Business News in Telugu | బిజినెస్ న్యూస్ | Today Latest Telugu Business Headlines - Sakshi
Sakshi News home page

Business Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

GDP growth may cross 7 5pc in Q2 SBI1
జీడీపీ వృద్ధి 7.5 శాతాన్ని మించొచ్చు..

న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో (జూలై–సెపె్టంబర్‌ త్రైమాసికం)7.5 శాతం మించి నమోదు కావొచ్చని ఎస్‌బీఐ పరిశోధన విభాగం అంచనా వేసింది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపునకు తోడు, పండుగల సమయంలో విక్రయాలు బలంగా నమోదు కావడం మెరుగైన వృద్ధికి దారితీయొచ్చని పేర్కొంది. అలాగే, పెట్టుబడులు పుంజుకోవడం, గ్రామీణ వినియోగం కోలుకోవడాన్ని ప్రస్తావించింది.‘‘పండుగల నేపథ్యంలో అమ్మకాలకు సంబంధించి మంచి గణాంకాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలకు సంబంధించి వినియోగం, డిమాండ్‌ను సూచించే సంకేతాలు క్యూ1లో ఉన్న 70 శాతం నుంచి క్యూ2లో 83 శాతానికి పెరిగాయి. వీటి ఆధారంగా క్యూ2లో వాస్తవ జీడీపీ వృద్ధి 7.5 శాతం లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చన్న అంచనాకు వచ్చాం’’అని ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం తన నివేదికలో పేర్కొంది.ఈ నెల చివర్లో క్యూ2 జీడీపీ గణాంకాలు విడుదల కానున్నాయి. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండొచ్చన్నది ఆర్‌బీఐ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్‌–జూన్‌) జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉండడం గమనార్హం. జోరుగా జీఎస్‌టీ వసూళ్లు.. నవంబర్‌ నెలకు జీడీపీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 6.8 శాతం అధికమని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. దిగుమతులపై ఐజీఎస్‌టీ, సెస్సు రూపంలో ఆదాయం రూ.51,000 కోట్లుగా ఉంటుందని.. దీంతో నవంబర్‌ నెలకు మొత్తం జీఎస్‌టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లను మించొచ్చని పేర్కొంది. జీఎస్‌టీ రేట్ల తగ్గింపు గత నెలలో పండుగల విక్రయాలను గణనీయంగా పెంచడాన్ని గుర్తు చేసింది.క్రెడిట్‌ కార్డు, డెబిట్‌కార్డు వ్యయాలు సైతం దీన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. యుటిలిటీలు, సేవలపై 38 శాతం, సూపర్‌ మార్కెట్, గ్రోసరీ కొనుగోళ్లపై 17 శాతం, పర్యటనలపై 9 శాతం ఖర్చు చేసినట్టు తెలిపింది. పట్టణాల వారీగా క్రెడిట్‌ కార్డు వ్యయాలను పరిశీలించగా, డిమాండ్‌ అన్ని ప్రాంతాల్లోనూ అధికమైనట్టు పేర్కొంది. అన్ని పట్టణాల్లోనూ ఈ–కామర్స్‌ విక్రయాలు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ఇక్రా అంచనా 7 శాతం సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. సేవలు, వ్యవసాయ రంగంలో రెండో త్రైమాసికంలో కొంత జోరు తగ్గిందంటూ.. తయారీ, నిర్మాణ రంగం, సానుకూల బేస్‌ మద్దతుతో పారిశ్రామిక పనితీరు బలంగా ఉన్నట్టు తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరం క్యూ2లో జీడీపీ 5.6 శాతంగా ఉండడం గమనార్హం.క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2తో పోల్చి చూసినప్పుడు ప్రభుత్వ వ్యయాలు తక్కువగా ఉండడం జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపించొచ్చని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ పండుగల సీజన్‌లో అమ్మకాలు, జీఎస్‌టీ రేట్ల క్రమబద్దీకరణ కారణంగా పెరిగిన అమ్మకాలు, టారిఫ్‌లు అమల్లోకి రావడానికి ముందుగా అమెరికాకు అధిక ఎగుమతులు జరగడం వృద్దికి మద్దతునివ్వొచ్చని చెప్పారు.

PhysicsWallah share price ipo listing2
ఫిజిక్స్‌వాలా.. లిస్టింగ్‌ అదిరేలా!

ముంబై: ఎడ్‌టెక్‌ యూనికార్న్‌ ఫిజిక్స్‌వాలా కంపెనీ షేరు ఎక్స్చేంజీల్లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది. ఇష్యూ ధర(రూ.109)తో పోలిస్తే బీఎస్‌ఈలో 31.28% ప్రీమియంతో రూ.143 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 49% ఎగసి రూ.162 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 42% లాభంతో రూ.155 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 44,382.43 కోట్లుగా నమోదైంది.ఎమ్‌వీ ఫొటోవోల్టాయిక్‌.. ప్చ్‌సౌరశక్తి సంస్థ ఎమ్‌వీ ఫొటోవోల్టాయిక్‌ పవర్‌ షేరు ఇష్యూ ధర(రూ.217)తో పోలిస్తే ఎలాంటి లాభ, నష్టం లేకుండా ఫ్లాటుగా రూ.217 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.207 వద్ద కనిష్టాన్ని, రూ.228 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 1% స్వల్ప లాభంతో రూ.219 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.15,166 కోట్లుగా నమోదైంది

Stock market: Sensex Slips 278 Points and Nifty Down 103 Points Amid Market Decline3
ఐటీ, మెటల్‌ షేర్లలో లాభాల స్వీకరణ

ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో ఐటీ, మెటల్, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్‌ 278 పాయింట్లు కోల్పోయి 84,673 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 103 పాయింట్లు నష్టపోయి 25,910 వద్ద నిలిచింది. దీంతో స్టాక్‌ సూచీల ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడినట్లైంది. సూచీలు రోజంతా బలహీనంగా ట్రేడవుతూ... ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 393 పాయింట్లు పతనమై 84,558 వద్ద, నిఫ్టీ 137 పాయింట్లు కోల్పోయి 25,876 వద్ద కనిష్టాలు తాకాయి.డిసెంబర్‌లో యూఎస్‌ ఫెడరల్‌ వడ్డీరేట్ల తగ్గింపుపై అనుమానాలు రేకెత్తడంతో పాటు టెక్నాలజీ రంగంలో అధిక వాల్యుయేషన్ల ఆందోళలనతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆసియాలో జపాన్‌ 3.33%, కొరియా 3.43%, తైవాన్‌ 2.58%, హాంగ్‌కాంగ్‌ 2%, సింగపూర్, చైనా 1% క్షీణించాయి. యూరప్‌లో ఫ్రాన్స్‌ 1.7%, జర్మనీ 1.6%, బ్రిటన్‌ 1.3% నష్టపోయాయి.⇒ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా వన్‌97 కమ్యూనికేషన్స్‌(పేటీఎమ్‌)లో తాజాగా పీఈ సంస్థ సయిఫ్‌ పార్ట్‌నర్స్‌ 1.86 శాతం వాటా విక్రయించింది. దీంతో పేటీఎమ్‌లో సయిఫ్‌ వాటా 15.33 శాతం నుంచి 13.47 శాతానికి తగ్గింది. షేరుకి రూ. 1,305 సగటు ధరలో రూ. 1,556 కోట్లకు అమ్మివేసింది. పేటీఎమ్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3% పతనమై రూ. 1,293 వద్ద ముగిసింది.

AI Adoption Thrust propels Indian GCC workforce to reach 34. 6 million by 20304
జీసీసీల్లో కొలువులు @ 34.6 లక్షలు!

