సాహిత్యోత్సవానికి స్వాగతం!! | Shillong Literary Festival at Wards Lake in Shillong Meghalaya | Sakshi
Sakshi News home page

సాహిత్యోత్సవానికి స్వాగతం!!

Nov 14 2026 5:10 PM | Updated on Nov 14 2026 5:22 PM

Shillong Literary Festival at Wards Lake in Shillong Meghalaya

చలికి వెచ్చదనాన్ని ఇచ్చేది ఓ కప్పు వేడి కాఫీ మాత్రమే కాదు.. మనసుకు హాయినిచ్చే మంచి సాహిత్యం కూడా! మంచు రాత్రుల్లో అక్షరాలతో చేసే ఈ ప్రయాణం ఎంతో ప్రత్యేకం. ప్రతి పుట ఓ విజ్ఞాన భాండాగారం. కొత్త సందేహాల సమాహారం. ఎన్నో సమాధానాల మేళవింపు. మరెన్నో అనుభూతుల కూర్పు. అలాంటి సాహిత్య ప్రపంచాన్ని మరింత దగ్గర చేసేందుకు ఈ శీతాకాలం సిద్ధమవుతోంది. పూల పరిమళాల్ని మాత్రమే కాకుండా... సాహిత్య పరిమళాల్నీ మోసుకొస్తోంది. ఈ సాహిత్య వేడుకల కోసం దేశ వ్యాప్తంగా ఎనిమిది నగరాలు ముస్తాబవుతున్నాయి. నవంబర్‌ 12న షిల్లాంగ్‌తో ప్రాంరంభమయ్యే ఈ సాహిత్య మహోత్సవాలు .. కోల్‌కతా నగరంలో జనవరి 27న జరిగే సాహిత్య సమ్మేళనంతో ముగుస్తాయి.  

షిల్లాంగ్‌ సాహిత్య ఉత్సవం (నవంబర్‌ 12–14)
2021లో ప్రారంభమైన షిల్లాంగ్‌ సాహిత్య ఉత్సవానికి ఈ ఏడాది.. వార్డ్స్‌ సరస్సు వేదిక కానుంది. ఈ ఉత్సవాల్లో కిరణ్‌ దేశాయ్, డామన్‌ గాల్గట్‌ వంటి ప్రముఖ రచయితలు తమ రచనా అనుభవాలను పంచుకోనున్నారు. ఖాసీ, గారో సాహిత్య సంప్రదాయాలు, మాతృస్వామ్య వ్యవస్థ, డిజిటల్‌ యుగంలో సాహిత్య పత్రికల భవిష్యత్తు వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు.

డెహ్రాడూన్‌లో (నవంబర్‌ 27–29)
ఎనిమిదోసారి నిర్వహించనున్న డెహ్రాడూన్‌  సాహిత్య ఉత్సవం సాహిత్యంతోపాటు సినిమా, సంగీతం, నాటక రంగాలకూ ప్రాధాన్యం ఇవ్వనుంది. రచయిత రస్కిన్‌  బాండ్, దర్శకులు ఇంతియాజ్‌ అలీ, విశాల్‌ భరద్వాజ్‌ ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. కొత్త రచయితలను ప్రోత్సహించేందుకు రస్కిన్‌  బాండ్‌ సాహిత్య పురస్కారాల పోటీని కూడా నిర్వహించనున్నారు.

కోశాలాలో(నవంబర్‌ 27–30)
2022లో లక్నోలో ప్రారంభమైన కోశాలా సాహిత్య ఉత్సవం అవధ్‌ ్ర΄ాంత సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా సాగుతోంది. ఈసారి లక్నోలోని మ్యూజియం ఆఫ్‌ హెరిటేజ్‌ అండ్‌ ఆర్ట్‌లో ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో హిందీ, ఉర్దూ, ప్రాంతీయ భాషల సాహిత్యం తోపాటు అనువాదాలు, వంటకాలు, నృత్యం, సంగీతం, సూఫీ గీతాలు, కవిత్వానికి చోటు దక్కనుంది.

