breaking news
Guest Columns
-
కొన్నిసార్లు 'తగ్గి ఉండటమే మంచిది'!
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి కామెడీ లెజెండ్ కోనన్ ఓబ్రెయిన్ చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం: అందరికీ స్వాగతం. రేపటి గొప్ప మేధావులైన మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. హార్వర్డ్ అమెరికాలో అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యానిలయం. నేను 40 సంవత్సరాల క్రితం ఇక్కడే డిగ్రీ పూర్తి చేశాను. ఈ రోజు మీరు 375వ గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్. 1642లో మొదటి గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌లో విద్యార్థుల సంఖ్య కేవలం తొమ్మిది మంది. అమెరికాలోని ఏ యూనివర్సిటీ కూడా హార్వర్డ్ కంటే ఎక్కువ మంది నోబెల్ విజేతలను గానీ, లేదా వైట్–కాలర్ నేరస్థులను గానీ తయారు చేయలేదు. కాబట్టి మీరు మంచి మార్గాన్ని ఎంచుకున్నా లేదా చెడు మార్గాన్ని అనుసరించినా... మీరు అత్యుత్తమ వ్యక్తుల మధ్య ఉన్నారని గుర్తుంచుకోండి. అనేకమంది కలిస్తేనే పనినేను ఈ హార్వర్డ్ యూనివర్సిటీని ఎందుకు ప్రేమిస్తున్నాను? నిజంగా నాకు ఈ కాలేజీ అంటే చాలా ఇష్టం. ఇది నా జీవితాన్ని మార్చేసింది. నాకు హార్వర్డ్‌లో సీటు వచ్చిందని మంచానికే పరిమితమైన నా నానమ్మకు చెప్పిన రోజు... అసలు కాలేజీ ముఖమే చూడని ఆమె కళ్ల వెంబడి నీళ్లు తిరిగాయి. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుల్లో అదొకటి. 1985లో నా గ్రాడ్యుయేషన్ రోజున ఇక్కడ కూర్చున్నప్పుడు నేను కూడా ఎంతో సంతోషపడ్డాను. మీరందరూ ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో నేను నిజంగా అర్థం చేసుకోగలను. నేను లేట్ నైట్ టాక్ షో హోస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించి నప్పుడు ఇంటర్నెట్ లేదు. మీడియాకు కోనన్ ఓబ్రెయిన్ గురించి తెలిసిన ఏకైక విషయం అతడు హార్వర్డ్‌లో చదువుకున్నాడని మాత్రమే. ఒకవేళ నేను ఒక తత్వవేత్తనో లేదా భౌతిక శాస్త్రవేత్తనో అయి ఉంటే హార్వర్డ్ నాకు బాగా ఉపయోగపడేదేమో. కానీ ఒక కమెడియన్‌కి అది మరణశాసనం లాంటిది. ఇన్ని సంవత్సరాల తర్వాత, నా పేరు వినగానే ప్రజలకు గుర్తుకొచ్చే మొదటి విషయం హార్వర్డ్ ఎంతమాత్రం కాదు. నేను పదివేల గంటల కంటెంట్ తయారు చేశాను. అందులో ఏ ఒక్కదానికీ హార్వర్డ్ చదువుతో సంబంధం లేదు. కానీ ఏ ఒక్క పనినీ నేను ఒంటరిగా పూర్తి చేయలేదని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. ప్రముఖ అమెరికన్ కవి, రచయిత, జర్నలిస్టు వాల్ట్ విట్మాన్ ‘నాలో అనేకమంది ఉన్నారు’ అని రాశారు. అలాగే నేనూ ఏది సాధించినా, నా వెనుక ఉన్న అనంతమైన వ్యక్తుల సహాయంతోనే సాధించాను. ఈ రోజు మీ ముందు ప్రసంగించడానికి నా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరినీ(బతికున్నవారైనా, చనిపోయినవారైనా) నేను ఆహ్వానించగలిగితే... హార్వర్డ్ మొత్తం, అలాగే నా స్నేహి తులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, రచయితలు, నిర్మాతలు, నన్ను ద్వేషించేవారు, అభిమానులు, అనుకోకుండా కలిసిన వేలాది మందితో కిక్కిరిసిపోతుంది. నా విజయాలు కేవలం నావి మాత్రమే కావని గుర్తించడం వల్ల, నా జీవితంలో అవసరమైన సమతుల్యత వచ్చింది. మార్గాన్ని మార్చుకున్నాను!నన్ను పదే పదే కాపాడిన మరొక విషయం... మార్గాన్ని మార్చుకోవడం. నా కెరీర్లో నేను ఎన్నోసార్లు నా దారిని మార్చు కోవాల్సి వచ్చింది. దానివల్ల నా మార్గం ఒక వంకర టింకర గీతలా మారిపోయింది. ప్రాణంగా భావించిన ఉద్యోగాన్ని కోల్పోయాను. ఆ తర్వాత కొన్నేళ్లకు నా కెరీర్‌ను అంకితం చేసిన లేట్ నైట్ టెలివిజన్ ఫార్మాట్ కనుమరుగవ్వడం చూశాను. దాంతో ఒక తెలివైన స్నేహితుడి సలహాతో ఒక పాడ్‌కాస్ట్ ప్రారంభించాను. మొదట్లో నాకా ప్రాజెక్ట్ అంటే నచ్చేది కాదు. కానీ జనం నా లేట్ నైట్ షో కంటే ఎక్కువగా ప్రేమించేలా నేను దాన్ని సృష్టించగలిగాను. నేను ఈ విధంగా అనేకసార్లు దారి మార్చుకున్నాను. ఇప్పుడు నాకు ఆ మార్పులంటే చాలా ఇష్టం. నా సంభాషణల్లో, మలుపు అనే పదాన్ని అవసరానికి మించి వాడుతుంటాను. ఎందుకంటే జీవితంలో అనేక మలుపులు ఉంటాయి. నా జీవితంలో అదృష్టం గొప్ప పాత్రను నేను ఎల్లప్పుడూ గుర్తిస్తాను. ఒకరి విజయంలో అదృష్టం పాత్రను చూడకపోవడం అజ్ఞానమే అవుతుంది. చాలామంది తమకు దక్కిన అదృష్టాన్ని తమ సొంత తెలివితేటలుగా పొరబడతారు. ఆ మానవ సహజమైన ఆలోచనను నిరోధించడం వల్లే నేను స్థిరంగా ఉండగలిగాను. సమాజం, సహజత్వం, వినయం, పని పట్ల నిజమైన అంకితభావం... అర్థవంతమైన గొప్ప జీవితాన్ని నిర్మించుకోవడానికి నాకు సహాయపడ్డాయని నమ్ముతున్నా. ఇక్కడ నా ఉద్దేశం విజయాలను వదులుకోవాలని కాదు, వాటిని ఒంటబట్టించుకోకపోవడమే మంచిది. మీరు మీ విజయాలను తేలికగా తీసుకున్నప్పుడు... దయ, సృజనాత్మకత, ధైర్యం, హాస్యం, మానవత్వం వంటి ఇతర గుణాలు బయటకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణాల ద్వారా నేర్చుకున్న పాఠాలుబహుశా నేను జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద పాఠాలు నా ట్రావెల్ షోల ద్వారానే అయ్యుండవచ్చు. క్యూబా, ఘనా, కొరియా, అర్మేనియా, ఐరోపాలో సగం భాగాలు, అర్జెంటీనా, థాయిలాండ్, మెక్సికో, గ్రీన్ ల్యాండ్లలో నన్ను నేను తగ్గించుకున్నాను. నన్ను నేను తగ్గించుకోవడం వల్ల హెచ్చింపబడ్డాను. నేను వేరే దేశానికి వెళ్లినప్పుడు, నేను మాట్లాడిన ప్రతి మాట... అక్కడి సమాజం, పరిస్థితులకు అనుగుణంగా మారడం... ఇవన్నీ చాలా అవసరం. మీకు అక్కడి భాష రానప్పుడు, మీరు ఏ కాలేజీలో చదివారనేది అనవసరం. అప్పుడు స్నేహం చేయడం తప్ప మీకు వేరే మార్గం లేదు. ఆ ప్రయాణాల్లోనే నేను ఒక గొప్ప పాఠం నేర్చు కున్నాను. కొన్ని విషయాల్లో తగ్గి ఉండటమే మంచిది. మా తాతయ్య పేరు ‘హుఫర్’. ఆయన తన తల్లిదండ్రులను పోషించడానికి ఏడో తరగతిలోనే చదువు ఆపేసి... వర్సెస్టర్, మాసాచుసెట్స్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయనో మాట చెప్పేవారు: ‘ఏది దొరికితే అది తీసుకో.. ఆపై ఇంకా కావా లని అడుగు’. చాలా తెలివైన వ్యక్తి! నా జీవితంలో హుఫర్ చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన గౌరవార్థం, నేను ఈ యూనివర్సిటీ ఇవ్వజూపిన డాక్టరేట్‌ను తీసుకుంటాను, ఆ తర్వాత నగదు బహు మతి ఏమైనా ఇస్తారా అని కూడా అడుగుతా! నా కోరిక ఏమిటంటే... హార్వర్డ్ అనేది మీ గురించి ప్రజలకు తెలిసే విషయాల్లో అత్యంత తక్కువ ప్రాధాన్యత ఉన్నదిగా మారాలి. ఎందుకంటే, మీ అసలైన చదువు ఇప్పటి నుంచే మొదలవుతుంది. మీ కష్టం, పట్టుదల, మానవత్వం, మీరు నిర్మించబోయే సరిహద్దులు లేని సమాజం కోసం... నా హృదయపూర్వక అభినందనలు! -
అమితాబ్ బచ్చన్ (బాలీవుడ్ దిగ్గజం) రాయని డైరీ
రాత్రి 2.34. ఎంతకూ మెలకువ రావటం లేదు! మెలకువ రావటం లేదంటే నిద్రలో ఉన్నట్లనేనా?! నేను కోరుకుంటున్న మెలకువ... నిద్రాణంగా ఉన్న నా జీవితపు మలుపుల్లోంచి నిస్త్రాణగా పడి ఉన్న నా నిరాలోచనల ఏకాంతంలోకి. పాతవన్నీ ప్రవాహంలా మనసులోకి వచ్చి చేరుతున్నాయంటే... బిందెడు తులసి నీళ్లను మంచం పక్కన సిద్ధంగా ఉంచుకోవటమేనా? గొంతెండి ఉన్న దారులను తీర్థపు గుక్కిళ్లతో ఆరారగా తడుపుకుంటూ జీవనావస్థలోకి మళ్లీ మళ్లీ ప్రయాణించి వస్తుండటమేనా? ప్రయాసగా పక్కకు ఒత్తిగిలాను. నీలం రంగు మసక వెలుతురు... తీరని అలసటలా మనసును పూర్తిగా కమ్మేసి ఉంది. వలదనుకోలేని జ్ఞాపకాలు. అంతమూ పొంతనా లేని తలపులు. ఏ జాము అయిందో తెలియదు, మనిషి జీవితకాల జాముల గురించి ఆలోచిస్తున్నాను! అరవై ఏళ్లు రాగానే మనిషిని మనుషులు ఎందుకు ఆనవాలు పట్టటం మానేస్తారు! డెబ్బై దాటగానే ఎందుకు చూపులు చిట్లిస్తారు! ఎనభైల్లో ఎదురుపడితే ఎదురైంది మనిషే కానట్లు ఎందుకు దాటుకుని పోతారు! మనుషులిలా తప్పుకుని పోతున్నప్పుడే తొంభై ఏళ్లు, నూట తొంభై ఏళ్లు బతికి, మనుషులతో మాట కలపాలనిపిస్తుంది నాకు. కోవిడ్‌తో నేను ముంబై నానావతి ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో ఉన్నప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి నా మరణాన్ని తీవ్రంగా కాంక్షిస్తూ, ‘‘కనీసం ఈ కోవిడ్తోనైనా నువ్వు చనిపోవాలని కోరుకుంటున్నాను’’ అని సోషల్ మీడియాలో ఒక సంక్షిప్త సందేశం పోస్ట్ చేశాడు! పట్టలేనంత కోపం వచ్చింది నాకు.ఆ వెంటనే ఆలోచిస్తే... కోపం వచ్చినందుకు నవ్వొచ్చింది. నేను చనిపోవాలని కోరుకుంటు న్నాడంటే... నేను బతికున్నానని అతడు అనుకుంటున్నట్లే! అది కదా దీర్ఘాయుష్షు... మనిషి మనసులో మనిషి ఉండటం! ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సెట్స్‌లో ఒకసారి ప్రీతి జింతాను అడిగేశాను... ‘‘నేను ప్రతి సంవత్సరం జనవరి 31న మీకు బర్త్‌డే విషెస్ చెప్తాను, కానీ మీరు ఒక్కసారి కూడా నాకు రిప్లయ్ ఇవ్వలేదు’’ అని. ‘‘సారీ బచ్చన్ జీ. నంబర్ మారిపోయింది’’ అన్నారు ప్రీతి జింతా! ఒక ఏడాది మే 1న అనుష్క శర్మను ట్విట్టర్లో బహిరంగంగానే అడిగాను, ‘‘మీకు ఎస్ఎంఎస్లో శుభాకాంక్షలు పంపాను. కానీ ఎలాంటి స్పందనా లేదు’’ అని. ‘‘సారీ సర్... చూసుకోలేదు’’ అన్నారు అనుష్క! ‘‘ పర్వాలేదు. నిన్న రాత్రి ఐపీఎల్ గేమ్‌లో మీరు చాలా కాంతిమంతంగా కనిపించారు’’ అని మళ్లీ శుభాకాంక్షలు పంపాను. సోనమ్ కపూర్ కూడా నన్ను పట్టించు కోలేదు! ‘‘సారూ... నేను అమితాబ్ బచ్చన్ ని. జూన్ 9న నీ పుట్టినరోజుకు విష్ చేశాను. రిప్లయ్ లేదు, కాల్ కూడా చేయలేదు... వెరీ బ్యాడ్!’’ అని మెసేజ్ పెట్టాను. ‘‘సారీ అంకుల్, మీ ఎస్ఎంఎస్ నాకు రీచ్ అయినట్లు లేదు’’ అన్నారు సోనమ్!రణ్వీర్ సింగ్‌ని, ‘‘హేయ్... అందరికీ థ్యాంక్స్ చెబుతున్నావ్. మరి నేను పంపిన విషెస్ సంగతి ఏంటి? రిప్లయ్ ఎందుకు ఇవ్వలేదు?’’ అని అడిగాను. ‘‘సారీ అమితాబ్ జీ, మీక్కూడా థ్యాంక్యూ చెప్పానే!! మీకు ఆ థ్యాంక్యూ చేరలేదంటే... ఏదో టెక్నికల్ గ్లిచ్ అయుంటుంది’’ అన్నారు రణ్వీర్! సమాధానం సంతృప్తికరంగా ఉండక పోవచ్చు. అసలు ప్రశ్నే సరైనది కాకపోవచ్చు. కానీ, ప్రశ్నలు సమాధానాలు ఉండటమే జీవితం. అడగాల్సిన ప్రశ్నలు, చెప్పాల్సిన సమాధానాలు లేకుండా... నిండు నూరేళ్ల జీవితం కూడా సంపూర్ణం కాలేదు. ప్రశ్న, సమాధానం నిశ్శేషం కానంత వరకు జీవితకాలం అసలు పూరై్తనట్లే కాదు. ‘‘మేల్కొన్నారా?’’ – తెల్లవారు జామునెప్పుడో జయ అడుగుతోంది. ‘‘ఇది కోటి రూపాయల ప్రశ్న దేవీజీ... ఆలోచించాల్సిందే’’ అన్నాను, నిట్టూర్పుగా. -
ఆరోగ్యకరమైన నేలే మనిషి ఆరోగ్యానికి మూలం
నీరు, గాలి, వాతావరణ నాణ్యత క్షీణించడానికి నిస్సారమైన మట్టి దారితీస్తుంది. నేల ఆరోగ్యం క్షీణించడం వల్ల మొక్కలు, జంతు వులు, మానవుల ఆరోగ్యం దెబ్బతింటుంది. నేల స్వయంగా ఒక జీవ వ్యవస్థ. అలాగే ఇతర జీవరాశులకు ఆధారభూతమైనది కూడా. నేల, మొక్కలు, జంతువులు, మానవులు, పర్యావరణ వ్యవస్థ, భూగ్రహం ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడివడి విడదీయలేని ‘ఏకైక ఆరోగ్యం’ (వన్ హెల్త్)గా ఉంటాయి.‘ఆరోగ్యమైన నేల– ఆరోగ్యమైన మొక్క– ఆరోగ్యమైన జంతువు– ఆరోగ్యమైన మనిషి’ అనే భావనే వన్ హెల్త్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులు, జంతువులు, మొక్కలు, పర్యా వరణం పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఈ నాలుగు ఆరో గ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ‘ఏకైక ఆరోగ్యం’ భావనను, భారతదేశంలో జరిగిన జీ–20 సమావేశాలలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక టీ స్పూన్ ఆరోగ్యకరమైన నేలలో కోట్ల నుండి వందల కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి.వీటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగి), యాక్టినోమైసెట్స్, ప్రోటో జోవా, నులిపురుగులు (నీమటోడ్లు), వానపాములు వంటి జీవులు ప్రధానమైనవి. ఈ సూక్ష్మజీవులు, నేల జీవులు కలిసి సేంద్రియ పదార్థాలను కుళ్లించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. నేలలో ఉండే ఖనిజాలు (జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ వంటివి) మొక్కల వేర్ల ద్వారా గ్రహించబడి ధాన్యాలు, కూర గాయలు, పండ్లు ఇతర ఆహార పంటలలో నిల్వ అవుతాయి. ఈ పంటలను మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి అందుతాయి. ‘నేలలో పోష కాలు సమృద్ధిగా ఉంటేనే ఆహారం పోషకవంతంగా ఉంటుంది; ఆహారం పోషకవంతంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.’నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులుసేంద్రియ పదార్థాల వినియోగం నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పశువుల ఎరువు, కంపోస్ట్, వర్మీకంపోస్ట్, గ్రీన్ మెన్యూర్, బయోచార్ వంటి సేంద్రియ పదార్థాలు నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచి, నేల సారాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి, మొక్కలకు అవసరమైన పోషకాలను క్రమంగా అందుబాటులోకి తీసుకు వస్తాయి. పంటల మార్పిడి మరో పద్ధతి. ఒకే భూమిలో ఒకే పంటను వరుసగా సాగు చేయకుండా, వివిధ రకాల పంటలను క్రమపద్ధతిలో సాగు చేయాలి. పప్పు ధాన్యాలైన శనగ, పెసర, మినుము, కంది, అలసంద వంటివాటి వేర్లపై ఉండే రైజోబియం అనే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి, మొక్కలు ఉపయోగించుకునే రూపంలో నేలలో స్థిరీకరిస్తాయి. మరీ ముఖ్యంగా పంట అవశే షాలను కాల్చకూడదు. కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పోష కాలు నష్టపోతాయి. పంట అవశేషాలను మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి, కలుపు మొక్కల పెరుగు దల తగ్గుతుంది. అవసరానికి మించి తరచుగా దుక్కి దున్నడం వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతింటుంది. నేలలో నిల్వ ఉన్న సేంద్రియ కార్బన్ వేగంగా విచ్ఛిన్నమైపోతుంది. అతి దుక్కిని నివారించాలి.‘ఏకైక ఆరోగ్యం’ భావన విజయవంతం కావడంలో రైతు పాత్ర కీలకం. రైతు అనుసరించే వ్యవసాయ పద్ధతులే నేల, మొక్కలు, పశువులు, పర్యావరణం, చివరకు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నేల ఆరోగ్యాన్ని కాపాడటం అనేది రైతు పొలం దిగుబడికే కాదు, సమాజ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు భవిష్యత్ తరాలకు చేసే గొప్ప పెట్టుబడి.– డా. కె. తేజస్వరరావు, డా, ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, డా. బి. సహదేవ రెడ్డి, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు -
పాండురాజుకు ఆ శాపం ఎందుకు వచ్చింది?
పాండురాజుకు మృగవధ వలన శాపం తగిలింది. ‘ఎవరికీ అపకారం చేయక, ప్రకృతి సహజమైన సుఖాన్ని పొందుతున్న సమయంలో, విచక్షణా రహితంగా మమ్ములను బాణహతికి గురిచేసావు. కాబట్టి నీవు కూడా నీ చివరి క్షణాలలో మావంటి బాధనే అనుభవించి మరణిస్తావు!’ అని శపించింది ఆ మృగమిథునం.మృగమిథునం పాండురాజుకు ఇచ్చిన ఈ శాపంతో మహాభారత కథ రెండవ అతిపెద్ద మలుపు తిరిగింది. శంతనుడి రెండవ భార్య అయిన సత్యవతికి పుట్టిన ఇద్దరు కొడుకులు– చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు– పుత్రహీనులుగా మరణించగా, వారి భార్యలైన అంబిక, అంబాలికలకు, దేవరన్యాయం పద్ధతిన వ్యాసమహర్షి వలన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు సంతానంగా కలగడం అన్నది మహాభారత కథలోఅంతకు ముందు చోటుచేసుకున్న మొదటి ముఖ్యమైన మలుపు.అయితే ఆ ముగ్గరిలో రాజు కాగలిగి, రాజ్యాధికారం చేపట్టగలిగిన లక్షణాలున్న పాండురాజుకు, మృగమిథున శాపం తగిలి, తన భార్యలైన కుంతి, మాద్రిల ద్వారా తన సంతానాన్ని నేరుగా కురువంశానికి అందించలేకపోవడం అన్న విచిత్ర స్థితి దాపురించి, తన అంశతో సంతానాన్ని ఇవ్వగలగడం అన్నది విధివశాన లేకుండాపోయింది.క. ఎట్టి విశిష్ట కులంబునబుట్టియు, సదసద్వివేకములు గల్గియు, మున్గట్టిన కర్మఫలంబులునెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్?‘పూర్వం చేసిన దుష్కర్మల ఫలం వెంటాడుతుంది. ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, వివేకవంతుడైనప్పటికీ, అతడిని కొన్ని క్షణాలు విచక్షణను పోగొట్టుకునేలా చేసి, పాపకార్యం మళ్ళీ చేసేలా అది చేస్తుంది. అలా సంక్రమించిన పాపకార్య ఫలం ఒక జన్మలో కాకుంటే, ఆ తరువాత మరొక జన్మలో భోగింపక– అనగా అనుభవించకుండా తప్పించుకోవడం ఎంతటి వానికైనా సాధ్యంకాదు’ అని పై సందర్భానికి అనుగుణంగా నన్నయ భట్టారకుడు ఆంధ్ర మహాభారతం, ఆదిపర్వంలో సర్వకాలీనమైన ఆధ్యాత్మిక సత్యాన్ని సూక్తీకరించి చెప్పాడు.– భట్టు వెంకటరావు -
ఆరోగ్యకరమైన నేలే మనిషి ఆరోగ్యానికి మూలం
నీరు, గాలి, వాతావరణ నాణ్యత క్షీణించడానికి నిస్సారమైన మట్టి దారితీస్తుంది. నేల ఆరోగ్యం క్షీణించడం వల్ల మొక్కలు, జంతు వులు, మానవుల ఆరోగ్యం దెబ్బతింటుంది. నేల స్వయంగా ఒక జీవ వ్యవస్థ. అలాగే ఇతర జీవరాశులకు ఆధారభూతమైనది కూడా. నేల, మొక్కలు, జంతువులు, మానవులు, పర్యావరణ వ్యవస్థ, భూగ్రహం ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడివడి విడదీయలేని ‘ఏకైక ఆరోగ్యం’ (వన్ హెల్త్)గా ఉంటాయి.‘ఆరోగ్యమైన నేల– ఆరోగ్యమైన మొక్క– ఆరోగ్యమైనజంతువు– ఆరోగ్యమైన మనిషి’ అనే భావనే వన్ హెల్త్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులు, జంతువులు, మొక్కలు, పర్యా వరణం పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఈ నాలుగు ఆరో గ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ‘ఏకైక ఆరోగ్యం’ భావనను, భారతదేశంలో జరిగిన జీ–20 సమావేశాలలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక టీ స్పూన్ ఆరోగ్యకరమైన నేలలో కోట్ల నుండి వందల కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగి), యాక్టినోమైసెట్స్, ప్రోటో జోవా, నులిపురుగులు (నీమటోడ్లు), వానపాములు వంటి జీవులు ప్రధానమైనవి. ఈ సూక్ష్మజీవులు, నేల జీవులు కలిసి సేంద్రియ పదార్థాలను కుళ్లించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. నేలలో ఉండే ఖనిజాలు (జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ వంటివి) మొక్కల వేర్ల ద్వారా గ్రహించబడి ధాన్యాలు, కూర గాయలు, పండ్లు ఇతర ఆహార పంటలలో నిల్వ అవుతాయి. ఈ పంటలను మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి అందుతాయి. ‘నేలలో పోష కాలు సమృద్ధిగా ఉంటేనే ఆహారం పోషకవంతంగా ఉంటుంది; ఆహారం పోషకవంతంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.’నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులుసేంద్రియ పదార్థాల వినియోగం నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పశువుల ఎరువు, కంపోస్ట్, వర్మీకంపోస్ట్, గ్రీన్ మెన్యూర్, బయోచార్ వంటి సేంద్రియ పదార్థాలు నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచి, నేల సారాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి, మొక్కలకు అవసరమైన పోషకాలను క్రమంగా అందుబాటులోకి తీసుకు వస్తాయి. పంటల మార్పిడి మరో పద్ధతి. ఒకే భూమిలో ఒకేపంటను వరుసగా సాగు చేయకుండా, వివిధ రకాల పంటలను క్రమపద్ధతిలో సాగు చేయాలి. పప్పు ధాన్యాలైన శనగ, పెసర, మినుము, కంది, అలసంద వంటివాటి వేర్లపై ఉండే రైజోబియం అనే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి, మొక్కలు ఉపయోగించుకునే రూపంలో నేలలో స్థిరీకరిస్తాయి.మరీ ముఖ్యంగా పంట అవశే షాలను కాల్చకూడదు. కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పోష కాలు నష్టపోతాయి. పంట అవశేషాలను మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి, కలుపు మొక్కల పెరుగు దల తగ్గుతుంది. అవసరానికి మించి తరచుగా దుక్కి దున్నడం వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతింటుంది. నేలలో నిల్వ ఉన్న సేంద్రియ కార్బన్ వేగంగా విచ్ఛిన్నమైపోతుంది. అతి దుక్కిని నివారించాలి. ‘ఏకైక ఆరోగ్యం’ భావన విజయవంతం కావడంలో రైతు పాత్ర కీలకం. రైతు అనుసరించే వ్యవసాయ పద్ధతులే నేల, మొక్కలు, పశువులు, పర్యావరణం, చివరకు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నేల ఆరోగ్యాన్ని కాపాడటం అనేది రైతు పొలం దిగుబడికే కాదు, సమాజ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు భవిష్యత్ తరాలకు చేసే గొప్ప పెట్టుబడి.– డా‘‘ కె. తేజస్వరరావు, డా‘‘ ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి ‘ సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు -
డ్రాగన్–ఎలిఫెంట్ నృత్యం... వినోద క్రీడేనా?
డ్రాగన్ గాలిలోకి ఎగిరే భీకర జంతువే కాని వాస్తవంగా లేని మిథ్యామృగం. భూగోళంపై అతిపెద్ద బలమైన జంతువైన ఏనుగు మృదుస్వభావి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను డ్రాగన్‌గా, మన భారతీయ ప్రజాస్యామ్య దేశాన్ని ఏనుగుగా పోల్చడం సహజంగా మీడియా చేస్తుంటుంది. ‘టాంగో’ అనేది స్పానిష్ నృత్య సంబంధిత పదం. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో, అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ ఆతిథ్యంలో న్యూఢిల్లీలో జరిగే రెండ్రోజుల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకానుండటం ప్రాధాన్యతసంతరించుకుంది. చివరిదాకా ఆయన పర్యటనపై స్పష్టతనివ్వని చైనా ఎట్టకేలకు 67 మంది సభ్యుల ప్రాతినిధ్య బృందంతో రావడం ఇరుదేశాల సంబంధాల్లో సానుకూలతను సూచిస్తోంది.దగ్గరకు చేర్చిన అమెరికాకమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్దేశించిన సూచనలపై ఇటీవల చైనా 15వ పంచవర్ష ప్రణాళిక (2026–2030)కు శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోని 150 దేశాలు, ప్రాంతాలతో వాణిజ్య భాగస్వామ్యం కలిగిన చైనా, ప్రపంచ ద్వితీయ భారీ ఆర్థిక వ్యవస్థగా అమెరికాకు సవాలు విసురుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత్ దిగుమతులపై ఆగస్ట్ 2025 నుంచి అదనంగా 25 శాతం ట్యారిఫ్ విధింపు ప్రభావం, భారత్ – చైనాల మధ్య వాణిజ్య సయోధ్యకు దారి తీసింది. 2025 ఆగస్ట్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిఇండియా రాక సందర్భంలో అయిదు సంవత్సరాల క్రితం ఆగి పోయిన బోర్టర్ ట్రేడ్ ఇటీవలే మళ్ళీ ప్రారంభమైంది. భారత్, చైనా ఆర్థిక వాణిజ్య బాంధవ్యం రెండు దేశాల 280 కోట్ల జనావళి దృష్ట్యా పటిష్ట మవుతున్నాయి. భారత్–చైనా మధ్య సుదీర్ఘ కాలం నుంచి అత్యంత క్లిష్టమైన భౌగోళిక సరిహద్దు వివాదా లున్నప్పటికీ, వాటిని పక్కకు పెట్టి, వరస్పర ప్రయోజనాల దృష్ట్యా, ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసుకొనే సత్కృషి ప్రారంభమైంది. 2017లో భారత్ అధికార యుతంగా షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)లో చేరింది. 2024 నాటికి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అర్థిక సర్వేలోనూ, నీతి ఆయోగ్ నివేదికలోనూ చైనా పెట్టుబడులను దేశంలోకి ఆహ్వానించాలనే సానుకూల ప్రతిపాదన లున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, మన విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో 2025 అగస్టు 18న జరిపిన న్యూఢిల్లీ సమావేశం కొత్త వాకిళ్ళు తెరిచింది. దానికి తోడు రెండు దేశాల మధ్య 2021 నాటి 125.6 బిలియన్ యూఎస్ డాలర్ల వాణిజ్యం, 2024 నాటికి 138.5కు పెరిగింది.షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) బిష్కెక్ శిఖరాగ్ర సమావేశం; యూఎస్, ఇజ్రాయిల్‌లు అంతర్జాతీయ చట్టం, యూఎన్ ఛార్టర్ ప్రాథమిక సూత్ర నియమావళిని ఉల్లంఘించే దుర్నీతిని దుయ్యపట్టడం భారత్, చైనాల సయోధ్యను మరింత బలపరిచాయి. ట్రంప్ శిక్షగా విధించే సుంకాలు, అస్థిర వైఖరి కారణంగా భారత్ యిప్పటికే చైనాతో చేతులు కలుపుతోంది.సంబంధాల్లో ముల్లుకానీ పాకిస్తాన్ పట్ల చైనా అనుకూల వైఖరి భారత్‌కు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతోంది. ఉగ్ర, వేర్పాటు, తీవ్రవాదాలుసృష్టిస్తున్న యుద్ధ ప్రజ్వలనంలో భాగస్వామ్యమైన పాకిస్తాన్‌ను చైనా వెనకేసుకు రావటం, పైగా పాకిస్తాన్ ఛైర్‌గా రానున్న ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి వేదిక కావటం, భారత్‌కు మింగుడుపడని సమస్య అవుతోంది. దానికి తోడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా స్టేట్ కౌన్సిల్‌కు చెందిన సెంట్రల్ కమిటీ, ‘యూనియన్ టెర్రిటరీ ఆఫ్ లదాఖ్’లో వున్న నిర్దిష్ట జిల్లాలను హియాన్, హికాంగ్ పేర్లతో రెండు కొత్త కౌంటీలుగా ప్రకటించడానికి అనుమతించింది. అదీగాక టిబెట్‌లో పుట్టిన బ్రహ్మపుత్ర నదిని అక్కడ యార్లుంగ్ సాంగ్పో అంటారు. అరుణాచలప్రదేశ్‌లోని మనదేశ సరిహద్దుల సమీపంలో మిడాన్ ప్రాంతంలో కొండవాగు కనుమలలో చైనా నిర్మించనున్న సూపర్ జలవిద్యుత్ కేంద్రం వల్ల ప్రవాహం దిగువలో ఉన్న ఇండియా, బంగ్లాదేశ్‌లకు బ్రహ్మపుత్ర నదీ జలాల వినియోగానికి అవరోధమని భారత్ హెచ్చరిస్తున్నా చైనా పట్టించు కోవడం లేదు. 70 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించే లక్ష్యంగా ఈ ‘ప్రాజెక్ట్ ఆఫ్ ద సెంచరీ’ని చైనా ప్రభుత్వం ప్రస్తుత 2026 నుంచి ప్రారంభించనున్న 15వ పంచవర్ష ప్రణాళికలో చేర్చింది. గతేడాది జూలైలో ఈ భారీ విద్యుత్ పునరుత్పాదన కేంద్రాన్ని ప్రాధాన్యతా పరంగా కమ్యూ నిస్ట్ చైనా రెండవ అగ్రశ్రేణి నేత, ప్రధాని లిక్వియంగ్ టిబెట్‌లోని నియింగ్చి వద్ద ప్రారంభించారు. 1.2 ట్రిలియన్ యువాన్లతో (సుమారు రూ. 14 లక్షల కోట్లు) అయిదు పవర్ స్టేషన్ల నిర్మాణం జరగనుంది. జంగ్ము వద్ద చైనా ఇప్పటికే భారీ జలాశయం నిర్మించింది. ఇండియా–చైనాల మధ్య ట్రాన్స్ బోర్టర్ నదీ జలాలపై నిపుణుల స్థాయి సమావేశం జరగవలసి ఉంది.పర్యావరణ విధ్వంసం కారణంగా హిమాలయాల మహోన్నత శిఖరాల నుంచి ప్రకృతి ప్రళయాలు అనుభవిస్తూనే ఉన్నాం. జల విద్యుత్ ఉత్పాదన కోసం నిర్మిస్తున్న జలాశయాలు ప్రవాహ అవరో ధాలకు కారణం అవుతున్నాయి. ప్రకృతి కన్నెర్ర చేస్తున్నా, నేపాల్ చైనా సరిహద్దులలో ఈ మానవ విధ్వంసం ఆగేటట్టు లేదు. ప్రపంచ అగ్రరాజ్యాలలో ప్రప్రథమ స్థానాన్ని పొందాలనే కమ్యూనిస్ట్ చైనా డ్రాగన్ విజృంభిస్తోంది. ప్రస్తుతం ట్రంప్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలక్రిందులు చేస్తున్న ఈ తరుణంలో ‘డ్రాగన్ – ఎలిఫెంట్టాంగో’... వినోదం అవుతుందా? రణక్రీడ కానుందా?-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్-జయసూర్య -
ట్రాన్స్‌జెండర్స్ సమాజంలో భాగమే!
ఇటీవలి కాలంలో గృహప్రవేశాలు, తదితర శుభ కార్యాల సమయంలో కొందరు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు వచ్చి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు సామాజిక మాధ్య మాల్లో ఫిర్యాదులు వస్తున్నాయి. దౌర్జన్యంగా డబ్బు వసూలు చేయడాన్ని ఎవరూ సమర్థించరు. అయితే, శతాబ్దాలుగా సమాజం వారిని ఎంతలా అట్టడుగుకు నెట్టేసిందో, వ్యవస్థాపరంగా వారు ఎంతటి దోపిడీకి గురయ్యారో కూడా మనం అర్థం చేసుకోవాలి.ఒక మనిషి ట్రాన్స్‌జెండర్ అని బయటపెట్టిన మరుక్షణం నుంచే అన్ని అవకాశాలు మూసేసి సమాజం వారిని చీదరించుకోవడం పెద్ద విషాదం. ఆశ్రయం కోల్పోయిన వారి కోసం భారత ప్రభుత్వ ‘స్మైల్’ పథకం కింద ‘గరిమా గృహ్’ ఆశ్రమాలు అరకొరగా పని చేస్తున్నాయి. విద్య, ఉద్యోగం, ఆరోగ్య సంరక్షణ, నివాసం వంటి విషయాల్లో వారిపై ఎలాంటి వివక్ష చూపకూడదని ‘ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం–2019’ స్పష్టంగా చెబుతోంది. ఎవరైనా వారిని ఇంటి నుంచి గెంటేసినా, బహిరంగ ప్రదే శాల్లోకి రాకుండా అడ్డుకున్నా... చట్టం ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.ట్రాన్స్‌జెండర్స్ జీవితాల్లో అత్యంత దయనీయమైన అంశం వైద్య సదుపాయాల కొరత. హార్మోన్ థెరపీ, లింగ మార్పిడి శస్త్రచికిత్సల కోసం వారు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేక, ప్రైవేట్ ఆసు పత్రుల్లో ఖర్చులు భరించలేక, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దేశంలోనే తొలి సారిగా 2008లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిన ఘనత తమిళనాడుది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లింగ మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా, సురక్షితంగా అందిస్తూ వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వ విద్యా లయాల్లో చదివే ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు ఫీజు మాఫీ చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ‘పృత్తికా యాషిని’ దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కాగలిగారు.మరోవైపు, దేశంలోనే తొలిసారిగా ఒక సమగ్రమైన రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ పాలసీని తీసు కువచ్చిన కేరళ ‘సమన్వయ’ పథకంతో నిరంతర విద్య, ‘సాకల్యం’ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ, ఉచిత లింగ మార్పిడి శస్త్రచికిత్సలకు ఆర్థిక సాయం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. కర్ణాటక... ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని సామాజిక వర్గాల్లోనూ ట్రాన్స్‌జెండర్స్‌కు 1 శాతం రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణలో కొందరిని ట్రాఫిక్ సిబ్బందిగా నియమించడం, జూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇవ్వడం వంటి సాను కూల అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్... పెన్షన్ పథకం కూడా అమలు చేస్తోంది. అయితే ఇతర దక్షిణ భారత రాష్ట్రాలతో పోలిస్తే మరింత ప్రగతి సాధించాల్సి ఉంది.పిలుపులోనే గౌరవం ఉంటుంది కాబట్టి, తమిళనాడులో ట్రాన్స్‌జెండర్‌ను ‘తిరునర్’ అనీ, ట్రాన్స్ స్త్రీని ‘తిరునంగై’ అనీ, ట్రాన్స్ పురుషులను ‘తిరునంబి’ అనీ అంటున్నారు. తెలుగులోనూ అలాంటి గౌరవ సంబోధనలను వాడుకలోకి తేవాల్సిన అవసరం ఉంది.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకుడు -
దైవాన్ని ప్రేమించాలంటే.. ముందు మనిషిని ప్రేమించాలా?
సృష్టికర్త దృష్టిలో మనుషులందరూ ఒకే కుటుంబం. జాతి, వర్ణం, భాష, దేశం, సంపద అనే భేదాలు మనుషులు నిర్మించుకున్న కృత్రిమ గోడలే తప్ప గొప్పతనానికి కొలమానాలు కావు. నిజమైన శ్రేష్ఠత కేవలం సత్ప్రవర్తన, దైవభీతి, పరోపకారంలోనే ఉంది. దివ్య బోధనల్లో ద్వేషానికి తావులేదు, ప్రేమ ఉంది; అహంకారానికి ఆస్కారం లేదు, వినయం ఉంది. ఈ ఉదాత్తమైన సూత్రాలే ధార్మిక మానవతా దృక్పథానికి మూలస్తంభాలు.ఈ మానవీయ దృక్పథానికి శిఖరాగ్రం ఏమిటంటే, ఒక నిరపరాధి ప్రాణాన్ని కాపాడటం సమస్త మానవాళిని రక్షించడంతో సమానమని చాటిచెప్పడమే. ధర్మం మనుషుల మధ్య గోడలు కట్టదు, హృదయాలను కలుపుతుంది. దేవుని ప్రేమను కోరుకునే హృదయమేదైనా మొదట సృష్టిని ప్రేమించడం నేర్చుకోవాలి. మానవత్వం లేని మతం ఊపిరి లేని శరీరమైతే, నైతిక మూల్యాలతో వికసించిన మానవత్వమే ఈ భూమిపై దైవకరుణకు సజీవ సాక్ష్యం.ఈ సత్యం ఆచరణలోకి వచ్చినప్పుడే ఆధ్యాత్మికతకు పరిపూర్ణత్వం చేకూరుతుంది. అందుకే ధర్మం అంటే కేవలం ఆచారాలు, ప్రార్థనలకే పరిమితం కాదు; అది మనిషిలోని మానవత్వాన్ని మేల్కొలిపే జీవన విధానం. నిజమైన ధార్మికత మనిషిని కేవలం ఆరాధనలకే పరిమితం చేయదు; ఆకలితో ఉన్న వారిని, అనాథలను, బలహీనులను ఆడుకునేలా తీర్చిదిద్దుతుంది. స్వార్థానికి అతీతంగా, చివరకు తమకు వ్యతిరేకమైనా సరే న్యాయం వైపే నిలబడే సత్యసంధతను నూరిపోస్తుంది.– ఎం.డి. ఉస్మాన్ ఖాన్ -
మక్కా కూటమిని ఎలా చూడాలి?
పాకిస్తాన్ చొరవతో పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా సభ్యులుగా గత నెలలో మక్కాలో ఒక కొత్త సైనిక కూటమికి అంకురార్పణ జరిగింది. ఈ కూటమిని ‘ఇస్లామిక్ నాటో’ అని కూడా అభివర్ణిస్తు న్నారు. నెల తిరగకుండానే, ఈ నెల మొదటి తారీఖున మళ్లీ ఈ మూడు దేశాల రక్షణ మంత్రులు, సైన్యాధ్యక్షులు సమావే శమై కూటమి సెక్రటేరియట్, విధివిధా నాల మీద చర్చించారు. ఉమ్మడి భద్రత లక్ష్యంగా ఏర్పడిన ఈ సైనిక కూటమిని నాటో తరహాలో రూపొందించటానికి ప్రయత్నం జరుగుతున్నది. నాటో కూటమి ఒప్పందం ఆర్టికల్ ‘5’ ప్రకారం, కూటమి ఏ ఒక్క సభ్య దేశంపైన దాడి జరిగినా దాన్ని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించి సైనిక కూటమి తన పూర్తి శక్తితో ప్రతిస్పందిస్తుంది. మక్కా ఒప్పందంలో కూడా ఈ తరహా క్లాజును పొందుపరచటం విశేషం. కారణాలేమిటి?స్థూలంగా పరిశీలిస్తే ఈ కూటమి ఏర్పాటుకు ఇరాన్ యుద్ధంలో సౌదీ, కువైట్, బెహ్రయిన్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడుల వలన జరిగిన నష్టం ప్రథమ కారణంగా కన్పడు తున్నది. పర్షియా సింధు శాఖలోని రియాద్, ఫుజేరా, కువైట్, దుబాయ్ వంటి నగరాలు; చమురు శుద్ధి కేంద్రాలు, డీసాలినేషన్ ప్లాంట్లు ఇరాన్ మిస్సైల్స్, డ్రోనుల దాడి నుండి తప్పించుకోలేక పోయాయి. సౌదీ, యూఏఈ, బెహ్రయిన్ దేశాలలోని నాటో సైనిక స్థావరాలు కూడా దెబ్బతిన్నాయి. యూఎస్ఏ ఏర్పాటు చేసిన మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలు ఈ దేశాలకు పూర్తి రక్షణను కల్పించ లేకపోయాయి. అమెరికన్ సైనిక స్థావరాలుండటమే, ఈ దేశాలపై ఇరాన్ దాడి చేయటానికి కారణం. యుద్ధం ఇరాన్–అమెరికా/ ఇజ్రా యెల్ మధ్య జరుగుతున్నప్పటికీ, గల్ఫ్ దేశాలు అడకత్తెరలో పోక చెక్కలా చిక్కుకుపోయాయి. ఇరాన్‌ను నేరుగా ఎదుర్కొనే సైనికశక్తి ఈ దేశాలకు లేదు. అమెరికన్ భద్రతా గొడుగు నుండి బయటకు వచ్చి స్వతంత్రంగా తమకొక ప్రత్యేక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటానికి జరుగుతున్న ప్రయత్నంగా ఇది కనబడుతోంది. అయితే సౌదీపై హౌతీల దాడులు జరిగినప్పటికీ ఆర్టికల్ 5ని ఆచరణలోకి తేలేదు. అది అంత సులభం కాదు.ఈ కూటమి కేవలం అమెరికన్ నాయకత్వంలోని నాటోకు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ప్రాంతీయ కూటమి కాకపోవచ్చు. పాకిస్తాన్, టర్కీ పర్షియా సింధు శాఖలోని దేశాలు కాదు. ఈ మూడు దేశాలు సున్నీ ముస్లిమ్ దేశాలు. ఇరాన్, ఇరాక్ షియా ముస్లిం దేశాలు. పర్షియా సింధుశాఖలోని యూఏఈ ఈ కూటమిలో ప్రస్తుతానికి లేదు. సౌదీ, యూఏఈలకు వ్యూహాత్మక లక్ష్యాలలో వైరుధ్యం ఉన్నది. ఈ రెండు దేశాలు యెమెన్‌లో రెండు సైనిక గ్రూపులను సమర్థిస్తున్నాయి. పాలస్తీనా సమస్యలో ఈ రెండు దేశాల వైఖరిలో అంతరమున్నది. యూఏఈ అబ్రహాం ఒప్పందంపై సంతకం చేసి ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవ టానికి మొగ్గు చూపుతున్నది. సౌదీ అరేబియా సంతకాలకు నిరాక రిస్తున్నది. ఈ మూడూ అమెరికాకు నమ్మకమయిన స్నేహితులు.ఉమ్మడి శత్రువు లేని కూటమిపాకిస్తాన్కు సుశిక్షితమైన విస్తృత సైనిక బలగం ఉన్నది. ఇప్ప టికే పాక్ సైనికులు సౌదీలో విధులు నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్‌కు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నది. గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ అణ్వస్త్ర ముప్పును ఎదుర్కోవటానికి అణ్వస్త్రాల సహాయం అవసరం. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగానే అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్‌లు ఇరాన్‌పై దాడికి అణుబూచినే ముందు ఉంచుతున్నారు. టర్కీ వద్ద సైనిక విమానాలు, డ్రోన్లు, మందుగుండు సామగ్రి తయారీ సామర్థ్యం విస్తృతంగా ఉన్నది. నాటో సభ్యదేశం కావటంతో ఆధునిక యుద్ధ రీతులు, యుద్ధతంత్రాలు టర్కీకి సుపరిచితం. సౌదీ అరేబియా వద్ద పుష్కలంగా పెట్టుబడి సామర్థ్యం ఉన్నది. కీలకమైన చమురు, సహజ వాయువు నిల్వలున్నాయి. ఈ మూడు దేశాలు చేతులు కలపటంతో బలమైన సైనిక శక్తి ఆవిర్భవించే అవకాశమున్నది.అయితే, లక్ష్యాలపరంగా కూటమిలోని మూడు దేశాల మధ్య వైరుధ్యం స్పష్టంగా కనబడుతోంది. సైనిక కూటములకు సహజంగా ఉమ్మడి శత్రువులుంటారు. ఉదాహరణకు నాటో కూటమికి బద్ధ శత్రువు పూర్వపు సోవియట్ యూనియన్, తరువాత రష్యా. కానీ మక్కా కూటమిలోని సౌదీ అరేబియాకు ఇరాన్, ఇజ్రాయెల్ ప్రథమ శత్రువులు. సౌదీ దృష్టంతా పర్షియా సింధుశాఖ, ఎర్ర సముద్రాల పైన ఉంటుంది. టర్కీకి ఇజ్రాయెల్ ప్రధాన శత్రువు. టర్కీ తన శక్తియుక్తులను తూర్పు మద్యధరా సముద్రం, సిరియా, జోర్డాన్, లెబనాన్లపైన కేంద్రీకరిస్తుంది. పాక్‌కు మధ్యప్రాచ్యంలో ప్రత్యేకంగా శత్రువులెవరూ లేరు. ఇరాన్‌తో కూడా మిత్రత్వ వైఖరినే అవలంబిస్తుంది. ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించినప్పటికీ, శత్రువుగా చూడదు. పాకిస్తాన్‌కు భారతదేశమే లక్ష్యం, శత్రువు. కచ్చితమైన ఉమ్మడి శత్రువు లేకపోవటం కూటమికి పెద్ద బలహీనత.భారత్‌కు సవాలుఅమెరికన్ భద్రతా ఛత్రానికి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయంగా గల్ఫ్ దేశాలు తమకంటూ ప్రత్యేకంగా ఒక సైనిక కూటమిని ఏర్పరచుకోవటం స్వాగతించదగినదే. కానీ పర్షియన్ సింధుశాఖ ప్రాంతానికి సంబంధం లేని ప్రాంతీయేతర శక్తులు ఇరాన్‌కు వ్యతి రేకంగా సైనిక కూటమిని ఏర్పాటు చేయటం, దానికి పాకిస్తాన్, టర్కీ పునాదిరాళ్లు కావటం భారత్ ప్రయోజనాలకు ప్రమాదకరం. ఇటీవలి ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్–టర్కీ రెండూ జతకట్టి భారత్‌పై దాడి చేశాయి. టర్కీ ఐక్యరాజ్యసమితిలో పలుమార్లు కశ్మీర్ విషయంలో భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది. ఆప రేషన్ సిందూర్‌లో పాక్‌కు పెద్ద మొత్తంలో డ్రోన్లను, మొబైల్ కమాండ్ సెంటర్లను, కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని సమకూర్చింది.మక్కా కూటమి మత ప్రాతిపదికన ఏర్పడటం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఈ కూటమిని ఇస్లామిక్ నాటో లేదా సున్నీ నాటోగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. మతఛాందస ఇస్లా మిక్ టెర్రరిజం భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద భద్రతా ప్రమాదం. కానీ ఈ సైనిక కూటమిని అమెరికా సమర్థించటం కొసమెరుపు. ఇటీవల జరిగిన కూటమి సమావేశంలో కూటమిని విస్తరించ టానికి సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈజిప్ట్, ఖతార్, బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరటానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా వార్త లొస్తున్నాయి. బంగ్లాదేశ్ ఈ కూటమిలో చేరటం సమస్యను మరింత జటిలం చేస్తుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ నూతన ప్రభుత్వం పాక్, చైనాలకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేసింది. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌదీ, టర్కీలు భారత్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపే దుశ్శకునాలు కన్పడుతున్నాయి. జియోపాలిటిక్స్‌లో ఏదైనా జరగ వచ్చు. ఈ నేపథ్యంలో భారత్ ఈ కూటమి అడుగులను నిశితంగా పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఈ కూటమికి ప్రతిగా భారత్ చొరవ తీసుకొని యూఏఈ, ఇజ్రాయెల్, జపాన్‌లతో చేయికలిపి ప్రత్యామ్నాయ ఏర్పాటుకు ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఇరవై ట్రిలియన్ల వ్యవస్థ కాగలమా?
ఇటీవలి ఈక్విరస్ ‘వృద్ధి విధాన నివేదిక’ 2036 నాటికి 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందాలంటే నామినల్ రూపాయి వృద్ధి 14.2 శాతంగానూ, సాంవత్సరిక రూపాయి అప్రిషియేషన్ 3–3.6 శాతం అవసరమనీ పేర్కొనడం చర్చనీయాంశంగా నిలిచింది. రాబోవు పదేళ్ల కాలంలో జీడీపీలో 5 రెట్లు పెరుగు దల ఉండాలంటే, దానికి అవసరమైన సగటు వార్షిక డాలర్ – ఆధారిత నామినల్ జీడీపీ వృద్ధిని 15.9 శాతంగా నివేదిక అంచనా వేసింది. వివిధ రంగాలలో ఉత్పాదకత వృద్ధి తక్కువగా ఉండటం, స్థూల స్థిర మూలధన కల్పన జీడీపీలో 30 శాతానికి పరిమితం కావడం, సంఘటిత రంగంలో ఉపాధి తక్కువగా ఉండటం, ఇంధన ధరలలో పెరుగుదల కారణంగా అధిక ద్రవ్యోల్బణం, మానవాభివృద్ధిపై పెట్టుబడులు తక్కువగా ఉండటం, ద్రవ్యలోటు పెరుగుదల, సామర్థ్యానికి తగినట్లు ఎగుమతు లలో వృద్ధి లేకపోవడం లాంటి అంశాలు నామినల్ జీడీపీ వృద్ధిలో అనూహ్య పెరుగుదలకు అవరోధాలుగా నిలిచే అవకాశం ఉంది. భారత్ వాస్తవిక జీడీపీ వృద్ధిని 2026–27లో 6.3 శాతంగా, 2027–28లో 6.4 శాతంగా ఓఈసీడీ అంచనా వేస్తుండగా, ప్రపంచ బ్యాంకు 6.6 శాతంగా అంచనా వేసింది. నామినల్ వార్షిక జీడీపీ వృద్ధిని 15.9 శాతంగా రాబోవు పది సంవత్సరాల కాలంలో నిర్వ హించాలంటే సాంప్రదాయ కోశ విధానం, విత్త మద్దతుతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు అవసరం. అభివృద్ధి దేశాల వృద్ధి నమూనాప్రస్తుతం భారత్ జీడీపీ 3.96 ట్రిలియన్ డాలర్లు కాగా 2036 నాటికి 20 ట్రిలియన్ డాలర్లకు చేరుకొనే క్రమంలో ప్రపంచంలో అధిక ఆదాయ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా రూపొంద డానికి ఎంత సమయం తీసుకున్నాయి, ఏ అభివృద్ధి వ్యూహాలను అవలంభించాయో పరిశీలించాలి. అధిక ఆదాయ దేశాలుగా రూపొందడానికి అమెరికాకు (వందకు మించిన సంవత్సరాలు), యూకే (100 సం‘‘లు), జర్మనీ (50–100 సం‘‘లు), జపాన్ (50–100 సం‘‘లు), కెనడా (75–100 సం‘‘లు), దక్షిణ కొరియా (30–40 సం‘‘లు) సమయం తీసుకోగా, ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం ఎగువ మధ్య ఆదాయ దేశమైన చైనాలో 1978 తర్వాతి కాలంలో వృద్ధి వేగవంతమై 2026 నాటికి ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 20.85 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. చైనా, దక్షిణ కొరియాతో పోల్చినప్పుడు అధిక ఆదాయ దేశంగా రూపొందడానికి అమెరికా అధిక సమయం తీసుకొంది. అతిపెద్ద ఏకీకృత స్వదేశీ మార్కెట్, ప్రైవేటును ప్రోత్సహించడం, మౌలిక సౌకర్యాలపై అధిక పెట్టుబడులు, పటిష్టమైన మూలధన మార్కెట్, ప్రఖ్యాత విద్య, పరిశోధనా సంస్థలు, సాంకేతిక నవకల్ప నలు అమెరికాకు సానుకూలంగా పనిచేశాయి. మొదటి పారిశ్రామిక విప్లవం వలన బ్రిటన్; భారీ పరిశ్రమలు, రసాయనాలు, మెషినరీ, తయారీ రంగం అభివృద్ధి కారణంగా జర్మనీ; పారిశ్రామికీకరణ, ఎగుమతులు, సాంకేతికత కారణంగా జపాన్; ఎగుమతులపై దృష్టి కేంద్రీకరించి తయారీ రంగ అభివృద్ధి, విద్య, పారిశ్రామిక విధానం ద్వారా దక్షిణ కొరియా అధిక ఆదాయ దేశాలుగా రూపొందాయి.వివిధ రంగాలలో ఏం మారాలి?20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందాలంటే వ్యవసాయం, తయారీ, సేవలు, శక్తి, మానవ మూలధనం, సాంకే తిక రంగాలలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలు అవ సరం. ఐఎంఎఫ్ అభిప్రాయంలో భారత్ ఉత్పాదకత పెంపు, నైపు ణ్యత, శ్రామిక మార్కెట్ సరళత, నియంత్రణల సడలింపు, వాణిజ్యం అనుసంధానంపై దృష్టి సారించాలి. పట్టణీకరణ వేగవంతమవుతున్న కారణంగా ప్రస్తుతం జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 17 శాతం నుండి రాబోవు కాలంలో తగ్గే సూచనలున్నాయి. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపు, సప్లయ్ చెయిన్‌ను మెరుగుపరచడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని విస్తరణ, నిల్వ సౌకర్యం, లాజిస్టిక్స్ అభివృద్ధికి చర్యలు అవసరం. నశ్వర ఉత్పత్తులైన పండ్లు, కూరగాయల మొత్తం ఉత్పత్తిలో 4 శాతంకు మాత్రమే రిఫ్రిజిరేటెడ్ రవాణా సౌకర్యం ఉంది. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు సంబంధించి పది సంవత్సరాల పన్ను విరామాన్ని ప్రకటించాలి. తయారీ రంగంలో అతిపెద్ద నిర్మాణాత్మక మార్పులు అవసరం. జీడీపీలో తయారీ రంగం వాటా ప్రస్తుతం 12.9 శాతం కాగా 2035 నాటికి 25 శాతానికి పెంచాలని జాతీయ తయారీ విధానం లక్ష్యంగా తీసుకుంది. తయారీ రంగంలో చిన్న సంస్థలు, పెద్ద సంస్థ లుగా మారే క్రమంలో చెప్పుకోదగిన ప్రగతి లేదు. ఆగస్ట్ 2026 నాటికి భారత ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఉద్యమ్ పోర్టల్‌లో సూక్ష్మ సంస్థలు (9.24 కోట్లు), చిన్న సంస్థలు (5.42 లక్షలు), మధ్య తరహా సంస్థలు (41,775) నమోదయ్యాయి. సంస్థలు చిన్న స్థాయిలో ఉంటే నైపుణ్యత కల్గిన శ్రామికుల లభ్యత, సంస్థాపరమైన పరపతి, సప్లయ్ చెయిన్‌కు అనుసంధానపరచడం, సాంకేతికత లభ్యత క్లిష్టతరమవుతుంది. సక్రమంగా నడుస్తున్న చిన్న సంస్థలకు ఈక్విటీ మార్కెట్లో ప్రవేశం కల్పించి పెద్ద మొత్తంలో నిధులు సేకరించుకొనే అవకాశం కల్పించాలి. కార్పొరేట్ బాండ్లను జారీ చేసే స్వేచ్ఛను కంపెనీలకు ఇవ్వాలి. జీడీపీలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ విలువ భారత్‌లో 15–16 శాతం కాగా, చైనాలో 38 శాతం, మలేషి యాలో 54 శాతం, దక్షిణ కొరియాలో 79 శాతం. అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలి. జీసీసీలు అధిక విలువ కల్గిన కార్య కలాపాలను నిర్వహిస్తున్నందువలన, ఈ రంగాన్ని విస్తరిస్తే భారత్ జీడీపీలో పెరుగుదల ఏర్పడుతుంది. ఉత్పాదక శ్రామికులుగా మార్చాలి!భారత్‌లో తాత్కాలిక కార్మికులు 2029–30 నాటికి 2.35 కోట్లుగా ఉండగలరని అంచనా. ప్రత్యేకమైన శ్రామిక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం ద్వారా శ్రామిక వివాదాలను పరిష్కరించాలి. 2036 నాటికి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 70 శాతం, మొత్తం శ్రామిక శక్తిలో మహిళల వాటా 50 శాతం, సంఘటిత రంగంలో ఉపాధి విస్తరణ, అప్రెంటిషిప్స్ ఏడాదికి కోటికి పైగా ఉండేలా తగిన విధానాలను రూపొందించుకోవాలి. పనిచేసే వయో వర్గ జనాభాను అధిక వేతనంతో కూడిన ఉత్పాదక శ్రామికులుగా మార్చడం శ్రామిక మార్కెట్ సంస్కరణలలో కేంద్ర బిందువుగా ఉండాలి. దేశంలో 37 కోట్లకు పైగా ఉన్న యువతకు వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశోధన, అభివృద్ధి వ్యయం జీడీపీలో 0.6–0.7 శాతంగా ఉండటం వలన ఉత్పాదకత పెంపు, సాంకేతిక ఆధారిత అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నందువలన ఈ వ్యయాన్ని పెంచాలి. భారత్ అంతర్జాతీయ కంపెనీలకు తక్కువ వ్యయంతో సేవలను అందించేకన్నా ‘ప్రపంచ నవకల్పన, అధిక విలువతో కూడిన సేవల హబ్’గా రూపొందాలి. డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు -
వాక్పతి: వ్యాసుని మహాభారత రచనలో గణపతి మహిమ!
‘తొండము నేకదంతము’... ప్రార్థనా పద్యంలో ‘విద్యల కెల్ల నొజ్జయై’ అని వాక్కుల కధిపతిగా, విద్యా బుద్ధుల ప్రదాతగా వినాయకుని కీర్తించటం ఉంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని చెపుతుండగా గణపతి రాశాడని చెబుతారు.అంటే గణపతి వ్యాసుని ఎదురుగా కూర్చుని రాస్తూవుంటే... వ్యాసుడు ఆశువుగా చెబుతున్నాడని పైకి తోచే అర్థం. కాని, వ్యాసుడు ఏకాక్షర గణపతిని ఉపాసించి సర్వ విద్యల సారం గ్రహించి, సమస్త ఛందస్సులలోని భాషా చాతుర్యమంతా అవగతం చేసుకుని మహాభారతాన్ని రచించాడని ఇందులోని అంతరార్థం అని గణేశ పురాణం చెబుతుంది. వ్యాసుడు మహా భారతం, మహా భాగవతాలనే కాక అష్టాదశ పురాణాలను, అష్టాదశ ఉప పురాణాలను కూడా రచించాడు. ఆ ఉప పురాణాలలో ఒకటి గణేశ పురాణం.రచన ధారళంగా సాగాలన్నా, భాషాదోషాలు లేకుండా, ఎక్కడా కుంటుపడకుండా భాష ప్రవహించాలన్నా, మంచి ఆలోచనలు రావాలన్నా గణపతి పూజ అవశ్యం అని పెద్దల మాట. అలనాటి వ్యాసుని నుంచి నేటి పండిత శ్రేష్ఠుల వరకు అందరికీ గణపతి ఆరాధ్య దైవం, వాక్పతి. విద్యాదాత.దేవతలు కూడా విధిగా పూజించవలసిన దైవం గణపతి. దేవతలు క్షీర సాగర మథనాన్ని గణపతి పూజ చేయకుండా ప్రారంభించటం వల్లనే మధ్యలో విఘ్నం కలిగిందనీ, అప్పుడు స్వయంగా మహా విష్ణువే దేవతలచేత గణపతి పూజ చేయించటం వల్ల ఆ కార్యం నిర్విఘ్నంగా జరిగిందనీ గణేశ పురాణం తెలియజేస్తోంది.– డా. చెంగల్వ రామలక్ష్మిఇవి కూడా చదవండి: హిమధీర -
రూపాయి అంతర్జాతీయీకరణ దిశగా...
హిందూ మహాసముద్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ద్వీపదేశం మాల్దీవుల్లో జూలై 30న ప్రారంభమైన ఒక కొత్త చెల్లింపు సదుపాయం, భారత రూపాయి అంతర్జాతీయీకరణ దిశగా జరిగిన మరో చిరు ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. మాల్దీవుల మానిటరీ అథారిటీ నిర్వహించే తక్షణ చెల్లింపుల వ్యవస్థ ‘ఫవారా’ను భారతదేశపు యూపీఐతో అనుసంధానించారు. తొలిదశలో మాల్దీవుల్లోని బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్, మాల్దీవ్స్ ఇస్లామిక్ బ్యాంక్ ఖాతాదారులకు భారత్‌లోని యూపీఐ అనుసంధాన ఖాతాలకు నేరుగా డబ్బు పంపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మాల్దీవుల రుఫియాలో ప్రారంభించిన లావాదేవీ భారత్‌లోని ఖాతాలో రూపాయల్లో జమ అవ్వడంతో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ సదుపాయం మాల్దీవుల నుంచి భారత్‌కు జరిగే వ్యక్తిగత బదిలీలకు మాత్రమే పరిమితమైంది. తదుపరి దశల్లో ద్విముఖ, క్యూఆర్ ఆధారిత వాణిజ్య లావాదేవీలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఎందుకు ప్రాధాన్యత?భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో ముడిపడుతున్న కొద్దీ అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, రెమిటెన్సులు, ఇతర సరిహద్దు లావాదేవీల పరిమాణం పెరుగుతోంది. ఆర్బీఐ అంచనా ప్రకారం, 2023–24లో భారత వస్తు, సేవల వాణిజ్యం, పెట్టు బడులు, రెమిటెన్సులకు సంబంధించిన సరిహద్దు లావాదేవీల విలువ 1.9 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇంత భారీ స్థాయి లావాదేవీల్లో రూపాయి వినియోగం పెరిగిన కొద్దీ, భారతీయ సంస్థలకు మారకపు రిస్క్, లావాదేవీ వ్యయాలను కొంతవరకు తగ్గించుకునే వెసులుబాటు కలుగుతుంది. విదేశీ భారతీయ బ్యాంకుల్లో ‘వోస్ట్రో’ ఖాతాను నిర్వహించుకునే సౌలభ్యం ఎప్పటినుంచో ఉంది. అయితే, అంతర్జాతీయ వాణి జ్యాన్ని రూపాయల్లో ఇన్వాయిస్ చేయడం, చెల్లించడం, సెటిల్ చేసుకోవడం కోసం ఆర్బీఐ 2022 జూలైలో స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్ (ఎస్‌ఆర్‌వీఏ) సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. రూపాయి అంతర్జాతీయీకరణ దిశలో దీనిని కీలకమైన అడుగుగా పేర్కొన వచ్చు. భారత దిగుమతిదారు రూపాయల్లో చెల్లించిన మొత్తం, ఎగుమతిదారు బ్యాంకు భారత్‌లో నిర్వహించే ఎస్ఆర్వీఏలో జమ అవుతుంది. ఆ నిల్వలను భారత ఎగుమతిదారులకు చెల్లింపులతో పాటు, ఆర్బీఐ అనుమతించిన ఇతర లావాదేవీలకు కూడా ఉపయో గించవచ్చు. నిబంధనల మేరకు దేశీయ ప్రాజెక్టులు, ప్రభుత్వ ఋణపత్రాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా ఉంది. ఇది ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ సెటిల్మెంట్ మార్గాలకు అదనం.స్థానిక కరెన్సీల్లో సెటిల్మెంట్లురూపాయి అంతర్జాతీయీకరణ దిశలో మరో అడుగు ద్వైపాక్షిక లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ (ఎల్సీఎస్) వ్యవస్థ. 2023లో భారత్, యూఏఈ రూపాయి–దిర్హామ్‌లో ద్వైపాక్షిక లావాదేవీలను ప్రోత్స హించేందుకు ఎల్సీఎస్ ఒప్పందం చేసుకున్నాయి. ఆ తర్వాత ఇండోనేషియా, మాల్దీవులు, మారిషస్లతోనూ భారత్ ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంది. వీటి ద్వారా ఇరు దేశాలు డాలరు వంటి అంత ర్జాతీయ కరెన్సీపై అతిగా ఆధారపడకుండా, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తమతమ స్థానిక కరెన్సీల్లో ఇన్వాయిస్ చేసి, సెటిల్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.అయితే ఈ విధానంలో ఒక ఆచరణాత్మక సవాలు ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం సమతుల్యంగా లేకపోతే ఒక దేశం వద్ద మరొక దేశ కరెన్సీ నిల్వలు పెరిగిపోవచ్చు. అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి ముడిచమురును రూపాయల్లో కొనుగోలు చేసిన సందర్భంలో ఇరాన్‌కు ఇదే సమస్య ఎదురైంది. అలా పేరుకున్న రూపాయి నిల్వలను భారత్ నుంచి వస్తువులు, సేవలు కొనుగోలు చేయడానికి లేదా అనుమతించిన పెట్టుబడుల్లో వినియోగించుకునే అవకాశాలు కూడా సమృద్ధిగా ఉండాలి. అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగం పరిమితంగా ఉంటే, అలాంటి నిల్వలను వినియోగించుకునే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఇప్పటివరకు రూపాయిలో జరిగే అంతర్జాతీయ వాణిజ్య పరిమాణం, భారతదేశం మొత్తం సరిహద్దు లావాదేవీలతో పోలిస్తే చాలా పరిమితంగానే ఉంది. విధానపరమైన ప్రయత్నాలు ముమ్మరమైనప్పటికీ, అంత ర్జాతీయ వాణిజ్యంలో రూపాయి వినియోగం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్లు ఈ ఒరవడి సూచిస్తోంది.దశాబ్దాలుగా, బెల్జియం కేంద్రంగా ఉన్న స్విఫ్ట్ నెట్వర్క్అంతర్జాతీయ బ్యాంకింగ్‌లో కీలకమైన ఆర్థిక సమాచార మౌలిక వసతిగా ఉంది. బ్యాంకుల మధ్య చెల్లింపు ఆదేశాలను ఈ నెట్వర్క్ సురక్షితంగా చేరవేస్తుంది. అసలు నిధుల బదిలీ మాత్రం కరెస్పాండెంట్ బ్యాంకులు, సంబంధిత చెల్లింపు వ్యవస్థల ద్వారా జరుగు తుంది. లావాదేవీలో పాల్గొనే మధ్యంతర బ్యాంకుల సంఖ్య, కరెన్సీ స్వభావం వంటి అంశాలపై బదిలీకి అయ్యే ఖర్చు, అంతిమ లబ్ధిదారుడికి డబ్బు చేరే సమయం ఆధారపడి ఉంటాయి. దీనికి భిన్నంగా, ఫవారా–యూపీఐ వంటి ఏర్పాట్లలో రెండు దేశాల దేశీయ తక్షణ చెల్లింపు వ్యవస్థలు పరస్పరం నేరుగా అనుసంధా నమవుతాయి. ఫలితంగా ద్వైపాక్షిక చెల్లింపులను వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. ఈ పరిణామం రూపాయి అంతర్జాతీయీకరణకు కూడా తోడ్పడుతుంది. భారత్ ఇప్పటికే సింగపూర్ ‘పేనౌ’తో సహా పలు దేశాల తక్షణ చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధానించింది.2024లో భారత్ ‘ప్రాజెక్ట్ నెక్సస్’లో చేరింది. భారత్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల తక్షణ చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించడం ప్రాజెక్టు లక్ష్యం. ఈ నాలుగు దేశాలతో భారత్ జరిపే లావాదేవీల విలువ... ఆసియాన్ దేశాలు భారత్‌తో జరిపే మొత్తం ప్రవాహాల్లో మూడింట రెండొంతు లకు పైగా ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది.ప్రధాన అవరోధంచెల్లింపుల సదుపాయాలు విస్తరించడం ఒక్కటే రూపాయి అంతర్జాతీయీకరణకు సరిపోదు. విదేశీ సంస్థలు రూపాయి ఆధారిత ఆర్థిక ఆస్తులను సులభంగా కొనుగోలు చేయడానికి, వాటిని నిర్వహించడానికి, అవసరమైనప్పుడు ఇతర కరెన్సీల్లోకి మార్చుకోవడానికి అనువైన లోతైన ఆర్థిక మార్కెట్లు కూడా అవసరం. ఈ ఆస్తులను స్వేచ్ఛగా ఇతర కరెన్సీల్లోకి మార్చుకునే అవకాశం లేకపోతే, రూపాయి ఆస్తులను పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడానికి విదేశీ సంస్థలకు ప్రోత్సాహం తగ్గుతుంది. భారత్‌లో మూలధన ఖాతా ఇంకా పూర్తి పరివర్తనీయంగా లేకపోవడం రూపాయి అంతర్జాతీయీకరణకు ప్రధాన అవరోధాల్లో ఒకటి. అందువల్ల, విదేశీ సంస్థలకు అవసరమైనప్పుడు రూపాయి ఆస్తులను ఇతర కరెన్సీల్లోకి సులభంగా మార్చుకునే స్వేచ్ఛతో పాటు, పూర్తి పరివర్తనీయత కలిగిన రూపాయి, లోతైన ద్రవ్య మార్కెట్లు అవసరం. ఈ దిశగా భారత్ మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నంలో బ్రిక్స్ వేదిక కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించిన వివరాల ప్రకారం, బ్రిక్స్ దేశాలు తమ తక్షణ చెల్లింపు వ్యవస్థలు, కేంద్ర బ్యాంకుల డిజిటల్ కరెన్సీలను పరస్పరం అనుసంధానించే అవకా శాలపై చర్చిస్తున్నాయి. అంతర్జాతీయ చెల్లింపుల వ్యయాన్ని తగ్గించడం ఈ ప్రయత్నం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. రూపాయి అంత ర్జాతీయీకరణ దిశగా ఇప్పటివరకు ఏర్పడిన ప్రతి కొత్త అనుసంధానం ఒక అవకాశాన్ని సృష్టిస్తోంది. మాల్దీవుల ఫవారా–యూపీఐ అనుసంధానం ఆ సుదీర్ఘ ప్రయాణంలో మరో ముందడుగు.కృష్ణ బాలాజి పల్లపోతువ్యాసకర్త విశ్రాంత ఉన్నతాధికారి, ఎస్.బి.ఐ. -
విద్వేషాల లోకంలో వివేకపు మట్టివాసన
ప్రముఖ అమెరికన్ రైతు–తాత్వికుడు, పర్యావరణ ఉద్యమకారుడు వెండెల్ బెర్రీ (92) మరణంతో ప్రపంచం ఒక గొప్ప శాంతి స్వరాన్ని కోల్పోయింది. కెంటకీ రాష్ట్రంలోని హెన్రీ కౌంటీకి చెందిన ఆయన గొప్ప సమగ్ర మానవుడిగా ప్రసిద్ధి గాంచారు. మరణం గురించి ఆయన ఒకసారి ఇలా రాశారు: ‘దీర్ఘాయువు అనే యంత్రాంగం విష యంలో జాగ్రత్త వహించండి. ఒక మనిషి జీవితం ముగిసినప్పుడు, అతను మరణించటమే సరైన పని. అడవి కూడా మరణం నుంచి తనను తాను కాపాడుకోదు’.హెన్రీ కౌంటీలో ఆయన కుటుంబం 200 ఏళ్లకు పైగా వ్యవ సాయం చేస్తోంది. 1934లో వర్జీనియా ఎర్డ్మన్, న్యాయవాది జాన్ మార్షల్ బెర్రీ దంపతులకు జన్మించిన వెండల్ బెర్రీ డజన్ల కొద్దీ పుస్తకాలు రాశారు. భూమిని పరిరక్షించటం, భూమిని నైతికంగా ఉపయోగించవలసిన ఆవశ్యకత గురించి తన కవిత్వంలో, కాల్పని కేతర సాహిత్యంలో నిండుగా రాశారు. ఇంగ్లిష్‌లో మాస్టర్ డిగ్రీ పొందిన బెర్రీ అనేక విశ్వవిద్యాలయాల్లో బోధించారు. అయినా, మట్టిని గాఢంగా ప్రేమించారు. ఆ గాఢతతోనే తన ఉద్యోగ జీవితా నికి స్వస్తి పలుకుతూ న్యూయార్క్ నగరాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా తన సొంత ఊరు వెళ్లిపోయారు. చివరికి అక్కడే మొన్న ఆగస్ట్ 31న కన్నుమూశారు.యుద్ధం–పర్యావరణ విధ్వంసంతన సామానంతటినీ ఒక వోక్స్వ్యాగన్ బీటిల్ కారులో సర్దు కుని, ఇంటికి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆయన ఒక పత్రి కతో ఇలా చెప్పారు: ‘కొంత భయం, వణుకుతో పాటూ సరైన పని చేస్తున్నాననే భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు గొప్ప, గాఢమైన ఉపశమనం కలిగింది. చివరికి నేను నా నిజమైన మార్గాన్ని అనుసరిస్తున్నట్లుగా అనిపించింది’. భూమిని సంరక్షించటం మానవ ప్రాథమిక బాధ్యతల్లో ఒకటని ఆసాంతం ఆయన భావించారు.యుద్ధాలు, వాతావరణ సంక్షోభం చుట్టుముట్టిన నేటి తరుణంలో ఆయన ప్రబోధించిన ‘న్యాయంతో కూడిన శాంతి’ సిద్ధాంతం ఎప్పటికీ ప్రాసంగికమే. ప్రకృతిని గౌరవిస్తూ మమేకమై జీవించటం, స్థానిక సమాజాల తరఫున నిలబడటం ద్వారానే శాశ్వత శాంతి, సామాజిక న్యాయం సాధ్యమని ఆయన తన జీవితం ద్వారా చాటిచెప్పారు.మనిషి ప్రకృతిపై సాగిస్తున్న దాడికి, తోటి మనుషులపై చేస్తున్న యుద్ధాలకు మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని బెర్రీ ఎత్తి చూపారు. ఆయుధాలతో రక్తపాతం సృష్టించటం ఎంతటి హింసో... కార్పొరేట్ అత్యాశతో నేలను, నీటిని, అడవులను కొల్ల గొట్టటం కూడా అంతే తీవ్రమైన హింస అని ఎలుగెత్తారు. ప్రకృతిని దోచుకునే సమాజం తోటి మానవుల పట్ల శాంతియుతంగా ఉండలేదని హెచ్చరించారు. భూమికి జరుగుతున్న అన్యాయం అంతిమంగా మానవాళి వినాశనానికే దారితీస్తుందన్నది ఆయన ఆలోచనల మూలసూత్రం.చదవండి: వందేమాతరం అసలు అర్థం ఇదే!చాలా సందర్భాల్లో శాంతి అంటే కేవలం తుపాకుల మోత ఆగ టమో లేదా రెండు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందమో అనుకుంటారు. కానీ బెర్రీ దృష్టిలో ‘న్యాయం లేని శాంతి’ నిలబడదు. వనరుల అసమాన పంపిణీ, అట్టడుగు వర్గాల ఆర్థిక దోపిడీ, బల హీనులను అణచివేసే వ్యవస్థలు కొనసాగినంత కాలం నిజమైన శాంతి సాధించలేం. యుద్ధ యంత్రాలు, ఆయుధ సంపత్తిని పోగెయ్యటం మాని... ఆకలి నిర్మూలన, నేల పునరుజ్జీవనం, పేదల హక్కుల పరిరక్షణవైపు మళ్లించినప్పుడే శాశ్వత శాంతి నెలకొంటుందనేది ఆయన నిశ్చితాభిప్రాయం.చిన్న రైతుల సేద్యమే...ప్రపంచీకరణ తెచ్చిన విచ్చలవిడి వినియోగ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా ‘స్థానిక సమాజాలు, స్వయంసమృద్ధి’ భావనలను బెర్రీ సమర్థించారు. బహుళజాతి సంస్థల గుత్తాధిపత్య వ్యవసాయం కంటే, స్థానిక నేలను అర్థం చేసుకునే చిన్న రైతుల వ్యవసాయమే భూమిని కాపాడుతుందన్నారు. సమాజాలు స్వయంసమృద్ధిని కోల్పోయి, అపరిమిత లాభాల వెంట పరుగులెత్తినప్పుడే వనరుల కోసం అంతర్జాతీయ యుద్ధాలు పుడతాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థలను, పొరుగు వారితో ప్రేమానుబంధాలను బలోపేతం చేయటమే హింసను అడ్డుకునే మొదటి మార్గం అంటారాయన. అధికారం, యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న నేటి ప్రపంచానికి ఆయన బోధించిన వినయం, ప్రకృతితో సహజీవనం, నైతిక బాధ్యతలే నిజమైన సంజీవని.– పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
దక్షిణ అమెరికాలో కొత్త క్రీడలు
పశ్చిమాసియా, పసిఫిక్, యూరప్, కెనడాలలో తన వ్యూహాలు అనుకున్న విధంగా సాగకపోతుండటంతో యూఎస్ఏ అధ్యక్షుడు ట్రంప్ దృష్టి దక్షిణ అమెరికా వైపు ఎక్కువగా మళ్లుతున్నట్లు కనిపిస్తున్నది. అట్లాగని ఈ దృష్టి లోగడ లేదని కాదు. ఆ ప్రాంతాన్ని వారు శతాబ్దాల క్రితమే తమ జమీందారీగా ప్రకటించి బయటివారెవరూ అటు కన్నెత్తి చూడరాదన్నారు. అటువంటి మన్రో డాక్ట్రిన్ (1828)ను డోన్రో డాక్ట్రిన్ (2026)గా మార్చి ట్రంప్ మరింత తీవ్రతనైతే తెచ్చారుగానీ, పైన అనుకున్న ప్రతికూలతల దృష్ట్యా దక్షిణ అమెరికాపై పట్టును మరింత బిగించటం అవసరమనుకుంటున్నట్లున్నారు.అమెరికా జమీందారీ...పనామా కాలువ ఉదంతం తర్వాత వెనిజులా అధ్యక్షుని అపహరణ తెలిసిందే. అయితే, ఈ రెండు కూడా పైన పేర్కొన్న కొత్త వ్యూహాలకన్న ముందే చోటు చేసుకున్నాయి. కాలువ గురించి ఆయన తాను అధికారానికి వచ్చిన కొత్తలోనే మాట్లాడగా, మదురో అపహరణ తొమ్మిది నెలల క్రితం జనవరిలో జరిగింది. ఆ తర్వాతి కాలంలో ఇదే విధమైన పరిణామాలు మరికొన్ని కనిపిస్తున్నాయి. వాటిలో అన్నింటికన్న ముఖ్యంగా పేర్కొనవలసింది క్యూబా విషయం. అక్కడ ఫిడెల్ కాస్ట్రో నాయకత్వాన 1959లో జరిగింది సాధారణ నియంతృత్వాలపై జరిగే ప్రజాస్వామిక తిరుగుబాటు వంటిది కాదు. అది స్పష్టమైన కమ్యూనిస్టు తిరుగుబాటు. కమ్యూనిజానికి సైద్ధాంతిక బద్ధశత్రువైన అమెరికాకు అటువంటి పరిణామమే సరిపడనిది కాగా, తమ జమీందారీలో చోటు చేసు కోవటం ఎట్లుండేదీ చెప్పనక్కర లేదు.అటువంటి క్యూబన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గత 66 సంవత్సరాలుగా విఫల ప్రయత్నాలు చేస్తున్న యూఎస్ఏ, ఇపుడు ట్రంప్ ఆధ్వర్యాన భిన్నమైన వ్యూహాన్ని అమలుకు తెస్తున్నది. అది కాస్ట్రో హత్యకు నమ్మశక్యం కాని రీతిలో 638 సార్లు ప్రయత్నించటం వంటిదో, వెనిజులా అధ్యక్షుడిని అపహరించటం వంటిదో కాదు. ఒక వ్యక్తిగా ప్రస్తుత అధ్యక్షుడు మిగ్వేల్ దియాజ్ భద్రంగానే ఉన్నారు. కానీ, క్యూబాను ఆర్థికంగా ధ్వంసం చేసి, అక్కడి ప్రజలు పూర్తి పేదరికంలోకి జారుకుని, తమ ప్రభుత్వంపై తిరగబడేటట్లు చేయాలన్నది పథకం. ఇది ఎవరో ఊహిస్తున్నది కాదు. యూఎస్ఏ విదేశాంగ మంత్రి మార్కో రూబియో బాహాటంగా ప్రకటిస్తున్న మాట. తన పూర్వీకులు క్యూబన్లు అయిన ఆయన, అక్కడి ప్రభు త్వాన్ని పడగొట్టి, అక్కడి నుంచి యూఎస్‌కు వలస వచ్చిన వారిలో ఒకరిని కొత్త అధ్యక్షుడు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అక్కడి మీడియాయే రాస్తున్నది. ఇది సరిగా ట్రంప్, నెతన్యాహూ ఇరాన్లో అనుసరించబూనిన వ్యూహాన్ని గుర్తుకు తెస్తుంది.ద్విముఖ వ్యూహంఇరాన్లో విఫలమైన వ్యూహం క్యూబాలో విజయవంతమవు తుందా అన్నది వేరే ప్రశ్న. అయితే రెండింటి మధ్య మరొక పోలిక కనిపిస్తున్నది. ఇరాన్‌తో చర్చలు అనటం, అవి సంతృప్తికరంగా సాగుతూ ఒక కొలిక్కి వస్తుండగానే మధ్యలో ఆకస్మికంగా దాడులు జరపటం తెలిసిందే. ఇరాన్ వలెనే క్యూబాను లొంగదీసేందుకంటూ ఆంక్షలు ప్రకటించటం కమ్యూనిస్టు విప్లవం జరిగిన 1958లోనే మొదలై నేటికీ సాగుతున్నదే. ఆ స్థితిని ఇరాన్ వలెనే క్యూబా కూడా తట్టుకుంటూ వస్తున్నది. ఇరాన్‌ను ఆర్థికంగా మొత్తం ప్రపంచమే ‘వెలివేసేట్లు’ చేయగలనని ప్రకటించిన తరహాలో, క్యూబాను ఆర్థి కంగా అష్ట దిగ్బంధనం చేసే వ్యూహాన్ని ట్రంప్ ఎంచుకున్నారు. ఆ వ్యూహాన్ని ఇపుడు ద్విముఖంగా అమలుపరుస్తున్నారు. ముందుగా ఆర్థిక ఆంక్షలు ప్రకటించారు. వాటిని సడలించాలంటే ప్రైవేట్ రంగానికి, విదేశీ పెట్టుబడులకు, వాణిజ్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. పరిస్థితులు క్లిష్టంగా మారుతుండటంతో అందుకు ప్రభుత్వం ఒక మేర అంగీకరించగా, అది బాగున్నది గాని ఇంకా చేయాలన్నారు. ఇది కెనడా ప్రధాని మైక్ కార్నీ ఇటీవల ఎత్తి చూపినటువంటి ఎత్తుగడ. తాము అంగీకరించినకొద్దీ కొత్త షర తులు పెడుతున్నారని అన్నారాయన. అది చెల్లదని విమర్శించిన ఆయన అసలు చర్చలనుంచే వైదొలిగారు. ఇదే తరహా ఉపాయా లను అమెరికన్లు ఇండియాతో జరుగుతున్న వాణిజ్య చర్చలలోనూ ప్రయోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అనేక ఇతర దేశాలతో. లొంగినకొద్దీ మరింతగా లొంగదీసుకోవాలన్నది వారి వ్యూహం. ఆ విషయం అట్లుంచితే, ఈ నెల 3వ తేదీన క్యూబన్ చమురు కంపెనీలతో సహా మరికొన్ని సంస్థలపై మరిన్ని ఆంక్షలు ప్రకటించారు. గమనించదగినదేమంటే, సరిగా అవే రోజులలో క్యూబన్ ప్రభుత్వం ఆర్థిక విధానాల సరళీకరణ దిశగా 176 కొత్త సంస్కరణ లను ఆమోదించింది. ఇది గతంలో ఎన్నడూ జరగనిది. క్యూబాలో తీవ్రమైన ఇంధన కొరతలు, విద్యుత్ సమస్యలతో ఆర్థిక రంగం, ప్రజా జీవితం ఇప్పటికే సంక్షోభానికి గురవుతున్నాయి. ధరలు, నిరుద్యోగం పెరుగుతున్నాయి. ఇరాన్లో వలెనే అక్కడి ప్రజల లోనూ దేశభక్తి స్ఫూర్తి, యూఎస్ఏ పట్ల వ్యతిరేకత బలంగా ఉన్నందున పరిస్థితులను తట్టుకుని నిలబడుతున్నారుగానీ, లేనట్లయితే రెండు చోట్లా తిరుగుబాట్లు రావలసింది! పశ్చిమార్ధం మాదే!మిగిలిన దక్షిణ అమెరికా దేశాలలో మితవాద పార్టీలు, ప్రగతి శీల పార్టీలు అధికారానికి రావటం, పోవటం జరుగుతుండేదే గనుక చింతించనక్కర లేదు. చిలీలో ఏర్పడిన స్పష్టమైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని 1973లో కూలదోశారు. ఇక మిగిలిన ఏకైక ప్రభుత్వం క్యూబాది. అది కూడా పోతే తప్ప పశ్చిమార్ధంపై తిరుగులేని భరోసా ఏర్పడదు. మదురో నిజానికి సోషలిస్టే తప్ప సైద్ధాంతి కమైన కమ్యూనిస్టు కాదు. అయినా అక్కడి చమురు నిల్వల ఆకర్షణ అన్నిటికి మించినది గనుక, తనకు ఆ ముద్ర వేసి అపహరించిన ట్రంప్, ‘ఇకపైన లాటిన్ అమెరికా వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడజాల’రని హెచ్చరించారు. ట్రంప్ వ్యూహంలో ఇది ఒక భాగం మాత్రమే. ఇదిగాక ఆయన అక్కడి దేశాల ఎన్నికలలో మితవాద పార్టీలు గెలిచేందుకు ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. ఎన్నికలలో పరోక్ష జోక్యాన్ని సీఐఏ యథాప్రకారం కొనసాగిస్తున్నది. బ్రెజిల్, మెక్సికో వంటి బలమైన దేశాలలో గల నేరస్థ సంస్థలను ‘టెర్రరిస్టు’ సంస్థలుగా ప్రకటించి, వాటి చర్యల వల్ల అమెరికా భద్రతకు ముప్పు కలుగుతున్నదనే విచిత్రమైన వాదనలను తయారు చేస్తున్నాయి. ఈక్వెడార్ వంటి దేశాలకు ఇటీవలనే సైన్యాన్ని పంపి, మెక్సికోకు కూడా పంప జూస్తున్నారు. అదనపు ట్యారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందా లతో స్వపర భేదాలు లేకుండా అందరినీ నియంత్రించజూడటం ఇతరత్రానూ జరుగుతున్నదే.మొత్తంమీద ట్రంప్ లక్ష్యం, ఇతర ప్రాంతాలలో ఆశించిన ప్రకారం సాగ కున్నా, కనీసం తమ పశ్చిమార్ధ రాజ్యంలో ఎదురులేక పోవటం. ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. దక్షిణ అమెరికాలో 16వ శతాబ్దంలోనే మొదలైన బానిసల తిరుగుబాట్లు, ఆ తర్వాత కాలంలో రైతుల తిరుగుబాట్లు, వలస పాలనపై తిరుగుబాట్లు, క్యూబన్ విప్లవం స్ఫూర్తితో వామపక్ష భావజాలాలు చిరకాలంగా వ్యాపించి ఉన్నాయి. అక్కడి సంపదలు పాశ్చాత్య దేశాల పాలవు తుండటంతో పేదరికం తొలగకుండా ఉంది. అందువల్లనే ప్రగతిశీల పార్టీలు తరచూ గెలుస్తూనే ఉన్నాయి. ఈ రోజునే లెక్కగట్టినా మితవాద ప్రభుత్వాలు 8 దేశాలలో ఉండగా, ప్రగతివాదులు 7 చోట్ల పాలిస్తున్నారు. మిగిలినవి తటస్థం. అనగా, ఈ ప్రాంతమైనా ఇక శాశ్వతంగా తమ స్వాధీనమయేందుకు యూఎస్ఏ ఏ వ్యూహాలూ పనిచేయగల అవకాశం లేదన్నమాట. అయినా ట్రంప్ వంటి నాయకుని ప్రయత్నాలు ఆగవు గదా!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
వందేమాతరం.. అసలు అర్థం ఇదే!
‘వందేమాతరం’ అనగానే మనలో గర్వం ఉప్పొంగుతుంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో, మన జాతీయ చైతన్యంలో ఈ గేయానికి ప్రత్యేక స్థానం ఉంది. దాని 150వ వార్షికోత్సవాన్ని గర్వంగా జరుపుకోవడం సముచితమే. ఆ గేయం మనకు చూపించిన మాతృభూమి స్వరూపాన్ని నేటి పరిస్థితుల్లో మరోసారి అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఒక అవకాశం.బంకించంద్ర ఛటోపాధ్యాయ మాతృభూమిని కేవలం భౌగోళిక సరిహద్దులుగా ఊహించలేదు. సుజలాం– సమృద్ధిగా జలాలు కలది. సుఫలాం– ఫలసంపదతో నిండినది. సస్య శ్యామలాం– పచ్చని పంటలతో కళ కళలాడేది. అంటే ‘వందేమాతరం’లోని మాతృభూమి కేవలం భూభాగం కాదు. మనిషి, నేల, నీరు, వ్యవసాయం, ప్రకృతి పరస్పరం ఆధారపడిన ఒక సజీవ వ్యవస్థ. వందే మాతరం మన గర్వానికి ప్రతీక అయితే, ఆ మాతృభూమిని కాపాడటం మన బాధ్యత.స్వాతంత్య్ర ఉద్యమం నుంచి నేటి భారతదేశం వరకు మన జాతీయ ఆలోచనా రూపకల్పనలో ఎన్నో శక్తిమంతమైన భావనలు రూపుదిద్దుకున్నాయి– భారతమాత, గ్రామ స్వరాజ్యం, స్వదేశీ, సర్వోదయం నుంచి బేటీ బచావో బేటీ పఢావో, వికసిత భారత్ వరకు ఎన్నో. ఇవి కేవలం నినాదాలు కావు. మాతృభూమిని ‘సుజలాం’ అని కీర్తిస్తే మన నీటి నాణ్యత, జలవనరుల స్థిరత్వం ముఖ్యం. ‘సస్య శ్యామలాం’ అని పాడితే నేల ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణం ముఖ్యం. ‘గ్రామ స్వరాజ్యం’ అంటుంటే గ్రామాలకు తమ వనరులను సంరక్షించుకునే సామర్థ్యం ఉండాలి. ‘సర్వోదయం’ అంటుంటే అభివృద్ధి అట్టడుగు వర్గాల వరకు చేరాలి. ‘బేటీ పఢావో’ అంటుంటే ప్రతి బాలిక పాఠశాలలో గౌరవంగా చదువుకోగలగాలి.కేవలం నినాదాలా?ఒక గ్రామ పాఠశాలను ఊహించుకుందాం. ఉదయం పిల్లలు కలిసి ‘వందేమాతరం’ ఆలపిస్తారు. కానీ పాఠశాల పైకప్పు సురక్షితంగా ఉందా? మరుగుదొడ్లు పనిచేస్తున్నాయా? బాలికలు వాటిని గోప్యతతో, గౌరవంగా ఉపయోగించగలుగుతున్నారా? ఉపాధ్యాయులు ఉన్నారా? పిల్లలు నిజంగా నేర్చుకుంటున్నారా? అని పరిశీలించాలి. ఇవి దేశభక్తికి వ్యతిరే కమైన ప్రశ్నలు కావు. పాఠశాలలో కుళాయి ఉండటం మాత్రమే కాదు– పిల్లలకు సురక్షితమైన తాగునీరు అందడం ముఖ్యం. మరుగుదొడ్డి ఉండటం మాత్రమే కాదు– అది పరిశుభ్రంగా, ఉపయోగించడానికి అనువుగా ఉండటం ముఖ్యం. బాలికను బడికి పంపించడంతోనే మన బాధ్యత తీరిపోదు. ఆమె ఎలాంటి ఇబ్బంది, భయం, అవమానం లేకుండా గౌరవంగా చదువు కొనసాగించగల వాతావరణం కూడా కల్పించాలి.ఇదీ చదవండి: ఉపాధ్యాయుడికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు!నీటి భద్రత, నేల క్షీణత, కాలుష్యం, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం, సహజ పర్యావరణ వ్యవస్థలపై పెరుగుతున్న ఒత్తిడి వంటి సవాళ్ల సమయంలో ‘వందేమాతరం’లోని ప్రకృతి దృశ్యానికి కొత్త ప్రాసంగికత ఉంది. బంకించంద్రుడు మనం ఏమి కాపాడాలో చెప్పారు. గాంధీజీ ఆ బాధ్యత ఎక్కడ (గ్రామస్వరాజ్యం) మొదలవ్వాలో చూపించారు. ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి సుస్థిరమైన వికసిత భారత్‌ను నిర్మించడం మన ముందున్న సవాలు.- డాక్టర్ రఘు చలిగంటి అగ్రికల్చరల్ ఎకానమిస్ట్, పాలసీ రిసెర్చర్, జర్మనీ -
పెద్ద కలలతోనే 'పెద్ద మార్పులు'
నేడు పట్టభద్రులవుతున్న మీ అందరికీ ప్రత్యేక అభినందనలు. ఈ రోజు మీ ముందుకు వచ్చి కొన్ని ఆలోచనలు పంచుకోవడం నాకు నిజంగా గొప్ప గౌరవం. పెద్దవాళ్లు జీవితంలో తాము నేర్చుకున్న విషయాలను పిల్లలకు చెప్పాలని కోరుకుంటారు. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రుల కోరిక ఒకటే. తమ పిల్లలు మంచి మనుషులుగా ఎదగాలి. సంతోషంగా జీవించాలి. స్వతంత్రంగా నిలబడాలి. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మారాలి. ముఖ్యంగా పిల్లలకు ఎదురయ్యే బాధలు, నిరాశలు, కష్టాలు వీలైనంత వరకు రాకుండా కాపాడాలని తల్లిదండ్రులు ఆరాటపడతారు. సలహాలు ఇవ్వడం సులభం కాదు!జీవితంలో మంచి ఉద్యోగం వస్తుందని... మంచి ప్రేమ దొరుకుతుందని... మీరు కోరుకున్న ప్రతిదీ సాధిస్తారని నేను హామీ ఇవ్వలేను. అలా చెప్పగల శక్తి ఎవరికీ లేదు. ఈ రోజుల్లో ప్రపంచం చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో ఇతరు లకు సలహాలు ఇవ్వడం అంత సులభం కాదు. నేను ఒక నటిని. ఒక తల్లిని. ఒక వ్యాపారవేత్తను. అన్నిటికంటే... నాకు ఎంతో ఇష్టమైన పనిని జీవితాంతం చేయగలిగిన అదృష్టవంతురాలిని. అందుకే నా అనుభవాల నుంచి నేర్చుకున్న కొన్ని విషయాలను మీకు చెప్పాలను కుంటున్నా. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో అదే ముఖ్యమని గుర్తించండి. మీ కుటుంబం, ఉపాధ్యాయులు, స్నేహితులు మీకు సహాయం చేసి ఉండొచ్చు. కానీ చివరికి పరీక్షలు మీరు రాశారు. భయాలను మీరు ఎదుర్కొన్నారు. సందేహాలను మీరు జయించారు. ఇకపై కూడా ఇతరుల మాటలు వినండి. వారి అనుభవాల నుంచి నేర్చుకోండి. కానీ, మీ జీవితాన్ని ఇతరులు రాయకూడదు. మీ కథను మీరు రాయాలి. మీరు ఎవరో, మీ విలువలు ఏమిటో, మీ కలలు ఏమిటో... వాటిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎందుకంటే... ప్రపంచానికి మరో కాపీ అవసరం లేదు. ప్రపంచానికి అవసరమైంది... మీ కొత్త ఆలోచనలు. మీ సృజనాత్మకత. మీ భిన్నమైన దృష్టికోణం. ఇవే భవిష్యత్తును మార్చగలవు. ‘ఒకవేళ ఇలా జరిగితే?’నటనా ప్రపంచంలో ఒక గొప్ప ప్రశ్న ఉంటుంది: ‘వాట్ ఇఫ్’? ‘ఒకవేళ ఇలా జరిగితే?’, ‘ఒకవేళ ఇలా చేస్తే ఎలా ఉంటుంది?’... ఈ ప్రశ్నే కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. ఇప్పుడు నా మొదటి ‘వాట్ ఇఫ్’?... ఒకవేళ, మీరు మీ కుతూహలం(క్యూరియాసిటీ) ఎప్పటికీ కోల్పోకపోతే? ఆసక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునేలా చేస్తుంది. కొత్త మనుషులను కలిసేలా చేస్తుంది. కొత్త ప్రపంచాలను చూపిస్తుంది. నిజంగా జీవితం మారేది... మనకు తెలిసిన ప్రపంచంలో కాదు. మనకు తెలియని ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడే. అక్కడే కొత్త ఆలోచ నలు పుడతాయి. అక్కడే మనం నిజంగా ఎదుగుతాం. అందుకే, ఎప్పుడైనా జీవితంలో దారి కనిపించకపోతే... ప్రశ్నలు అడగండి. తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కొత్త విషయం నేర్చు కున్నప్పుడు, మీ జీవితంలో ఒక కొత్త తలుపు తెరుచుకుంటుంది. నేను మిమ్మల్ని అడగాలనుకునే మరో ‘వాట్ ఇఫ్ ప్రశ్న’... ఒకవేళ మీరు నేర్చుకోవడాన్ని జీవితాంతం కొనసాగిస్తే? అప్పుడు, మీ జీవితం ఎప్పటికీ ఒకే చోట నిలిచిపోదు. మీరు మారుతారు. ప్రపంచాన్ని చూసే మీ దృష్టి మారుతుంది. అదే నిజమైన విజయం. మా కుటుంబం ఆర్థికంగా చాలా సాధారణంగా ఉండేది. ఎనిమిది మంది పిల్లల్లో నేను ఒకరిని. మాకు అవసరమైనవి ఉండేవి. కానీ, కోరుకున్నది మాత్రం దొరికేది కాదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే... అదే నా జీవితంలో ఒక గొప్ప వరం అనిపిస్తోంది. ఎందుకంటే, అది నాలో ఆకలిని పెంచింది. కష్టపడే అలవాటును నేర్పింది. ఈ రోజు నేను సాధించిన ప్రతి విజయానికి ఆ రోజులే పునాది. ఎప్పుడూ కొత్త లక్ష్యాలు పెట్టుకోండి. కొత్త ఆశలు కలిగి ఉండండి. కొత్త కలల కోసం ప్రయాణం కొనసాగించండి. కలలు లేని జీవితం, ముందుకు సాగని నది లాంటిది. పెద్ద కలలు కనేవారే పెద్ద మార్పులు తీసు కొస్తారు. కల అంటే... కేవలం ఊహ కాదు. అది ఒక దిశ. ఒక లక్ష్యం. ఒక భవిష్యత్తు. విజయం అంటే ఏమిటి?ఈ రోజుల్లో చాలామంది... ఎక్కువ డబ్బు సంపాదించడం, పెద్ద పదవి పొందడం, పేరు సంపాదించడం... ఇవే విజయమని భావిస్తున్నారు. కానీ నా దృష్టిలో నిజమైన విజయం వేరు. విజయం అంటే... ఒక మంచి స్నేహితుడిగా ఉండడం. నమ్మకమైన భాగస్వా మిగా మెలగడం. ఇతరులకు తోడుగా నిలవడం. మంచి మనిషిగా జీవించడం. దయ, నిజాయితీ, మానవత్వం, సహానుభూతి... ఇవి ఎప్పటికీ పాతబడని విలువలు. ఒకప్పుడు... లింగం, కులం, జాతి, వర్గం, లేదా మన నేపథ్యం ఆధారంగా మనిషిని విలువను నిర్ణయించేవారు. అలాంటి నియమాలు తప్పు. వాటిని మార్చాల్సిందే. కానీ కొన్ని విలువలు మాత్రం ఎప్పటికీ మార కూడదు. వాటిలో నాకు అత్యంత ఇష్టమైనది... నువ్వు ఇతరులు నీతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటావో, నువ్వూ వారితో అలాగే ప్రవర్తించు. దీనినే ‘గోల్డెన్ రూల్’ అంటారు. ఇది చాలా సులభంగా అనిపిస్తుంది. కానీ దీన్ని ప్రతిరోజూ పాటించడం అంత సులభం కాదు. అయినా ఇదే జీవితానికి దారి చూపే దిక్సూచి.నా చివరి ‘వాట్ ఇఫ్’. ఒకవేళ, మీరు నిరాశకు లొంగిపోకుండా ముందుకు సాగితే? ఒకవేళ, మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ జీవిస్తే? ఒకవేళ, మీరు కలిసి మెలిసి పనిచేస్తే? అప్పుడు మీరు ఊహించలేని అద్భుతాలను సృష్టించగలరు. కొత్త ప్రపంచాన్ని నిర్మించగలరు. గాయాలను మాన్పగలరు. ప్రజల జీవితాల్లో ఆశలు నింపగలరు. ఈ రోజు మీ చేతిలో డిగ్రీ ఉంది. రేపు మీ చేతిలో సంస్థలు ఉంటాయి. పరిశోధనలు ఉంటాయి. పాఠశాలలు ఉంటాయి. వ్యాపారాలు ఉంటాయి. ప్రభుత్వ బాధ్యతలుండొచ్చు. కుటుంబాలు ఉంటాయి. అంటే... మీ నిర్ణయాలు వేలాదిమంది జీవితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే, ఎల్లప్పుడూ దయతో ఉండండి. నిజాయితీని ఎంచుకోండి. మానవత్వాన్ని పంచుకోండి. -
జార్జియా మెలోని (ఇటలీ ప్రధాని) రాయని డైరీ
కష్టాలను దాటుకుని ఎంత గొప్పగా లక్ష్యాన్ని చేరుకున్నా, ఆ వచ్చిన దారిని ఎప్పుడైనా తలచుకున్నప్పుడు... లక్ష్యాన్ని చేరుకోవటంకంటే కూడా కష్టాలను గట్టెక్కుతూ రావటమే గొప్ప విజయంలా అనిపిస్తుంటుంది నాకు! స్త్రీ జీవితంలోని అతి పెద్ద కష్టం... పురుషుడు! నా జీవితంలో ఆ అతి పెద్ద కష్టం నా జీవన సహచరుడు ఆండ్రియా, నా తండ్రి ఫ్రాన్సిస్కో. ఇంకా, నా రాజకీయ జీవితంలోని అనేకానేక మంది ఆండ్రియాలు, ఫ్రాన్సిస్కోలు. ఇటలీలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి పెద్ద వార్త... ప్రధానిగా నేను రికార్డ్ బ్రేక్ చేయటం! వెల్, మీడియా చేసే ‘అతి’ తప్ప, ఏదీ కూడా ఎప్పుడూ అతి పెద్ద వార్త కాదు నా దృష్టిలో. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, గత 80 ఏళ్లలో 2001–2005 మధ్య మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ సృష్టించిన 1,412 రోజుల పాలన రికార్డును నేను సెప్టెంబర్ 3న బ్రేక్ చేశానట! ఆ రోజుతో ప్రధానిగా నేను 1,413 రోజులు పూర్తి చేసుకున్నానట! బెర్లుస్కోనీ బ్రేకులు బ్రేకులుగా 9 ఏళ్లు పాలించినా...మెలోని ఒక్క బ్రేక్ కూడా లేకుండా తన 3 సంవత్సరాల 316 రోజుల పాలనతో ఆయన్ని వెనక్కి నెట్టేశారనీ పత్రికలు రాస్తున్నాయి. స్త్రీ ఎవర్నీ వెనక్కు నెట్టేయదు. తనుముందుకు వెళ్లటం మాత్రమే చేస్తుంది. ప్రధానిగా నా రికార్డుదేముంది కానీ... రాజకీయాల్లోంచి నాకై నేను పారిపోయేలా చేసేందుకు ఎవరెన్ని మాటలు అన్నారో అవన్నీ కదా అసలైన రికార్డులు! ముప్పై ఏళ్ల వయసులో తొలిసారి నేను మంత్రినైనప్పుడు... ‘‘అనుభవం లేని ఈ ‘పొట్టి పిల్ల’ మంత్రిగా ఏం చేస్తుంది?’’ అని సీనియర్ నాయకులు ఫక్కున నవ్వారు! 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు అన్నది ‘పొట్టి’ కిందకే రావచ్చు. కానీ ఆ మాట అన్న పొడగరులు ఆ ఒక్క మాటతో ఎంత ఎత్తు నుండి పడిపోయారో గ్రహించన్నా గ్రహించి ఉంటారా! సాటి ప్రజా ప్రతినిధిని పట్టుకుని ‘పిల్ల’ అని అనటంలోనే వాళ్లెంత పెద్దమనుషులో తేలిపోలేదా? నన్ను ‘గార్బటెల్లా గర్ల్’ అని అన్నారు. వీధి బాలికననీ, రోడ్డు పక్కన పెరిగిన అమ్మాయిననీ వాళ్ల చిన్నచూపు.రోమ్‌లోని నిరుపేదలు, కార్మికులు ఉండే ప్రాంతం గార్బటెల్లా నుంచి వచ్చానని నా భాషను కూడా వాళ్లు... ‘జానపద నగర మాండలికం’ అని గేలి చేశారు. నా దుస్తుల్ని గార్బటెల్లా ఫ్యాషన్ అన్నారు! ప్యాంటు, టీ షర్ట్ తొడుక్కోవటం తప్ప ఇటాలియన్ ఫ్యాషన్ సెన్ ్స లేదు అన్నారు. నన్ను ‘లావు’ అన్నారు, ‘ఆవు’ అన్నారు. నేను దేనికీ తల దించకపోవటం చూసి, నన్ను కించపరచటానికి నా తండ్రి గతాన్ని తవ్వి తీశారు. ‘‘ఈమె ఎవరో కాదు, డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవించిన ఫ్రాన్సిస్కో అనే ఒక నేరస్థుడి కూతురు’’ అన్నారు. నేను కొన్నాళ్లు కలిసి జీవించిన ఆండ్రియా మాట తెచ్చి... ‘‘సంప్రదాయాలు, కుటుంబ విలువల గురించి మాట్లాడే ఈమె... పెళ్లి చేసుకోకుండానే కూతుర్ని కనింది’’ అన్నారు. ఇంట్లోని మగవాళ్లు బయటి మగవాళ్లకు ఆయుధాలుగా మారినప్పుడు స్త్రీ మరింత గట్టిగా అరచి తన కోసం తను పోరాటం చేయవలసి వస్తుంది.మగ మాటలతో, మగ చూపులతో తలపడి నిలబడిన ప్రతి క్షణమూ నేను విజయవంతంగా పూర్తి చేసిన ఐదేళ్ల పాలనా కాలంతో నాకు సమానం అయినప్పుడు... సిల్వియో బెర్లుస్కోనీ, మారియో డ్రాఘి, జ్యుసేప్ జానార్డెల్లి, మట్టెయో రెంజీ, జియోవన్నీ లాంజా... ఎంత మంది ఇటలీ ప్రధానుల పదవీ కాలాలు నా వల్ల బ్రేక్ అయితే మాత్రం నాకు గొప్పౌతుంది?! నిత్యం మగాళ్లతో ఇంట్లో, బయటా అవస్థలు, అవమానాలు పడుతున్న సాధారణ స్త్రీల అనుక్షణ జీవిత కాలం ముందు ప్రధానిగా నా ఎన్నేళ్ల నిరవధిక పదవీ కాలమైనా ఏం లెక్కౌతుంది?! -
భూమిపై మరో సూర్యుడిని సృష్టిస్తున్న చైనా!
చైనా అభివృద్ధి చేసిన ‘ఈస్ట్’ (ఎక్స్పరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్) రియాక్టర్ ప్రపంచ శక్తి (ఎనర్జీ) రంగాన్ని సరికొత్త మలుపు తిప్పే దిశగా పురోగమిస్తోంది. సూర్యుడిలో నిరంతరం శక్తిని ఉత్పత్తి చేసే న్యూక్లియర్ ఫ్యూజన్ (అణు సంలీనం) ప్రక్రియను భూమిపై సురక్షితంగా పునఃసృష్టించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం.రెండు తేలికపాటి పరమాణు కేంద్రకాలు అత్యధిక ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఒకదానికొకటి వేగంగా ఢీకొని, కలిసిపోయి ఒకే బరువైన పరమాణు కేంద్రకంగా మారడాన్ని అణు సంలీనం అంటారు. భూమిపై సూర్యుడిలోని గురు త్వాకర్షణ శక్తిని సృష్టించడం సాధ్యం కాదు. అందుకే టోకమాక్ అనే శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాలు కలిగిన డోనట్ ఆకారపు పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇందులో హైడ్రోజన్ ఐసోటోప్‌లైన డ్యూటీరియం, ట్రిటియంలను వందల మిలియన్ల డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసి ప్లాస్మా రూపంలో బంధించి ఈ సంలీన ప్రక్రియను జరుపుతారు.చైనా సైంటిస్టులు 12 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్మాను 101 సెకన్ల పాటు, అలాగే మరికొన్ని ప్రయోగాల్లో 1,000 సెకన్ల కంటే ఎక్కువ సమయం స్థిరంగా నిర్వహించి ప్రపంచ రికార్డులు నమోదు చేశారు. ఈ ప్రాజెక్ట్ చైనాలోని అనూయ్ ప్రావిన్స్‌లో ఉన్న ‘హెఫీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్’ ఆధ్వర్యంలో నడుస్తోంది.ప్రస్తుతం వాడుతున్న అణు విచ్ఛిత్తి వల్ల ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ వ్యర్థాలు వస్తాయి. ఈ ఫ్యూజన్ సాంకేతికత వల్ల జీరో కార్బన్ ఉద్గారాలు, సురక్షితమైన శక్తి లభిస్తుంది. సముద్రపు నీటిలో లభించే డ్యూటీరియం, ట్రిటియం వంటి హైడ్రోజన్ ఐసోటోప్‌లను ఇంధనంగా వాడుతారు. నిజమైన సూర్యుడి కేంద్రకంలో ఉష్ణోగ్రత సుమారు 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. చైనా సృష్టించిన ఈ పరికరం ఏకంగా 16 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తాకి రికార్డు సృష్టించింది.ప్లాస్మాను ఎక్కువసేపు స్థిరంగా ఉంచడం, ఉత్పత్తి అయ్యే శక్తిని సమర్థ వంతంగా విద్యుత్‌గా మార్చడం వంటి సాంకేతిక సవాళ్లు ఇంకా పరిష్కరించాల్సి ఉంది. చైనా మాత్రమే కాకుండా అమెరికా, యూరప్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా అణు సంలీన సాంకేతికతపై పరిశోధనలు చేస్తున్నాయి. చైనా ప్రయోగాలు కేవలం ఈస్ట్తోనే ఆగడం లేదు. తదుపరి తరం ప్రాజెక్ట్ ‘బెస్ట్’ (బర్నింగ్ ప్లాస్మా ఎక్స్పెరిమెంటల్ సూపర్ కండక్టింగ్ టోకమాక్)ను నిర్మిస్తున్నారు. 2030 నాటికి వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సాంకేతికతను సిద్ధం చేయాలనేది దీని లక్ష్యం.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ -
ఉపాధ్యాయుడికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు!
తరతరాలుగా గురువును పూజనీయ స్థానంలో ఉంచి... తల్లి, తండ్రి తర్వాత స్థానం గురువుకు ఇచ్చిన సంస్కృతి మనది! అట్టి ఉపాధ్యాయ వృత్తి ప్రమాదంలో పడ్డ నేపథ్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. విద్య అనేది ప్రాథమికంగా ఒక మానవ ప్రయత్నం. అది సంబంధాల మీద ఆధారపడి ఉంటుంది.నమ్మకం మీద, అనుబంధం మీద ఆధారపడి ఉంటుంది. అది మనం ఆటోమేట్ చేయగల లావాదేవీల వ్యాపారం కాదు. బోధనోపకరణాలు, సమయం, నమ్మకాన్ని సరైన పద్ధతిలో, ప్రయోజనాత్మకంగా, గౌరవప్రదంగా, ఉపాధ్యాయులకు మద్దతు ఇచ్చే సరైన అకడమిక్ వాతావరణంలో, వారి అభివృద్ధికి సరైన అవకాశాలతో వినియోగించడంతోనే నాణ్యమైన విద్యకు పునాది ఏర్పడుతుంది.అభివృద్ధి చెందుతున్న బోధనా వృత్తిపై జరుగుతున్న చర్చలు... విద్య అనేది ఉపాధ్యాయ–విద్యార్థి కీలక సంబంధంలోనే దృఢంగా పాతుకుపోయి ఉందని స్పష్టం చేశాయి. ఉపాధ్యాయుల నియా మకం, వారిని వృత్తి నిబద్ధులుగా రూపుదిద్దడంలో ప్రపంచవ్యాప్త సవాళ్లు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు సరిపోని జీతాలు, అహేతుకమైన అధిక పనిభారం.ఎడ్ టెక్ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక మార్పులు వేగంగా వస్తున్న తరుణంలో బోధనలో కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగం గురించి చర్చ జరుగుతోంది. నాణ్యమైన విద్యకు ఉపాధ్యాయులే కేంద్రబిందువు అని అందరూ అంగీకరిస్తున్నప్పటికీ, తమ తరగతి గదు లలో కృత్రిమ మేధను ఎలా, ఏ మేరకు అనుసంధానించాలనే విష యంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అవకాశాలను అంది పుచ్చుకోవడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తుండగా; ఉపాధ్యాయులు, విద్యావేత్తలు మరింత జాగ్రత్తతో నియంత్రణలు ఉండాలని వాదిస్తున్నారు.సాంకేతిక మార్పు ఉపాధ్యాయులకు అవకాశాలను కల్పించ గలిగినప్పటికీ, ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వృత్తిపై ఇది మరింత భారాన్ని పెంచే ప్రమాదం ఉంది. బోధనలో ఏఐ అనుసంధానం జరగడానికి ఉపాధ్యాయుల నుండి అదనపు కృషి, బోధన, అభ్యసన ప్రక్రియలలో నిరంతర సర్దుబాట్లు అవసరం. అందువల్ల, ఈ మార్పులన్నింటి మధ్య, విద్యా నిపుణుల శ్రేయస్సు– పనిభారాన్ని కూడా సరిగ్గా పరిగణనలోకి తీసుకునేలా చూడాల్సిన అవసరం ఉంది. ఒక విషయం మాత్రం పూర్తిగా స్పష్టం: కృత్రిమ మేధ ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయం కాదు.పుస్తకాల స్థానంలో కంప్యూటర్లను తీసుకొచ్చి దాదాపు 15 ఏళ్ల పాటు డిజిటల్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించి అమలు చేసిన స్వీడన్ దేశం డిజిటల్ ఫస్ట్ విధానం వల్ల విద్యార్థుల్లో చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలు క్షీణిస్తున్నాయనే విషయాన్ని గుర్తించింది. ఎడ్ టెక్ అనేది విఫల ప్రయోగం అనీ, అందువల్ల విద్యార్థులకు మరిన్ని భౌతిక పాఠ్యపుస్తకాలు అవసరమనీ చెప్పిన స్వీడన్ అనుభవాలు గమనించాలి.దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఉపాధ్యాయ లోకానికి దక్కిన అతిపెద్ద విజయాల్లో ఉద్యోగ భద్రత మొదటిది. కానీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ప్రవేశపెడుతున్న కొత్త విద్యా విధానాల నేపథ్యంలో కాంట్రాక్టు, పార్ట్ టైమ్, ఔట్ సోర్సింగ్లాంటి పద్ధతుల్లో ఉపాధ్యాయుల నియామకాలు జరిగి ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమైంది. ఇటువంటి అధ్యాపకులకు కనీస టైమ్ స్కేల్ వర్తింపజేయాలి. శాశ్వత ఉద్యోగభద్రత వలన వృత్తిపట్ల అంకితభావం తగ్గుతుందనే శుష్క వాదనలను చేయడం సముచితం కాదు.– కె. వేణుగోపాల్, విద్యారంగ విశ్లేషకులుఇవి కూడా చదవండి: మా పిల్లలనూ కాపాడండి! -
మన దేహం విలువ కోట్లకంటే ఎక్కువ.. ఈ కథతో అర్థమవుతుంది!
మన శరీరంలోని కాలేయం, గుండె, ఊపిరి తిత్తులు, కళ్ళు, పళ్ళు వంటివేవైనా... కొంత చెడి పోయినా బాగు చేయించుకోవటానికి లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అన్నీ బాగుండి, ఆరోగ్యంగా, దృఢంగా ఉన్నవారు శరీర విలువను గ్రహించక, జీవిత విలువను తెలుసుకోలేక, ఎలా జీవించాలో అలా జీవించక వెళ్ళిపోతున్నారు. మహారాజ్ జగత్ సింగ్జీ ఒక కథ చెబుతారు:ఒక వృద్ధుడు అడవిలో కట్టెలను కొట్టి, ఆ కట్టెలను కాల్చి, వచ్చిన బొగ్గును అమ్మి జీవించేవాడు. ఒకసారి అడవిలో దారితప్పిన రాజును రక్షించి, రాజనగరుకు క్షేమంగా చేర్చాడు. ఆ రాజు సంతోషించి అతనికి చందన వృక్షాలు గల అందమైన తోటను కానుకగా ఇచ్చాడు. ఆ వృక్షాల ప్రత్యేక విలువ ఆ వృద్ధునికి తెలీదు. ఆ చెట్లను కొట్టాడు, కట్టెలను కాల్చాడు, వచ్చిన బొగ్గులను అమ్మాడు, వచ్చిన కొంత డబ్బుతో ఏ పూటకు ఆ పూట గడిపాడు, దరిద్రునిగనే నిలచిపోయాడు.కొద్ది రోజుల తర్వాత రాజు వచ్చి, అతని దారిద్య్రాన్ని చూసి, విషయాన్నంతా అడిగి తెలుసుకున్నాడు. ఒక చిన్న కట్టె ఏమైనా మిగిలి ఉందా? అని ప్రశ్నించాడు. ఏదో ఒక మూలన పడివున్న బారెడు కట్టెను తెచ్చాడు వృద్ధుడు. సరే, దీన్ని ఇలాగే బజారుకు తీసుకెళ్ళి, అమ్మి పైకాన్ని తీసుకురా అన్నాడు రాజు. అది మామూలు కట్టె కాదని, చందన వృక్షపు ముక్క అని తెలిసిన వ్యక్తి వందల రూపాయలను ఇచ్చి దాన్ని కొన్నాడు.ఆ వృద్ధుడు ఆశ్చర్యంతో రాజుగారికి ఆ డబ్బును చూపించాడు. ‘ఇప్పుడు నీకు తెలిసిందా, నేను నీకు కానుకగా ఇచ్చిన తోట ఎన్ని కోట్ల విలువైనదో? నీవు అజ్ఞానంతో అమూల్యమైన సంపదను కోల్పోయావు’ అన్నాడు రాజు. (పుట 58, ఆత్మజ్ఞానము– సర్దార్ బహదుర్ జగత్ సింగ్జీ; రాధాస్వామి సత్సంగ్ బియాస్).భగవంతుడు లేక ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ మానవ దేహం రాజు గారు ఇచ్చిన చందన వృక్ష తోటకంటె ఎన్నో వందల రెట్లు విలువైనదే. ‘శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం’ అని శాస్త్రాలు ఘోషిస్తాయి. ఈ శరీర మూలంగానే జ్ఞానాన్ని ఆర్జించాలి. ఆ తర్వాత ‘పరోపకారార్థ మిదం శరీరం’ అని గుర్తెరిగి జీవించాలి.– రాచమడుగు శ్రీనివాసులు -
భూమి దున్నేవారు లెక్కలోకి రారా?
రంగారెడ్డి జిల్లాలో ఒక రైతు పదేళ్లుగా ఐదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తు న్నాడు. విత్తనం కొనేది అతడే. ఎరువులు వేసేది అతడే. పంట ఎండిపోతే నష్టం భరించేదీ అతడే. కానీ ప్రభుత్వ రికార్డులో ఆ భూమి సాగు చేసే రైతు అతడు కాదు. అందుకే బ్యాంకు రుణం రాదు, పంటల బీమా రాదు, పెట్టుబడి సాయం రాదు, కరవు వచ్చినప్పుడు పరిహారమూ రాదు. దశాబ్దాలుగా మన కౌలు రైతుల కథ ఇదే. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఒక్కటే– దేశం మొత్తాన్ని డిజిటల్‌గా మారుస్తున్న కొత్త వ్యవస్థ ఈ కథను మారుస్తుందా?అగ్రిస్టాక్ అంటే ఏమిటి?కేంద్ర ప్రభుత్వం రూ. 2,817 కోట్లతో అగ్రిస్టాక్ అనే డిజిటల్ వ్యవస్థను నిర్మిస్తోంది. దేశంలోని 14 కోట్ల వ్యవసాయ కమతాలకూ, ప్రతి రైతుకూ ఆధార్‌తో ముడిపడిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. భూమి వివరాలు, ఏ పంట వేశారు, ఎంత దిగుబడివచ్చింది– అన్నీ ఉపగ్రహ చిత్రాలతో కలిపి ఒకచోట పెడతారు. దీని ఆధారంగా రాయితీలు, బీమా, రుణాలు, సలహాలు అన్నీ వేగంగా అందుతాయని చెబుతున్నారు. పంటల బీమా క్లెయిము రావడానికి ఇప్పుడు ఏళ్లు పడుతోంది. ఉపగ్రహ చిత్రాలతో పంట నష్టాన్నివెంటనే గుర్తిస్తే రైతుకు నిజంగానే మేలు జరుగుతుంది. కానీ ఒక్క ప్రశ్న. మన వ్యవసాయ సమస్య నిజంగా సమాచారం లేక పోవడమేనా? దేశంలో ఇప్పటికే 22 కోట్ల భూసార కార్డులు ఇచ్చారు. కేంద్ర భూగర్భ జల మండలి 25 వేల బావులను ఏటా కొలుస్తోంది. వ్యవసాయ ఖర్చులను 1970ల నుంచీ ప్రతి ఏటా లెక్కిస్తున్నారు. రైతు ఆత్మహత్యల సంఖ్యను 1995 నుంచీ నమోదు చేస్తున్నారు. వాతావరణ శాఖకు 730 కేంద్రాలున్నాయి. మరి ఫలితం? నేలలో సేంద్రియ కర్బనం తగ్గుతూనే ఉంది. భూగర్భ జలం అడుగంటుతూనే ఉంది. రైతుల అప్పులు పెరుగు తూనే ఉన్నాయి. సమాచారం లేకపోవడమే అసలు అడ్డంకి అయితే ఈ సమస్యలు ఎప్పుడో తీరిపోయేవి.ఎరువుల విషయమే చూడండి: నత్రజని తగ్గించమని భూసార కార్డు చెబుతుంది. కానీ యూరియా బస్తా ధర 85% రాయితీతోఅందుతుంది. నేల ఏం చెప్పినా, మార్కెట్లో అన్నింటికంటే చౌక అదే. అందుకే రైతు దాన్నే వాడతాడు. కంప్యూటర్ ఎంత తెలివైనదైనా ఈ లెక్క మార్చదు.అసలు లోపం ఎక్కడుంది?దేశంలో దాదాపు 40 శాతం వ్యవసాయ కుటుంబాలు తమవి కాని భూముల్ని సాగు చేస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో 60 నుంచి 80 శాతం చేసేది మహిళలు; కానీ భూమి ఉన్నది కేవలం 13.9 శాతం మందికే. అటవీ హక్కుల పత్రాలు రాని ఆదివాసీలు, భూమిలేని కూలీలు, వలస వెళ్లి కౌలుకు చేసేవాళ్లు– వీళ్లెవరూ భూ రికార్డులో కనిపించరు.తెలంగాణ రైతు భరోసా అనుభవం మన కళ్ల ముందే ఉంది. అది భూ రికార్డులతో ముడిపెట్టిన పథకం. అందుకే లక్షలాది కౌలు రైతులు దాని పరిధిలోకి రాలేదు. ఇప్పుడు అదే లోపాన్ని దేశమంతటికీ, డిజిటల్ రూపంలో, శాశ్వతంగా అమర్చుతున్నాం. కాగితపు రికార్డును అప్పుడప్పుడూ సరిదిద్దుకోవచ్చు. కంప్యూటర్లో ఒకసారి నమోదైన తప్పును కదిలించడం చాలా కష్టం. తెలంగాణలో భూభారతి, ఆంధ్రాలో వెబ్ ల్యాండ్. దాని మీద అగ్రిస్టాక్. దాని మీద కృషి విస్తార్ అనే సలహాల వ్యవస్థ. కింది అంతస్తులో ఉన్న పగుళ్లు పైకి ఎక్కుతూ పెద్దవవుతాయి. రైతు అనుమతితోనే సమాచారం పంచుకుంటామని చెబు తున్నారు. కానీ పీఎం–కిసాన్ డబ్బు, పంటల బీమా, కిసాన్ క్రెడిట్ కార్డు– ఇవన్నీ ఆ నమోదుతోనే ముడిపడితే, రైతుకు వద్దనే స్వేచ్ఛ ఎక్కడ? విత్తనం కొనడానికి డబ్బు కావాల్సిన రైతు ‘అంగీకరిస్తున్నా’ అని నొక్కడం సమ్మతి కాదు, తప్పనిసరి.ఆ సమాచారం చిన్నదేమీ కాదు. ఏ పంట వేశాడు, ఏ ఎరువు కొన్నాడు, ఎంత అప్పు ఉంది, ఎప్పుడు కట్టాడు– ఇదంతా ఎరువుల కంపెనీలకూ, రుణ సంస్థలకూ బంగారం లాంటిది. ఉపగ్రహ చిత్రంలో పంట ఎండినట్టు కనిపించిన మరుక్షణం రుణం వసూలుకు ఒత్తిడి మొదలవ్వొచ్చు.ఇది ఊహాజనిత భయం కాదు. ప్రపంచంలో ఇలాగే జరిగింది. వాతావరణ సమాచారం ఇచ్చే ఒక చిన్న కంపెనీని మాన్ శాంటో వేల కోట్లు పెట్టి కొనుక్కుంది. ఆ తర్వాత అది రైతుల పొలాల సమాచా రాన్నంతా సేకరించే పెద్ద వేదికగా మారింది. ప్రజా ప్రయోజనం పేరుతో మొదలైన వ్యవస్థలు చివరికి వ్యాపార వేదికలుగా మారడం చాలాసార్లు చూశాం.కృత్రిమ మేధతో సలహాలు ఇస్తామంటున్నారు. మన దగ్గర ఒక వ్యవసాయ అధికారికి వెయ్యి మంది రైతులు. ఇది సాంకేతిక లోపం కాదు, పెట్టుబడి లోపం. యాప్ ఉంది కదా అని సిబ్బందిని నియమించడం మానేస్తే, రైతుకు మిగిలేది పొలానికి రాని సలహా. పైగా ఆ సలహా ఇచ్చే వేదికలు ఎరువులు, పురుగుమందులు అమ్మే కంపెనీలతో కలిసి పనిచేస్తే– రసాయనాలు తక్కువ వాడమని అది ఎందుకు చెబుతుంది?మరేం చేయాలి?అగ్రిస్టాక్‌ను ఆపమని ఎవరూ అనడం లేదు. రైతు ప్రయోజ నాల చుట్టూ దాన్ని నిర్మించాలి. మొదటిది– భూమి యజమానిని కాక సాగు చేసేవారిని రైతుగా గుర్తించాలి. గ్రామసభ ధ్రువీకరణతో కౌలుదారుల పేర్లు నమోదు చేయాలి. ఒడిశా, కేరళ ఇలాంటి ప్రయత్నాలు చేశాయి. రెండోది– మహిళల పేర్లు తప్పనిసరిగా నమోదు కావాలి. కుటుంబంలో సాగుచేసే అందరికీ గుర్తింపు ఇవ్వాలి. మూడోది– సమాచారంపై బేరసారాలు ఒక్కో రైతు ఒంట రిగా చేయలేడు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, సహకార సంఘా లకు ఆ అధికారం ఇవ్వాలి. నాలుగోది– సలహాలు ఇచ్చే కంప్యూటర్ కార్యక్రమాలు బహిరంగంగా ఉండాలి. అవి ఎలా పనిచేస్తున్నాయో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రజలు పరిశీలించగలగాలి. సలహాలు ఇచ్చే కంపెనీలు బాధ్యత వహించాలి. ఐదోది– ఎవరైనా అన్యాయంగా జాబితా నుంచి తప్పిపోతే, వారం రోజుల్లో సరిదిద్దే వ్యవస్థ ఉండాలి. కంప్యూటర్ క్షణంలో పేరు తీసేస్తే, దాన్ని తిరిగి చేర్చడానికి ఏళ్లు పడితే ఆ సీజన్ పంట పోతుంది.ఇవేమీ కొత్త ఆలోచనలు కావు. సేంద్రియ ధ్రువీకరణ కోసం మన దేశంలో ఇప్పటికే రైతులే పరస్పరం తనిఖీ చేసుకునే పద్ధతి నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసా యానికి మారింది యాప్‌ల వల్ల కాదు, గ్రామంలోని ఒక రైతు మరో రైతుకు నేర్పడం వల్ల. సాంకేతికత ఈ మానవ వ్యవస్థలకు తోడుగా రావాలే తప్ప, వాటి స్థానంలో కూర్చోకూడదు. మన వ్యవసాయ సంక్షోభం సమాచార సమస్య కాదు, పాలన సమస్య. భూమి పత్రం ఏం చెబుతుందో కాదు, పొలంలో ఎవరు చమట చిందిస్తున్నారో చూసే వ్యవస్థ కావాలి.-వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
సముద్ర రవాణా ఇక ఆర్కిటిక్ వైపు?
ప్రపంచ సగటుతో పోలిస్తే వేగంగా పెరుగుతున్న ఆర్కిటిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గ్రీన్ లాండ్‌ను వశం చేసుకుంటామనే ట్రంప్ బెదిరింపులు, అసాధారణ స్థాయిలో కరిగిపోతున్న మంచు; రష్యా, ఇరాన్లపైన అమెరికా ఆర్థిక యుద్ధం క్రమంగా ప్రపంచ దేశాలను ఆర్కిటిక్ సముద్ర జలాల వైపు నడిపిస్తున్నాయి. అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య దేశాల అదుపాజ్ఞలలో ఉన్న హార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయెజ్, మలక్కా జలసంధుల నుండి దూరంగా సురక్షిత ఆర్కి టిక్ సముద్ర మార్గం గుండా సరకుల రవాణాకు రష్యా, చైనా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాయి. ఆసియా, ఐరోపాలను కలిపే కేప్ ఆఫ్ గుడ్‌హోప్, సూయెజ్ కాలువ మార్గాలలో అశాంతి, అనిశ్చిత స్థితి వలన అందరి చూపు ఆర్కిటిక్ వైపు మళ్లింది. ప్రపంచ సగటుతో పోల్చితే ఆర్కిటిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు మూడు నుండి నాలుగు రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. దీనినే పర్యావరణ శాస్త్రజ్ఞులు ‘ఆర్కిటిక్ ఆంప్లిఫికేషన్ ’గా అభివర్ణిస్తున్నారు. పారిశ్రామిక విప్లవానికి ముందు ఉష్ణోగ్రతల కంటే ఐరోపాలో 2.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగితే ఆర్కిటిక్ సముద్రంలో 3.3. డిగ్రీల సెల్సియస్ పెరిగింది. గత సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆర్కిటిక్‌లో 5.8 శాతం మంచుపొర క్షీణించింది. వేగంగా క్షీణిస్తున్న మంచుపొర ఆర్కిటిక్ జలాలను నౌకాయానానికి మరింత అనుకూలంగా చేస్తున్నది. రష్యాకు సానుకూలంఆర్కిటిక్ జలాలలో మూడు ప్రధాన నౌకా మార్గాలున్నాయి. అవి. 1. నైరుతి మార్గం 2. వాయవ్య మార్గం 3. ధ్రువ ప్రాంతం మీదుగా వెళ్లే (ట్రాన్స్ పోలార్) మార్గం. కెనడా తీరంలోని వాయవ్య మార్గంలో అనువైన రేవు పట్టణాలు లేవు. అందువలదన ఈ ప్రాంతంలో కేవలం విహార యాత్రికుల క్రూయిజ్ షిప్పులు, పరిశోధనా నౌకలు మాత్రమే సంచరిస్తున్నాయి. ఉత్తర ధ్రువాన్ని ఆనుకుని ఉన్న ట్రాన్స్పోలార్ మార్గం పూర్తిగా మంచుతో కప్పబడి నౌకాయానానికి ఏ మాత్రం వీలుగా లేదు. ప్రస్తుత ప్రపంచ దృష్టి అంతా రష్యా తీరంలోని నైరుతి ఆర్కిటిక్ సముద్ర మార్గంపైననే ఉన్నది. రష్యా తీరంలో ముర్మన్స్క్నుండి వ్లాదివోస్తోక్ మధ్యలో 70కి పైగా రేవు పట్టణాలు ఉన్నాయి. ముర్మన్స్క్ రేవు పట్టణం సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది. రష్యన్ న్యూక్లియర్ ఐస్ బ్రేకర్ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఇక్కడనే ఉన్నది. 2025లో ఈ ఆర్కిటిక్ సముద్ర మార్గం గుండా 37 మిలియన్ టన్నులుగా ఉన్న రవాణా 2026లో ఇప్పటికే 40 మిలియన్ టన్నులకు చేరింది. ఈ రవాణా ప్రధానంగా రష్యన్ చమురు, గ్యాస్ ఎగుమతుల రూపంలో ఉన్నది. యామాల్ ద్వీపకల్పంలోని నోవాటెక్ చమురు క్షేత్రాలలో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజవాయువులను ఈ మార్గం గుండా చైనాకు ఎగుమతి చేస్తున్నారు. రష్యా–చైనా మధ్య గత సంవత్సరం 103 నౌకలు ఈ మార్గంలో ప్రయాణించాయి. ఈ మార్గంలో చమురు ట్యాంకర్లే కాకుండా క్రమంగా సరకుల రవాణా చేసే భారీ కంటెయినర్ కార్గో షిప్పుల ప్రయాణం కూడా ప్రారంభమైంది. 2023లో 7 కంటెయినర్ షిప్పులు ప్రయాణిస్తే ఈ సంవత్సరం ఇప్పటికే 30 కంటెయినర్ షిప్పులు ప్రయాణించాయి.చైనా వడి వడి అడుగులుచైనా వ్యూహాత్మకంగా ఆర్కిటిక్ సముద్ర మార్గంపై అమితా సక్తిని చూపిస్తున్నది. చైనాకు ఆర్కిటిక్ తీరం లేదు. 2013లో ఆర్కిటిక్ కౌన్సిల్లో అబ్జర్వర్‌గా చేరింది. 2017లో చైనా తన ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) పథకాన్ని ఆర్కిటిక్‌కు విస్తరిస్తూ ‘పోలార్ సిల్క్ రోడ్’ను ప్రతిపాదించింది. 2018లో ఆర్కిటిక్ విధాన శ్వేతపత్రంలో చైనా తనను తాను ‘నియర్ ఆర్కిటిక్ స్టేట్’గా అభివర్ణించుకున్నది. ఆర్కిటిక్ సముద్ర జల మార్గంలో 2024లో 15 చైనా నౌకలు ప్రయాణించగా, వాటి సంఖ్య 2026 నాటికి 30కి పైగా చేరింది. చైనాలో నింగ్బో నుండి కంటె యినర్ షిప్పులు సూయెజ్ కాలువ గుండా ప్రయాణిస్తే యూకేలోని అతిపెద్ద కంటెయినర్ టర్మినల్ ఫీలిక్స్స్టోవే చేరటానికి 40 రోజులు పడుతుంది. ఆర్కిటిక్ సముద్ర మార్గంలో నింగ్బో నుండి ఫీలిక్స్ స్టోవేకు 20 రోజుల్లో చేరుతున్నారు. చైనాకు చెందిన సీవోఎస్సీవో (కాస్కో) ఈ మార్గంలో కంటెయినర్ రవాణాను చేపట్టింది. నౌకల రవాణాను సుగమం చేయటానికి చైనా ఆర్కిటెక్ జలాలలోకి గ్జ్యూ లాంగ్, గ్జ్యూ లాంగ్–2 ఐస్‌బ్రేకర్ షిప్పులను ప్రవేశపెట్టింది. 2025లో రష్యా, చైనా ఆర్కిటిక్ సముద్ర రవాణాలో పరస్పరం సహకరించుకోవటానికి ఒప్పందం కుదుర్చుకొన్నాయి.అంతర్జాతీయంగా రష్యన్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయటానికి రష్యాపై అమెరికా తీవ్ర ఆంక్షలను విధించింది. అంతర్జాతీయ నెఫ్ట్ చెల్లింపుల వ్యవస్థ నుండి రష్యాను బహిష్కరించింది. అయి నప్పటికీ చైనా, భారత్, ఇరాన్ వంటి దేశాలతో లావాదేవీల ద్వారా రష్యా తన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నది. ఆర్కిటిక్ జలాలలో రష్యా–చైనా వ్యూహాలను అమెరికా, ఐరోపాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రస్తుతం రష్యన్ ఆర్కిటిక్ ఎకానమీ, రష్యన్ జీడీపీలో పది శాతం కంటే తక్కువగానే ఉన్నది. కానీ రానున్న 20 సంవత్సరాలలో ఇది 60 శాతానికి చేరినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ గ్రీన్ లాండ్ వివాదాన్ని భుజాలకెత్తుకున్నాడు. ఆర్కిటిక్ జలాలలో రష్యా–చైనా లపై నిఘా వేయటానికి గ్రీన్ లాండ్ కీలకం. అందుకే గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో అంతర్భాగం చేయాలని పట్టు బడుతున్నాడు. 2026 ఫిబ్రవరిలో నాటో ‘ఆపరేషన్ ఆర్కిటిక్ సెంట్రీ’ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆర్కిటిక్ జలా లపై నాటో బలగాలు గట్టి నిఘాను పెడుతున్నాయి. అయితే ఆర్కిటిక్ రష్యాను ఎదుర్కొనే నౌకాశక్తిగానీ, ఐస్ బ్రేకింగ్ షిప్పుల సామ ర్థ్యాలుగానీ, యూఎస్, నాటోలకు లేవు. అదే రకంగా రష్యాకూ పరిమితులున్నాయి. రష్యా మీద ఆంక్షల వలన పాశ్చాత్య షిప్పింగ్ కంపెనీలు, బీమా కంపెనీలు ముందుకు రాకపోవడంతో ఆర్కిటిక్ ప్రపంచ రవాణా మార్గంగా అభివృద్ధి చెందటం కష్టం.భారత్ కార్యకలాపాలు1920 స్వాల్బార్డ్ ఒప్పందంపై సంతకం చేయటం ద్వారా భారత్ ఆర్కిటిక్ వైపు అడుగులు వేసింది. 2007లో తన మొదటి పరిశోధనా/ అన్వేషణ నౌకను ఆర్కిటిక్‌కు పంపించింది. 2013లో ఆర్కిటిక్ కౌన్సిల్లో అబ్జర్వర్‌గా చేరింది. 2022లో ఆర్కిటిక్ పాలసీని ప్రకటించింది. శాస్త్ర–వైజ్ఞానిక అంశాల లక్ష్యంగా ఉన్న ఆర్కిటిక్ సముద్ర జలాలను భారత్ 2022 తర్వాత వనరులు, ఆర్థిక లక్ష్యాలు, వ్యూహాత్మక కోణంలో నుండి పరిశీలించటం ప్రారంభించింది. 2024లో చెన్నై–వ్లాదివోస్తోక్ మార్గాన్ని ‘ఈస్టర్న్ మారిటైమ్ కారిడార్’గా అభివృద్ధి చేయటానికి రష్యాతో ఒప్పందం కుదుర్చు కున్నది. రష్యన్ ఆర్కిటిక్ తీరంలో ప్రాజెక్టుల అభివృద్ధికి ఒక బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను ఏర్పాటు చేసింది. వచ్చే సంవ త్సరం (2027)లో మొట్టమొదటి భారతీయ రవాణా నౌక ఆర్కిటిక్ జలాలలో ప్రయాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గురజాల శ్రీనివాసరావు వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
మా పిల్లలనూ కాపాడండి!
అమెరికా రాష్ట్రాలు సంయుక్తంగా దాఖలు చేసిన దావాలో టెక్ దిగ్గజం ‘మెటా’ రాజీకి వచ్చి, 18 బిలియన్ డాలర్ల చెల్లింపుతో పాటు, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో బాలలకు రోజుకు కేవలం రెండు గంటల వినియోగ పరి మితి, రాత్రిపూట ఆటోమేటిక్ లాకౌట్, క్రోనలాజికల్ ఫీడ్, కఠిన వయో నిర్ధా రణ వ్యవస్థను అమలు చేయడానికి అంగీకరించింది.స్నాప్‌చాట్, టిక్‌టాక్, యూట్యూబ్ కూడా ఇదే బాటలో నడవనున్నాయి. ఐరోపా సమాఖ్య సైతం తమ పిల్లల భద్రత కోసం ఇదే తరహా రక్షణ చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. భారత దేశం కూడా మేలుకోవాలి. ‘లోకల్ సర్కిల్స్’ సర్వే ప్రకారం, ఆన్ లైన్ లో తమ పిల్లలు అనుచితమైన కంటెంట్‌కు గురైనట్లు సగం మంది భారతీయ తల్లిదండ్రులు గుర్తించారు.మన దేశంలో 2023 డేటా ప్రొటెక్షన్ చట్టం ‘తల్లిదండ్రుల సమ్మతి’పై ఆధారపడి ఉంది. ఆస్ట్రే లియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించగా, ఇండోనేషియా, బ్రెజిల్, టర్కీ, యూకే కఠిన నిబంధనలు తెచ్చాయి. దీనితో పాటు... అశ్లీలత, హింస, షార్ట్–వీడియోల వ్యసనం, గేమింగ్–బెట్టింగ్ యాప్స్ లాంటి పెద్ద ముప్పులను కూడా అడ్డుకోవాలి. టెక్సాస్, బ్రిటన్, ఫ్రాన్స్ తరహాలో బయోమెట్రిక్ లేదా ఐడీ ద్వారా వయసు నిర్ధారణను కఠినంగా అమలు చేయాలి.పిల్లల మెదడులో డోపమైన్‌ను పెంచి బానిసలను చేస్తున్న షార్ట్–వీడియోల నిరంతర ఆటో ప్లే, స్క్రోలింగ్‌లను ఆపేయాలి. గేమింగ్ ముసుగులో ఉండే ‘లూట్ బాక్స్’లను జూదంగా పరిగణించి నియంత్రించాలి. చైనాలో మైనర్లకు ‘మైనర్ మోడ్’ తీసుకువచ్చారు. ఆర్థిక సర్వే 2025–26 సూచించినట్లుగా, స్కూళ్లలో బేసిక్ ఫోన్లను మాత్రమే అనుమతించాలి. ఈయూ తరహాలో ‘మా పిల్లలను కూడా రక్షించండి (ప్రొటెక్ట్ అవర్ కిడ్స్ టూ)’ అని భారతదేశం కూడా గట్టిగా అడగాలి.అలాగే ఇటీవలి సంఘటనల్లో టీనేజీ పిల్లల బాధితులైన ‘ఒంటరి మహిళ బలహీన లక్ష్యం’ అనే మూస ధోరణిని తిప్పి కొట్టాలి. హ్యాండ్‌బ్యాగ్‌లో ‘పెప్పర్ స్ప్రే’ వంటి చట్టబద్ధ మైన సాధనం ఉంచు కోవాలి. దీనితో పాటు ‘హోమ్ ఎస్.ఓ.ఎస్. సైరన్’ వ్యవస్థను ప్రోత్సహించాలి. ప్యానిక్ బటన్ నొక్కగానే మోగే పెద్ద సైరన్ చుట్టు పక్కల వారిని అప్రమత్తం చేసి, ఇరుగుపొరుగు వారి మధ్య నమ్మకాన్ని పెంచుతుంది.లాటిన్ అమెరికాలో వీధి మొత్తానికి ‘అలార్మా వెసినాల్’ సైరన్ ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికీ ఒక రిమోట్ ఇస్తారు. బటన్ నొక్కితే చుట్టుపక్కల వారు వచ్చి సాయం చేస్తారు. దక్షిణాఫ్రికాలో నేరాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు ప్యానిక్ బటన్లు, ప్రత్యేకమైన విజిల్స్ వాడుతారు. అలాగే, యాప్‌లోని ‘షౌట్’ బటన్ ద్వారా లొకేషన్‌తో కూడిన సందేశం పోలీసులకు చేరవేసే ‘112 ఇండియా’ యాప్‌పై అవగాహన పెంచాలి.– శ్రీనివాస మాధవ్, ఆర్టీఐ పరిశోధకులు -
పీజీ సెంటర్ నుంచి యూనివర్సిటీ దాకా...
1960ల వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య, పరిశోధనలకు ప్రధానంగా మూడు విశ్వవిద్యాలయాలే ఉండేవి. హైదరాబా ద్లో ఉస్మానియా, విశాఖపట్నంలో ఆంధ్ర, తిరుపతిలో శ్రీవేంక టేశ్వర. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల విద్యార్థులు స్నాతకోత్తర విద్య కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇది వారికి అదనపు ఆర్థిక భారాన్ని, ప్రయాసను కలిగించేది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, 1956 డిసెంబరులో జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సమావేశంలో కళాప్రపూర్ణ వావిలాల గోపాలకృష్ణయ్య గుంటూరులో స్నాతకోత్తర కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.అయితే, ఆ ప్రతిపాదన వెంటనే కార్యరూపం దాల్చలేదు. తరువాత డా‘‘ సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడు ఆచార్య ఎస్.గోపాల్ నేతృత్వంలోని కమిటీ సూచనలతో గుంటూరులో పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. 1967లో ఆచార్య ఎస్.మీనాక్షి సుందరం ప్రత్యేకాధికారిగా నియమి తులై గుంటూరుకు వచ్చారు. తొలుత గుంటూరు మెడికల్ కళాశా లలో కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నల్లపాడు లోని ఎం.బి.టి.ఎస్. పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని ప్రత్యేక భవనంలో స్నాతకోత్తర కేంద్రం ప్రారంభమైంది. ఒకేసారి తొమ్మిది స్నాతకోత్తర కోర్సులతో ప్రారంభమైన ఈ కేంద్రం గుంటూరు ప్రాంతంలో ఉన్నత విద్యకు కొత్త దిశను చూపింది.గుంటూరులో ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ కేంద్రం ప్రారంభ మైన తరువాత ఉన్నత విద్యా విస్తరణకు కొత్త దశ మొదలైంది. విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాల విద్యార్థులకు అందు బాటులో ఉండేలా కాజ–నంబూరు ప్రాంతంలో సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. భవ నాలు, రహదారులు, ఇతర మౌలిక వసతులతో పాటు పెద్దఎత్తున మొక్కలు నాటడం వల్ల ఆ ప్రాంగణం పచ్చదనంతో అలరిస్తోంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచార్య శాంతప్ప కమిటీ సిఫార్సులను ఆమోదించి, 1976లో 16వ శాసనం ద్వారా పీజీ కేంద్రానికి స్వయంప్రతిపత్తి కల్పించింది. అనంతరం నల్లపాడులో కొనసాగుతున్న పీజీ కేంద్రాన్ని నంబూరులో నిర్మించిన శాశ్వత భవనాల్లోకి తరలించారు. ఈ పరిణామానికి కొనసాగింపుగా 1976 ఆగస్టులో 43వ శాసనం ద్వారా నాగార్జున విశ్వవిద్యాలయం ఏర్పడింది. పీజీ కేంద్రం డైరెక్టర్ ఆచార్య ఉప్పలపాటి బాలయ్యనే తొలి ఉపకులపతిగా నియమించ డంతో పూర్తిస్థాయి పరిపాలనా వ్యవస్థ ఏర్పడింది.1976 సెప్టెంబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా నాగార్జున విశ్వవిద్యాలయం లాంఛనంగా ప్రారంభమైంది. మహాబౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరును సార్థకం చేస్తూ, ప్రాచీన భారతీయ జ్ఞాన సంపదను ఆధునిక శాస్త్రీయ ఆలో చనలతో మేళవించే విద్యాకేంద్రంగా ఇది ఎదగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ‘సత్యే సర్వం ప్రతిష్ఠితమ్’ అనే నినాదం విశ్వవిద్యాలయ లక్ష్యాన్ని ప్రతిబింబించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ నం.1/2004 ద్వారా 2004 జనవరి 24 నుంచి ‘నాగార్జున విశ్వవిద్యాలయం’ పేరు ‘ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం’గా మారింది.విశ్వవిద్యాలయ ప్రగతిలో దూర విద్యా కేంద్రం ఒక ముఖ్య మైన మైలురాయి. ఒక దశలో సుమారు 2.5 లక్షల మంది విద్యార్థు లకు 144 కోర్సుల ద్వారా విద్యను అందించింది. ఈ కేంద్రం విద్యను అందరికీ చేరువ చేయడంతో పాటు విశ్వవిద్యాలయానికి ఆర్థిక పరిపుష్టిని అందించింది. విశ్వవిద్యాలయం విద్య, పరిశోధ నతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ తన ప్రతిభను చాటు కుంటోంది. 2024 టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ యంగ్ యూనివ ర్సిటీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 401–500 శ్రేణిలో, జాతీయ స్థాయిలో 26వ, రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. పరిశో ధనకు సంబంధించిన కోర్సులతో పాటు ప్రత్యేక కేంద్రాలు, చైర్లు కూడా విశ్వవిద్యాలయ విద్యా వైవిధ్యాన్ని పెంచుతున్నాయి.– వాసా మాణిక్యాలరావు, పూర్వ జాయింట్ రిజిస్ట్రార్ (ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా) -
అన్నదాన మహిమ!
‘అన్నదానాత్పరం నాస్తి దానమన్యదిలాతలే.’ ఈ భూలోకంలో అన్నదానం కంటె గొప్ప దానం మరొకటి లేదు. నిత్యం అన్నదానం చేసే ఓ వ్యక్తి తన మరణానికి ముందు తన కుమారుణ్ణి పిలిచి, తాను చేసినట్లే అన్నదానం చేయాలని కోరాడు. తన దగ్గర అంతగా డబ్బులేని ఆ కుమా రుడు తన సమస్యను నారాయణునికి నివేదించడానికి బదరీకి బయలుదేరాడు.దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు నిండా పండ్లు ఉన్నాయి. వాటిని ఎవరూ ముట్టుకున్న జాడ కనిపించలేదు. ఒక పాము ఎవరు ఎంత కొట్టినా తనకు చావు రావడంలేదని చెప్పింది. ఒక పొలం యజమాని తన పండిన పంట తనకు దక్కడం లేదని వాపోయాడు. తమ సమస్యలను బదరీ నారాయణునికి నివేదించమని కోరారు. దారిలో ఆకలితో ఒక బోయవాని ఇంటికి వెళితే బోయవాడు తన కోసం ఉంచుకున్న దుంపలను ఆ బాటసారికి ఇచ్చాడు. అతడి భార్యాపిల్లలు తమ దుంపలను ఇవ్వడానికి నిరాకరించారు. తెల్లవారే టప్పటికి ఓ పులి బోయవాణ్ణి, అతడి కుటుంబాన్ని చంపిన దృశ్యం చూశాడు.బదరీ వెళ్లి నారాయణునితో ముందుగా ఇతరుల సమస్యలే నివేదించాడు. అందుకా నారాయణుడు పూర్వ జన్మలో ఒక వేదపండితుడు ఎవరికీ వేద పాఠం చెప్పకుండా చనిపోయి ఈ జన్మలో ప్రయోజనం లేని పండ్ల చెట్టయి పుట్టాడనీ, ఇప్పుడు ఎవరికైనా వేదం చెబితే అతడి సమస్య తీరుతుందనీ చెప్పాడు. పాము పూర్వజన్మలో పెద్ద ఆస్తిగల పిసినారి అనీ, ఇప్పుడు తన మణి మాణిక్యాలకు కాపలా కాస్తూ పడివున్నదనీ, వాటిని ఎవరికైనా దానం చేస్తే సమస్య తీరుతుందనీ చెప్పాడు. పొలం యజమాని తన ముగ్గురు కూతుళ్ళకు కన్యాశుల్కం తీసుకున్నాడనీ, ఇప్పుడు నాలుగో కుమార్తెకు కన్యా శుల్కం తీసుకోకుండా పెళ్లి చేస్తే అతడి పంట చేతికి వస్తుందనీ చెప్పాడు. ఇక బోయవాని ఉదంతం తెలుసుకోవాలంటే ఇప్పుడే కాశీరాజుకు జన్మించిన కుమారుని వద్దకు వెళ్ళమన్నాడు.బాటసారి ఆ పసిబాలుని దగ్గరకు వెళ్లగా ‘నీకు ఆకలి వేసినప్పుడు దుంపలను ఆహారంగా ఇచ్చిన బోయవాడిని నేనే! తమవంతు ఆహారాన్ని పెట్టని నా భార్య, బిడ్డలు ఈ జన్మలో పందిపిల్లలుగా పుట్టారు’ అని చెప్పాడు. దీంతో అన్నదాన మహిమ అర్థమైన బాటసారి నారాయణుడు చెప్పిన పరిష్కార మార్గాలు రైతు, పాము, మామిడి చెట్టుకు చెప్పాడు. దీంతో, రైతు తన కుమార్తెను బాటసారికిచ్చి పెండ్లి చేశాడు. పాము తన సంపదనంతా అతడికే ఇచ్చింది. మామిడి చెట్టు రూపంలోని పండితుడు వేద పాఠం చెప్పాడు. అందరి సమస్యలను పరిష్కరించిన బాటసారి ధనం, విద్య, భార్యతో తల్లిని చేరి అన్నదానం ప్రారంభించి ధన్యుడయ్యాడు.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
శాస్త్రీయతలేని విధానాలతోనే విపత్తులు
హిమాలయాలు ఒకదాని తర్వాత ఒకటిగా హెచ్చరికలు చేస్తూనే వస్తున్నాయి. ఆకస్మిక వరదలు, హిమ పాతాలు, హిమానీనద సరస్సులకు గండి పడటంతో ముంచెత్తుతున్న వరదలు, మేఘ విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం, తీవ్రంగా భూమి కుంగిపోవడం వంటివి వాటి కోవలోకి వస్తాయి. కేదార్నాథ్, ధౌళిగంగ, జోషీమఠ్, సిక్కిం, ఇపుడు నేపాల్‌లోకి సరిహద్దులు దాటి వచ్చిన వరదలు అలాంటివే. అటువంటి ప్రతి ఉత్పాతంలోనూ వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అపారమైన విధ్వంసం కనుల ఎదుట నిలుస్తోంది. హిమాలయాలలో సంభవిస్తున్న విపత్తులను ఎదుర్కొనేందుకు బహుముఖ వ్యూహం అవసరం. శాస్త్రీయ పరిశోధనలు సాగించడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేసే యంత్రాంగాలను తయారు చేసుకోవడం, ప్రజా చైతన్యం తీసుకు రావడం, సమాజాలను కూడా ఈ కృషిలో భాగస్వాములుగా చేయడం వంటివి చేపట్టక తప్పదు. నివేదికలు వెల్లడిస్తున్న వాస్తవాలువాతావరణ మార్పుపై ఏర్పడిన వివిధ ప్రభుత్వాల ప్యానెల్ అంతర్జాతీయ స్థాయిలో వివిధ నివేదికలను ప్రచురించింది. గ్లేసియర్లు, పర్వత ప్రాంతాలలోని జీవావరణ వ్యవస్థల గురించి వివిధ దేశాలు వాటి పరిశోధనల్లో కనుగొన్న అంశాలకు ఒక సమగ్ర రూపం ఇచ్చింది. మన దేశంలోనూ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిమోట్ సెన్సింగ్ ఇమేజరీని ఉపయోగించి (మొత్తం 28,000లలో) 7,500లకు పైగా గ్లేసియల్ సరస్సుల మ్యాప్‌ను రూపొందించింది. హై–రిస్క్ గ్లేసియల్ సరస్సులకు సంబంధించి అది వరద ముప్పుల మ్యాప్‌ను కూడా తయారు చేసింది. ఐసు గడ్డలు, బండరాళ్ళు కట్టలుగా ఉన్న సరస్సులు ఒక్కసారి తెగిపడితే రాగల వరదలు, వాటివల్ల దిగువ పరీవాహక ప్రాంతాల్లోనున్న జనావాసాలకు వాటిల్లగల నష్టాల గురించి కూడా అది తెలియజేసింది. కాఠ్మాండూకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటెగ్రే టెడ్ మౌంటైన్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) మొన్నీమధ్య అంటే 2026 మార్చిలో కూడా రెండు గణనీయమైన నివేదికలను ప్రచురించింది. వాటిలో ఒకటి హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో 1990 నుంచి 2020ల వరకు మారుతున్న గ్లేసియర్ల గతిశీలతలను వివరించింది. మరోటి 2026 నాటికి ఉన్న హిందూ కుష్ హిమాలయ గ్లేసి యర్ల స్థూల స్వరూప స్వభావాలను వెల్లడించింది. ఈ నివేదికలు వెల్లడిస్తున్న అంశాలు ఆందోళన రేపేవిగా ఉన్నాయి. మొదటి నివేదిక 55 వేలకు పైగా చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హిందూ కుష్ ప్రాంతమంతటానున్న 63,761 గ్లేసియర్ల డేటాను ఆధారం చేసుకుని రూపొందింది. వాటిలో 5,700 క్యూబిక్ కిలోమీటర్ల మేర ఐసు నిల్వలున్నాయి. నలుచెరగులా ఉన్న ఈ గ్లేసి యర్లు 1990ల ఆరంభం నుంచి స్థిరంగా కరిగిపోతూ వస్తున్నా యని ఆ విశ్లేషణ తెలిపింది. మొత్తం గ్లేసియర్ ప్రాంతంలో 12 శాతం తరిగిపోయింది. అంచనా వేసిన హిమ నిల్వలలో 9 శాతం క్షీణత కనిపించింది. గ్లేసియర్లు అలా కుంచించుకుపోవడం 2010 నుంచి 2020 మధ్య కాలంలో మరీ కొట్టొచ్చినట్లు కనిపించింది. సింధు నదీ పరీవాహక ప్రాంతం 6 శాతం గ్లేసియర్ ప్రాంతాన్ని కోల్పోయింది. గంగా నది 21 శాతం, బ్రహ్మపుత్ర 16 శాతం తరుగుదలను నమోదు చేశాయి. హిమం గడ్డకట్టిన ప్రాంతాలు కుంచించుకు పోవడం వల్ల వర్షాకాలం మినహా ఇతర కాలాల్లో నీటి లభ్యత తగ్గి పోతోంది. రెండవ నివేదిక 38 గ్లేసియర్ల సన్నిహిత పరిశీలనతో తయారైంది. హిమాలయాల్లో హిమం గడ్డకట్టిన భూభాగాల్లో కొన్ని పాతరూపును పూర్తిగా కోల్పోయే స్థితికి చేరుకున్నట్లుగా కనిపిస్తున్నా యని ఈ నివేదిక వెల్లడించింది. ‘‘ఇది ఎక్కడో సుదూరంలో ఉన్న సమస్య కాదు. నేటి కాలంలో ఆవిష్కృతమవుతున్న సంక్షోభం. ప్రతి వేసవిలోను, వర్షాకాలంలోను కొత్త ఉపద్రవాలను చూస్తున్నాం. హిమాన్ని కోల్పోతున్న రేట్లు ఈ శతాబ్దంలో రెండింతలైన వాస్తవ మైనా కనీసం మన కళ్లు తెరిపించాలి’’ అని ఐసీఐఎంఓడీ డైరెక్టర్ జనరల్ పెమా గ్యాంషో అన్నారు. నేపాల్‌లో ఇటీవల చూసిన వరదలు గ్యాంషో హెచ్చరికలోని వాస్తవాన్ని ఎత్తి చూపాయి. ఇది గ్లేసియర్ గతిశీలతల సైన్స్, ఉపగ్రహాల విశ్లేషణ, 1974 నుంచి క్షేత్ర స్థాయిలో సేకరిస్తూ వస్తున్న డేటాను ఆధారం చేసుకుని చేసిన స్పష్టమైన హెచ్చరికగా భావించవచ్చు. రుణాలు ఎలా ఇస్తున్నారు?డేటాను విశ్లేషించడం ద్వారా, నిష్క్రియాపరత్వం వల్ల కలిగే ప్రమాదకర పర్యవసానాలను తెలుపడం ద్వారా సైంటిస్టులు తమ వంతు కృషి చేస్తున్నారు. కానీ, విధాన నిర్ణేతల స్పందనే మంద కొడిగా ఉంది. అంతర్జాతీయంగా కూడా, వివిధ దేశాల ప్యానెళ్ళ నివేదికలపై స్పందన లోపభూయిష్టంగా ఉంది. ముఖ్యంగా, పుడమి తాపాన్ని తగ్గించేందుకు ఉద్గారాలను తగ్గించు కోవాల్సిన అంశంపై వాటి కార్యాచరణ పేలవంగా ఉంది. దాని ప్రత్యక్ష ఫలితం హిమా లయాలపై పడుతోంది. ప్రాంతీయ స్థాయిలో హిమాలయ ప్రాంతంలోని దేశాల మధ్య సహకారం బొత్తిగా లేదనే చెప్పాలి. ప్రాంతాల మధ్య రాజకీయ సరిహద్దులను ప్రకృతి ఉత్పాతాలు, వాతావరణం గుర్తించవు కనుక ఈ ప్రాంతంలోని దేశాలు సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుని తీరాలి. సింధు, గంగ, బ్రహ్మపుత్ర, మెకాంగ్ వంటి పెద్ద నదులన్నీ హిమాల యాలలోనే పుడుతున్నాయి. వివిధ దేశాలను దాటి ప్రవహిస్తు న్నాయి. కనుక, ఒక దేశంలో ఆ నదిలోకి కొండ చరియలు విరిగి పడితే, అది మరో దేశంలో వినాశకర వరదలకు కారణంగా పరిణ మించవచ్చు. లిహెండే ఖోలా నదిలో గత ఏడాది జూలైలో సంభవించిన విపత్తు అదే రసూవా, నువాకోట్ ప్రాంతంలోని కనీసం అర డజను జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులకు నష్టం కలిగించింది. ఇపుడు వార్తలకెక్కిన ప్రాంతం అప్పుడూ ఇంచుమించుగా ఇవే కారణాలపై వార్తలకెక్కింది. త్రిశూలి పరీవాహక ప్రాంతంలో దాదాపు 36 జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. బహుళ జాతీయ రుణ సంస్థలు కూడా ఆయా అంశాలు వేటినీ లెక్కలోకి తీసుకోకుండా రుణాలు ఇస్తూనే ఉన్నాయి. ఆనకట్టలు, నదులు, ప్రజానీకంపై అధ్యయనం చేసిన సౌత్ ఏషియా నెట్వర్క్ విశ్లేషణలో ఆ అంశాలు వెలుగు చూశాయి. భారతదేశంలో కూడా ప్రకృతి ఉత్పాతాలు, హిమ పాతాలు సంభవించే, శిథిల ప్రవాహాలుసాగే ప్రాంతాల్లో జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులు చురుకుగా సాగుతున్నాయి. రెండూ సాగవు!హిమాలయాల్లో జీవావరణ పరంగా సున్నితమైన ప్రాంతాలు రాజకీయంగా కూడా సున్నితమైనవి. అవి భారత్, చైనా, నేపాల్ సరిహద్దుల గుండా వ్యాపించి ఉన్నాయి. వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా మౌలిక వసతులను పెద్దయెత్తున అభివృద్ధి చేస్తున్నాయి. పైగా, సామూహిక యాత్రలను, వాణిజ్యపరమైన పర్వత ప్రాంత టూరిజాన్ని అవి ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నాయి. కానీ, పర్యావరణపరంగా పెళుసైన ప్రాంతాల్లో నిర్నిరోధ అభి వృద్ధి, కమర్షియల్ టూరిజం చెట్టపట్టాలేసుకుని సాగలేవని గ్రహించాలి. శాస్త్రీయ ఆధారాలు, విధాన నిర్ణయాల మధ్య అగాథాన్ని భర్తీ చేయడం ద్వారా పర్వత ప్రాంతాల్లో సంభవించగల విపత్తుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ప్రజల హృదయాల్లో చెరగని సంతకం
ప్రజల జీవితాలను మార్చిన నాయకులు ప్రజల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోతారు. అలాంటి అరుదైన ప్రజా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల మూడు నెలల స్వల్ప కాలంలోనే సంక్షేమం, వ్యవసాయం, సాగు నీరు, విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లో తీసుకున్న నిర్ణయాలు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక చరిత్రను మార్చేశాయి. వైఎస్సార్ పాలనకు అసలు బలం ఆయన అధికారంలోకి రావడానికి ముందే పాదయాత్ర చేసి ప్రజలతో మమేకవడమే. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1,470 కిలోమీటర్లకు పైగా సాగిన ఆయన ప్రజా ప్రస్థానం కేవలం ఒక రాజకీయ పాదయాత్ర కాదు. అది గ్రామీణఆంధ్రప్రదేశ్ వాస్తవ పరిస్థితులను స్వయంగా తెలుసుకున్న ఒక నాయకుడి సామాజిక అధ్య యనం. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ‘ప్రజలు’ కేంద్ర బిందువుగా పలు చారి త్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.రైతు సంక్షేమానికి వైఎస్సార్ ఇచ్చిన ప్రాధాన్యం ఆయన పాలనా తత్వానికి అద్దం పడుతుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించే నిర్ణయంపై తొలి సంతకం చేయడం ఒక సాధారణ ప్రభుత్వ ఉత్తర్వు కాదు. విద్యుత్ బకాయిల రద్దు, వ్యవసాయానికి ప్రోత్సాహం, సాగునీటి విస్తరణ వంటి చర్యలతో రైతాంగానికి ఆయన ఒక కొత్త భరోసాను కల్పించారు. అదే సమయంలో కరవుతో అలమటిస్తున్న ప్రాంతా లను శాశ్వతంగా మార్చాలన్న సంకల్పంతో ‘జలయజ్ఞం’కు శ్రీకారం చుట్టారు. పోలవరం, ప్రాణహిత–చేవెళ్ల, దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ వంటి అనేక ప్రాజెక్టులు ఆయన కాలంలోనే రూపుదిద్దుకున్నాయి.స్వయంగా వైద్యుడైన వైఎస్సార్ పేదలకు వైద్యం భారం కాకూడదనే గొప్ప ఆలోచనతో ఆరోగ్యశ్రీ, ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడేందుకు 108, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు 104 వంటి కార్య క్రమాలు తీసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను చేరువ చేశారు. ఇంది రమ్మ ఇళ్లు, పావలా వడ్డీ రుణాలు, పింఛన్ల పెంపు వంటి చర్యలు... సంక్షేమాన్ని వైఎస్సార్ ప్రభుత్వ విధానంలో అంతర్భాగంగా మార్చాయి.హైదరాబాద్ అభివృద్ధిలోనూ వైఎస్సార్ దూరదృష్టి స్పష్టంగా కనిపిం చింది. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఆయన పాలనలోనే తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్ గ్రేటర్ నగరం విస్తరణకు పునాదులు వేశాయి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా రైతు పొలంలో, పేదవాడి ఇంటిలో, విద్యార్థి కలలో, రోగి చికిత్సలో, సాగునీటి ప్రాజెక్టుల్లో ఆయన పరిపాలనా ముద్ర కనిపిస్తూనే ఉంటుంది.చదవండి: మానవతా మహర్షి...బి. మహేశ్ కుమార్ గౌడ్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
నిక్కమైన రైతు బాంధవులు
ఎంఎస్ స్వామినాథన్‌కూ, వైఎస్ రాజ శేఖరరెడ్డికీ మధ్యన పోలికేంటి? వారిద్దరూ ఎక్కడైనా, ఎప్పుడైనా కలసి పనిచేశారా? లేదు. వారిద్దరూ నడిచిన బాటలు వేరే అయినప్పటికీ గమ్యం ఒక్కటే. అదే రైతు సంక్షేమం. స్వామినాథన్ ప్రముఖ శాస్త్ర వేత్త. భారత దేశంలో హరిత విప్లవానికి పితామహుడు. 1971 వరకూ ఇండియా ఆహార కోరతతో, పీఎల్ 420 పేరిట అమె రికా పంపుతున్న గోధుమల సాయంతో భారంగా బండినీడ్చుకుంటూ వస్తున్న దేశం. స్వామినాథన్ సృజన, పరిశ్రమ, దూరదృష్టితో దేశంలో ఆహార కొరతను అధిగమించాం. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఉత్పత్తి ఖర్చులు కూడా పెరిగాయి. రైతు పరిస్థితి మాత్రం అధ్వాన్నమైంది. ఈ దశలో రైతును ఆదుకునే రాజకీయ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మనసున్న మహారాజుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవతరించారు. స్వామినాథన్ శాస్త్రీయ దృక్పథం, వైఎస్ రైతుబాంధవ్యం కలసి రైతులను ఆదుకున్నాయి.హరిత విప్లవానికి కొనసాగింపు...‘ఎవర్ గ్రీన్ రివల్యూషన్’ అనే మాటను సృష్టించిన వ్యక్తి ‘భారతరత్న’ స్వామినాథన్. గ్రీన్ రివల్యూషన్ తాత్కాలికమైనది కాదనీ, అది ఎప్పటికీ పురోభివృద్ధి చెందుతూ ఉండాలనీ ఆయన ఉద్దేశం. పంట దిగుబడి పెంచడం ఒక ఎత్తయితే, రైతుకు నష్టం లేకుండా చూడటం మరో ఎత్తు. స్వామినాథన్ పంట దిగుబడిని పెంచగలిగాడు కానీ ఉత్పత్తిదారులు అంటే రైతులు సంతోషంగా, సుఖంగా జీవించే విధంగా వారి జీవితాలను మార్చలేకపోయారు. ఇది శాస్త్రవేత్తల వల్ల అయ్యే పనికాదు. ఇందుకు అంకితభావం కలి గిన రాజనీతిజ్ఞుడు అవసరం. రాజశేఖరరెడ్డి వంటి నాయకుడు, పల్లెలు, రైతుల జీవితాలు క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కావాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యవసాయాన్ని శాస్త్రవేత్త కోణంలో చూడ లేదు. రాజకీయవేత్తగా చూశారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి మూడున్నర దశాబ్దాల కిందటి నుంచి గ్రామాలు గురించీ, రైతుల గురించీ, రైతులు ఎదుర్కొనే కష్టాల గురించీ అవగాహన పెంచుకున్న రాజకీయ నాయకుడు ఆయన. కడపలో వైద్యుడిగా పని చేసిన రోజుల నుంచి 1978లో శాసన సభకు ఎన్నికైన తర్వాత ఓటమి ఎరుగకుండా అసెంబ్లీలోనో, పార్ల మెంటులోనో ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ ప్రజాసమస్యలను అవగాహన చేసుకున్న ప్రజల మనిషి ఆయన. 2003లో సుమారు పదిహేను వందల కిలోమీటర్లు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ నుంచి శ్రీకాకుళం వరకూ పల్లెలనూ, పొలాలనూ, చిన్నపట్టణాలనూ దాటుకుంటూ, రకరకాల వ్యక్తులతో మాట్లాడుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేసిన ప్రజానాయకుడు. ఆ పాద యాత్రలో అవగతమైన అంశాలే ముఖ్యమంత్రిగా తాను రూపొందించిన విధానాలకు ప్రాతిపదికలైనాయి.రైతులు ఎదుర్కొంటున్నది ఒక సమస్య కాదు. మంచి వంగడం దొరికితే నీరు అందదు. నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తక్కువ వడ్డీకి రుణాలు లభించవు. ఇవన్నీ ఉన్నప్పటికీ సకాలంలో వానలు కురియవు. అన్నీ సవ్యంగా ఉండి పంట దిగుబడి అధికంగా వచ్చి నప్పటికీ మార్కెట్లో పంటకు తగిన ధర పలకదు. ఈ కష్టాలన్నీ వైఎస్‌కు కరతలామలకం కనుకనే ఆయన ప్రభుత్వం చేపట్టిన పథకాలూ, కార్యక్రమాలూ అన్ని సమస్యలకూ సమాధానాలు అందించాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నచ్చజెప్పి రెండు లక్షల వరకూ రైతుల రుణాలను మాఫీ చేయించారు. ఇది దేశంలో మరో ముఖ్యమంత్రి ఎవ్వరూ చేయని సాహసం. నీరు అందించడం కోసం జలయజ్ఞం పేరిట నీటి ప్రాజెక్టుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ రైతుల ఆత్మహత్యలను నివారించడానికీ, రైతుల గుండెలలో ధైర్యం నింపడానికీ అవసరమైన చర్య. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత విస్తృతంగా జలవనరుల అభివృద్ధికి చొరవ తీసుకోలేదు. వ్యవసాయదారులకు కరెంటు ఉచితంగా సరఫరా చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజులలోనే (2004 మేలోనే) ఈ సంస్కరణ ప్రవేశపెట్టారు. రైతులకు ఆరోగ్య బీమా ప్రవేశ పెట్టారు. ఒక సమగ్రమైన రైతు సంక్షేమ పథకాల ప్రణాళికను వైఎస్ తన ప్రభుత్వంలో ఆవిష్కరించడానికి ప్రధాన కారణం ఆయనకు రైతుల ఖర్చుల పట్ల, కష్టాల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉండటమే.సరిగ్గా ఇక్కడే స్వామినాథన్, వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితాలని తరచి చూడాలి. స్వామినాథన్ సైన్సుద్వారా కృషి చేశారు. రాజ శేఖరరెడ్డి పరిపాలన ద్వారా రైతు జీవితాలలో ఆనందం తొంగి చూసేందుకు సహకరించారు. సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం, గిట్టు బాటు ధరల ద్వారా రైతుల దిగుబడి పెంచి, వారికి గిట్టుబాటు ధర లభించడం ఎట్లాగా అన్న ప్రశ్నలకు సమాధానాలను స్వామినాథన్ అన్వేషించారు. వ్యవసాయపు ఖర్చుల భారాన్ని రైతుల భుజాలపై నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ఏమి చేయగలదో రాజశేఖరరెడ్డి ఆలోచించారు. ఒకరు వ్యవసాయానికి శాస్త్రీయ పునాదులు వేస్తే, మరొకరు వ్యవసాయం గిట్టుబాటు కావడానికి అవసరమైన రైతు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇద్దరూ కలసి ఎవరి దారిలో వారు చొరవ తీసుకున్నప్పుడే వ్యవసాయం బాగుంటుంది. రైతుల జీవితాలు గౌరవప్రదంగా ఉంటాయి. అందుకే, ‘డాక్టర్ వైఎస్ రాజ శేఖర రెడ్డి అవార్డు– 2026’ను నేడు దిల్లీలో జరిగే సభలో స్వామి నాథన్ ఫౌండేషన్‌కు ఇవ్వడం, అవార్డును ఎం.ఎస్. స్వామినాథన్ కుమార్తె డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ స్వీకరిస్తుండటం సముచితం.ఉండవల్లి అరుణ్కుమార్వ్యాసకర్త లోక్‌సభ మాజీ సభ్యులు -
మానవతా మహర్షి...
జననం వల్ల వంశగౌరవం తెలుస్తుందేమో గానీ, మరణం వల్ల ఆ మనిషి ప్రపంచం మీద చూపిన ప్రభావం, ప్రజల మీద వేసిన ప్రత్యేక ఆత్మీయ ముద్ర, చెలిమితో చేసిన పని, గుండెల్ని తట్టిలేపి అందులో వికసిత సితవదన రాజశేఖరమై వెలుగొందడం తెలుస్తుంది. ఇది అక్షరాలా ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ దివంగత ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖరరెడ్డికి వర్తిస్తుంది. మహాత్ములకు మరణం ఉండదు. వారు భౌతికంగా మనకు కనిపించకపోవచ్చు కానీ కొన్ని తరాల వరకు వారి జ్ఞాపకాలు నిత్య హరితంగా, నిత్యస్మరితంగా మనవెంట ఉంటాయి. వారు చేసిన మంచి పనులు మనసుకు కనిపిస్తూ వారి కీర్తి స్ఫూర్తి కాయాన్ని కళ్ళముందు నిలిపి కన్నులు చెమ్మగిల్లేలా చేస్తాయి. రాజన్న శరీరం మనల్ని వదలి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయనను నిత్యం తలచుకుంటున్నారు అంటే ఆశ్చర్యం, ఆనందం. ప్రజలను ఆయన తన గుండెలా చూసుకుంటే, ఆయనకు ప్రజలు తమ గుండెల్లో గుడి కట్టారు. మానుషరూప దైవం ఆయనే అన్నట్లు తమ పూజా మందిరాలలో ఆయన చిత్ర పటాన్ని ఉంచారు. అంత గొప్ప స్థానం దక్కించుకోవడం ఎవరికి సాధ్యమౌతుంది, అసాధ్యాలను సాధ్యాలు చేసిన రాజశేఖరరెడ్డికి తప్ప.ఇచ్చుటలో ఉన్న హాయి...కొందరు కారణం లేకుండా సమాజంతో, పరిస్థితులతో రాజీపడరు. సేవ చేయటానికి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటారు. అధికారం ఉన్నా, లేకున్నా. అదీ రాజశేఖరరెడ్డి. అందుకే ఆకాశ మంత ప్రేమ ఆయనంటే అందరికీ. అప్పట్లో వెనుకబడిన పేదరిక ప్రాంతం కడప జిల్లాలో జన్మించి గడపగడపలో ఆయన చిత్ర పటాన్ని పెట్టుకునే స్థాయికి ఎదగడం సామాన్యం కాదు. బాల్యం నుంచే భిన్నంగా ఆలోచించడం, చుట్టూ ఉన్న పేదరికానికి చలించి వారికి ఏదో చేయాలి అని తపించడం వల్లే అది సాధ్యమైంది. నేర్చుకునే గుణాన్ని ఆయన ఆఖరి క్షణం వరకు వదలలేదు. ‘తీసుకోవడం కాదు ఇవ్వడం వల్ల ప్రేమ రెట్టింపు అవుతుంది’ అనేవాడు. ఇవ్వడంలో ఉన్న హాయి ఆయన తెలుసుకోవడమే గాక అందరికీ తెలియచెప్పాడు. చెప్పడమే కాదు ఆచరించాడు. ఆ గుణం వల్లే దేశంలోని ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేనన్ని వరాలు, సౌకర్యాలు, పథకాలు ఆయన ఉభయ రాష్ట్రాల తెలుగువారికి అందించాడు. కడపజిల్లా మట్టి వాసన పీల్చిన మొరటు మొండితనం, తప్పునకు ఏమాత్రం తలవంచక నిలబడి కలబడటం, వైద్యం చదివినందువల్ల మనసంతా కరుణ, ఎదుటివారి ప్రాణం ఎలాగైనా కాపాడి తీరాలన్న తపన, మాట ఇస్తే అందుకోసం ఎందాకా అయిన నిలబడి తీరాలన్న నిజాయితీ, అందిన అధికారాన్ని సేవకోసం మాత్రమే ఉపయోగించాలన్న ఆశయం– ఇవన్నీ సాకార ఆకారమై ముందు నిలిస్తే అది వైఎస్ రాజశేఖరరెడ్డి! ఆయన వ్యక్తిత్వం గురించి, మంచితనం గురించి ఎంత చెప్పినా ఏదో మిగిలే ఉంటుంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్న కాలంలోనూ, ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న కాలంలోనూ ఎందరికో సహాయం చేశాడు. బహిరంగంగా ఆయనను తిట్టినవాళ్ళు, రాజకీయంగా విమర్శించినవాళ్ళు సైతం ఆయన సహాయాన్ని పొందారన్నది పచ్చినిజం. ‘సహాయం చేయడంలో రాజకీయాలు, పార్టీలు ఎందుకు? మనం మనుషులం. ఎంతో నమ్మకంతో మన దగ్గరికి వచ్చి అడిగినపుడు, మనం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు చేసి తీరాలి’ అనేవాడు.ప్రజారోగ్యాన్ని నెత్తికెత్తుకొని...మానవీయ విలువల మహోన్నత వికాస మానసం ఆయనది. ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలన్న ఆలోచన ఎంత గొప్పది! ఈ రోజు రాజశేఖరరెడ్డి కారణంగా కొన్ని లక్షల ప్రాణాలు నిలిచాయి. ఆ కుటుంబాలు చితికిపోకుండా చిగురు వేశాయి. వారందరికీ ఆయన ప్రాణదాత, విధాత, విధి రాతను తిరిగి రాసిన నేత అన్నది సర్వాంగీకార సత్యం. జనం కోసం, రైతుకోసం, నీటికోసం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా సొంత పార్టీవారితో పోరాటం చేశాడు. పదవులు, పార్టీల కన్నా ప్రజలు, వారి అవసరాలు ముఖ్యం అని నిలబడ్డాడు. కుటుంబానికి పరిమి తమైన విద్యార్థి ‘రాజా’, ‘డాక్టరు రాజా’ అయ్యాడు. పేదల వైద్యుడిగా, ప్రజా వైద్యుడిగా ప్రయాణిస్తూ మరింత సేవ చేసేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేసి ‘రాజన్న’ అయ్యాడు. సమస్యను తక్షణం పరిష్కరించడం ఆయన ప్రత్యేకత. చూద్దాం, చేద్దాం అన్న మాట ఆయన నోట వినలేదు. ఎప్పుడూ అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసేవాడు. ఎండిన పొలాలు, మండుతున్న రైతు గుండెల్ని చూసి... పొలం గట్టు మీద కూర్చొని మథనపడేవాడు. ఒక్క ఎకరా కూడా నీరు లేకుండా ఎండకూడదు, అలా చేయటానికే అధికారంలోనికి రావాలి అనుకున్నాడు. ఇతరులు అధికారం పొంది ధనయజ్ఞం చేస్తే, రాజన్న జలయజ్ఞం చేశాడు. అందుకే ఆయన దేవుడయ్యాడు. ఎందరు కాదన్నా పట్టుదలతో రైతులకు ఉచిత విద్యుత్తు అందించాడు.రాజన్న తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన అనేక పథకాలను వివిధ రాష్ట్రాలు అనుసరించాయి. ప్రజల హృద యాలను, అవసరాలను, పేదరికపు వ్యథా భరిత జీవితాలను ఎంత చదివాడో, ఎంతగా ఆయన లోలో నలిగాడో గానీ... ఆయన ప్రవేశపెట్టిన ప్రజారోగ్య, విద్యా పథకాలను కాదని ఏ ప్రభు త్వమూ మనుగడ సాగించలేదు. పల్లె పల్లెలో, వీధి వీధిలో ఆయన విగ్రహాలు వెలిశాయి అంటే అందుకు కారణం ఇదే. చెప్పుకోవడం కాదు, చేతల్లో ఎలా ఉన్నాం, చేతనంలో ఎలా ఉన్నాం అన్నది మౌనంగా గ్రహిస్తారు ప్రజలు. వారికి తెలియ దనుకోవడం అమాయకత్వం. రాజశేఖరుని ఆంతర్యం ఆసాంతం అందరు గ్రహించారు. కాబట్టి ఆ విగ్రహాలు ఎవరికి వారు స్వచ్ఛందంగా వారి వారి ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవడం చరిత్రలో అసాధారణం, అసామాన్యం కదా! ఎంతమంది నాయకులు లేరు! ఆయన కన్నా ముందు ఎందరు పరిపాలించలేదు! ఎవ్వరికీ దక్కని కీర్తి ప్రతిష్ఠలు రాజశేఖరరెడ్డికే దక్కడం ఆయన అదృష్టం కాదు. ఆయన చేసిన కృషి, సేవ అందుకు కారణం. ఆగ్రహంతో అడవులలో ఆయుధా లతో తిరిగే అన్నలతో సైతం శాంతి చర్చలు జరిపాడే... అది చాలదా ఆయన శాంతి కామన ఆరాధన. ఎంతటి వారికైనా మరణం అనివార్యం. మరణం అంటే మనిషి లేకపోవడం. కానీ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలు, కీర్తి, చేసిన పనులు, వారి నుండి సహాయం పొందిన వ్యక్తులు, వ్యవస్థలు అన్నీ ఉన్నాయి. ఆయన మనమధ్యే ఉన్నారు, మనతో ఉన్నారు. నిత్య స్మరణలో ఉన్న మనిషికి మరణం ఉంటుందా! కొందరు సమాజాన్ని మార్చటానికే జన్మిస్తారట. అలాంటి సార్థక ధన్యజన్మ ఆయనది. అతి కొద్ది పరిపాలన కాలంలోనే, తిరుమల తిరుపతి దేవస్థానాలతో సహా రాష్ట్రంలోని అన్ని విభా గాలను ప్రక్షాళితం, ప్రజ్వలితం చేయగలిగాడు. రైతులు, ఉద్యో గులు, విద్యార్థులు, కార్మికులు అందరి ముఖాలలోను చిరునవ్వులు వెలిగించాడు. ఆయనతో కలిసి నడిచిన వ్యక్తిగా, ఆత్మబంధువుగా ఆయనను ఈ రోజు స్మరించుకోవడం నా భాగ్యం, నా ధర్మం, నా కర్తవ్యం. రామాలయం లేని గ్రామం ఉండవచ్చు కానీ రాజన్న జ్ఞాపక చిత్రం లేని ఒక్క హృదయాలయమూ ఉండదని గుర్తు చేస్తూ...భూమన కరుణాకర రెడ్డివ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు -
ఆదాయపు పన్ను – అముఖ మదింపు
Faceless Assessment ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన వారి రిటర్న్‌ల మదింపు ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతున్నది. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ చట్టబద్ధమైన తరవాత, ప్రభుత్వం ఎన్నో విధి విధానాలను మార్చేసింది. వాటిలో ఆదాయపు పన్ను అముఖ మదింపు (ఫేస్‌లెస్ అసెస్మెంట్) ఒకటి. ఇంతకు మునుపు ఆదాయపు పన్ను మదింపులు, పన్ను చెల్లింపుదారులు ఉండే ప్రదేశంలో నియమితులైన క్షేత్ర స్థాయి మదింపు అధికారుల పరిధిలో ఉండేది. ఆదాయపు పన్ను రిటర్న్‌లను పరిశీలించి, తేడాలుంటే వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయి అధికారుల ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేవారు. సరిగ్గా ఇక్కడే అవినీతి జరిగే ఆస్కారముండేది.పన్ను మదింపులో విప్లవాత్మకమైన మార్పును చేస్తూ కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు, దేశ ఆర్థిక ప్రగతికి దోహదం చేసే సంస్కరణకు 2019లో శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియలో పన్ను చెల్లింపుదారులకు ఏ అధికారి పన్ను మదింపు చేస్తున్నారో తెలి యదు. ఆ అధికారి కూడా కనిపించడు. ఇది కేవలం అముఖమదింపు మాత్రమే కాదు, ఈ ప్రక్రియలో భౌగోళిక పరిధి కూడా ఉండదు. ఇది ఒక విధంగా ‘జీరో ఎఫ్.ఐ.ఆర్.’ ప్రక్రియ లాంటిదే. ఆదాయపు పన్ను శాఖలో ‘నేషనల్ ఫేస్‌లెస్ అసెస్మెంట్ సెంటర్’ అనేది ఏర్పాటయ్యింది. ఈ కేంద్రం, కృత్రిమ మేధ సహాయంతో, పన్ను మదింపు అధికారుల బృందానికి పన్ను చెల్లింపుదారుల రిటర్న్‌లను పంపిస్తుంది. వారు ఆ రిటర్న్‌లను పరిశీలించి అభ్యంతరాలుంటే, తమ అభ్యంతరాలతో సహా నోటీసులను ఆదాయపు పన్ను వెబ్ సైట్లో అప్లోడ్ చేస్తారు. పన్ను చెల్లింపుదారులు ఆ నోటీసులకు సమాధానం, తమ వాదనకు రుజువుగా పత్రాలు, సాక్ష్యాలు మళ్లీ అదే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. కోరితే, పన్ను చెల్లింపుదారులకు ఆన్లైన్లోనే వ్యక్తిగతంగా తమ వాదనలు విని పించే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. మరింత సమయం కావాలన్నా, వాయిదా కావాలన్నా, ఇదే ప్రక్రియలో కోరవచ్చు. అంతే కాని, పన్ను చెల్లింపుదారులు మాటిమాటికి ఆదాయపు పన్ను కార్యాలయాలకు వెళ్లటం, రావడం అనే ప్రశ్నే ఉండదు. ఆ తరువాత పన్ను మదింపు అధికారుల బృందం– పత్రాలు, రుజువులు, వాదనలు పరిశీలించి తమ ఆదేశాలను ఎన్.ఎ. ఎఫ్.ఎ.సి. ద్వారా మళ్లీ అదే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. జరిమానా ఏమైనా విధిస్తే, లేక పన్ను అసలే చెల్లించకపోతే లేదా మరింత పన్ను చెల్లించాలని ఆదేశిస్తే, వాటిని వసూలు చేయడానికి ఆ పన్ను చెల్లింపుదారుల దస్త్రాన్ని అప్పుడు భౌగోళిక పరిధిలో ఉన్న క్షేత్ర స్థాయి మదింపు అధికారులకు పంపిస్తారు. ఒకసారి మదింపు జరిగి ఆదేశాలు జారీ అయిన తరువాత వాటిని మార్చే అధికారం క్షేత్రస్థాయి అధికారులకు ఉండదు కనుక క్షేత్రస్థాయి అధికారులు అవినీతికి పాల్పడే అవకాశ ముండదు. క్షేత్రస్థాయి మదింపు అధికారులు, రికవరీ సర్టిఫికేట్ నియమాలను అనుసరించి, పన్ను వసూలు చర్యలు చేపడతారు. అదేవిధంగా, ఆ ఆదేశాలపై కమిషనర్ స్థాయిలో అప్పీల్ చేయాలన్నా ఇదే పద్ధతిలో ఆన్లైన్లో అప్పీల్ చేయాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులకు సహాయంగా, ఆదాయపు పన్ను వెబ్సైట్లో ఈ అముఖ మదింపు విధానంలో పాల్గొనడానికి,ఆకళింపు చేసుకోవడానికి అన్ని సాంకేతిక వివరాలు విపులంగా పొందుపరచారు. ఈ ప్రక్రియ పారదర్శకమైనది. పన్ను చెల్లింపు దారులకు సౌకర్యవంతమే కాకుండా పన్ను మదింపు వేగవంతం అయింది. ఇది అవినీతిని రూపుమాపే దిశలో చాలా ప్రభావవంతమైన ఆధునీకరించిన సంస్కరణ. సాంకేతికతను ఉపయోగించి సాధించిన విశిష్టత. డిజిటల్ గవర్నెర్స్ లక్ష్య సాధనలో ఇదొక మైలు రాయి అని చెప్పడంలో సందేహంలేదు. – హరీష్ కుమార్ కొలిచెల అసిస్టెంట్ జనరల్ మేనేజర్ – లా (రిటైర్డ్), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
‘కాక్రోచ్’ పార్టీ సిద్ధాంతాలు ఏమిటి?!
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అనేది నిజానికి ఒక రాజకీయ పార్టీ కాదు. అట్లా మారే ఆలోచన కూడా లేదని, సమాజాన్ని వేధిస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడిని సృష్టించే ఉద్యమంగా మాత్రమే కొనసాగదలచుకున్నామని ఆ సంస్థ నిర్వాహకులు పదేపదే స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ సిద్ధాంతాలు ఏమిటనే ప్రశ్న ముందుకు వస్తూనే ఉండటం గమనార్హం. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. సిద్ధాంతా లనేవి పార్టీలకు మాత్రమే ఉండాలా? సీజేపీ వంటి ఉద్యమాలకు ఉండవా? ఉండకూడదని, ఉండవని ఎవరైనా సూత్రీకరిస్తే అది పొరపాటు అవుతుంది. ఈ మాట అనుకున్న తర్వాత రెండు ప్రశ్నలకు జవా బులు చెప్పుకోవాలి. ఒకటి, అసలు సిద్ధాంతాలు అంటే ఏమిటి? రెండు, ఆ ప్రకారం సీజేపీకి సిద్ధాంతాలు అనదగ్గవి ఉన్నాయా, ఉంటే ఏమిటవి? అదే విధంగా ఈ తరహా ప్రశ్నలు ఎదురైనప్పుడు సీజేపీ నిర్వాహకులు ఇస్తున్న సమాధాన మేమిటి? సిద్ధాంతం అనే మాటకు స్థూలమైన నిర్వచనం ఏమంటే ఒక వ్యక్తికి, లేదా పార్టీకి, లేదా సంస్థకు సమాజం పట్ల, సామాజిక సమస్యల పట్ల, అందుకు పరిష్కారాల పట్ల, భవిష్యత్తు పట్ల, దాని కోసం ఏమి చేయాలనే విషయమై తనదైన అవగాహన, కార్యాచరణ మార్గం ఉండటం. సిద్ధాంతం అనేది ఏ రంగం విషయంలోనైనా ఉంటుంది. ఇక్కడ సందర్భం సీజేపీ అయినందున సామాజిక రంగం గురించి చెప్పుకుంటున్నాము. సిద్ధాంతాలన్నవి రాజకీయ పార్టీలకే పరిమితం కానక్కర లేదని, సంస్థలకు కూడా ఉండవచ్చు నని, ఉండాలి కూడానని అనుకుంటున్నాము గనుక, ఇపుడు సీజేపీ గురించి విచారిద్దాము.ప్రకటన, పత్రం కనిపించని పోరాటంకొద్దిరోజుల క్రితం ఒక ఛానల్ ఇంటర్వ్యూలో సీజేపీ నిర్వాహకులు ఈ ప్రశ్నకు స్వయంగా చెప్పిన సమాధానం ఈ విధంగా ఉంది. ప్రశ్న: మీ సిద్ధాంతం మితవాదమా, మధ్యే మార్గమా, లేక వామపక్షమా? జవాబు: మేము రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని మొదటి నుంచి చెబుతున్నాం. ప్రశ్న: రాజ్యాంగానిది మధ్యే మార్గమంటారు కదా? జవాబు: ఏదైనా కావచ్చు. కానీ మాది రాజ్యాంగ మార్గం. సమానత్వ హక్కులు, భావప్రకటనా స్వాతంత్య్రం, విద్యాహక్కులు, శాంతియుతంగా నిరసన ప్రకటించే హక్కు వగైరాలు. ఇటువంటివి అనేకం రాజ్యాంగంలో ఉన్నాయి. వాటిని సరిగా పాటించినట్లయితే మన దేశం చాలా ముందుకు పోతుంది. మేము సెక్యులర్. మావి ప్రజాస్వామిక విలువలు. ఛానల్ చర్చ ఒకే ప్రశ్నతో క్లుప్తంగా ముగిసినందున సీజేపీ ఆలోచనలు పూర్తి రూపంలో వెల్లడి కాలేదనాలి. ఇతరత్రా కూడా వారు దీనిపై ఒక ప్రకటనగాని, పత్రంగానీ విడుదల చేయలేదు. సంస్థ ఆరంభమైన మొదటి రోజు నుంచే వారు కార్యక్రమాలలో తలమునకలుగా ఉండటం అందుకు కారణం కావచ్చు. ప్రస్తుతం ఉద్యమం వేడిలో నిర్వాహకులు చెప్పే కొద్ది మాటలు, చేసే కొద్ది కార్యక్రమాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. ముందుకు సాగిన కొద్దీ, ఇతర సామాజిక అంశాలపైనా దృష్టి పెట్టగలమంటున్నందున వాటి గురించి కూడా పలు ప్రశ్నలు ముందుకు వస్తాయి. అందువల్ల సీజేపీ, రాగల రోజులలో ఈ ప్రశ్నలపై దృష్టి పెట్టడం అవసరం అవుతుంది. సంస్థ నాయకుల నుంచి ఇంతవరకు వినవచ్చిన మాటలను, వారి కార్యక్రమాలను గమనించినపుడు వారి ఆలోచనలు, లేదా స్థూలమైన రీతిలో సిద్ధాంతాలు అనదగ్గ వాటిపై కొన్ని అంచనాలు ఏర్పడుతున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ అయిన అభిజీత్ దీప్కే అమెరికా నుంచి వచ్చి విమానాశ్రయం నుంచే భారత రాజ్యాంగాన్ని పైకెత్తి చూపటం చేశారు. జంతర్ మంతర్ ఆందోళన పొడవునా తనతోపాటు పలువురు ఇతర ఆందోళనకారులు అదే పని చేశారు. ఇదే ధోరణి ఇతర రాష్ట్రాలలోనూ కనిపించింది. ఈ స్ఫూర్తి ఎంతగా వ్యాపించిందంటే, ఇటీవల పట్నాలో పోలీసులు అదుపు లోకి తీసుకున్న ఆరేళ్ల పేద పిల్లవాడు ఆదిత్య రాజ్యాంగం గురించి, అంబేడ్కర్ గురించి మాట్లాడటం విన్నాము.రాష్ట్రాలకూ వ్యాపిస్తున్న ఆందోళనలుమొదటి రోజు నుంచే అభిజీత్ అనేకమార్లు గాంధీ, అంబేడ్కర్, నెహ్రూ, భగత్‌సింగ్‌ల ప్రస్తావనలు, కొద్దిసార్లు సుభాష్ బోస్ ప్రస్తా వన చేస్తున్నారు. వారి మార్గాన్ని అనుసరిస్తామన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలిచ్చారు. రైతాంగానికి సంఘీభావం ప్రకటించి వారిని తమకు మద్దతు తెలుపవలసిందిగా ఆహ్వానించటంతో పాటు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల వ్యవసాయ రంగానికి కలిగే నష్టాలపై వారు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు ప్రతినిధులను పంపారు. సీజేపీ మొదటినుంచే లేవనెత్తిన అంశాలలో మత రాజకీయాల పట్ల కూడా నిరసనలు కనిపించాయి. ఇపుడు పైన ప్రస్తావించిన ఛానల్ ఇంటర్వ్యూలోనూ అభిజీత్ తాము సెక్యులర్ వాదులమని ప్రకటించారు. ఈ అంశాలకే పరిమితం కాని నిర్వాహకులు పలు ప్రజాస్వామ్య సంబంధమైన సమస్యలను కూడా లేవనెత్తారు. అవి కోర్టులు, ఎన్నికల సంఘం సవ్యంగా పనిచేయక పోవటం, పార్టీ ఫిరాయింపులు, ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వాలకు జవాబుదారీతనం, పారదర్శకత లేకపోవటం, ప్రశ్నిస్తే ముద్రలు వేసి అణచివేయటం, అవినీతి, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, ధనిక– పేద తారతమ్యాలు మొదలైనవి అందులో ఉన్నాయి. ఈ ఉద్యమ వాతావరణం క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించింది.శూన్యాన్ని పూరించే శక్తి కాగలదా? ఇవన్నీ గమనించినపుడు సీజేపీది ఏ సిద్ధాంతమని భావించ వలసి ఉంటుంది? మితవాదమా, మధ్యేవాదమా, వామపక్ష వాదమా, లేక అసలు ఏ వాదమూ లేనిదనా? వారు తమది రాజ్యాంగ వాదమన్నారనుకోవాలి. ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన విషయాలు రెండు న్నాయి. సీజేపీ నాయకులను ప్రశ్నించిన ఛానల్ యాంకర్ అన్నట్లు భారత రాజ్యాంగం మధ్యేమార్గానిది ఎంతమాత్రం కాదు. అంబేడ్కర్, నెహ్రూలు సారథ్యం వహించిన ఆ గ్రంథం సోషలిస్టు, లేదా వామపక్షపు మొగ్గు గల మధ్యేమార్గ లక్షణాలు కలది. ఇపుడు సీజేపీ నిర్వాహకులు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అన్నీ అవే లక్షణాలతో ఉన్నాయి. ఇది మొదటి విషయం కాగా, స్వాతంత్య్రా నంతరం అందుకు వారసత్వం తీసు కున్నామన్న కాంగ్రెస్ ఆచరణలో విఫలమైంది. ఆ పార్టీ స్థానంలో అదే వారసత్వాన్ని కొనసాగిస్తామన్న జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లు కూడా విఫలమయ్యాయి. ఆ శూన్యంలోకి బీజేపీ అనే మితవాద పార్టీ ప్రవేశించింది. ప్రస్తుతం అది కూడా ప్రజాదరణను క్రమంగా కోల్పోతున్నది. భారతదేశపు వర్తమాన సమాజం ప్రగతిశీలమైన సమ్మిళిత వ్యవస్థను కోరుతోంది. అదే ఆ సమాజపు అవసరం, సహజ స్వభావం. అటువంటి స్థితిలో దేశం ఎదుర్కొంటున్న శూన్యాల మధ్య, సీజేపీ వంటిది ఆ శూన్యాన్ని పూరించగల శక్తిగా ఎదగగలదా, ఎదిగితే బాగుండుననే ఆలోచనలు ఒక చిన్న స్థాయిలో మొదలవుతున్నాయి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సేవల స్థానంలో వ్యాపారమా?
భారత తంతి తపాలకి ఘనమైన చరిత్ర ఉన్నది. పోస్ట్‌కార్డు, ఇన్లాండ్ కవరు, పోస్టల్ కవరు, రిజిస్టర్డ్ పోస్ట్ వంటి పలు సేవలు అందిస్తూ ఉన్నది. అతి తక్కువ చార్జీలకు పార్శిళ్ళు, దేశంలోని ప్రధాన పట్టణాలకి 24 గంటల్లో కవర్లు అందించే ‘స్పీడ్ పోస్ట్’ వ్యవస్థ కూడా అందుబాటులోకి తేవడంతో పోస్టాఫీసు లన్నీ రద్దీతో క్యూకట్టేవి. ఎంతోకాలంగా రిజిస్టర్డ్ పోస్ట్ ‘సేవ’లు అందిస్తున్న డిపార్ట్మెంట్ గత సంవత్సరం ఏకంగా దాన్ని రద్దు చేసేసింది. కేవలం 20 గ్రాముల కవరుకు ఐదు రూపాయలు, రిజిస్టర్డ్ చార్జీలు కలిపి 23 రూపాయ లుగా దేశం మొత్తం ఒకే విధానం ఉండేది. అదనంగా ఉన్న ప్రతి 20 గ్రాము లకు మరో 5 రూపాయలు వసూలు చేసే విధానం ఉండేది.అలాగే రచయితలు, ప్రచురణ కర్తలు ప్రచురించే సాహిత్య పుస్తకాలు ‘రిజిస్టర్డ్ ప్రింటెడ్ బుక్’, ‘రిజిస్టర్డ్ బుక్ పోస్ట్’ ద్వారా అతి తక్కువ ధరలో బట్వాడా చేసే సౌలభ్యం ఉండేది. కానీ గత ఏడాది రిజిస్టర్డ్ బుక్, రిజిస్టర్డ్ ప్రింటెడ్ బుక్, రిజిస్టర్డ్ లెటర్ అనేవి రద్దు చేసేసి రెండే రెండు విధానాలుగా... స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పార్శిళ్ళను మాత్రమే ఉంచారు. కేవలం సుమారు రూ. 23 ఉండే రిజిస్టర్డ్ ప్రింటెడ్ బుక్, రిజిస్టర్డ్ బుక్‌పోస్ట్ తీసివేసి దాని స్థానంలో రిజిస్టర్డ్ పార్శిళ్లుగా 500 గ్రాముల లోపు రూ. 42; 1 కిలోకి రూ. 62గా పెంచారు.ఆ తరువాత పుస్తకాల కోసం ‘జ్ఞాన్ పోస్ట్’ పేరుతో ఒక విధానాన్ని తీసు కొచ్చారు. 300 గ్రాముల నుంచి 20 కిలోల వరకు జీఎస్టీతో కలిపి రూ. 24గా నిర్ణయించారు. ఇది ఉపయోగించాలంటే వ్యాపారంకాని ఉచితంగా పంపే పుస్తకాలై ఉండాలి. 300 గ్రాములలోపు బరువుండే పుస్తకాలకు అనుమతి లేదు. ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి రిజిస్టర్డ్ పార్శిళ్ల ధరను కూడా పెంచారు. 500 గ్రాములలోపు ధర గతంలో రూ. 42గా ఉండేదాని స్థానంలో లోకల్ రూ. 34, సొంత రాష్ట్రంలో రూ. 77, మెట్రో రూ. 82, ఇతర రాష్ట్రాలకు రూ. 84గా పెంచారు. జ్ఞాన్ పోస్ట్ ధర రూ. 20 నుంచి రూ. 30కి పెంచారు.ఒకప్పుడు ‘విద్యాసేవగా’ పరిగణించిన రిజిస్టర్డ్ ప్రింటెడ్ బుక్ సేవలకు ఇప్పుడు తిలోదకాలు ఇవ్వడం దేనికి సంకేతం? కేవలం రూ. 30 లేదా రూ.40 గల ఒక పుస్తకాన్ని పాఠకుడికి చేర్చాలంటే దాని ధర కంటే పోస్టల్ చార్జీలు అధి కంగా చెల్లించాల్సి రావడం చూస్తే... జ్ఞాన సంపదను ప్రజలకు చేర్చకుండా అడ్డుకట్ట వేయడం అనిపించడం లేదా? అందుకే ‘జ్ఞాన్ పోస్ట్’ ద్వారా అయినా పాఠకులకు తక్కువ ధరకు పంపే వెసులుబాటు కల్పించి, ఇప్పుడున్న 300 గ్రాముల విధానాన్ని, టారీఫ్‌ను సవరించితే రచయితలకు, ప్రచురణకర్తలకు మేలు జరుగుతుంది.– చలపాక ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిఇవి కూడా చదవండి: రేపటి పౌరులను ఇలాగేనా తీర్చిదిద్దేది? -
రేపటి పౌరులను ఇలాగేనా తీర్చిదిద్దేది?
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డిని సొంత పాఠశాల విద్యార్థులే 27 సార్లు కత్తితో పొడిచి చంపిన దారుణం, అదే జిల్లా దేవరకొండలో ఉపాధ్యాయరాలిపై జరిగిన దాడి కేవలం వివిక్త సంఘటనలు కావు. 2012 ఫిబ్రవరి 9న చెన్నైలోని సెయింట్ మేరీస్ ఆంగ్లో–ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 9వతరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థి క్లాస్ రూమ్‌లోనే సైన్స్ టీచర్ ఉమా మహేశ్వరిని పుస్తకంలో దాచి తెచ్చిన కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపిన ఉదంతం విద్యావ్యవస్థకే మచ్చగా మిగిలింది.అలాగే 2017 సెప్టెంబర్ 8న గురుగ్రామ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పరీక్షలు, పేరెంట్–టీచర్ మీటింగ్ వాయిదా పడాలనే వికృత ఉద్దేశంతో 11వ తరగతి విద్యార్థి ఏడేళ్ల 2వ తరగతి బాలుడు ప్రద్యుమన్ ఠాకూర్‌ను వాష్‌రూమ్‌లో గొంతుకోసి హత మార్చడం యావత్ దేశాన్ని స్తంభింపజేసింది. దీనికితోడు కోటా, హైదరాబాద్ వంటి నగరాల్లో మార్కులు తగ్గాయని ఏటా పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషాదాలు నేటి విద్యాసంక్షోభ తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి.నేటి విద్యావ్యవస్థ జ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించే కేంద్రంగా కాకుండా, కేవలం ర్యాంకులు, మార్కులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారిపోయింది. కార్పొరేట్ భవనాలు, డిజిటల్ బోర్డులు, కోట్ల రూపాయల వ్యాపార ప్రచారాలకు ఇచ్చే ప్రాధాన్యత విద్యార్థుల మానసిక ఎదుగుదల, భావోద్వేగ స్థిరత్వం, నైతిక విలువలపై ఎవరూ పెట్టడం లేదు.జపాన్ ఉదాహరణజపాన్ వంటి దేశాల్లో ప్రాథమిక పాఠశాలల్లో మొదటి మూడేళ్లు ఎలాంటి మార్కుల పరీక్షలు లేకుండా కేవలం పరిశుభ్రత, సమాజం పట్ల బాధ్యత, పెద్దలను గౌరవించడం వంటి జీవన సూత్రాలను మాత్రమే నేర్పిస్తారు. కానీ మన దగ్గర ఐదేళ్ల ప్రాయం నుంచే ర్యాంకుల పోటీని నూరిపోస్తున్నాం. గెలవడం ఎలాగో నేర్పుతున్న చదువులు... ఓటమిని ఎలా తట్టుకోవాలో, కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో, తోటి మనుషులను ఎలా ప్రేమించాలో నేర్పడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి.ఈ విష సంస్కృతి మారాలంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలో సమూల మార్పు రావాలి. ఉపాధ్యాయులు కేవలం సిలబస్ పూర్తి చేసే ఉద్యోగులుగా కాకుండా విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకునే గురువులుగా నిలవాలి. గతంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల నడవడికను తీర్చిదిద్దేవారు. నేడు చిన్న పొర పాట్లకు కూడా పాఠశాలలపై దాడులకు దిగే తల్లిదండ్రుల ధోరణి పిల్లల్లో క్రమశిక్షణా రాహిత్యాన్ని పెంచుతోంది. పిల్లల డిజిటల్ స్క్రీన్ సమయం, సైబర్ స్నేహాలు, అలవాట్లను నిరంతరం గమనించడం ప్రతి తల్లిదండ్రుల ప్రాథమిక కర్తవ్యం.ప్రతి విద్యాసంస్థలో అర్హత కలిగిన మానసిక నిపుణులు, కౌన్సెలర్లను తప్పనిసరిగా నియమించి విద్యార్థుల్లో ఆకస్మిక ప్రవర్తనా మార్పులు, ఒంటరితనం, వ్యసనాలను ప్రారంభ దశలోనే గుర్తించాలి. వారానికి కనీసం రెండు పీరియడ్లను నైతిక విద్య, ప్రాథమిక జీవన నైపుణ్యాలు, భావో ద్వేగ సమతుల్యత నేర్పేందుకు కేటాయించాలి. వ్యాపార విద్య స్థానంలో విలువలతో కూడిన విద్యావిధానం వచ్చినప్పుడే ఇలాంటి నేర ప్రవృత్తులకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.– డా. మేడా జగన్మోహనరావు, విద్యారంగ నిపుణులుఇవి కూడా చదవండి: ఏఐ యుగంలో గొప్ప ఆయుధం... విచక్షణ -
ఒక్కరోజు భోజనం.. ఆరు నెలలు నిద్ర! కుంభకర్ణుడికి ఈ వరం ఎలా?
రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మ గురించి తపస్సు చేశారు. ‘ఏ వరమూ లేకుండానే కావరంతో వీడు పెట్టే బాధలు భరించరానివిగా ఉన్నాయి. ఇక వరములిస్తే లోకాలు తట్టుకోగలవా దేవా? కనుక, ఏ వరాలూ కుంభకర్ణుడికి ఇవ్వవలదు’ అని బ్రహ్మదేవుడిని ప్రార్థించారు దేవతలు.కుంభకర్ణుడిపై కారుణ్యత్వము మాని, అతడిని మాయావివశుడిని జేసి, ఏదో ఒక చిన్న వరాన్ని ప్రసాదిస్తే లోకాలకు శుభం జరుగుతుంది అన్నారు. వెంటనే బ్రహ్మదేవుడు ‘సకల జీవుల రసనలపై నిలిచి నాట్య మాడే నీవు, ఈ కుంభకర్ణుడి రసనపై ఇప్పుడు నిలిచి, నీ చాతుర్యంతో వ్యర్థ ప్రలాపాలను పలికించి, లోకాలకు హాని కలిగించే వరం ఏదీ అతడు కోరుకోకుండా చేయుము!’ అని సరస్వతీదేవిని ఆదేశించాడు. అలాగేనంది ఆమె.అప్పుడు బ్రహ్మ, తపస్సులో ఉన్న కుంభకర్ణుడి ముందు ప్రత్యక్షమై ‘కుంభకర్ణా! నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో’ అన్నాడు. బ్రహ్మ చెప్పినట్లుగా సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై చేరి, ఆ క్షణం కుంభ కర్ణుడి చేత ‘ఆరుమాసాలు సుఖనిద్ర, ఒకరోజు భోజనం’ ప్రసాదించమని అడిగించింది. ‘నిజమే, అదే మేలు. నీవు కోరిన ప్రకారమే సుఖ నిద్రలో ఉండు’ అని కుంభకర్ణుడికి వరమిచ్చాడు బ్రహ్మదేవుడు. కుంభకర్ణుడు వెంటనే నిద్రలోకి జారు కున్నాడు. దేవతలు సంతోషించారు.‘ఉత్తర రామాయణం’ కావ్యం, ద్వితీయాశ్వాసంలోని ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుని, ఆ కావ్యకర్తయైన కంకంటి పాపరాజు ఇలా వ్యాఖ్యానించాడు: క. పౌరుషంబునకు దైవం/ బారయ ఫలకారి యందు రాదైవంబే/ వైరస్యము వహించిన/ నేరూపున పురుషుడొందు నిష్టార్థంబుల్. మనిషి కోరుకునే కోరికలను, ఆ కోరికలు సఫలం కావాలని చేసే ప్రయత్నాలను దైవం ఫలవంతం చేస్తాడు. అటువంటిది, ఆ దైవమే, చేసే ప్రయత్నాలపట్ల విముఖు డైతే, ఆ వ్యక్తి తన కోరికలను ఎలా తీర్చుకుంటాడు? తీర్చుకోలేడు. ఆ పరిస్థితి రాకుండా ధర్మయుక్తమైన జీవితం గడుపుతూ, దైవం పట్ల భక్తిశ్రద్ధలు కలిగి ఉండటం మనిషి చేయవలసిన పని.– భట్టు వెంకటరావుఇవి చదవండి: కుటుంబం: సామాజిక సౌధానికి పునాది -
ఏఐ యుగంలో గొప్ప ఆయుధం... విచక్షణ
అందరికీ శుభోదయం. ఈ రోజు మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఇలాంటి ముఖ్యమైన రోజున మీతో మాట్లాడ టానికి వచ్చిన నేను... మెదిపిన బంగాళాదుంపల (స్మాష్డ్ పొటా టోస్) గురించి మాట్లాడబోతున్నాను! ఎందుకో తెలుసుకోవాలంటే మనం 50 ఏళ్ల వెనక్కి వెళ్లాలి. 1970లలో నేను కొలంబస్లో పెరిగాను. ఆ రోజుల్లో పరిస్థితులు ఇప్పటితో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, ఉద్యోగాలపై ఆందోళన, పెరుగుతున్న పెట్రోల్ ధరలు వంటి సమస్యలు ఉండేవి.మెదిపిన బంగాళాదుంపల కథచిన్నప్పుడు నేను... మా అమ్మ, నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లతో కలిసి రోజూ భోజనం చేసేవాడిని. మా ఇంట్లో భోజనం చాలా సాధారణంగా ఉండేది. హాట్ డాగ్స్, ట్యూనా క్యాసరోల్, మీట్ లోఫ్ వంటివి ఉండేవి. అయితే మా భోజనంలో తరచుగా కనిపించేది మెదిపిన బంగాళాదుంపలు. తొమ్మిదేళ్ల వయసులో నేను ఓ రోజు మా వృద్ధ బంధువు ఇంటికి వెళ్లాను. ఆమె నాకు మెదిపిన బంగాళాదుంపలు వడ్డించింది. అవి నేను అప్పటివరకు తిన్న వాటిలో అత్యంత రుచికరమైనవి. అవి మెత్తగా రుచిగా ఉన్నాయి. వాటిని ఎలా తయారుచేశారో తెలుసుకోవాలనే ఆసక్తితో వంటగది లోకి వెళ్లాను. అక్కడ నాకు ఆశ్చర్యం కలిగింది. అవి ప్యాకెట్ నుంచి వచ్చినవి కావు. ఆమె సహజమైన బంగాళాదుంప లను ఉడికించి, వాటిని మెదిపి... వెన్న, ఉప్పు కలిపి తయారు చేసింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నాకు మంచి రుచి ఏదో తెలుసు. నాకు నా సొంత అభిరుచి ఉంది. అంటే కేవలం రుచి చూసే నాలుక ఉందని కాదు. ఏది మంచిదో, ఏది అంత మంచిది కాదో గుర్తించే సొంత అభిప్రాయం నాకు ఉందని అర్థం. గత నాలుగేళ్లలో మీరు ఇక్కడ యానిమేషన్ , ఫ్యాషన్ , సినిమా, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్ , గేమ్స్, ఫైన్ ఆర్ట్ వంటి ఎన్నో విషయాల్లో నైపుణ్యం సంపాదించారు. మీరు కష్టమైన ప్రాజెక్టులు పూర్తి చేశారు. మంచి ఇంటర్న్‌షిప్‌లు పొందారు. జీవితాంతం గుర్తుండిపోయే స్నేహా లను ఏర్పరచుకున్నారు. కానీ వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. మీరు మీ సొంత అభిరుచిని, కళాత్మక దృష్టిని,సొంత ఆలోచనా విధానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఏది మంచిదో, ఏది గొప్పదో, ఏది మెరుగుపరచాలో గుర్తించే శక్తిని పొందారు. ఇప్పుడు మనం కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో ఉన్నాం. ఈ కాలంలో మీ సొంత అభిరుచి మిమ్మల్ని ఇతరుల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఏఐ మీకు ఎన్నో ఎంపికలు ఇవ్వగలదు. ఒక చిన్న సూచన ఇస్తే చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ సాధనాలు డజన్ల కొద్దీ, వందల కొద్దీ ఆలోచనలు ఇవ్వగలవు. కానీ వాటిలో ఏది అద్భుత మైనది? ఏది సాధారణమైనది? ఏది వినియోగదారుడికి ఉపయోగ పడుతుంది? ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది? అనేది మీరు నిర్ణయించాలి. ఏఐకి సొంత అభిరుచి, సొంత అభిప్రాయం ఉండదు. మీకు సొంత అభిరుచి ఉంది. సొంతం అభిప్రాయం ఉంది. అందుకే భవిష్యత్తులో ఏఐకి మీలాంటి మనుషులు మరింత అవసరం అవుతారు. కృత్రిమ మేధ యుగంలో మీ గొప్ప ఆయుధం... మీ సొంత అభిరుచి. మీ సొంత విచక్షణ!మంచి పనిని గుర్తించే అభిరుచిచాలా కాలం వరకు మనుషులు గొప్ప ఆలోచనలు చేయ గలిగేవారు. కానీ వాటిని నిజంగా రూపొందించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సాధనాలు అందరికీ ఉండేవి కావు. ఏఐ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చింది. ఇప్పుడు దాదాపు ఎవరైనా దాదాపు ఏదైనా తయారు చేయగలరు. అందువల్ల భవిష్యత్తులో అరుదైన నైపుణ్యం పని చేయడం మాత్రమే కాదు; మంచి పనిని గుర్తించడం. దీనినే విచక్షణ అంటాం. ఉదాహరణకు పుస్తక ప్రచురణ రంగంలో ఏఐ కారణంగా పుస్తకాలు రాయడం సులభమైంది. పుస్తకాల సంఖ్య పెరిగింది. పరిమాణం పెరిగింది. కానీ వాటి సగటు నాణ్యత తగ్గింది. ఈ పరిస్థితిలో మంచి పనిని గుర్తించే అభిరుచే అత్యంత కీలక నైపుణ్యంగా మారనుంది. మన అభిరుచి ఇతరుల పనిని చూడటం వల్ల అభివృద్ధి చెందదు. మనమే ఏదైనా సృష్టించినప్పుడు మన అభిరుచి మరింత పెరుగుతుంది. మీరు చేసిన ప్రతి ప్రాజెక్టు, ఎదుర్కొన్న ప్రతి విమర్శ, వదిలేయాలని అనిపించిన ప్రతి పని.. ఇవన్నీ మీ అభి రుచిని పెంచుతాయి. కళ, డిజైన్ , సంగీతం, సినిమాలు, సాహిత్యం వంటి వాటిని ఆస్వాదించండి. కానీ ఇతరుల పనిని చూడటంకంటే... మీరు స్వయంగా సృష్టించే పనికి ఎక్కువ సమయం కేటాయించండి. అభిరుచి అంటే మనకు నచ్చినది చెప్పడం మాత్రమే కాదు. నచ్చనప్పుడు ‘లేదు’ అని చెప్పే ధైర్యం కూడా. ‘ఇది సరి పోదు.’ ‘ఇది నాకు నచ్చలేదు.’ ‘ఇది ఇంకా మెరుగ్గా ఉండాలి’ అని నిర్మొహమాటంగా చెప్పగలగాలి. ఇతరులందరూ ఒక పనికి ‘అవును’ అని చెప్పినప్పటికీ... అది సరైనది కాదని మీకు అనిపిస్తే ‘నో’ అని చెప్పే ధైర్యం ఉండాలి. ఇదే నిపుణుడికి, సాధారణ వ్యక్తికి మధ్య ఉన్న తేడా! అభిరుచి మారాలి!మీ అభిరుచులు ఎప్పటికీ ఒకేలా ఉంటే మీరు ఎదగడం లేదని అర్థం. మీరు ఈ కాలేజీలో చేరిన రోజు ఉన్న వ్యక్తి ఇప్పుడు లేరు. మీ ఆలోచనలు మారాయి. మీ అనుభవాలు పెరిగాయి. మీ దృష్టి మారింది.ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది ఎదుగుదలకు సంకేతం. నాలుగేళ్ల తర్వాత, పదేళ్ల తర్వాత కూడా మీరు మారు తూనే ఉండాలి. విజయవంతమైన సృష్టికర్తలు జీవితాంతం ఒకే విధానంలో చిక్కుకుపోరు. వారు కొత్త విషయాలు నేర్చుకుంటారు. కొత్త ఆలోచ నలను స్వీకరిస్తారు. తమ అభిరుచిని నిరంతరం అభివృద్ధి చేసుకుంటారు. అందుకే మూడు విషయాలు గుర్తుంచుకోండి: ఎక్కువగా సృష్టించడంపై దృష్టిపెట్టండి. అవసరమైనప్పుడు ‘నో’ చెప్పండి. ఎప్పటి కప్పుడు మారుతూ ఉండండి. చివరగా ఒక చిన్న సలహా: ఓ ఆన్లైన్ వేదికలో బంగాళా దుంపల గురించి ప్రత్యేకంగా చర్చించే ఒక సమూహం ఉంది. అక్కడ మెదిపిన బంగాళాదుంపల గురించి కూడా చర్చ జరిగింది. కొంతమంది వాటిని ఇష్టపడలేదు. మరికొందరు వాటిని సమర్థించారు. అందులో ఒక వ్యక్తి చెప్పిన నాలుగు పదాల సలహా నాకు చాలా నచ్చింది: ‘‘విమర్శలను పట్టించుకోకండి. మీ ఆనందాన్ని ఆస్వాదించండి’’. ఇది సృజనాత్మక జీవితానికి కూడా గొప్ప సలహా.మీరు అడుగుపెడుతున్న ప్రపంచంలో మనుషులు చూడగలి గిన దానికంటే ఎక్కువ సమాచారం ఉంటుంది. అనంతమైన చిత్రాలు. అసంఖ్యాకమైన ఎంపికలు. ఎప్పటికీ ఆగని సమాచార ప్రవాహం. అలాంటి ప్రపంచంలో ఏది నిజమైనది? ఏది అందమై నది? ఏది విలువైనది? ఏది సృష్టించదగినది? అని గుర్తించగలిగిన వారిదే భవిష్యత్తు. చివరగా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక్కటే: విమర్శలను పట్టించుకోకుండా, మీ జీవితాన్ని ఆనందంగా ఆస్వా దిస్తూ ముందుకు సాగండి. మీ అందరికీ అభినందనలు! -
నిరసన ఒక మేలుకొలుపు
భారతదేశ సామాజిక, రాజకీయ గమనంలో యువత ఎల్లప్పుడూ అత్యంత ప్రభావవంత మైన శక్తిగా ఉంది. ఇటీ వల ‘జెన్ జీ’ ఆధ్వర్యంలో వెల్లువెత్తిన నిరసనలు, ఉద్యమాలు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటివి. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల నుంచి, ముఖ్యంగా యువ తరం నుంచి వచ్చే అసంతృప్తిని కేవలం తాత్కా లిక భావోద్వేగంగానో లేదా రాజకీయ ప్రత్యర్థుల ప్రేరేపిత చర్యగానో కొట్టిపారేయడం సరైన పని కాదు. అయినప్పటికీ, ఈ పరిణామాలను నిష్పా క్షికంగా విశ్లేషించుకునేందుకు ఎన్డీఏకు ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం భారత్. అయితే, యువత తమ భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో, విశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ జనాభా నిజమైన జాతీయ సంపదగా మారుతుంది. చదువు పూర్త యిన తర్వాత ఉద్యోగం దొరక్కపోవడం, కెరీర్ ఎదుగుదలలో స్తబ్ధత, ఆర్థిక అభద్రత వంటి సమస్యలతో యువత తీవ్ర అసంతృప్తిలో ఉంటే, ఆ జనాభా శక్తి నిరాశగా మారి సమాజంలో ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉంది. ‘ఈ నిరస నలను ఎవరు నడిపిస్తున్నారు?’ అని అన్వేషించడం కంటే, ‘యువత ఎందుకు ఇంత తీవ్ర అసంతృప్తితో ఉంది?’ అనే మూలకారణాన్ని వెత కడం అత్యంత ముఖ్యమైన విషయం.దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా ఆచరణా త్మకంగా సాధ్యం కాదు. మిగిలిన మెజారిటీ యువత ప్రైవేటు రంగాలు, వ్యవసాయం, సేవా రంగం, వ్యాపారాలు లేదా స్వయం ఉపాధిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాల అసలైన బాధ్యత కేవలం కొన్ని ఉద్యోగ నోటిఫికే షన్లు ఇవ్వడానికే పరిమితం కాకూడదు. యువత తమ స్వశక్తితో ఉపాధిని సృష్టించుకునే ‘జాబ్ క్రియేటర్స్’గా ఎదిగే వ్యవస్థను సిద్ధం చేయాలి.ఇదీ చదవండి: యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలంఆచరణాత్మక చర్యలు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మార్కెట్ అవసరాలు, ఆధునిక ఉపాధి రంగా లపై స్పష్టమైన మార్గదర్శకత్వం అందించాలి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆధునిక సాంకేతిక శిక్షణ ఇవ్వాలి. కొత్తగా వ్యాపారాలు, స్టార్టప్‌లు ప్రారంభించే యువతకు ఎలాంటి పూచీకత్తు లేకుండా సులభంగా రుణాలు, సబ్సిడీలు అందేలా చూడాలి. భారత దేశ భవిష్యత్ పురోగతి మన విద్యా వ్యవస్థ నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. ఉపాధ్యా యుల నియామకాలు, నాణ్యమైన శిక్షణ, పరిశో ధనలు, విద్యార్థులలో ఆచరణాత్మక అభ్యసన ఫలితాలు పెంపొందించడంపై పూర్తి దృష్టి పెట్టాలి. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) మంచి దిశానిర్దేశం చేసింది. చదువు పూర్తయ్యే సమయానికి విద్యార్థి ఉద్యోగా ర్థిగా కాకుండా, సమాజానికి విలువను చేకూర్చే సమర్థుడిగా మారేలా విద్యా వ్యవస్థ ఉండాలి.ఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!నిరసనలు ఎదురైనప్పుడు పాలకులస్పందన సహనంతో, సమతుల్యతతో ఉండాలి. యువత కోపంతో ఉన్నప్పుడు వారి అసంతృప్తికి గల కారణాలను వినడం, ఆ శక్తిని సానుకూల దిశగా మళ్లించడం పరిపక్వ నాయకత్వ లక్షణం. ఏ ప్రజా ఉద్యమంలోనైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు ప్రవేశించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. విధ్వంసాలకు పాల్పడేవారిని, చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులను పోలీసులు, దర్యాప్తు సంస్థలు పక్కా ఆధారాలతో గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఆ నెపంతో శాంతియుతంగా తమ ఆందోళ నలను, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెస్తున్న యువతపై విచక్షణారహితంగా చర్యలు తీసు కోవడం ప్రమాదకరం. న్యాయమైన అసమ్మతికి, నేరపూరిత కార్యకలాపాలకు మధ్య ఉన్న సన్నని గీతను పాలకులు, యంత్రాంగం గుర్తించాలి.2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ అభి వృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) తీర్చి దిద్దాలనే లక్ష్యానికి నేటి యువతే మూలస్తంభం. యువత విద్యావంతులైనప్పటికీ ఉద్యో గాలు లేక నిరాశతో ఉంటే, నైపుణ్యాలు ఉన్నా అవకాశాలు దక్కకపోతే ఈ మహత్తర లక్ష్యం కలగానే మిగిలి పోతుంది. అదే యువత నైపుణ్యాలు, ఆత్మ విశ్వాసం, పారిశ్రామిక దృక్పథంతో ముందుకు సాగితే దేశం అపూర్వమైన ప్రగతిని సాధిస్తుంది. ప్రభుత్వం యువతతో నిరంతర సంభాషణ ప్రారంభించి, వారి సమస్యలను వింటూ, విద్య, ఉపాధి వ్యవస్థలను సంస్కరించాలి. జెన్ జీ ఉద్య మాన్ని కేవలం రాజకీయ ముప్పుగా కాకుండా, వ్యవస్థను సరిదిద్దుకునే ఒక మేలుకొలుపుగా, సువర్ణావకాశంగా స్వీకరించి నప్పుడే బలమైన, సంపన్నమైన నవభారత నిర్మాణం సాధ్యమవుతుంది. -పి. వేణుగోపాల్ రెడ్డి ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ -
ఏకాకివి కాదు – సమూహానివి!
