పోస్టాఫీసులకు రూ.2,632 కోట్ల నిధులు.. | Cabinet approves 2632 crore for India Post schemes | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసులకు రూ.2,632 కోట్ల నిధులు..

Nov 27 2026 4:27 PM | Updated on Nov 27 2026 4:53 PM

Cabinet approves 2632 crore for India Post schemes

దేశవ్యాప్తంగా విస్తరించిన తపాలా వ్యవస్థను ఆధునికీకరించడంతోపాటు, ఆదాయాన్ని గణనీయంగా పెంచి లాభాల బాట పట్టించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా పోస్టల్‌ ఆపరేషన్స్‌, ఎస్టేట్స్‌ మేనేజ్‌మెంట్‌ పథకాల కొనసాగింపునకు కేంద్ర కేబినెట్‌ రూ.2,632 కోట్ల నిధులను ఆమోదించింది. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్ల పాటు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఇందులో పోస్టల్‌ ఆపరేషన్స్‌ పథకానికి రూ.1,141 కోట్లు, ఎస్టేట్స్‌ మేనేజ్‌మెంట్‌ పథకానికి రూ.1,491 కోట్లు కేటాయించారు. తపాలా సేవల సామర్థ్యాన్ని పెంచడం, పార్సెల్‌ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, పోస్టాఫీసుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పెట్టుబడుల ప్రధాన ఉద్దేశం.

గురువారం ఈ వివరాలను వెల్లడించిన కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. 2030 నాటికి తపాలా శాఖను వ్యయ కేంద్రం నుంచి లాభాల కేంద్రంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని 29 శాతం పెంచి దాదాపు రూ.20 వేల కోట్లకు చేర్చాలని భావిస్తున్నట్లు చెప్పారు. 2025-26లో శాఖ ఆదాయం 16 శాతం వృద్ధితో రూ.15,373 కోట్లకు చేరినట్లు వెల్లడించారు.

పోస్టాఫీసుల రూపురేఖలు మారనున్నాయ్‌

నిధుల్లో అధిక భాగం పోస్టాఫీసుల భవనాల ఆధునికీకరణ, కొత్త భవనాల నిర్మాణానికి వినియోగించనున్నారు. ఇందులో భాగంగా 190 కొత్త పోస్టల్‌ భవనాలను నిర్మించడంతోపాటు, శిథిలావస్థలో ఉన్న 50 భవనాలను తిరిగి నిర్మిస్తారు. మరో 2,550 సబ్‌ పోస్టాఫీసులను ఆధునికీకరించి, 2,500 అద్దె భవనాల్లో కొనసాగుతున్న పోస్టాఫీసులకు కొత్త రూపునివ్వనున్నారు. 20 చారిత్రక పోస్టల్‌ భవనాలను పునరుద్ధరించడంతోపాటు, 150 ఉద్యోగుల నివాస సముదాయాలను అభివృద్ధి చేస్తారు. సౌర విద్యుత్‌ వ్యవస్థలు, వర్షపు నీటి సంరక్షణ, దివ్యాంగులకు అనుకూలమైన సదుపాయాలకూ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. బెంగళూరులో పోస్టల్‌ టెక్నాలజీ ఎక్సలెన్స్‌ సెంటర్‌కు శాశ్వత సాంకేతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.

పార్సెల్‌ సేవలపై ప్రత్యేక దృష్టి

మరోవైపు పోస్టల్‌ ఆపరేషన్స్‌ పథకం కింద మెయిల్‌, పార్సెల్‌ రవాణా వ్యవస్థలను ఆధునికీకరిస్తారు. ఇందుకోసం కొత్త పార్సెల్‌ హబ్‌లు, ప్యాకేజింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్‌ సంస్థల నుంచి పెరుగుతున్న పార్సెల్‌ రవాణా అవసరాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి సారించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్‌ సేవల విస్తరణ, అంతర్జాతీయ మెయిల్‌ నిర్వహణ, సేవల నాణ్యత మెరుగుదల, ప్రచార కార్యక్రమాలకూ నిధులు వెచ్చించనున్నారు.

పార్సెల్‌ వ్యాపారంలో 71 శాతం వృద్ధి

తపాలా శాఖ ఆదాయంలోనూ గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. 2024-25లో రూ.13,218 కోట్లుగా ఉన్న ఆదాయం 2025-26లో రూ.15,373 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి ఆరు నెలల్లోనే రూ.8,212.7 కోట్ల ఆదాయం నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 24 శాతం అధికం. ముఖ్యంగా పార్సెల్‌ విభాగం 71 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. పోస్టల్‌ సేవలతోపాటు పొదుపు ఖాతాలు, బీమా, ఆధార్‌, పాస్‌పోర్ట్‌ సేవలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాల పంపిణీలోనూ ఇండియా పోస్ట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా సుమారు 1.65 లక్షల పోస్టాఫీసులతో విస్తరించిన ఈ వ్యవస్థను మరింత సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని కేంద్రం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement