తొలి ఉద్యోగం నుంచి వచ్చిన జీతంలో క్రమంగా కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ.. బోనస్‌లు, మిగిలిన డబ్బును బంగారంలో పెట్టుబడిగా మలిచిన ఓ యువకుడి కథ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. 12 ఏళ్ల పాటు తల్లిదండ్రులకు తెలియకుండా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో పెట్టుబడులు పెట్టిన అతడు.. చివరకు తన డీమ్యాట్ ఖాతా వివరాలను కుటుంబ సభ్యులకు చూపించడంతో వారు ఆశ్చర్యపోయారు.
మీడియా కథనం ప్రకారం.. సదరు యువకుడు తొలి జీతం నుంచి సుమారు రూ.25 వేలతో పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ.28 వేలుగా ఉందని(ప్రస్తుతం 10 గ్రాములు రూ.1.20 లక్షలు) సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అనంతరం ఖరీదైన గాడ్జెట్లు, విలాసవంతమైన ఖర్చులకు దూరంగా ఉంటూ జీతంలో మిగిలిన మొత్తాలను, బోనస్‌లను గోల్డ్ ఈటీఎఫ్‌ల కొనుగోలుకు వినియోగించాడని కథనంలో తెలిపారు.
తల్లిదండ్రులు మాత్రం కుమారుడు సంపాదనను సక్రమంగా నిర్వహించడం లేదని భావించేవారట. అయితే 12 ఏళ్ల తర్వాత తన డీమ్యాట్ ఖాతా స్టేట్‌మెంట్‌ను వారికి చూపించడంతో కుటుంబంలో భావోద్వేగ వాతావరణం నెలకొన్నట్లు ఆ పోస్టులో వివరించారు. తండ్రి గతంలో చెప్పిన పొదుపు సూత్రాన్నే తాను పాటించానని కుమారుడు చెప్పాడు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు అంటే ఏమిటి?
సెబీ పెట్టుబడిదారుల సమాచారం ప్రకారం, ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో షేర్ల మాదిరిగా కొనుగోలు, విక్రయాలు చేయగల పెట్టుబడి సాధనాలు. గోల్డ్ ఈటీఎఫ్‌లలో బంగారం అంతర్లీన ఆస్తిగా ఉంటుంది. వీటి యూనిట్ల విలువ బంగారం ధరల కదలికలకు అనుగుణంగా మారుతుంది. భౌతిక బంగారాన్ని నిల్వ చేయకుండా డీమ్యాట్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇవి ఒక మార్గాన్ని అందిస్తాయి. అయితే గోల్డ్ ఈటీఎఫ్‌లు కూడా మార్కెట్ ప్రమాదాలకు లోబడి ఉంటాయి. బంగారం ధర తగ్గితే యూనిట్ విలువ కూడా తగ్గవచ్చు. బ్రోకరేజ్, డీమ్యాట్ ఛార్జీలు వంటి ఖర్చులు ఉండవచ్చని సెబీ సూచిస్తోంది.
ఇదీ చదవండి: అత్తకు రూ.6000 కోట్లు ఇచ్చేదే లేదు!
ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