ఏ ఇద్దరు మనుషులైనా తమ డీఎన్ఏలో 99.6 శాతాన్ని పంచు కుంటారు. మరో మనిషిపై సానుభూతిని నిరాకరించడం అంటే, తార్కికంగా చూస్తే, మనలోని 0.4 శాతం తేడాను ద్వేషించడమే.మనం ప్రత్యేకతను ఆరాధించే యుగంలో జీవిస్తున్నాం. ఇతరులకంటే మనం ఎలాభిన్నంగా ఉన్నామో చాటిచెప్పాలని ఆధునిక సంస్కృతి మనకు చెబుతోంది. అయితే, వ్యక్తిగత సామీప్యత అనే పరిమితిని పక్కనపెట్టి, మానవాళి మొత్తానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పరిశీలిస్తే పూర్తిగా భిన్నమైన చిత్రం ఆవిష్కృతమవుతుంది.మనం ఒకరినొకరం వేర్వేరు శిబిరాలుగా విభజించుకోవడానికి, పరస్పరం తగాదాలు పడటానికి కారణ మవుతున్న తేడాలు చాలావరకు మన వ్యక్తిగత అనుభవాల వల్ల ఏర్పడే భ్రమలే. ఆ వ్యక్తిగత సామీప్యతను శాస్త్రీయ, గణిత విశ్లేషణల ద్వారా పక్కకు తొల గిస్తే, ఈ భూమిపై ఉన్న 830 కోట్ల మంది అంతులేని వైవిధ్య సమూహంగా కనిపించరు. విశ్వవ్యాప్త మానవ స్వభావాన్ని ప్రతిబింబించే ఒకే ఒకసాంద్రమైన శిఖరానికి మనమంతా అత్యంత సమీపంగా ముడిపడి ఉన్నామని స్పష్టమవుతుంది.ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఎత్తు, చర్మపు రంగులు, స్వభావాల్లో కనిపించే వైవిధ్యాన్ని చూసి, మనుషుల మధ్య లోతైన భేదాలు ఉన్నాయని భావించడం సహజం. కానీ జన్యుశాస్త్రం దీనికి మరింత భిన్నమైన కథను చెబుతోంది. ఆధునిక జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రకారం, భూమిపై ఉన్న ఏ ఇద్దరు మనుషుల జన్యు నిర్మాణమైనా సుమారు 99.6% నుంచి 99.9% వరకు ఒకేలా ఉంటుంది. మనలో కనిపించే ప్రతి శారీరక వైవిధ్యానికీ కారణం ఈ అత్యంత స్వల్పమైన తేడానే. మన మానసిక స్థితి, ప్రేరణలను నియంత్రించే న్యూరో ట్రాన్స్మిటర్లు, ఒత్తిడికి శరీరం స్పందించే విధానం, సామాజిక అనుబంధాలను నియంత్రించే హార్మోన్లకు సంబంధించిన జీవరసాయన రూపకల్పన మొత్తం మానవజాతిలో దాదాపు ఒకే విధంగా ఉంటుంది.సార్వత్రిక గ్రామం– సంస్థాగత సమన్వయంపిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది కుటుంబంతో పాటు ఒక సామూహిక శక్తి– సామాజిక గ్రామం. శైశవం నుంచి యుక్తవయస్సు వరకు ప్రతి బిడ్డపై ప్రభావం చూపే అంశాల సమగ్ర వ్యవస్థను పరిశీలిస్తే, కుటుంబ, సామాజిక వలయం, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇంటర్నెట్, టెలి విజన్ సినిమాలు, ప్రపంచ వ్యాప్త మీడియా వంటి వ్యవస్థలు కనిపి స్తాయి. ఇవి సాంస్కృతిక సరి హద్దులు, కాలమాన ప్రాంతాలను దాటి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి.ఒక పిల్లవాడు లాస్ ఏంజెలిస్‌లో పెరిగినా, ముంబైలో పెరిగినా, సహకారం, పరస్పర సహకారం, నిజాయితీ, పట్టుదల, దూకుడును నియంత్రించుకోవడం వంటి ప్రాథమిక ప్రవర్తనలకు ఒకే విధమైన ప్రోత్సాహం, నిరుత్సాహం కలిగించే సంస్థాగత వ్యవస్థల గుండా ప్రయా ణిస్తుంది. పైకి కనిపించే సాంస్కృతిక భేదాలు నిజమే. కానీ వాటి అంత ర్లీన ప్రవర్తనా శిక్షణ మాత్రం ఒకే దిశగా పయనిస్తుంది.830 కోట్ల మంది వ్యక్తులు సమష్టిగా చూస్తే, ప్రాథమికంగా ఒకే విధమైన లక్షణాలను కలిగి ఉన్నారని గణాంకపరంగా ఎలా నిరూపించగలం? ఇందుకోసం ఒక ప్రపంచవ్యాప్త ఆలోచనా ప్రయోగాన్ని ఊహించు కుందాం. వేలాది మంది పాల్గొనేవారిని, తమకు బాగా పరిచయమున్న 100 మంది వ్యక్తుల పేర్లను చెప్పమని అడుగుదాం. ఆ తర్వాత ప్రతి వ్యక్తి స్వభావాన్ని 1 నుంచి 10 వరకు ఒక ప్రమాణంపై అంచనా వేయమని కోరుదాం. అలా కోట్లాది సంబంధాలతో అనుసంధానమైన ఒక భారీ మానవజాలం ఏర్పడుతుంది.ఇప్పుడు ఈ సమాచారాన్ని కంప్యూటర్‌కు అందిద్దాం. ఒక్కొక్కరి వ్యక్తిగత రేటింగ్లను విడిగా పరిగణనలోకి తీసుకోవడానికి బదులుగా, ఒక వ్యక్తికి అతని లేదా ఆమె మొత్తం సామాజిక వలయంలో లభించిన ప్రతి రేటింగ్‌ను కంప్యూటర్ సమీకరిస్తుంది. ఫలితంగా, వ్యక్తిగత పక్షపాతా లను సగటు చేసి తొలగించిన, ప్రతి వ్యక్తి సామాజిక స్థితికి సంబంధించిన మరింత వాస్తవికమైన అంచనా లభిస్తుంది. వేలాది మంది వ్యక్తులకు ఇలా పక్షపాతాలను సరిచేసి లెక్కించిన సగటు విలువలను గ్రాఫ్‌పై ఉంచితే, ఆ సమాచారం యాదృచ్ఛికంగా చెల్లాచెదురుగా కనిపించదు. అది ఒక స్పష్ట మైన గాసియన్ పంపిణీగా, అంటే గంట ఆకారంలో ఉండే ఒక వక్రరేఖగా రూపుదాల్చుతుంది. దాని అత్యంత సాంద్రమైన శిఖరం 6 లేదా 7కు సమీపంలో ఉంటుంది.ఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!అత్యధిక మంది మనుషులు పూర్తిగా మంచివాళ్లూ కాదు, పూర్తిగా రాక్షసులూ కాదు. మనం సహజంగానే సగటు మనుషులం– బతకడానికి, ప్రేమించడానికి, ఇతరులతో అనుబంధం ఏర్పరచుకోవడానికి, సమూ హంలో మన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి మన వంతు ప్రయత్నంచేస్తుంటాం. నిజమైన అత్యంత మంచి లేదా అత్యంత చెడు వ్యక్తులు మాత్రం ఈ వక్రరేఖకు ఇరువైపులా ఉండే పలుచని చివరి భాగాల్లో మాత్రమే కనిపిస్తారు. వారు గణాంకపరంగా అరుదైన మినహాయింపులు. సాధారణ నియమం మాత్రం కాదు.అవుట్‌లయర్ అనే భ్రమదైనందిన జీవితంలో మన మెదళ్లు సాధారణానికి భిన్నంగా ఉండే వ్యక్తులను గుర్తించేందుకు సహజంగానే ప్రయత్నిస్తుంటాయి. ఒక వ్యక్తితో జరిగిన ఒక్క చెడు అనుభవంతోనే అతడిని లేదా ఆమెను శాశ్వతంగా ప్రతినాయకుడిగా ముద్ర వేస్తాం. అలాగే, ఒకే ఒక్క వీరోచిత చర్యతో ఎవరినైనా అందుకోలేని స్థాయిలో ఉన్నత పీఠంపై కూర్చోబెడతాం. కానీ గణిత విశ్లేషణ ఈ భావనను వ్యక్తిగత సామీప్యత వల్ల కలిగే భ్రమగా బయటపెడుతుంది. మానవులందరి అభిప్రాయాలను కంప్యూటర్ సగటు చేసినప్పుడు, మనం భయపడే రాక్షసులూ, మనం ఆరాధించే మహనీ యులూ ఇద్దరూ గంట ఆకారపు వక్రరేఖలోని మధ్య భాగం వైపే లాగ బడతారు. గణాంక పరంగా చూస్తే, మనమంతా ఆ ఒకే సాంద్రమైన శిఖరం కిందనే ఉన్నాం. మనందరిలోనూ లోపాలున్నాయి; అదే సమయంలో మనం అందంగా అసంపూర్ణమైన మనుషులం.ఇదీ చదవండి: యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలంఇంతకు డేటా చెబుతున్నదేమిటి?ఈ తర్కం మూడు స్వతంత్ర దిశల నుంచి ఒకే నిర్ధారణకు చేరుకుంటుంది: జన్యుశాస్త్రం, సంస్థాగత సామాజిక శాస్త్రం, గణిత గణాంకాలు. ఏ ఇద్దరు మనుషులైనా తమ డీఎన్ఏలో 99.6 శాతాన్ని పంచుకుంటారు. మరో మనిషిపై సానుభూతిని నిరాకరించడం అంటే, తార్కికంగా చూస్తే, మనలోని 0.4 శాతం తేడాను ద్వేషించడమే. మరో సంస్కృతిని పరాయిదిగా చూడటం అంటే, డేటాను తప్పుగా అర్థం చేసుకోవడమే. జీవశాస్త్రపరంగా మనమంతా ఒకే తాళంలో ఉన్నాం. పరస్పరం ముడి పడిన సంస్థాగత వ్యవస్థల ద్వారా మనం రూపుదిద్దుకుంటున్నాం. మనల్ని మనం ప్రతిబింబించే కోట్లాది సూక్ష్మ ప్రతిరూపాల మనం మధ్య జీవిస్తున్నాం.అందువల్ల తార్కికంగా మనం చేరుకోవాల్సిన ఏకైక నిర్ధారణ: వారందరినీ ప్రేమించండి! మేడాపరమేశ్వర రెడ్డి వ్యాసకర్త రిటైర్డ్ ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్త; రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్ డైరెక్టర్ -
జెలెన్స్కీ (ఉక్రెయిన్ ప్రెసిడెంట్) రాయని డైరీ
యుద్ధం మన జీవిత భాగస్వామి అయినప్పుడు ప్రతి ఉదయం ఒకే మంచం మీద బతుకు తెల్లారుతూ ఉంటుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో అధ్యక్ష కార్యాలయం నుంచి కాక, భూగర్భ బంకర్ల నుంచి నేను నా దేశాన్ని నాలుగున్నర ఏళ్లుగా ఏ రాత్రికి ఆ రాత్రి, ఏ పగలుకు ఆ పగలు కాపు కాసుకుంటూ వస్తున్నాను. ఇక ఇప్పుడైతే ఏ నిమిషానికి ఆ నిమిషం! ఒకప్పటి తమ అభిమాన హాస్య నటుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నేటి నిజ జీవిత విషాద సన్నివేశాలకు ఎందుకు ఇంతగా కొనసాగింపును ఇవ్వవలసి వస్తున్నదో అర్థం చేసుకోగలిగినవారు అయినందువల్లనే ఉక్రెయిన్ ప్రజలు ఈ యుద్ధకాలంలో నాకు గొప్ప బలగంగా ఉన్నారు. రాత్రి 2:14 అయింది. టీవీ కాంతిలో మెరుస్తున్న ఈ చీకటి గదిలో కొన్నిసార్లు ఒలెనా, అలెక్సాండ్రా, కిరిలో... కళ్లలో మెదులుతుంటారు. నేను వారి జీవితంలో ఒక నిశ్శబ్ద ఛాయలా మాత్రమే మిగిలిపోతున్నానా... వారి నవ్వులు వినక, వారిని హృదయానికి హత్తుకోక!! యుద్ధం మొదలయ్యే సమయానికి నా కూతురు అలెక్సాండ్రా టీనేజ్‌లో ఉంది. తను ఇప్పుడు ఉన్నత చదువులకు వచ్చింది. కిరిలో అప్పుడు 9 ఏళ్లవాడు. ఆ వయసుకే వాడొక ఉక్రెయిన్ సైనికుడిలా కనిపించేవాడు నాకు!ఒలెనా... నా సహచరి. నేను బంకర్ల నుంచి శత్రువుతో పోరాడుతుంటే, తను బయటి నుంచి ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతోంది. ఉక్రెయిన్ మహిళలు, చిన్నారుల కోసం ‘‘హౌ ఆర్ యు?’’ అనే ప్రాజెక్టు నడుపుతోంది. అదే మాటను కాస్త తగ్గించిన స్వరంతో, ప్రేమగా ఎప్పుడైనా నన్ను అడుగుతుంది: ‘‘యాక్ స్ప్రావి వోలోద్యా?’’ అని. కొన్నిసార్లయితే ‘‘యాక్ స్ప్రావి మిస్టర్ ప్రెసిడెంట్?’’ అంటుంది నవ్వుతూ.ఆమె గొంతు విని, డీజిల్ వాసన కొట్టే బంకర్ ఒక్కసారిగా గుబాళిస్తుంది. ఒలెనా, నేను ఒకే స్కూల్లో, ఒకే కాలేజ్‌లో చదువుకున్నాం. క్రివీ రిహ్ నేషనల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని చెర్రీ బ్లోసమ్, మాగ్నోలియా పూల చెట్ల కింద మా చేతులు కలిసి నడిచాయి. రాత్రి 2.43కి బంకర్లోకి కాల్! ‘‘మన సైన్యం శత్రువును గట్టిగా తిప్పి కొట్టింది మిస్టర్ ప్రెసిడెంట్. మన భూభాగాన్ని తిరిగి సాధించాం...’’ అని గర్వంగా చెబుతున్నారు కమాండర్లు. తిరిగి స్వాధీనం చేసుకునే ప్రతి చదరపు కిలోమీటరు వెనుక సైనికుల ప్రాణత్యాగం ఉంటుంది. సైరన్లు ఆగిన ప్రతిసారీ ఆ కాసేపటి శూన్యంలో, అమరవీరుల జ్ఞాపకాలతో నా గుండె బరువెక్కుతుంది.ఉక్రేనియన్లు, రష్యన్లు ఒకరే అంటాడు పుతిన్ . నవ్వొస్తుంది నాకు. ఆ వెంటనే రష్యన్ రొమాంటిక్ కామెడీ ‘8 ఫస్ట్ డేట్స్’ గుర్తొస్తుంది. అందులో హీరోగా నటించింది నేనే. అకిన్షినా అనే అమ్మాయి హీరోయిన్ . సినిమాలో ఆమె పేరు వీరా. నా పేరు నికిత. వీరాకు, నికితకు వేరే వేరే వాళ్లతో పెళ్లయి ఉంటుంది. కానీ ఉదయాన్నే లేచి చూస్తే ఇద్దరూ ఒకే మంచం మీద ఉంటుంటారు! అలా ప్రతిరోజూ ఒకే మంచంపై మెలకువ రావడం అనేది యాదృచ్ఛికం కాదనీ, తమ ఇద్దరినీ కలపటానికి ఏదో అదృశ్య శక్తి ప్రయత్నిస్తోందనీ అనుకుంటారు. పైకి పర్ఫెక్ట్గా కనిపించే దంపతుల కంటే– మనో భావాలను, లోపాలను అర్థం చేసుకునేవారే నిజమైన జీవిత భాగస్వాములు అని తీర్మానించుకుంటారు. పాత పెళ్లిళ్లు రద్దు చేసుకొని ఇద్దరూ ఒకటవుతారు! బహుశా పుతిన్ కూడా రోజూ ఉదయం నిద్రలేవగానే తన మంచం మీద ఉక్రెయిన్ ఉండాలని కోరుకుంటూ ఉండి ఉండొచ్చు. కానీ అది ఎప్పటికీ జరగదు. ‘8 ఫస్ట్ డేట్స్’లో ప్రేక్షకులకు నచ్చేలా స్క్రిప్ట్‌ను దిద్దిన నేను... రష్యా ఇప్పుడు రాస్తున్న బాధ్యతారహితమైన స్క్రిప్టుకు, ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్న ముగింపును ఇవ్వలేనా?! -
మాతృభాషా? మార్కులా?
నేటి ఆధునిక విద్యా విధానంలో విద్యార్థి వికాసానికి ప్రధాన కూడలి ఇంటర్ విద్య. దీని ద్వారానే సాంకేతిక, వైద్య, బ్యాంకింగ్ రంగాలకు చెందిన నిష్ణాతులైన విద్యావంతులు తయారై ఆ యా రంగాలను సుసంపన్నం చేయగలరు. ఇంటర్ విద్య ఎంత కీలకమో అందులో ద్వితీయ భాష కూడా అంతే ప్రధానం. ఇంటర్ వ్యవస్థ ఏర్పడ్డప్పుడే మాతృభాషల వికాసమే లక్ష్యంగా విద్యార్థులు తమ తమ మాతృభాషలు ఎంపిక చేసుకొని చదువుకునే వెసులుబాటు కల్పిస్తూ తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్, సంస్కృతం, ఆంగ్లం భాషలకు అవకాశం కల్పించారు. ‘మాతృభాష సంస్కృతి సాహిత్య వికాసాల వేదిక ద్వితీయ భాష’ అనే సూత్రంతో దీన్ని ఏర్పాటు చేశారు.ప్రస్తుతం ఇంటర్ విద్యార్థి మాతృభాషతో ప్రమేయం లేకుండా ‘తక్కువ నిడివి–స్వల్ప బోధన–అధిక మార్కులు’ అనే ఆధునిక సూత్రంతో కార్పొరేట్ కళాశాలలు నిర్బంధ సంస్కృత విద్యను అంటగడు తున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోనూ ద్వితీయ భాష మాతృభాష సూత్రం తుంగలో తొక్కి అడ్మిషన్లు పెంచు కోవడం వల్ల ద్వితీయ భాషగా తెలుగు చదివేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. ఎంతో పవిత్రమైన సంస్కృత భాషకు మనం ఎంత గౌరవం ఇస్తున్నాం? ప్రాథమిక తరగతుల్లో నేర్చుకోని సంస్కృతాన్ని రెండు సంవత్సరాల్లో ఎలా నేర్పగలం? అదేవిధంగా హిందీ చదివిన విద్యార్థులకు కనీసం చదవడం, రాయడం, మాట్లాడటం వస్తుందా? కేవలం మూల్యాంకనంలో అధిక పేపర్లు ఉండి అధిక మొత్తంలో పారితోషికం రావాలనే ఆశతో విద్యార్థుల భావి జీవితాలను భాషాపరంగా నాశనం చేయడం గౌరవప్రదమైన గురువులుగా మనకు తగునా?ఇంటర్ విద్యాభ్యాసం చేస్తున్న లక్షలాది మంది విద్యార్థుల్లో 80% విద్యార్థులు తెలుగు మాతృభాష కలవారే ఉన్నారు. అవసరార్థం ఆంగ్ల భాషలో విద్యాభ్యాసం చేస్తున్నా దాన్ని అర్థం చేసుకునేది మాత్రం వారి అమ్మ భాషలోనే. ద్వితీయ భాష తెలుగు పాఠ్యపుస్తకాలు మానవతా విలువలు, శతక సాహిత్యం, స్థానిక సంస్కృతి, సాంప్ర దాయాలు, రచయితలు, రచనలను పరిచయం చేస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా ఉన్నాయి. ‘మన ప్రోత్సహం విద్యార్థి ఉన్నతికి ఉపకరించాలి తప్ప వినాశనానికి దోహదపడకూడదు’ అని గౌరవ ఉపన్యాసకులు తెలుసుకోవాలి. మూల్యాంకన కేంద్రాల్లో ఉన్నత స్థాయి అధికారులను నియమించి సూక్ష్మ పరిశీలన చేస్తే మూల్యాంకన విలువలు పెరుగుతాయి. అప్పుడే విద్యా లక్ష్యాలు నెరవేరతాయి. లేకపోతే భవిష్యత్తులో ఇంటర్ విద్యలో తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.– డా. అమ్మిన శ్రీనివాసరాజు. సీనియర్ తెలుగు ఉపన్యాసకులు(నేడు వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి)ఇవి కూడా చదవండి: నేడు నేపాల్... రేపు ఇండియా? -
ప్రేమ, సేవ, సత్యం.. ఆధ్యాత్మిక వికాసానికి ఇవే మెట్లు!
ఆధ్యాత్మిక వికాసం పట్ల ఆకర్షితులైన ఆలోచనపరుల ఆసక్తులు ఉన్నతంగా ఉంటుంటాయి. సకల సృష్టిపట్ల వారు ప్రేమతో వ్యవహరిస్తారు. సద్భక్త్యాసక్తితో తన చుట్టూ ఉన్న సాటివారిని, దూరస్తులైన సామాన్యు లనూ ఒకేలా ప్రేమిస్తారు.సామాజిక సేవ సంబంధిత పరిచర్యలకు తమ విలువైన సమయం కేటాయించడం, సత్క్రియలను చేతలలో చూపడం, మేలైన సాహిత్యం చదవడం, గాత్ర సంగీతం వినడం, సేంద్రియ తోటల పెంపకం, కొత్త భాషలు నేర్చుకోవడం, చిన్న పిల్లలకు తగు శ్రద్ధతో ఓపిక సహనం కలిగి అర్థవంతమైన రీతిలో పాఠాలు బోధించడం, బాధితులను ఓదార్చి వారిలో ధైర్యం నూరిపోయడం, పరిసరాల పరిశుభ్రతకు పూనుకొని పర్యావరణాన్ని కాపాడుకొనే ప్రయత్నాలు చేయడం, బృందపని సారథ్య సామార్థ్యం పట్ల అవగాహన పెంచడం వంటి అలవాట్లు, పనులు వీరిలో కనిపిస్తాయి.సత్యాన్ని ప్రేమించే అన్వేషకులు ఆత్మ సంబంధ జీవముతో వర్ధిల్లుతుంటారు. సత్య సంబంధ ఆత్మజ్ఞానం ఆత్మకు ఆహారం. ఇట్టి ఆహారం వలన జీవింపజేసేది, మనిషి ఉనికిని కాపాడుతుండేది ఆత్మే కాబట్టి ఆత్మ అభ్యున్నతి పట్ల శ్రద్ధ అవసరం. తెలిసిన కొద్దిపాటి సత్యంతోనే ఎదగడం ప్రారంభిస్తే, అనగా అట్టి సత్యానికి లోబడి జీవిస్తేనే మరింతగా సత్యములోనికి అడుగులు పడే అవకాశం మెండుగా ఉంటుంది. ఇలా ఆధ్యాత్మిక వికాసం వైపుగా ఒక్కో మెట్టు ఎక్కగలిగితే ఆధ్యాత్మిక భావ దారిద్య్రం నుండి విడిపించబడతాము.– జేతమ్ఇవి చదవండి: ధైర్యం వదిలేస్తే ఏం జరుగుతుంది? -
నేడు నేపాల్... రేపు ఇండియా?
హిమాలయాలు కోట్లాది ప్రజలకు జీవనాధారమైన నదులకు పుట్టినిల్లు. భారత ఉపఖండ వాతావరణం, వ్యవసాయం, జీవ వైవిధ్యం, ఆధ్యాత్మికతతో వాటికి విడదీయరాని సంబంధం ఉంది. కానీ నేడు మనిషి హిమాలయాలను ప్రకృతి వరంగా కాకుండా పర్యాటక కేంద్రంగా, రహదారి కారిడార్‌గా, విద్యుత్ ప్రాజెక్టుల ప్రాంతంగా, నిర్మాణాలకు అనువైన భూమిగా చూడటం మొదలు పెట్టాడు. మరోవైపు వాతావరణ మార్పుల ప్రభావం కూడా పెరుగు తోంది. ఫలితంగా నేపాల్–టిబెట్ సరిహద్దు హిమాలయప్రాంతంలో ఆగస్టు 26 లాంటి ఘోరవిపత్తులు సంభవిస్తున్నాయి. అభివృద్ధి కావాలి. కానీ హిమాలయాల మూల్యంతో కాదు. దేశ భద్రతకు రహదారులు అవసరం. స్థానిక ప్రజల ఆర్థికాభివృద్ధికి పర్యాటకం అవసరం. కానీ హిమాలయాలను మైదాన ప్రాంతాల మాదిరిగా చూస్తూ అభివృద్ధి చేయడం ప్రమాదకరం. కొండను తొలిచి రోడ్డు వేస్తాం. తవ్విన మట్టి, రాళ్లను పక్కనే వేస్తాం. నదీ తీరంలో హోటల్ కడతాం. పార్కింగ్ కోసం నదినే పూడ్చివేస్తాం. వాగులపై నిర్మాణాలు చేపడతాం. సహజ డ్రైనేజీలను మూసేస్తాం. ఆ తర్వాత భారీ వర్షం వస్తే మాత్రం దాన్ని ‘అనూహ్య ప్రకృతి విపత్తు’గా పేర్కొంటాం. ప్రకృతి అనూహ్యంగా ప్రవర్తించిందా? లేక ప్రకృతి హెచ్చరికలను మనమే పట్టించుకోలేదా?హిమాలయంలో రహదారి నిర్మాణం అంటే కేవలం కొండను తవ్వడం కాదు. కొండ స్థిరత్వం, నీటి సహజ ప్రవాహం, వర్షపు నీటి డ్రైనేజీ, దిగువ ప్రాంతాల భద్రత అన్నింటిపైనా ప్రభావంఉంటుంది. అందుకే ‘ఎన్ని కిలోమీటర్ల రోడ్డు నిర్మించాం?’ అన్నదే కాకుండా ‘ఎంత భూభాగం అస్థిరమైంది?’ అని కూడా ప్రశ్నించాలి. రోడ్డు ‘ఆల్ వెదర్’ కావచ్చు... హిమాలయం మాత్రం ‘ఆల్ వెదర్’ కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి.కేదార్నాథ్ నుంచి జోషిమఠ్ వరకు...2013 కేదార్నాథ్ విషాదం హిమాలయాల సున్నితత్వాన్ని దేశా నికి స్పష్టంగా చూపించింది. నదీ లోయలు, వరద మైదానాలు, కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో నిర్మాణాలపై హెచ్చరికలు వచ్చాయి. 2023లో జోషిమఠ్ భూమి కుంగుబాటు మరోసారి హెచ్చరించింది.హిమాలయాల్లో మరో పెద్ద సమస్య నదీ తీరాలు, వరద మైదానాల్లో పెరుగుతున్న నిర్మాణాలు. సహజ నదీ ప్రవాహప్రాంతం క్రమంగా కుంచించుకు పోతోంది. సాధారణ రోజుల్లో నది ప్రశాంతంగా ఉంటుంది. కానీ అసాధారణ వర్షం వచ్చినప్పుడు దాని పాత ప్రవాహ మార్గాలు తిరిగి జీవం పొందుతాయి. నది తన దారిని తిరిగి వెతుక్కుంటుంది. అందుకే నదీ గర్భం, వరద మైదా నాల్లో నిర్మాణాలకు కఠినమైన జోనింగ్ నిబంధనలు అవసరం.హిమాలయాలను రక్షించాలంటే అభివృద్ధిని పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు. అభివృద్ధి విధానాన్ని మార్చాలి. ప్రతి ప్రధాన తీర్థ, పర్యాటక ప్రాంతానికి శాస్త్రీయ క్యారీయింగ్ కెపాసిటీని నిర్ణయించాలి. నదుల వెంట, సహజ డ్రైనేజీలలో నిర్మాణాలను కఠినంగా నియంత్రించాలి. భారీ రోడ్డు, టన్నెల్, విద్యుత్ ప్రాజెక్టులకు పర్యా వరణ ముప్పు మదింపును తప్పనిసరి చేయాలి. కొండ తవ్వకాల వ్యర్థం నదుల్లోకి చేరకుండా పటిష్ట పర్యవేక్షణ ఉండాలి. స్థానిక ప్రజల అనుభవం, సంప్రదాయ జ్ఞానాన్ని విపత్తు నిర్వహణలో భాగం చేయాలి.హిమాలయాలను జయించలేం, గౌరవించాలి. ఎంత పెద్ద రోడ్డు వేసినా, ఎన్ని టన్నెళ్లు తవ్వినా, ఎన్ని హోటళ్లు కట్టినా, ఒక విరిగిన భారీ కొండచరియ ముందు మనిషి ఎంత చిన్నవాడోప్రకృతి నిరూపిస్తూనే ఉంటుంది. హిమాలయాలను మన అవసరా లకు తగ్గట్టు మార్చడం కాదు. మన అవసరాలను హిమాలయాల పరిమితులకు తగ్గట్టు మార్చుకోవాలి. అదే నిజమైన అభివృద్ధి.– శ్రీకాంత్ బందు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
ఘర్షణ లేదు... పురోగతీ లేదు!
భారత్ ప్రస్తుతం దౌత్య వ్యవహారాల్లో తలమునకలై ఉంది. కిర్గిజ్స్తాన్లోని బిష్కెక్లో ఆగస్టు 31 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖ రాగ్ర సమావేశాలు మొదలవుతున్నాయి. తర్వాత, ఢిల్లీలో సెప్టెంబర్ 12 నుంచి ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు జరగ నున్నాయి.మన జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్ ఆగస్టు 25న చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్, విదేశాంగ మంత్రి వాంగ్ యితో బీజింగ్‌లో చర్చలు జరిపారు. భారత్–చైనా సరిహద్దు వివాదంపై రెండు దేశాల ప్రత్యేక ప్రతి నిధుల 25వ దఫా సమావేశాలు చైనాలో జరిగాయి. రెండు దేశాలు మొదటి రోజున విడివిడిగా ప్రకటనలు చేశాయి. దాంతో ఏకాభి ప్రాయం కుదరనట్లుగా కనిపించింది. కానీ, ఆగస్టు 26న, ఎనిమిది అంశాలతో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఏకీభావం ఎందులో?ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరింపజేసుకోవడం, స్థిరత్వాన్ని కొనసాగించడం, శాంతి, ప్రశాంతతలకు భంగం వాటిల్లకుండా చూసుకొనే దిశగా ముందడుగు వేయాలని స్థూలంగా ఒక అభిప్రా యానికి వచ్చారు. సరిహద్దుల పునర్విభజనపై ‘వీలైనంత త్వరగా, గణనీయమైన ఫలితాలు’ సాధించేలా చర్చలు జరపాలనే సంకల్పం గురించి ప్రత్యేకించి పేర్కొన్నారు. సరిహద్దుకు రెండు వైపుల ప్రవహి స్తున్న నదుల గురించి సెప్టెంబర్‌లో మాట్లాడుకోవాలని నిర్ణయాని కొచ్చారు. సరిహద్దు గుండా సాగే వర్తకానికి వెసులుబాటు కల్పించు కోవాలనీ, సరిహద్దులో అదనంగా సమావేశ ప్రాంతాలు, హాట్ లైన్స్ ఏర్పాటు చేసుకోవాలనీ నిర్ణయించారు.భారత్–చైనా మధ్యనున్న 3,488 కిలోమీటర్ల నిడివి గల వాస్తవాధీన రేఖలో పునర్విభజనకు ఏయే రంగాలను ఎంచుకున్నదీ రెండు పక్షాలు వెల్లడించలేదు. భారత్–చైనా ప్రత్యేక ప్రతినిధుల తదుపరి దఫా సమావేశం మన దేశంలో 2027లో జరుగనుంది. గల్వాన్ ఘర్షణ (2020) తర్వాత, స్నేహ సంబంధాలను పటిష్ట పరచుకునేందుకు ఆమధ్య కాలంలో సాగిన ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ చర్చలు జరిగాయని భావించవచ్చు. కూటముల భిన్న లక్ష్యాలుభారత్ విషయానికొస్తే, ‘ఎస్సీఓ’, ‘బ్రిక్స్’ నెరవేర్చగల ప్రయోజనాలు భిన్నమైనవి. షాంఘై సహకార సంస్థలో భారత్– చైనాలతోపాటు రష్యా, పాకిస్తాన్, కజికిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్ ఉన్నాయి. ఇది మొదట్లో ప్రాంతీయ భద్రత, కౌంటర్–టెర్రరిజంపైనే దృష్టి పెట్టింది. తర్వాత, ఆయా దేశాల మధ్య కనెక్టివిటీ, వాణిజ్య సంబంధాలకు విస్తరించి నప్పటికీ, ఈ సంస్థకు ఇప్పటికీ భద్రతే మూల బిందువు.బిష్కెక్ సమావేశంలో మనం సీమాంతర తీవ్రవాదం గురించి లేవనెత్తే అవకాశం ఉంది. సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేదిగా ఉన్న చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్లపై వెనక్కి తగ్గాలని కోరవచ్చు. మధ్య ఆసియా, రష్యా, చైనాలతో కలసి పనిచేయగల మార్గాలను అన్వేషించవచ్చు. ‘బ్రిక్స్’కు విస్తృత భౌగోళిక రాజకీయ ప్రాధాన్యం ఉంది. ప్రస్తుత అధ్యక్ష హోదాలో ‘బ్రిక్స్’ కూటమి నాయకుల 18వ శిఖరాగ్ర సమావేశాలకు మనమే ఆతిథేయిగా ఉన్నాం. ‘స్థితిస్థాపకత, నవీ కరణ, సహకారం, సుస్థిరత’లను ప్రధాన భావనగా చేసుకుని ఈ సమావేశాలు సెప్టెంబర్ 12–13 తేదీలలో జరుగనున్నాయి. రెండు వారాల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఢిల్లీ సదస్సుకు జిన్‌పింగ్ హాజరవుతారని బీజింగ్ ఇంకా అధికారికంగా ప్రకటించ లేదు. కానీ, భారత్ ‘విజయవంతంగా’ ‘బ్రిక్స్’ సమావేశాలు నిర్వహించేందుకు అండగా ఉంటామని చైనా చెబుతోంది. బ్రెజిల్ శిఖరాగ్ర సదస్సుకు జిన్‌పింగ్ హాజరవబోవడం లేదని బీజింగ్ 2025 మొదట్లోనే ప్రక టించేసింది. ఇది నిష్క్రియాపరత్వం కాదు. ఆచితూచి వ్యవహరించే ధోరణి. హాజరయ్యే అంశాన్ని నాన్చడం వల్ల సరిహద్దు పునర్విభజన, వాణిజ్యం అంశాలపై బేరసారాలాడేందుకు బీజింగ్‌కు అవకాశం చిక్కుతుంది.పాతుకుపోయిన అపనమ్మకంబీజింగ్ రెండు నాల్కల ధోరణి ఢిల్లీని కలవరపరుస్తోంది. అది ఒక పక్క, ద్వైపాక్షిక సంబంధాలను ‘వ్యూహాత్మక, దీర్ఘకాలికదృక్పథం’తో చూస్తున్నామని చెబుతోంది. మరోపక్క, అరుణాచల్ ప్రదేశ్‌కు సంబంధించి కొత్త మ్యాప్‌లు విడుదల చేస్తోంది. వాస్తవాధీన రేఖపై అస్పష్టతను కొనసాగిస్తోంది. ఉగ్ర జాబితాలో చేర్చే విషయంలో ఐక్యరాజ్య సమితిలో మనకు అడ్డంపడుతోంది.ఢిల్లీ కూడా రెండు మార్గాల వైఖరిని కనబరుస్తోందని బీజింగ్ భావిస్తోంది. ‘క్వాడ్’ (ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా)తో సంబంధాలు బలపరచుకోవాలని చూస్తోంది. భారత్‌లో చైనాసంస్థల పెట్టుబడుల విషయంలో సవాలక్ష నిబంధనలనుముందుకు తెస్తోంది. భారత్ ఇలా సంశయించడానికి ఆర్థికఅంశాలు కారణమవుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రధాని అయినపుడు 2003–04లో భారత్–చైనా వాణిజ్య లోటు కేవలం 1.1 బిలియన్ డాలర్లు. మొత్తం వాణిజ్యం 14 బిలియన్ డాలర్లకన్నా తక్కువే. చైనా 2008 నాటికి భారత్‌కు పెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం సుమారుగా 38 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అది 2023–24 నాటికి 118.4 బిలియన్ డాలర్లను మించిపోయింది. 2024–25 నాటికి 127.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనాతో వాణిజ్యం మాదిరిగానే దాని నుంచి దిగుమతులు కూడా మనకు ఎక్కువ అవుతున్నాయి. ఈ వాణిజ్య లోటు 2003–04లో 1 బిలియన్ డాలర్లుగా ఉండేది. అది 2023–24 నాటికి 85.07 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 17% పెరుగుదలను కనబరుస్తూ 2024–25లో 99.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశపు మొత్తం వాణిజ్య అసమతుల్యతలో చైనా వాటాయే ఇపుడు 35%. చైనా నుంచి మరో పెద్ద అలను తట్టుకోగల స్థితిలో భారత్ లేదు. చైనా వస్తువులపై అమెరికా సుంకాలు 245% ఉన్నాయి. దాంతో చైనా వస్తువులు మన దేశంలోకి మరింతగా వచ్చిపడే ప్రమాదం ఉంది. పైగా, అమెరికాతో వాణిజ్యాన్ని పెంపొందించుకుని, దాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు ఢిల్లీ–వాషింగ్టన్ మధ్య చర్చలు సాగుతున్నాయి. భారత్ ఆత్మరక్షణ ధోరణిలో ఉంది. కనుక, ఎంతో యుక్తిని ప్రదర్శించవలసి ఉంటుంది. షాంఘై సంస్థలో సరిహద్దు, భద్రతా సమస్యలను లేవనెత్తాలి. ప్రపంచ బడుగు దేశాల వేదికగా ‘బ్రిక్స్’ను సజీవంగా ఉంచాలి. అదే సమయంలో, ఆర్థిక సంబంధాలు తెగి పోకుండా చూసుకోవాలి. ట్రంప్ 2026లో సృష్టించిన సంక్షోభం భారత్–చైనాలను ఎడమొహం పెడమొహం కాకుండా చేస్తోంది. అందుకనే, భారత్–చైనా ముంగిట ‘చారిత్రక అవకాశం’ ఉందని డోభాల్ వ్యాఖ్యానించారు. ఇతర విషయాల్లో ప్రగతిని సాధించే ముందు ‘సరిహద్దు సమస్యను సరైన విధంగా పరిష్కరించుకునేందుకు’ భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. చైనా విదేశాంగ మంత్రి యాంగ్ యి కూడా గత ఏడాదిగా రెండు పక్షాలు ‘క్షేత్ర స్థాయిలో ఫలితాలు చూపేందుకు కృషి చేశాయి. మంచి ప్రగతిని కనబరి చాయి’ అని వ్యాఖ్యానించారు. ప్రగతిని కనబరిచాయి అన్నారేగానీ, పురోగతి అనే పదాన్ని ఉపయోగించలేదు. సంపూర్ణ నమ్మకం లేక పోవడం వల్లనే పదాలను ఆచితూచి ప్రయోగిస్తున్నారు. రెండు దేశాలు ఘర్షణను కోరుకోవడం లేదు. గొప్పగా బేర సారాలు సాగించాలనే కోరిక ఇరువైపులా లేదు. పోటీని కొనసా గిస్తూ రావడమే ప్రస్తుతానికి చేయగలిగిన పని. రక్షణను చూసుకుంటూనే మిగిలిన పనులను చక్కబెట్టుకోవడం. ఇదీ భారత్–చైనా మధ్య సంబంధాల ప్రస్తుత స్థితి. రెండూ పరస్పర మిత్రదేశాలు కాదు. శత్రువులూ కాదు. ఒకరిని చూసి ఒకరు శాశ్వతంగా జంకే శక్తిమంతమైన దేశాలు. తదుపరి సంక్షోభం సంభవించకుండా నివారించడానికి చర్చలు జరుపుతూ ఉంటాయి. -వ్యాసకర్త రక్షణ వ్యవహారాల నిపుణుడు;‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్’-సి. ఉదయ్ భాస్కర్ -
శ్రావణ పూర్ణిమకు అంతటి విశిష్టత ఎందుకు?
దైవారాధనకు అన్ని రోజులూ అనువైనవే. కానీ కొన్ని రోజులు మరీ అనువైనవని భావించటం ఆస్తికులకు ఒక ముచ్చట. అందుకే ఇన్ని పండగలు! ఆధ్యాత్మిక జ్ఞానం భౌతిక ప్రమాణాలకూ, ఇంద్రియాలకూ అందదు. దాన్ని మనిషి తన మనసు ద్వారా భావించి, చింతన చేసి, గ్రహించ వలసిందే.ఆ మనసును నియంత్రించే అధిష్ఠాన దేవత చంద్రుడు. అందుకే నిండు పున్నమి దినాలన్నీ మనసును ఉత్తేజితం చేస్తాయి. కాబట్టి, పున్నమి దినాలన్నీ ఆధ్యాత్మిక చింతనకూ, సాధనలకూ, కార్యకలాపాలకూ అనుకూలమైన పర్వదినాలుగా పరిగణిస్తారు. అందునా శ్రావణ, కార్తీక పూర్ణిమలు మరీ విశిష్టాలు. శివారాధనకు శ్రావణ పూర్ణిమ ఎంతో ప్రశస్తం.శ్రావణ పూర్ణిమ అనగానే మూడు విశేషాలు మనసుకు వస్తాయి. ఇది ‘రాఖీ’ పూర్ణిమ. రక్షాబంధనాల పూర్ణిమ. సోదరులూ, తత్సమానులైన వారి క్షేమాన్నీ, సర్వతోసమృద్ధినీ ఆకాంక్షిస్తూ, సోదరీమణులూ (తత్సమానురాళ్ళూ) అనురాగంతో, ఆత్మీయతతో వారి చేతికి రక్షాబంధనాలు కట్టే వేడుక అనేక శతాబ్దాలుగా వస్తున్నది.ఈ పూర్ణిమ హయగ్రీవ అవతార తిథి. బ్రహ్మ చేసిన సత్రయాగంలో విష్ణుమూర్తి వేదమయుడైన హయగ్రీవు డిగా అవతరించి, తనఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా వేదవాణిని ప్రకటించాడని భాగవతం చెప్తుంది. జ్ఞాన సర్వస్వ మైన వేదాలను వినిపించిన జ్ఞానానందమయుడూ, నిర్మల స్ఫటికాకారుడూ, సకల విద్యలకూ ఆధారమూ అయిన హయగ్రీవుడి అవతార తిథి కాబట్టి శ్రావణ పూర్ణిమ, వేదాధ్యయన ఆరంభానికీ (‘ఉపాకర్మ’), వేద శ్రవణానికీ సముచితమైన ముహూర్తం. అందుకే, వేద విద్యార్థులూ, అధ్యాపకులూ, ఇతరులూ కూడా, శిథిలమై జీర్ణమైన దశలో ఉన్న యజ్ఞోపవీతాలను మార్చుకొనే ‘జంధ్యాల పూర్ణిమ’ కూడా ఇదే. ఇప్పటివరకూ వర్షాల వల్ల కుంటు పడిన ‘వానాకాలపు’ చదువులకు చురుకు పెంచి, ఈ పూర్ణిమ నుండి ఇక చదువులో శ్రద్ధనూ, వేగాన్నీ పెంచుకొంటే, అది వేద విద్యార్థులకూ, లౌకిక విద్యల విద్యార్థులకూ అందరికీ ప్రయోజనకరమే.– ఎం. మారుతి శాస్త్రిఇవి కూడా చదవండి: రక్షాబంధన్‌కి అంత మహత్తు ఉందా? ఆ పండుగ కోసమే ఆ దేవత.. -
మూడో ప్రపంచ యుద్ధ ముప్పున్నదా?
ఒకవైపు ఉక్రెయిన్–రష్యా యుద్ధం దీర్ఘకాలం కొనసాగుతుండగానే అనూహ్యంగా కొత్త సంక్షోభాలు ప్రారంభమయ్యాయి. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో శాంతి ఎండమావిగా తోస్తున్నది. ఇజ్రాయెల్ అనూహ్యంగా సిరియాను, తద్వారా టర్కీని కూడా యుద్ధంలోనికి లాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై సైనిక దాడికి దిగిన ట్రంప్ సరికొత్తగా ఆ దేశంపై ఆర్థిక యుద్ధం పల్లవి అందుకున్నాడు. ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న దేశాలపై ఆంక్షలు విధించాలన్న ట్రంప్ విధానం అమలైతే తీవ్రంగా నష్టపోయేది చైనా. ఇరాన్ చమురులో 90 శాతం చైనా కొనుగోలు చేస్తున్నది. ఈ రకంగా ఇరాన్ యుద్ధంలోనికి ప్రత్యక్షంగా చైనాను లాగటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే సందేహం కలుగుతున్నది. మరొకవైపు ఇజ్రాయెల్ ప్రధాని, ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ‘గ్రేటర్ ఇజ్రాయెల్’ పల్లవిని అందుకున్నాడు. ఇంకొకవైపు సౌదీ– పాకిస్తాన్–టర్కీ ‘మక్కా ఒప్పందం’తో నాటో తరహా సైనిక ఒప్పందంపై సంతకాలు చేశాయి. బంగ్లాదేశ్ ప్రధాని మక్కా ఒప్పందంలోనికి చేరటానికి సంకేతాలివ్వటం భారత్‌ను ఒత్తిడిలోనికి నెట్టింది. వేగంగా మారుతున్న సమీకరణాలు ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధంవైపు తీసుకెళ్తున్నాయా అనే సందేహాన్ని కలిగించక మానవు.ప్రపంచ యుద్ధాల నేపథ్యంమొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఐరోపా రెండు రాజకీయ /సైనిక కూటములుగా చీలిపోయింది. బ్రిటన్ ఆధిపత్యాన్ని జర్మనీ సవాలు చేసింది. పాన్ జర్మనిక్, పాన్ స్లావిక్, బాల్కన్ జాతీయవాద ధోరణులు బలంగా వ్యాపించి ఉన్నాయి. జూన్ 1914లో ఆస్ట్రియా– హంగరీ సామ్రాజ్య వారసుడు ఫ్రాంక్ ఫెర్డినాండ్ హత్యతో సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధాన్ని ప్రకటించింది. కూటమి ధర్మంలో భాగంగా సెర్బియాకు మద్దతుగా రష్యా, ఆస్ట్రియాకు మద్దతుగా జర్మనీ యుద్ధంలో చేరాయి. జర్మన్ సైనికాధికారి ‘షెఫర్’ యుద్ధ తంత్రంలో భాగంగా తటస్థ దేశమైన బెల్జియంపై దాడి చేయాల్సి వచ్చింది. ఈ రకంగా యుద్ధం ఐరోపా మొత్తం విస్తరించింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత కుదిరిన వెర్సెయిల్స్ ఒప్పందంలో భాగంగా జర్మనీపై విధించిన యుద్ధనష్ట పరిహారం, ఇతర అంశాలను అమలు చేసే యంత్రాంగం లేకపోవడం, ఆర్థిక మాంద్యం (గ్రేట్ డిప్రెషన్), పునరుత్థానం చెందుతున్న జర్మనీ/ జపాన్ వంటి దేశాలు తమ ఆధిపత్యాన్ని పునఃస్థాపించటానికి సరి హద్దుల వ్యాప్తి (లెబెన్స్రామ్), లీగ్ ఆఫ్ నేషన్స్ వైఫల్యం రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఫాసిజం, కమ్యూనిజం, లిబరల్ డెమోక్రసీ వంటి సిద్ధాంతాల వైరుధ్యం అగ్నికి ఆజ్యంపోశాయి.ఈ సందర్భంలో ‘తూసిడైడీస్ ట్రాప్’ సిద్ధాంతాన్ని చర్చించు కోవాలి. ప్రాచీన చరిత్రకారుడైన తూసిడైడీస్... ఒక కొత్త రాజకీయ శక్తి ఎదుగుదల ప్రస్తుత రాజకీయ శక్తిలో సందేహాన్ని, భయాన్ని కలిగించినప్పుడు... ఇరు శక్తులు ఆయుధ సమీకరణ చేస్తాయనీ, అప్పుడు యుద్ధం అనివార్యమనీ సిద్ధాంతీకరించాడు. ప్రాచీన గ్రీక్ ప్రాంతంలో ఏథెన్స్ ఎదుగుదల స్పార్టాలో భయానికి కారణమై యుద్ధానికి దారితీసింది. 2017లో రాజకీయ శాస్త్రజ్ఞుడు గ్రాహమ్ ఆలిసన్ తన ‘డెస్టైన్డ్ ఫర్ వార్: కెన్ అమెరికా అండ్ చైనా ఎస్కేప్ తూసిడైడీస్స్ ట్రాప్?’ గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని విస్తృతంగా పరిశీ లించాడు. గత 500 ఏళ్ల చరిత్రలో కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించిన 16 సందర్భాల్లో 12 సార్లు యుద్ధం జరిగిందని పేర్కొన్నాడు. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా?1914, 1939 సంవత్సరాలలో మాదిరిగానే ఇప్పుడూ ఒక కొత్త రాజకీయ శక్తి చైనా ప్రపంచ ఆధిపత్య రేసులోనికి వచ్చింది. ట్రంప్ ట్యారిఫ్ వార్‌లో చైనా, అమెరికాపై ప్రతిసుంకాలను విధించింది. ఇటీవల ట్రంప్ బీజింగ్ పర్యటన సందర్భంగా తైవాన్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని జిన్‌పింగ్ హెచ్చరించాడు. సెమికండక్టర్స్, చిప్స్, కృత్రిమ మేధ, క్రిటికల్ మినరల్స్ రంగాలలో అమెరికాకు, ఐరోపాకు చైనా నేరుగా సవాలు విసిరింది. 2020 నుండి రష్యా తిరిగి బలం పుంజుకొని నాటో ఆధిప త్యాన్ని సవాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్‌పై ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఐక్యరాజ్యసమితి బలహీనపడటంతో మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు కూడా యుద్ధాన్ని నిలువరించే వ్యవస్థలు లేవు. కోవిడ్ అనంతరం ప్రపంచ ఆర్థికాభివృద్ధి మందగించడం, గల్ఫ్ యుద్ధం, వాతావరణ మార్పుల వంటి వాటివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధరంగంలోనికి అణ్వస్త్రాలు వచ్చి చేరాయి. ప్రధాన రాజకీయ శక్తులన్నీ అణ్వస్త్ర దేశాలే. వీటిమధ్య ప్రత్యక్ష యుద్ధం సంభవిస్తే, పరస్పర వినాశం అనివార్యం. అందువలన ఏ అణ్వస్త్ర దేశం ఇంకో అణ్వస్త్ర దేశంపైన దాడికి సాహసించే అవకాశం లేదు. ప్రస్తుత ప్రపంచంలోని వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి పెనవేసుకొని ఉన్నాయి. అందువలన మూడవ ప్రపంచ యుద్ధం సంభవిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఏ రాజకీయ శక్తి కూడా ఈ దుస్సాహసానికి పాల్పడలేదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల సమయంలో మాదిరిగా ఇప్పుడు స్పష్టమైన పరస్పర, వైరుధ్య శత్రు కూటములు కూడా లేవు. కొత్త కూటములుఅయితే కూటములు ఏర్పడే అవకాశాలూ కనపడుతున్నాయి. చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా (క్రింక్) ఒక కొత్త సైనిక కూట మిగా ఏర్పడి నాటోను నేరుగా సవాలు చేయవచ్చు. మక్కా ఒప్పందంతో సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ కొత్త సైనిక కూటమిగా ఇప్పటికే ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయాలను వెదకాల్సి వస్తుంది. బహుశా దీనికి విరుగు డుగా భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – ఇజ్రాయెల్ – జపాన్ కూటమి అవతరించినా ఆశ్చర్యపోనవసరం లేదు. గ్రేటర్ ఇజ్రాయెల్‌లో భాగంగా నైలు నది నుండి యూఫ్రటీస్ నది వరకు లేదా, కనీసం జోర్డాన్ నది నుండి మద్యధరా సముద్రం వరకు ఇజ్రాయెల్ విస్తరణకు పూనుకుంటే గల్ఫ్ యుద్ధక్షేత్రం మరింత విస్తరిస్తుంది. ఇరాన్‌పై అమెరికా ఆర్థిక యుద్ధాన్ని తీవ్ర తరం చేస్తే నష్టపోయే చైనా... ఇరాన్‌కు ప్రత్యక్షంగా మద్దతు తెలప వచ్చు. దీంతో ఇరాన్... ఐరోపా దేశాలపై దాడులు చేయవచ్చు. ఇదే అదనుగా రష్యా ఇతర ఐరోపా దేశాలపై (ముఖ్యంగా బాల్టిక్ దేశాలపై) దాడులు చేసి ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించవచ్చు. శత్రువును నిలువరించటానికి ఇదే అనువైన సమయంగా భావించి తైవాన్ను చైనా స్వాధీనం చేసుకోవటానికి ఉపక్రమించవచ్చు. రష్యా, చైనాలకు మద్దతుగా దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దాడి ప్రారంభించవచ్చు. ఇదే అదనుగా పాక్–చైనా కలిపి భారత్‌పై దాడి చేయవచ్చు. ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. అయితే మూడవ ప్రపంచ యుద్ధం... దేశాలను, భూభాగాలను ఆక్రమించుకోవటానికి కాకుండా శత్రుదేశాల సామర్థ్యాన్ని ధ్వంసం చేసే దిశగా ఉంటుంది. నగరాలు, పౌరులు లక్ష్యంగా ఉండదు. రేవుల దిగ్బంధనం, రవాణా మార్గాల దిగ్బంధనం, ఆర్థిక విధ్వంసం, సైబర్, అంతరిక్ష దాడులు, ప్రాక్సీ వార్ఫేర్ రూపంలో ఉండవచ్చు. గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
విషపూరిత ఆహారానికి విరుగుడేది?
2026 ఆగస్టు 11న లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఒక లెక్క చెప్పింది: 2023 నుండి 2026 మధ్య దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి సేకరించిన 70,652 పండ్లు, కూరగాయల నమూనా లను పరీక్షించారు. వాటిలో 2,223 నమూనాల్లో, అంటే 3.15 శాతంలో పురుగుమందుల అవశేషాలు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిర్ణయించిన గరిష్ఠ అవశేష పరిమితి (ఎంఆర్ఎల్– మ్యాగ్జిమమ్ రెసిడ్యూ లిమిట్) కంటే ఎక్కువగా కనిపించాయి. జాతీయ సగటుగా చూస్తే ఇది చిన్న సంఖ్యే. కానీ తెలుగు రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి వేరు.తెలుగు రాష్ట్రాలు ఆందోళనకరంతెలంగాణలో 8,198 నమూనాల్లో 486 నమూనాలు, అంటే 5.93 శాతం (జాతీయ స్థాయిలో మూడో స్థానం) పరిమితి దాటాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2,104 నమూనాల్లో 134, అంటే 6.37 శాతం (జాతీయ స్థాయిలో రెండో స్థానం) పరిమితి దాటాయి. రెండూ దేశ సగటు కంటే దాదాపు రెట్టింపు. మరో విధంగా చెప్పాలంటే, దేశంలో పరిమితి దాటిన మొత్తం నమూనాల్లో దాదాపు 28 శాతం ఈ రెండు రాష్ట్రాల నుండే వచ్చాయి. కానీ పరీక్షించిన మొత్తం నమూనాల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా 15 శాతమే. 2004–2010 మధ్యలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో సగానికి పైగా తగ్గిన పురుగు మందుల వినియోగం అ తర్వాత విపరీతంగా పెరిగింది అని అర్థం అవుతోంది. వినియోగంతో పాటు అవశేషాలు కూడా పెరుగుతున్నాయి. మోతాదుకి మించి అవశేషాలు ఉండ టాన్ని వినియోగదారులుగా మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎంఆర్ఎల్ అంటే ‘సురక్షితం – అసురక్షితం’ అనే గీత కాదు. ఇక్కడో ముఖ్యమైన అపార్థం ఉంది. ఎంఆర్ఎల్ అనేది ఆరోగ్య కోణంలో ‘ఇంతకు మించితే విషం’ అనే గీత కాదు. సిఫారసు చేసిన పంటపై, సిఫారసు చేసిన మోతాదులో, సిఫారసు చేసినన్నిసార్లు మాత్రమే పిచికారీ చేసి, కోతకు ముందు నిర్ణీత విరామం పాటించి నప్పుడు పంటలో మిగిలే గరిష్ఠ అవశేషం అది. అంటే అది ముఖ్యంగా ‘మందును సరిగ్గా వాడారా?’ అని చెప్పే కొలమానం. అయితే ఇక్కడ రెండు ‘నిజాలను’ గుర్తించాలి. 1. ఎంఆర్ఎల్ దాటిందంటే ఆ కూరగాయ తినగానే హాని జరుగుతుందని కాదు. ఈ పరిమితులను చాలా కింది స్థాయిలో పెడతారు. 2. ఎంఆర్ఎల్ లోపల ఉందంటే సురక్షితమని కూడా కాదు.పంట వేరు, భోజనం వేరు ప్రయోగశాల టమాటాను విడిగా, మిర్చిని విడిగా పరీక్షిస్తుంది. కానీ ఇంట్లో మనిషి టమాటా, మిర్చి, ఆకుకూర, బియ్యం, పప్పు, పండ్లు– అన్నీ కలిపి తింటాడు. ప్రతీ పదార్థం దాని సొంత ఎంఆర్ఎల్ లోపలే ఉండవచ్చు. కానీ ఒకే మందు నాలుగైదు పదార్థాల ద్వారా శరీరంలోకి వెళ్ళవచ్చు. ప్రపంచంలో ఇందుకోసం రెండు కొలమానాలు ఉన్నాయి. మొదటిది ఏడీఐ (యాక్సెప్టబుల్ డెయిలీ ఇన్‌టేక్)– కిలో శరీర బరు వుకు, రోజుకు, జీవితాంతం తీసుకున్నా ఇబ్బంది లేని మోతాదు. రెండోది ఏఆర్ఎఫ్డీ (అక్యూట్ రిఫరెన్స్ డోస్)– ఒక్క పూటలో లేదా ఒక్క రోజులో తీసుకోదగిన మోతాదు. రెండూ శరీర బరువుకు అనుగుణంగా లెక్కగట్టేవి. అందుకే అదే కూర 60 కిలోల బరువున్న పెద్దవాడికంటే 15 కిలోల పిల్లవాడికి ఎక్కువ ప్రమాదం అవుతుంది. ఒకే నమూనాలో రెండు, మూడు, నాలుగు రకాల మందుల అవశేషాలు కనిపించడం అసాధారణం కాదు. ప్రతీ మందూ దాని సొంత పరిమితి లోపలే ఉండవచ్చు. కానీ ఒకే రకమైన ప్రభావం చూపే మందులు కలిసినప్పుడు మొత్తం ప్రభావం ఎంత అనేది వేరే ప్రశ్న. యూరప్ ఆహార భద్రతా సంస్థ (ఈఎఫ్ఎస్ఏ) ఈ దిశగా పని మొదలుపెట్టింది. మనం కనీసం ఏ నమూనాలో ఎన్ని మందులు కలిసి ఉన్నాయో నమోదు చేసి, ప్రచురించడం నుండి మొదలుపెట్టాలి.ఎంఆర్ఎల్ దాటడం అనేది కేవలం ప్రయోగశాల ఫలితం కాదు– అది పొలంలో జరిగిన దాని సంకేతం. కారణాలు రైతులకు కొత్తవేమీ కాదు: ఆ పంటకు అనుమతి లేని మందు వాడకం,లేబుల్ కంటే ఎక్కువ మోతాదు, అవసరం లేకుండా మళ్ళీ మళ్ళీ పిచికారీ, మూడు నాలుగు మందుల అనవసర మిశ్రమాలు, పురుగు కనిపించకపోయినా క్యాలెండర్ ప్రకారం పిచికారీ, పంట కోత విరామం పాటించకపోవడం, పిచికారీ చేసిన వెంటనే కోయడం. మిర్చి, టమాటా, బెండ, వంకాయ, ద్రాక్ష– తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సాగేవి, ఎక్కువ పిచికారీలు అవసరమయ్యేవి. అయితే గణాంకాల నుండి కారణం ఏదని నేరుగా చెప్పలేం. అది పొలాల్లో విచారణ చేసినప్పుడే తెలుస్తుంది.ఒక సంగతి: ఈ పట్టికను రాష్ట్రాల ర్యాంకింగ్‌గా చదవకూడదు. ఛత్తీస్‌గఢ్‌లో పరీక్షించినవి 29 నమూనాలే; ఒక్కటీ పరిమితి దాట లేదు. అయినా అక్కడ సమస్య లేదని అర్థం కాదు. ఎక్కడ సేకరించారు, ఏ పంటలు, ఏ కాలంలో, ఎన్ని మందుల కోసం చూశారు– ఇవన్నీ సంఖ్యను మార్చేస్తాయి.కూరగాయలు మానేయకండి!చివరగా ఒక ముఖ్యమైన మాట: ఈ కథనం చదివి కూర గాయలు, పండ్లు తినడం తగ్గించవద్దు. ఐసీఎంఆర్– జాతీయ పోషకాహార సంస్థ రోజుకు 400 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పండ్లు తినాలని సిఫారసు చేస్తోంది. మనం అంతకంటే చాలా తక్కువ తింటున్నాం. కూరగాయలు తక్కువ తినడం వల్ల కలిగే గుండె, మధుమేహ, క్యాన్సర్ ముప్పు... అవశేషాల ముప్పు కంటే చాలా పెద్దది. కడగడం, తొక్క తీయడం, వండటం వంటివి అవశేషాలను గణనీయంగా తగ్గిస్తాయి. కానీ మొత్తం బాధ్యతను వినియోగ దారుడిపై నెట్టడం సరైనది కాదు. అవశేషం పుట్టేది ఇంట్లో కాదు, పొలంలో. అందుకే పరిష్కారం అక్కడే జరగాలి. పురుగుమందుల అవసరం తగ్గించడమే సమస్యకు అసలైన పరిష్కారం. ఎర పంటలు వేయడం, ఫెరమోన్ ట్రాప్‌లు పెట్టడం, మిత్రపురుగుల పరిరక్షణ, పంట వైవిధ్యం, ఆర్థిక నష్టస్థాయి దాటినప్పుడే చర్య తీసుకోవడం, రైతు క్షేత్ర పాఠశాలల ఏర్పాటు వంటివి అవసరం. తెలుగు రాష్ట్రాలకు ఈ అనుభవం ఇప్పటికే ఉంది.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ -
అతడు సముద్రాలను కొలిచేశాడు!
1768 ఆగస్టులో ఇంగ్లాండ్ నుంచి ఎండీవర్ అనే చిన్న నౌక సముద్రంలోకి బయలుదేరింది. దానికి నాయకత్వం వహించిన కెప్టెన్ జేమ్స్ కుక్కు సముద్రాలను కొలవాలి, తెలియని భూభాగా లను పటాల్లో నమోదు చేయాలి. కుక్ 1728లో వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించాడు. చిన్న వయసులోనే వ్యాపార నౌకల్లో పనిచేస్తూ సముద్ర ప్రయాణం నేర్చుకున్నాడు. బ్రిటిష్ నౌకాదళంలో చేరి కెనడాలోని సెయింట్ లారెన్స్ నది, న్యూఫౌండ్లాండ్ తీరాన్ని సర్వే చేయడం ద్వారా మ్యాపుల తయారీలో నైపుణ్యాన్ని చాటాడు. 18వ శతాబ్దంలో భూమి నుంచి సూర్యుడి దూరం ఎంత అనే ప్రశ్న ఖగోళ శాస్త్రవేత్తలను వేధించేది. 1769లో జరిగే వీనస్ ట్రాన్సిట్ను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పరిశీలించడం ద్వారా ఈ దూరాన్ని అంచనా వేయాలని భావించారు. అందుకే ఎండీవర్‌లో శాస్త్రీయ పరికరాలతో ఖగోళ శాస్త్రవేత్తలూ బయలుదేరారు. యువ ప్రకృతి శాస్త్రవేత్త జోసెఫ్ బ్యాంక్స్, స్వీడిష్ వృక్షశాస్త్రవేత్త డానియల్ సోలాండర్ కూడా ఈ యాత్రలో భాగం అయ్యారు.ఎండీవర్ యాత్ర అధికారికంగా తాహితీలో శుక్రగ్రహం సూర్యుడి ముందు నుంచి దాటుతున్నట్లు కనిపించే వీనస్ ట్రాన్సిట్ను పరిశీలించడానికి బయలుదేరింది. కానీ కుక్కు మరో రహస్య ఆదేశం కూడా ఉంది: తెలియని దక్షిణ భూభాగం– టెర్రా ఆస్ట్రాలిస్ ఇన్ కాగ్నిటా– ఉందా లేదా పరిశీలించాలి; కనిపిస్తే బ్రిటన్ తరఫున దానిపై హక్కు ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాలి. ఫలితంగా రాయల్ సొసైటీ పరిశోధన, బ్రిటిష్ అడ్మిరాల్టీ వ్యూహం ఒకే నౌకలో ప్రయాణించాయి.1769 జూన్ 3న తాహితీలో అంతరిక్షంలో వీనస్ ట్రాన్సిట్ను పరిశీలించారు. తరువాత కుక్ న్యూజిలాండ్‌కు చేరుకుని దాని తీరప్రాంతాన్ని శాస్త్రీయంగా సర్వే చేశాడు. న్యూజిలాండ్ ఒక భారీ దక్షిణ ఖండంలో భాగం కాదని స్పష్టం చేయడంలో అతని మ్యాపులు కీలకమయ్యాయి. 1770 నాటికి కుక్ ఆస్ట్రేలియా తూర్పు తీరానికి చేరుకుని దానిని మ్యాపుల్లో నమోదు చేశాడు. బోటనీ బేలో బ్యాంక్స్, సోలాండర్ వివిధ మొక్కల నమూనాలను సేకరించారు. గ్రేట్ బ్యారియర్ రీఫ్ వద్ద ఎండీవర్ ప్రమాదంలో పడినా నౌకను మరమ్మతు చేసి ప్రయాణాన్ని కొనసాగించారు. తుదకు 1771లో ఇంగ్లాండ్‌కు తిరిగి చేరుకున్నారు.కుక్ ఆస్ట్రేలియాను కనిపెట్టలేదు!అయితే కుక్ ఆస్ట్రేలియాను ‘కనుగొన్నాడు’ అని చెప్పడం తప్పుదారి పట్టించే మాట. ఆ ఖండంలో వేల సంవత్సరాలుగా ఆదివాసీ సమాజాలు నివసిస్తున్నాయి. కుక్ చేసింది కేవలం ఆస్ట్రేలియా తూర్పు తీరాన్ని... యూరోపియన్ నౌకాయానాన్ని సులభతరం చేస్తూ ఓ పద్ధతి ప్రకారం మ్యాప్ చేయడం, బ్రిటిష్ సింహాసనం తరఫున హక్కు ప్రకటించడం మాత్రమే.ఇదీ చదవండి: జపాన్ అణ్వస్త్ర డైలమాబ్యాంక్స్, సోలాండర్ సేకరించిన మొక్కల నమూనాలు యూరోపియన్ శాస్త్ర ప్రపంచానికి కొత్త ప్రకృతి వైవిధ్యాన్ని పరిచయం చేశాయి. ఆ కాలంలో సముద్రంపై పయనించే యాత్రికులు స్కర్వీ వ్యాధితో చనిపోతూ ఉండేవారు. కుక్ యాత్రలో స్కర్వీ నివారణకు తగిన చర్యలు తీసుకున్నారు. ఆహారంపై శ్రద్ధ పెట్టారు. అతడి సముద్రయానం సముద్ర నావిగేషన్‌ను మరింత కచ్చితంగా చేసింది. అదే సమయంలో సైన్స్, మ్యాపింగ్, అన్వేషణలు సామ్రాజ్య విస్తరణకు కూడా ఉపయోగపడ్డాయి.అందుకే కుక్‌ను దేవుడిలా పొగడటం సరైంది కాదు, అలాగే అతడిని కేవలం వలసవాద ప్రతినిధిగా కొట్టిపారేయడం కూడా సరికాదు. అతను తన కాలంలోని సైన్స్, నౌకాయానం, సామ్రాజ్యవాద రాజకీయాలు కలిసిన ప్రపంచానికి ప్రతినిధి. శాస్త్రం, సాంకేతికత, పరిశీలన, పటాల తయారీ, వివిధ రంగాల నిపుణుల సహకారం కలిసినప్పుడే ఒక యాత్ర విజ్ఞానయుతంగా మారుతుంది అని కుక్ ప్రయాణం నిరూపించింది. ఆనాడు కుక్ తన బృందంలో వివిధ రంగాల నిపుణులను చేర్చుకున్న పద్ధతినే ఇప్పుడు అంతరిక్ష యాత్రలకు వెళ్లే బృందాల్లోనూ అనుసరించడం గమనార్హం. ఎడిటోరియల్ టీమ్ -
కష్టాల కావడి మోస్తున్న కౌలురైతు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని బతికిస్తున్న కౌలురైతుల బతుకులు దుర్భరమవుతున్నాయి. సొంతగా భూమి సాగుచేసే రైతు కన్నా ఇతరుల భూమి కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న రైతు మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నాడు. ప్రభుత్వ పథకాలు, విత్తన–ఎరువుల సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, నష్టపరిహారాలు, రుణమాఫీలు, మద్దతు ధర, బోనస్.... ఇటువంటివేవీ నేరుగా కౌలురైతులకు అందటం లేదు. ఎన్నికల హామీలతో ఊదరగొట్టి గద్దెనెక్కిన పార్టీలు, కౌలు రైతాంగానికిచ్చిన మాట తప్పిన ఫలితమే ఈ దుఃస్థితి!పెద్ద ఎత్తున ప్రజాధనం వెచ్చించి వ్యవసాయానికి మద్దతుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధి కౌలురైతులకు అందడం లేదు. నిజానికి క్షేత్రంలో ఉండి, పెట్టుబడి పెట్టి, పరి స్థితుల్ని ఎదుర్కొని సాగుచేసేది కౌలు రైతు. కానీ, వారిని గుర్తించి, ఆ మేరకు ప్రయోజనాలు కల్పించడానికి ప్రభుత్వాలు జంకుతున్నాయి. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి! అన్ని బాధలూ వారివే! సర్కారు లెక్కల ప్రకారం తెలంగాణలో కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉంది. చిన్న, మధ్యతరహా, పెద్ద...అంతా కలిపి సుమారు 70 లక్షల మంది రైతులుగా నమోదై పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఉన్నారు. వారంతా రైతు భరోసా (ఇదివరకటి రైతుబంధు) లబ్ధిదారులు. అందులోనే కొందరు, తమ భూమికి తోడు ఇతరుల భూమి తీసుకొని కౌలు చేస్తున్నారు. మరికొందరు, సొంత భూమే లేకున్నా ఇతరుల భూమి కౌలుకు చేస్తున్నారు. తెలంగాణలో 36 శాతం మంది కౌలురైతులున్నట్టు 2022లో ‘రైతు స్వరాజ్య వేదిక’ (ఆరెస్వీ) జరిపిన సర్వే లెక్కలు చెబుతున్నాయి. సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు, రుణమాఫీ లబ్ధి, రైతు భరోసా, పంట బీమా/పంట నష్ట పరిహారం, మద్దతు ధర, అదనపు బోనస్... ఇటువంటి ప్రయో జనం ఏదీ నేరుగా కౌలురైతుకు అందటం లేదు. ప్రభుత్వం, అనుబంధ విభాగాలు వ్యవసాయ రంగంలో ఆధు నిక సాంకేతికతను వినియోగించడం మొదలెట్టాక ‘యాప్’లతో భూయజమానుల మొబైల్, పాస్‌పుస్తకాలు లింక్ చేయడం, ‘ఓటీపీ’లు వారికే రావడం, ఎరువుల సమాచారమైనా, ధాన్యం విక్రయ వివరాలైనా నేరుగా వారి మొబైల్‌కు, బ్యాంకు ఖాతాలకే చేరుతోంది. కౌలు డబ్బు, పెట్టుబడి వ్యయం పెరిగి, మద్దతు ధర కూడా లభించక కౌలురైతు రెండింతలు నష్టపోతున్నాడు. ప్రభుత్వ సహాయమూ అందక మూడు రకాల భారం మోయాల్సివస్తోంది.కష్టాన్ని కళ్లకు కడుతున్న సర్వేలుతెలంగాణ గ్రామీణ జనాభాలో దాదాపు సగం మందికి సెంటు భూమి కూడా లేదు. ముఖ్యంగా వెనుకబడిన, దళిత, మైనారిటీ, గిరిజన వర్గాలవారిలో అత్యధికులకు భూమి లేదు, ఉన్నా ఒకటీ, అర ఎకరాలు మాత్రమే! ఇటీవల ‘కౌలురైతుల గుర్తింపు సాధన కమిటి’ వారు కూడా తెలంగాణలో సర్వే నిర్వహించారు. 22 జిల్లాలు, 47 మండలాలు, 57 గ్రామాల్లోని 1,836 మంది కౌలు రైతులను ‘ప్రాతినిధ్య నమూనా’లుగా ఎంపిక చేశారు. ప్రధానంగా వ్యక్తి గత ఇంటర్వ్యూ పద్ధతిలో సమాచారం రాబట్టారు. ఏపీలో ‘ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం’తో కలిసి ‘పీపుల్స్ పల్స్’ సర్వే నిర్వహించింది. మొత్తం 26 జిల్లాల్లో జిల్లాకు సగటున 100 నుంచి 125 ‘నమూనా’ల చొప్పున మొత్తం 3000 శాంపిల్స్‌తో నెల రోజుల పాటు ఈ సర్వే జరిగింది. కౌలురైతులకు ఏపీలో అరకొరగా గుర్తింపుకార్డు లిచ్చారు. 12.3 శాతం మంది తమకు లభించాయని చెబితే, కార్డు లేవీ అందలేదని 87.7 శాతం మంది వెల్లడించారు. 70 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారే ఏపీలో కౌలురైతులు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీరేట్లు, యంత్రాల అద్దెలు అసాధారణంగా పెరిగాయని 67.2 శాతం రైతులు చెబితే, కౌలు డబ్బు/ధాన్యం పెరగటం వల్ల ఇబ్బందులని 12.5 శాతం మంది, గిట్టుబాటు ధరలు లేక కష్టాలు పెరిగాయిని 10.8 శాతం మంది, అధిక వడ్డీల ప్రయి వేటు అప్పుల భారమనీ, మార్కెట్ సమస్యలనీ మరో పది శాతం మంది చెప్పారు. కొన్ని చోట్ల కౌలు రేట్లు యేటా ఎకరాకు 53 వేల రూపాయల వరకు చేరాయని, సగటున 14,936గా చెల్లిస్తున్నామని తెలంగాణ కౌలురైతులు చెప్పారు. చిన్న కమతాల్లో కౌలు గిట్టుబాటు కాక ఎక్కువ ఎకరాల్లో కౌలు చేయాల్సి వస్తోందని, ఇదివరకు సగటున రైతుకు 5 ఎకరాలున్న కౌలుసాగు ఇప్పుడు 6.7 ఎకరాలకు పెరిగిందని వారంటున్నారు. 5కు పైగా ఎకరాలు కౌలుసాగు చేస్తున్న రైతుల సంఖ్య 31 నుంచి 42 శాతానికి పెరిగింది. మాట తప్పిన ‘రాజకీయాలు’కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి, అన్ని సంక్షేమ పథకాలతో పాటు బీమాను వారికే వర్తింపజేస్తామని ఏపీలో తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ‘ప్రజాగళం’ పేరిట ప్రకటించిన ఎన్నికల మాని ఫెస్టోలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపు కౌలు రైతు లకు ప్రత్యేకచట్టం తెస్తామన్న మాట కూడా గాలికిపోయింది. కూటమి భాగస్వామి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (జనసేన) ఎన్నికల ముందు ఉత్తర కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమ... ఎక్కడి కక్కడ కౌలురైతుల సమావేశాలు పెట్టి, వారికి ఆర్థిక సహాయం అందించి నానా హడావుడి చేశారు. ఇప్పుడు కిమ్మనటం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలురైతుల పట్ల కక్ష కట్టినట్టే వ్యవహరించింది. 2016 వరకు తెలంగాణలోని రెవెన్యూ రికార్డుల్లో ప్రతిసీజన్ భూయజమానితో పాటు వాస్తవ సాగులో ఉన్న (కౌలు రైతు) పేరు విడిగా నమోదు చేసే అవకాశం ఉండేది. అలా నమోదు కోసం ఉన్న సాగు కాలమ్‌ను 2017లో ఒక చట్ట సవరణ ద్వారా తొలగించింది. కౌలురైతుల్ని గుర్తించడానికి, వారికి గుర్తింపు కార్డుల ద్వారా ఎంతోకొంత ప్రయో జనం కల్పించడానికి వీలు కల్పించే ‘భూ అధీకృత సాగుదారుల చట్టం–2011’ అమలును 2015 నుంచి దాదాపు నిలిపివేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు, నాటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘2023 సెప్టెంబర్’లో కౌలురైతు లకు బహిరంగ లేఖ రాస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు అన్యాయం జరిగిందనీ, తాము అధికారంలోకి రాగానే 2011 చట్టాన్ని అమలు చేయడమే కాకుండా అన్ని ప్రభుత్వ పథ కాలు వారికి వర్తించేలా చర్యలు తీసుకుంటామనీ పేర్కొన్నారు. గద్దెనెక్కి రెండున్నరేళ్లు దాటినా నేటికి అతీగతీ లేదు. ఏ రకంగా చూసినా కౌలురైతు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నష్టపోతున్నాడు. రెండింతల కష్టాల కావడి మోస్తున్నాడు.దిలీప్ రెడ్డివ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రిసెర్చి సంస్థ డైరెక్టర్ -
యువతను చేరుకోవడమే వ్యూహమా?
విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలో ఆగస్టు 19 నుంచి 21 వరకు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూడు రోజుల అఖిల భారత సమన్వయ సమావేశాన్ని సాధారణ వార్షిక సంస్థాగత సమావేశంగా మాత్రమే చూడటం సరిపోదు. ఈ సమా వేశంలో యువత, వ్యవస్థలోని లోపాలు, జంతర్ మంతర్ నిరస నలు, కుటుంబ వ్యవస్థ, పర్యావరణం, నైపుణ్యాభివృద్ధి, కృత్రిమ మేధస్సు వంటి అంశాలు చర్చకు రావడం ఆర్ఎస్ఎస్ భవిష్యత్ సామాజిక వ్యూహంలో మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.విద్యా వ్యవస్థలో లోపాలు, ప్రవేశ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకులు, యువత భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాలతో ప్రారంభమైన జెన్–జీ ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్దచర్చకు దారితీసింది. 49 రోజుల ఆందోళన అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడంతో ఉద్యమం ముగిసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఎన్నికల రాజకీయాల్లో యువత శక్తిని ఏ రాజకీయ సంస్థ కూడా నిర్లక్ష్యం చేయలేదు.జంతర్ మంతర్ నిరసనలపై విలేఖరులు ప్రశ్నించినప్పుడు, ఆర్ఎస్ఎస్ దానిని కేవలం అవినీతి సమస్యగా చూడలేదు; వ్యవస్థ లోని లోపాలు, యువతలో భవిష్యత్తుపై ఏర్పడుతున్న ఆందోళన; ప్రభుత్వాలు, సమాజం కలిసి వ్యవస్థను సరిచేయాల్సిన అవసరం ఉందని సంఘ్ నాయకత్వం పేర్కొంది. విద్య, ఉద్యోగం, పోటీ పరీక్షలు, పరిపాలనా పారదర్శకత, అవినీతి, ధరలు, సామాజిక అవకాశాలు వంటి అనుభవాలు క్రమంగా యువతలో ప్రభు త్వంపై నమ్మకాన్ని నిర్మిస్తాయి లేదా దెబ్బతీస్తాయి. జంతర్ మంతర్ ఉద్యమం ఈ అసంతృప్తికి ఒక డిజిటల్ ముఖాన్ని చూపించింది.సోషల్ మీడియానే యుద్ధభూమిజంతర్ మంతర్ ఉద్యమం... నేటి రాజకీయ శక్తి కేవలం సభలు, ర్యాలీలు, పోస్టర్లు, సంప్రదాయ మీడియా ద్వారా నిర్ణయించబడదు, సామాజిక మాధ్యమాల్లో కథనాన్ని ఎవరు నిర్మిస్తారన్నది కూడా అంతే ముఖ్యం అనే విషయాన్ని స్పష్టం చేసింది. జనరేషన్ జెడ్ రాజకీయ చైతన్యం చాలా వరకు డిజిటల్ ప్రపంచంలో పెరుగుతోంది. వ్యంగ్యం, మీమ్స్, చిన్న వీడియోలు, ప్రత్యక్ష ప్రసా రాలు, వ్యక్తిగత కథనాలు– ఇవి యువతను సంప్రదాయ రాజకీయ ప్రసంగాల కంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఆర్ఎస్ఎస్ యువతతో ‘నిరంతర సంబంధం’ గురించి మాట్లా డటం, సాంకేతికతపై ప్రత్యేకంగా చర్చించడం యాదృచ్ఛికం కాదు.ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయదు. అయినప్పటికీ బీజేపీతో దాని సైద్ధాంతిక, సంస్థాగత సంబంధాల కారణంగా సంఘ్ సమాజంలో చేపట్టే కార్యాచరణకు ఎన్నికల రాజకీయాలపై పరోక్ష ప్రభావం ఉండటం సహజం. అందుకే విశాఖ సమావేశాన్ని బీజేపీ భవిష్యత్ ఎన్నికల వ్యూహానికి కూడా ఒక సూచికగా చూడవచ్చు.ఇకపై సంఘ్ ముందున్న అసలు పరీక్ష యువతకు హిందు త్వాన్ని వివరించడం కాదు; యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు హిందుత్వ–సనాతన ధర్మ భావజాలం ఏ సమాధానం ఇస్తుందో చూపించడం. ఉపాధి, విద్య, అవినీతి, సాంకేతిక మార్పు, పర్యావరణం, సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు ఈ అంశాలపై ఆచరణాత్మక పరిష్కారాలను చూపగలిగితే సంఘ్ తన సామాజిక ప్రభావాన్ని మరింత విస్తరించగలదు. అలా చేయలేక పోతే, కేవలం సిద్ధాంతపరమైన ప్రచారం కొత్తతరాన్ని ఆకర్షించక పోవచ్చు. విశాఖ సమన్వయ సమావేశం అందుకే ఒక సాధారణ వార్షిక సమావేశం కాదు. ఇది ఆర్ఎస్ఎస్ తన శతాబ్ది అనంతర దశలో ‘సమాజాన్ని ఎలా చేరుకోవాలి?’ అనే ప్రశ్నకు వెతుకుతున్న సమాధానానికి ఒక ముఖ్యమైన అధ్యాయం.– సీహెచ్.వి.ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్ -
జాగృత శక్తి! ఆరు చక్రాల రహస్యమేంటి?
రాజయోగలో యమ, నియమ, ఆసనాదులను గూర్చి చెబుతారు. అందులోనే కుండలిని గూర్చి ఉంటుంది. ప్రతి మనిషిలో ఆరు చక్రాలుంటాయనీ, ఆ చక్రాల్లో అట్టడుగున ఉన్న మూలాధార చక్రంలో కుండలిని ఉంటుందనీ, యోగాభ్యాసం ద్వారా దాన్ని క్రమంగా పైనున్న చక్రాలకు తీసుకపోవాలనీ చెబుతారు. యోగాన్ని అత్యంత శ్రద్ధతో అభ్యసించిన విశ్వమాత కృష్ణాబాయి ఇలా చెబుతారు:కుండలిని మూలాధార చక్రములో నిద్రాణమై ఉంటుంది. అప్పుడా వ్యక్తి దృక్పథం కేవలం భౌతికంగా ఉంటుంది. ఒక మహాత్ముని సంపర్కం వల్ల ఆ కుండలిని జాగృతమై దాని పై కేంద్రానికి చేరుతుంది. ఆ వ్యక్తికి అప్పుడు ధార్మిక జీవనం గడపాలనే ఆకాంక్ష కలుగుతుంది. కుండలిని పై కేంద్రానికి చేరుతుంది. అతడు అంత కంతకూ సత్సంగం, దేవాలయ సందర్శనను కోరుతాడు. కుండలిని ‘అనాహత’ అను నాల్గవ కేంద్రాన్ని చేరుతుంది. అప్పుడా వ్యక్తి గురువును తన ఆత్మీయునిగా భావిస్తాడు. అతని దృష్టిని ఆ భావన విస్తరింప చేస్తుంది.ఆ శక్తి (కుండలిని) విశుద్ధమనే అయిదవ చక్రాన్ని చేరినపుడు గురువు అవ్యక్త స్థితిని తెలుసుకుంటాడు. గురువుని గూర్చి, లేక ఆ భగవంతుని స్థితిని గూర్చి అధికంగా మాట్లాడుతాడు. తర్వాత కుండలిని పై చక్రమైన ఆజ్ఞాచక్రాన్ని చేరుతుంది. అప్పుడు ఆ సాధకునకు భగవద్దర్శనమై అతని మనస్సు క్రమంగా అవ్యక్తస్థితి వైపు ఆకర్షితమవుతుంది. అక్కడే అతనికి కొన్ని సిద్ధులు అబ్బుతాయి. అతడు వాటికి లోబడితే పతనమవుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.బయటి నుండి గురువు సాధకుణ్ణి ఈ కేంద్రం వరకు మాత్రమే ప్రేరేపించగలడు. దీని తరువాత హృదయంలో ఉన్న గురువునుండి మార్గదర్శనం వస్తుంది (పుటలు 81, 82 – విశ్వమాత కృష్ణాబాయి – ఆనందా శ్రమం, కేరళం). ఆమె అంతవరకే చెప్పి తన గురువైన రామదాసు కృపవల్ల తనకు ఆజ్ఞా చక్రం నుండి కుండలిని అధికమైన వేగంతో మెరుపును మించిన కాంతితోను పైకి పోయిందనీ, తనకు అనిర్వచనీయమైన ఆనందం కలిగిందనీ అంతకుమించి ఇక ఏమీ చెప్పజాలననీ అంటారు.– రాచమడుగు శ్రీనివాసులు -
జపాన్ అణ్వస్త్ర డైలమా
కొన్ని విషయాలు వినేందుకు విచిత్రంగా తోస్తాయి. ప్రపంచంలో అణ్వస్త్రాలంటూ తయారైన తర్వాత వాటి దాడికి 1945లో మొట్టమొదట గురైన దేశం జపాన్. అప్పటినుంచి 81 సంవత్సరాలు గడిచినా మరెవరూ ఎవరిపై ఆ దాడులు చేయ లేదు. అనగా ఆ ఊహాతీత వినాశనానికి గురైన ఏకైక దేశం జపాన్. ఆ దుష్ఫలితాలను వారు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ఇటీవల తాము కూడా అణ్వాయుధాలు తయారు చేయాలా, లేదా కనీసం తమ దేశంలో అణ్వస్త్ర స్థావరాల ఏర్పాటుకు అనుమతించాలా అనే చర్చ జరుగుతున్నది.ఇప్పటికే వ్యతిరేకతే1945 ఆగస్టు నెలలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణ్వస్త్రాలను ప్రయోగించింది. ఆ సందర్భంగా ఆ రెండు నగరాలలో అక్కడి మునిసిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యాన ప్రతి సంవ త్సరం విస్తృత స్థాయిలో సంతాప సభలు జరిగినట్లే ఈసారి కూడా 81వ సంవత్సర సభలు జరిగాయి. మునిసిపల్ మేయర్ల అధ్యక్షతన జరిగిన ఆ కార్యక్రమాలలో ప్రధానమంత్రి సనాయే తకాయిచీ కూడా సభికులలో ఒకరిగా కూర్చుని పాల్గొన్నారు. అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా రెండు నగరాల మేయర్లు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. జపాన్ నగరాలన్నిటా భారీ ప్రదర్శనలు జరిగాయి. దేశ వ్యాప్తంగా జరిగిన వేర్వేరు ప్రజాభిప్రాయ సేకరణలలో సగటున 70 శాతానికి పైగా ప్రజలు అణ్వస్త్రాలకు వ్యతిరేకంగా ఓటు చేయగా, మరొక 10 శాతం వరకు తటస్థంగా ఉండిపోయారు.దీనంతటి మధ్య గమనించదగినదేమంటే, 1971 నాటి అణ్వస్త్ర విధానాన్ని తీవ్ర మితవాద తకాయిచీ ప్రభుత్వం అధికారికంగానైతే ఏమీ మార్చలేదు. కానీ దానిని సవరించాలంటూ జరుగుతున్న చర్చను అనధికారికంగా ప్రోత్సహిస్తున్నది. అప్పటి విధానం ప్రకారం జపాన్ స్వయంగా అణ్వాయుధాలను తయారు చేయ రాదు, ఇతర దేశాల నుంచి స్వీకరించి నిల్వ చేయరాదు, ఇతరులు తమ అణ్వాస్త్రాలను జపాన్ భూభాగంపై మోహరించేందుకు అంగీ కరించరాదు. ఇపుడు జరుగుతున్న చర్చ ఇందులో మొదటి రెండు నిబంధనలు యథాతథంగా కొనసాగాలనీ, మూడవ దానిని మాత్రం సడలించాలనే ధోరణిలో సాగుతున్నది. అనగా జపాన్‌లో ఇతర దేశాల అణుస్థావరాలకు అవకాశం ఇవ్వటం. ఇతర దేశాల న్నవి తమపై 1945లో అణుదాడి చేసిన అమెరికాయే అవుతుందని వేరే చెప్పనక్కర లేదు. రెండు దేశాల మధ్య ఇప్పటికే పూర్తిస్థాయి రక్షణ ఒప్పందం ఉంది. జపాన్‌కు అణ్వస్త్ర స్థాయి రక్షణ కల్పించటం అందులోని అంశాలలో ఒకటి. జపాన్‌లోని ఒకినావా దీవిపై గల విస్తారమైన రక్షణ స్థావరాలు గాక దేశవ్యాప్తంగా 80కి పైగా సైనిక సదుపాయాలున్నాయి. పసిఫిక్ ప్రాంతంలో ఇరువురి ప్రయోజ నాలు, వ్యూహాలు ఒకటే. ఇటువంటి రక్షణ ఏర్పాట్లు ఉన్నపుడు, జపాన్‌కు స్వయంగా అణ్వస్త్రాలు ఉత్పత్తి చేసుకోవలసిన అవసరం ఏమిటి? లేదా ఇతరుల అణ్వస్త్ర స్థావరాలకు చోటివ్వటం ఏమిటి?మారుతున్న అమెరికా వైఖరిమొదట ఒక మాటగా అనుకోవాలంటే, పసిఫిక్ ప్రాంతంలో అమెరికా వ్యూహాలు మారు తున్నాయనే అంచనా. చైనాను ప్రపంచంలో తమ పోటీదారు, పసిఫిక్ ప్రాంతంలో తమకు సవాలు అంటూ వచ్చిన అమెరికా, ఇటీవల జి–2 ఫ్రేమ్‌వర్క్ పద్ధతిలో వారితో సహకారానికి సిద్ధ పడటం. ఇదే సంవత్సరం ఆరంభంలో ‘ఇండో–పసిఫిక్ వ్యూహ పత్రం’ ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం, పసిఫిక్ నుంచి ఉపసంహరించుకున్నట్లయితే ప్రకటించలేదుగానీ (ఆ పని ఎన్నటికీ చేయరు), ఆ ప్రాంతంలోని తమ మిత్ర దేశాలు ఇక నుంచి తమ రక్షణ భారాన్ని చాలావరకు తామే మోయాలని స్పష్టం చేసింది. ఇదిగాక, దక్షిణ కొరియాను ఉపేక్షించి ఉత్తర కొరియాతో మైత్రికి ప్రయత్నించటం, జపాన్‌పై రకరకాల ఒత్తిడులు సృష్టించటం వంటివి జరుగుతున్నాయి.ట్రంప్ ఇదే విధంగా ఇచ్చిన స్పష్టతలతో యూరప్‌పై ఒత్తిడులు పెరిగినట్లు, పసిఫిక్ ప్రాంతంలోనూ అదే జరుగుతున్నది. దానితో ఇదే సంవత్సరం నుంచి అందరూ రక్షణ బడ్జెట్లు పెంచుతున్నారు. ఇతర దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇది ప్రధా నంగా చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో ముప్పు ఉందనుకునే దేశాల నుంచి కనిపిస్తున్నది. గమనించదగినదేమంటే దీనంతటికి ప్రత్యేకమైన చొరవ తీసుకుంటూ తీవ్రస్థాయిలో మాట్లాడుతున్నది జపాన్ ప్రభుత్వం. చైనాతో దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో సరిహద్దు వివాదాలు మరికొన్ని దేశాలకు కూడా చిరకాలంగా ఉన్నాయి. అదే విధంగా ఆ సముద్ర ప్రాంతం నుంచి స్వేచ్ఛా నౌకా యాన సమస్యలు. కానీ అక్కడినుంచి పూర్తిగా తూర్పున గల న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల వరకు ఏదో ఒక మేరకు సామరస్యత చూపుతూ ఆర్థిక సంబంధాలకు ప్రాధాన్యతనిస్తుండగా, జపాన్ నుంచి భిన్న ధోరణి కనిపిస్తున్నది.తైవాన్‌పై వైఖరిలో దూకుడునిరుడు అక్టోబర్‌లో ప్రధానిగా ఎన్నికైన తకాయిచీ నవంబర్‌లో పార్లమెంట్లో మాట్లాడుతూ, ఒకవేళ చైనా సైన్యం తైవాన్ను ఆక్ర మించుకొనజూసినట్లయితే, అందువల్ల జపాన్ ఉనికికి ప్రమాదం వాటిల్లగలదు గనుక తాము కూడా ఆ యుద్ధంలో పాల్గొనవలసి రావచ్చునని అన్నారు. దానితో ఒక్కసారిగా పరిస్థితి వికటించింది. ఆ ప్రకటనలోని ప్రమాదాన్ని గుర్తించిన ట్రంప్ హెచ్చరించిన మీదట తకాయిచీ మౌనం వహించటమైతే చేశారుగానీ, చైనా డిమాండ్ చేసినట్లు తన ప్రకటనను ఉపసంహరించుకోలేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తైవాన్ చైనాలో అంతర్భాగ మని ఐక్యరాజ్యసమితితో పాటు అత్యధిక దేశాలు గుర్తిస్తున్నాయి. వాటిలో జపాన్ కూడా ఉంది. తైవాన్ చైనాలో శాంతియుతంగా విలీనమవుతుందా, బలప్రయోగం ద్వారానా అన్నది వేరే విషయం. కానీ అసలు ఆ విలీనం విషయంలో జపాన్కుగానీ, మరొకరికిగానీ పాత్ర ఎట్లా ఉంటుంది? ఒకవేళ ఆ విలీనం సైనికంగా జరిగినా తైవాన్ నుంచి 100 కిలోమీటర్లకు పైగా దూరంలో గల జపాన్ ఉనికికి ముప్పు కలగడమేమిటి? విలీనాలు శాంతియుతంగా జరగాలని కోరటానికీ, ఇటువంటి వైఖరి తీసుకోవటానికీ తేడా ఉంటుంది. అందుకు కారణం తకాయిచీ పూర్తి కన్సర్వేటివ్ కావటంతోపాటు, తైవాన్ కొంతకాలం తమ ఆక్రమణలో ఉండటం, అమెరికా వ్యూహంలో భాగం కావటమనే అభిప్రాయం ఉంది.సమస్య ఈ విధంగా మొదలై ఇపుడు జపాన్ అణ్వస్త్రాల గురించి ఆలోచించే వరకు వచ్చింది. తైవాన్, చైనా ఒకటేనని స్వయంగా తైవాన్ కూడా సూత్ర రీత్యా అంగీకరించటం మరొక విశేషం. తమకు స్వాతంత్య్రం కావాలనే వర్గం ఒకటి అక్కడ ఉన్నా, వద్దనే వర్గం కూడా ఉంది. ఎప్పటికైనా, ఏదో విధంగా విలీనం చేసు కోగలమని చైనా కృతనిశ్చయంతో చెప్తున్నది. ట్రంప్ ఈ సంవత్సరం మే నెలలో చైనాకు వెళ్లినపుడు తనకు ఆ మాట అర్థమైనట్లే రాజీ ధోరణిలో వ్యాఖ్యానించారు. అటువంటి స్థితిలో, చైనాను తాము సైనికంగా నిలువరించగలమని జపాన్ ప్రధాని నిజంగానే నమ్ము తున్నారా? 1945 తర్వాత 81 ఏళ్లకు జపాన్ ప్రధాని ఆ వినాశనాన్ని మరచి అక్కరలేని అణ్వస్త్ర డైలమాను సృష్టించుకొని ఉండవచ్చు. జపాన్ ప్రజల వ్యతిరేకత మాత్రం సంతృప్తిని కలిగిస్తోంది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
బోధనా పద్ధతులు మనకు లేవా?
ఇతర దేశాల్లో విద్యా విధానాలను అధ్యయనం చేసే లక్ష్యంతో ఫిన్లాండ్, సింగపూర్, జపాన్, జర్మనీ, వియత్నాం లాంటి దేశాలకు అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల బృందాల పర్యట నలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ‘జాయ్ అండ్ ప్లే’ పద్ధతిలో పూర్వ ప్రాథమిక, బాల్య విద్య, ఉపాధ్యాయుల వృత్తిపరమైన సామ ర్థ్యాలు పెంచడం, విద్యార్థి కేంద్రిత అభ్యసన, ఆనందదాయక బోధన, ఆటల ఆధారిత విద్య వంటి వినూత్న తరగతి గది బోధన పద్ధతులను అధ్యయనం చేసే విధంగా పర్యటనలను రూపొందించారు. అయితే ఉత్తమ బోధనా పద్ధతులు, నమూనాలు భారతదేశంలో లేవా? 80 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా విదేశీ నమూనాలను ఆదర్శంగా తీసుకుందామా?రూసో, ప్లేటో లాంటి వారు విద్య అంటే కేవలం సమాచారాన్ని అందించడం కాదు, వ్యక్తి సర్వతోముఖ అభివృద్ధి అని నిరూపించారు. ఆధునిక ప్రయోగాత్మక విద్యకు పితామహుడైన జాన్ డ్యూయీ ‘చేయడం ద్వారా నేర్చుకోవడం’ అనే అనుభవపూర్వక అభ్యాసాన్ని ప్రవేశపెట్టారు. పిల్లల స్వయంప్రతిపత్తిని గౌరవిస్తూ మాంటి స్సోరి బోధనా పద్ధతిని మరియా మాంటిస్సోరి రూపొందించారు. అలాగే భారతీయ తత్వవేత్తల ఆలోచన ప్రాతిపదికన మన సమాజానికి అనువైన విద్యా విధానాన్ని రూపొందించడం జరగాలి.భారతీయ విద్యా సిద్ధాంతాలుస్వామి వివేకానంద ‘మనిషిని నిర్మించే విద్య’ సిద్ధాంతంతో విద్య అంటే సమాచారం నింపడం కాదు, మనిషిలో ఇప్పటికే ఉన్న శక్తిని బయటకు తీసుకు రావడం అని బోధించారు. రవీంద్రనాథ్ టాగూర్ పుస్తకాలకే పరిమితం కాకుండా, కళ, సంగీతం, ప్రకృతి ద్వారా విద్యను ప్రతిపాదించారు. మహాత్మా గాంధీ ‘బేసిక్ ఎడ్యు కేషన్’ లేదా ‘నయీ తాలీం’ పేరుతో విద్య, పని కలిపి ఉండాలని; చేతివృత్తుల ద్వారా నేర్చు కోవడం, మాతృభాషలో బోధన, స్వావలంబన నేర్పాలని ప్రతిపాదించారు. డా‘‘ సర్వేపల్లి రాధా కృష్ణన్ విలువలతో కూడిన విద్య సిద్ధాంతంతో ఆధ్యాత్మికత+ హేతుబద్ధత కలిపిన విద్యను ఆచ రించాలని సూచించారు. ‘భయం లేని విద్య’ ఉండాలని జిడ్డు కృష్ణమూర్తి ఆలోచించారు.విద్యా విధానమంటే బోధన, పాఠ్యాంశాలు, పరీక్షలే కాదు. ఉత్తమ ఉపాధ్యాయులు తయా రయ్యే విద్యా శిక్షణా కళాశాలలు కూడా అందులో భాగమే. దేశ విద్యా విధానానికి దిక్సూచిగా ఉండే ఎన్సీఈఆర్టీ, సీబీఎస్ఈలో అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీఈఆర్టీలలో కూడా పోస్టులు ఖాళీలే. బీఈడీ, డీఈడీ శిక్షణా కళాశాలల్లో నామమాత్రపు శిక్షణతో ఉపాధ్యాయ శిక్షణలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా భారతీయ సమాజానికి అనుగుణంగా ఆదర్శ అకడమిక్ వాతావరణంలో ఉత్తమ బోధనా పద్ధతులు అవలంబిస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. ఇటువంటి మంచి అనుభవాలను స్వీకరించి మన సమాజానికి అవసరమైన విద్యావిధానం రూపొందించాలి.ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధా నాన్ని మార్చే పద్ధతులు సరికాదు. విద్యా తత్వ వేత్తల ఆలోచనల వెలుగులో ఆదర్శ బోధనా పద్ధ తులను అవలంబిస్తున్న అనుభవాలను స్వీకరించాలి. కొఠారి లాంటి విద్యావేత్తలు సూచించిన కామన్ స్కూల్ విధానం ఆచరణీయం. విద్యను వ్యాపారంగా మార్చకుండా ప్రభుత్వ వ్యయాన్ని పెంచడంతోనే భావి పునాదులు తరగతి గదుల్లోనే నిర్మాణం అవుతాయి.– కె. వేణుగోపాల్, విద్యారంగ విశ్లేషకులు -
ధర్మవాక్కు..! అతడి మరణాన్ని ముందే చెప్పిన అయోధ్య రాజు!
పూర్వం అయోధ్యను అనరణ్యమహారాజు పాలించేవాడు. ఆ రోజులలో రావణుడు తనకు యక్ష కిన్నర కింపురుషాదులలో ఎవరి వలననూ మరణం కలగకుండా బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు. ఆ బలంతో రాజులందరినీ పరాజితులను చేసి, అవమానపరచి ఆనందిస్తున్నాడు. అది తెలిసి, ముందుగానే లొంగిపోయి ప్రాణం రక్షించుకున్నారు కొందరు.అయోధ్యను పాలించిన అనరణ్యమహారాజు మాత్రం రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ‘పూటకొకమాటు ఆకలిదప్పులతో అల్లాడే నరుల సేనను నా సైన్యం వేసే శరసమూహజ్వాలల దాహాన్ని తీర్చడానికి తెచ్చావా?’ అని హాస్యమాడాడు రావణుడు. ఇరువురికీ ముఖాముఖి జరిగిన యుద్ధంలో చివరన సారథిని కూల్చి, అనరణ్యమహారాజును రథహీనుడిని చేసి నేలమీద పడేట్లు చేశాడు. ‘మృత్యువు కూడా నా దగ్గరకు రావడానికి భయపడుతుంది. అలాంటిది నువ్వెంత? ఓడిపోయానని ఒప్పుకో, వదిలేస్తాను!’ అన్నాడు. ఒప్పుకోకుండా రావణుడి చేతిలో వీరమణం పొందాడు. అయితే, మరణానికి ముందు, ‘ఎప్పటికైనా నా వంశంలో పుట్టిన వీరుడి చేతిలోనే నీవు మరణం పొందుతావు!’ అన్నాడు. ఆ మాటలకు నవ్విన రావణుడితో అనరణ్యమహారాజు ఇంకా ఇలా అన్నాడని కంకంటి పాపరాజు రచించిన ‘శ్రీమదుత్తర రామాయణం’ తృతీయాశ్వాసంలోని ఈ క్రింది పద్యం చెబుతోంది:చ. పురుషుడు కర్మసంగమున బొందు సుఖంబులు దుఃఖ మెవ్వరెవ్వరికి విరోధముల్ సలుపు వా రిది దైవవశంబు దీనగాతరతవహింప నే గనక దానమఖాధ్యయనాది కర్మముల్వొరసితి నేని బల్కు పొలివోవక నట్లగుగాక యంచనన్.‘మనిషి చేసే పనులను బట్టి సుఖదుఃఖాలు ఉంటాయి. ఎవరూ ఎవరికీ విరోధులు కారు. దైవం జరిపించే విధంగా జరిగేవే అన్నీ. నేనే గనుక దానధర్మాధ్యయనాది పుణ్యకర్మలను నిష్ఠగా చేసినవాడనైతే నా మాట అక్షరం పొల్లుపోకుండా జరుగుతుంది!’ అన్నట్లుగానే రావణుడి మరణం అయోధ్యను పాలించిన శ్రీరాముడి వలన జరిగింది. ధర్మబద్ధమైన జీవనం సాగించే వ్యక్తికి కష్టం కలిగి మాట్లాడే మాట తప్పక జరుగుతుందని దీనివలన అర్థమౌతుంది.– భట్టు వెంకటరావు -
అప్రమత్తతతో కూడిన 'ఆశావాదం అవసరం'
అభినందనలు. మీరు సాధించారు! మీలో చాలామంది ఎంతో ఉత్సాహంగా భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నారు. కానీ కొందరి ప్రణాళికలు తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మీ నియంత్రణలో లేని పరిస్థితులు అందుకు కారణం కావచ్చు, ఉద్యోగ మార్కెట్లో వచ్చిన మార్పులు, టెక్నా లజీ వంటి పరిస్థితులు కొందరి ఆశలను దెబ్బతీసే ఆస్కారం ఉంది. మీ ఆశలు దెబ్బతిన్నట్లయితే... మీరు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఇలాంటి సమయంలో నేను ‘అనుకోని అవకాశాల కోసం పక్క చూపు’ అనే ఆలోచనను మీకు సూచిస్తున్నాను.‘పెరిఫెరల్ విజన్’ అంటే ఏమిటి?మీ ప్రస్తుత కెరీర్ మార్గంపై దృష్టి పెట్టండి. అయితే మీ సమయం మొత్తాన్ని దానికే కేటాయించకండి. మీ సమయంలో 10 నుంచి 15 శాతం ఇతర రంగాలను పరిశీలించడానికి కేటాయించండి. మీ ప్రధాన రంగానికి పక్కన ఉన్న ఇతర రంగాలు, కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలను గమనిస్తూ ఉండండి. అలా మీ ‘పక్క చూపు’తో మీరు ఎవరూ ఊహించని కొత్త అవకాశాలను గుర్తించవచ్చు. అదే పెరిఫెరల్ విజన్! అది మీరు ఎప్పుడూ ఊహించని ఒక కొత్త, ఆనందకరమైన కెరీర్ మార్గంలోకి మిమ్మల్ని తీసుకెళ్లవచ్చు. 1969లో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లిష్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన తర్వాత ఫ్రాన్స్ కార్డోవా జర్నలిజం రంగంలోకి వెళ్లారు. లాస్ ఏంజెల్స్ టైమ్స్‌లో జర్నలిస్టుగా పనిచేశారు. అదే ఆమెకు నచ్చిన కెరీర్ మార్గం. కానీ ఆమె ‘పక్క చూపు’లో ఒక రోజు నక్షత్రాల గురించి ఒక డాక్యుమెంటరీ చూసింది. భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రంపై ఆసక్తి పెంచుకుంది. ఆమెకు అప్పటికీ ఫిజిక్స్‌లో ఉన్నత విద్య చదవడానికి అవసరమైన సంసిద్ధత దాదాపు లేదు. అయినా కాల్టెక్ కమ్యూనిటీ నుంచి లభించిన సహకారంతో ఇంగ్లిష్ చదివిన విద్యార్థి నుంచి ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా మారే మార్గాన్ని స్వయంగా నిర్మించుకున్నారు. 1979లో కాల్టెక్ నుంచి ఫిజిక్స్‌లో పీహెచ్డీ పొందారు. ఆ తర్వాత ఒక అనుకోని అవకాశం నుంచి మరొక అవకాశానికి ప్రయాణిస్తూ... ఖగోళ శాస్త్ర విభాగాధిపతిగా, నాసాలో మొదటి మహిళా మరియు అతి పిన్న వయస్కురాలైన చీఫ్ సైంటిస్ట్‌గా, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్‌గా ఎదిగారు. నా జీవితంలో కూడా దాదాపు అలాంటిదే జరిగింది. నాకు లిగో(ఎల్ఐజీఓ–లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్–వేవ్ అబ్జర్వేటరీ) ప్రాజెక్ట్ ఒక అనుకోని అవకాశం. విశ్వంలో గురుత్వా కర్షణ తరంగాలను గుర్తించడానికి లిగో ప్రాజెక్ట్‌ను ప్రారంభించి నప్పుడు సాంకేతిక, రాజకీయ, సామాజిక సవాళ్లు ఎన్నో ఉన్నాయి. అయినా మేము విజయం సాధిస్తామని నమ్మాం. అదే సమయంలో ఏ సమస్యలు మన ప్రయాణాన్ని ఆపగలవో ముందుగానే గుర్తించాం. ప్రతి సమస్యను పెద్ద అడ్డంకిగా మారకముందే పరిష్కరించడానికి ప్రయత్నించాం. ఆ విధానం విజయవంతమైంది. దీన్నే నేను ‘అప్రమత్తతతో కూడిన ఆశావాదం’ అంటాను. ‘ఇంటర్స్టెల్లార్’ ఎలా వచ్చింది?1979లో నేను దక్షిణ కాలిఫోర్నియాలో ఒంటరిగా ఉన్నాను. నా ‘పక్క చూపు’ను విస్తరించడానికి హాలీవుడ్లో డేటింగ్ కూడా చేశాను! లిండా అబ్బాట్ అనే భవిష్యత్తులో ప్రముఖ సినిమా నిర్మాతతో నాకు పరిచయం ఏర్పడింది. ఆమె ఉత్సాహభరితమైన మహిళ; నేను మాత్రం పుస్తకాల పురుగు లాంటివాడిని. అయినా మేము స్నేహితులుగా కొనసాగాం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆమె ఒక సినిమా కోసం నాతో ఆలోచనలు పంచు కోవాలనుకుంది. నేను ఆ అనుకోని అవకాశాన్ని వెంటనే అంది పుచ్చుకున్నాను. తర్వాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ చేతుల్లో ఆ ప్రాజెక్ట్ ‘ఇంటర్స్టెల్లార్ ’ అనే ప్రసిద్ధ చిత్రంగా మారింది. ఇంటర్స్టెల్లార్ సినిమా నా కెరీర్‌ను పూర్తిగా మార్చింది. దాదాపు అర్ధ శతాబ్దం పాటు కాల్టెక్ ప్రొఫె సర్గా ఉన్న నేను... ఆ తర్వాత నా జీవితంలోని తదుపరి దశను సైన్స్, కళల కలయికలో పనిచేయడానికి కేటాయించాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి ప్రాజెక్టులు నాకు కొత్త ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా యువతకు సైన్స్‌పై ఆసక్తిని కలిగిస్తాయి. నేను భవిష్యత్తు గురించి ఆశావాదంగా ఉంటాను. నేను 100 సంవత్సరాల వయసు వరకు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తూ, మానసికంగా బలంగా ఉండి, నా ప్రాజెక్టులను కొనసాగించగలనని ఆశిస్తున్నాను. కానీ రోజువారీ జీవితంలో నేను జాగ్రత్తగా ఉంటాను. నా ఆరోగ్యానికి ఎదురయ్యే ప్రమాదాలను గమనిస్తాను.ఇప్పుడు మన ముందున్న ‘ఏనుగు’– ఏఐఇప్పుడు మన ముందున్న ఒక పెద్ద విషయంపై మాట్లాడాలి. ఆ ‘ఏనుగు’ పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ. నేను ఏఐ నిపుణుడిని కాదు. కానీ ఏఐ సంక్లిష్టమైన విషయం. కొన్ని రంగాల్లో దాని సామర్థ్యం అద్భుతంగా ఉంది. ఏఐ అభివృద్ధిని ఈరోజే పూర్తిగా ఆపేసి, ప్రస్తుతం ఉన్న రూపంలోనే కొన్ని నెలలు లేదా ఒక సంవత్సరం ఉపయోగిస్తే, మనలో చాలా మంది దాన్ని త్వరగా ఇష్టపడటం ప్రారంభిస్తారు. మనలో అనేక మందిని భయపెడు తున్నది ఏఐ ఉనికి కాదు, ఏఐ వేగంగా మారిపోతుండటమే మనల్ని ఆందోళనకు గురిచేస్తోంది.మీరు వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాల్లో కెరీర్ ఎంచుకుంటే.. వేగంగా మారడం నేర్చుకోవాలి. అందుకు ముఖ్య మైన మార్గం... స్వీయ అభ్యాసం. టెక్నాలజీ మారుతున్న కొద్దీ దాన్ని ఉపయోగించడం మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఏఐ, క్రిస్పర్, ఎంఆర్ఎన్ఏ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తు గురించి నాకు కూడా పూర్తిగా తెలియదు. నిపుణులు కూడా ‘మాకు తెలి యదు’ అని చెబుతున్నారు. కొంతమంది భవిష్యత్తు గురించి చాలా నిరాశావాదంగా మాట్లాడుతున్నారు. కానీ నేను నిరాశావాదిని కాదు. ఏఐ, ఇతర వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల దీర్ఘకాల భవిష్యత్తును చూస్తున్నప్పుడు కూడా నేను ‘జాగ్రత్తతో కూడిన ఆశావాదం’నే పాటిస్తాను.ఏఐ వల్ల మనుషులు ఒకరికి ఒకరు దూరమవుతారని కొందరు భయపడుతున్నారు. అలా జరగదని ఆశిద్దాం. భవిష్యత్తులో మనం మరింత బలమైన, అభివృద్ధి చెందిన, నైతిక విలువలు కలిగిన మానవ సమాజంగా ఎదుగుతామని ఆశిద్దాం. మన అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. ప్రతి మనిషి, ఇతర మనుషులను గౌరవించే సమాజంగా మనం ఉండాలి. మనిషి–మనిషి సంబంధాలు మన ఆనందానికి, ఆరోగ్యానికి, శ్రేయస్సుకు కేంద్రంగా ఉండాలి. ఆశావాదంతో పాటు జాగ్రత్త కూడా అవసరం. దీర్ఘకాల భవిష్యత్తుపై ఆశావాదంగా ఉండండి. కానీ రోజువారీ జీవితంలో అప్రమత్తంగా ఉండండి. మన ఆశావాద లక్ష్యానికి ఎదురయ్యే ప్రమాదాలను గమనించండి. ఆ ప్రమాదాలు పెద్ద సమస్యలుగా మారకముందే పరిష్కరించండి. -
అమిత్ షా (కేంద్ర మంత్రి) రాయని డైరీ
ఎండన పడి వచ్చిన వాళ్లకే కాదు, ఏ వేళన పడిలేస్తూ వచ్చిన వారికైనా ఎదురెళ్లి మంచినీళ్ల గ్లాసును చేతికి అందించటం భారతీయ సంస్కృతికే ప్రత్యేకమైన ఒక గొప్ప ఆతిథ్యం. నేను గుజరాతీని కాబట్టి, ఒకవేళ ఎవరైనా నాకు – ముఖ్యంగా ఆదివారం ఉదయం – అల్పాహారంగా తియ్యటి రసం ఊరే వేడి వేడి జిలేబీలను, వాటి అనంతరం కారం కారంగా కరకరలాడుతుండే ఫాఫ్డాను; మధ్యాహ్నం భోజనంలోకి రొట్టెలు, అన్నం లేదా పెసర పప్పు కిచిడీని; సాయంత్రపు స్వల్పాహారంగా ఆవిరిపై ఉడికించి, ఆవాలు, పచ్చిమిర్చి తాలింపుతో మెత్తటి స్పాంజీలా చేసిన ఢోక్లాను... నాకోసం సిద్ధం చేయటమన్నది కూడా ఒక గొప్ప ఆతిథ్యం కంటే తక్కువేమీ కానప్పటికీ... వాళ్లు అందించిన మంచి నీళ్ల గ్లాసుకే మొదట నేను రుణపడి ఉంటాను. సిలిగురిలో గత మూడు రోజులూ మహానంద నది నీళ్లే నా అమృతాహారం. ఢిల్లీలో ఈ రోజు గంగా జల వరప్రసాదం. రేపు మరొక నది కావచ్చు. ఆ మరునాడు ఇంకొక నది. ప్రాంతాలు ఏవైనా ‘జల’సత్వం ఒక్కటే. గురువారం, ఐదు దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశానికి మహాబలిపురం వెళ్లినప్పుడు... బహుశా అక్కడ నేను కృష్ణ లేదా కావేరీ నీళ్లు తాగి ఉంటాను. మీటింగ్‌కి, ఆ తర్వాత లంచ్‌కి ఏర్పాటు చేసిన నీళ్ల బాటిళ్లు చెన్నైలోని కృష్ణా, కావేరీ పైపుల నుంచి పట్టితెచ్చినవై ఉండాలి. ‘‘అమిత్ జీ, మీకోసం మా తమిళ వంటకాలను ఇంట్లో చేయించి తెచ్చాను’’ అన్నారు సీఎం విజయ్, లంచ్ మీట్లో! నదుల మధ్య రాష్ట్రాలకు సరిహద్దులు ఉంటే ఉండొచ్చు. నదీ జలాలు వంటగదులలో ఆ హద్దులను చెరిపేస్తాయి! భోజనం బల్ల ముందు కూర్చున్నంత సేపూ నేను గుజరాతీనిగానీ, ఢిల్లీవాలానుగానీ కాకుండా పూర్తిగా తమిళ ఆహారిని అయిపోయాను. విజయ్ తనే స్వయంగా అందరికీ వడ్డించడం మొదలు పెట్టారు! తక్కిన నలుగురు ముఖ్యమంత్రులు కూడా ఒకరికి ఒకరు పాత్రలు అందించుకుంటున్నారు. పక్కన ఉన్నవారి గాజు గ్లాసులలో ఖాళీ అయిన మేరకు నీళ్లను నింపుతున్నారు. ‘‘మరికాస్త తినండి’’ అని గిన్నెలను ముందుకు జరుపుతున్నారు. ఇది కదా సమైక్య దేశం! ఇదే కదా భిన్నత్వంలో ఏకత్వం! కానీ, భోజనానికి ముందు జరిగిన కీలకమైన సమావేశంలో ఆ ఐదుగురు ముఖ్యమంత్రులు, నీళ్లలో తమ వాటా కోసం పట్టుపట్టిన వాళ్లే! ఒకరి గొంతు ఒకరు పట్టుకున్నవారే. కావేరి నదిపై మేకేదాటు జలాశయ నిర్మాణానికి కేంద్రం వెంటనే అనుమతులు ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి. కావేరి నది నుండి న్యాయంగా తమకు రావలసిన నీటి వాటాను విడుదల చేయాలని, ఎగువన కొత్త డ్యామ్‌ల నిర్మాణాలను ఆపాలని తమిళనాడు ముఖ్యమంత్రి.గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానానికి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కృష్ణా జలాల ట్రిబ్యునల్ పరిధిలో తమ రాష్ట్రానికి రావలసిన నీటి వాటాను చట్టబద్ధంగా త్వరగా ఖరారు చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి. కేరళ ప్రజల ప్రాణాల భద్రత దృష్ట్యా ముల్లపెరియార్ వద్ద కొత్త డ్యామ్ నిర్మించ డానికి తమిళనాడు, కేంద్రం అంగీకరించాలని కేరళం ముఖ్యమంత్రి. మీటింగ్‌కి, ఆ తర్వాతి డిన్నర్ మీటింగ్‌కి మధ్య ఎంత వ్యత్యాసం! ఎంత వైరుధ్యం?!మీటింగ్‌లో ‘‘మా నీళ్లు మాక్కావాలి’’ అని అడిగినవాళ్లు... డిన్నర్ మీటింగ్‌లో ఒకరికి ఒకరు నీళ్లందించుకున్నారు! మీటింగ్ అయ్యాక, సిలిగురి బయల్దేరే ముందు – ఏళ్లుగా దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న నీళ్ల వివాదాలకు మహాబలిపురంలో నాకు పరిష్కారం కనిపించింది! నీళ్లు ఇస్తే తప్ప, నీళ్లు తీసుకుంటే తీరేది కాదు నీళ్ల సమస్య! -
మోయకూడని బరువు..
ఒక వ్యక్తి, ఒక ముని వద్దకు వచ్చాడు. ‘అయ్యా! ఈ భారాన్ని, భయాన్ని నేను భరించ లేకపోతున్నాను. నాకు విముక్తి ప్రసాదించండి’ అని ఆవేదన చెందాడు. ముని అతనితో ‘సరే, నీకు దారి చెబుతాను. దానికి ముందు, ఈ దారిలో ఉన్న రెండు పెద్ద రాళ్లను నీ రెండు చేతుల్లో పట్టుకుని, ఈ తోట చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేసి రా’ అన్నాడు.అతను రెండు చేతుల్లో రాళ్లను ఎత్తుకుని నడవటం ప్రారంభించాడు. మొదటి చుట్టులోనే చేతులు వణికి పోయాయి. రెండో చుట్టులో నరాలు ఉబ్బిపోయాయి. మూడో చుట్టులో నొప్పితో అరిచాడు. నాలుగో చుట్టులో ‘గురుదేవా, నా వల్ల కావడం లేదు. చేతులు పడిపోతున్నాయి, నా ప్రాణం పోతోంది’ అన్నాడు. ముని ప్రశాంతంగా, ‘అయితే, ఆ రాళ్లను కింద పడేయ్’ అన్నాడు. అతను వెంటనే ఆ రెండు రాళ్లను కింద పడేశాడు. మరుక్షణమే, అతని చేతుల్లో భారం తగ్గి, శరీరమూ మనస్సూ తేలికపడినట్లు అనిపించింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.‘రాళ్లను పట్టుకుని నొప్పితో అరిచిందీ నువ్వే, వాటిని కింద పడేసి ప్రశాంతతను పొందిందీ నువ్వే. రాళ్లు నిన్ను బలవంతం చేసి నీ చేతులకు అతుక్కున్నాయా? నువ్వే వాటిని పట్టుకున్నావు కదా. అలాగే నీ గత జ్ఞాపకాలు, భవిష్యత్తు భయాలు కూడా. గడిచిపోయిన కాలం ఎప్పుడో ముగిసిపోయింది, రాబోయే కాలం ఇంకా రాలేదు. రాళ్లను కింద పడేయడానికి నీకు ఎవరి అనుమతి అవసరం లేదు కదా? అలాగే నిన్ను గాయపరిచే జ్ఞాపకాలను, అనవసరమైన భారాన్ని మనస్సు నుంచి వదిలేయడం నీ చేతుల్లోనే ఉంది’ అని వివరించాడు ముని.– యామిజాల జగదీశ్ -
ఆరోగ్యాన్ని సాగు చేసే దిశగా...
భారత వ్యవసాయం దశాబ్దాలుగా ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించింది. ఆకలి నుంచి దేశాన్ని బయటకు తీసుకువచ్చింది. ఆహార ధాన్యాల కొరతతో బాధపడిన దేశాన్ని ఆహార భద్రత కలిగిన దేశంగా మార్చింది. ఇప్పుడు మన ముందున్న సవాలు మాత్రం భిన్నమైనది. ప్రజలకు తినడానికి ఆహారం ఉండటమే కాదు... వారు తింటున్న ఆహారం వారిని ఆరోగ్యంగా ఉంచుతున్నదా? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం వచ్చింది.ఈ నేపథ్యంలో 2026 మే 11న భారత వైద్య పరిశోధనామండలి (ఐసీఎంఆర్), భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) సంయుక్తంగా ప్రారంభించిన ‘సెహత్’ (సైన్స్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ త్రూ అగ్రికల్చరల్ టాన్స్ఫర్మేషన్) ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యవసాయం, పోషకాహారం, ప్రజారోగ్యాన్ని ఒకే వేదిక పైకి తెచ్చి, వ్యవసాయ పరిశోధన ఫలితాలను నేరుగా ప్రజల ఆరోగ్య ఫలితాలతో అనుసంధానించడం దీని ప్రధాన లక్ష్యం. జీవ పోషక సమృద్ధి కలిగిన, పోషక విలువలు అధికంగా ఉన్న పంటలు; వైవిధ్యభరిత సమగ్ర వ్యవసాయ వ్యవస్థలు; రైతుల వృత్తిపర ఆరోగ్యం; మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధుల నివారణ; ఒకే ఆరోగ్యం– ఇవీ దీని ఐదు ప్రధాన దిశలు.పరస్పర విరుద్ధ పరిస్థితిఇది భారతదేశానికి అవసరమైన విధాన మార్పు. ఒకవైపు పోషకాహార లోపం కొనసాగుతుండగా, మరోవైపు ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటివి పెరుగుతున్నాయి. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్) ప్రకారం,దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 35.5 శాతం నుంచి 29.3 శాతానికి తగ్గడం ఆశాజనకం. కానీ తక్కువ బరువున్న పిల్లలు ఇప్పటికీ 31.8 శాతం ఉన్నారు. అదే సమయంలో 15–49 ఏళ్లమధ్య ఉన్న మహిళల్లో అధిక బరువు/ఊబకాయం జాతీయ స్థాయిలో 30.7 శాతానికి చేరింది. అంటే ఒకే సమాజంలో పోషకా హార లోపం, అధిక పోషణ రెండూ కనిపిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో ఈ సమస్య మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సర్వే ప్రకారం 15–49 ఏళ్ల మహిళల్లో ఏకంగా 47.9 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు; గత ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఇది 36.3 శాతం. పురుషుల్లోనూ ఇది 31.1 నుంచి 41.5 శాతానికి పెరిగింది. మహిళల్లో 21.8 శాతం, పురుషుల్లో 24.1 శాతం మంది అధిక రక్త చక్కెర స్థాయులు లేదా మధుమేహ మందుల వినియోగం ఉన్న వర్గంలోకి వస్తున్నారు. అదే సమయంలో పిల్లల్లో ఎదుగుదల లోపం 31.2 నుంచి 24.6 శాతానికి తగ్గడం మంచి పరిణామం.తెలంగాణలోనూ ఇదే చిత్రం దర్శనమిస్తోంది. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 33.1 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది. కానీ 6–23 నెలల పిల్లల్లో సరిపడా ఆహారం అందుకుంటున్న వారు కేవలం 15.3 శాతమేమే. మరోవైపు మహిళల్లో 36.3 శాతం, పురుషుల్లో 35.5 శాతం అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. మహిళల్లో రక్తంలో అధిక చక్కెర ఉన్నవారు లేదా మధుమేహ మందుల వినియోగం చేయవలసిన స్థితిలో ఉన్నవారు 19.6 శాతం ఉండగా, పురుషుల్లో 24.5 శాతం మంది ఉన్నట్లుతేలింది. ఈ గణాంకాలు ఆరోగ్య సమస్యను కేవలం ఆసుపత్రిలో మాత్రమే పరిష్కరించలేమనీ, దానిలో ఒక భాగాన్ని పొలంలోనే పరిష్కరించాల్సి ఉంటుందనీ సందేశం ఇస్తున్నాయి.వైవిధ్యానికి ప్రాధాన్యంఇప్పటివరకు వ్యవసాయ రంగంలో సాధించిన విజయాన్ని ప్రధానంగా దిగుబడి, ఉత్పత్తి, ధర, రైతు ఆదాయం ఆధారంగా కొలిచాం. ఇకపై పోషక విలువ, ఆహార వైవిధ్యం, ఆహార భద్రత, ఆరోగ్య ఫలితాలు కూడా వ్యవసాయ ప్రణాళికలో భాగం కావాలి. బియ్యం, గోధుమలతో కేలరీల భద్రత సాధించాం. ఇప్పుడు పప్పులు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, నూనెగింజలు, పాలు, గుడ్లు, చేపలు వంటి ఆహార వైవిధ్యానికి ప్రాధాన్యంపెంచాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇందుకు అపారమైన అవకాశం ఉంది.ఆంధ్రప్రదేశ్‌కు ఉద్యానవన పంటలు, మత్స్యరంగం, చిరు ధాన్యాలు, పప్పుధాన్యాల్లో బలం ఉంది. తెలంగాణకు చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనెగింజలు, ఉద్యానవన పంటలు, పశుసంపద రంగాల్లో ప్రత్యేక సామర్థ్యం ఉంది. అధిక ఐరన్, జింక్ ఉన్న జీవపోషక సమృద్ధి పంటలు; మంచి మాంసకృత్తుల నాణ్యత కలిగిన పప్పుధాన్యాలు; రక్తంలో తక్కువ చక్కెర ప్రతిస్పందనకు అనుకూలమైన చిరుధాన్యాలు; యాంటీఆక్సిడెంట్లు, సూక్ష్మపోష కాలు సమృద్ధిగా ఉన్న పండ్లు, కూరగాయలు– ఇవన్నీ వ్యవసాయ పరిశోధన, విత్తన వ్యవస్థ, సాగు విస్తరణలో ప్రాధాన్యం పొందాలి. సెహత్ కూడా పోషక విలువలు అధికంగా ఉన్న, జీవపోషక సమృద్ధి పంటలను ప్రత్యేక ప్రాధాన్యంగా గుర్తించింది.రైతు ఆరోగ్యమూ ముఖ్యమే!అయితే రైతు ఆరోగ్యాన్ని మర్చిపోకూడదు. వ్యవసాయం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడమే కాకుండా, ఆ ఆహా రాన్ని పండించే రైతు కూడా సురక్షితంగా ఉండాలి. పురుగుమందుల ప్రభావం, తీవ్రమైన వేడి, యంత్ర ప్రమాదాలు, జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు వంటి అంశాలను వ్యవసాయ విస్తరణలో భాగం చేయాలి. ఇదే సెహత్లో వృత్తిపర ఆరోగ్యం, ఏక ఆరోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యం వెనుక ఉన్న భావన.ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాల యాలు, వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీలు కలిసి పనిచేసే కొత్త నమూనా అవసరం. ఒక జిల్లాలోఏ పోషకాహార లోపం లేదా అసాంక్రమిక వ్యాధులు ఎక్కువగా ఉన్నాయో ఆరోగ్య శాఖ గుర్తిస్తే... ఆ అవసరానికి తగిన పంటలు, వ్యవసాయ వ్యవస్థలు, ఇంటి తోటలు, పోషకాహార తోటలు,జీవ పోషక సమృద్ధి రకాలను వ్యవసాయ వ్యవస్థ ప్రోత్సహించ వచ్చు. జిల్లా ఆరోగ్య స్థితి వివరాలకు జిల్లా వ్యవసాయ ప్రణాళిక స్పందించాలి. అలాగే ప్రభుత్వ సేకరణ విధానం కూడా మారాలి. పాఠశాల మధ్యాహ్న భోజనం, అంగన్ వాడీలు, వసతి గృహాలు, ఆసుపత్రుల ఆహారంలో స్థానిక పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు వంటి వాటికి స్థిరమైన డిమాండ్ సృష్టిస్తే ఒకేసారి రైతుకు మార్కెట్, పిల్లలకు పోషణ లభిస్తాయి.ఇప్పటి వరకు మనం ఆహార భద్రత గురించి మాట్లాడాం.ఇక ఆరోగ్య భద్రత దిశగా అడుగు వేయాలి. మన వ్యవసాయశాస్త్రం ఒకప్పుడు ఆకలిని జయించింది. ఇప్పుడు మధుమేహం, ఊబకాయం, సూక్ష్మపోషక లోపాలు, ఆహార సంబంధిత వ్యాధులతో పోరాడటంలో కూడా తన పాత్రను విస్తరించాలి. ఆసుపత్రులు అనారోగ్యానికి చికిత్స చేస్తాయి. కానీ ఆరోగ్యకరమైన వ్యవసాయం ఆ అనారోగ్యాన్నే రాకుండా చేయగలదు. సెహత్ ఇచ్చే అసలైన సందేశం ఇదే. పొలం నుంచి పళ్లెం వరకు మాత్రమే కాదు; పళ్లెం నుంచి ప్రజారోగ్యం వరకూ వ్యవసాయ పాత్ర ఉందనిగుర్తించి ఆ దిశగా అడుగులు వేయాలి.-వ్యాసకర్త ఐకార్–అటారి, హైదరాబాద్ డైరెక్టర్-డా‘‘ షేక్ ఎన్. మీరా -
దిమాగీ నక్సల్ అంటే మాకు మెదడు ఉన్నట్టే కదా!
ప్రశ్న: ముందుగా, ఇటీవలి కాలంలోని అత్యంత విజయవంత మైన, దేశానికి కొత్త ఆశను కల్పించిన ఉద్యమంలో నాయకత్వ పాత్ర పోషించినందుకు అభినందనలు. గత రెండు దశాబ్దాలుగా సమాజాన్ని ఆవరించిన భయోత్పాత వాతావరణాన్ని ఈ ఉద్యమం కొంతవరకు తొలగించగలిగింది. అందుకు మరిన్ని అభినందనలు. ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్దాం. జంతర్ మంతర్ నుంచి దేశవ్యాప్త పర్యటన ఎందుకు?ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించడం. జార్ఖండ్‌లో విద్యార్థులు జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షలను రద్దు చేయాలని ఉద్యమిస్తున్నారు. అందుకే రాంచీ వెళ్లాం. కోల్‌కతాలో ఐఎస్ఐ విద్యార్థులు తమ విద్యాసంస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అందుకే అక్కడికి వెళ్లాం. తర్వాత జైపూర్ వెళ్లాం. రాజస్థాన్ పేపర్ లీక్‌లకు కేంద్రంగా మారింది. ప్రైవేట్ కోచింగ్ మాఫియా అక్కడ పెద్ద సమస్య. విద్యా వ్యవస్థ ఒత్తిడి వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అక్కడ కనిపిస్తున్నాయి. హైదరాబాదులో ఏబీవీపీ హింసకు వ్యతి రేకంగా కొంతమంది విద్యార్థులు పోరాడుతున్నారు. సీజేఐని కాన్వొకేషన్‌కు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తే తమను బార్లో నమోదు చేయబోమని బెదిరించే పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి. మేము వారితో కలిసి పోరాడుతున్నాం.జంతర్ మంతర్ ఉద్యమం ఎలాంటి పాఠాలు నేర్పింది?ఆ ఉద్యమం విజయం సాధించడానికి ప్రధాన కారణం మేము సంఘటితంగా ఉండటం. అందుకే ఎక్కడ విద్యార్థులు పోరాడు తున్నా వారు కూడా సంఘటితం కావాలి. అధికార ధోరణులను, నిరంకుశ శక్తులను నిజంగా ఎదుర్కోవాలంటే కలిసి రావాలి, తమను తాము చైతన్యపరుచుకోవాలి.మీ తక్షణ లక్ష్యం ఏమిటి?ప్రత్యేకంగా ఏమీ లేదు. వీలైనంత ఎక్కువమంది విద్యార్థులను సంఘటితం చేయడం, రాజకీయాల్లోకి తీసుకుని రావడం, నిజమైన శక్తి ఐక్యతలోనే ఉందని అర్థమయ్యేలా చేయడం– ఇవే మా లక్ష్యాలు. నాణ్యమైన విద్య కోసం, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం పోరాడాలి.జంతర్ మంతర్‌లో మూడు భిన్నమైన స్రవంతులు ఒకే వేదిక పైకి వచ్చాయి. ఇక భవిష్యత్తు?మేమంతా కలిసి కొత్త సంస్థ ఏర్పాటు చేయబోవడం లేదు. నేను ఏఐఎస్‌ఏలో భాగం. అదే నా సంస్థ. అభిజీత్ దీప్కే సీజేపీలో భాగం. అదే ఆయన సంస్థ. సోనమ్ వాంగ్‌చుక్ స్వతంత్ర వ్యక్తి. ఆయన సొంత అభిప్రాయాలు ఆయనకు ఉన్నాయి. అయితే ఉమ్మడి సమస్యలు ఉంటే విద్యార్థుల కోసం, దేశంలోని యువత కోసం మేము ఒక ఐక్య వేదిక ద్వారా కలిసి పోరాడవచ్చు.మీరు మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వస్తారా?మెయిన్‌స్ట్రీమ్ రాజకీయాలపై నా అవగాహన భిన్నంగా ఉంటుంది. నేను వామపక్ష భావజాలం నుంచి వచ్చాను. ప్రధాన స్రవంతి రాజకీయాలను ఆదర్శ రాజకీయాలుగా మేము చూడం. కాబట్టి నేను ఆ రాజకీయాల్లో చేరను. నేను రాజకీయాల్లోనే ఉన్నాను – నాకు సాధ్యమైనంత లోతుగా. నా భావజాలాన్ని కొనసాగిస్తాను. ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను కొనసాగించవచ్చు.మోదీ అంటించిన ‘దిమాగీ నక్సల్’ లేబుల్‌పై మీ స్పందన?అది ఏమాత్రం ప్రభావం లేని పదం. ప్రజలను చెడ్డవారిగా చిత్రీకరించడానికి, వారిని నిరుత్సాహపరచడానికి, వారి మనో ధైర్యాన్ని దెబ్బతీయడానికి కొత్త కొత్త పదాలను సృష్టిస్తున్నారు. ‘దిమాగీ నక్సల్’ అనేది ఒక జోక్ మాత్రమే. అందరూ నరేంద్ర మోదీని ఉద్దేశించి రకరకాల వ్యంగ్య నినాదాలు ఇస్తున్నారు. ఆయన కూడా ‘నేనూ ఏదైనా కొత్త పదం కనిపెట్టాలి’ అనుకుని ‘దిమాగీ నక్సల్’ అనే పదాన్ని తీసుకొచ్చినట్టుంది. కానీ ఇందులో మరో విషయం ఉంది. ‘దిమాగీ నక్సల్’ అంటే మనందరికీ మెదడు ఉంది. మనకు ఆలోచించే శక్తి ఉంది. మనం ఏమి ఆలోచిస్తున్నామో చెప్పడానికి టెలీప్రాంప్టర్ అవసరం లేదు. సామాన్య ప్రజలకు అర్థం కాని భాషలో మాట్లాడే ఇన్స్టాగ్రామ్ ప్రపంచం కూడా మనకు అవసరం లేదు. ప్రజలతో స్నేహంగా ఉండాల్సింది పోయి, వారి నుంచి పూర్తిగా దూరమయ్యే భాష మనకు అవసరం లేదు. కాబట్టి ‘దిమాగీ నక్సల్స్’ అని పిలిస్తే పిలవనివ్వండి!– డానీ, సమాజ విశ్లేషకులు -
చైనాతో సంబంధాలు మెరుగయ్యేనా?
వచ్చే నెల సెప్టెంబర్‌లో భారత్‌లో జరుగనున్న బ్రిక్స్ దేశాధినేతల సమావేశానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరవుతాడా అని విశ్లేషకులు ఆసక్తితో ఎదురు చూస్తు న్నారు. భారత్–చైనా దేశాధినేతల భేటీ నేపథ్యంలో రెండు దేశాల సంబంధాలకు దిశానిర్దేశం జరుగుతుందని జియో పొలిటికల్ సర్కిల్స్‌లో ఆశాభావం వ్యక్తమవుతోంది. భారత్–చైనా సంబంధాలలో స్థిరత్వం ఆసియా ఖండానికే కాకుండా ప్రపంచ శాంతికి కూడా కీలకం. 2020 గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో సుమారు నాలుగు సంవ త్సరాలు సంబంధాలలో స్తబ్ధత చోటు చేసుకున్నది. 2024లో రష్యాలో కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో మోదీ–జిన్‌పింగ్ సమావేశం, సరిహద్దు గస్తీ ఒప్పందం ఇరుదేశాల సంబంధాలలో ఘర్షణను కొంతవరకు తగ్గించాయి. కానీ మొత్తంగా సంబంధాలు సాధారణ స్థితికి చేరటానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. 1962 యుద్ధం తరువాత 1988లో రాజీవ్ గాంధీ బీజింగ్ పర్యటనతో మళ్లీ రెండు దేశాల సంబంధాలు గాడిన పడ్డాయి. 44 సంవత్సరాల తరువాత 2006లో నాథూ లా కనుమ మళ్లీ తెరుచు కున్నది. కానీ ఇరుదేశాల మధ్య పీటముడిలా ఉన్న సరిహద్దు సమస్యకు పరిష్కారం సమీప భవిష్యత్తులో లేనట్లే లెక్క.అయినా... వాణిజ్యం పెరిగింది!సరిహద్దు సమస్య సంక్లిష్టత నేపథ్యంలో ఇరు దేశాలు వాస్తవిక దృష్టితో గత రెండు దశాబ్దాలుగా వ్యాపార–వాణిజ్య సంబంధాలపై దృష్టి పెట్టాయి. 2000 సంవత్సరంలో 3 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం, 2025కల్లా 128 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. గత 25 సంవత్సరాలలో సరిహద్దుల మీద ఎన్ని ఘర్షణలు చోటు చేసుకున్నా అవి ఇరు దేశాల వాణిజ్యానికి నష్టం కలిగించలేదు. కానీ జూన్ 2020 గల్వాన్ దుస్సాహసం రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించింది. 2024 నుండి మరమ్మత్తు చర్యలు చేపట్టినప్పటికీ, అవి ఢిల్లీ–బీజింగ్ మధ్య విశ్వసనీయతలో లోటును పూరించలేక పోయాయి. గత రెండున్నర దశాబ్దాలుగా చైనాతో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. ఒకవైపు వ్యాపార వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటూనే, మరొకవైపు సరిహద్దులలో మన సైనిక శక్తిని మెరుగుపరచుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. అంతర్జాతీయ యవనికపై పర్యావరణం, వాతావరణంలో మార్పులు, శక్తి, అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల విషయంలో చైనాతో చేతులు కలిపాము. ఇరుదేశాల మధ్య వాణిజ్యం విçస్తృతంగా వృద్ధి చెంది నప్పటికీ వాణిజ్య లోటు పెద్ద సమస్యగా మారింది. 2020లో 44 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 2026కల్లా 112 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. చైనా దిగుమతులపై మన ఆర్థిక వ్యవస్థ విపరీతంగా ఆధారపడతున్నది. ఈ రకమైన వాణిజ్య సంబంధాలు దీర్ఘకాలంలో మనకు నష్టం కలిగించటం ఖాయం.చైనా గ్రే జోన్ యుద్ధతంత్రం1962 తర్వాత భారత్‌పై చైనా మళ్లీ యుద్ధం చేసే పరిస్థితి, ప్రమాదం లేకపోయినప్పటికీ... సరిహద్దు సమస్య శాశ్వత పరిష్కా రానికి మనస్ఫూర్తిగా, మిత్రత్వ ధోరణితో చైనా ముందుకు రావటం లేదు. పైపెచ్చు వరుసగా సరిహద్దులలో కవ్వింపు ధోరణిని అమలు పరుస్తున్నది. వ్యూహాత్మకంగా ‘గ్రే జోన్ ’ యుద్ధతంత్రాన్ని అమలు పరుస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఒకవైపు సరిహద్దులలో భారత్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ... మరొకవైపు పరోక్షంగా భారత్ అభివృద్ధిని అడ్డుకొని బలహీనపరచే కుతంత్రాన్ని చైనా అమలుపరుస్తున్నది. దీనితో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వెచ్చించాల్సిన కీలక నిధులను భారత ప్రభుత్వంచే సైనిక వ్యయంవైపు మళ్లింప చేయటంతో చైనా కృత కృత్యురాలయింది. సరిహద్దులను ఒకవైపు అస్థిరం చేస్తూనే మరొక వైపు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవు లతో జతకట్టి ఇండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈశాన్య భారతంలో ఉగ్రవాద ముఠాలకు వత్తాసు పలుకుతూ దేశాన్ని అస్థిరం చేయటానికి ప్రయత్నిస్తున్నది. వాణిజ్యంలో కూడా కీలకమైన వస్తువులను, ఉత్పత్తులను భారత్‌కు ఎగుమతి చేయకుండా ఆంక్షలు విధిస్తున్నది. మనకు అత్యంత అవసరమైన టన్నెల్ బోరింగ్ యంత్రాలు, సీఎన్ సీ లేథ్ యంత్రాలు, యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రేడియంట్లు, క్రిటికల్ మినరల్స్ మనకు అందకుండా వ్యూహాత్మ కంగా వ్యవహరిస్తున్నది. సామాజిక మాధ్యమాలలో భారత్‌కు వ్యతి రేకంగా పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నది.భారత్ ఏం చేయ్యాలి?గత రెండు దశాబ్దాలలో భారత్ ఎడల చైనా ప్రవర్తన, దృక్పథంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. 2000 సంవత్సరం వరకు భారత్‌ను చైనా ఒక సహ ప్రత్యర్థిగా చూసింది. 2025కల్లా అంతర్జాతీయంగా చైనా ఆర్థిక శక్తిగానే కాకుండా టెక్నాలజీ పవర్ హౌస్‌గా ఏర్పడింది. సహజంగానే భారత్ ఎడల ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నది. అమెరికా బలహీనపడటం చైనాకు కలిసి వచ్చింది. భారత్–చైనా సంబంధాలలో యూఎస్ఏ, పాకిస్తాన్ పాత్రను మనం కాదనలేము. ఇటీవల బీజింగ్ పర్యటన సందర్భంగా ట్రంప్ యూఎస్ఏ, చైనాలను జీ2గా అభివర్ణించాడు. అంటే యూఎస్ఏ, చైనాలే అగ్రరాజ్యాలని ప్రకటించాడు. అయితే, చైనాను ప్రాంతీయంగా బలహీన పరచటానికి అమెరికా భారత్‌ను సమర్థిస్తుందనీ, అమెరికాను ఎదుర్కోవటానికి చైనా భారత్‌తో చేతులు కలుపుతుందనీ మరొక వాదన. చైనాతో సంబంధాల విషయంలో భారత్ ఈ వాదనల ఆధారంగా సిద్ధాంత రూపకల్పన చేయటం అవివేకం. చైనాతో సంబంధాల విధాన రూపకల్పన అమెరికన్ సిద్ధాంతాల ఆధారంగా కాకుండా మన దేశ శక్తి, సామర్థ్యాలు, స్థిరత్వం, అభివృద్ధి అవసరాల ఆధారంగానే జరగాలి.భారత్‌కు కొన్ని ముఖ్యమైన అంశాల్లో స్పష్టత అవసరం. మన లక్ష్యం ప్రాంతీయ హోదానా? సరిహద్దు సమస్య పరిష్కారమా? సరి హద్దులలో ప్రశాంతతనా? అంతర్జాతీయంగా చైనాను బలహీనపర చటమా? ఏ అంశాల విషయంలో భారత్ రాజీపడదనే విషయంలో చైనాకు భారత్ స్పష్టతనివ్వాలి. కవ్వింపు చర్యలు, పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భూభాగాల నుండి భారత్‌ను అస్థిరపరచే కుట్రల విషయంలో భారత్ రాజీ పడదు. ద్వైపాక్షిక సంబంధాలలో భారత్‌ను సమవుజ్జీగా పరిగణించాలి. అయితే, చైనా ధోరణి ఎప్పటికైనా మన బలంపైనే ఆధారపడి ఉంటుంది. బలమైన భారత్ మాత్రమే చైనాకు సరైన సమాధానం. ముఖ్యంగా మన ప్రజాస్వామ్య వ్యవస్థ చైనాకు కంటగింపుగా ఉన్నది. ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలి. చైనా పెట్టు బడులకు మళ్లీ పచ్చజెండా ఊపాలంటే వాణిజ్య లోటును పరిగణన లోనికి తీసుకోవాల్సిందే. భారత జెనరిక్ ఔషధాలు, ఐటీ సేవలను ఎగుమతి చేయటానికి చైనాపై ఒత్తిడి తేవాలి. 21వ శతాబ్దం చైనా శతాబ్దం కాకూడదు, అది ఆసియా శతాబ్దమవ్వాలి!గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఇది లా విద్యార్థుల హక్కుల ధిక్కరణే!
