కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. తల్లి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న కుమార్తె అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. కోల్‌కతాలోని సోనార్‌పూర్‌లో తన అమ్మమ్మ, తాతయ్యల ఇంట్లో శనివారం సాయంత్రం ఆమె విగతజీవిగా కనిపించింది. సయానీ షికారి అనే ఈ బాలిక తల్లి హత్య కేసులో తండ్రే ప్రధాన నిందితుడు కావడం గమనార్హం.
2023లో తల్లి హత్య.. తండ్రి అరెస్టు
సయానీ తల్లి మాలా షికారిని 2023 అక్టోబర్‌లో హత్యకు గురైంది. ఈ కేసులో ఆమె భర్త సమీర్ షికారిని పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి సయానీ తన తల్లి తరఫు తాతయ్య, అమ్మమ్మల వద్దే ఉంటోంది. అటుల్ కృష్ణ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
మూడేళ్ల తర్వాత తండ్రికి బెయిల్
దాదాపు మూడేళ్లపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమీర్ షికారికి ఇటీవల బెయిల్ లభించింది. విడుదలైన తర్వాత అతడు సయానీని సంప్రదించేందుకు ప్రయత్నించినట్లు బంధువులు తెలిపారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
ఫోన్ నంబర్ మార్చినా..
తండ్రి నుంచి ఫోన్లు వస్తున్నాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక సిమ్ కార్డు, ఫోన్ నంబర్ మార్చుకోవాలని పోలీసులు సూచించారు. కుటుంబ సభ్యులు అలాగే చేసినప్పటికీ సమీర్ కొత్త నంబర్‌ను కూడా సంపాదించినట్లు బంధువులు ఆరోపించారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘటన
శనివారం మధ్యాహ్నం సయానీ ఇంట్లో ఒంటరిగా ఉంది. సాయంత్రం కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి ఆమె గదిలో విగతజీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
తండ్రిపైనే అనుమానం
సయానీ తాతయ్య నితెన్ బోస్, మరో బంధువు సుభాష్ బారిక్ ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. బాలిక మృతిలో సమీర్ పాత్ర ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉందా అనే కోణంలోనూ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు విచారణ పూర్తికాకుండా ఎలాంటి నిర్ధారణకు రావద్దని కోరారు.
ఫోన్ పరిశీలనలో పోలీసులు
బాలిక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణానికి ముందు ఎవరితో మాట్లాడింది? ఎవరైనా సందేశాలు పంపారా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోన్ వివరాలు వచ్చిన తర్వాతే మరణానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: ఇక నేపాల్‌కు రైల్లో.. నేడే కొత్త రైలు పరుగులు..


