సాక్షి, తాడేపల్లి: తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై గతంలో తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబుతో షర్మిల రాజకీయంగా సన్నిహితంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలకు తాజాగా వెలువడిన ఓ మైనింగ్ జీవో మరింత ఆజ్యం పోసింది. షర్మిల కుటుంబానికి ఆర్థిక సంబంధాలున్నట్లు ఆమె ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆమోద ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు చంద్రబాబు ప్రభుత్వం 50 ఏళ్లపాటు ఇనుప ఖనిజ గనుల లీజు మంజూరు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబుకు రాజకీయంగా ప్రతికూల పరిణామాలు చోటుచేసుకున్నప్పుడల్లా షర్మిల తన రాజకీయ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారంటూ విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మైనింగ్ లీజు మంజూరు కావడాన్ని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. స్థానిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి చంద్రబాబుకు మేలు చేయడానికి.. కూతురు పెళ్లి పేరుతో వైఎస్ జగన్ ప్రతిష్టను దిగజార్చడానికి క్షణం తీరిక లేకుండా కష్టపడుతున్న షర్మిలకు బహుమానంగా జీవో ఇప్పించడంతో బాబు-షర్మిల చెలిమి మరోసారి ప్రపంచానికి తెలిసింది. అనిల్ బినామీ కంపెనీ ఆమోద ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు కర్నూలు జిల్లా వెల్దుర్తి సర్వే నెంబర్ 865లో 33.01 హెక్టార్ల ఇనుప ఖనిజాన్ని 50 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఎన్నికల సమయంలో షర్మిల దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆమోద స్టీల్‌తో ఉన్న ఆర్థిక బంధాన్ని ఆమే స్వయంగా ప్రకటించుకున్నారు.

షర్మిల భర్త అనిల్ బినామీ కంపెనీ ఆమోద ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్‌కు కర్నూలు జిల్లా వెల్దుర్తిలో 33.01 హెక్టార్ల ఇనుప ఖనిజాన్ని 50 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు
రాజకీయంగా కొత్త చర్చ
ఇటీవలి కాలంలో షర్మిల రాష్ట్ర రాజకీయాల్లో చేస్తున్న వ్యాఖ్యలు, అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నాయంటూ వస్తున్న విమర్శలు, తాజాగా మైనింగ్ లీజు మంజూరు.. ఈ పరిణామాలను కలిపి రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ నడుస్తోంది. షర్మిల కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయని ఆరోపిస్తున్న కంపెనీకి ప్రభుత్వం లీజు ఇవ్వడం వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 50 ఏళ్లపాటు ఇనుప ఖనిజ గనుల లీజు మంజూరు చేయడానికి అనుసరించిన విధానం ఏమిటి? కంపెనీకి ఏ ప్రాతిపదికన అర్హత కల్పించారు? గతంలో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనకు ఇప్పుడు ఎందుకు ఆమోదం తెలిపారు? కంపెనీ యాజమాన్యం, ఆర్థిక ప్రయోజనాల వెనుక ఉన్నవారెవరు? అన్న అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
షర్మిల రాజకీయ డ్రామాలకు చంద్రబాబు ఇచ్చిన ప్రతిఫలమేనా ఈ భారీ గనుల కేటాయింపులు? జగన్ ఇవ్వలేని ప్రయోజనాలు చంద్రబాబు నుంచి దక్కుతున్నాయనే కారణంతోనే జగన్‌పై కక్ష సాధిస్తున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి! షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్‌కు చెందినవిగా ఆరోపిస్తున్న బినామీ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం భారీగా గనుల లీజులు కట్టబెడుతోందనే ఆరోపణలు! 50 ఏళ్లకు ఇనుప ఖనిజ గనుల లీజు! 10 ఏళ్లకు క్వార్ట్జ్ గనుల లీజు! 224 ఎకరాల్లో క్వార్ట్జ్ ప్రాజెక్ట్! కుటుంబ రాజకీయాల వెనుక గనుల ప్రయోజనాలున్నాయా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?
— TeluguNRIBulletinBoard (@TeluguNRInews) November 22, 2026
ఇదీ చదవండి: షర్మిల వద్ద ఒక్క ఆధారమైనా ఉందా?