రాజ్యాంగం ప్రకారం న్యాయవ్యవస్థ అత్యంత స్వతంత్రంగా పని చేయాలి. పౌరహక్కులకు, స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు న్యాయ వ్యవస్థ రక్షణ కవచంగా ఉండాలి. అందుకోసమే రాజ్యాంగ నిర్మాతలు న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించారు. దేశంలోని న్యాయవ్యవస్థకు గౌరవం, ప్రజలలో నమ్మకం కలగడానికి న్యాయవాదుల పాత్ర, కృషి, నిబద్ధత విస్మరించరానివి.అలాంటి న్యాయవాదులను తయారుచేసే నల్సర్ విశ్వవిద్యా లయం విద్యార్థులు తమ ఉపకులపతి, రిజిస్ట్రార్లకు ఒక లేఖ రాశారు. తమ స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించే అంశాన్ని పునః పరిశీలించాలని అందులో కోరారు. స్నాతకోత్సవ తేదీ ఇంకా ఖరారు కాలేదు, ముఖ్య అతిథి ఎంపిక కూడా తుది దశకు రాలేదని తమకు తెలుసునని చెబుతూనే అధికారిక నిర్ణయం తీసుకునే ముందు తమ అభిప్రాయాన్ని వినాలని కోరారు. విద్యార్థులు స్నాతకోత్సవాన్ని బహిష్కరిస్తామని చెప్పలేదు, న్యాయవ్యవస్థను తిరస్కరించలేదు, న్యాయమూర్తి తీర్పులన్నింటినీ ప్రశ్నించలేదు. విద్యార్థుల అభ్యంతరం, ఆవేదన... ఒక నిర్దిష్ట సందర్భంలో న్యాయవ్యవస్థ ప్రవర్తించిన తీరుపై మాత్రమే. కానీ విద్యార్థులు ప్రశ్నించారనే కారణంతో వారి గొంతును నొక్కివేయడం ప్రజాస్వామ్య పద్ధతి కాదు.న్యాయ విద్య అంటే సెక్షన్లు బట్టీ పట్టడం, కోర్టులో వాదించడం మాత్రమే కాదు. న్యాయ విద్య అంటే అధికారాన్ని ప్రశ్నించడం, బలహీనుడి పక్షాన నిలబడటం, అన్యాయాలకు గురైనవారి వెంట, పౌర హక్కులకు దూరమైనవారి వెంట నిలబడి రాజ్యాంగాన్ని కాపాడటం కూడా. ప్రజాస్వామ్యానికి ప్రశ్నలు ప్రమాదకరం కాదు, ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం ప్రమాదం. న్యాయవ్యవస్థను బలహీనపరిచేది విమర్శ కాదు, న్యాయవ్యవస్థపై విమర్శ వినే ఓపిక లేకపోవడమే ప్రమాదకరం.ఆ అధికారం ఎక్కడిది?బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లా విద్యార్థులపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికార పరిధి లేదు. విద్యార్థుల ప్రవర్తన కోర్టు ధిక్కరణ చర్య కానీ లేదా దేశ చట్టాల ఉల్లంఘన కానీ కానే కాదు. కొందరు విద్యార్థులు ఒక ప్రముఖుడు తమ స్నాతకోత్స వంలో భాగం పంచుకోవడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన శాంతియుత ప్రాతినిధ్యం ఆధారంగా పట్టభద్రులవుతున్న వారిని బార్ కౌన్సిల్స్‌లో నమోదు చేసుకోవద్దని నిషేధం విధించడం కరెక్టు కాదు. తమ సొంత కాన్వొకేషన్ కొరకు ముఖ్య అతిథి ఎంపికపై విద్యార్థులు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తప్పెలా అవుతుంది?బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు... బార్ స్వతంత్రతను, సమగ్రతను పరిరక్షించడం ప్రాథమిక బాధ్యత. బార్ కౌన్సిల్ చైర్మన్ చేసిన ఈ చర్య అప్రజాస్వామికం. నిషేధాన్ని వెనక్కి తీసుకుని, చైర్మన్ ఇప్పటికే క్షమాపణ చెప్పినప్పటికీ ఆయనపై అధికారిక విచారణ చేపట్టాలి. తక్షణమే ఆయనను తొలగించాలి. నల్సర్ విద్యార్థులు సహజ న్యాయం గురించి చదివారు. అలాగే రాజ్యాంగానికి అతీతమైన అధికారం ఏదీ లేదని నల్సార్లోనే వారికి బోధించారు. ఈ జ్ఞానంతోనే విద్యార్థులు తమ సొంత సంస్థకు హేతుబద్ధమైన లేఖ రాసి బెదిరింపులకు గురికావడం బాధాకరం. ప్రజాస్వామ్యానికి అవసరమైనది అంధభక్తి కాదు, సంస్థలను గౌరవిస్తూనే వాటిని ప్రశ్నించే సంస్కృతి కావాలి. ప్రజాస్వామ్యంలో గౌరవమంటే జవాబుదారితనం నుంచి మినహాయింపు కాదనేది అర్థం చేసుకోవాలి.– దిగుపాటి రాజగోపాల్ ‘ ఏఐఎల్యూ ఏపీ గౌరవ అధ్యక్షులు -
దోమా! ఇది నీకు తగునా!!
‘సాయంత్రానికి ఇంటిలోకి చేరతావు, ఏదో ఒక మూలనుంటావు. నేను ప్రేమించే వెలుతురుని ద్వేషిస్తావు, నేను ద్వేషించే చీకటిని ప్రేమిస్తావు. రాత్రంతా నాకోసం మేల్కొని ఉంటావు, టైము దొరికితే కాటేస్తావు. మనది మనది ఒకటే రక్తం అంటావు, నా రక్తాన్నే తాగుతావు. కొన్ని రోజులే బతుకుతావు, కానీ నన్ను రోజూ చంపుతావు. రోగక్రిమి లేకపోతే మిత్రుడు, ఉంటే శత్రువు.’సంవత్సరానికి పదిలక్షల పైచిలుకు మరణాలతో, మానవ మరణాలకు కారణమయ్యే జీవుల్లో దోమ మొదటిస్థానం ఆక్రమిస్తుంది. 1897 ఆగస్టు 20న సర్ రోనాల్డ్ రాస్ మలేరియా క్రిముల్ని దోమలో చూసి, మలే రియా వ్యాధి వ్యాప్తికి కారణం దోమ అని నిర్ధారించారు. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ‘ప్రపంచ దోమ రోజు’ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దోమల గురించిన కొన్ని వాస్తవాలు:దోమలు 112 జాతులతో 3,541 తెగలతో భూగోళమంతా వ్యాపించి ఉన్నాయి. వాటిలో 50 జాతులు, 404 తెగలు భారతదేశంలో ఉన్నాయి. 4 జాతులకు చెందిన దోమలు మాత్రమే మన దేశంలో మనుషులకు వ్యాధులను కలిగిస్తాయి. అనాఫిలస్ జాతి మలేరియా వ్యాధిని; క్యూలెక్స్ జాతి ఫైలేరియా, మెదడువాపు వ్యాధులను; ఏడిస్ జాతి డెంగీ, చికున్ గన్యా, జికా వ్యాధులను; మాన్సోనియా జాతి బోదకాలు వ్యాధిని వ్యాప్తిచేస్తాయి.దోమ జీవితంలోని 4 దశల్లో, 3 దశలు (గుడ్డు, లార్వా, ప్యూపా) నీటిలోనూ, ఒక దశ (పెద్ద దోమ) భూమిమీద నివసిస్తాయి. సాధారణంగా మగదోమలు వారం రోజులు, ఆడదోమలు నెల రోజులు మాత్రమే జీవిస్తాయి. జీవించడానికి ఆడ, మగ దోమలు మొక్కల రసాలు తాగుతాయి, గుడ్లుపెట్టడానికి మాత్రమే ఆడదోమలు రక్తం తాగుతాయి. దోమకాటు దగ్గర ఏర్పడే ఎర్రని బొబ్బ దోమకాటు వల్ల కాకుండా, మనిషి వ్యాధినిరోధక వ్యవస్థ స్పందన వలన ఏర్పడుతుంది.దోమలు భూమికి 25 మీటర్లకంటే తక్కువ ఎత్తులో ఎగరడానికి ఇష్టపడతాయి. అవి మనుషులు, జంతువులు విడిచే వాయువులను 75 మీటర్ల దూరంనుండి కూడా గుర్తించ గలవు. గర్భిణీ స్త్రీలను, ‘ఓ’ రక్తగ్రూపు వాళ్లను, శరీరం వేడిగా ఉండేవాళ్ళను దోమలు సులభంగా గుర్తించగలవు. కదిలేవాటిని, తెలుపు, నలుపు రంగులను, ఉష్ణోగ్రతలను, గాలిలోని తేమను పసిగట్టగలవు.దోమ రెక్కల ద్వారా చేసే శబ్దాలు వాటి తెగకు చెందిన, ఇతర దోమలు గుర్తించడానికి చేసేవే. పెద్ద దోమలను తినేవాటిలో తూనీగలు, దోమ పిల్లలను తినేవాటిలో చేపలు ముందుంటాయి. దోమ కిలోమీటరు దూరం మాత్రమే వ్యాధిని వ్యాప్తిచేయగలదు. అయితే వ్యాధికారకం కలిగిన మనుషులు మాత్రం వేలకిలో మీటర్ల మేరకు వ్యాధిని వ్యాప్తిచేయగలరు. అందుకే దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోండి – దోమకాటు వ్యాధులనుండి రక్షణ పొందండి.– తలతోటి రత్న జోసఫ్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్, ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ -
ఆరోగ్య పరిశోధనకు అనారోగ్య మార్గం?
ఆరోగ్య పరిశోధనా శాఖ ఇటీవల ఒక జాతీయ ఆరోగ్య పరిశోధనా విధానాన్ని ప్రతిపాదించింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ విభాగం దాదాపు రెండు దశాబ్దాలుగా మనుగడలో ఉన్నప్పటికీ, ఆరోగ్య పరిశోధనకు సంబంధించి దేశానికి ఇంతవరకు ఒక కట్టుదిట్టమైన విధానం ఏదీ లేదనే వాస్తవాన్ని మొదటిసారిగా ఇపుడే గుర్తించి నట్టుంది. దేశంలో ఆరోగ్య పరిశోధనకు సంబంధించి ప్రధాన బాధ్యతను భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) నిర్వర్తిస్తోంది. జాతీయ పరిశోధన–అభివృద్ధికి చెందిన నిధులలో ఆ సంస్థకు కేవలం 3.3 శాతం నిధులు మాత్రమే అందుతున్నాయని 2026 జూలైలో విడుదలైన జాతీయ ‘ఆర్ అండ్ డి’ డేటా వెల్లడించింది. రక్షణకు 32 శాతం, అంతరిక్ష పరిశోధనకు 15 శాతం అందుతున్నాయి. అసలు మొత్తం ఆర్–డిపై మన జాతీయ వ్యయం, స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో చైనా (2.58 శాతం)తో పోల్చుకుంటే, నామమాత్రంగా, 0.84 శాతంగా ఉంది. బయోమెడికల్, ఆరోగ్య ఆర్–డిపై వ్యయాన్ని పెంచడం నూతన ఆరోగ్య పరిశోధనా విధాన లక్ష్యాలలో ఒకటి. ఆరోగ్య పరిశో ధనపై పెట్టుబడిని జీడీపీలో ఇపుడున్న 0.024 శాతం నుంచి 2037 నాటికి 0.072 శాతానికి, 2047 నాటికి 0.15 శాతానికి పెంచాలని సంకల్పించారు. ఇది పెద్ద అంగగానే కనిపించవచ్చుకానీ, భారత దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లతోనూ, భవిష్యత్తులో ఉండగల వ్యాధుల భారంతోనూ పోల్చుకుంటే, ఆ వ్యయం కూడా తక్కువే. పైగా ప్రతిపాదిత పెంపుదలలు సుదూర కాలానివి. పక్షపాత పరిశోధనలకు ఊతమిస్తే?దాన్నలా ఉంచితే, ప్రతిపాదిత పెంపుదల మరింత సమస్యాయుతంగా కనిపిస్తోంది. ‘ప్రభుత్వ పెట్టుబడి క్రమేపీ పెరుగుతుంది. దానికి బాధ్యతాయుతమైన ప్రైవేటు, దాతృత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి వచ్చే పెట్టుబడి తోడవుతుంది’ అని ఆ విధానం పేర్కొంటోంది. ఆరోగ్య పరిశోధనలో ప్రైవేటు పెట్టుబడులకు ఇది అధికారికంగా ద్వారాలు తెరుస్తుంది. ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుకుంటున్న ప్రైవేటు పెట్టుబడి స్వరూప స్వభావాలు మరింత ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రైవేటు కంపెనీల నుంచి వచ్చే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను ప్రభుత్వ సంస్థలలో ఆర్–డిపై వినియోగించేందుకు అనుమతిస్తామని ఆ విధానంలో పేర్కొన్నారు. ఈ విధానం ఇపుడున్న ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యాలకు భిన్నమైనది. కోవిడ్–19 వ్యాక్సిన్ల వంటి నిర్దిష్ట ప్రాజెక్టుల కింద ఫార్మా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కొత్త ఔషధాలను లేదా టీకాలను తయారు చేస్తూ వస్తున్నాయి. అది ఫార్మా లేదా మరో కంపెనీ ఏదైనా సరే ఇచ్చే సీఎస్ఆర్ నిధులతో ఓ చిక్కు ఉంది. ఒక కంపెనీ నెలకొల్పిన దాతృత్వ సంస్థ నిధులతోనైనా కూడా ఇబ్బందే. అది పక్షపాతపూరిత పరిశోధనకు దారితీయవచ్చు. పర్యావరణ ఆరోగ్యం (వాయు కాలుష్యం, పొగాకు, ఆల్కహాల్ ప్రభావాలు), కొన్ని వృత్తి ఉద్యోగాల్లో ఆరోగ్యంపై పడే ప్రభావం, ఆహార భద్రత, వాతావరణ మార్పు వంటి వివాదాస్పద అంశాలలో జరిగే పరిశోధ నలలో రహస్య అజెండా దాగుండొచ్చు. ‘శాస్త్రీయ సందేహా’లను సృష్టించవచ్చు. కొన్ని అగ్రశ్రేణి ఆరోగ్య ఎన్జీవోలు, ప్రజారోగ్య సంస్థలు క్షేత్ర స్థాయిలో చేసే పరిశోధనా అధ్యయనాలకు విదేశీ మారక ద్రవ్య నిబంధనల పేరుతో ప్రభుత్వం ఓపక్క అడ్డంపడుతూ, మరోపక్క ఆరోగ్య పరిశోధనలు నిర్వహించేందుకు పరిశ్రమలకు, విదేశీ ఫౌండేషన్లకు ద్వారాలు తెరవడం విడ్డూరం. విశ్వాసాలకు శాస్త్రీయ ముసుగుఈ మొత్తం విధానం ఆరోగ్య పరిశోధనను అన్ని స్థాయుల్లోనూ అధికార యంత్రాంగంతో ముడిపెడుతూ కేంద్రీకృతం చేసేదిగా ఉంది. జాతీయ ఆరోగ్య పరిశోధనా అజెండా స్థూల స్థాయిలో ప్రాధాన్యాలను నిర్దేశిస్తుందనీ, అ అజెండాను మూడు అంచెల పాలనా వ్యవస్థ అమలుజరుపుతుందనీ కొత్త విధానం చెబుతోంది. నూతన ఆరోగ్య పరిశోధనా సారథ్య కమిటీ అత్యున్నత స్థాయిలో ఉండి, వ్యూహాత్మక దిశా నిర్దేశాన్ని అందిస్తుంది. దానికి ముఖ్య శాస్త్రీయ సలహా మండలి నేతృత్వం వహిస్తుంది. దానిలో ప్రభుత్వాధికారులు (వైజ్ఞానిక శాఖల కార్యదర్శులు) సభ్యులుగా ఉంటారు. రెండవ అంచెలో ఆరోగ్య పరిశోధనా విభాగం సెంట్రల్ నోడల్ ఇంప్లిమెంట్ ఏజెన్సీగా పనిచేస్తుంది. శాస్త్రీయ–సాంకేతిక అమలు బాధ్యతలను మూడవ అంచెలో భారతీయ వైద్య పరిశోధనా మండలికి అప్పగిస్తారు. ప్రజారోగ్యం ప్రాథమికంగా రాష్ట్రాల జాబితాలోకి వస్తుంది. వైద్య విద్య–పరిశోధన ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. కానీ, ప్రతిపాదిత పాలనా వ్యవస్థ రాష్ట్రాల పాత్రను తగ్గించేదిగా ఉంది. ఆరోగ్య పరిశోధనా అజెండాను కేంద్ర సారథ్య కమిటీకి అప్పగించడం వల్ల రాష్ట్రాల పాత్ర కేవలం అమలు చేయవలసినదిగా మారు తుంది. ప్రతిపాదిత ఆరోగ్య పరిశోధనా విధానం మరో ముఖ్యమైన మార్పునకు సంకేతంగా నిలుస్తోంది. ‘సమీకృత ఆరోగ్యం’ ముసుగులో ఆధునిక వైద్యానికి ఉద్దేశించిన పరిశోధనా నిధులను ఆయుర్వేదం, ఇతర వైద్య విధానాలను అనుసరించే సంస్థలు కూడా వినియోగించుకోవచ్చు. నిజానికి, అటువంటి సంస్థలు ఆయుష్ మంత్రిత్వ శాఖ, అది నిర్వహిస్తున్న యంత్రాంగాల నుంచి పరిశోధనా నిధులను ఇప్పటికే అందుకుంటున్నాయి. ఇది తిరిగి పాత పద్ధతులు, విశ్వాసాలు, అభిప్రాయాలను ధ్రువీకరించే ఉద్దేశంతో చేసే పరిశోధనలకు ఊతం ఇస్తుంది. గోమూత్రం వంటివి ఆధునిక పరిశోధనకు లోనవుతాయి. శాస్త్ర–సాంకేతిక పరిశోధన శాఖ వంటి ఇతర పరిశోధనా ఏజెన్సీలు ఇస్తున్న నిధులతో అటువంటి ప్రాజెక్టులు ఇప్పటికే నడుస్తున్నాయి. రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా...మన దేశం భౌగౌళికంగా, సాంస్కృతికంగా మాత్రమే వైవిధ్య భరితమైనది కాదు. దాని ఆరోగ్య అవసరాలు కూడా భిన్నమైనవి. వివిధ చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండటంలో తారతమ్యాలున్నాయి. బిహార్ లేదా ఒడిశా వంటి రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ఆరోగ్య సవాళ్ళు పూర్తిగా భిన్నమైనవి. ‘పైనుంచి–కింద’కు అనే అజెండాను రాష్ట్రాలు అమలు చేయక తప్పని స్థితిని కల్పించే బదులు, రాష్ట్రాలు వాటి ప్రాధాన్యాలు, అవసరాల ఆధారంగా సొంత ఆరోగ్య పరిశోధనా మౌలిక వసతులను అభివృద్ధి చేసు కునేలా నిధుల రూపంలో చేయూతనందిస్తే బాగుంటుంది. ఆరోగ్య పరిశోధన అంటే కేవలం కొత్త టెక్నాలజీలను పరీక్షించడం లేదా కొత్త టీకాలు, మందులను తయారు చేయడమే కాదు; పరిశోధన ఫలితాలు ఆరోగ్య విధానాలు, బడ్జెట్లకు దారి చూపాలి. ఆరోగ్య పరిశోధన ఒక నిరంతర, గతిశీల ప్రక్రియ. అది సామాజిక–ఆర్థిక అంశాలతో సన్నిహితంగా ముడిపడి ఉంటుంది. పట్టణాల్లో ఉండే పేదలు, గిరిజనులు వంటి అనేక బడుగు, బలహీన వర్గాల ఆరోగ్య సమస్యలు తరచు పరిశీలనకు నోచుకోవడం లేదు. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో వైద్య కళాశాలలను తెరిచారు. తమతమ ప్రాంతాల్లో ఉండే ఆరోగ్య సమస్యలపై పరిశోధన సాగించే విధంగా వాటికి దిశా నిర్దేశం చేయాలి. ఆరోగ్య పరిశోధనకు అంకితమైన ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే పరిశోధన అజెండాను రూపొందించేందుకు కేంద్రీకృత విధానాన్ని అనుసరించడం, ప్రైవేటు రంగానికి ప్రముఖ పాత్ర కల్పించడం, ఆధునిక వైద్య పరిశోధనా అజెండాకు సమీకృత సంప్రదాయ వైద్యాన్ని జోడించడం వంటివాటితో ఈ విధానం తీసుకుంటున్న దిశ మాత్రమే అనారోగ్యకరంగా కనిపిస్తోంది.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ఒక ఫోటో... కాలానికి అద్దం
‘ఒక చిత్రం వెయ్యి మాటలకు సమానం’ అంటారు. కానీ ఒక మంచి ఫొటో వెయ్యి మాటలకే పరిమితం కాదు; అది ఒక జ్ఞాపకాన్నీ, ఒక భావోద్వేగాన్నీ, ఒక సంఘటననూ, ఒక్కోసారి ఒక కాలాన్నే తనలో శాశ్వతంగా భద్రపరుస్తుంది. తరాలు మారిపోతాయి. కానీ ఒక ఫొటో ఆ ఒక్క క్షణాన్ని ఆపి ఉంచుతుంది. నవ్వులు, కన్నీళ్లు, విజయాలు, విషాదాలు, పోరాటాలు, సంబరాలు అందులో నిశ్శబ్దంగా జీవిస్తూనే ఉంటాయి.1839లో ఫ్రెంచ్ ఆవిష్కర్త లూయిస్–జాక్–మాండే డాగ్యేర్ అభివృద్ధి చేసిన డాగ్యేరియో టైప్ ప్రక్రియ ప్రపంచానికి పరిచయం కావడంతో ఫొటో గ్రఫీ ఒక కొత్తయుగంలోకి ప్రవేశించింది. 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్‌లో ఈ ప్రక్రియను అధికారికంగా ప్రకటించడంతో ఆ రోజుకు ఫొటోగ్రఫీ చరిత్రలో ప్రత్యేక స్థానం లభించింది. అందుకే ప్రతి సంవ త్సరం ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ’ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం.తెలంగాణ విషయానికి వస్తే ఫొటో జర్నలిజానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతఉంది. హైదరాబాద్ నగర జీవితం నుంచి తెలంగాణ పల్లెల వరకు, బతుకమ్మ నుంచి బోనాల వరకు, మేడారం జాతర నుంచి వివిధ సాంస్కృతిక ఉత్సవాల వరకు, ఎన్నికల నుంచి ప్రజా సమస్యల వరకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి సామాజిక పరిణామాల వరకు తెలంగాణ జీవితంలోని అనేక కోణాలను ఫొటో జర్నలిస్టులు తమ కెమెరాల్లో భద్రపరిచారు. తెలంగాణ సామాజిక, రాజకీయ చరిత్రలో జరిగిన వివిధ ఉద్యమాల సందర్భంలో కూడా ఫొటో జర్నలిజం ఒక ముఖ్యమైన దృశ్య రికార్డుగా నిలిచింది. 1969 ఉద్యమం నుంచి తరువాతి దశల వరకు జరిగిన ర్యాలీలు, విద్యార్థుల ఆందోళనలు, ప్రజా సమావేశాలు, నిరసనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం వంటి అనేక దృశ్యాలను ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో భద్రపరిచారు. ఇదీ చదవండి: ఏ రకమైన దోమ కుడితే ఎలాంటి వ్యాధి వస్తుందో తెలుసా?ఫొటో జర్నలిస్టు పని బయటకు కనిపించేంత సులభమైనది కాదు. మంచి ఫ్రేమ్ కోసం కొన్నిసార్లు గంటల తరబడి ఎదురుచూడాలి. ఎండ, వర్షం, రద్దీ, ప్రమాదకర పరిస్థితులు... ఏవీ పట్టించుకోకుండా సరైన క్షణాన్ని కెమెరాలో బంధించాల్సి ఉంటుంది. సరైన క్షణాన్ని గుర్తించే చూపు, సంఘటనను అర్థం చేసు కునే అవగాహన... ఇవే మంచి ఫొటోగ్రాఫర్‌కు అసలైన సంపద. ఒక ఫొటో తీసిన క్షణంలో అది కేవలం ఒక చిత్రం. కానీ సంవత్సరాలు గడిచిన తరువాత అదే ఫొటో ఒక జ్ఞాపకం. మరింత కాలం గడిచిన తరువాత అదే ఫొటో ఒక చరిత్ర. కాలం మారుతుంది. తరాలు మారుతాయి. సాంకేతికత మారుతుంది. కానీ ఒక మంచి ఫొటో మాత్రం కాలాన్ని దాటి జీవిస్తూనే ఉంటుంది.– నాగులపల్లి వెంకటేశ్వరరావు సెక్రెటరీ, మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది? -
ద్రవ్యోల్బణ సూచీలు – దాక్కుంటున్న ధరలు
భారత్ ఇటీవలే వినియోగదారుల ధరల సూచీ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ –సీపీఐ)కి కొత్త రూపం ఇచ్చింది. 2012ను ఆధార సంవత్సరంగా తీసుకున్న పాత శ్రేణి స్థానంలో, 2024ను ఆధార సంవత్స రంగా తీసుకున్న కొత్త శ్రేణి 2026 ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చింది. గృహ వినియోగ వ్యయ సర్వే 2023–24 ఆధారంగా వినియోగ బుట్టను, దాని బరువులను పునర్నిర్మించారు. అయితే, ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణ సూచీలు ఒక కుటుంబం ప్రత్యక్షంగా అనుభవించే ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా ప్రతి బింబించడం లేదనే వాదన కొన్ని వర్గాల్లో ఉంది. ఉదాహరణకు, ఆగస్ట్ 12న విడుదలైన జూలై నెల సీపీఐ సూచీ రిటైల్ ద్రవ్యోల్బణం రేటును 4.45 శాతంగా, పట్టణ ప్రాంత ఆహార ద్రవ్యోల్బణం రేటును 5.05 శాతంగా చూపించింది. వాస్తవానికి తాము మోస్తున్న ధరల భారం మరింత ఎక్కువని కొందరు భావిస్తున్నారు. వాస్తవానికి సీపీఐ తప్పుగా లెక్కించబడటం లేదు. అయితే, సీపీఐ ఒక సగటు వినియోగ బుట్ట ఆధారంగా దేశంలోని కుటుంబాలందరికీ ద్రవ్యోల్బణ రేటును సూచిస్తుంది. కానీ ప్రతి కుటుంబం ఒకే వస్తువులను, ఒకే పరిమాణంలో, ఒకే ధరకు కొనదు. అందువల్ల అధికారికంగా సూచించే ద్రవ్యోల్బణం, కుటుంబం అనుభవించే ద్రవ్యోల్బణం కొంత భిన్నంగా ఉండవచ్చు.ఒకే బుట్ట... భిన్నమైన కుటుంబాలుద్రవ్యోల్బణాన్ని కొలవడానికి, ప్రజలు సాధారణంగా కొనుగోలు చేసే వస్తువులు, సేవలను ఒక ‘వినియోగ బుట్ట’గా వర్గీక రిస్తారు. పాత శ్రేణిలోని 299 వెయిటెడ్ వస్తువుల స్థానంలో కొత్త శ్రేణిలో 358 వస్తువులు చేరాయి. ప్రతి వస్తువుకు, కుటుంబాల మొత్తం వినియోగ వ్యయంలో దాని ప్రాధాన్యతకు అనుగుణంగా ఒక బరువు కేటాయిస్తారు. వాటి ధరల మార్పును ఈ బరువుల దామాషాలో గణించి సీపీఐని లెక్కిస్తారు. గృహ వినియోగ వ్యయ సర్వే 2023–24 ప్రకారం, సగటున భారతీయ కుటుంబం తన వినియోగ వ్యయంలో దాదాపు 40–50 శాతం ఆహారంపైనే ఖర్చు చేస్తోంది. అయితే తక్కువ ఆదాయ కుటుంబాలు ఆహారంపై తమ వినియోగ వ్యయంలో ఎక్కువ భాగం ఖర్చు చేయడం వల్ల, ఆహార ధరలు వేగంగా పెరిగినప్పుడు, వారిపై సగటు సూచీ చూపే ద్రవ్యోల్బణం కంటే అధిక భారం పడుతుంది. ధరల కారణంగా ఒక కుటుంబం పామాయిల్ కొనడం తగ్గించి, వేరుశనగ నూనెకు మారిందనుకుందాం. కానీ, వెంటనే సూచీ బరువులు మారవు. అందువల్ల వినియోగ బుట్టలోని వస్తు వులు, వాటి బరువులను ఒకసారి సవరించి సుదీర్ఘకాలం కొనసాగించే బదులు, వినియోగ వ్యయ సర్వేల ఆధారంగా మరింత తరచుగా బరువులను పునఃసమీక్షించే విధానం అవసరం. భారత్ కొత్త సీపీఐలో 2024ను ఆధార సంవత్సరంగా ఎంచుకోవడం ద్వారా ఈ దిశగా ముందడుగు వేసింది.ధర మారకపోయినా... ఖర్చు పెరగవచ్చుఇటీవలి కాలంలో సూపర్ మార్కెట్లలో తరచూ చూస్తున్న ‘ష్రింక్‌ఫ్లేషన్’ మరో సమస్య. నిత్యావసరమైన ‘పాలు’ ఉదాహర ణగా తీసుకుందాం. 500 మిల్లీలీటర్ల ఉత్పత్తి స్థానంలో అదే ధరకు 400 మిల్లీలీటర్లు లభిస్తే, ధర పెరగకపోయినా వినియోగదారుడి వాస్తవ ఖర్చు పెరుగుతుంది. సీపీఐలో ఉత్పత్తి పరిమాణం లేదా ఉత్పత్తి లక్షణాలు మారినప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకునే విధానం ఇప్పటికే ఉంది. అయితే వేలాది ఉత్పత్తుల ప్యాక్ పరిమాణాలు మారుతూ ఉండే రిటైల్ మార్కెట్లో, ఇటువంటి మార్పులను సకాలంలో గుర్తించి, యూనిట్ ధరలో వచ్చిన మార్పును త్వరితంగా నమోదు చేయడానికి ఈ–కామర్స్, రిటైల్ స్కానర్ డేటాను విస్తృతంగా ఉపయోగించాల్సి ఉంటుంది. బ్రిటన్ 2026లో గ్రోసరీ స్కానర్ డేటాను సీపీఐలో ఇముడ్చుతూ, పరిమాణ మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. వస్తువుల నాణ్యత మారినప్పుడు కూడా కొత్త సీపీఐలో నాణ్యత సర్దుబాటుకు ప్రత్యేక విధానం ఉంది. అయితే స్మార్ట్ఫోన్లు, కంప్యూ టర్లు వంటి వేగంగా మారే ఉత్పత్తుల్లో కెమెరా సామర్థ్యం, స్టోరేజ్, ప్రాసెసింగ్ వేగం వంటి లక్షణాల విలువను, బ్రిటన్ , అమెరికాల తరహాలో విడివిడిగా అంచనా వేసే ‘హెడానిక్ ప్రైసింగ్’ (వస్తువు ధరలో దాని వివిధ లక్షణాల వాటాను విడిగా అంచనా వేసే పద్ధతి)ని విస్తృతంగా ఉపయోగిస్తే, ఉత్పత్తుల ధరల్లో వచ్చిన వాస్తవ మార్పులను సూచీలు మరింత నిక్కచ్చిగా ప్రతిబింబించగలవు.జాతీయ సగటు సరే, మా ఇంటి పరిస్థితేంటి?మొదట, ప్రస్తుత జాతీయ సీపీఐకి తోడుగా వివిధ ఆదాయ వర్గాలకు ప్రత్యేక వినియోగ బరువులతో సూచీలను రూపొందిస్తే, ధరల పెరుగుదల దిగువ, మధ్య, ఎగువ ఆదాయ కుటుంబాల జీవనవ్యయాన్ని విడివిడిగా, మరింత కచ్చితత్వంతో చూపిస్తుంది. రెండవది, ప్రతి కుటుంబానికి వ్యక్తిగత ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే డిజిటల్ సాధనాన్ని ప్రభుత్వం అందించవచ్చు. ఒక కుటుంబం ఆహారం, ఇంధనం, విద్య, ఆరోగ్యం, అద్దె తదితరాలపై తన నెల వారీ వినియోగాన్ని, ఖర్చును నమోదు చేస్తే, అదే సీపీఐ ధరల డేటాను ఉపయోగించి ఆ కుటుంబం ప్రత్యక్షంగా అనుభవించే వాస్తవ ద్రవ్యోల్బణాన్ని లెక్కించవచ్చు. అటువంటి సూచీ వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలకు దోహదపడుతుంది. కెనడాలో ఇప్పటికే ఇలాంటి అధికారిక వ్యక్తిగత ద్రవ్యోల్బణ కాలిక్యులేటర్ ఉంది. మూడవది, ధరల పెరుగుదలతో పాటు పన్నుల అనంతరం మిగిలే ఆదాయంలో మార్పును కూడా పరిగణనలోకి తీసుకుని, ఒక కుటుంబం వాస్తవంగా ఎంత కొనుగోలుశక్తిని కోల్పోయిందో లేదా పొందిందో చూపించే ‘నికర వాస్తవ కొనుగోలు శక్తి సూచీ’ని అభివృద్ధి చేయవచ్చు. ఆదాయంలో మార్పు, ప్రత్యక్ష పన్నుల భారం వంటి అంశాలను సమన్వయం చేసే ఈ సూచీ, ‘నా ఆదాయం పెరిగినా నా చేతిలో మిగిలే డబ్బు ఎందుకు పెరగడం లేదు?’ అనే సామాన్యుడి ఆవేదనకు గణాంకపరమైన సాంత్వన చేకూర్చుతుంది. భారత్ కొత్త ద్రవ్యోల్బణ శ్రేణిలో 1,465 గ్రామీణ, 1,395 పట్టణ మార్కెట్లతో పాటు 12 ఆన్ లైన్ మార్కెట్ల నుంచి ధరలను, ఈ–కామర్స్, టెలిఫోన్ , విమాన ప్రయాణం, ఓటీటీ వంటి విభా గాల్లో ఆన్ లైన్ డేటాను కూడా ఉపయోగిస్తోంది. తదుపరి దశలో జీఎస్టీ, ఈ–ఇన్ వాయిస్ డేటా, ఈ–కామర్స్ విక్రయాలు, రిటైల్ స్కానర్ డేటా వంటి వనరులను... ధరలతో పాటు కొను గోలు పరిమాణాలను అంచనా వేయడానికి ఉపయోగిస్తే ష్రింక్ ఫ్లే్లషన్ వంటి ధోరణుల ప్రభావాన్ని కూడా మరింత కచ్చితత్వంతో అంచనా వేయవచ్చు. కొన్ని యూరోపియన్ దేశాలు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.కృష్ణ బాలాజి పల్లపోతువ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు -
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం.. ఎటు పోతోంది?
ఒకప్పుడు పాలకులు మతం గురించి పదే,పదేమాట్లాడే వారు కారు.మూఢ విశ్వాసాలను ప్రోత్సహించేవారు కారు. బాణామతి,చేతబడి వంటి వాటిని అరికట్టడానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకునేవారు. మతం,దైవ భక్తి అన్నవి వ్యక్తిగత విషయాలుగానే భావించేవారు.కాని కాలం మారింది. శాస్త్రీయ దృక్ఫధం స్థానంలో మతాల ప్రస్తావన అధికంగా వస్తోంది. ప్రజలు భక్తిని, మతాన్ని ఆచరించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అలాగే ఆయా ఉత్సవాలలో, మతపరమైన కార్యక్రమాలలో ప్రజలకు ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని ఎవరూ ఆక్షేపించరు. కాని ఇప్పుడేం జరుగుతోంది. వాటిని కూడా రాజకీయాలకు వాడుకోవడానికి నేతలు పోటీ పడుతున్నారు.తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే రాజకీయం ఇలా తయారవుతోందేమిటా అన్న ఆవేదన కలుగుతుంది. రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ బిఆర్ఎస్పై చేతబడుల విమర్శ చేశారు. 'పదేళ్లు అధికారంలో ఉన్నవారు, పాతికేళ్లు తెలంగాణలో రాజకీయం చేసినవారు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ,ప్రజలకు వ్యతిరేకంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి చేతబడులు ,అఘోరా పూజలు చేయించడం అత్యంత దుర్మార్గం "అని రేవంత్ వ్యాఖ్యానించారు. బుద్ది సరిగా లేకపోతే ఆ క్షుద్ర పూజలు తిరగబడతాయి అని ,అదే కనుక జరిగితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా అష్టదిగ్భందనం చేస్తాయి అని ఆయన హెచ్చరించారు. 'ఎల్ నిలో ప్రభావంతో రాష్ట్రం ఎండిపోవాలని,కరువు వచ్చి జనాలు అల్లాడిపోవాలని ప్రభుత్వం బదనాం కావాలని అఘోరా పూజలు చేశారు "అని ఆయన ఆరోపించారు. అయితే దేవుడు ,అదృష్టం తమ వైపే ఉన్నాయని, తమ సంకల్పం మంచిది కాబట్టి ఈ సమయంలోను వర్షాలు కురిశాయని రేవంత్ చెప్పారు. తమకు దేవుడి దయ, ప్రజల ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఎందుకు వచ్చింది? కొద్దికాలం క్రితం బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి.హరీష్ రావు కర్నాటకలో కొన్ని గుడులను సందర్శించారు. అది ఆయన వ్యక్తిగత స్వేచ్చ. నమ్మకం. కాని కాంగ్రెస్ అధికార ప్రతినిది సామా రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరీష్ రావు క్షుధ్రపూజలు చేయించడానికి గుడులకు వెళ్లారని ఆరోపించారు. దీనిపై హరీష్ రావు మండిపడ్డారు. తాను అలాంటివి చేయలేదని, ఇలా మాట్లాడిన కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపుతున్నట్లు ప్రకటించారు. అయినా కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ వివాదంలోకి వచ్చి, తన వద్ద ఆధారాలు ఉన్నాయని హరీష్‌పై మళ్లీ ఆరోపణలు చేశారు. తదుపరి ఏకంగా ముఖ్యమంత్రి రేవంతే ఈ అభియోగం మోపారు. ఇలాంటివి చెబుతున్నారంటే వీటిని వీరు నమ్ముతున్నారనే కదా! వ్యక్తిగతంగా ఎలాంటి విశ్వాసం అయినా పెట్టుకోవచ్చు. కాని ప్రజలలో మాట్లాడడానికి ముందు వీటి ప్రభావం గురించి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో బాణామతి అనే అంధ విశ్వాసం ఉండేది. బాణామతి, చేతబడులు చేస్తున్నారన్న అనుమానంతో కొందరిపై దాడి జరిగేది. కొంతమంది ఈ క్రమంలో హత్యలకు కూడా గురైన సందర్భాలు ఉండేవి.క్షుధ్రపూజలు చేస్తున్నారన్న సందేహంతో నోటిలోని పళ్లు కూడా పీకేసిన కేసులు కూడా నమోదయ్యేవి.హైదరాబాద్ నగరం విస్తృతం అవడం,శాస్త్ర విజ్ఞానం పెంపొందడంతో ఇవి ఇటీవలికాలంలో బాగా తగ్గాయి.ఈ తరుణంలో సి.ఎమ్.స్థానంలో ఉన్నవారు ఈ క్షుద్రపూజల గురించి మాట్లాడడం వల్ల రాజకీయంగా ఆయనకు ఎంత లబ్ది చేకూరుతుందో కాని,ప్రజలలో మాత్రం మూఢ విశ్వాసాలు మరింత పెరగడానికి దోహద పడతాయి. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశంలో శాస్త్రీయ దృక్ఫధం పెరగాలని వాంచించారు. ఇందుకోసం ఐఐటి వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలను నెలకొల్పారు. అలా అని ఆయనకు మతపరమైన విశ్వాసాలు లేవని కాదు. తను మరణించిన తర్వాత చితాభస్మాన్ని పవిత్రమైన నదులులో కలపాలని కోరుకున్నారు. తదుపరి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కంప్యూటర్ వినియోగాన్ని ప్రోత్సహించారు.పివి నరసింహారావు ప్రదానిగా ఉన్నప్పుడు చంద్రస్వామి అన్న తాంత్రికుడు చక్రం తిప్పేవారని ప్రచారం జరిగేది. అయినా ఆయన మత విశ్వాసాలు ఎలా ఉన్నా, బాబ్రి మసీదు కూల్చివేసిన ఘటనపై తీవ్రంగా ఆవేదన చెందారు. నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డితో సహా ఆయా ముఖ్యమంత్రులకు కొందరు జ్యోతిష్కులపైన, పండితులపైన నమ్మకాలు ఉండేవి. అయినా వారు ఆ నమ్మకాలను ప్రజలపై రుద్దాలని భావించలేదు. బహిరంగ సభలలో వాటి గురించి పెద్దగా ప్రస్తావన తెచ్చేవారు కారు. భారతీయ జనతా పార్టీ దేశంలో విస్తృతం అయ్యే కొద్ది ఈ మతపరమైన విశ్వాసాలు పెరుగుతూ వచ్చిన మాట నిజమే.కాని అదే పార్టీకి చెందిన కొందరు నేతలు మూడ విశ్వాసాలకు వ్యతిరేకంగా కూడా మాట్లాడేవారు.కరువు పరిస్థితులు ఇప్పుడే కాదు.గతంలో కూడా వచ్చేవి.అప్పుడు కూడా కొందరు ముఖ్యమంత్రులు వరుణ యాగాలు చేయించారు.కొద్ది రోజుల క్రితం రేవంత్ కూడా సాగర్ వద్ద వరుణ యాగం నిర్వహించారు. గత ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా సందర్భాలలో యాగాలు, యజ్ఞాలు చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు రాజకీయాలలోకి వచ్చాక ,మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ వంటివారు స్వామిజీ అని సంభోధించేవారు.అయినా ఎన్.టి.ఆర్.తను నటించిన పలు సినిమాలలో ఈ మూఢ విశ్వాసాలకు , మతం పేరుతో మోసాలు చేసేవారికి వ్యతిరేకంగా పలు సన్నివేశాలు పెట్టేవారు.ప్రభుత్వంలో ఉన్నప్పుడు మతపరమైన అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.అలా అని ఆయనకు దైవం పై నమ్మకం లేదని కాదు.ప్రస్తుత ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు పెద్దగా మతపరమైన రాజకీయాలు చేసేవారుకారు. బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో ఆ పార్టీ మసీదులు కూల్చే పార్టీ అని విమర్శించేవారు.రాజకీయంగా తనకు లాభం జరుగుతుందనుకున్నప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకునేవారు. ఒకరకంగా చెప్పాలంటే అవకాశవాద రాజకీయాలు చేయడంలో ఆయనకు సాటి లేరనుకోవవచ్చు. 2019లో ఓటమి ఎదురైన తర్వాత అప్పటి వైసిపి ప్రభుత్వాన్ని ,ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ను ఓడించాలంటే మతపరమైన విమర్శలు చేయాలని తలపెట్టేవారు. కొత్త పూజారికి పంగనామాలు ఎక్కువ అన్న సామెత ఉంది. దానికి అనుగుణంగా ఉన్నవి, లేనివి ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎక్కడా సంకోచించలేదన్న అభిప్రాయం ఉంది.2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దోరణి మరింతగా పెరిగింది. తిరుమల స్వామివారి ప్రసాదంపై వివాదం సృష్టించి దానిని జగన్ కు ఆపాదించడం వరకు వెళ్లారు.జగన్ ఆలయాలకు వెళ్లడాన్ని కూడా ఆక్షేపించేవరకు వెళ్లి మీ దేవుడు,మా దేవుడు అంటూ వ్యాఖ్యలు చేసే దశకు చేరుకున్నారు.బహిరంగ సభలలో ఇలాంటి ప్రసంగాలు చేయడం అలవాటుగా చేసుకున్నారు. అమరావతి దేవత రాజధాని అంటూ కొత్త నినాదం చేబూని ప్రజలను ఆకర్షించే పనిలో ఉంటున్నారు.రాజధానిలో జరిగే అక్రమాలు, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు ఇలా మతాన్ని,దేవుడిని అవసరం ఉన్నా,లేకపోయినా ప్రస్తావిస్తున్నారని ఆయన ప్రత్యర్ధులు విమర్శిస్తుంటారు. ఇక ఈ మధ్య మరో అడుగు ముందుకేసి శ్రీవెంకటేశ్వర స్వామి వద్దకు వర్చువల్ గా వెళ్లానని అంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం సజావుగా సాగాలని ప్రార్ధించానని ఆయన చెబుతున్నారు.ఎల్లో మీడియా గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడానని చెబుతున్నారంటూ ఒక తప్పుడు కధనాన్ని సృష్టించి ప్రచారం చేసింది. ఇప్పుడు చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను మాత్రం పెద్దగా కనిపించకుండా జాగ్రత్తపడడం గమనించదగ్గ అంశం.చివరిగా ఒక మాట చెప్పాలి. ప్రముఖ ఆధాత్మిక వేత్త,ఎపి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు ఒక వ్యాఖ్య చేశారు.రాజు ధర్మాన్ని పాటించకపోతే వర్షాలు కురవవని ఆయన తన ధార్మిక ప్రసంగంలో చెప్పారు. వర్షాలు పడకపోవడానికి ఎల్ నిలో కారణమని నమ్మమంటారా?లేక చాగంటి అభిభాషించినట్లుగా రాజు ధర్మంగా లేకపోవడం వల్లనే అని అనుకోమంటారా?అంటే ముఖ్యమంత్రులు ఏమి చెబుతారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
తల్లి ప్రేమకు, విశ్వాసానికి ప్రతీకగా సెయింట్ హెలెనా
రోమన్ కతోలికుల ఉనికికే ప్రాణం పోసిన మహామహిళ సెయింట్ హెలెనా. రోమ్ మొదటి క్రిస్టియన్ చక్రవర్తి ‘కాన్స్టాంటైన్ ద గ్రేట్’ను కన్న వీరమాత. అది రోమా సామ్రాజ్యం మహా వైభవోపేతంగా ఉన్న కాలం! సాధారణ కుటుంబంలో హెలెనా జన్మించింది. చిన్ననాటి నుంచే భయ భక్తుల్లో పెరగబట్టి ఆమెకు పెద్దల పట్ల వినయం, సమాజం పట్ల దయ, దేవునిపై విశ్వాసం అనే సద్గుణాలు అలవడ్డాయి. ‘రోమన్ కేథలిక్కులు’ అనే పేరులో రోమన్ పదం చేరడానికి కారకులు ఈ తల్లీకొడుకులు. ఇదెలా జరిగింది?ఒకానొకపుడు క్రైస్తవుల్ని నానాహింసల పాలు చేసిందీ, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నదీ ఈ రోమన్ పాలకులే. కానీ పేదరికం అనుభవించినా గొప్ప విశ్వాసకురాలైన తల్లి ఉద్బోధనల వల్ల, కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవ మతానికి అనుకూలంగా మారాడు. ఈ నేపథ్యంలో రోమన్ దేశంలో చిన్నగా కదలిక ప్రారంభమైంది. ‘యేసు ప్రభువు నడిచిన పవిత్ర స్థలాలను దర్శించాలి; ఆయన ప్రేమను ప్రపంచానికి గుర్తు చేయాలి’ అని హెలెనా యెరూషలేముకు పవిత్ర యాత్ర చేసింది. అక్కడ యేసు ప్రభువు శిలువ వేయబడిన స్థలాన్ని వెతికింది. సంప్రదాయం ప్రకారం, ఆమె అక్కడ శిలువకు సంబంధించిన పవిత్ర అవశేషాలను కనుగొన్నట్లు చెబుతారు.ఆమె ఆ పవిత్ర స్థలాలను గౌరవంగా సంరక్షించి, అక్కడ ప్రార్థనా మందిరాల నిర్మాణానికి సహాయం చేసింది. ముఖ్యంగా యెరూషలేములోని ‘చర్చ్ ఒఫ్ ద హోలీ సెపుల్చెర్’ నిర్మాణానికి ఆమె సహకారం అందించింది. దేవుని ప్రేమను పంచిన హెలెనా క్రీ.శ. 330లో మరణించినా, ఆమె పేరు మాత్రం శతాబ్దాల తరువాత కూడా విశ్వాసం, త్యాగం, తల్లి ప్రేమకు ప్రతీకగా నిలిచిపోయాయి.– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు -
సరైన దారిలో 'కాక్రోచ్ సీజన్ 2'
దేశం ఈ నెల 15న 80వ స్వాతంత్య్ర సంవత్సరంలోకి ప్రవేశించిన వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఒక అపూర్వమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని పేరు ‘స్కూల్స్ ఠీక్ కరో’, లేదా ‘ఫిక్స్ రూరల్ గవర్నమెంట్ స్కూల్స్’. సీజేపీ ఉద్యమం మొదలైందే విద్యారంగ సమస్యలపై. ఈ దేశ భవిష్యత్తు ఆధారపడింది విద్యా వ్యవస్థపై అనీ, అది పేదలకూ, గ్రామీణులకూ అందుబాటులో లేకుండా పోయిందనీ, కనుక ఈ సమస్యపై మొత్తం దేశాన్ని కదిలించేందుకు ప్రయత్నించగలమనీ నిర్వాహకులు ప్రకటిస్తున్నారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో మొదటి రెండు రోజులపాటు జరిగిన కార్యక్రమాల వీడియోలు, వార్తలు అందుబాటులోకి వస్తున్నాయి. సీజేపీ వ్యవస్థాపకుడైన అభిజీత్ దీప్కే తన స్వస్థలమైన ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పిల్లల మధ్య కూర్చుని, వివిధ సౌకర్యాలు, బోధనా పరిస్థితుల గురించి వారిని చిన్న చిన్న ప్రశ్నలు వారి మాతృభాష మరాఠీలో అడుగుతూ నోట్స్ రాసుకోవటం కన్పించింది. ఆ పిల్లలు ఉత్సాహంగా చెప్తున్నారు. అదే రోజున సీజేపీ ఇతర బాధ్యులు, ఇంకా వందలాది మంది కార్యకర్తలు వేర్వేరు రాష్ట్రాలలోని వేర్వేరు గ్రామాలలో అదే పని చేశారు. నూతన ఉద్యమ వాతావరణంగమనించదగిన విశేషం మరొకటి జరిగింది. జంతర్ మంతర్ ఉద్యమస్ఫూర్తితో అంతటా ఒక కొత్త వాతావరణం ఏర్పడినందున, అనేకచోట్ల సీజేపీ బాధ్యులెవరూ లేకుండానే బడిపిల్లలు ఈ ‘స్కూల్స్ ఠీక్ కరో’ కార్యక్రమం గురించి విని, తమంతట తామే తమ బడులలో వివిధ సౌకర్యాల లేమిపై పాఠశాల పెద్దలనే కాక, సమీపాన గల ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి ప్రశ్నించటం కనిపించింది. ఇదే చైతన్యం దేశమంతటా వ్యాపిస్తే? వ్యాపింపజేయటమే జంతర్ మంతర్ తర్వాత తమ తదుపరి కార్యక్రమమని సీజేపీ ప్రకటించింది. దానిని ‘సీజన్–2’ ఉద్యమ మంటున్నది. అందులో భాగంగా చేపట్టే కార్యక్రమం కోసం ఒక ఫారాన్ని తమ వెబ్సైట్లో పెట్టింది. దాని ద్వారా ఎవరైనా సభ్యు లుగా చేరి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. యథాతథంగా కార్యక్రమంలో చేయవలసిన పనులు మూడు విధాలు. ఒకటి– మంచినీళ్ళు, టాయిలెట్ సౌకర్యాల పరిస్థితి.రెండు– విద్యుత్తు, తరగతి గదులు, వాటి భద్రత. మూడు– ప్రహరీ గోడలు, భద్రత. ఇదంతా మొదటి విధమైన పని. రెండవ విధమైన దానిలో కార్యకర్తలు లైట్లు, ఫ్యాన్లతో సహా వీట న్నింటిని ఫొటోలు, వీడియోలు తీయాలి. అగ్నిమాపక సిలిండర్లు ఉన్నాయో లేదో చూడాలి. మూడవ విధమైన పని ఈ వివరాలన్నీ అధికారులకు అందజేయటంతో పాటు, సీజేపీ అడ్రసుకు అప్లోడ్ చేయాలి. మన దేశం స్వతంత్రమైనప్పటినుంచి విద్యారంగానికి సంబంధించి ఆధా రాలతో అధికారులను ఒత్తిడి చేయటం వంటి కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఎన్నడూ జరగలేదు. గమనించదగిన మరొకటి, నెహ్రూ కాలంలోనూ ఉన్నత విద్యపై తప్ప గ్రామీణ విద్యపై, ప్రాథమిక విద్యపై తగిన శ్రద్ధ చూపలేదు.అయినా అణచివేతలా?సీజేపీ కార్యక్రమం ఏ విధంగా సాగి ఎటువంటి ప్రభావాలు చూపగలదో ఇప్పుడే చెప్పలేము. విద్యారంగానికి సంబంధించి వారి అవగాహనలు, ఆలోచనలు, లేవనెత్తుతున్న ప్రశ్నలు, తలపెట్టిన కార్యక్రమాలు మాత్రం సమగ్రంగా కనిపిస్తున్నాయి. వాటిలో లోతు, దూరదృష్టి ఉన్నాయి. విద్యార్థి లోకంలో, వారి తండ్రులలో, సమా జంలో, ఆలోచనాపరులలో మద్దతు పెరుగుతున్నది. మరొక విషయం, ఆ నిర్వాహకులపై, వారి కార్యక్రమాలపై వ్యతిరేకత, అణచివేత చర్యలు జంతర్ మంతర్ దశ తర్వాత కూడా కొనసాగు తుండటం. ఉదాహరణకు, తమ ‘స్కూల్స్ ఠీక్ కరో’ కార్యక్రమ ప్రకటనకు ఢిల్లీలో కార్యకర్తల సమావేశాన్ని జరపచూడగా, అందు కోసం హాలును ఇవ్వకుండా యజమానులను బెదిరించారు. చివరకు ఒక పార్కులో సమావేశమవుతుండగా పోలీసులను పంపి గేట్లకు తాళాలు వేశారు. గట్టిగా ప్రశ్నించిన మీదటగానీ తెరవలేదు. ఇటువంటి నిర్హేతుకతలు, అణచివేతల ప్రభావం, దేశమంతటా ఇప్పటికే జంతర్‌మంతర్ సృష్టించిన ప్రభావాలను మరెంత పెంచు తుందో అధికారంలో గల వారికి అర్థం కావటం లేదు. జంతర్ మంతర్ దరిమిలా స్వయంగా ప్రధాని మోదీ, ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ విద్యారంగం గురించీ, యువ తరం అసంతృప్తి న్యాయబద్ధం కావటం గురించీ చెప్పిన మాటలను గమనించినప్పుడు, ఈ అణచివేతలు విచిత్రంగా తోస్తాయి.ప్రభుత్వ విద్యారంగం బాగుపడక ప్రైవేట్ రంగం మాత్రమే వర్ధిల్లినంత కాలం సాధారణ కుటుంబాల పిల్లలు చదువులో ముందుకుపోలేరు. అందువల్ల వారికేగాక దేశానికి కూడా నష్టమే. కనుక విద్యారంగానికి బడ్జెట్లను జీడీపీలో ఆరు శాతానికే కాదు,అంతకు మించి పెంచాలి. నివేదికలను అమలుపరచాలి. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పించి విద్యాబోధనను మెరుగుపర చాలి. ఈ దిశలో తమ తొలి దశ కార్యక్రమాన్ని ఆరు మాసాలపాటు సాగి స్తారు. ఇది క్రమంగా ఊపందుకుని దేశవ్యాప్తమైన కొద్దీ కొత్త పరిస్థితులను చూడగలమని ఆశించవచ్చు. వారు మూతపడిన 94 వేల స్కూళ్ల గురించి కూడా ప్రశ్నిస్తున్నందున వాటిని తిరిగి తెరవటం, ఇక ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మూసివేత లను కొనసాగించకపోవటం కూడా జరుగుతుందని ఆశించాలి.క్యా బోల్తీ పబ్లిక్?పోతే, కాక్రోచ్ సీజన్ 2 సరైన మార్గంలో ముందుకు సాగుతున్న సూచనలు ఇతరత్రా కూడా ఉన్నాయి. వారి కోర్ కమిటీ ఈ నెల మొదటి వారంలో రెండు రోజులపాటు చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తాము విద్యతో పాటు ప్రజలకు సంబంధించిన ఇతర సమస్యలపై ప్రభుత్వాలను ఒత్తిడి చేసే ఉద్యమంగానే ఉంటాము తప్ప రాజకీయాలలోకి ప్రవేశించబోమన్న అంతకుముందటి వైఖరినే పునరుద్ఘాటించటం వాటిలో మొదటిది. అందువల్ల వారి విశ్వసనీయత పెరిగి, పునాది స్థిరపడి విస్తరిస్తుంది. అదే సమావేశంలో సంస్థ బాధ్యుల టీమ్‌ను ప్రకటించటంతోపాటు, దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నలుగురు ఇన్ఛార్జ్లను నియమించుకున్నారు. కార్యాచరణకు సంబంధించి, ఈ సెప్టెంబర్ నుంచి, దేశమంతటా పర్యటనలు జరిపి ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరిట అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలూ, ఆలోచనలేమిటి? ఏమి జరగాలనుకుంటున్నారు? అనేవి తెలుసుకోవటం; దాని ఆధారంగా భవిష్యత్తు అజెండాలను, కార్యాచరణను రూపొందించటం.ఎంతో సంయమనంతో, ప్రజాస్వామికంగా, శాంతియుతంగా ప్రజలతో సమన్వయమవుతూ ముందుకు సాగేందుకు సీజేపీ ప్రయత్నిస్తున్న తీరును, అందుకు సమాజంలో కనిపిస్తున్న సానుకూలతలను గమనించినప్పుడు, మన దేశపు 80వ స్వాతంత్య్ర సంవత్సరంలో కొత్త గాలులు మొదలుకానున్నాయా అనే సూచనలు కనిపిస్తున్నాయి. స్వాతంత్య్రానంతర దేశం 1991 నాటి ఆర్థిక సంస్కరణలతో ఒక కొత్త మలుపు తిరగగా, ఈ 2026లో మరొక మలుపు తిరిగే అవకాశమున్నదా? ఈ ప్రశ్నలు ఇప్పటికే ఆలోచనా పరుల మెదళ్లకు మేతగా మారాయి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నమ్మిన దైవమే గట్టెక్కించే దారి చూపుతుంది..
హిరణ్యకశిపుడు ఒక రోజు ఆలోచనలో పడ్డాడు. ‘అమరుల తల్లి కంటె మా అమ్మ పెద్దది. త్రిలోక రాజ్య భోగములు నాకు దక్కాలి గాని ఆ భోగాలకు అమరులెట్లా అర్హులౌతారు? ఉగ్రతపంతో కానివి లేవు కాబట్టి తపోనిష్ఠతో బ్రహ్మను మెప్పించి, ముల్లోకాధిపత్యాన్ని నేను దక్కించుకుంటాను!’ అని నిశ్చయించుకున్నాడు.తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అతడి ఉగ్రతపస్సుకు దేవేంద్రుడు భయపడ్డాడు. దేవగురువైన బృహస్పతిని చెంతకు పిలిపించుకుని, ‘తండ్రి ఒక్కడే. తల్లులు మాత్రం మాకు వేరు. జగత్సామ్రాజ్య పూజ్యనీయత తనకు దక్కాలని దైతేయుడైన హిరణ్యకశిపుడు, బ్రహ్మదేవుడి నుండి వరం పొందాలని ఉగ్రతపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సుకు జగములు తల్లడిల్లే పరిస్థితి వస్తున్నది కాబట్టి వేరే మార్గం కనపడక అడిగినది వరంగా ఇచ్చేస్తాడు బ్రహ్మదేవుడు. అది తప్పిపోయే మార్గం చెప్పండి, గురుదేవా!’ అని ప్రాధేయపడ్డాడు.సురేంద్రుడి భయాన్ని అర్థం చేసుకున్న బృహస్పతి ‘భయపడవలసింది లేదు. విష్ణుద్వేషం, నిరంతర దోషం, శ్రుతిధర్మ విరోధం, సుజన నిరోధం లక్షణాలుగా కలిగిన అసురులను శ్రీహరి క్షమించడు. కనుక నారాయణ మంత్రాన్ని నిత్యం పారాయణం చెయ్యి!’ అని చెప్పి ఆ మంత్ర మహత్యాన్ని గురించి ఇలా వివరించాడని ఎఱ<న శ్రీనృసింహపురాణంలో చెప్పాడు.క. తను నెబ్భంగి దలంతురుజను లాభంగిన తలంచు సరసీరుహలోచనుడును వారల గావునననిశంబు కృతార్థమతులు హరిపద భక్తుల్.‘తనను ఎంత గాఢమైన భక్తితత్పరతతో పూజిస్తారోఅంతే గాఢమైన తలపుతో వారిని శ్రీహరి రక్షిస్తాడు. అందువలననే శ్రీహరిని భక్తితో కొలిచేవారికి కలగని సుఖములు లేవు!’ అని కర్తవ్యాన్ని బోధించి సురేంద్రుడి కలతను, కష్టాన్ని తీర్చాడు బృహస్పతి. తాను ఎదుర్కొనలేని ఆపదలో చిక్కుకున్న వేళ, వ్యర్థంగా కలత చెందడం మాని నమ్మిన దైవాన్ని శరణు వేడితే, ఆ ఆపద నుంచి గట్టెక్కే మార్గం కనపడుతుందని పై సన్నివేశం విదితం చేస్తుంది.– భట్టు వెంకటరావు -
సమస్య వైపు పరుగెత్తు!
