ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఏ రేంజ్‌లో ఘనంగా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. వరుడికి ఇచ్చే కట్నకానుకలు కూడా మాములుగా ఉండవు. అలాంటిది ఒక ఊరి సర్పంచ్ తన కుమారుడి పెళ్లి ఏ రేంజ్‌లో చేస్తాడో చెప్పాల్సిన పనిలేదు. కానీ అతడు నయా పైసా కట్నం వద్దని..అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తాను అందరిలా ఆదర్శపూర్వకమైన మాటలు చెప్పేవాడిని కాదని తన చేతల ద్వారా చాటి చెప్పాడు.
ఆయనే హర్యానాలోని భివానీకి చెందిన సర్పచ్ వేద్‌పాల్ జాంగ్రా. ధనానా-II గ్రామానికి చెందిన సర్పంచ్ వేద్‌పాల్ తన కుమారుడు వికాస్ జాంగ్రాకు భివానీ నగరంలోని ఫ్రెండ్స్ కాలనీకి చెందిన దీపాన్షితో జరగబోయే వివాహాన్ని ఎటువంటి కట్నకానుకలు లేకుండా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వివాహానికి ముందు జరిగే 'లగన్' (నిశ్చితార్థం వంటి వేడుక) సమయంలో, వధువు కుటుంబ సభ్యులు బంగారు ఆభరణాలను, 11 లక్షల రూపాయల నగదును తీసుకురాగా, వరుడి కుటుంబం వాటిని స్వీకరించేందుకు నిరాకరించింది.
కేవలం ఒక్క రూపాయి కట్నంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. కట్నాన్ని తిరస్కరించాలనేది తన ఒక్కడి నిర్ణయం మాత్రమే కాదని, కుటుంబం మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయమని వేద్‌పాల్ జాంగ్రా చెప్పారు. ఒక తండ్రి తన కుమార్తెను మరొకరికి ఇచ్చాడంటే, ఆయన తన సర్వస్వాన్ని మనకు అప్పగించాడని అర్థం అందుకే తాను కట్నం వద్దన్నానని అన్నారు. అలాగే వలం ఒక్క రూపాయికే వివాహం జరుగుతున్నప్పటికీ, తమ కోడలికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వధువు తండ్రి వీరేంద్ర నారాయణ్ కూడా వరుడి కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
తాము 'లగన్' వేడుక కోసం స్వచ్ఛందంగానే బంగారు ఆభరణాలను, 11 లక్షల నగదును తీసుకువచ్చామని, అయితే వరుడి కుటుంబం వాటిని ఏమాత్రం స్వీకరించలేదని ఆయన తెలిపారు. కట్న వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించే కుటుంబంలో తమ కుమార్తె అడుగుపెడుతున్నందుకు తాము ఎంతో ఆనందంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనా భివానీ ఖేరా బీజేపీ ఎమ్మెల్యే కపూర్ వాల్మీకి కూడా వేద్పాల్ జాంగ్రా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు.
వరకట్నం తరుచుగా పేద కుటుంబాలను తమ కుమార్తెల వివాహం కోసం అప్పులు చేయడానికి, ఆర్థిక సహాయం కోరడానికి బలవంతం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సర్పంచ్ సమాజానికి ఒక సానుకూల సందేశాన్ని పంపారని ప్రశంసించారు ఆయన. అంతేగాదు గతంలో తమ కుటుంబం తన మేనల్లుడి వివాహాన్ని కేవలం ఒక్క రూపాయికే జరిపించిందని కూడా ఆ ఎమ్మెల్యే పంచుకున్నారు. నిజంగా కట్నం తీసుకునే వాడు గాడిద అంటూ బహిరంగా చెప్పే మాటలు కన్నా ఆచరించి చూపే మాటలే మిన్న అని భలే చూపించాడు ఈ సర్పంచ్.
ఇదీ చదవండి: బాలీవుడ్ పాటకు స్టూడెంట్స్‌తో కలిసి టీచరమ్మ స్టెప్పులు..!


