దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రక్తపాతాన్ని చవిచూశాయి! అంతర్జాతీయంగా ముదురుతున్న యుద్ధ మేఘాలు, ముడిచమురు సెగలు దలాల్ స్ట్రీట్‌ను అతలాకుతలం చేశాయి. అత్యంత ఘోరమైన పతనాన్ని నమోదు చేస్తూ.. ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజులో ఏకంగా రూ.12 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈరోజు 2,196.89 పాయింట్లు (3.26%) పతనమై 74,207.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 775.65 పాయింట్లు (3.26%) క్షీణించి 23,002.15 వద్ద స్థిరపడింది.
మార్కెట్‌ను ముంచేసిన 5 ప్రధాన కారణాలు
పతాక స్థాయికి చేరిన మధ్యప్రాచ్య సంక్షోభం
అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయబ్రాంతులకు గురిచేసింది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్, ఖతార్‌లోని రాస్ లఫ్ఫాన్ LNG ప్లాంట్‌లతో పాటు సౌదీ, కువైట్ రిఫైనరీలపై దాడులు జరగడం గ్లోబల్ ఎనర్జీ సరఫరా వ్యవస్థను దెబ్బతీసింది.
భగ్గుమన్న ముడిచమురు
యుద్ధ భయాలతో బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కరోజే 5-11% పెరిగి బ్యారెల్‌కు 119 డాలర్లకి చేరుకుంది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఇది పెద్ద దెబ్బ. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, కంపెనీల నిర్వహణ వ్యయం భారమై లాభాలు తగ్గుతాయన్న ఆందోళన పెరిగింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కుదుపు
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) పార్ట్-టైమ్ చైర్మన్ అటాను చక్రవర్తి అనూహ్య రాజీనామా మార్కెట్‌ను షాక్‌కు గురిచేసింది. "విలువలు, నైతికత" విషయంలో విభేదాల కారణంగా ఆయన తప్పుకోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 7-8% కుప్పకూలింది. ఇది నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌ను భారీగా కిందకు లాగింది.
అమెరికా ఫెడ్ 'హాకిష్' వైఖరి
అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమే కాకుండా, కఠిన వైఖరిని ప్రదర్శించింది. యుద్ధం వల్ల ఇన్‌ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉన్నందున, 2026లో కేవలం ఒకే ఒక్క వడ్డీ రేటు కోత (25 bps) ఉండొచ్చని సూచించడం గ్లోబల్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
రూపాయి పతనం- ఎఫ్‌ఐఐల అమ్మకాలు
అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో రూపాయి విలువ రికార్డు స్థాయిలో రూ.92.63కి పడిపోయింది. దీనికి తోడు విదేశీ సంస్థాగత మదుపరులు (FII) భారీగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, అటు ఆసియా, యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉండటంతో భారత మార్కెట్లు కోలుకోలేకపోయాయి.