ముంబై: దేశీయంగా గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమలో ఉద్యోగాలు కూడా భారీగా పెరగనున్నాయి. దీంతో సిబ్బంది సంఖ్య 2026 నాటికి 11 శాతం వృద్ధి చెంది 24 లక్షలకు, ఆ తర్వాత 2030 నాటికి 34.6 లక్షలకు చేరనుంది. ప్రస్తుత స్థాయితో పోలిస్తే అప్పటికి 13 లక్షల కొలువులు కొత్తగా జతకానున్నాయని అంతర్జాతీయ టెక్నాలజీ, డిజిటల్‌ టాలెంట్‌ సొల్యూషన్స్‌ సేవల సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్విసెస్‌ ఒక నివేదికలో తెలిపింది. ‘జీసీసీ 4.0 ప్రస్థానంలో భారత్‌ కీలక దశలో ఉంది.నేడు జీసీసీలు కేవలం కృత్రిమ మేధ (ఏఐ)ని వినియోగించుకోవడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. దాన్ని వినియోగంలోకి తెచ్చే దిశగా ముందుకు వెళ్తున్నాయి. సాధారణంగా ఈ పరిశ్రమలో ఏఐ జోరు ఊహించినదే అయినప్పటికీ ఈ సంవత్సరం ఇది కాస్త వేగవంతమైంది‘ అని సంస్థ సీఈవో సచిన్‌ అలగ్‌ తెలిపారు. దీనితో నిపుణుల నియామకాలు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశీయంగా ఆరు నగరాల్లో 10 రంగాల నుంచి 321 జీసీసీ దిగ్గజాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ ఈ నివేదిక రూపొందించింది. 2025 జూలై–అక్టోబర్‌ మధ్య ఈ సర్వే నిర్వహించారు. రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు.. ⇒ ఏఐ వినియోగం పెరిగే కొద్దీ జీసీసీల్లో కొత్త రకం కొలువులు వస్తున్నాయి. సైబర్‌సెక్యూరిటీ, ఏఐ గవర్నెన్స్‌ ఆర్కిటెక్ట్స్‌ (29 శాతం), ప్రాంప్ట్‌ ఇంజినీర్స్‌ (26 శాతం), జెన్‌ఏఐ ప్రోడక్ట్‌ ఓనర్స్‌ (22 శాతం), ఏఐ పాలసీ అండ్‌ రిస్క్‌ స్ట్రాటెజిస్ట్స్‌ (21 శాతం)కి డిమాండ్‌ నెలకొంది. ⇒ అదే సమయంలో ఎల్‌1 ఐటీ సపోర్ట్‌ (75 శాతం), లెగసీ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ (74 శాతం), మాన్యువల్‌ క్యూఏ (72 శాతం), ఆన్‌–ప్రెమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ (67 శాతం) విభాగాల్లో ఉద్యోగాలను జీసీసీలు దశలవారీగా తొలగిస్తుండటం గమనార్హం. ⇒ భౌగోళికంగా జీసీసీలు మెట్రో నగరాల నుంచి క్రమంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు మళ్లుతున్నాయి. చిన్న పట్టణాల్లో అట్రిషన్‌ (ఉద్యోగుల వలస) రేటు తక్కువగా 10–12 శాతం స్థాయిలో ఉండటం, ఆఫీస్‌ వ్యయాలు 30–50 శాతం తక్కువగా ఉండటం, ఉద్యోగులపై వ్యయాలు 20–35 శాతం మేర తక్కువగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణం. ⇒ 2030 నాటికి జీసీసీల్లో 39 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి పని చేసే అవకాశం ఉంది. మరోపక్క ప్రథమ శ్రేణి నగరాలు లీడర్‌íÙప్, గవర్నెన్స్, పరిశోధన–అభివృద్ధి కార్యకలాపాలకు కేంద్రాలుగా కొనసాగనున్నప్పటికీ, కోయంబత్తూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్‌ లాంటి ద్వితీయ, తృతీయ శ్రేణి హబ్‌లు చాలా వేగంగా స్పెషలైజ్డ్‌ డెలివరీ సెంటర్లుగా ఎదుగుతున్నాయి.

