డిజిటల్ గుర్తింపుతో ఆదాయం.. రూ.1,300 నుంచి రూ.61 వేల వరకు రాబడి
భారత్‌లో రూ.49 వేలకోట్ల డిజిటల్ ప్రకటనల మార్కెట్
80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు
రోజుకు నాలుగు డీప్‌ఫేక్ సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులు
ప్రతి నాలుగు ఉద్యోగాల్లో ఒకదానిపై జెన్‌ఏఐ ప్రభావం
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో మనిషి ముఖం, గొంతు కూడా ఆదాయాన్నిచ్చే వ్యాపార వస్తువులుగా మారాయి. ఫొటోలు, ముఖకవళికలు, గొంతుకను ఏఐ వీడియోలు, ప్రకటనలు, షార్ట్ డ్రామాలు, వీడియో గేమ్‌లలో ఉపయోగించుకునేందుకు ఇస్తూ డబ్బు సంపాదించే కొత్త వ్యాపారం పుట్టుకొచ్చింది. ఇప్పటివరకు నటులు, మోడళ్లు, యాంకర్లకే పరిమితమైన ఈ అవకాశం ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తోంది.
చైనాలో ప్రారంభమైన ఈ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఒక్కో ముఖానికి రూ.1,300 నుంచి రూ.61 వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మనదేశంలోను రూ.49 వేల కోట్ల డిజిటల్ ప్రకటనల రంగం ఉండటంతో భవిష్యత్తులో ఇక్కడా భారీ అవకాశాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ముఖాన్ని అద్దెకివ్వడం ద్వారా ఆదాయం వస్తున్నప్పటికీ.. అదే ముఖం దుర్వినియోగమైతే ఎదురయ్యే ప్రమాదాలూ తక్కువేమీ కాదనే వాదనలు ఉన్నాయి.
చైనాలో 800 మంది నమోదు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఈ ఏడాది జూలై 27న ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన యాక్ట్‌ఐడీ అనే సంస్థ ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 800 మందిని నమోదు చేసుకుంది. వీరిలో 300 మంది తమ ముఖాలను ఏఐ కంటెంట్ తయారీకి లైసెన్స్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఇప్పటివరకు రెండు ఏఐ డ్రామా నిర్మాణాల్లో సుమారు పదిమంది ముఖాలను వినియోగించారు. ముఖం ఎంపిక, వినియోగకాలం, ప్రాజెక్టు, ఒప్పందాన్ని బట్టి చెల్లింపులు మారతాయి. వృద్ధులు, ప్రత్యేకరూపం కలిగిన వ్యక్తుల ముఖాలకు కూడా పాత్రల అవసరాన్ని బట్టి డిమాండ్ ఉంటోందని ఆ అధ్యయన నివేదిక వెల్లడించింది.
మనదేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్నది 55.3 శాతం
భారత్‌లో ఏఐ ప్రకటనలకు విస్తృత అవకాశాలు ఉండటానికి డిజిటల్ వినియోగదారుల సంఖ్య కూడా కారణం. ఇప్సోస్ నివేదికలోని గణాంకాల ప్రకారం.. 2025లో దేశంలో 5.6 కోట్ల మంది కొత్తగా ఇంటర్నెట్ వినియోగదారులయ్యారు. దీంతో మొత్తం వినియోగదారుల సంఖ్య 80.6 కోట్లకు చేరింది. దేశ జనాభాలో ఇంటర్నెట్ వినియోగం 55.3 శాతంగా నమోదైంది. కనెక్టెడ్ టీవీ వినియోగదారులు నాలుగుకోట్లకు చేరగా, 2026లో ఐదుకోట్లకు చేరుతారని అంచనా. ఈ విస్తరణతో ప్రాంతీయ భాషల్లో ఏఐ ప్రకటనలు, స్థానిక ముఖాలతో రూపొందించే వీడియోలకు అవకాశాలు పెరుగుతున్నాయి.
ఏఐ ప్రకటనలకు 44 శాతం మంది ఆమోదం
ఇప్సోస్ ఏఐ మానిటర్ 2025 అధ్యయనం ప్రకారం.. ప్రకటనల కోసం ఏఐతో చిత్రాలు, వీడియోలు రూపొందించడాన్ని 44 శాతం మంది భారతీయులు అంగీకరిస్తున్నారు. బ్రాండ్ల ప్రకటనల కంటెంట్ తయారీలో ఏఐ కొన్ని పనులు చేపట్టవచ్చని 64 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఆన్‌లైన్ సెర్చ్ ఫలితాల్లో ఏఐ పాత్రను 66 శాతం మంది, సినిమా, టీవీ స్క్రిప్టుల రచనలో ఏఐ వినియోగాన్ని 65 శాతం మంది అంగీకరించారు. అయితే ప్రకటనలు, వీడియోల విషయంలో 47 శాతం మంది మానవులు రూపొందించిన కంటెంట్‌ను ఇష్టపడుతుండగా, 40 శాతం మంది ఏఐ కంటెంట్‌కు ప్రాధాన్యమిచ్చారు. అంటే ఏఐకి ఆదరణ పెరుగుతున్నా మానవ సృజనాత్మకతకు ఇంకా ఎక్కువ ప్రాధాన్యం ఉందని స్పష్టమవుతోంది.
