హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ కుదుపు.. | HDFC Bank Shocker Rs 1 lakh crore wiped out After Chairmans Sudden Exit | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో భారీ కుదుపు..

Mar 19 2026 7:58 PM | Updated on Mar 19 2026 8:42 PM

HDFC Bank Shocker Rs 1 lakh crore wiped out After Chairmans Sudden Exit

దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్యాంక్ పార్ట్ టైమ్ ఛైర్మన్ అతాను చక్రవర్తి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం ఇన్వెస్టర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిణామంతో గురువారం స్టాక్ మార్కెట్‌లో బ్యాంక్ షేర్లు కుప్పకూలాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఇన్వెస్టర్ల సంపద రూ. 1 లక్ష కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది.

అసలేం జరిగింది?
మార్చి 17న పంపిన తన రాజీనామా లేఖలో చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్ధతులు, నిర్ణయాలు తన వ్యక్తిగత విలువలకు, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

"నేను బ్యాంకులో ఏదో తప్పు జరిగిందని ఆరోపించడం లేదు. కానీ నా వ్యక్తిగత భావజాలం, సంస్థ అనుసరిస్తున్న పద్ధతులు ఒకేలా లేవు. అందుకే తప్పుకుంటున్నాను" అని ఆయన స్పష్టం చేశారు.

ఆర్థిక శాఖ మాజీ బ్యూరోక్రాట్ అయిన చక్రవర్తి, 2021లో బోర్డులో చేరారు. హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో విలీనం వంటి కీలక ప్రక్రియలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.

మార్కెట్‌లో ప్రకంపనలు
చక్రవర్తి నిష్క్రమణ వార్త బయటకు రాగానే మార్కెట్ తీవ్రంగా స్పందించింది. ప్రారంభ ట్రేడింగ్‌లోనే షేరు ధర 9 శాతం మేర పడిపోయి రూ.770 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ల పతనం కారణంగా బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ-50 వందల పాయింట్ల మేర నష్టపోయింది. అయితే, మార్కెట్ ముగిసే సమయానికి షేరు స్వల్పంగా కోలుకుని, క్రితం ముగింపుతో పోలిస్తే 3.8 శాతం నష్టంతో రూ.810.80 వద్ద స్థిరపడింది.

రంగంలోకి దిగిన ఆర్‌బీఐ
పరిస్థితిని చక్కదిద్దేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తక్షణమే రంగంలోకి దిగింది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ వెటరన్ కేకీ మిస్త్రీని మార్చి 19 నుండి మూడు నెలల కాలానికి తాత్కాలిక పార్ట్ టైమ్ ఛైర్మన్‌గా నియమించేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది.

బ్యాంకులో ఎలాంటి ఆధిపత్య పోరాటాలు, కార్యాచరణ లోపాలు లేవని కేకీ మిస్త్రీ ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన బ్యాంక్ అని, దాని వద్ద తగినంత మూలధనం, నగదు లభ్యత ఉన్నాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. మేనేజ్‌మెంట్ తీరుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్‌ ఎందుకంతలా కూలింది? ఇవే కారణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement