న్యూఢిల్లీ: నేపాల్‌లో నేటి (మంగళవారం) ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు భారత్‌లోని బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలనూ తాకాయి. ముఖ్యంగా ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్, జల్పాయ్‌గురి ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో జల్పాయ్‌గురి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్)వివరాల ప్రకారం.. నవంబర్ 24న ఉదయం 7 గంటల 2 నిమిషాల 47 సెకన్లకు భూకంపం సంభవించింది.
భూమికి 20 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నేపాల్‌లో 27.855 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 87.909 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారత వాతావరణ శాఖకు సంబంధించిన సమాచారం ప్రకారం.. సిక్కింలోని మంగన్‌కు పశ్చిమ వాయవ్య దిశగా 67 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. మరోవైపు నేపాల్‌లోని కోషి ప్రావిన్స్ లెలెప్ సమీపంలో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఐఏఎన్ఎస్ పేర్కొంది.
ఈ ప్రకంపనలు భారత్‌తో పాటు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాలోని పలు ప్రాంతాల్లోనూ నమోదైనట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఉత్తర బెంగాల్‌లో కొన్ని ప్రాంతాల్లో వరుసగా రెండుసార్లు భూమి కంపించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలో సీసాల్లోని నీరు స్వల్పంగా కదలడం కనిపించింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు.
ఇదీ చదవండి: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సౌరవ్ దాస్‌కు షాక్!


