9 ఏళ్ల పింటు.. 31 ఏళ్ల తర్వాత అబ్దుల్‌ జబ్బార్‌గా ఇంటికి రావడంతో.. | Pintu Yadav reunites with Parents after 31 years | Sakshi
Sakshi News home page

9 ఏళ్ల పింటు.. 31 ఏళ్ల తర్వాత అబ్దుల్‌ జబ్బార్‌గా ఇంటికి రావడంతో..

Oct 24 2026 8:36 AM | Updated on Oct 24 2026 8:36 AM

Pintu Yadav reunites with Parents after 31 years

కతిహార్‌: బీహార్‌లోని కతిహార్‌కు చెందిన 9 ఏళ్ల బాలుడు పింటు యాదవ్, ఆడుకుంటూ అనుకోకుండా ఒక రైలెక్కి ఇంటికి దూరంగా పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నాడు. భాష రాక, దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్న ఆ చిన్నారిని ఓ ముస్లిం కుటుంబం చేరదీసి ‘అబ్దుల్ జబ్బార్’గా పేరు పెట్టి తమ సొంత బిడ్డలా పెంచింది. కాలక్రమేణా అతనికి పెళ్లై, ఢిల్లీలో ఉంటూ ముగ్గురు పిల్లల తండ్రిగా తన కొత్త ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాడు.

అయితే అతనికి తన పుట్టింటి జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో సోషల్ మీడియా ద్వారా తన కుటుంబాన్ని వెతికే ప్రయత్నాలు చేశాడు. ఎట్టకేలకు తన ఊరు కాంటాకోష్‌కు చేరుకోవడంతో, మూడు దశాబ్దాల సుదీర్ఘ అజ్ఞాత వాసానికి తెరపడింది. 31 ఏళ్ల సుదీర్ఘ కాలంలో పేరు, మతం, వేషధారణ, జీవితం అన్నీ మారిపోయినా తల్లి పేగు బంధం చెరగలేదు. ఊహించని విధంగా ఎదుట నిలబడిన కొడుకును చూసి మొదట గుర్తుపట్టలేకపోయినా, అతని కంటి పైనున్న చిన్ననాటి గాయాన్ని తల్లి మీనాదేవి ఇట్టే గుర్తించింది. ఆ క్షణంలో కొడుకును హత్తుకుని ఆ తల్లి కంట కార్చిన ఆనంద బాష్పాలు అందరి హృదయాలను ద్రవింపజేశాయి.

వేరే మతంలో పెరిగి, వేరే పేరుతో జీవిస్తున్నప్పటికీ కన్న కొడుకును ఆ కుటుంబం ఏమాత్రం సంకోచించకుండా మనస్ఫూర్తిగా స్వాగతించింది. అంతేకాకుండా అబ్దుల్ జబ్బార్ భార్యను, పిల్లలను కూడా తమ కుటుంబంలో భాగం చేసుకుంటామని తండ్రి మోతీలాల్ యాదవ్ ప్రకటించడం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. కాలం ఎంత మారినా, రక్త సంబంధాలు ఎప్పటికీ చెరిగిపోవని ఈ  సంఘటన నిరూపించింది.

ఇదీ చదవండి: ‘దుస్తుల కన్నా సేవలు మిన్న’.. పాక్‌ ఎయిర్‌లైన్స్‌పై ట్రోల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement