ్ (StayTouch), ఆపిల్ నేమ్‌డ్రాప్ (NameDrop) అంటే ఏమిటి?
టెక్‌క్రంచ్ (TechCrunch) కథనం ప్రకారం, ఈ స్టార్టప్ 2019లో స్టేటచ్‌ను ప్రారంభించి, అదే ఏడాది అమెరికాలో పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత 2021లో భారతదేశంలో పేటెంట్ కోసం దరఖాస్తు చేయగా, 2024 జూలైలో పేటెంట్ మంజూరైంది. స్టేటచ్ అనేది జీజీ టెక్నాలజీస్ రూపొందించిన ప్రాక్సిమిటీ-ఆధారిత కాంటాక్ట్-షేరింగ్ యాప్. ఐఓఎస్ (iOS), ఆండ్రాయిడ్ రెండింటిలోనూ అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా, ఫోన్ నంబర్లను మాన్యువల్‌గా టైప్ చేయాల్సిన అవసరం లేకుండా రెండు స్మార్ట్‌ఫోన్‌లను దగ్గరకు తీసుకురావడం ద్వారా కాంటాక్ట్ సమాచారాన్ని పంచుకోవచ్చు.
ఇదీ చదవండి: రూ.2 కోట్ల కరెన్సీ దండ : పెళ్లికి బామ్మర్ది సర్‌ప్రైజ్
మరోవైపు, ఆపిల్ తన iOS 17 అప్‌డేట్‌లో భాగంగా 2023 జూన్‌లో 'నేమ్‌డ్రాప్' ఫీచర్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా ఐఫోన్‌లను ఒకదానికొకటి దగ్గరగా ఉంచడం ద్వారా కాంటాక్ట్ వివరాలను షేర్ చేసే వీలును ఈ ఫీచర్ కల్పిస్తుంది. అదే ఏడాది చివర్లో ఐఫోన్‌లకు, అక్టోబర్ 2023లో watchOS 10.1 ద్వారా ఆపిల్ వాచ్‌లకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
జీజీ టెక్నాలజీస్ ప్రధాన ఆరోపణలివే
సమీపంలో ఉంచిన పరికరాల మధ్య కాంటాక్ట్ సమాచారాన్ని బదిలీ చేసే టెక్నాలజీకి సంబంధించి తమకు ఉన్న భారతీయ పేటెంట్‌ను ఆపిల్ నేమ్‌డ్రాప్ ఉల్లంఘిస్తోందని జీజీ టెక్నాలజీస్ పేర్కొంది. రూ. 1,500 కోట్ల నష్టపరిహారంతో పాటు, భారతదేశంలో ఆపిల్ ఈ వివాదాస్పద ఫీచర్‌ను ఉపయోగించకుండా నిషేధం విధించాలని బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా, నేమ్‌డ్రాప్ ఫీచర్ ముందే ఇన్‌స్టాల్ అయి ఉన్న ఐఫోన్‌లు, ఆపిల్ వాచ్‌ల అమ్మకాలు, దిగుమతులను నియంత్రించాలని కూడా కోర్టును కోరింది. ఈ దావా ఇంకా విచారణకు రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఆ క్రీమ్‌తో నా కిడ్నీలూ పాడయ్యాయి : సింగర్, కంపెనీకి భారీ షాక్!
అమెరికాలోనూ షాక్
ఈ రెండు కంపెనీల మధ్య న్యాయపోరాటం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఇవే ఆరోపణలతో జీజీ టెక్నాలజీస్ గత ఏప్రిల్‌లో అమెరికాలోనూ ఆపిల్‌పై పేటెంట్ ఉల్లంఘన దావా వేసింది. ఈ ఫిర్యాదు మేరకు, ఆగస్టులో అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్ (ITC) దర్యాప్తు ప్రారంభించిందని టెక్‌క్రంచ్ నివేదించింది. తమ పేటెంట్‌ను ఉల్లంఘించినట్లు తేలిన ఆపిల్ పరికరాల దిగుమతిని అడ్డుకోవడంతో పాటు, అమెరికాలో వాటి అమ్మకాలపై ఆంక్షలు విధించాలని జీజీ టెక్నాలజీస్ ఆ కేసులో కోరుతోంది.