నేను చాలా ప్రసంగాలు చేశాను. కానీ ఇది నాకు వ్యక్తిగతమైనది. 1986 చలికాలంలో మిట్లో చేరాను. నా తల్లిదండ్రులు నన్ను నెక్ట్స్ హౌస్ హాస్టల్లో దింపి వెళ్లారు. అప్పుడు నాకు 17 ఏళ్లు. నేను తైవాన్‌లో పుట్టాను. అమెరికాలోని క్వీన్స్ ప్రాంతంలో పెరిగాను. గణితంలో నేను దిట్ట అని నమ్మేదాన్ని! కానీ రెండు వారాల్లోనే ఒక విషయం అర్థమైంది: ఎంఐటీలో గణితంలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు! మొదటి అసైన్మెంట్లను చూస్తూ అనుకున్నాను: ‘అయ్యో! ఇవి ఎంతో కష్టంగా ఉన్నాయి!’ నేను కాలేజీకి (ఫ్రెష్మన్ ఇయర్‌కు) వచ్చేవరకు ఎప్పుడూ రాత్రంతా నిద్రలేకుండా చదవడం లేదా పనిచేయడం అనేది లేదు. మిట్లో చేరాక ఆ అనుభవం కొత్తగా ఉన్నా... క్లాస్‌మేట్స్‌తో కలిసి పని చేయడం సరదాగా అనిపించింది. మిట్ మనల్ని ఊహించిన దానికంటే ఎంతో ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన మార్గాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు సమస్యలతో కుస్తీ పడతారు. ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒకటి రెండు సర్క్యూట్లు పేలిపోవచ్చు. కానీ ఏదోలా చివరకు ఆ పని పూర్తవుతుంది. అప్పుడు మీరే స్వయంగా ఏదో ఒకటి తయారు చేయగలరని మీకు అర్థమవుతుంది. సెమీకండక్టర్లతో ప్రేమమిట్లో డిగ్రీ (అండర్ గ్రాడ్యుయేట్) చదువుతున్నప్పుడే రీసెర్చ్‌లో పనిచేసే అవకాశం రావడం నా జీవితాన్నే మార్చేసింది. ఎక్స్–రే లిథోగ్రఫీ మాస్క్ బ్లాంక్స్ తయారు చేయడం ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం. అప్పట్లో దాని అర్థం ఏమిటో కూడా నాకు పూర్తిగా తెలి యదు. కానీ నా మొదటి ‘బన్నీ సూట్’ (క్లీన్ రూమ్‌లో వేసుకునే ప్రత్యేక దుస్తులు) వేసుకుని... చిన్న 2–అంగుళాల వేఫర్లపై పరికరాలు తయారు చేయడం ప్రారంభించాను. ఆ వేఫర్లు సున్నితంగా ఉంటాయనీ, పొరపాటున కూడా వాటిని పగలగొట్టకూదడనీ త్వరగానే గ్రహించాను. నేను ఎన్నో ప్రయోగాలు చేశాను. వాటిలో ఎక్కువ శాతం మేము ఆశించిన విధంగా పనిచేయలేదు. పద్ధతి మార్చుకుని, మళ్లీ ప్రయత్నించాం. నేను తరగతి గదిలో టెక్నాలజీ గురించి చదవడం మాత్రమే చేయలేదు; కొత్త విషయాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్న ఒక బృందంలో భాగమయ్యాను. నాకైతే అప్పట్లో ఒకటే ఆలోచనొచ్చింది. వావ్, మనం ఇంత చిన్న వస్తువులను కూడా తయారు చేయగలమా? కానీ ప్రపంచాన్నే మార్చగల శక్తిమంతమైన చిన్న పరికరాలు ఇవి. అప్పుడే నేను సెమీ కండక్టర్లతో ప్రేమలో పడ్డాను. అక్కడే నేను సమస్యలను ఎలా పరిష్కరించాలో అసలు సిసలు పాఠాలు నేర్చుకున్నాను. ఆ రంగా నికి కొత్తగా వచ్చిన విద్యార్థి స్థాయి నుంచి, స్వయంగా ఆ రంగానికి కొత్త విషయాలు అందిస్తున్న వ్యక్తిగా మారాను. ఆ ప్రయాణంలో, నా మీద నాకు నమ్మకం కలగడం మొదలైంది. అది నాకు ఎప్పుడూ అన్ని సమాధానాలూ తెలుసనే అతివిశ్వాసం కాదు; అసలు సమాధానం ఇప్పుడే తెలియకపోయినా దాన్ని నేను కనుగొనగలను అనే ఆత్మవిశ్వాసం. మిట్ నాకు సెమీకండక్టర్ ఫిజిక్స్ కంటే పెద్ద విషయాన్ని నేర్పిందని నాకు అర్థమవుతోంది. మైండ్ అండ్ హ్యాండ్ మిట్ మోటో ‘మైండ్ అండ్ హ్యాండ్’ కేవలం ఒక నినాదం అనుకున్నాను. కానీ అది మిట్ ప్రత్యేకతను సరిగ్గా తెలియజేస్తుందని భావిస్తున్నాను. మిట్ మనకు లోతుగా ఆలోచించడం నేర్పిస్తుంది. ఏదైనా తయారు చేయడం, ఆలోచనలను పరీక్షించడం, మొదటి ప్రయోగం లేదా ఐదో ప్రయోగం కూడా విఫలమైనా ఆగిపోకుండా ముందుకు సాగడం నేర్పిస్తుంది. ఒకప్పుడు అసాధ్యమని పించిన సమస్యలను కూడా మీరు పరిష్కరించగలరని మీపై మీకే నమ్మకం కలిగేలా చేస్తుంది. నేను క్యాంపస్ వదిలి వెళ్లిన చాలా కాలం తర్వాత కూడా అదే భావనతో ఉన్నాను. నేను ఐబీఎంలో చేరినప్పుడు,మళ్లీ మొదటి నుంచి ప్రారంభించినట్లు అనిపించింది. ఐబీఎంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు. అప్పట్లో నాకు 25 ఏళ్లు.అంత పెద్ద కంపెనీలో నేను ఎలా మార్పు తీసుకురాగలను అని ఆశ్చర్యపోయాను. కానీ త్వరగా ఒక ముఖ్యమైన విషయం తెలుసు కున్నాను. ఇంజినీరింగ్ మీ వయసును పట్టించుకోదు. మీ ఆలోచ నలు పనికొస్తాయా లేదా అనేదే చూస్తుంది. నా మెంటార్లలో ఒకరు నాకు చెప్పిన ఒక మాటను నేను ఎప్పటికీ మర్చిపోలేదు: అత్యంత కష్టమైన సమస్యల వైపు పరు గెత్తుకుంటూ వెళ్లు! అప్పట్లో అది నాకు పూర్తిగా అర్థం కాలేదు. కాలక్రమేణా, నా జీవితంలో లభించిన అత్యుత్తమ సలహా అదేనని అర్థమైంది. కష్టమైన సమస్యలే మీ అసలు సత్తా ఏమిటో మీకు తెలియజేస్తాయి. కొంచెం వెనక్కు వెళ్తే... 12 ఏళ్ల క్రితం, ఆ పాఠాన్ని నిజ జీవితంలో పరీక్షించి చూసే అవకాశం వచ్చింది. నాకు ఏఎండీ సంస్థకు సీఈఓ అయ్యే అవకాశం లభించింది. ఆ ఉద్యోగంలో చేరడం రిస్క్ అని నా మెంటార్లలో కొందరు భావించారు. కానీ ఇది నా డ్రీమ్ జాబ్ (కలల ఉద్యోగం). నిజంగా ప్రాముఖ్యత ఉన్న సమస్యలపై,సాంకేతిక రంగంలో కొత్త టెక్నాలజీతో పనిచేసే అవకాశం. భవి ష్యత్తులో అత్యంత కీలకమైన సాంకేతికత హై–పెర్ఫార్మెన్స్ కంప్యూ టింగ్ (అధిక పనితీరు గల కంప్యూటింగ్) అని మేము దీర్ఘకాలికంగా నమ్మాం. మా ప్రతిభావంతులైన బృందానికి పెద్ద ఆలోచనలు చేసే స్వేచ్ఛను ఇచ్చాం. తదుపరి కొన్ని సంవత్సరాలలో, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లను తయారు చేయడానికి వీలుగా మేము టెక్నాలజీని అభివృద్ధి చేశాం. భవిష్యత్‌ను నిర్ణయించేది మనుషులే!గడచిన కొన్ని దశాబ్దాలలో మనం అనేక సాంకేతిక మార్పులను చూశాం. ఇప్పుడు ఏఐ విప్లవానికి ప్రారంభంలో ఉన్నాం. ఏఐ మనుషులను భర్తీ చేయదు. బదులుగా, ప్రతి ఒక్కరి సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. వైద్యం, శాస్త్రం, ఇంధనం, వాతావరణం– ఏ రంగంలోనైనా, మనం గడిచిన ముప్పై ఏళ్లలో కనుగొన్న దానికంటే ఎక్కువ విషయాలను రాబోయే పదేళ్లలోనే కనుగొనవచ్చు. అయితే భవిష్యత్తు ఎలా ఉండాలనేది సాంకేతికత నిర్ణయించదు, మనుషులే నిర్ణయిస్తారు. శక్తిమంతమైన పరికరాలను ఎలా ఉపయోగించాలో తెలిసిన మనుషులు ప్రపంచానికి అవసరం లేదు. వాటిని ‘దేని కోసం’ ఉపయోగించాలో తెలిసిన మనుషులు కావాలి. నన్ను ఎవరైనా కెరీర్ సలహా అడిగితే, ఒకటే చెబుతుంటాను: కష్టపడి పనిచేయండి, కానీ అదృష్టం కూడా ముఖ్యం అని గ్రహించండి. కాలక్రమేణా నేను ఒక విషయాన్ని నమ్మడం మొదలు పెట్టాను. గొప్ప వ్యక్తులు తమ అదృష్టాన్ని తమంతట తామే సృష్టించుకునే మార్గాలను వెతుక్కుంటారు. అదృష్టం అంటే సరైన సమయంలో, సరైన స్థలంలో ఉండటమే కాదు. ఒక కష్టమైన పని చేయ డానికి రిస్క్ తీసుకోవడం. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోవడం. మీకు తెలిసిన విషయాల హద్దులు దాటి కొత్త సమస్యలను ఎంచుకోవడం. మిమ్మల్ని మరింత మెరుగుపరిచే వ్యక్తుల మధ్య ఉండటం. ‘అవును.. మనం ఈ ప్రపంచాన్ని మార్చగలము’ అని నమ్మడం. మీరు ఎంచుకునే సమస్యల విషయంలో పెద్ద ఆశయాలు కలిగి ఉండండి. అన్నింటికంటే కష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రండి! -
చంద్రశేఖరన్ (‘టాటా సన్స్’ చైర్మన్) రాయని డైరీ
వంతెనపై గమ్యాన్ని చేరుకోవాలంటే, వంతెన కంటే ముందు గమ్యాన్ని నిర్మించుకోవాలి. ‘టాటా’ వంతెనపై నాది 40 ఏళ్ల ప్రయాణం. వంతెనే నా కోసం గమ్యాన్ని నిర్మించినట్లుగా సాగిన జీవన యానం! టాటాలో ఇవి నా ఆఖరు నెలలు! 2027 ఫిబ్రవరి 20 నా చివరి రోజు. టాటా మహా సముద్రంలో ఒక అల కూడా ముందస్తు ప్రణాళికతో ఉంటుంది. దేశం 2026లో ఉన్నప్పుడు టాటా 2027లో ఉంటుంది. ‘‘చంద్ర తర్వాత ఎవరు?’’ అని ఏడాది ముందే ఈ ఫిబ్రవరిలో బోర్డు రూమ్‌లోకి ఒక ‘ప్రశ్న’... బంట్రోతులా వచ్చి నిలబడింది. టాటాలో బాస్ అయినా బంట్రోతు అయినా ఒకే వంతెనపై నడుస్తారు. ప్రశ్నలు రేకెత్తిస్తున్నంత కాలమే వారు ఆ వంతెనపై నడిచేందుకు అర్హులై ఉంటారు. సమాధాన పడిపోయే వాళ్లకు టాటాలో సీటు ఉంటే ఉండొచ్చు కానీ చోటు మాత్రం ఉండదు. నువ్వు ప్రశ్నిస్తున్నావంటే పనిలో ఉన్నట్లు! నువ్వు ప్రశ్నించటం మానేశావంటే, కేవలం ఉద్యోగం చేస్తున్నట్లు! ఇదీ టాటా సిద్ధాంతం. ‘‘చంద్ర తర్వాత ఎవరు’’ అన్నప్పుడు సగం మందికి పైగా వాటాదారులు ‘‘మళ్లీ చంద్రే’’ అన్నారు. బోర్డు కూడా ‘‘మళ్లీ చంద్రే’’ అంది. బోర్డు డైరెక్టర్లలో ఒక్క నోయెల్ టాటా మాత్రమే మౌనంగా ఉండిపోయారు. ఆర్నెల్లుగా ఇప్పటికీ ఆయన మౌనంగానే ఉన్నారు! మనం పుట్టి పెరిగిన ఇల్లే అయినా, ఇంట్లో మనతో మాట్లాడని మనిషి ఒక్కరున్నా అదిక మన ఇల్లవదు. ఇంటిని ఇంటిలా ఉంచాలంటే మనమే బయటికి వచ్చేయాలి. ఊహు... వచ్చేయటం కాదు, వెళ్లిపోవటం! రతన్జీ ఉండి ఉంటే, ‘‘ఎక్కడికి వెళ్తావ్ చంద్రా ఇంత రాత్రప్పుడు?!’’ అని నన్ను ఆపి ఉండేవారా... అది మిట్ట మధాహ్నమే అయినా – నా వెనకే అడుగులు వేసుకుంటూ వచ్చి! ఎందుకు వెళుతున్నదీ ఆయన అడగరు. ‘‘వెళ్లి ఏమౌతావు?’’ అన్నదే ఎవరి గురించైనా ఎప్పుడూ ఆయన ఆందోళన. ‘‘ఇంటిని గానీ, సంస్థను గానీ, ఆఖరికి మనిషినే గానీ ఎవరైనా వదిలి వెళ్లవలసి వచ్చిందంటే... వెళ్లాక వారెలా ఉండగలుగు తారు అనే ఆలోచన రావలసింది... ఆ ఇంటికి, ఆ సంస్థకు, వదిలి వెళ్లటానికి కారణం అయిన ఆ వ్యక్తికే గానీ, వదిలి వెళ్లిపోవలసి వచ్చినవారికి కాదు’’ అనేవారు రతన్జీ! టాటా ప్రధాన కార్యాలయం ఉండే ‘బాంబే హౌస్’ రతన్‌జీకి పవిత్రాలయం. చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు, పునర్జన్మ... అన్నీ ఆయనకు బాంబే హౌసే!‘‘రతన్జీ... 90 ఏళ్లుగా ‘బాంబే హౌస్’ ఇలాగే ఉంది. కొద్దిగా మార్పులు చేస్తే బాగుంటుంది’’ అని, ‘టాటా సన్స్’ చైర్మన్‌గా నేను బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయనతో అన్నప్పుడు– ఆయన నా వైపు సౌమ్యంగా చూశారు. ‘‘మార్పులు అంటే పడగొట్టటం, తిరిగి కట్టటమే కదా చంద్రా! మరి అక్కడ నివాసం ఏర్పరచుకుని ఉన్న కుక్కల్ని, వాటి పిల్లల్ని ఏం చేస్తారు? ఖాళీ చేయించేస్తారు. అంతేకదా! అప్పుడు అవి ఎక్కడికి వెళ్తాయి? ముందు వాటికి భద్రమైన చోటు ఏర్పాటు చేయించి, ఆ తర్వాత మీ ‘పునర్నిర్మాణం’ మొదలుపెట్టండి’’ అన్నారు రతన్ జీ!!రతన్జీతో కలిసి పని చేయటం నాకొక లాంగ్ డిస్టెన్స్ మారథాన్. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన టోక్యో, బోస్టన్, లండన్, బెర్లిన్, చికాగో, న్యూయార్క్ మారథాన్లతో పాటుగా నేను పూర్తి చేసిన ఏడో మారథాన్... ‘రతన్జీ టాటా’! క్షణికమైన వేగం కంటే... అనుకున్న మార్గంలో చివరివరకు నిలబడటమే ముఖ్యం అనేవారు రతన్జీ. టాటాను వదిలి వెళ్లాలన్న నా నిర్ణయం క్షణికమైన వేగంలో తీసుకున్నది కాదు. బోర్డు తీర్మానం కోసం ఆరు నెలలు ఆగి చూసి, టాటా ప్రతిష్ఠను నిలబెట్టటానికి ఆరు నెలల ముందే, కాబోయే చైర్మన్ కోసం నా అంతట నేను పరిచిన రెడ్ కార్పెట్ అది. -
చరిత్రను మార్చిన 'పరాజితుల చరిత్ర'
1976 ఆగస్ట్ 17. సరిగ్గా యాబై సంవత్సరాల కింద. అమెరికన్ స్వాతంత్య్ర దినం (జూలై 4) ద్విశతాబ్ది వేడుకలు దేశమంతా అట్టహాసంగా జరిగి ఇంకా ఆరు వారాలు కాలేదు. ఆ రోజున ఒక పుస్తకం వెలువడింది. సుప్రసిద్ధ అమెరికన్ ప్రచురణ సంస్థ డబుల్ డే ప్రచురించిన పుస్తకం అది. పేరు రూట్స్– ద సాగా ఆఫ్ యాన్ అమెరికన్ ఫామిలీ. రచయిత ఆఫ్రికన్ అమెరికన్ బానిస సంతతి ఏడో తరానికి చెందిన అలెక్స్ హేలీ (1921–1992). ఆ పుస్తకంతో ఆయన ప్రపంచ సాహిత్యంలో విజయ పతాక ఎగరేశాడు. అమెరికా జిలుగు వెలుగుల వెనుక దాగిన అపారమైన అంధకారాన్నీ, అందవికారాన్నీ విప్పి చూపిన అత్యంత ప్రభావశీలమైన పుస్తకం అది. రెండు వందల సంవత్సరాల చరిత్రను తవ్వి తీసి, కొత్త చరిత్ర సృష్టించిన పుస్తకం అది. ఇంతవరకూ విజేతలు రాసుకుంటూ వచ్చిన చరిత్రను సవాలు చేసి, తుడిచేసి, పరాజితుల చరిత్రను రంగస్థలం మీద ప్రవేశపెట్టిన పుస్తకం అది. వెలువడిన మొదటి సంవత్సరంలోనే అమెరికన్ మార్కెట్లో అరవై లక్షల ప్రతులు అమ్ముడైన ఈ పుస్తకం, ఇప్పటికి కనీసం నలబై భాషల్లోకి అనువాదమైంది. ఎన్ని కోట్ల ప్రతులు వెలువడ్డాయో లెక్కలేదు. వెండితెర మీద, బుల్లితెర మీద కోట్లాది మందిని ప్రభావితం చేసింది. ఇంగ్లిష్‌లో వెలువడిన నాలుగు సంవత్సరాల్లోనే తెలుగులోకి సహవాసి సంక్షిప్త అనువాదంతో, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణగా ‘ఏడు తరాలు’గా వెలువడి ఇప్పటికీ పునర్ముద్రణలు పొందుతున్నది. అమ్మమ్మ చెప్పిన కుటుంబ కథమొట్టమొదట దీన్ని హిస్టారికల్ ఫిక్షన్ (చారిత్రక కల్పన) అనాలా, నాన్ ఫిక్షన్ (కాల్పనికేతర రచన) అనాలా అని చర్చ జరిగింది. అలెక్స్ హేలీ తన కుటుంబ చరిత్ర గురించి ఇంట్లో విన్న మౌఖిక ఆధారాల దగ్గర ప్రారంభించి, మూడు ఖండాలలో, అనేక చారిత్రక, ప్రభుత్వ పత్రాల, నౌకాయానాల లిఖిత ఆధారాల మీద పరిశోధన జరిపి దీన్ని రాశాడు. దొరుకుతున్న చారిత్రక సాక్ష్యాధారాలు భిన్నమైన కథనాన్ని చెపుతున్నాయని ఆ పుస్తకాన్ని ఖండించిన చరిత్ర కారులు, సామాజిక శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. మరొక పక్క, దానిలో కొంత వాస్తవ చరిత్ర ఉన్నప్పటికీ, అది నవల అని, కాల్పనిక రచన అని అనేవాళ్లు కూడా ఉన్నారు. స్వయంగా రచయిత దాన్ని ఒక కొత్త పేరుతో పిలిచాడు: అది ఫాక్ట్ (వాస్తవం), ఫిక్షన్ (కల్పన) కలిసిన ఫాక్షన్ అన్నాడు. పూర్తి వాస్తవమూ కాదు, పూర్తి కల్పనా కాదు, అద్భుత రసాయనిక సంయోజనంలో రెండూ కలగలిసిన వినూత్న రచనాశైలి. ఒక వ్యక్తి తన వంశ చరిత్రనూ, తన మూలాలనూ అన్వేషించడంలో చేసిన అపార కృషి ఫలితం. రెండు వందల సంవత్సరాల వలసవాద దుర్మార్గాన్ని కళ్లకు కట్టిన దస్తావేజు. ఒక మానవ మహా విషాద కథనం. గొప్ప మానవ సంబంధాల చిత్రణ. దుర్భేద్యమైన అవరోధాలను అధిగమించి మానవ సంకల్పం, మానవ శ్రమ, మానవ సృజనాత్మకత ఎలా విస్తరిస్తుందో సజీవంగా చూపే చారిత్రక–సామాజిక విశ్లేషణ. ఆఫ్రికన్ దేశం గాంబియాలో 1750లో ప్రారంభమై, 1970ల దాకా సాగిన 120 అధ్యాయాల రచనలో చివరి అధ్యాయాలలో అలెక్స్ హేలీ ఈ రచనకు తన ప్రేరణనూ,కృషినీ వివరించాడు. తన అమ్మమ్మ పదే పదే చెప్పిన తమ కుటుంబ కథలోని శకలాలను పట్టుకుని, కుటుంబ చరిత్ర రాయగలనా అనే ప్రశ్నతో ఈ 730 పేజీల ఉద్గ్రంథం తయార యింది. ఇది పురాతత్వ పరిశోధన వంటి ప్రయత్నం. పురాతత్వ పరిశోధకులు ప్రాచీన యుగ అవశేషాల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు దొరికేవి కుండ పెంకులు మాత్రమే. పూర్తి కుండలు కూడా దొరకవు. కాని ఇతరేతర ఆధారాలతో పరిపుష్టం చేసుకుంటూ, ఆ కుండ పెంకు ఏ కుండలో భాగమో, ఆ కుండ ఏ శ్రమనుంచి ఉద్భవించిందో, ఏ సంస్కృతికి ప్రతిబింబమో, ఆ కుండను వాడిన మనుషుల సామూహిక జీవన విధానం ఏమిటో వివరించడానికి ప్రయత్నిస్తారు. అలెక్స్ హేలీ చేసినది సరిగ్గా అటువంటి కృషి. నిజానికి ఆయన అప్పటికి పరిశోధకుడూ కాదు, రచయితగా కూడా సుప్రసిద్ధుడూ కాదు. తీరప్రాంత గస్తీ దళం ఉద్యోగిగా పనిచేస్తూ, ఏవో కొన్ని రచనలు చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత జర్నలిస్టు అయ్యాడు. అమెరికన్ ప్రముఖులు కొంద రిని ఇంటర్వ్యూ చేశాడు. నల్లజాతి ఉద్యమ నాయకుడు మాల్కోమ్ ఎక్స్ హత్య కావడానికి ముందు నాలుగు సంవ త్సరాల పాటు ఆయనను ఇంటర్వ్యూలు చేసి, ఆయన హత్య తర్వాత ఆటోబయోగ్రఫీ ఆఫ్ మాల్కోమ్ ఎక్స్ రాసి పేరు తెచ్చుకున్నాడు. ఈ అక్షర కృషికి, పురాతత్వ పరిశోధన తోడయింది. చిన్నప్పటి నుంచీ అమ్మమ్మ సింథియా నుంచి విన్న విషయాలు రాయాలనుకున్నాడు. లండన్ మ్యూజియంలో ఒక ప్రాచీన లిపి పరిశోధన చూసి తానూ అటువంటి పరిశోధన చేయాలనుకున్నాడు. అమ్మమ్మకు సన్నిహిత బంధువు, అప్పటికి ఎనబైల్లో ఉన్న జార్జ్‌తో ప్రస్తావించి నప్పుడు, ‘‘అవును కుర్రాడా, ఆ ఆఫ్రికన్ తన పేరు కింటే అని చెప్పేవాడు. గిటార్‌ను కో అనేవాడు. నదిని కాంబీ బోలొంగో అనేవాడు. డోలు చెయ్యడానికి కర్ర కోసం అడవికి పోయినప్పుడు వాళ్లు ఎత్తుకొచ్చారనేవాడు’’ అందామె.‘కింటే ఎక్కడి నుంచి వచ్చాడో అన్వేషిస్తాను’ అని ఆమెకు మాట ఇచ్చాడు. ‘‘ఆ పని చెయ్యి. మీ అమ్మమ్మ, మన వాళ్లందరూ పై నుంచి చూస్తుంటారు’’ అని ఆమె ఇచ్చిన ప్రోత్సాహం ఈ రచనకు పునాది. ఏడు తరాల కథగిటార్ వంటి సంగీత సాధనానికి మాండింకా భాషలో పేరు కో అని, కాంబీ బోలోంగో అంటే గాంబియా నది అని గుర్తించి గాంబియా వెళ్లాడు. మౌఖిక వంశచరిత్రా గాయకుల సహాయంతో నిజంగానే కింటా కుంటే అనే పదహారేళ్ల కుర్ర వాడిని ఎత్తుకుపోయి, ఓడలో అమె రికా తీసుకుపోయారని గుర్తించాడు. బానిసగా ఒక యజమానికి అమ్మబడిన కుంటా కింటే తిరగ బడ్డాడు, పారిపోవడానికి ప్రయత్నించాడు. పారిపోకుండా యజమానులు కాలు తెగనరికారు. అక్కడ వంట మనిషిగా ఉండిన బెల్‌ను పెళ్లి చేసుకుని కిజ్జీ అనే కూతురిని కన్నారు. యజమాని ఆ అమ్మాయిని మరొక యజమానికి అమ్మితే, కొత్త యజమాని కిజ్జీ మీద అత్యాచారం చేశాడు. అలా కోడి పందాల జార్జిగా పేరు తెచ్చుకున్న మూడో తరం వ్యక్తి పుట్టాడు. జార్జి– మెటిల్డాలకు పుట్టిన ఆరుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లలో ఒకరు అలెక్స్ హేలీ ముత్తాత, కమ్మరి టామ్, నాలుగో తరం. ఆయనకూ ఐరీన్కూ పుట్టిన సింథియా, ఐదో తరం, అలెక్స్ హేలీకి తమ కుటుంబ చరిత్ర చెప్పిన అమ్మమ్మ. ఆమె కూతురు బెర్తా, ఆ వంశంలో కాలేజీకి వెళ్లి చదువుకున్న మొదటి వ్యక్తి, అక్కడ కలుసుకున్న సైమన్ హేలీని పెళ్లి చేసుకుంది. ఆమె కొడుకు అలెక్స్ హేలీ. నెత్తురూ కన్నీళ్లూ కలిసిన ఏడు తరాల కథ ఇది. యాబై సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాన్ని చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విశిష్టతలు కనిపిస్తాయి. ఆఫ్రికన్ తెగల సాంస్కృతిక ఆచారాలు, నల్లవాళ్లను అసలు మనుషులు గానే గుర్తించని, ఓడల్లో పశువుల్లా, సరుకుల్లా ఎత్తుకువచ్చి, తమ వ్యవసాయ క్షేత్రాల్లో పనులకు, ముఖ్యంగా పత్తి పంటకు ఉపయోగించిన తెల్లవాళ్లు, హింస, తిరుగుబాట్లు, పారిపోయే ప్రయత్నాలు, తమ మౌఖిక చరిత్రను సంరక్షించుకున్న పద్ధతులు, స్వాతంత్య్రం నుంచి బానిసత్వానికీ, అక్కడి నుంచి మళ్లీ స్వాతంత్య్రానికీ ప్రయాణాలు, బానిస విముక్తి, ఆంతర్యుద్ధం... చరిత్ర, గత వర్తమానాల మధ్య నిరంతర సంభాషణ. ‘తన చరిత్ర తనె పఠించి భోరున ఏడ్చింది ధరణి, తన చరిత్ర తనె స్మరించి ఫక్కున నవ్వింది ధరణి’. ఎన్. వేణుగోపాల్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
స్వతంత్ర భారత మార్గదర్శకులు
గతవారం అండమాన్, నికోబార్ దీవుల్లో పర్యటించినప్పుడు హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసే గౌరవం నాకు లభించింది. అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని స్మరించుకొని, నివాళులు అర్పించాను. నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ 1943 డిసెంబర్ 30న భారత భూభాగంపై తొలిసారి మువ్వన్నెల జెండాను ఎగరవేసిన పవిత్ర భూమిపై నిలబడటం నా హృదయాన్ని కదిలించే అనుభవం. పసుంపోన్ ముత్తురామలింగ థేవార్ ఆహ్వానం మేరకు 1939 సెప్టెంబరులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మదురైని సందర్శించిన విషయాన్ని ఈ సందర్భం నాకు గుర్తు చేసింది. డూ ఆర్ డైజాతీయ స్మారకమైన సెల్యూలార్ జైలును సందర్శించడం కూడా నా పర్యటనలో మరో స్ఫూర్తిదాయకమైన సందర్భం. వీర్ సావర్కర్, యోగేంద్ర శుక్లా, బటుకేశ్వర్ దత్, సచ్ఛీంద్రనాథ్ సన్యాల్‌తో సహా ఎందరో భరతమాత వీరపుత్రులను వలసవాద శక్తులు ఇక్కడ బంధించాయి. స్వేచ్ఛగా, గౌరవంగా భారత్ మనుగడ సాగించాలనే లక్ష్యంతో ప్రాణాలర్పించిన వారి ధైర్యాన్నీ, వేదననూ, నేటికీ ఈ జాతీయ స్మారకం గోడలు ప్రతిధ్వనిస్తున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, ఆగస్టు 9న అండమాన్ దీవుల్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. జాతిపిత మహాత్మాగాంధీ 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించి ‘డూ ఆర్ డై’ అనే స్ఫూర్తిదాయక నినాదాన్ని ఇచ్చారు. ఈ పిలుపుతో దేశవ్యాప్తంగా స్వాతంత్య్రం సాధించాలనే ఆకాంక్ష తీవ్రమైంది. తమ కాలంలో వలసవాద శక్తులతో పోరాడిన తరానికి ధన్యవాదాలు. వారి కారణంగానే ఇప్పుడు మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ హక్కులతో జీవించే అదృష్టాన్ని పొందాం.స్వాతంత్య్ర యోధుల ఘన చరిత్రఉత్తరాన కశ్మీర్, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన గుజరాత్, తూర్పున అస్సాం... ఇలా అన్ని ప్రాంతాలకూ, నేపథ్యాలకూ, వయసులకూ చెందిన సమరయోధులూ, ధీరవనితలూ ఒకే ఉమ్మడి లక్ష్యం కోసం ఏకమయ్యారు. మొదటి స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాటానికి శాశ్వత ప్రతీకగా నిలిచిన ఝాన్సీరాణి లక్ష్మీబాయి శౌర్యం, మంగళ్ పాండే ధైర్యం, ‘స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దానిని సాధిస్తాను’ అనే నినాదంతో దేశాన్ని జాగృతం చేసిన బాలగంగాధర తిలక్ నిర్భయ పిలుపు– ఇలా ప్రతిస్వరం స్వాతంత్య్రం దిశగా చేపట్టిన ప్రయా ణాన్ని బలోపేతం చేసింది.తొలి స్వదేశీ నౌకారవాణా సంస్థను ప్రారంభించి వలస పాలన ఆర్థిక ఆధిపత్యాన్ని వి.ఒ.చిదంబరం పిళ్లై సవాలు చేశారు. యుద్ధభూమిలో మాత్రమే కాకుండా, వాణిజ్యంలోనూ స్వాతంత్య్ర పోరాటం సాగిందని ఆయన నిరూపించారు. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ విప్లవ కాంక్ష... స్వేచ్ఛా సాధనకు త్యాగం చేసేలా తరతరాలకూ స్ఫూర్తిగా నిలిచింది. ఈశాన్యంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటన జ్వాలను రాణి గైడిన్లియు రగిలించారు. అస్సాంలో అంచంచలమైన ధైర్యంతో జాతీయ పతాకాన్ని మోస్తూ, క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ కనకలతా బారువా ప్రాణాలను అర్పించారు. భగవాన్ బిర్సా ముండా, అనేక మంది ఇతర గిరిజన నాయకులు వలస పాలనకు వ్యతిరేకంగా చేపట్టిన చారిత్రక పోరాటానికి నాయకత్వం వహించారు. మన చరిత్ర పుటల్లో పోరాట పటిమనూ, ధైర్యాన్నీ, పట్టుదలనూ ప్రదర్శించే అనేక గాథలున్నాయి. అసంఖ్యాకమైన వీరుల సమష్టి సంకల్పంతోనే భారతదేశ స్వాతంత్య్రం సాధ్యమైందని మనకు గుర్తు చేస్తాయి.నేలకొరిగిన సమర కిశోరాలుమనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో కోడి కాథ కుమరన్(పతాక రక్షకుడు కుమరన్)గా ప్రసిద్ధి చెందిన తిరుప్పూర్ కుమరన్‌కు నివాళి అర్పిస్తున్నారు. నా స్వస్థలమైన తిరుప్పూర్‌లో, స్వాతంత్య్ర పోరాట సమయంలో జాతీయ పతాకాన్ని కింద పడనీయకుండా పట్టుకొని మృత్యు ఒడిలోకి చేరారు. అందుకే ఆయనకు ఈ బిరుదు లభించింది. ‘స్వరాజ్యం మన జన్మహక్కు’ అనే పిలుపుతో ఆయన స్వాతంత్య్ర పోరాటంలో చేరారు. ‘దేశబంధు యూత్ అసోసియేషన్’ను ప్రారంభించారు. గాంధీజీ సామాజిక సంస్కరణలకు కట్టుబడి, మద్యపాన నిషేధాన్ని ప్రచారం చేశారు. ఆత్మనియంత్రణను అలవర్చుకోవాలని ప్రోత్సహిస్తూ, కల్లు దుకాణాల వద్ద పికెటింగ్‌లో పాల్గొన్నారు.1932 జనవరి 10న జరిగిన శాసనోల్లంఘన ఉద్యమంలో కుమరన్ ఓ యాత్రకు నాయకత్వం వహించారు. ‘వందేమాతరం’ నినాదాలతో తిరుప్పూర్ వీధులు ప్రతిధ్వనించాయి. ఈ బృందంపై వలసవాద శక్తుల దాడిలో తలకు గాయమైన కుమరన్ వందే మాతరం అని నినదిస్తూనే జెండాను శరీరానికి హత్తుకొని ప్రాణాలర్పించారు. ఆయన వయసు కేవలం 27 ఏళ్లు. భగత్ సింగ్ (23), సుఖ్‌దేవ్ (23), రాజ్‌గురు (22), ఖుదీరామ్ బోస్ (18), కనకలతా బారువా (18), అనంత లక్ష్మణ్ కన్హేరే (19), వంచినాథన్ (25) లాంటి ఎందరో యువకులు స్వాతంత్య్ర ఉద్యమంలో అమరులయ్యారు.స్వాతంత్య్ర సంగ్రామంలో అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవను ప్రశంసిస్తున్నాను. అజ్ఞాత స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తున్నాను. ఈ మహత్తర సందర్భంలో, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడానికి మనల్ని మనం అంకితం చేసుకుందాం. అచంచలమైన ధైర్యంతో పోరాడి, మన స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు మనం అర్పించగల సముచితమైన నివాళి ఇదే. జై హింద్! భారత్ మాతాకీ జై!వ్యాసకర్త భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ -
సాగునీరు ఇచ్చే సన్నద్ధత లేదా?
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో నీటి నిల్వలు పడి పోయాయనీ, అందువల్ల కృష్ణా డెల్లాకు సాగునీరు ఇవ్వలేమనీ జూలై 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రకటించింది. వరి పంట వేయ వద్దనీ, వరి పంట వేస్తే తర్వాత నీరు లేక నష్టపోయేది రైతులేననీ హెచ్చరిక జారీ చేశారు మంత్రిపుంగవులు. ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాభావంతో పాటు కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఖరీఫ్‌కు చాలాముందే ప్రకటించారు. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. కాని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదు.జూన్– జూలై నెలల మధ్య సాగు నీరు విడుదల విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చింది. జూన్ నెలలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సాగు నీరు విడుదల తేదీలను కూటమి మంత్రులు ప్రకటించారు. మంత్రుల ప్రకటనతో అప్పులు చేసి సేద్యానికి కావాల్సిన వనరులను రైతులు సమకూర్చుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్ నినో ప్రభావం వల్ల ఇప్పుడు సాగు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం వల్ల రైతాంగం తీవ్రమైన మనోవేదనకు గురౌతున్నారు.జల వనరుల వ్యవస్థ తాజా గణాంకాల ప్రకారం ప్రకాశం బ్యారేజి నీటి నిల్వ 2.978 టీఎమ్సీలు కాగా, పూర్తి నీటి మట్టం 3.071 టీఎమ్సీలు. 96.97% నీటి నిల్వ ఉన్నందువల్ల సాగు నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని నిపుణులు చెబుతున్నారు. పులిచింతలలో ప్రస్తుతం 29.039 టీఎమ్సీల నీరు ఉంది. మరి కూటమి ప్రభుత్వం సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదు?కృష్ణా డెల్టాలో ప్రధాన సేద్యం వరి. అలాంటి వరి సేద్యం చేయవద్దంటే, రైతులు ఖరీఫ్ సేద్యానికి దూరం కావడమే కదా! ప్రకాశం బ్యారేజి కుడి, ఎడమ కాల్వలకు సాగునీరు విడుదల చేయకపోతే ఆ పంటల సేద్యం సాధ్యం కాదు. చెరువులు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుని, పూడికలు తీసి నీటితో వాటిని నింపి ఉంటే, వాటి ద్వారా నీరు లభించేది. ఇది పాలకుల వైఫల్యం కాదా?రాష్ట్రంలోని 608 మండలాల్లో 250 మండలాలు తీవ్ర కరువు మండలాలుగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో కరవును ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కరవు మండలాల్లో గ్రామీణ ఉపాధి హామీ పనులను 250 రోజులకు పెంచి గ్రామీణ పేద కుటుంబాలకు పనులు కల్పించాలి. ఆ పనుల వేతనం పెంచాలి. రైతాంగానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా ఇవ్వాలి. వారు తీసుకున్న పంట రుణాలు రద్దు చేయాలి. తాగు నీటి సమస్య లేకుండా చూడాలి. ఈ డిమాండ్ల సాధన కోసం రైతాంగం, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి.- బొల్లిముంత సాంబశివరావు, వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆంధ్రప్రదేశ్), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
అంచనాలు అందుకోని ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ప్రభుత్వం 2026 జూలైలో విడు దల చేసిన శ్వేతపత్రం కొత్త చర్చకు తెరతీసింది. 2024–25లో రాష్ట్ర స్వంత ఆదాయాలు రూ. 96,270 కోట్లు కాగా, జీతాలు, పెన్షన్లకు రూ. 92,869 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రాష్ట్ర సొంత ఆదాయానికి దాదాపు సమానమైన మొత్తం జీతాలు, పెన్షన్లకే వెళ్తున్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే ‘రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల జీతాలకే పోతోంది’ అనే వాదనను నేరుగా అంగీకరించడం సరైంది కాదు. రాష్ట్ర సొంత ఆదాయం, మొత్తం రెవెన్యూ ఆదాయం, కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లు, అప్పులు... ఇవన్నీ వేర్వేరు. ఏ ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నాం అన్నదే శాతాన్ని నిర్ణయిస్తుంది.2024–25లో రాష్ట్రానికి వాస్తవంగా వచ్చిన రెవెన్యూ రిసిప్షన్ రూ. 1,67,676 కోట్లు. ఇందులో రాష్ట్ర పన్ను ఆదాయం రూ. 89,435 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 5,972 కోట్లు కాగా, కేంద్ర పన్నుల వాటా రూ. 52,080 కోట్లు, కేంద్ర గ్రాంట్లు రూ. 20,188 కోట్లు. బడ్జెట్లో అంచనా వేసిన రూ. 2,01,174 కోట్లతో పోలిస్తే వాస్తవ రెవెన్యూ ఆదాయం రూ. 33,498 కోట్లు తక్కువగా వచ్చింది. రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలోనే రూ. 20,354 కోట్ల లోటు నమోదైంది. ఇదే రాష్ట్ర ఆర్థిక సమస్యకు కీలక సంకేతం. సమస్య కేవలం జీతాల భారం కాదు; ఆదాయాన్ని అంచనాల మేరకు సమకూర్చుకోలేకపోవడం.2024–25లో రెవెన్యూ ఖర్చు రూ. 2,27,961 కోట్లు కాగా, రెవెన్యూ రాబడి రూ. 1,67,676 కోట్లు మాత్రమే. ఫలితంగా రెవెన్యూ లోటు రూ. 60,285 కోట్లకు చేరింది. మరోవైపు భవిష్యత్తు మౌలిక వసతులకు కీలకమైన క్యాపిటల్ ఔట్లే కేవలం రూ. 16,141 కోట్లే. బడ్జెట్ అంచనా రూ. 32,713 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు సగం.2026–27 నాటికి ఆదాయ రాబడి రూ. 2,34,140 కోట్లుగా అంచనా వేయగా, రాష్ట్ర సొంత వనరులు రూ. 1,37,320 కోట్లు. అదే సమయంలోవడ్డీ చెల్లింపులు రూ. 37,281 కోట్లు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆర్థికసంక్షోభాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సమస్యగా చూడటం సరికాదు. ఉద్యోగుల జీతాలు ప్రభుత్వ వ్యయమే అయినప్పటికీ... వైద్యం, విద్య, పోలీసు, రెవెన్యూ వంటి కీలక ప్రజాసేవలు వాటితోనే నడుస్తాయి. రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుతున్నారు? భవిష్యత్తు అభివృద్ధికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు? అన్నవి ఈ సందర్భంలో తలెత్తుతున్న అసలు ప్రశ్నలు.– సీహెచ్.వి. ప్రభాకర్ రావు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
పేదలెక్కువైన సంపన్న రాష్ట్రం
పుష్కర తెలంగాణ రాష్ట్రం జీఎస్డీపీ, తలసరి ఆదాయం లాంటి ఆర్థికాభివృద్ధి సూచికలలో దూసుకుపోతోంది. దేశంలో పారిశ్రామికంగా బలమైన మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి 5,407 డాలర్ల తలసరి జి.ఎన్.ఐ.తో తెలంగాణ ఎగువ మధ్య స్థాయి ఆదాయ రాష్ట్రంగా (యు.ఎం.ఐ.ఎస్.) ఢిల్లీ, కర్ణాటక తరువాత మూడవ రాష్ట్రంగా ఆవిర్భవించిందని ప్రపంచ బ్యాంక్ తన ‘కంట్రీ ఇన్కమ్ క్లాసిఫికేషన్ – 2026’ నివేదికలో వెల్లడించింది. ఇది రాష్ట్రానికి దక్కిన గౌరవంగానే చూడాలి. కానీ దీన్ని రాష్ట్ర అభివృద్ధికి గీటురాయిగా చెప్పలేం. రాష్ట్రంలో ఆదాయం సమకూరే మార్గాలు, ఆదాయ పంపిణీ తీరు రాష్ట్ర వాస్తవిక అభివృద్ధికి అద్దం పట్టడం లేదు.తెలంగాణలో జిల్లాల మధ్య తీవ్ర అంతరాలు ఉన్నట్లుగా ‘తెలంగాణ సోషియో ఎకనామిక్ ఔట్లుక్ సర్వే – 2026’ గుర్తించింది. రాష్ట్ర ఆదాయంలో 51 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి లాంటి జిల్లాల నుండి వస్తుంటే... మిగతా 49 శాతం ఆదాయం 29 జిల్లాల నుండి వస్తోంది. రాష్ట్ర ఆదాయ పంపిణీ తీరులో కూడా తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయి.ఐటీ, ఫార్మా రంగాలు; రియల్ ఎస్టేట్, గ్లోబల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నుండి రాష్ట్రానికి ఆదాయం సమకూరటం వలన రాష్ట్ర సంపద కొద్ది మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతం అయ్యింది. తలసరి జి.ఎన్.ఐ. ఎక్కువగా కనపడుతున్నా అభివృద్ధి ఫలాలు, పెరిగిన ఆదాయం కింది వర్గాలకు చేరడంలేదు. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, గ్రామీణ వృత్తుల బలోపేతం ద్వారా గ్రామీణ ప్రజల ఆదాయాలను పెంచాలి. అంతే కాక ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు పరచడం, గ్రామీణ అవస్థాపన నిర్మాణాన్ని చేపట్టడం వంటి చర్యలు చేపట్టాలి. అలాగే విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వ పెట్టుబడులు పెరిగినప్పుడే కింది వర్గాల ఆదాయాలు, కొనుగోలు శక్తి కూడా పెరిగి ఆర్థిక అంతరాలు తగ్గుతాయి.రాష్ట్రంలో 1.14 కోట్ల కుటుంబాలు ఉంటే 89 లక్షలకు పైగా కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని ప్రభుత్వ సామాజిక, ఆర్థిక సర్వేలు తేటతెల్లం చేస్తు న్నాయి. తెలంగాణ పేదలు ఉన్న సంపన్న రాష్ట్రంగా తెలంగాణ కనిపిస్తుంటే రాష్ట్ర ఏర్పాటుకు చేసిన త్యాగాలకూ, ఉద్యమాలకూ అర్థం ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సంపద పెరగడమే కాదు, ఆ సంపద కింది వర్గా లకు చేరడమే నిజమైన అభివృద్ధికి గీటురాయి.– డా. తిరునహరి శేషు, అర్థశాస్త్ర ఉపన్యాసకులు, కేయూ -
సమావేశాలు సరే, సమస్యల మాటేంటి?
భారతదేశ భవిష్యత్తును నిర్దేశించేది, నిర్ణయాలకు కేంద్ర బిందువుగా ఉండేది, 143 కోట్ల భారతీయుల తలరాతలను మార్చేది పార్లమెంట్. తమ తమ ప్రాంతాలలో చోటు చేసుకున్న సమస్యలను ఎంపీలు ప్రస్తావించేందుకు పార్లమెంటు ఓ కీలకమైన వేదిక. ఇప్పుడు కేవలం ఆరోపణలు, విమర్శలకే ఎక్కువ సమయం సరిపోతోంది.దేశంలో పెద్ద గుంతలతో నిండిన రహదారులను దాటడం, మునిగి పోయిన నగరాల్లో నడవడం, అంతులేని ఉద్యోగ దరఖాస్తు లతో చెమటలు పట్టడం, దొంగతనాల వల్ల కోట్లు నష్టపోయే విద్యుత్ రంగానికి ధర చెల్లించడం దేశంలో సాధారణ దృశ్యాలు అయ్యాయి. ప్రతి వారం ప్రజల తెరలపై ఒక వంతెన వంగిపోవడం, ఒక కారును రహదారి మింగేయడం వంటి దృశ్యాలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలు, ప్రభుత్వ సమాధానాలు చూస్తే దేశంలో పరిస్థితి కళ్లముందు ప్రత్యక్షమవుతుంది.‘ఎన్ని రహదారులు కూలిపోయాయి?’ అనే ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం 49 అని. ఇది 2014 నుండి 2025 వరకు ఉన్న డేటా. ప్రతి వర్షాకాలం కల్లోలం సృష్టిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టణ వరదల బాధ్యతను రాష్ట్రాలు, స్థానిక సంస్థలపై మోపుతుంది. ఇది రాజ్యాంగపరంగా సరైనదే. అయితే, అతి పెద్ద పట్టణా భివృద్ధి కార్యక్రమం ఢిల్లీ నుండి నిర్వహించబడుతోంది. ‘స్మార్ట్ సిటీస్ మిషన్’ కింద 8,064 ప్రాజెక్టులలో 7,790 పూర్తయ్యాయి. ఖర్చు రూ. 1,56,257 కోట్లు. ఖర్చు అంటే కేవలం డబ్బు కదలిక మాత్రమే, పరిష్కారం కాదు.ఈ వారం ఎంపీలు నీటి కాలుష్యం, అంచనాలు, ప్రమాణాలు, పరిష్కారాలపై కూడా గొంతెత్తారు. 2023–24 నుండి 2.52 కోట్ల ప్రయోగశాల నమూనాల సేకరణ జరిగిందనీ, 2.87 కోట్ల ఫీల్డ్ పరీక్షలు జరిగాయనీ, ట్యాంకర్ మాఫియా నీటి కొరత నిజమనీ ప్రభుత్వం అంగీకరించింది.ఇక ప్రాథమిక విద్య విషయానికి వస్తే, భవిష్యత్తు ఆశల వెన్నె ముక విరిగిపోయింది. ప్రభుత్వం 10.05 లక్షల పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 11.89 కోట్ల పిల్లలు చదువుతున్నారు. ప్రైవేట్ రంగం 3.42 లక్షల పాఠశాలలను నడుపుతోంది. వీటిలో 8.89 కోట్ల పిల్లలు చదువుతున్నారు. విధానాలు, కంప్యూటరైజేషన్ గురించి చర్చల మధ్య ఈ వివరాలు వెల్లడయ్యాయి. 73,481 పాఠశాలలకు విద్యుత్ లేదు. 1,00,843 పాఠశాలల్లో ఒక్క గురువు మాత్రమే ఉన్నారు. అందుకే యువత వ్యవస్థలోని సమస్యలతో పోరాడు తున్నారు. మొన్న జంతర్ మంతర్‌లో, ఇప్పుడు జార్ఖండ్, పంజాబ్, రాజస్థాన్, కర్ణాటకల్లో కనిపిస్తున్న ఆగ్రహం చదువు, ఉపాధి రంగా లపై అసంతృప్తిని ఎలుగెత్తి చాటుతున్నది.ఇంతలోపే ఆగస్ట్ 15 వచ్చేసింది. ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగించడం మామూలే. కానీ రోజురోజుకూ రూపాయి మరింత బలహీనమవుతోంది. ముడి చమురు ఉత్పత్తి తగ్గిపోతోంది. ఆర్థిక లోటు పెరుగుతోంది. దివాళా చట్టం కింద 2020 నుండి డిసెంబర్ 2025 వరకు 25,900 కేసులు దాఖలయ్యాయి. పాలనలో బాధ్యత, సమర్థత లోపించడం వల్లనే ఈ సమస్యలు కొనసాగుతున్నాయి. – కృష్ణ తేజ, కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి -
పూజ వేరు.. విన్నపం వేరు..
కతోలికులు మరియ మాత ముందు కూర్చొని, మూడు దేవరహస్యాలతో 15 ఘట్టాలతో కూడుకొన్న జపదండ చెబుతారు. క్రీస్తు ప్రభు గురించి, తండ్రి దేవునికి సంబంధించి, ఆత్మ దేవునికి సంబంధించిన రహస్యాలే అవి. ఆ యా ఘట్టాలన్నీ కొత్త నిబంధనా సంఘటనలే. దేవునికీ తమకూ మధ్యవర్తిగా ఆమెను నిలబెట్టి, ఆ ప్రభునికి ‘మా బాధలూ గాథలూ చేరవేయవమ్మా మా మరియమ్మా’ అని వేడుకొంటారు. పూజ వేరు, విన్నపం వేరు.బైబిల్లో ఆమెకు ఎదురైన చిన్న సంఘటనల్లోని మాటల్నే జపంగా మార్చుకొని పదే పదే ఉచ్ఛరించడం వల్ల ఆమె కేవేవో పూజలు జరుగుతున్నాయనుకోకూడదు. ఈ విషయమై ఇటీవల విశ్వ కాపరి, పోప్ లియో ప్రత్యేకమైన సందేశం ఇచ్చిన సంగతి మరువగూడదు. శిలువపై మరణించబోతున్న యేసు ప్రభువు, తన తల్లి బాధ్యత ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. మరియ మాత ఓ చిన్న ఇంట్లో నివసించేది. ఆమె ప్రతిరోజూ దేవుణ్ణి ప్రార్థించేది. అందరినీ ప్రేమతో చూసుకునేది. తన చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదించేది. పేదలకు సహాయం చేసేది. యేసు చెప్పిన మాటలను ప్రజలకు గుర్తు చేసేది.ఓ రోజు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, ‘మరియమ్మా! దేవుడు నిన్ను తన దగ్గరకు పిలుస్తున్నాడు’ అని చెప్పాడు. కొంతకాలానికి ఆమె భూలోక జీవితాన్ని ముగించింది. యేసు శిష్యులు ఆమెను ఎంతో గౌరవంగా సమాధి చేశారు. కొన్ని రోజుల తర్వాత వారు సమాధి దగ్గరకు వెళ్లి చూడగా, అక్కడ మరియ మాత శరీరం కనిపించలేదు. దేవుడు ఆమెను శరీరంతో సహా పరలోకానికి తీసుకువెళ్లాడని వారు విశ్వసించారు. ఆమెకు తిన్నగా మోక్షాన్ని ఆరోపించారు. ఇది ‘మోక్షారోపణ’. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మరియ మాత మోక్షారోపణ పండుగ జరుపుకొంటారు. అమె ఎంతో ధన్యురాలని పిలుస్తారు. (లూకా 1:48)– డా. దేవదాసు బెర్నార్డ్ రాజు (ఆగస్టు 15న మరియా మోక్షారోపణ పండుగ) -
ఐరోపా వలస సంక్షోభం
జూలై 30న మద్యధరా సముద్ర తీరంలో మొరాకో అంచున ఉన్న స్పానిష్ ఎన్క్లేవ్ స్యూటాలోకి ఒక్కసారిగా 50 వేల నుండి 60 వేల మంది మొరాకన్లు సము ద్రాన్ని ఈదుకుంటూ రావటం, సుమారు 72 మంది మృత్యువాత పడటం, స్పెయిన్ ఎమర్జెన్సీ ప్రకటించటం ఒక్కసారిగా సభ్యసమాజం ఉలిక్కిపడేలా చేసింది. గత సంవత్సర కాలం నుండి అమెరికాలో ‘ఐస్’ (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) ఏజెంట్లు వలస దారులపై చేస్తున్న దాడులు చర్చనీయాంశమయ్యాయి. స్వదేశంలో అంతర్యుద్ధాలు, పేదరికం, నిరుద్యోగ సమస్యల కారణంగా అనేక వేలమంది ప్రాణాలకు తెగించి ఏదో రకంగా ఐరోపా దేశాలకు చేరుకోవటానికి సాహసం చేస్తున్నారు. అటు అంతర్యుద్ధాలు ఇటు శ్రామిక కొరతసిరియా, లిబియా, అఫ్గాన్, ఇరాక్, ఎరిట్రియాలలో అంతర్యు ద్ధాల వలన ఒక మిలియన్‌కు పైగా శరణార్థులు ఒక్కసారిగా 2015లో ఐరోపాలోకి ప్రవేశించారు. దీనిని 2015 ఐరోపా శరణా ర్థుల సంక్షోభంగా పేర్కొంటారు. ఈ శరణార్థుల చొరబాటు ప్రధా నంగా మూడు మార్గాల గుండా జరిగింది. 1. తూర్పు మద్యధరా సముద్రంలో టర్కీ నుండి గ్రీకుకు చెందిన లెస్బాస్, చియోస్ దీవుల గుండా ఐరోపాలోకి. 2. పశ్చిమ బాల్కన్ ప్రాంతంలో మెసడోనియా నుండి సెర్బియా, హంగరీ, క్రొయేషియాల గుండా జర్మన్, ఆస్ట్రియా, స్కాండినేవియా ప్రాంతానికి. 3. మధ్య మద్యధరా ప్రాంతంలో లిబియా నుండి ఇటలీగుండా ఐరోపాలోనికి. ఐరోపా దేశాల ఉదారవాద విధానాల వలన అక్రమ వలస దారులు ఒకసారి ఐరోపాలోనికి ప్రవేశిస్తే వారిని వెంటనే వెనక్కు పంపటం సాధ్యం కాదు. వీరి దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవటా నికి కనీసం రెండేళ్లు పడుతుంది. ఐరోపా దేశాల సంక్షేమ పథకాల ఆలంబనతో వీరు ఏదోరకంగా ఐరోపాలో స్థిరపడుతుంటారు.ఐరోపా దేశాలలో కనీసం 2.5 మిలియన్ల శ్రామికుల కొరత ఉన్నది. ఐరోపా జనాభాలో వృద్ధుల శాతం ఎక్కువ. చౌక శ్రామిక శక్తి ఆవశ్యకతను గుర్తించి ఐరోపా దేశాలు వలసల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించాయి. 2020 కంటే ముందు ఐరోపా దేశాలు శరణా ర్థులు, అక్రమ వలసదారుల ఎడల మెతక వైఖరిని అవలంభించాయి. ముఖ్యంగా జర్మనీ (ఆంజిలా మెర్కెల్ ప్రభుత్వం) కేవలం 2015లోనే 8.9 లక్షల శరణార్థులను అనుమతించింది. ఐరోపా దేశాలు అక్రమ వలసదారులను నియంత్రిస్తూ, వారిని క్రమంగా ఐరోపా సంస్కృతిలో విలీనం చేయాలనే సిద్ధాంతాన్ని అమలు పరచాయి. యూకే, నెదర్లాండ్స్, స్వీడన్ వంటి దేశాలు శరణార్థులు వారి సంస్కృతిని కాపాడుకోవటానికి సహాయం చేశాయి. ముఖ్యంగా ఇస్లామిక్ మతబోధనల పాఠశాలల ఏర్పాటుకు కూడా సహకరించాయి. వీరికి పౌరసత్వం ఏర్పాటు చేశాయి. ఫ్రాన్స్ దీనికి విరుద్ధంగా ఫ్రెంచ్ భాషను తప్పనిసరి చేసింది. పాఠశాలలు, పబ్లిక్ ప్రదేశాలలో మతసంబంధ చిహ్నాలను నిషేధించింది. జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ వంటి దేశాలు నైపుణ్యంగల వలస దార్లను మాత్రమే అనుమతించటానికి ప్రాధాన్యతనిచ్చాయి. పౌరసత్వ సదుపాయం కల్పించలేదు.నియంత్రణల కసరత్తు2020 తర్వాత ఐరోపా దేశాలలో ఉగ్రవాద చర్యలు, హింసా త్మక సంఘటనలలో వలసదారుల ప్రమేయం బయటకు రావటంతో ఐరోపా దేశాలు తమ విధానాలను పునస్సమీక్షించుకోవటం మొదలెట్టాయి. స్వీడన్లో గ్యాంగ్‌వార్స్, 2024లో యూకేలో దొమ్మీలు, 2023లో ఫ్రాన్స్‌లో అల్లర్లు, యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్ లపై నివేదికలు వలసలను వ్యతిరేకించే రైట్‌వింగ్ రాజకీయ పక్షాలు బలోపేతమవటానికి దోహదం చేశాయి. యూరోపియన్ యూనియన్ దేశాలలో సుమారుగా 6.4 కోట్ల మంది విదేశాలలో జన్మించినవారు. మొత్తం జనాభాలో వీరి వాటా సుమారు 13.3 శాతం. ప్రతి సంవత్సరం సుమారు 6.7 లక్షల శరణార్థులు వస్తున్నారు. ఇప్పుడు ఐరోపా దేశాలు దరఖాస్తులపై తుది నిర్ణయం తీసు కొనేవరకు ఐరోపా బయట వేరే దేశాలలో ఉంచే పథకాన్ని ప్రారంభించాయి. రువాండా, అల్బేనియా, ట్యునీషియాలో వీరిని క్యాంపు లలో ఉంచటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వలసదారులకు స్థానిక భాష, సంస్కృతిపై అవగాహనను నిర్ధారించే పరీక్షలను తప్పనిసరి చేస్తున్నారు. స్కాండినేవియన్ దేశాలలో వలస వచ్చిన వారిని సంక్షేమ పథకాల నుండి మినహాయిస్తున్నారు. స్వీడన్లో శరణార్థులు నివసిస్తున్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. నేరా లతో సంబంధమున్న వారిని దేశం నుండి బహిష్కరిస్తున్నారు. భద్రతా కారణాలు, సాంస్కృతిక–రాజకీయ నేపథ్యంలో ఐరోపా దేశాలు వలసలను నియంత్రించటానికి ప్రయత్నించటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ వలసలను పూర్తిగా నిషేధిస్తే ఐరోపా ఆర్థిక వ్యవస్థ మనుగడకే ముప్పు. ముఖ్యంగా హెల్త్‌కేర్ రంగంలో నర్సులు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఎల్డర్లీ కేర్ రంగాలలో తీవ్ర కొరత ఉన్నది. ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్ రంగాలలో డ్రైవర్లు, మెకానిక్‌లు, క్రేన్ ఆపరేటర్ల కొరత ఉన్నది. నిర్మాణ రంగంలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఫిట్టర్లకు కొరత ఉన్నది. ఇండియాకు ఐరోపా ద్వారాలుప్రపంచవ్యాప్తంగా 30.4 కోట్ల మంది తమ మాతృదేశాల నుండి వలస వెళ్లి ఇతర దేశాలలో నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో వీరి వాటా 3.7 శాతం. వీరంతా అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు చెందినవారు. ప్రధానంగా యూఎస్ఏ, కెనడా, ఐరోపా, ఆస్ట్రేలియాలకు వలస వెళ్తున్నారు. ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక వలసల విషయంలో కఠినమైన వైఖరిని అనుసరిస్తున్నారు. భారత్ అక్రమ వలసలను, చొరబాట్లను ఏ రకంగానూ సమర్థించదు. అయితే చట్టబద్ధ వలసల విషయంలో ట్రంప్ వైఖరి భారత్‌ను ఒత్తిడికి గురిచేస్తున్నది. హెచ్1బీ వర్క్ వీసాలలో భారత్ వాటా 70 శాతం. హెచ్1బీ, గ్రీన్‌కార్డ్ వర్క్ వీసాల నిబంధనలతో బాటుగా అమెరికాలో జన్మించినవారికి లభించే పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసే యత్నాలు భారత్‌కు నిరాశను కలిగిస్తున్నాయి.ఇవి ఒక రకంగా కొత్త అవకాశాలకు దారి తెరిచే అవకాశం ఉన్నది. 2023లో 9 లక్షలమంది భారతీయ విద్యార్థులు విదేశీ విద్యకు వెళితే 2025లో 6.26 లక్షలమంది మాత్రమే విదేశీ విశ్వవిద్యాలయాల వైపు మొగ్గు చూపారు. వీరు కూడా యూఎస్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయ లేదా ఐరోపా విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటున్నారు. అమెరికా నుండి రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ సూచనలు కన్పడుతున్నాయి. అమెరికన్ కంపెనీలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఆఫ్ షోరింగ్ స్థానంలో ఆన్ షోరింగ్ ప్రారంభమవుతున్నది. భారతీయుల అమెరికన్ డ్రీమ్ చెదిరిపోయే తరుణంలో ఐరోపా ద్వారాలు తెరుచుకుంటున్నాయి. భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా అంతర్జాతీయ సంబంధాలలో వాణిజ్యాన్ని – వలసలను కలిపి ప్రతిపాదిస్తున్నది. ఇండియా – ఈయూ మొబిలిటీ పాక్ట్ (2026)పై ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా భారత విద్యార్థుల వీసాలను ఫాస్ట్‌ట్రాక్ చేయటం, ఐరోపా విశ్వవిద్యా లయాలలో భారతీయ విద్యార్థులు కోర్సు ముగించిన తరువాత ఉద్యోగం వెతుక్కోవటానికి 12 నెలల వీసా అనుమతికి వీలున్నది. ముఖ్యంగా ఐటీ, ఇంజినీరింగ్, మానుఫాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ,హెల్త్ కేర్ రంగాలలో భారతీయులకు వర్క్ వీసాలకు ఐరోపా దేశాలు అనుమతిస్తాయి. అమెరికాలో వీసా నిబంధనల సమస్యల నేపథ్యంలో ఐరోపా వలస సంక్షోభం, ఘర్షణలు భారత్‌కు కలిసొచ్చాయనే చెప్పవచ్చు. బహుశా 2050 కల్లా ఐరోపా ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలలో భారతీయులు తమదైన ముద్రను వేసే అవకాశం ఉన్నది.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
దీక్ష.. గురువు పెట్టిన పరీక్ష!
అస్మృతిః క్లేశజాతస్య దీక్షాయాః ఆది లక్షణమ్’ ఒక పని చేసేటప్పడు దీక్ష ముఖ్యం. ఎలాంటి బాధలు గుర్తుకురాకుండా ఉండటమే దీక్షకు ప్రధాన లక్షణం. ఏ పనినైనా చేసి లక్ష్యాన్ని సాధించాలని అనుకొన్నప్పుడు అందులో ఉండే కష్టనష్టాలు గుర్తుకు రాకూడదు. గుర్తొస్తే పట్టుదల పలచబడి లక్ష్యం సాధించలేరు. ఏకాగ్రత ఉన్నప్పుడే లక్ష్య సాధన సాధ్యమవుతుంది.కారు నడిపే సమయంలో డ్రైవరు మనసు పరిపరివిధాల పోకుండా ముందు రోడ్డువైపే ఏకాగ్రతతో ఉంటుంది. లేకపోతే ప్రమాదాలేర్పడతాయి. అందుకే డ్రైవరు కారు వేగం పరిమి తిని, సమయాన్ని, ట్రాఫిక్ రూల్సును, సిగ్నల్స్‌ను జాగ్రత్తగా గమనిస్తూ ముందుచూపు సడల కుండా దీక్షతో నడుపుతాడు. అప్పుడే వాహనం క్షేమంగా గమ్యం చేరుతుంది.ఒక శిల్పాచార్యుడికి ఇద్దరు శిష్యులుండేవారు. మొదటివాడు కష్టపడి చాలాసేపు శిల్పాలు చెక్కుతూనే ఉండే వాడు. రెండోవాడికెప్పుడూ ఆటల ధ్యాసే. గురువుగారు వచ్చేసరికి పని చేస్తూండటం, తర్వాత వదిలివేయటం అలవాటు. ఒకరోజు ఇద్దర్నీ పిలిచి ఫలానా కొండల్లో ఫలానా రాయి ఉంది, వెతికి తీసుకురండని పంపాడు. ఇద్దరు అలాగే వెళ్ళి శిలను గుర్తించి తెచ్చారు. మొదటివాడు పండ్లు, పూలు, మూలికలు కూడా తెచ్చాడు.‘ఇవన్నీ ఎందుకురా?’ అని గురువడిగితే ‘స్వామీ! నా తల్లికి పండ్లు, చెల్లికి పూలు, మా అమ్మమ్మ చికిత్సకు మూలికలు తెచ్చా’నన్నాడు మొదటి శిష్యుడు. రెండవవాడిని ‘ఏరా! మీ తలిదండ్రులకు సుస్తీగా ఉందికదా! మరి నీవెందుకు మూలికలు తేలేదు’ అని గురువడిగాడు. ‘స్వామీ! నేను శిలను మాత్రమే వెతికాను. ఇతర ఆలోచనలేవీ నాకు లేవు’ అన్నాడు. పనిలో ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఉంటే కార్యసిద్ధి కల్గుతుంది.- శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
మన వ్యవసాయ విధానాలకు పరీక్ష
ఎల్ నినో కేవలం ఏదో ఒక పరిణామం కాదు. అది భూగోళం మొత్తంమీద వాతావరణ మార్పు వైపరీత్యానికి సంకేతం. పరస్పరాధారిత జీవావరణ వ్యవస్థలకు, వ్యవసాయ రంగానికి, ఆహార భద్రతకు ఎదురవుతున్న సవాళ్ళను గుర్తు చేస్తున్న ప్రమాదఘంటిక. ఈ రకమైన ఉపద్రవం తరచు తలెత్తుతున్నా దాని దీర్ఘకాలిక పర్యవసానాలను ఎదుర్కోవడంలో భారతదేశ సన్నద్ధత అసమతుల్యంగానే ఉంది. ఎల్ నినో ప్రభావాలను రైతులకు ఎరుక పరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కృషి చేస్తున్న మాట వాస్తవమే. అయితే, వ్యవసాయ ఉత్పత్తి చుట్టూ అలముకుంటున్న అస్థిరత, పంటల తీరుతెన్నులపై పెరిగిపోతున్న ఒత్తిడిపై మరింతగా దృష్టి సారించవలసిన అవసరం ఉంది. అనిశ్చితిలోనూ స్థిరమైన పనితీరుఈ నేపథ్యంలో, వ్యవసాయ స్థితిస్థాపకత విధానపరంగా ఒక ముఖ్యమైన ప్రాధాన్యతను సంతరించుకోవాలి. పంట నష్టాలను తగ్గించుకోవడం మాత్రమే స్థితిస్థాపకత అనిపించుకోదు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ, సాపేక్షంగా చూస్తే స్థిరమైన పనితీరు కనబరచగల వ్యవసాయ పద్ధతులను రూపొందించుకోవాలి. దీర్ఘకాలిక స్థితిస్థాపక శక్తిని సమకూర్చుకునేందుకు మౌలిక వసతులు, టెక్నాలజీ, జల నిర్వహణ, ఎటువంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోగల వంగడాలను అభివృద్ధి చేయడం, పరిశోధనలపై పెట్టుబడులు అవసరమవుతాయి. వాతావరణ అశనిపాతాల పట్ల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తు న్నాయన్నది ఒక పార్శ్వం మాత్రమే. అటువంటి షాక్‌లు ఎదురవ డానికి ముందే ప్రభుత్వ సంస్థలు రైతులను ఎంత పకడ్బందీగా సన్నద్ధపరుస్తున్నాయన్నది కీలక ప్రశ్న. పంట మార్పిడిలను ప్రోత్సహించడంలో ప్రభుత్వాల ప్రయత్నాలు ఎంతవరకు సఫల మవుతున్నాయి? ప్రత్యామ్నాయ పంటలు, వాటిని నాటవలసిన కాల పరిధులు, రిస్క్–మేనేజ్మెంట్ వ్యూహాల గురించి రైతులకు సలహాలిచ్చేందుకు తగినంత సామగ్రి దిగువ స్థాయి వ్యవసాయ వ్యవస్థల వద్ద ఉంటోందా? పంటలకు నష్టాలు వాటిల్లినప్పుడు పరిహారం, బీమా, ఇతర సహాయక యంత్రాంగాలు దెబ్బతిన్న రైతుల ముంగిళ్ళకు ఎంత వేగంగా చేరుకోగలుగుతున్నాయి? కేవలం అధిక దిగుబడులను సాధించడంపైనే కాకుండా, వాస్తవిక పరిస్థితులలో స్థిరమైన పనితీరును నిలబెట్టుకోగలగడంపైనే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దేశంలో కర్షకులు సుమారుగా 11.88 కోట్ల మంది ఉన్నారని, వ్యవసాయ కూలీలు 14.43 కోట్ల మేరకు ఉంటారని 2011 నాటి జనాభా లెక్కల వివరాలు వెల్లడిస్తున్నాయి. వాతావరణ వైపరీత్యాల ప్రభావం పంట పొలాలకే పరిమితం కాదనీ, అవి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆహార భద్రత, విస్తృత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయనీ గుర్తుంచుకోవాలి. సాంకేతిక సాయంభారత వ్యవసాయ రంగం ప్రధానంగా రుతువుల మార్పులపై ఆధారపడి నడుస్తోంది. వాతావరణానికి సంబంధించి తగినంత సమాచారం లేకుండా నారుపోయడం లేదా ఇతర సేద్య కార్యకలా పాలు చేపట్టడంలో ఇబ్బందులున్నాయి. తీరా అవి చేపట్టాక వర్ష పాత ధోరణుల్లో మార్పులొస్తే, రైతులు ఆర్థికంగా నష్టపోతారు. వ్యవసాయ రంగానికి సంబంధించి పైకి అంతగా కనిపించని దుర్భ లత్వాలలో ఇది ఒకటి. పంటలు దెబ్బతిన్నప్పుడు వచ్చే నష్టాలే కాకుండా, అనువుకాని సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా రైతులు నష్టపోయే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ఈ సమస్య ఒక పూర్తి స్థాయి సంక్షోభంగా పరిణమించకముందే, ఆ ముప్పు ఏర్పడగల అవకాశాన్ని గుర్తించడంలో ప్రవర్ధమాన టెక్నాలజీలు ముఖ్యంగా ఉపగ్రహ ఆధారిత భూ పరిశీలనలు తోడ్పడుతున్నాయి. దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు తరిగిపోతున్న వృక్ష సంపద ఆరోగ్యాన్ని గుర్తించడంలో, విస్తారమైన వ్యావసాయిక ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గుదల వంటివాటిని గుర్తించడంలో ఉపగ్రహ పరిశీ లనలు సహాయపడతాయి. కనుక, ఎల్ నినో విసురుతున్న సవాల్‌ను ఎదురు దెబ్బగా చూడనవసరం లేదు. భారతీయ వ్యవసాయ వ్యవస్థలను పటిష్టపరచుకునేందుకు లభించిన ఒక అవకాశంగా దీన్ని పరిగణించవచ్చు. అనిశ్చిత పరిస్థితుల్లో ఏ పంటలు పండించగలుగుతున్నాం, దానికి ఏ విధమైన సేద్యపు విధానాలు అనుసరిస్తున్నాం, సంస్థా పరమైన స్పందనల మెరుగుదల వంటి అంశాలకు సంబంధించి విలువైన పరిజ్ఞానాన్ని ప్రతి క్లిష్టమైన వ్యవసాయ సీజన్ నుంచి గ్రహించవచ్చు. వాతావరణంలో మార్పు గురించిన సాధారణ హెచ్చరికలు చేస్తే రైతులకు సరిపోదు. పరిస్థితిని బట్టి వివిధ పంటలు వేసుకోగల వెసులుబాటు కల్పించాలి. ప్రత్యామ్నాయ ఉపకరణాలు, వంగడాలను అందుబాటులోకి తేవాలి. సమర్థ పంట బీమా అవసరం. అస్థిర పరిస్థితులను తట్టుకోగలిగిన విధంగా సంస్థాపరమైన మద్దతును కూడా అందించాలి.ప్రపంచమంతటా పెను ప్రభావమే!ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తిపైన కూడా వాతావరణ వ్యత్యాస ప్రభావం పెరుగుతూ వస్తోందని 2026 ఆగస్టు 6న ప్రచురించిన గ్లోబల్ క్రాప్ మానిటర్ నివేదిక వెల్లడించింది. అది నాలుగు ప్రధాన (గోదుమ, మొక్కజొన్న, వరి, సోయాబీన్) పంటల స్థితిగతులను మదింపు చేసింది. సాపేక్షంగా చూస్తే గోదుమకు సానుకూల పరిస్థితులున్నాయని ఆ నివేదిక తెలిపింది. బియ్యానికి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. వరి రైతులు వాతావరణ ప్రతికూలత, నీటి సౌలభ్యం తక్కువగా ఉండటం, పంటకు చీడపీడలు సోకడంతో పాటు, దిగుబడులకు సంబంధించి ఇతర ప్రతిబంధకాలను కూడా ఎదుర్కొంటున్నారు. భారత్ విషయంలో దీని ప్రధాన సందేశం ముఖ్యమైంది. వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేని పరిస్థితులు పెరుగు తున్నాయి. వాటిని తట్టుకుని నిలబడగలిగిన విధంగా పంటలు రూపొందాలి. వ్యవసాయ విధానాలు వేగంగా మారిపోతున్న రిస్కు లకు తగ్గట్లుగా స్పందించగలిగిన సామర్థ్యం ఉన్నవై ఉండాలి. మరింత ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే భారత వ్యవసాయ రంగ భవిష్యత్తు కాదు. అది మెరుగైన సమాచారంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలిగినదిగా ఉండాలి. క్షేత్ర స్థాయిలో మారుతున్న పరిస్థితులను అవగాహన చేసుకుని, ఎదురుకాగల ముప్పులను ఊహించగలిగినప్పుడే ప్రభుత్వాలు స్థితిస్థాపక శక్తి కలిగిన వ్యవసాయ వ్యవస్థలను నిర్మించగలుగుతాయి. అప్పుడే ఎల్ నినోను అడపాదడపా తలెత్తే వాతావరణ భూతంగా కాక దేశ వ్యవసాయ పాలనకు ఒక పరీక్షగా చూడటం సాధ్యపడుతుంది.– డా‘‘ సుంకరి సత్యం ‘ అసిస్టెంట్ ప్రొఫెసర్;– కంచర్ల శ్రీదేవి ‘ రిసెర్చ్ స్కాలర్; కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్, హైదరాబాద్ -
సంకేతమే అయినా మున్ముందు సవాలే!
సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే ఆగస్ట్ 7న ‘మక్కా రక్షణ ఒడంబడిక’పై రియాద్‌లో సంతకాలు చేశాయి. దీనికి సైనికపరంగాకన్నా ఇతరత్రా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇది పశ్చిమాసియాలో నీరుగారుతున్న అమెరికా ప్రాభవాన్ని వెల్లడిస్తోంది. భద్రతా ప్రాధాన్యాల రీత్యా ఈ మూడు దేశాల మధ్యనున్న సారూప్యత బహు స్వల్పం. అమెరికా– ఇరాన్ మధ్య యుద్ధ పర్యవసానాలు సౌదీకి తలనొప్పిగా పరిణమించాయి. ఇరాన్‌తో దాని వైరం 1979 నుంచి సాగుతోంది. పాక్ దృష్టంతా భారత్‌పైనే. ‘నాటో’ కూటమిలో ఒకటిగా ఉన్న తుర్కియే అటు పశ్చిమాసియాలోనూ, ఇటు ఉత్తరాఫ్రికాలోనూ తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తోంది. ఆ ప్రాంతంలో నమ్మదగిన రక్షణ సామగ్రి ఎగుమతి దారుగా అవతరించాలని కోరుకుంటోంది. ఇలా వైరుధ్యాలున్నా రక్షణ కోసం ఈ మూడు దేశాలు ఒక వర్గంగా ఏర్పడటం ప్రతీకాత్మకంగా గణనీయమైనదే. ఇది మూడు భారీ మార్పులను ప్రతిబింబిస్తోంది: భిన్నమైన వ్యూహాత్మక, భద్రతా ప్రాధాన్యతలు; నూతన భద్రతా భాగస్వామ్యాల కోసం అన్వేషణ; అమెరికాపై ఇన్నాళ్ళూ ఉన్న నమ్మకం సడలిపోవడం.అమెరికాపై పోతున్న ఆశలుపశ్చిమాసియా, దానిని అనుకుని ఉన్న ప్రాంతాలు ఒక భద్రతా చట్రాన్ని కల్పించుకోవడంలో కొన్ని దశాబ్దాలుగా వాషింగ్టన్‌పైనే ఆధారపడుతూ వచ్చాయి. అమెరికా నుంచి ఆయుధాలు కొని సౌదీ అరేబియా దాని నుంచి భద్రతాపరమైన పూచీకత్తులు సంపాదించింది. తుర్కియే ఎలాగూ ‘నాటో’లో సభ్యురాలు. పాకిస్తాన్ ‘‘నాటో’యేతర ప్రధాన మిత్రపక్షం’.ఆరామ్‌కోపై జరిగిన ఇటీవలి దాడులపైనా, హౌతీలను కట్టడి చేయడంపైనా అమెరికా స్పందన పేలవంగా ఉందని సౌదీ భావిస్తోంది. సిరియా విషయంలో ‘నాటో’తో తుర్కియే చాలా ఏళ్లుగా ఘర్షణపడుతోంది. ఎఫ్–35 యుద్ధ విమానాల విక్రయాలు, కుర్దుల అంశం కూడా దాన్ని చిరాకుపరుస్తున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సేనలు వైదొలగడం, 2009 తర్వాత అమెరికా క్రమంగా భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపించడంతో వ్యూహాత్మకంగా ఏకాకినవుతున్నానని పాక్ భావిస్తూ ఉండవచ్చు. రియాద్, అంకారా, ఇస్లామాబాద్ ఒకదానికొకటి రక్షణగా నిల వాలని నిర్ణయించుకోవడం గణనీయమైన పరిణామమే. ఈ ఒడంబడిక ప్రస్తుతానికి పస లేనిదిగా కనిపించవచ్చుకానీ, ఇక్కడ సంకే తానికే ఎక్కువ ప్రాధాన్యం. మూడు ప్రధాన ముస్లిం మెజారిటీ సైనిక శక్తులు చేతులు కలుపుతున్నాయి. పాకిస్తాన్ అమ్ములపొదిలో అణ్వస్త్రం ఉంది. తుర్కియేలో ప్రధాన రక్షణ సామగ్రి పరిశ్రమలు న్నాయి. సౌదీ అరేబియాకు చమురు నిల్వలు పుష్కలం.ఇజ్రాయెల్‌కు సంకటమే!ఈ మూడు దేశాల్లో ఏ దేశంపైన దాడి జరిగినా మిగిలిన రెండు దేశాలపైన కూడా దాడి జరిగినట్లుగానే భావించాలని పేర్కొంటున్న క్లాజు మక్కా ఒప్పందానికి ప్రాముఖ్యతను సంతరిస్తోంది. కాకపోతే, భాష అస్పష్టంగా ఉంది. ‘నాటో’ ఆర్టికల్ 5 తరహాలో, ఆటోమే టిక్‌గా యుద్ధానికి దిగుతామనే నిర్దుష్టమైన పదజాలాన్ని చేర్చలేదు. సమైక్య కమాండ్ల ప్రస్తావన లేదు. సంయుక్తంగా స్థావరాలు నిర్వహిస్తామని ఎక్కడా ప్రకటించలేదు. ఈ ఒడంబడిక తక్షణ సైనిక ప్రభావం పరిమితం కావచ్చు. కానీ, అస్పష్టతకు కూడా భౌగోళిక రాజకీయాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఇది శత్రు దేశాల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. వాటి రక్షణ సన్నద్ధత ఖర్చును పెంచుతుంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు సంబంధించిన భద్రతా చర్చల్లో తల దూర్చాలని తుర్కియే చాలా కాలంగా అభిలషిస్తోంది. కానీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అమెరికా దాన్ని దూరంపెడుతూ వచ్చాయి. ఇపుడు మక్కా ఒడంబడికతో తుర్కియే ఆ రకమైన చర్చల్లో పాల్గొనేందుకు ప్రవేశార్హత సంపాదించుకున్నట్లు అయింది. ఇది ఇజ్రాయెల్‌కు కంటక ప్రాయంగా మారడం ఖాయం. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను తుర్కియే బాహాటంగా విమర్శిస్తోంది. మక్కా రక్షణ ఒడంబడికతో అటు తుర్కియే, ఇటు అణ్వస్త్ర సహిత పాకిస్తాన్ పశ్చిమాసియా భద్రతకు సంబంధించిన అధికారిక చర్చల్లో మొదటిసారిగా పాల్గొనేందుకు ప్రయత్నించవచ్చు. ఇంత కాలం అమెరికా నేతృత్వంలోని అబ్రహాం ఒప్పందాల గొడుగు నీడన ఇజ్రాయెల్ పనులు చక్కబెట్టుకుంటూ వస్తోంది. గల్ఫ్ కౌన్సి ల్తో సన్నిహిత సంబంధాలు నెరపుతోంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా భద్రతాపరమైన సహకారాన్ని గుట్టుచప్పుడు కాకుండా అందిస్తోంది. తద్వారా, పాక్‌ను ఆమడదూరంలో ఉంచుతూ వస్తోంది. తాజా ఒడంబడిక ఈ సూత్రీకరణలన్నింటినీ అస్తవ్యస్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌ను గుర్తించని పాక్‌కు గల్ఫ్ భద్రతా చర్చల బల్ల వద్ద కుర్చీ కల్పిస్తోంది. పాలస్తీనియన్ల తరఫున వకాల్తా పుచ్చుకున్నదిగా తనను చాటుకునే తుర్కియేకు సంస్థాపరమైన పరపతిని తెచ్చిపెడుతోంది. భారత్ ఎందుకు జాగ్రత్తపడాలి?ఈ ఒడంబడికతో న్యూఢిల్లీకి సంబంధం లేదని అనడానికి లేదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సిసలైన కాపలాదారుగా భారత్ తనను తాను చాటుకుంటూ వస్తోంది. సాగర జలాలకు సంబంధించినంతవరకు భద్రతకు నికరంగా భారత్ పైనే ఆధారపడ టానికి ప్రాధాన్యం ఇస్తారనే భావనపైనే ప్రధాని నరేంద్ర మోదీ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను నిర్మించుకుంటూ వచ్చారు. సౌదీ అరేబియా 14 దేశాలతో కలసి జూలై 30న ఒక మారిటైమ్ సెక్యూరిటీ క్లస్టర్‌ను ప్రారంభించింది. కానీ ఈ గ్రూపులో భారత్ భాగంగా లేదు. భారతదేశానికి బదులుగా పాక్, తుర్కియేలతో రక్షణ అవగాహన కల్పించుకునేందుకు సౌదీ మొగ్గు చూపడాన్నే ఒక భౌగోళిక రాజకీయ సంకేతంగా తీసుకోవాలి. భారత్‌తో ఆర్థిక సంబంధాలు, ఇంధన వర్తకం వృద్ధి చెందుతున్నా, సంక్షోభం ముంచుకొస్తే, భారతదేశాన్ని ఒక ముఖ్యమైన భద్రతా భాగ స్వామిగా రియాద్ చూడదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. పాకిస్తాన్ పరపతి పెరుగుతూండటం రెండవ అంశం. రెండు పవిత్ర మసీదులకు రక్షణదారుగా ఉన్న దేశంతోనూ, ఒక ‘నాటో’ సైనిక శక్తితోనూ రక్షణ ఒడంబడిక కుదుర్చుకోవడం ఇస్లామాబాద్‌కు దౌత్యపరమైన విలువ తెచ్చిపెడుతోంది. అంతర్జాతీయంగా పాక్ ఏకాకి అయిందనే కథనానికి ఇది గండికొడుతోంది. బలాబలాల మధ్య సమతూకాన్ని మక్కా రక్షణ ఒడంబడిక రాత్రికి రాత్రి మార్చేయకపోవచ్చు. సంయుక్త సున్నీ సైనిక శక్తి రేపటికి రేపే అవతరించకపోవచ్చు. కానీ, ఈ ఒడంబడిక రెండు చేదు వాస్తవాలను వెల్లడిస్తోంది. ఒకటి– కీలకమైన మధ్యవర్గ శక్తులు కేవలం అమెరికాపై ఆధారపడే ధోరణి నుంచి దూరం జరుగుతున్నాయి. రెండు– ఈ వైవిధ్యీకరణలో సిద్ధాంతాన్ని పక్కనపెట్టి, తక్షణ ఆచరణాత్మక దృక్పథంతో నూతన కూటములు ఏర్పడుతున్నాయి. ఢిల్లీ ఎదుట సునిశితమైన సవాల్ ఉంది. గల్ఫ్ నుంచి ఆగ్నేయాసియా వరకు భద్రతను కల్పించగల శక్తిగా అవతరించాలని కోరుకుంటున్న భారత్ తన ‘సాగర్’, ‘మహాసాగర్’ విధానాలను సౌదీ అరేబియా వంటి దేశాలు అక్కున చేర్చుకోగలిగినవిగా మలచాలి. సి. ఉదయ్ భాస్కర్వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ -
న్యాయ పోరాటంలో మలుపు
ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ అనంతరం పొందే పెన్షన్‌కు సంబంధించిన 15 ఏళ్ల కమ్యుటేషన్ రికవరీ అంశం ప్రస్తుతం చర్చ నీయాంశంగా మారింది. ఈ అంశంపై దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్ (ఎస్ఎల్పీ నం. 26631/2025)లో భారత సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం లక్షలాదిమంది పెన్షనర్లలో కొత్త ఆశలను రేకెత్తించింది.పదవీ విరమణ సమయంలో ఉద్యోగి తన నెలవారీ పెన్షన్ లో గరిష్ఠంగా 40 శాతం వరకు ఒకేసారి నగదు రూపంలో పొందే అవకాశాన్ని కమ్యుటేషన్ అంటారు. కుటుంబ అవసరాలు, గృహ నిర్మాణం, పిల్లల విద్య, వివాహాలు లేదా వైద్య ఖర్చుల వంటి అత్యవసర అవసరాలకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, ఈ మొత్తానికి బదులుగా కమ్యూట్ చేసిన పెన్షన్ భాగాన్ని నెలవారీ పెన్షన్ నుండి కోత విధిస్తారు. ప్రస్తుతం అమ లులో ఉన్న ఆంధ్రప్రదేశ్ సివిల్ పెన్షన్స్ (కమ్యుటేషన్) రూల్స్–1944 లోని రూల్– 18 ప్రకారం పూర్తి పెన్షన్ పునరుద్ధరణ 15 సంవత్సరాల తరువాత మాత్రమే జరుగు తుంది.రిటైర్డ్ తహసీల్దార్ బి.అప్పారావు సుప్రీంకోర్టు ముందు ఉంచిన ప్రధాన వాదన ఏమిటంటే, ప్రభుత్వం కమ్యుటేషన్ మొత్తాన్ని వడ్డీతో సహా సుమారు 11 సంవత్సరాల 3 నెలల్లోనే తిరిగి పొందుతోంది. అయినప్పటికీ, మరో నాలుగేళ్ల వరకు పూర్తి పెన్షన్‌ను పునరుద్ధరించకుండా కొనసాగించడం న్యాయ సమ్మతం కాదని ఆయన వాదించారు. తన విషయంలో కమ్యుటేషన్ మొత్తంతో పాటు వడ్డీ కలిపి సుమారు రూ.7.55 లక్షలు ప్రభుత్వం ఇప్పటికే తిరిగి పొందినట్లు పేర్కొన్నారు. కాబట్టి, 15 ఏళ్ల వరకు కోత కొనసాగించడం ప్రభుత్వానికి అనవసర ఆర్థిక ప్రయోజనం కల్పిస్తోందని పిటిషన్లో వివరించారు.ఈ అంశంపై దాఖలైన పలు రిట్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 ఏప్రిల్ 28న తిరస్కరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ప్రత్యేక అనుమతి పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది. తుది తీర్పు వెలువడలేదు. నోటీసులు జారీ కావడం అంటే పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చిందని కాదు. కానీ ఈ కేసులో రానున్న తీర్పు ఒక వ్యక్తి లేదా ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా కమ్యుటేషన్ విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.– టి.ఎం.బి. బుచ్చిరాజు, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ సంఘం -
అసలు సన్యాసం అంటే 'నేను–నాది’ని వదలడమే!
'జటిలో ముణ్డీలుంచిత కేశఃకాషాయాంబర బహుకృత వేషఃపశ్యన్నపి చ న పశ్యతి మూఢఃఉదర నిమిత్తం బహుకృత వేషః'ఇది శంకర భగవత్పాదుల వారి ‘భజగోవిందం’లోని ఒక శ్లోకం. జడలు కట్టిన వెంట్రుకలతో ఒకడు, జుట్టులేక ముండనము చేయించుకున్నవాడు ఒకడు, వ్రేలా డుతూ ఉండే వెంట్రుకలు కలవాడు ఒకడు, కాషాయ రంగు బట్టలను ధరించినవాడు ఒకడు– నిజానికి వీళ్ళంతా ఉదర పోషణకు మాత్రమే వివిధ వేషములను వేస్తారు (భజగోవిందం; వ్యాఖ్య స్వామి చిన్మయానంద).శంకరాచార్యుల కాలం నాటికే సన్యాసులు అలా ఉండేవారంటే ఆశ్చర్యం కల్గుతుంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు సాధన కొరకు జీవించాలి కాబట్టి ఏదో కొంత భిక్షాన్నాన్ని, దాన్ని పవిత్రమైన ‘మధుకరి’గా భావించి యాచించేవారు. కానీ ఈనాడు ఆధ్యాత్మిక సాధన ఏదీ లేకపోయినా, కేవలం కాషాయ వస్త్రాలను ధరించి, సన్యాసులుగా అవతారమెత్తి యాచిస్తున్నారు చాలామంది.కేరళలోని ఆనందాశ్రమానికి చెందిన విశ్వమాత కృష్ణాబాయి ఏ యువకుడైనా తనకు సన్యాస దీక్షను ఇమ్మని అడిగితే, మందలిస్తూ ఇలా చెప్పేది: ‘సన్యాసం తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. నీవెందరో సన్నాసులను చూస్తున్నావు. వారు పొందినదేమిటి? గృహాన్ని, బంధువులను వదలటం, కాషాయ వస్త్రాలను ధరించటమే సన్యాసం కాదు. నేను, నాది అన్న భావాన్ని వదలటం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా దీనిని నీవు చేయవచ్చు. నీ వైపునుండి అవసరమైన ఒకే ఒక విషయం నీ శాశ్వత స్వరూపాన్ని సాక్షాత్కరించుకొనవలెననే తీవ్రమైన ఆకాంక్ష.ఈ ఆకాంక్షతో రామనామాన్ని స్వీకరించి, నీ ఇరుగు పొరుగు వారినీ, నీ ప్రదేశంలో నున్నవారినీ రాముని రూపాలుగా సేవించు. పవిత్రమూ, సర్వశక్తిమంతమైన రామ నామాన్ని నిరంతరం నీ నాలుక మీద నాట్యం చేయ నివ్వు’ (పుటలు– 41–42; విశ్వమాత కృష్ణాబాయి– స్వామి సచ్చిదానంద – ఆనందాశ్రమము).– రాచమడుగు శ్రీనివాసులు -
గిరిజన సాగును ఎలా చూడాలి?