ఉద్యోగాల్లోనూ మార్పులు
అంతర్జాతీయ కార్మికసంస్థ (ఐఎల్‌వో), పోలాండ్‌కు చెందిన నాస్క్ 2025 అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు ఉద్యోగాల్లో ఒకటి జెన్‌ఏఐ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగవడం కంటే వాటిలోని పనుల స్వరూపం మారే అవకాశమే ఎక్కువని పేర్కొంది. ప్రపంచ ఆర్థికవేదిక (డబ్ల్యూఈఎఫ్) 2025 నివేదిక ప్రకారం.. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని, 9.2 కోట్ల ఉద్యోగాలు స్థానభ్రంశం చెందుతాయని అంచనా. తద్వారా 7.8 కోట్ల ఉద్యోగాల నికర పెరుగుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏఐ మోడల్ రూపకల్పన, డిజిటల్ కంటెంట్, డేటా నిర్వహణ, ఏఐ భద్రత వంటి రంగాల్లో కొత్త నైపుణ్యాలకు డిమాండ్ పెరగనుంది. మొత్తంగా చూస్తే భవిష్యత్తులో మనిషి శ్రమతోపాటు ముఖం, గొంతుక, డిజిటల్ గుర్తింపునకు ధర నిర్ణయించే మార్కెట్ రూపుదిద్దుకుంటోంది.
డీప్‌ఫేక్ ముప్పు
ఏఐ ముఖాల వినియోగంలో అతిపెద్ద ప్రమాదం డీప్‌ఫేక్‌లు. మ్యాక్‌అఫీ ఈ ఏడాది ఫిబ్రవరి 5న విడుదల చేసిన స్టేట్ ఆఫ్ ది స్కామివర్స్ నివేదిక ప్రకారం.. భారతీయులు రోజుకు సగటున నాలుగు డీప్‌ఫేక్‌లను చూస్తున్నారు. రోజుకు నాలుగు డీప్‌ఫేక్‌ల వల్ల రూ.93,915 నష్టం వాటిల్లుతోంది. డీప్‌ఫేక్‌లు ఎక్కువగా కనిపిస్తున్న వేదికల్లో ఇన్‌స్టాగ్రామ్ 65 శాతం, ఫేస్‌బుక్ 59 శాతం, యూట్యూబ్ 48 శాతం, టెలిగ్రామ్ 44 శాతం, వాట్సాప్ 41 శాతంతో ఉన్నాయి.
సర్వేలో పాల్గొన్న వారిలో మూడింట ఒక వంతుకుపైగా వాటిని గుర్తించగలమన్న నమ్మకం లేదని చెప్పారు. ప్రతి ఐదుగురిలో ఒకరు వాయిస్ క్లోనింగ్ మోసాన్ని ఎదుర్కొన్నారు. 87 శాతం మంది ఆన్‌లైన్ మోసాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. 51 శాతం మంది మోసాల వల్ల డబ్బు కోల్పోయారు. రోజుకు సగటున 13 మోసపూరిత సందేశాలు అందుతున్నాయి. ఆన్‌లైన్‌లో నిజమైన సమాచారాన్ని, నకిలీ సమాచారాన్ని గుర్తించేందుకు ఏడాదికి 102 గంటలు వెచ్చిస్తున్నారు.
రూ.49 వేల కోట్ల మార్కెట్.. 20 శాతం వృద్ధి
భారత్‌లో ఏఐ ముఖాలకు భవిష్యత్తులో మార్కెట్ ఏర్పడటానికి డిజిటల్ ప్రకటనల రంగం విస్తరణ ప్రధాన కారణం. ఈటీ బ్రాండ్ ఈక్విటీ–ఇప్సోస్ 2025–26 నివేదిక ప్రకారం..
» 2024–25లో మొత్తం ప్రకటనల వ్యయం రూ.1.11 లక్షల కోట్లు
» దీన్లో డిజిటల్ ప్రకటనల వ్యయం రూ.49,000 కోట్లు
» డిజిటల్ ప్రకటనల వాటా 44%
» డిజిటల్ రంగం వార్షిక వృద్ధి 20%
» 2025–26లో డిజిటల్ ప్రకటనల అంచనా రూ.56,400 కోట్లు
» మొత్తం ప్రకటనల వ్యయంలో డిజిటల్ వాటా అంచనా 46%
» మొత్తం డిజిటల్ ప్రకటనల వ్యయంలో మొబైల్ వేదికలవాటా 78% (దీన్లో ఎఫ్‌ఎంసీజీ, ఈ–కామర్స్ సంస్థల వాటా 68%)