బెంగళూరులో (డిసెంబర్‌ 11–13)
2012లో ప్రారంభమైన బెంగళూరు సాహిత్య ఉత్సవం ఈసారి 15వ ఎడిషన్‌తో ముందుకు రానుంది. ఫ్రీడమ్‌ పార్క్‌ వేదికగా మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరగనున్నాయి. బ్రిటిష్‌ రచయితలు జెఫ్‌ డయ్యర్, లీసా జ్యూవెల్, బంగ్లాదేశ్‌ రచయిత్రి తహ్మీమా అనమ్, చరిత్రకారుడు రామచంద్ర గుహా, నటుడు రానా దగ్గుబాటి తదితరులు పాల్గొననున్నారు. కొత్త రచయితలకు తమ రచనలను ప్రచురణకర్తలకు పరిచయం చేసే ‘లిట్‌మార్ట్‌’ వేదిక ప్రత్యేక ఆకర్షణ. సినిమాల కోసం కథలు, స్క్రీన్‌ ప్లేలు రాసేవారికి ’స్క్రీన్‌ లిట్‌’ ద్వారా అవకాశాలు కల్పిస్తున్నారు.

కేరళలో (జనవరి 21–24, 2027)
కోజికోడ్‌ సముద్ర తీరంలో 2016లో ప్రాంరంభమైన కేరళ సాహిత్య ఉత్సవం దేశంలోని ప్రముఖ సాహిత్య వేడుకల్లో ఒకటిగా ఎదిగింది. 2023లో యునెస్కో కోజికోడ్‌కు భారతదేశపు తొలి ‘సాహిత్య నగరం’గా గుర్తింపు ఇచ్చింది. ఈ ఉత్సవం పదో ఎడిషన్‌  ‘ఎ పాలీఫోనిక్‌ డిసెన్నియల్‌’ అనే ఇతివృత్తంతో జరగనుంది. ఈసారి ఆస్ట్రేలియా అతిథి దేశంగా వ్యవహరించనుంది.

హైదరాబాద్‌లో (జనవరి 22–24, 2027)
2010లో ప్రారంభమైన హైదరాబాద్‌ సాహిత్య ఉత్సవం నగరంలోని భిన్న భాషలు, సంస్కృతులకు అద్దం పడుతోంది. ఈసారి 17వ ఎడిషన్‌  హైటెక్‌ సిటీలోని సత్వా నాలెడ్జ్‌ సిటీలో జరగనుంది. వాతావరణ మార్పులు, అంతరించిపోతున్న భాషలు, కవిత్వం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. ప్రతి ఏడాది ఒక భారతీయ భాషను ప్రత్యేకంగా పరిచయం చేయడం ఈ ఉత్సవం ప్రత్యేకత. 2026లో కశ్మీరీ భాషపై దృష్టి పెట్టారు.

కోల్‌కతాలో(జనవరి 23–27, 2027)
2012లో కోల్‌కతా పుస్తక ప్రదర్శనలో ప్రారంభమైన కోల్‌కతా లిటరరీ మీట్‌ ఈసారి జనవరి 23 నుంచి 27 వరకు జరగనుంది. ‘కలామ్‌’గా ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవం గతంలో విక్టోరియా మెమోరియల్‌లో, ఇటీవల అలీపూర్‌ మ్యూజియంలో నిర్వహించారు. అమితవ్‌ ఘోష్, ఝుం΄ా లాహిరి, కిరణ్‌ దేశాయ్, జావేద్‌ అక్తర్‌ వంటి ప్రముఖులు గత కార్యక్రమాల్లో ΄ాల్గొన్నారు. యువ ΄ాఠకుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడం దీని ముఖ్య ఉద్దేశం.

జైపూర్‌లో (జనవరి 14–18, 2027)
భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సాహిత్య వేడుకల్లో జైపూర్‌ సాహిత్య ఉత్సవం ఒకటి. 2006లో కేవలం 18 మంది రచయితలు, వంద మంది ప్రేక్షకులతో ప్రారంభమైన ఈ వేడుక నేడు అంతర్జాతీయ స్థాయికి చేరింది. 20వ ఎడిషన్‌  జనవరి 14 నుంచి 18 వరకు జరగనుంది. నోబెల్‌ పురస్కార గ్రహీతలు ఓల్గా టోకార్జుక్, ఎస్తేర్‌ డుఫ్లోతోపాటు పలు దేశాలకు చెందిన రచయితలు, మేధావులు పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: టాప్‌ 50లో భారతీయ రెస్టారెంట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement