వాషింగ్టన్: ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు చైనావైపే చూస్తోంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఈ ముగ్గురు అగ్రనేతలు ఒకే వేదికపై సమావేశం కానుండటం అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. అణ్వాయుధాల ముప్పు, ప్రపంచ భద్రత, ప్రాంతీయ యుద్ధాలు వంటి కీలక అంశాలపై ఈ భేటీలో చర్చలు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల దిశను ప్రభావితం చేయగల ఈ సమావేశంపై అంతర్జాతీయంగా ఉత్కంఠ నెలకొంది.
చైనాలోని షెన్‌జెన్ నగరంలో నవంబర్ 18, 19 తేదీల్లో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార సంస్థ (APEC) శిఖరాగ్ర సమావేశం ఈ కీలక దౌత్య చర్చలకు వేదిక కానుందని కథనాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ మధ్య త్రైపాక్షిక సమావేశం జరగనున్నట్లు వైట్‌హౌస్ ధ్రువీకరించినట్లు నివేదికలు వెల్లడించాయి. ముగ్గురు అగ్రరాజ్యాల నేతలు ఒకేసారి చర్చలు జరపడం అంతర్జాతీయ దౌత్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
అణ్వాయుధాలుపై చర్చ..
ఈ సమావేశంలో అత్యంత కీలకమైన అంశం అణ్వాయుధాల నియంత్రణ. అమెరికా, రష్యా వద్ద ఒక్కొక్క దేశానికి 5,000కు పైగా అణ్వాయుధాలు ఉండగా.. చైనా వద్ద అంతకంటే తక్కువ సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. మూడు దేశాల మధ్య అణ్వాయుధాల సంఖ్యను నియంత్రించే ఒప్పందం కుదిరితే ప్రపంచ భద్రతపై కీలక ప్రభావం పడే అవకాశం ఉంది. అణ్వాయుధాల నిర్వహణకు భారీగా ఖర్చు చేయడం కంటే వాటిని తగ్గించుకోవడమే మంచిదని ట్రంప్ గతంలో పలుమార్లు అభిప్రాయపడ్డారు. అయితే, ఈ విషయంలో చైనా వైఖరి కీలకం కానుంది. అమెరికా, రష్యాలతో సమాన స్థాయిలో అణ్వాయుధాల నియంత్రణ చర్చల్లో పాల్గొనడానికి బీజింగ్ గతంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. అందువల్ల ఈ సమావేశంలోనే ఒప్పందం కుదిరే అవకాశాలపై సందేహాలు ఉన్నాయి.
పశ్చిమాసియా భద్రతకు కీలకం..
అణ్వాయుధాల అంశంతో పాటు అంతర్జాతీయంగా కొనసాగుతున్న యుద్ధాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఇరాన్‌కు సంబంధించిన ఉద్రిక్తతలు చర్చల్లో చోటు చేసుకోవచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ప్రభుత్వం గతంలో పలు దౌత్య ప్రయత్నాలు చేసింది. మరోవైపు ఇరాన్ అంశం కూడా పశ్చిమాసియా భద్రతకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ముగ్గురు నేతల మధ్య జరిగే చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అధునాతన చిప్‌ల ఎగుమతులపై ఇప్పటికే అనేక విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా AI రంగంలో చైనా పురోగతిని నియంత్రించేందుకు అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఇరు దేశాల సంబంధాల్లో కీలక అంశంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్, జిన్‌పింగ్ మధ్య జరిగే చర్చలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఓటమి నేర్పిన గుణపాఠం.. ట్రంప్ సంచలన ప్రకటన


