పార్టీ రహిత ఎన్నికలను అపహాస్యం చేస్తూ టీడీపీ నేతల అరాచకం
ఏకగ్రీవ నజరానాల మాటున పదవుల వేలం పాటలు
రెండున్నరేళ్ల పాలనపై ప్రజా వ్యతిరేకతతోనే అడ్డదారులు
పార్టీ గుర్తులకు అతీతంగా.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికారం అండతో టీడీపీ నేతలు సాగిస్తున్న ఆధిపత్య పోరు, కుటుంబ రాజకీయాలు, బహిరంగ వేలం పాటలతో పల్లె పోరు అపహాస్యం పాలవుతోంది.
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ఏళ్ల తరబడి జెండా మోసిన కార్యకర్తలకు మొండిచేయి చూపి.. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ భార్యలు, సోదరులకే పంచాయతీలను కట్టబెడుతున్నారు. ఏకగ్రీవాలకు ఇచ్చే నజరానాల మాటున సర్పంచ్ పదవులకు రూ.లక్షల్లో రేటుకట్టి మరీ వేలం వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను టీడీపీ నేతలు ఆధిపత్య పోరుకు, కుటుంబ పాలనకు, బేరసారాలకు వేదికగా మార్చేశారు. రెండున్నరేళ్ల పాలనపై గ్రామాల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతే ఈ అడ్డదారులకు అసలు కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
కార్యకర్తలకు చేదు అనుభవం
టీడీపీ ఎమ్మెల్యేల అనుచరులకే టికెట్లు దక్కుతుండటంతో దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన వారు రోడ్డున పడుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 30 ఏళ్లుగా టీడీపీలో ఉన్న మహిళా నేత హేమలత సర్పంచ్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆమె తరఫున వేసిన వార్డు నామినేషన్లన్నింటినీ తిరస్కరించేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని తమకు అన్యాయం చేశారని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే సతీమణి సుధారెడ్డిని బంధువులు అక్కడే నిలదీశారు.
ప్రజాప్రతినిధుల ఇళ్లకే పదవులు
పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వాల్సిన నేతలు కుటుంబ సభ్యులనే బరిలో దింపుతున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్ స్థానానికి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సతీమణి ఇందిరారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవడం గమనార్హం. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సతీమణి ఉమాదేవి ఏకంగా పక్క నియోజకవర్గం సింగనమల మండలంలోని రాచేపల్లి సర్పంచ్ బరిలో ఉన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సోదరుడు నిమ్మలపాలెం సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్నారు. పార్టీ రహిత ఎన్నికలని చెబుతున్నా అధికార పార్టీ నేతలు అడుగడుగునా జోక్యం చేసుకుంటున్నారు.
మిత్రపక్షాలపైనా కత్తులు
ఎన్నికల ముందు ఒకే వేదికపై చేతులు కలిపిన కూటమి పార్టీలు ఇప్పుడు పదవుల కోసం తలపడుతున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ, జనసేన నేతలు రోడ్డునపడ్డారు. చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం రత్నంపేటలో టీడీపీ మద్దతుదారుడి తరఫున ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ఎన్ రాజును జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో ఆయన ప్రచారాన్ని మధ్యలోనే ఆపి వెళ్లిపోయారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలో జనసేన అభ్యర్థుల నామినేషన్లను టీడీపీ అడ్డుకుంటోందని ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం బుర్రారెడ్డిపల్లెలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఇంటిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు దాడికి దిగడం కూటమి ఐక్యతలో డొల్లతనానికి అద్దం పడుతోంది.
రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పరిస్థితి మరీ చిత్రంగా మారింది. పరిషత్ ఎన్నికల్లో జనసేనను కాదని టీడీపీకి మద్దతిచ్చిన ఆయనను ‘నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యే’వంటూ సొంత పార్టీ మహిళలే నిలదీశారు. తప్పు తనదేనని ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది. టీడీపీ ఒత్తిళ్లకు తలొగ్గి సొంత పార్టీ ఇన్‌చార్జ్‌లే తమను సర్దుకుపొమ్మంటున్నారని జనసైనికులు మండిపడుతున్నారు. కడప జిల్లా చక్రాయపేట మండలంలో నామినేషన్ల సమయంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో జనసేన కార్యకర్త మృతి చెందడం ఆ పార్టీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచింది.
ప్రజాస్వామ్యానికి వేలం
ఏకగ్రీవ పంచాయతీలకు జనాభాను బట్టి రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా ప్రకటించిన ప్రభుత్వం, ఏకగ్రీవాల కోసం ప్రచారం కల్పించాలని తమ నేతలకే సూచించింది. ఇదే అదనుగా పల్లె పీఠాలకు బహిరంగ వేలం పాటలు మొదలయ్యాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో సర్పంచ్ పదవికి టీడీపీ నాయకులే వేలం నిర్వహించగా, ఒకరు రూ.77 లక్షలు చెల్లించేందుకు ముందుకొచ్చారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లి సర్పంచ్ పదవి రూ.68 లక్షలు పలికింది. రాజ్యాంగం కల్పించిన గ్రామ స్వరాజ్యాన్ని కూటమి నేతలు నోట్ల కట్టలు, కర్రల దెబ్బలతో అపహాస్యం చేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రజావ్యతిరేకతే అసలు భయం
రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనతో తాము నిలువు దోపిడీకి గురయ్యామని అన్నివర్గాల ప్రజలు బాధపడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలు అటకెక్కాయి. రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఫీజు బకాయిలతో విద్యార్థులు అల్లాడుతున్నారు. ఏ వర్గంలోనూ సంతోషం కనిపిచండం లేదు. ఈ వ్యతిరేకత గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడిగే ధైర్యం లేకనే కూటమి నేతలు ఏకగ్రీవాలు, వేలం పాటలు, బెదిరింపుల వంటి అడ్డదారులు తొక్కుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