Gold prices plunged by Rs 3900 to Rs 125800 per 10 grams5
పసిడి రూ. 3,900 డౌన్‌

న్యూఢిల్లీ: వచ్చే నెలలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో పసిడి ధరలు మంగళవారం గణనీయంగా తగ్గాయి. దేశీయంగా ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 3,900 క్షీణించింది. రూ. 1,25,800కి తగ్గింది. వెండి రేటు కూడా కేజీకి రూ. 7,800 తగ్గి రూ. 1,56,000కు దిగి వచ్చింది.అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లడం, ఈ వారం కీలక డేటా విడుదల అనంతరం ఫెడ్‌ రిజర్వ్‌ తీసుకోబోయే చర్యల గురించి ఇన్వెస్టర్లు నిరీక్షిస్తుండటంతో పసిడి, వెండి అమ్మకాల ఒత్తిడికి లోనైనట్లు ఆగ్మంట్‌ హెడ్‌ (రీసెర్చ్‌) రెనిషా చైనాని తెలిపారు. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌లో) డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుకు సంబంధించి పసిడి రేటు క్రితం ముగింపు రూ. 1,22,927తో పోలిస్తే ఒక దశలో సుమారు రూ. 2,165 క్షీణించి రూ. 1,20,762కి తగ్గింది. వెండి ఫ్యూచర్స్‌ కూడా డిసెంబర్‌ కాంట్రాక్టు రూ. 3,660 మేర (సుమారు 2.36 శాతం) పతనమై రూ. 1,51,652 వద్ద ట్రేడయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లు చూస్తే కామెక్స్‌ గోల్డ్‌ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ ఔన్సుకి సుమారు 65 డాలర్లు (1.60 శాతం) క్షీణించి 4,009.5 డాలర్లకు తగ్గింది. గత నాలుగు సెషన్లలో పుత్తడి ధర ఏకంగా 204.1 డాలర్లు (సుమారు 4.84 శాతం) క్షీణించింది. అలాగే డిసెంబర్‌ కాంట్రాక్టు వెండి రేటు 2.38 శాతం క్షీణించి 49.50 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.

Employee Quits First Job After 3 Hours6
ఉద్యోగంలో చేరిన మూడు గంటల్లో రాజీనామా!

ఉద్యోగులు తమ సమస్యలను, కొంతమంది తమ జాబ్ అనుభవాలను రెడ్డిట్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. ఉద్యోగంలో చేరిన మూడు గంటల్లోనే.. ఉద్యోగానికి రాజీనామా చేశానని ఒక వ్యక్తి రెడ్డిట్‌లో పేర్కొన్నారు.నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది. నెలకు రూ. 12000 జీతం. కానీ ఉద్యోగంలో చేరిన మూడు గంటలలోనే రాజీనామా చేశాను, అని పేర్కొన్నారు. దీనికి కారణం రోజుకు 9 గంటల షిఫ్ట్ అని అన్నాడు. మొదట్లో ఈ పని చేయాలనుకున్నాను. కానీ ఈ జాబ్ నా సమయాన్ని మొత్తం వృధా చేస్తుందని వెల్లడించాడు. ఈ ఉద్యోగంతో కెరీర్‌లో నేను ఎదగలేనని గ్రహించాను. కాబట్టే ఉద్యోగాన్ని వదులుకున్నాను అని అన్నాడు.నేను పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్నాను. ఈ సమయంలో ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ ఉంటే బాగుంటుందని సెర్చ్ చేసాను. మొదట్లో నేను ఇలాంటి ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు.. పార్ట్-టైమ్ గిగ్‌గా ఉంది. ఆ తరువాత అది ఫుల్ టైమ్ జాబ్ అని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేశానని వెల్లడించాడు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు స్పందిస్తూ.. కొందరు మంచి నిర్ణయం తీసుకున్నావని ప్రశంసిస్తే, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందే అన్నీ సరిగ్గా చూసుకోవాలని ఇంకొందరు అన్నారు.

Advertisement
Advertisement
Advertisement