మైదాన ప్రాంతాల కోసం రాసిన పథకాలను, అభివృద్ధి చేసిన సాంకేతికతలను ఏజెన్సీ ప్రాంతాలకు యథాతథంగా పంపుతున్నాం. అక్కడి రైతులు కొత్త పద్ధతులు స్వీకరించడం లేదని నివేదికల్లో రాసుకుంటున్నాం. సమస్య రైతులది కాదు; అక్కడి పరిస్థితులను అర్థం చేసు కోలేని మనది. 2025 మార్చిలో తెలంగాణ రైతు కమిషన్ ఏర్పాటు చేసిన బృందంతో కలిసి ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలకు వెళ్లాం. అక్కడ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తన పంట దెబ్బతింది. కంకుల్లో గింజ పట్టలేదు. జిల్లా కమిటీ లెక్క ప్రకారం 959 మంది రైతులకు చెందిన 2,178 ఎకరాల్లో పంట నష్టపోయింది. మా దృష్టిని ఆకర్షించింది పంట నష్టం కంటే దాని వెనుక ఉన్న ఏర్పాట్లు, వ్యవస్థల వైఫల్యం.బాండ్ వ్యవసాయం అంటే ఏమిటి?విత్తన కంపెనీలు రైతులతో నేరుగా ఒప్పందం చేసుకోవు. స్థానిక ఆర్గనైజర్లతో ఒప్పందం చేసుకుంటాయి. ఆ ఆర్గనైజర్ రైతుతో నోటిమాట మీద మాత్రమే ఒప్పందం చేసుకుంటాడు. దీన్ని అక్కడ బాండ్ వ్యవసాయం అంటారు. విత్తనం, ఎరువులు, పురుగుమందులు అప్పుగా ఇచ్చి, పంట కొనుగోలు సమయంలో వసూలు చేసుకుంటాడు. వడ్డీ నెలకు వంద రూపాయలకు అయిదు రూపా యలు– సంవత్సరానికి అరవై శాతం! చట్టం ప్రకారం ప్రతి కాంట్రాక్ట్ సాగు ఒప్పందాన్ని మార్కెట్ కమిటీలో నమోదు చేయాలి. పురుగు మందులకు బిల్లులు లేవు; అవి అమ్మటానికి లైసెన్సులు లేవు; ఒక చిన్న నోటుపుస్తకంలో పేర్లు మాత్రమే రాశారు. కొన్నిచోట్ల గరిష్ఠ చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేశారు. మందుల డబ్బాల మీద సూచనలు ఇంగ్లిష్‌లో ఉన్నాయి.దీని ఫలితం మనుషుల మీద కనిపించింది. పొలంలో పని చేస్తూ విషప్రయోగానికి గురైన ఒక మహిళ చేతులు, కాళ్లు చచ్చుబడి మంచానికి పరిమితమైంది. పిచికారీ పనిని పర్యవేక్షించిన ఒక మేస్త్రీ పక్షవాతానికి గురయ్యాడు; వైద్యం కోసం ఆ కుటుంబం మిగిలిన నలభై సెంట్ల భూమిని అమ్ముకుంది. వరుసగా రెండు నష్టాల తరు వాత ముప్ఫై అయిదేళ్ల ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్లెవరూ వ్యవస్థ బయట ఉన్నవాళ్లు కాదు. పెద్ద కంపెనీల కోసం విత్తనం పండించినవాళ్లు. అయినా ఒప్పందం లేదు, బిల్లు లేదు, బీమా లేదు, ఫిర్యాదు చేసే చోటు లేదు.రెండు రకాల గిరిజన వ్యవసాయంతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాలు ఒకేలా లేవు. తెలంగాణలో గిరిజన వ్యవసాయం ఎప్పుడో వాణిజ్య వ్యవసాయంగా మారి పోయింది. ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో గోండు, కోలాం కుటుంబాలు గతంలో పండించిన జొన్న, పప్పు ధాన్యాలు, మిశ్రమ పంటల స్థానంలో పత్తి వచ్చింది. ములుగు, భద్రాద్రిలో కాంట్రాక్ట్ విత్తన సాగు నడుస్తోంది. రాష్ట్రంలో హెక్టారుకు దాదాపు 253 కిలోల ఎరువులు వాడుతున్నారు; దక్షి ణాది సగటు 164 మాత్రమే. 2019 నాటికి రాష్ట్రంలోని 92 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి; ఆ అప్పులో దాదాపు సగం బ్యాంకులది కాదు, వడ్డీ వ్యాపారులది.ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కొండ మండలాల్లో పది కుటుంబాల్లో ఏడు ఇప్పటికీ ప్రధానంగా సొంత అవసరాల కోసమే పండిస్తు న్నాయి– రాగులు, కొర్రలు, సామలు, కంది, వరి. కొండ వాలుల్లో పోడు సాగు కొనసాగుతోంది. రసాయనాల వినియోగం తక్కువే. వాణిజ్య పంటలు వచ్చినా అవి బహువార్షిక పంటలు– అరకు కాఫీ, మిరియాలు, పైనాపిల్, పసుపు. ఇక్కడ సమస్య అప్పుల భారం కాదు; తక్కువ దిగుబడులు, మార్కెట్ అందుబాటులో లేకపోవడం. అంటే ఒక ప్రాంతంలో ఇప్పటికే ఉన్న వాణిజ్య వ్యవస్థను నియంత్రించాలి. మరో ప్రాంతంలో ఉన్నదానికి విలువ చేర్చాలి.పథకాలు ఎందుకు పనిచేయడం లేదు?రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్ ప్రకారం, ఏ చట్టమైనా షెడ్యూల్డ్ ప్రాంతానికి వర్తించకుండా చేయడానికి, లేదా అవసరమైన మార్పులతో వర్తింపజేయడానికి గవర్నర్‌కు అధికారం ఉంది. గిరి జనుల భూమి బదిలీని నియంత్రించే అధికారంతో పాటు, వారికి వడ్డీ వ్యాపారం చేసే వ్యవహారాన్ని నియంత్రించే అధికారం కూడా స్పష్టంగా ఇచ్చారు. ఆ అధికారంతోనే 1960లో షెడ్యూల్డ్ ప్రాంతాల వడ్డీ వ్యాపారుల నియంత్రణ నిబంధన చేశారు. అది ఇప్పటికీ రెండు రాష్ట్రాల ఏజెన్సీ ప్రాంతాల్లో అమల్లో ఉంది. అంటే ములుగులో అరవై శాతం వడ్డీ వసూలు చేసేవాడిని ఆపడానికి అరవై అయిదేళ్లుగా చట్టం అందుబాటులో ఉంది. వాడలేదు.ఇలాంటి సమస్యలు పునరావృతం కాకూడదు అంటే వెంటనే చేయదగినవి మూడు ఉన్నాయి. ఒకటి– షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ప్రతి కాంట్రాక్ట్ సాగు, విత్తన ఉత్పత్తి ఒప్పందాన్ని విత్తే ముందే మార్కెట్ కమిటీలో నమోదు చేయించడం; ఒప్పంద పత్రం తెలుగులో రైతు చేతిలో ఉండాలి. రెండు– వడ్డీ వ్యాపారుల నియంత్రణ నిబంధనను అమలు చేయడం; సామగ్రి అమ్మేవాడే అప్పు ఇచ్చేవాడు, పంట కొనేవాడు కూడా అయినప్పుడు ఆ మూడు పాత్రలూ కాగితం మీద కనిపించాలి. మూడు– పట్టా పేరును కాక నిజంగా సాగుచేసేవారిని గుర్తించడం; గ్రామసభ ధ్రువీకరణ ఆధారంగా పోడు సాగుదారు లకు, కౌలుదారులకు, మహిళా రైతులకు రుణం, బీమా, పంట నష్ట పరిహారం అందేలా చూడటం. ఈ మేరకు ఒక ముసాయిదా విత్తన ఉత్పత్తి దారుల రక్షణ చట్టం ప్రభుత్వానికి సమర్పించటం జరిగింది. అది ఇప్పటికీ అమలులోకి రాలేదు. ఇది సాధ్యమేనా అంటే – అవును!అమ్రాబాద్‌లో చెంచు కుటుంబాలతో కలిసి పనిచేసినప్పుడు మిరప పంటలో సీజ¯Œ కు ఇరవై సార్లు కొట్టే పిచికారీలు ఆరు, ఏడుకు తగ్గాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గోండు, కోలాం రైతుల 700 ఎకరాలు సేంద్రియ, ప్రకృతి సాగులోకి మారాయి; రైతు ఉత్పత్తిదారుల సంఘానికి ప్రభుత్వం మంచిర్యాలలో ఒక సేంద్రియ దుకాణం కేటాయించింది. నారాయణపేటలో సెర్ప్ సంస్థతో కలిసి 1,500 ఎకరాలు మార్పు దిశగా వెళ్లగా, 200 ఎకరాల్లో వరి స్థానంలో చిరుధాన్యాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో గిరి సిరి రైతు సంఘం కింద 2,600 ఎకరాలు ప్రకృతి సాగులో ఉన్నాయి; పసుపు, వేరు శనగ ప్రాసెసింగ్ యూనిట్లు స్థానికంగానే ఏర్పాటయ్యాయి. ఈ నాలుగు చోట్లా చేసిన పని ఒకటే. రైతు ఇప్పటికే పండిస్తున్న దానినుంచి మొదలుపెట్టడం. ముందు ప్రమాదకర మందులు తీసేయడం. నీరు తక్కువున్న చోట చిరుధాన్యాలు. పొలం పక్కనే పోషకాహార తోట. మార్కెట్ పెట్టుకోవడానికి రైతు సంఘం. ఉత్పత్తి దగ్గరే ప్రాసెసింగ్. వీటిలో దేనికీ కొత్త పథకం అవసరం లేదు. చివరగా ఒక మాట. రెండు రాష్ట్రాల్లోనూ షెడ్యూల్డ్ ప్రాంతాల వ్యవసాయ గణాంకాలను విడిగా ప్రచురించడం లేదు. గిరిజన కుటుంబాల ఎరువుల వాడకం, అప్పులు, నేల ఆరోగ్యం, దిగు బడులపై ప్రత్యేకంగా సమాచారం లేదు. ఈ లోటు తీర్చడం ఖరీదైన పని కాదు; చేయాలన్న నిర్ణయం మాత్రమే కావాలి.డా‘‘ జి.వి.రామాంజనేయులువ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు -
ఉన్నత విద్యలో అసలు సవాలు
జూలై 27న విడుదలైన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్–2027 భాగస్వామ్య లేదా ప్రాతి నిధ్య నివేదిక భారత ఉన్నత విద్యకు ఒకేసారి ఆశాజనకమైన చిత్రాన్నీ, ఆందోళన కలిగించే వాస్తవాన్నీ చూపించింది. ప్రపంచంలోని 118 దేశాల నుంచి రికార్డు స్థాయిలో 2,297 విశ్వవిద్యాల యాలు ఈ ర్యాంకింగ్ ప్రక్రియలో పాల్గొనగా, 143 విశ్వవిద్యాల యాలతో భారత్ ప్రపంచంలో రెండో అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన దేశంగా నిలిచింది.ఎక్కువ విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్‌లో పాల్గొ నడం ఒక విషయం అయితే, ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి స్థానాలను సాధించడం మరో విషయం. అందుకే ఈ సందర్భంలో ‘రాశి కంటే వాసి ముఖ్యం’ అనే సామెత సరిగ్గా సరిపోతుంది. ప్రాతినిధ్యం పెరగడం మాత్రమే కాదు, ప్రపంచ నాణ్యతా ప్రమాణాలను అందు కోవడమే నిజమైన విజయానికి కొలమానం.గత ఐదేళ్లుగా భారతీయ విశ్వవిద్యాలయాలు టీహెచ్ఈ ర్యాంకింగ్స్‌లో చురుకుగా పాల్గొంటున్నాయి. అయితే ఈ సంఖ్య పెరుగుతున్నా, నాణ్యతలో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రపంచ టాప్–100లో మనం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఒక్క భారతీయ విశ్వవిద్యాలయంగానీ, ఉన్నత విద్యా సంస్థగానీ స్థానం సంపాదించలేక పోవడం ఆలోచించాల్సిన విషయం. ఎక్కువ శాతం 300–500 బ్యాండ్లలో లేదా అంతకంటే దిగువనే నిలుస్తున్నాయి.ఎక్కడ వెనుకబడ్డాం?భారతీయ విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా మూడు అంశాల్లో గణనీయంగా వెనుకబడి ఉన్నాయి. మొదటిది అంతర్జాతీయీ కరణ– విదేశీ విద్యార్థులు, విదేశీ అధ్యాపకుల సంఖ్య అత్యల్పంగా ఉండడం వల్ల ప్రపంచ అనుసంధానం పరిమితమవుతోంది. రెండవది ఫ్యాకల్టీ–విద్యార్థుల నిష్పత్తి. ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యా లయాల్లో ఒక్కో అధ్యాపకుడికి తక్కువ మంది విద్యార్థులు ఉండగా, మన దేశంలో పరిస్థితి అందుకు విరుద్ధం. మూడవది పరిశోధన ప్రభావం– పరిశోధనా పత్రాల సంఖ్య పెరుగుతున్నా, వాటికి అంత ర్జాతీయ సైటేషన్లు రావడం, పేటెంట్లు, పరిశ్రమలతో భాగస్వా మ్యాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ వంటి అంశాల్లో ఇంకా గణనీయ మైన లోటు ఉంది. దీనికి తోడు దేశం మొత్తం పరిశోధన–అభివృద్ధి (ఆర్ అండ్ డీ)పై జీడీపీలో కేవలం 0.6–0.7 శాతం మాత్రమే వ్యయం చేస్తుండగా, అందులో ఉన్నత విద్యా సంస్థల వాటా 8–9 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రపంచ స్థాయి పరిశోధనా విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దడం అంత సులభం కాదు.తూర్పు ఆసియా దేశాల అనుభవం భారత్‌కు విలువైన పాఠాన్ని చెబుతోంది. చైనా తక్కువ సంఖ్యలో విశ్వవిద్యాలయాల తోనే త్సింగ్వా, పెకింగ్ యూనివర్సిటీ వంటి వాటిని ప్రపంచ అగ్రశ్రేణి స్థానాలకు చేర్చింది. సింగపూర్ వంటి చిన్న దేశం కేవలం రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలతోనే ప్రపంచ టాప్–20లో స్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఈ దేశాలు ప్రాతినిధ్య సంఖ్యల కంటే నాణ్యత, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వా మ్యాలు, ప్రతిభావంతులైన అధ్యాపకులు, దీర్ఘకాలిక ప్రభుత్వ పెట్టు బడులకు ప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్లే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్థిరమైన విజయాలను అందుకుంటున్నాయి.భారత్ కూడా ఇదే దిశగా మరింత దృఢమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మన జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలు సాకారం కావాలంటే, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు అధిక నిధులు కేటాయించడం, అంతర్జాతీయ అధ్యాపకులను, విదేశీ విద్యార్థులను ఆకర్షించడం, పరిశ్రమ–విశ్వవిద్యాలయ భాగస్వా మ్యాలను బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయి పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడం అత్యవసరం.– ఏటూరి శేఖర్ శర్మ, రిటైర్డ్ జిల్లా విద్యాధికారి -
దైవకార్యాన్ని అర్థం చేసుకోవాలి
దాసియైన మంధర మాటలు విని, కైకేయి దశరథుడిని కోరిన రెండు వరములతో, శ్రీరాముడికి జరగవలసిన పట్టాభిషేక కార్యక్రమం అకస్మాత్తుగా ఆగిపోయింది. అదేకాక, శ్రీరాముడు పదు నాలుగేళ్ళు వనవాసం చేయవలసిన విషమ పరిస్థితి ఏర్పడింది. శ్రీరాముడికి బహిప్రాణంలా ఉండే లక్ష్మణుడు ఈ హఠాత్పరిణామానికి తట్టుకోలేక దుఃఖంలో మునిగిపోయాడు.‘చేతిలోకి వచ్చి స్వంతమయింది కదా అని భావించిన సంపద అంతలోనే పోవడం, అడవుల పాలవడం– ఇవి దైవనిర్ణయా లుగా జరుగుతాయే తప్ప మనుషుల వశంలో ఉండి జరిగేవి కావు తమ్ముడా!’ అని లక్ష్మణుడిని సమాధానపరిచాడు శ్రీరాముడు. తండ్రి మీద కూడా కోపంతో ఉన్న లక్ష్మణుడితో ఇంకా ఇలా చెప్పాడని ‘గోపీనాథ రామాయణము’ తెలిపింది.మనుషుల జీవితాలలో లాభాలాభములను, సుఖదుఃఖములను, భయక్రోధములను, భవాభవంబులను ఏది కలుగజేస్తుందో అది దైవం అనబడుతుంది. విశ్వామిత్రాది తపోధనులు– జితేంద్రియులు అయ్యుండి కూడా– దైవంచే పీడితులగుచూ శక్తిమంతాలైన వారి నియమాలను విడిచిపెట్టినవారై కామక్రోధాసక్తులగుట తెలిసినదే కదా! ఈ లోకంలో కావలసినదిగా భావించబడే కార్యాన్ని కాకుండాచేసి, ఊహించని కార్యాన్ని, సంకల్పించని పరిణామాన్ని జరిగేటట్లుగా చేయడమే దైవకార్యంగా భావించి మనిషి సమాధానపడాలి. అటువంటి వివేకం కలిగిన బుద్ధితో, క్రోధాది ఇంద్రియ భావములను అదుపులో పెట్టుకుని ఆలోచించినపుడు అకస్మాత్తుగా తప్పిపోయిననా పట్టాభిషేక కార్యం గురించిన శోకం నాలో జనించదు.తే. నాకు జూడ బ్రజాపాలనము కంటెనవ్విపినవాస మధికోదయంబు గానననఘ లక్ష్మీవిపర్యయమందు నీవుమది విషాదంబు విడువుము మమత దక్కి. పట్టాభిషేకం చేయించుకుని ప్రజాపాలనం గురించిన పనులలో పడడం కంటె, అడవికి వెళ్ళి అక్కడ జీవితాన్ని గడపడంలోనే నాకు ఎక్కువ ఆనందం లభిస్తుంది. కాబట్టి రాజ్యా ధికారం అనే లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోయిందనే శోకాన్ని విడిచిపెట్టు. ప్రశాంతంగా ఉండు – అని చెప్పి శ్రీరాముడు లక్ష్మణుడిని శాంతపరిచాడు.– భట్టు వెంకటరావు -
కశ్మీరీలకు పాకిస్తాన్‌పై ప్రేమేం లేదు!
కశ్మీర్ ప్రజలకు పాకిస్తాన్‌పై ప్రేమ లేదు. ఈ మాట అంటున్నది అధీన రేఖకు రెండు వైపులా కశ్మీరీల గురించి కూడా. ప్రస్తుతం రేఖకు ఆవలివైపున గత రెండు నెలలుగా మరోమారు ఆందోళనలు జరగడాన్ని చూస్తున్నాం. అదే సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇటు వైపున గలవారికి కూడా ఎటువంటి ప్రేమ లేదు. వాస్తవం ఇది కాగా... ఇటువారంతా కేవలం మత దృష్టితో పాకిస్తాన్‌పై ప్రేమతో భారత వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారనే ప్రచారాలను రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు.ఇండియానే ఎందుకు కోరుకున్నారు?పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించి చర్చించేముందు, సందర్భం వచ్చింది గనక మన కశ్మీర్ విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం. వలస పాలన ముగుస్తుండిన 1947లో బ్రిటిష్‌వారు ఇక్కడి సంస్థానాలకు భారత యూనియన్‌లో లేదా పాకిస్తాన్లో విలీన మయ్యే స్వేచ్ఛను ఇచ్చారు. అపుడు కశ్మీర్ పాలకుడు హిందువు కాగా, ప్రజలు మెజారిటీ సంఖ్యలో ముస్లింలు. రాజు హరిసింగ్ గానీ, ప్రజలు గానీ పాకిస్తాన్లో చేరేందుకు ఇష్టపడలేదు. అప్పటి ప్రధాన రాజకీయ పక్షం నాయకుడు షేక్ అబ్దుల్లా పూర్తిగా ఇండియా పక్షం వహించాడు. కోరుకుంటే పాకిస్తాన్లో చేరగల అవకాశం దేశ విభజన చట్ట ప్రకారం ఉండి కూడా, భారతదేశంలో విలీనాన్ని ఎందుకు కోరుకున్నారు? నేను కశ్మీర్‌లోని మొత్తం 22 జిల్లాల్లోనూ మూడుసార్లు విస్తారంగా పర్యటించినపుడు, ఇతర విషయాలను అట్లుంచి ప్రత్యేకంగా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ప్రయత్నించాను. నేను వెళ్లిన జిల్లాలలో ముస్లిం మెజారిటీ ప్రాంతమైన కశ్మీర్ లోయతో పాటు పాకిస్తాన్ సరిహద్దుల వెట ఉండి ఆ ప్రభావాలు గణనీయంగా గల కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ జిల్లాలు కూడా ఉన్నాయి. రెండుసార్లు వెళ్లినపుడైతే మిలిటెంట్ చర్యలు ఉధృతంగా సాగుతున్నాయి. మిలిటెంట్లకు పాకిస్తాన్ సహాయాలు అందు తూనే ఉన్నాయి. అయిన్పటికీ ఏ దశలోనూ ఒక చిన్న వర్గం తప్ప పాకిస్తాన్‌ను కోరుకోకపోవడం గమనార్హం. ఇద్దరికీ సరిపడనిదే!మొట్టమొదటి వేర్పాటువాద ఆజాద్ కశ్మీర్ ప్లెబిసైట్ సంస్థ ఆ తర్వాత జమ్మూ–కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌గా మారినప్పుడు వారి లక్ష్యం రెండు వైపులా గల కశ్మీరీలను వేరుపరిచి స్వతంత్ర దేశాన్ని నెలకొల్పడం. ఆ సంస్థను ఇండియా, పాకిస్తాన్ రెండూ అణచి వేశాయి. ఆ సంస్థ ముగిసిన తర్వాత కొంత కాలానికి 26 పార్టీలు, సంస్థలతో ఆల్ పార్టీ హుర్రియత్ కాన్ఫరెన్స్ ఏర్పడింది. నేను ఆ సంస్థ ముఖ్య నాయకులు కొందరితో మాట్లాడాను. విషయం ఏమంటే... లిబరేషన్ ఫ్రంట్ రెండు దేశాలను వ్యతిరేకించే కశ్మీరీ జాతీయవాద సంస్థ కాగా, హుర్రియత్లో కొద్దిమంది మాత్రమే పాకిస్తాన్ అనుకూలురు. సామాన్య ప్రజానీకంలో అత్యధికులు పాకి స్తాన్‌కు ఎంతమాత్రం అనుకూలురు కాదు. అదే సమయంలో వారందరికీ ఇండియాపై తీవ్రమైన ఫిర్యాదులున్నాయి. ఈ ద్వంద్వ స్థితిని అర్థం చేసుకోవాలంటే ముందు చరిత్రలోకి వెళ్లి, తర్వాత స్వాతంత్య్రానంతర వర్తమానంలోకి రావాలి. మొదటి నుంచి హిందూమతం ఉండిన కశ్మీర్లోకి క్రీస్తు పూర్వమే బౌద్ధం బలంగా ప్రవేశించింది. అశోకుడు (శ్రీనగర్‌ను స్థాపించింది ఆయనే), కుషాణులు బాగా వ్యాపింప చేశారు. మధ్య ఆసియా వర్తకుల ద్వారా ఇస్లాం వచ్చిన తర్వాత 14వ శతాబ్దంలో సూఫీ యిజం విస్తరించింది. ఈ విధమైన బౌద్ధం, సూఫీయిజం కలగలిసిన ప్రభావాలు కశ్మీరీల విశ్వాసాలు, ఆలోచనలు, సంస్కృతులపై వేసిన బలమైన ముద్రలు నేటికీ ఉన్నాయి. అందువల్లనే వారు జనసంఖ్య రీత్యా మెజారిటీ సున్నీలే అయినా పాకిస్తాన్‌లోని జనాభాతో, అక్కడి పాలకులతో ఏకీభావం లేదు. 1947లో లేదు. ఇప్పటికీ లేదు. అయితే, రెండు వైపులగల జాతి అనే భావన మాత్రం ఉంది. అందుకే కశ్మీర్ మొత్తంగా స్వతంత్రం కావాలని ప్రయత్నించిన రోజులలో లిబరేషన్ ఫ్రంట్‌కు విస్తారమైన సానుభూతి లభించింది. ఈ భావనలు తెలిసినందువల్లనే కశ్మీర్ ప్రతిపత్తిపై ప్లెబిసైట్ జర పాలన్న ప్రతిపాదన కొందరు చేయగా, ఇండియాతో పాటు పాక్ కూడా వ్యతిరేకించింది. స్వతంత్ర కశ్మీర్ వారికి కూడా సరిపడనిదే!మారని మౌలిక దృష్టిఇదంతా చరిత్రతో పాటు, 1947 అనంతరపు తొలినాళ్ల పరిస్థి తులు. ఆ తర్వాతకు వచ్చి, మూడు విషయాలను చూస్తే చిత్రం పూర్తవుతుంది. ఒకటి, పాకిస్తాన్‌పట్ల ఆ తర్వాత కూడా, చివరకు మిలిటెన్సీ కాలంలోనూ జనబాహుళ్యంలో ప్రేమ కలగకపోవడం. రెండు, ఇండియాపైన కూడా ప్రేమ ఏర్పడకపోవడం. అయినప్పటికీ పాకిస్తాన్‌తో పోల్చినప్పుడు ఇండియా మెరుగనుకోవడం. మూడవది భవిష్యత్ గురించి వారి ఆలోచనలు. ప్రత్యేక దేశంగా ఏర్పడినాక పాకిస్తాన్లో ఉంటూ వచ్చిన పరి స్థితులు ఇటువైపు కశ్మీరీలకు నచ్చలేదు. అభివృద్ధి, ప్రజల జీవి తాలు, శాంతి భద్రతలు, అప్రజాస్వామికతలు, సైనిక కుట్రలతో పాటు, అటువైపు గల తమ కశ్మీర్ సోదరులు, బంధుమిత్రుల పరి స్థితి, హక్కుల లేమి, అణిచివేతలు అందుకు తోడయ్యాయి. అటు చేరినా తాము బాగుపడేది ఏమున్నది కనుక అనే ప్రశ్నను నేను అన్నివైపుల నుంచీ విన్నాను. తమ మిలిటెంట్ యువకులకు అక్కడి నుంచి సహాయం అందటం వరకు కొంత సానుకూలతను కల్పించినా, మౌలికమైన దృష్టి మాత్రం మారలేదు. ఇండియా స్వతంత్రమైన తర్వాత 40 సంవత్సరాల వరకు కశ్మీర్లో మిలెటెన్సీ లేదు. నిజానికి ఆ కాలమంతా నేషనల్ కాన్ఫ రెన్స్, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఎక్కడా లేనంత విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డాయి. అభివృద్ధి మృగ్యమై తీవ్ర అసంతృప్తి ఏర్ప డింది. అయినా కేంద్ర ప్రభుత్వాలు చేసింది శూన్యం. అది చాలద న్నట్లు ప్రజాస్వామిక విధి విధానాలతో నిమిత్తం లేకుండా రాజ కీయ క్రీడలు యథేచ్ఛగా సాగించాయి. కశ్మీర్ ఒక సున్నిత స్థితిలో గల సరిహద్దు రాష్ట్రం, పాకిస్తాన్ అవకాశం కోసం పొంచి ఉన్నదనే స్పృహ సైతం లేకుండా పోయింది.అటువంటి పరిస్థితులతో ఇక ఓపిక నశించిన ప్రజలు 1987 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ రెండింటినీ ఓడిస్తు న్నట్లు ఓట్ల లెక్కింపులో స్పష్టమవుతుండగా... కనీవిని రీతిలో రిగ్గింగ్ జరిపి తామే గెలిచారు. పట్టరాని ఆగ్రహానికి గురై మిలిటెన్సీ మార్గం పట్టింది. పాకిస్తాన్ ఆ అవకాశాన్ని అందుకుంది. అప్పటి నుంచి 35 సంవత్సరాలుగా మిలిటెన్సీనైతే గణనీయంగా అణిచి వేశారు గానీ ప్రజలు విశ్వాసాన్ని సంపాదించలేక పోయారు. మధ్యలో ఆ ప్రయత్నాలు జరిగింది వీపీ సింగ్, పీవీ నరసింహా రావుల కాలంలో మాత్రమే. ప్రజలు కూడా వారిని విశ్వసించారు. బీజేపీ రాకతో పరిస్థితి తిరిగి క్షీణమార్గం పట్టింది. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అబద్ధం డేగలా... నిజం నత్తలా!
ఒకప్పుడు ఒక వార్త ప్రజల ముందుకు రావాలంటే సమాచారం సేకరించడం, దాన్ని పరిశీలించడం, ధ్రువీకరించడం వంటి ప్రక్రియలు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ ఒక ప్రచురణ వేదికగా మారింది. దీంతో సమాచారం వేగంగా చేరుతోంది. అదే సమయంలో ధ్రువీకరించని సమా చారం కూడా అంతే వేగంగా వ్యాపిస్తోంది. ఏది ఎక్కువ మందికి చేరాలనేదాన్ని ఇప్పుడు ఎడిటర్ కాదు; ఎక్కువ స్పందన వచ్చే కంటెంట్‌ను ముందుకు నెట్టే అల్గోరిథమ్లే నిర్ణయిస్తున్నాయి.ఇటీవల జరిగిన ఒక సంఘటన దీనికి మంచి ఉదాహరణ. 2026 మార్చి 16న, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే భారత సైన్యంపై అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేసినట్లు చూపే ఒక వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. నిజానికి అది మార్చి 14న పీటీఐ రికార్డ్ చేసిన అసలైన ప్రసంగం– ‘భవిష్యత్ భద్రతా సవాళ్లపై సైన్యం సంసి ద్ధత’ గురించి మాట్లాడిన వీడియో. దాని దృశ్యాలను అలాగే ఉంచి, ఏఐ సాయంతో పూర్తిగా వేరే ఆడియో జోడించారు. పీఐబీ ఫ్యాక్ట్–చెక్ యూనిట్, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫ్యాక్ట్–చెక్ విభాగం రెండూ దీన్ని డీప్ ఫేక్‌గా ధ్రువీకరించి, పాకిస్తాన్ ఆధారిత ప్రచార ఖాతాల నుంచి ఇది వ్యాపించిందని అధికారులు గుర్తించేలోపే, వీడియో లక్షల మందికి చేరి పోయింది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు నిజమైన వీడియో వచ్చినా ‘ఇది ఏఐతో సృష్టించిందేమో’ అనే అనుమానం కలుగుతోంది. గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి.రాయిటర్స్ ఇనిస్టిట్యూట్ వారి 2025 నివేదిక ప్రకారం 48 దేశాల్లో వార్తలపై ప్రజల నమ్మకం సగటున 40 శాతమే. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు వార్తలను నమ్మడం లేదు. ఇది పదేళ్ల క్రితం కంటే చాలా తగ్గింది. ఎడెల్మన్ వారి సర్వేలో 69 శాతం మంది– ఇది ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారం అని నమ్ముతున్నారు. యునెస్కో కూడా ఇదే విషయం చెబుతోంది– ధ్రువీకరణ లేని సమాచారం భయంకరంగా వ్యాపిస్తోందని!భారత్‌లో ఇంకా పెద్ద సమస్య. మన దగ్గర అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసేవి, షార్ట్ వీడియోలు– ఇవే చాలామందికి వార్తలు. ఎప్పటివో పాత దృశ్యాలు, సంఘటనలు ఇప్పటి వార్తలుగా ప్రచారం జరగడం సాధారణ విషయం అయ్యింది. ఇందువల్ల ఎంతో నష్టం వాటిల్లుతోంది. ఏదైనా వీడియో లేదా పోస్ట్ చూడగానే ఫార్వర్డ్ బటన్ నొక్కే ముందు, ‘ఇది ఎవరు పోస్ట్ చేశారు, మూలం ఏంటి’ అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అధికారిక ఫ్యాక్ట్–చెక్ వేదికలు, విశ్వసనీయ ధ్రువీకరణ సేవలను ఉపయోగించడం అలవాటు చేసు కోవచ్చు. సమాచారం విషయంలో ఏమాత్రం అస్పష్టత ఉండకూడదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు కూడా సంచలనం కంటే నమ్మదగిన సమాచారాన్ని ప్రోత్సహించాలి. నిజం నత్తలా నడిచినా... దాని బరువు తెలిసిన వాళ్లు దాని వెనుకే ఉంటారు!– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
జీవ ఇంధనాలే భారత భవిష్యత్ శక్తి
పెరుగుతున్న పెట్రోల్ ధరలు, నగరాల్లో క్షీణిస్తున్న గాలి నాణ్యత, పశ్చిమాసియాలో చమురు సరఫరాపై నెలకొంటున్న అనిశ్చితి– ఈ మూడు అంశాలు నేడు ప్రతి భారతీయుడి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారమే జీవ ఇంధనాల వాడకం.ప్రపంచం ఇప్పుడు జీవ ఇంధనాలను కేవలం ప్రత్యామ్నాయ ఇంధనంగా కాకుండా, పర్యావరణ రక్షణ, ఇంధన భద్రత, రైతు ఆదాయం, గ్రామీణ ఉపాధి వంటి వాటిని కలిపే భవిష్యత్ అభివృద్ధి మార్గంగా చూస్తోంది.భారత్ ప్రస్తుతం తన ముడి చమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ పరిస్థితిలో ప్రత్యా మ్నాయ ఇంధనాల విస్తరణ దేశ ఇంధన స్వావ లంబనకు కీలకం. జీవ ఇంధనాల ప్రత్యేకత ఏమిటంటే, అవి మన దేశంలోనే లభించే వ్యవసాయ, సేంద్రియ వనరుల నుంచి ఉత్పత్తి చేయగలగడం. చెరకు మొలాసిస్, మొక్కజొన్న, పాడై పోయిన ధాన్యాలు, వరి గడ్డి, పంట అవ శేషాలు ఇప్పుడు ఇంధన ముడి సరుకుగా మారు తున్నాయి. అంటే, వ్యర్థాన్ని సంపదగా మార్చే సర్క్యులర్ ఎకానమీకి జీవ ఇంధనాలు బలమైన పునాది వేస్తున్నాయి.జీవ ఇంధనాల్లో బయో–ఇథనాల్, బయో– డీజిల్, బయో–గ్యాస్, బయో– సీఎన్జీ, సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్ వంటి పలు రూపాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండో తరం ఇథనాల్ సాంకేతికత వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించడం వల్ల ఆహార భద్రతకు భంగం కలగకుండా ఇంధన ఉత్పత్తి సాధ్యమవుతోంది. 2014లో పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం సుమారు 1.5 శాతం మాత్రమే ఉండగా, 2024–25 నాటికి అది 19.05 శాతానికి చేరింది. 2025–26 ఆర్థిక సంవ త్సరంలో సగటు మిశ్రమం 20 శాతానికి చేరువ కావడం ఈ కార్యక్రమం విజయాన్ని సూచిస్తోంది.భారత్‌కు కొత్త అవకాశాలుఇటీవల కేంద్ర మంత్రివర్గం 23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్ధన్ – నేషనల్ సర్క్యులర్ బయోఎనర్జీ పథకాన్ని’ ఆమోదించడం జీవ ఇంధన రంగంలో కీలక మలుపు. పశువుల పేడ, పంట అవశేషాలు, వంటింటి వ్యర్థాలు, మార్కెట్ వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్, బయో–స్లర్రీగా మార్చి గ్రామీణ ప్రాంతాలను శుభ్రమైన ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా తీర్చిద్దడం ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ రంగం ద్వారా రూ. 40,000 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఆదా, 1.5 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు, 10 మిలియన్ మెట్రిక్ టన్నుల శిలాజ ఇంధన వినియోగానికి ప్రత్యామ్నాయం సాధ్యమవుతాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధానమంత్రి జీవన్ యోజన’ ద్వారా 2జీ ఇథనాల్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం అందుతోంది. ‘సతత్’ పథకం ద్వారా కంప్రెస్డ్ బయో గ్యాస్ ఉత్పత్తిని విస్తరిస్తున్నారు.2023లో జి–20 వేదికపై ప్రారంభమైన గ్లోబల్ జీవ ఇంధనాల కూటమి... జీవ ఇంధ నాల ఉత్పత్తి, సాంకేతిక మార్పిడి, వాణిజ్య సహకారానికి ప్రపంచ వేదికగా మారుతోంది. సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యూయెల్, భవిష్యత్ బయో ఎనర్జీ రంగాల్లో భారత్‌కు ఇది కొత్త అవకాశాలను తెరుస్తోంది. అయితే జీవ ఇంధనాల విస్తరణలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి.భూమి వినియోగం, నీటి అవసరాలు, ముడి సరుకు సరఫరా, సాంకేతిక వ్యయాలు వంటి అంశాలను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. మొత్తానికి చమురు బావుల నుంచి మాత్రమే కాదు, మన పొలాల నుంచి కూడా దేశ భవిష్యత్ శక్తి ఉత్పత్తి కావచ్చని జీవ ఇంధనాలు మనకు గుర్తుచేస్తున్నాయి.– ఆర్ధ శ్రీనివాస్ పటేల్, మీడియా–కమ్యూనికేషన్స్ అధికారి (రేపు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం) -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
సమస్య అనుకుంటే ప్రతిదీ సమస్యే. జెన్–జీ సమస్యే. పునర్విభజన బిల్లు సమస్యే. రామ మందిరంలో విరాళాల చోరీ సమస్యే. క్యాబినెట్ మార్పులూ సమస్యే. నిజంగా సమస్యలైనవి కొన్ని ఉంటాయి... అవసలు సమస్యలే కాదని ఎంత అనుకున్నా సమస్యలు కాకుండా పోనివి! ఆరెసెస్ను సంతోషంగా ఉంచటం నిరంతర సమస్య. ఒక్క ఏడాదైనా, ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు లేకుండా ఉండక పోవటం నిరవధిక సమస్య. ఆగస్టు 13తో వర్షాకాల సమావేశాలు ముగుస్తున్నాయి. సభ లోపల సమస్యలతో సమస్య లేదు. ఆ సంగతి స్పీకర్ ఓం బిర్లా చూసుకుంటారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు చూసుకుంటారు. స్పోక్స్ పర్సన్ సంవిత్ పాత్రా చూసుకుంటారు. మాటకు మాట చెప్పవలసి వస్తే ఎంపీ దినేష్ శర్మ చూసుకుంటారు. వీళ్ల కాక, చూసీ చూడనట్లు చూసుకునే ‘ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్’ రాజ్‌నాథ్ సింగ్, ‘నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్’ అమిత్ షా ఎటూ ఉంటారు. టీమ్ అంతా కలిసి సమస్యలు కానివాటిని, సమస్యలు కానివాటితో డీల్ చేస్తుంది. చివరికి వచ్చేసరికి ఏదీ సమస్య కాకుండా పోతుంది. ఏదీ సమస్య కానప్పుడు, పడుకున్న 8 సెకన్ల లోపే గాఢ నిద్ర పట్టేస్తుంది. ఒక దేశ ప్రధానికి పడుకున్న ఎనిమిది సెకన్లకే గాఢ నిద్ర పట్టేయటం దేశ సౌభాగ్యానికి సంకేతం. దేశ ఆర్థికాభివృద్ధికి సూచిక. ‘‘మా త్రివిధ దళాలు కళ్లు తెరిచే ఉన్నాయి’’ అని శత్రు దేశాలకు హెచ్చరిక. ‘‘దేశంలో శాంతి భద్రతలు లేవు’’ అని ఆరోపిస్తున్న ప్రతి పక్షాల నోటికి ఆనకట్ట. సభలో ఈ చివరి మూడు రోజులను కూడా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సాగనిచ్చేలా లేరు. వాళ్ల ఆందోళన, నిరసన, డిమాండ్ ఒక్కటే... కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రావటం లేదో చెప్పాలని! తరగతి గదిలో అల్లరి చేస్తున్న పిల్లల మధ్యలోంచి ఒక మంచి విద్యార్థి లేచివెళ్లి, తరగతి బయట కాస్త దూరంగా చెట్టుకింద కూర్చుని తన క్లాస్ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఉండటంలో జాతికి హితం కానిది ఏముంటుంది? వీళ్లు శీతాకాల సమావేశాలనైనా సజావుగా నడవనిస్తారా?! అప్పటికి ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై రిపోర్ట్ కూడా సిద్ధమై పార్లమెంటుకు వచ్చేస్తుంది. అదొస్తే, అందులోని ఏదో ఒక పాయింట్‌ను సపోర్ట్‌గా తీసుకుని పునర్విభజన బిల్లును మళ్లీ సభలో ప్రవేశపెట్టటానికి ఉంటుంది. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల ఎన్నికలున్నాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఇప్పుడున్నది బీజేపీ కనుక అక్కడ మళ్లీ బీజేపీనే వస్తుంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి కనుక అక్కడ ఈసారి బీజేపీ వస్తుంది. ఎన్నికలు సమస్య కాదు. సభలో బిల్లులు సమస్య కాదు. ఖర్గే, రాహుల్ సమస్య కాదు. ఆరెసెస్ను సంతృప్తి పరచటం ఒక్కటే సమస్య ఇప్పుడు! ‘‘జెన్–జీ ఆందోళనలో న్యాయం ఉంది’’ అని అంటున్నారు ఆరెసెస్ చీఫ్ మోహన్ భాగవత్! ‘‘విద్యార్థులపై పోలీసు చర్య వెనుక అసలేం జరిగిందో నాకు తెలుసుకోవాలని ఉంది’’ అంటున్నారు! ‘‘జెన్–జీని నేను గుడ్డిగా నమ్ముతాను’’ అంటున్నారు! జెన్–జీ వాదనను ఓపికతో వినాలని, వాళ్ల డిమాండ్లను ప్రేమతో అర్థం చేసుకోవాలని అంటున్నారు!అంటే, చెట్టుకింద కూర్చుని క్లాస్ వర్క్ చేస్తున్న మంచి స్టూడెంట్‌ని మంత్రి వర్గం నుంచి డిబార్ చెయ్యాలని చెబుతున్నారా? జెన్–జీని ఇక్కడ ఎవరు మాత్రం గుడ్డిగా నమ్మటం లేదు?! జెన్–జీ వాదనను ఇక్కడ ఎవరు మాత్రం ఓపికతో వినటం లేదు?! అర్థం చేసుకోని వారికంటే కొన్నిసార్లు బాగా అర్థం చేసుకునేవారే సమస్యగా మారతారు. నిద్ర కూడా పట్టకుండా చేస్తారు. -
అమెరికాను నిలబెట్టిన 'విలువలు ఏమిటి'?
ఒక చరిత్రకారుడిగా, ఒక చిన్న రాజకీయ–చారిత్రక చిత్రాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. మీలో చాలా మంది 21వ శతాబ్దంలో జన్మించారు. అమెరికాలో జన్మించినవారు 2001 సెప్టెంబర్ 11 (9/11) ఉగ్రదాడుల ప్రభావంలో పెరిగారు. 1814లో అమెరికా క్యాపిటల్ భవనం, వైట్ హౌస్‌కు బ్రిటిష్ సైన్యం నిప్పంటించిన తర్వాత... యూఎస్ఏ భూభాగంపై జరిగిన తొలిపెద్ద విదేశీ దాడి అదే. మీరు పెరుగుతున్న సమ యంలో అమెరికా ప్రభుత్వం ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో రెండు దీర్ఘకాల యుద్ధాలు చేసింది. నా కంటే ముందు తరాలకు మాత్రం అమెరికా కేంద్ర ప్రభుత్వం ఎంతో సమర్థంగా కనిపించేది. అధ్యక్షులు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, హ్యారీ ట్రూమన్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి రెండో ప్రపంచ యుద్ధంలో విజయాన్ని సాధించారు. వ్యోమగాములను చంద్రుడిపైకి!1960ల ప్రారంభంలో యువతకు ఫెడరల్ ప్రభుత్వం అంటే దేశంలో ఆధునిక రహదారులు నిర్మించడం, అమెరికా వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడం వంటి గొప్ప విజ యాలు గుర్తుకు వచ్చేవి. అప్పట్లో సోవియట్ యూనియన్‌తో జరుగుతున్న పోటీలోనూ అమెరికా ముందంజలో ఉండేది. 1965లో అధ్యక్షుడు, కాంగ్రెస్ కలిసి ఒక చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చారు. రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా ఎంతో గౌరవంగా భావించిన ఆ చట్టమే... 1965 ఓటింగ్ హక్కుల చట్టం. మీ తరం మాత్రం అమెరికా ఫెడరల్ ప్రభుత్వ చరిత్రలోని మరో కోణాన్ని కూడా చూసింది. వియత్నాం యుద్ధంలో వేలాది మంది యువ అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని మీరు చదివారు. అలాగే మీ కళ్ల ముందే ధనికులు–పేదల మధ్య అంతరం పెరగడం చూశారు. ఎంతో మంది అమెరికన్లు తమ ‘అమెరికన్ డ్రీమ్‘ సాధించే అవకాశాన్ని కోల్పోవడమూ గమనించారు. కరోనా మహమ్మారి అనే విషాదాన్ని మనమందరం అనుభవించాం. ఆ మహమ్మారి ప్రభావం ఇప్పటికీ మన జీవి తాలపై ఉంది. ఆ వ్యాధి వల్ల పది లక్షలకు పైగా అమెరికన్లు మరణిస్తారని అప్పట్లో మనలో ఎవరైనా ఊహించామా? ఇప్పుడు మనం అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో సమావేశమయ్యాం. ఒక్కసారి చరిత్రలోకి చూస్తూ... అమెరికాను బలంగా నిలబెట్టిన ఆరు గొప్ప సంప్రదాయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మొదటి విలువ–చట్టం అందరికీ సమానం:నా దృష్టిలో మొదటి గొప్ప సంప్రదాయం చట్ట పరిపాలన (రూల్ ఆఫ్ లా). ప్రతి పౌరుడికి సమాన న్యాయం లభించడం. న్యాయ వ్యవస్థలో ఎవరికీ ప్రత్యేక సౌకర్యాలు ఉండకపోవడం. అలాగే ఎవరికీ ప్రత్యేక శిక్షలు కూడా ఉండకపోవడం. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే అనే సూత్రాన్ని మనం ఎప్ప టికీ కాపాడుకోవాలి. రెండో సంప్రదాయం–స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు:ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తన ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించే అవకాశం కలిగి ఉండాలి. బ్రిటన్ రాజరిక వ్యవస్థలా కాకుండా, అమెరికా వ్యవస్థాపకులు దేశ పాలనా అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టారు. వారు ప్రభుత్వ పని తీరును ఓటు ద్వారా అంచనా వేస్తారు. ఎన్నికలు అంటే అదే. యుద్ధం జరిగినా ఎన్నికలు ఆగలేదు. అమెరికా అంతర్యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఎన్నికలు రద్దు చేయాలని కొంతమంది మేధావులు సూచించారు. కొంతమంది మరింత ముందుకెళ్లి, ఫెడరల్ సైన్యాన్ని రాష్ట్రాల్లో మోహరించి, పోలింగ్ కేంద్రాలను ఆధీనంలోకి తీసుకోవాలనీ, అవసరమైతే మార్షల్ లా కూడా అమలు చేయాలనీ కోరారు. కానీ అంతర్యుద్ధం సమయంలో అబ్రహాం లింకన్, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రూజ్వెల్ట్ కేవలం ఒకే వాక్యంలో సమాధానం చెప్పారు: ‘ఎన్నికలు యథావిధిగా జరగాలి’. అలా చేయడం ద్వారా అమెరికా ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో, ఎంత స్థిర మైనదో ప్రపంచానికి చూపించాలని వారు కోరుకున్నారు. మూడో విలువ – నిజాయితీతో కూడిన రాజకీయ వ్యవస్థ:మూడో గొప్ప సంప్రదాయం ఏమిటంటే... దేశ వ్యవస్థాప కులు నిజాయితీ, పారదర్శకత, సామర్థ్యం, నైతికత, కరుణ, మర్యాద, త్యాగస్ఫూర్తి వంటి విలువలతో నడిచే రాజకీయ వ్యవస్థను కలగన్నారు. అధ్యక్షులు జాన్ ఎఫ్.కెన్నెడీ, రోనాల్డ్ రీగన్ తరచూ అమెరికాలోని తొలి కాలనీ గవర్నర్ జాన్ విన్త్రోప్ చెప్పిన మాటలను గుర్తు చేసేవారు. ఆయన ఇలా చెప్పారు: ‘ప్రపంచం మొత్తం మనల్ని గమనిస్తోంది. కాబట్టి మనం కొండపై వెలిగే నగరంలా ఆదర్శంగా ఉండాలి’. ఫిలడెల్ఫియా లోని వాల్నట్ స్ట్రీట్ ప్రాంతంలో థామస్ జెఫర్సన్ ఒక గొప్ప కల కనేవారు. పారదర్శకమైన, నిజాయితీతో కూడిన, మిత వ్యయంతో, గౌరవప్రదంగా, సమర్థవంతంగా పనిచేసే రాజ కీయ వ్యవస్థ ఏర్పడితే... ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని ఆయన నమ్మారు.నాలుగో విలువ–ప్రతి పౌరుడిలో నాయకత్వం ఉండాలి:దేశానికి నాయకత్వం అనేది కేవలం వాషింగ్టన్ డి.సి.లోని ప్రభుత్వానికే పరిమితం కాకూడదు. 1776లో బ్రిటన్ లో అన్ని ముఖ్యమైన నిర్ణయాలు రాజే తీసుకునేవాడు. కానీ అమెరికా వ్యవస్థాపకులు వేరే విధంగా ఆలోచించారు. ఒకవేళ ప్రజలకు అధ్యక్షుడు, కాంగ్రెస్ లేదా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే... వారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొని దేశాన్ని సరైన దిశలో నడిపించాలని ఆశించారు. మాజీ అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ ఒక గొప్ప మాట చెప్పేవారు: ‘అమెరికాలో అత్యంత గొప్ప హోదా ‘మిస్టర్ ప్రెసిడెంట్’ కాదు. ‘మిస్టర్ సిటి జన్’(పౌరుడు)! అమెరికా రాజ్యాంగం ప్రకారం... ప్రజలు అధ్యక్షుడి కోసం పనిచేయరు. అధ్యక్షుడే ప్రజల కోసం పనిచేయాలి.ఐదో విలువ – చరిత్రకారులు, మేధావుల బాధ్యత:ఐదో సంప్రదాయం... అమెరికా సమాజంలో చరిత్రకా రులు, పరిశోధకులు, మేధావులకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి. దేశ వ్యవస్థాపకులు విమర్శ కూడా ప్రజాస్వామ్యానికి అవసర మేనని భావించారు. రాజరిక వ్యవస్థల్లో, నియంతృత్వ పాలనల్లో కనిపించేలా కాకుండా... అమెరికా వ్యవస్థాపకులు నిరంతర ఆత్మపరిశీలన ద్వారా సమాజాన్ని మెరుగుపరచాలని విశ్వసించారు. దేశాన్ని పొగిడేవారికే కాదు... దేశంలోని లోపాలను నిర్మాణాత్మకంగా విమర్శించేవారికీ సమాన గౌరవం ఇవ్వాలని నమ్మారు. గొప్ప అమెరికన్ నాయకుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. ఆయన చెప్పిన అత్యంత ముఖ్యమైన సందేశం ఏమిటంటే... ‘ప్రతి పౌరుడి తొలి బాధ్యత అధికారాన్ని ప్రశ్నించడమే’! కానీ 2026లో అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.లోని కొందరు రాజకీయ నాయకులు, చరిత్రకారులు తమకు అను కూలంగా మాత్రమే మాట్లాడాలని కోరుకుంటున్నారు. సర్కస్‌లో చెప్పినట్లు చెప్పే విదూషకుల్లా వారు ప్రవర్తించాలని ఆశిస్తున్నారు. అమెరికా చరిత్రలో జరిగిన తప్పులు, లోపాలు బయటపడితే వాటిని పట్టించుకోవద్దని లేదా వాటికి సాకులు చెప్పాలని వారు కోరుతున్నారు. అమెరికా వ్యవస్థాపకులు ఇలాంటి ఆలోచనను చూసి బాధపడేవారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైనది. చరిత్రను మార్చే ప్రయత్నాలు మరింత ప్రమాదకరం. కొంతమంది రాజకీయ నాయకులు... నల్లజాతి చరిత్రలోని కీలకమైన అంశాలను తగ్గించి చూపాలని, లేదా పూర్తిగా తొలగించాలని ఒత్తిడి తెస్తున్నారు. అది అమెరికా విలువలకు విరుద్ధం. ఆరో విలువ – జాతీయ ఐక్యత:నేను చెప్పబోయే ఆరు గొప్ప సంప్రదాయాల్లో చివరిది... జాతీయ ఐక్యత. అమెరికా వ్యవస్థాపకులు ప్రజలు రాజకీయాలపై భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చని అంగీకరించారు. వారు పరస్పరం చర్చించాలి, వాదించాలి. కానీ చివరికి ఒకేదేశ ప్రజలమనే భావనను కోల్పోకూడదని ఆశించారు. బ్రిటిష్ రాజరికంలో లాగా రాజభవనం నుంచి ఆదేశాలు రావడం కాకుండా... ప్రజలే దేశ భవిష్యత్తును నిర్ణయించాలని వారు విశ్వసించారు. వ్యవస్థాపకులు అధ్యక్షుడిని ప్రభుత్వ అధినేత గానే కాకుండా, దేశ రాజకీయ నాయకుడిగానూ రూపొందించారు. జార్జ్ వాషింగ్టన్‌ను ఆదర్శంగా తీసుకొని, ఎప్పటి కప్పుడు దేశాన్ని ఏకం చేసే నాయకులు రావాలని వారు ఆశించారు. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘అమెరికా అనేది ఒక అందమైన రంగురంగుల మొజాయిక్’(అందమైన చిత్రం) అన్నారు. అంటే... భిన్న సంస్కృతులు, విభిన్న అభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి దేశాన్ని నిర్మిస్తారని ఆయన ఉద్దేశం. అబ్రహాం లింకన్ చెప్పినట్లుగా... ‘పరస్పర ప్రేమ, అనుబంధాలే మనందరినీ ఎప్పటికీ కలిపి ఉంచుతాయి’. -
భాగ్యనగర భద్రతకు శాస్త్రీయ మార్గం
వరద అనేది కేవలం ప్రకృతి విపత్తు మాత్రమే కాదు, అది నగర ప్రణాళికలోని లోపాలు, ప్రవాహ మార్గాల ఆక్రమణ, దీర్ఘకాల శాస్త్రీయ ఆలోచన లోపం వంటివాటిని బహిర్గతం చేస్తుంది. హైదరా బాద్ నగరానికి 1908 సెప్టెంబర్‌లో సంభవించిన మహావరద నగర చరిత్రను మలుపు తిప్పింది.2020 అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉప్పొంగిన తీరు, మళ్లీ అదే హెచ్చరికను గుర్తుచేసింది. ఇప్పటి వరకు వరదలపై చర్చ ఎక్కువగా నేటి వర్షపాతం గణాంకాలకే పరిమితమైంది. కానీ, నది ప్రవర్తనను వర్తమాన డేటాతో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. నదులు నెమ్మదిగా మారుతాయి. భూభాగ వినియోగం, అడవుల తగ్గుదల, నగరీకరణ, మురుగు ప్రవాహాలు, మట్టి నిక్షేపాలు– ఇవన్నీ నదీ వ్యవస్థను కాల క్రమంలో మార్చేస్తాయి. ఆ మార్పుల ఆనవాళ్లు నదీ అవక్షేపాల్లో నిలిచి ఉంటాయి. అందుకే మూసీ ఒడ్డున పేరుకుపోయిన మట్టి పొరలు (స్తరాలు) ఒక సహజ చరిత్ర పత్రంలా పనిచేస్తాయి.శాస్త్రీయ విశ్లేషణ ఎలా అంటే...నదీ అవక్షేపాలు అంటే కేవలం బురద కాదు. ప్రతి పొర ఒక కాలానికి చెందిన సమాచారం. వరద తీవ్రత, పరిసర వృక్షావరణం, మానవ జోక్యం, కాలుష్య ముద్ర– ఇవన్నీ వాటిలో దాగి ఉంటాయి. ఈ పొరలను అవక్షేప కోర్ నమూనాల రూపంలో సేకరించి విశ్లేషిస్తే, గత వరదల స్వభావాన్ని పునర్నిర్మించవచ్చు.అదే సమయంలో పుప్పొడి శాస్త్రం మరో కీలక దృక్కోణాన్ని అందిస్తుంది. మట్టిలో దాగి ఉన్న చెట్లు, గడ్డి, పంటల పుప్పొడి ద్వారా అప్పటి వృక్షావరణం, వ్యవసాయ విస్తరణ, భూభాగ విని యోగ మార్పులు తెలిసిపోతాయి. ఒక పొరలో సహజ వృక్ష పుప్పొడి అధికంగా ఉంటే ఆ ప్రాంతం అప్పట్లో మరింత సహజ స్థితిలో ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. పంటల పుప్పొడి పెరిగితే వ్యవ సాయం విస్తరించిన సూచన. పుప్పొడి తగ్గి, ధూళి లేదా నిర్మాణ సంబంధిత కణాలు పెరిగితే పట్టణీకరణ వేగాన్ని సూచించవచ్చు. అవక్షేప శాస్త్రం (సెడిమెంటాలజీ), పుప్పొడి శాస్త్రం (పాలినోలజీ) కలిసి మూసీ చరిత్రను డేటా ఆధారంగా చెప్పగలవు.మూసీపై ఇలాంటి అధ్యయనం ఎందుకు అవసరం అంటే కారణం సుస్పష్టం. ప్రస్తుత వరద నియంత్రణ చర్యలు ఎక్కువగా ఇటీవలి పరికరాలతో నమోదు చేసిన గణాంకాల మీద ఆధార పడుతున్నాయి. కానీ నదులు దీర్ఘకాల చక్రాల్లో పనిచేస్తాయి. కొన్నేళ్ల గణాంకాలు మాత్రమే చూసి వరద మైదానాన్ని నిర్ణయించడం ప్రమాదకరం. నీరు సహజంగా వెళ్లే మార్గాలు, నిలిచే ప్రాంతాలు, వరద మైదానాలు గుర్తించడంలో తప్పులు జరిగితే, తప్పుడు చోట్ల నిర్మాణాలు పెరుగుతాయి. అప్పుడు ప్రతి భారీ వర్షం విపత్తుగా మారే అవకాశం ఉంటుంది.ఇటీవల ఒక నివేదిక ప్రకారం మూసీ అవక్షేపాల్లో కాలుష్యం ప్రధానంగా సేంద్రియ స్వభావం కలిగి ఉంది. అంటే సమస్య కేవలం వర్షం కాదు, నీరు వెళ్లాల్సిన సహజ మార్గాలు దెబ్బతినడం. అందుకే మూసీ కారిడార్‌లో అవక్షేప కోర్ నమూనాలను అధ్య యనం చేయడం కీలకం. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, చార్మి నార్ పరిసరాలు, ప్రతాపసింగారం వంటి ప్రాంతాల నుంచి నమూ నాలు తీసుకుని కర్బన–14 పద్ధతిని అనుసరించి కాల నిర్ణయం చేసి, కొన్ని వందల సంవత్సరాల వరకూ చరిత్రను పునర్నిర్మించవచ్చు. ఏ దశలో కరువు, ఏ దశలో తీవ్రమైన వరద, ఏ దశలో నగర ఒత్తిడి పెరిగిందో స్పష్టంగా తెలుసుకోవచ్చు.ఈ పరిశోధన ఫలితాలు హైదరాబాద్‌కు దిక్సూచిగా మారు తాయి. శాస్త్రీయ వరద మ్యాపులు తయారవుతాయి. గతంలో వరద నీరు ఏయే మార్గాల్లో ప్రవహించిందో తెలిసినప్పుడు ఆ ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలకు పరిమితులు విధించడం సులభమవుతుంది. భవిష్యత్ బృహత్తర ప్రణాళికలో ‘నాన్ కన్స్ట్రక్షన్ ఫ్లడ్ జోన్’ వంటి నిర్ణయాలు ఊహలపై కాకుండా డేటాపై ఆధారపడి తీసుకోవచ్చు. అలాగే వరద హెచ్చరిక వ్యవస్థలు కూడా మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడతాయి. మట్టి పొరల్లో దాగిన చరిత్రను వినగలిగితేనే హైదరాబాద్ వరద భద్రతకు శాస్త్రీయ మార్గం సుగమ మవుతుంది.– డా. రామకృష్ణ మనిమద్దె, ఎర్త్ సైంటిస్ట్, నదీ వ్యవస్థల పరిశోధకుడు -
మోసపోయినా మంచితనం వదలొద్దు!
జీవితంలో మనల్ని బాధించినవాళ్లు రెండు విషయాల్లో ఒకదాన్ని తప్పకుండా తీసుకెళ్తారు. ఒకటి మన ప్రశాంతతను, రెండోది మన మంచితనాన్ని. ప్రశాంతత కొంతకాలానికి తిరిగి వస్తుంది. కానీ మంచితనం పోతే మనల్ని మనమే కోల్పోతాం. ఎందుకంటే, బాధ మనిషిని రెండు రకాలుగా మారుస్తుంది.తాను అనుభవించిన గాయాలను ఇతరులకూ పంచడం మొదలుపెట్టడం అనేది ఒక రకమైతే... తాను అనుభవించిన బాధ ఇంకెవరికీ కలగకూడదనే భావనతో జీవించడం రెండో రకం. ఈ రెండో రకమైన మనుషులే నిజంగా అరుదు. వాళ్లు కూడా మోసపోతారు. వాళ్లూ కూడా విరిగిపోతారు. వాళ్లూ కన్నీళ్లు పెడతారు. కానీ తమలోని మంచి మనిషిని మాత్రం కోల్పోరు. ఎందుకంటే, చెడ్డవాడిగా మారడానికి ఒక్క గాయం చాలు, మంచి మనిషిగా మిగిలి పోవడానికి మాత్రం గొప్ప హృదయం కావాలి.విజయవంతులైన మనుషులు చాలామంది కనిపిస్తారు. తెలివైన వాళ్లు కూడా కనిపిస్తారు. కానీ, బాధను అనుభవించిన తర్వాత కూడా ఎవరికీ బాధ కలిగించకుండా జీవించే మనుషులు మాత్రం అరుదుగా కనిపిస్తారు. వాళ్ల జీవితంలో ఎంత చెడు ఎదురైనా, వాళ్లలోని మంచిని కోల్పోకపోవడమే వాళ్ళ వ్యక్తిత్వంలోని గొప్పదనం. అందుకే, బాధ హృదయాన్ని తాకినా, హృదయంలో ద్వేషానికి స్థానం ఇవ్వకుండా జీవించగలగడమే నిజమైన విజయం.ముందుగా క్షమాపణ చెప్పేవాడు ధైర్యవంతుడు. ముందుగా క్షమించేవాడు బలవంతుడు. ముందుగా మర్చిపోయే వాడు ప్రశాంతంగా జీవించగలడు. తనను బాధించిన తర్వాత కూడా మంచి తనాన్ని ఎంచుకునే మనిషి ఈ ప్రపంచంలో అత్యంత అరుదైన వ్యక్తి.– కొత్త కృష్ణవేణి -
అనుబంధ వ్యవసాయమే జీవధార
ఈ రోజుల్లో రైతు వ్యవసాయం చేయడం ఒక్కటే సరిపోవడం లేదు. ఎరువులు, విత్తనాలు, కూలీల ఖర్చులు పెరుగుతుండగాపంటల ధరలు మాత్రం ఎప్పుడూ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. కొన్ని సంవత్సరాల్లో వర్షాభావం, మరికొన్ని సంవత్సరాల్లో అధిక వర్షాలు, తెగుళ్లు రైతును నష్టాలకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం రావాలంటే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఇదే భావనతో శాస్త్రవేత్తలు, ప్రభుత్వం, వ్యవ సాయ విశ్వవిద్యాలయాలు ‘ద్వితీయ వ్యవసాయం’ (సెకండరీ అగ్రికల్చర్) అనే భావనను ప్రోత్సహిస్తున్నాయి.పంటను పండించడం ప్రాథమిక వ్యవసాయం. ఆ పంటను ప్రాసెసింగ్ చేయడం, విలువను పెంచడం, ప్యాకింగ్ చేయడం, వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులను తయారు చేయడం, పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలను ద్వితీయ వ్యవసాయం అంటారు. ‘పంటను మాత్రమే అమ్మకుండా, పంటతో పాటు మరిన్ని ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పెంచుకోవ డమే ద్వితీయ వ్యవసాయం’.విలువ జోడించండి–ఎక్కువ ధరను పొందండిచాలా మంది రైతులు పంట కోసిన వెంటనే మార్కెట్‌కు తీసు కెళ్లి అమ్మేస్తారు; అప్పుడు ధర తక్కువగా ఉంటుంది. అదే పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మితే మంచి లాభం వస్తుంది. వరిని బియ్యంగా మార్చడం, బియ్యంతో అటుకులు, మరమరాలు తయారు చేయడం, వేరుశనగతో నూనె, పీనట్ బటర్ తయారు చేయడం, మిరపతో మిరప పొడి తయారు చేయడం, పసుపును పాలిష్ చేసి పసుపు పొడిగా విక్రయించడం, మామిడితో జ్యూస్, జామ్, పల్ప్ తయారు చేయడం ఈ కోవలోకే వస్తాయి. దీనివల్ల రైతు సాధారణంగాపొందే ధర కంటే 20–100 శాతం వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలకు విలువ జోడించడం ద్వితీయ వ్యవసాయంలో అత్యంత లాభదాయకమైన, స్థిరమైన మార్గం. ముడి ధాన్యాన్ని మాత్రమే విక్రయించే బదులు, పిండి, రవ్వ, రెడీ–టు–కుక్, రెడీ–టు–ఈట్, బేకరీ, ఆరోగ్య ఆహార ఉత్పత్తులుగా మార్చి బ్రాండ్ పేరుతో విక్రయిస్తే గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో గణనీయమైన నష్టం కోత అనంతరం సంభవిస్తుంది. సరైన నిల్వ, గ్రేడింగ్, ప్యాకింగ్ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఒక గ్రామంలోనే చిన్న రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, పప్పు మిల్లు లేదా మసాలా పొడి తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులకు దగ్గరలోనే మార్కెట్ లభిస్తుంది. అదనంగా గ్రామ యువతకు కూడా ఉపాధి లభిస్తుంది.అనుబంధ ఆదాయ మార్గాలురైతు ఇంట్లో రెండు ఆవులు లేదా గేదెలు ఉన్నా ప్రతి రోజు నగదు ఆదాయం వస్తుంది. పాలను నేరుగా అమ్మడం కంటే పెరుగు, నెయ్యి, పనీర్, వెన్న, చీజ్ తయారు చేసి అమ్మితే మరింత లాభం వస్తుంది. పాడి పరిశ్రమ రైతు కుటుంబానికి సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే అత్యుత్తమ అనుబంధ వృత్తి. అలాగే తేనెటీగల పెంపకానికి ఎక్కువ భూమి అవసరం లేదు. దీని ద్వారా తేనె, బీస్వాక్స్, రాయల్ జెల్లీ లభిస్తాయి. వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు వంటి వ్యవసాయ అవశేషా లను ఉపయోగించి పుట్టగొడుగులను పెంచవచ్చు. చిన్న గదిలోనే సాగు చేయవచ్చు. వ్యవసాయ కుంటలు, చెరువులు, ఫార్మ్పాండ్లలో చేపల పెంపకం చేపట్టవచ్చు. వరిసాగుతో పాటు చేపల పెంపకం చేపడితే ఒకే భూమి నుండి రెండు రకాల ఆదాయంపొందవచ్చు. వ్యవసాయం, పశుపోషణ ఒకదానికొకటి పరస్పర అనుబంధమైనవి. పంట అవశేషాలు పశుగ్రాసంగా ఉపయోగపడ తాయి. వర్మీ కంపోస్ట్, బయోగ్యాస్, సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి పశువుల పేడ ఉపయోగపడుతుంది. చాలా మంది రైతులు వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, చెరకు ఆకులు వంటి అవ శేషాలను కాల్చివేస్తారు. అలా చేయకుండా వాటిని ఉపయోగించి వర్మీకంపోస్ట్, బయోగ్యాస్, బయోచార్‌కు వినియోగించ వచ్చు.స్వపరాగ సంపర్క పంటల్లో వరి, శనగ, పెసర, మినుము, ఉలవలు, వేరుశనగ నాణ్యమైన విత్తన ఉత్పత్తి అనేది ద్వితీయ వ్యవసాయం కింద అత్యంత లాభదాయకమైన కార్యకలాపాలలో ఒకటి. తక్కువ విస్తీర్ణంలో సాగుచేయగలిగే మల్లె, గులాబీ, బంతి వంటి పూల సాగుతో పాటు తులసి, కలబంద, అశ్వగంధ, లెమన్ గ్రాస్ వంటి ఔషధ, సుగంధ మొక్కల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఇటీవలి కాలంలో నగర ప్రజలు గ్రామీణ జీవనశైలిని అనుభ వించడానికి ఆసక్తి చూపుతున్నారు. రైతులు తమ పొలాల్లో ప్రకృతి సందర్శన, సేంద్రీయ వ్యవసాయ ప్రదర్శనలు, గ్రామీణ ఆహారం, పంటల సందర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు.పోషకాహార లోపం తొలగించేలా...పంటల సాగు నిలిచిపోతే రైతులు, గ్రామీణ కుటుంబాల ఆదాయం దెబ్బ తింటుంది. దీనిని నివారించేందుకు ప్రతి ఇంటా నాటుకోళ్లను పెంచాలి. సొంత వినియోగానికే కాకుండా... గుడ్లు, మాంసానికి సంవత్సరమంతా ఆదాయం ఉంటుంది. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలురకం కోడి పిల్లలను పెంచవచ్చు.గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే.సంప్రదాయ భారతీయ ఆహారంలో ప్రొటీన్ల లోపం ఉంటుంది. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైన ప్రొటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతం ప్రొటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడి మాంసంలో 75–80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే... గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది.ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అభివృద్ధి పథకం, జాతీయ తేనెటీగలు మరియు తేనె మిషన్, డెయిరీ అభివృద్ధి పథకాలు, నాబార్డ్ గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పథకాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా శిక్షణ, రుణాలు, సబ్సిడీలు పొందవచ్చు. నేటి పరిస్థితుల్లో ‘పంట పండించడం మాత్రమే కాదు... పంటకు విలువ జోడించడం కూడా రైతు విజయానికి కీలకం. ‘వ్యవసాయంలో వైవిధ్యం – రైతు కుటుంబానికి స్థిరమైన ఆదాయం’ అనే లక్ష్యంతో ద్వితీయ వ్యవసాయాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రోత్సహించాలి.– డా‘‘ కె. తేజస్వర రావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి-ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ సీనియర్ శాస్త్రవేత్తలు -
భారతీయతకు ప్రతీక
మగ్గం చప్పుడు వినిపిస్తే అది కేవలం నూలుపోగులు అల్లే శబ్దం కాదు... ఒక కుటుంబం జీవన గీతం. ఒక గ్రామం ఆర్థిక స్పందన. ఒక నాగరికత ఊపిరి. సింధు లోయ నాగరికత తవ్వకాల్లో లభించిన ఆధారాలు భారతీయులు వేల ఏళ్ల కిందటే నూలు నేయడంలో నైపుణ్యం సంపాదించినట్లు చెబుతున్నాయి. కాలం మారినా చేనేత తన రూపాన్ని మాత్రమే మార్చుకుంది; తన ఆత్మను కాదు. ప్రతి అల్లికలో ఒక ప్రాంతపు సంస్కృతి, ప్రతి నమూనాలో ఒక సంప్రదాయం, ప్రతి వస్త్రంలో ఒక సమాజపు సృజనాత్మకత ప్రతిఫలిస్తూనే ఉంది. భారత చేనేత వైభవం దాని వైవిధ్యంలోనే కనిపిస్తుంది. ఉత్తరాన బెనారసీ, పష్మినా; దక్షి ణాన కాంచీపురం; తెలుగునాట గద్వాల్, పోచంపల్లి, మంగళగిరి, ఉప్పాడ; తూర్పున బలుచారి, అస్సాం పట్టులు; పశ్చిమాన పటోలా... ప్రాంతం మారితే అల్లిక మారుతుంది, రంగు మారుతుంది, నమూనా మారుతుంది. కానీ ప్రతి వస్త్రంలోనూ భారతీయ సంస్కృతి సౌందర్యమే ప్రతిబింబిస్తుంది. అందుకేప్రపంచ వస్త్ర సంపదలో భారత చేనేతకు ప్రత్యేక గౌరవం దక్కింది.దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక గ్రామీణ ఉపాధిని కల్పిస్తున్న రంగాల్లో ఇది ఇప్పటికీ ఒకటి. ఈ రంగంలో మహిళల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. నూలు వడకడం నుంచి రంగులు వేయడం, అల్లిక, డిజైన్, విక్రయాల వరకు ప్రతి దశలో మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి చేనేతకేవలం ఉపాధి కాదు; ఆర్థిక స్వావలంబనకు, కుటుంబ నిర్ణయాల్లో భాగస్వా మ్యానికి, ఆత్మవిశ్వాసానికి బలమైన ఆధారం. అందుకే గ్రామీణ మహిళా సాధికారతకు చేనేత ఒక మౌన విప్లవంగా నిలిచింది.ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనతనేడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణహిత ఉత్పత్తులపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని జాతీయ సంస్థలు సంప్రదాయం, సాంకేతికత, మార్కెట్ మధ్య వారధిగా నిలిచి నేతకార్మికులకు సాయం చేస్తున్నాయి. అయితే పవర్‌లూమ్‌ల పోటీ, చౌక దిగుమతులు, ముడి సరుకుల ధరల పెరుగుదల, మధ్యవర్తుల ఆధిపత్యం, మార్కెటింగ్ లోపాలు, డిజిటల్ వాణి జ్యంలో పరిమిత ప్రవేశం చేనేత రంగాన్ని ఇబ్బందులకు గురిచేయడం గమ నార్హం. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కని పరిస్థితుల్లో యువత ఈ వృత్తి వైపు ఆకర్షితులు కావడం లేదు. ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించి నేతను కాపాడాలి. దాన్ని కాపాడటం అంటే ఒక వృత్తిని రక్షించడం మాత్రమే కాదు; భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్నీ, లక్షలాది కుటుంబాల జీవనాధారాన్నీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థనూ పరిరక్షించడం కూడా!– వాడవల్లి శ్రీధర్ ‘ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
దొంగలున్నారు జాగ్రత్త!
దొంగలు ధనాన్ని దోచుకు వెళ్తారు. ధనమంటే నగదు మాత్రమే కాదు. ధన కనక వస్తు వాహనాల రూపంలో ఉండే విలువైన వస్తువులన్నింటికీ దొంగల వల్ల ప్రమాదమే. కొందరు ధనం లాగేస్తారు. కొందరు వాహనాలను చాకచక్యంగా దొంగిలిస్తారు. కొందరు కొత్త తరం దొంగలు బ్యాంకు ఖాతాల్లో ధనాన్ని చప్పుడు లేకుండా లాగి వేయగల బుద్ధిశాలులు! అయితే జీవితంలో విలువైనవి వస్తు రూపంలో ఉండనివి కూడా చాలా ఉన్నాయి. శీలమూ, సౌందర్యమూ, మేధస్సూ, ధర్మబుద్ధీ, సిగ్గూ, లజ్జా, వినయమూ, సహనమూ, ఆ మాటకొస్తే ప్రాణమూ– ఇవన్నీ రూకలలో వెలగట్టలేని నిధులే. వీటిని తస్కరించటంలో విశేషమైన కౌశల్యం కల దొంగలున్నారు (అంటాడు, మహాభారతంలో విదురుడు).జరా రూపం హరతి హి, ధైర్యం ఆశా. ముసలితనం అనే దొంగ, సౌందర్యం అనే ధనాన్ని, ఎంత జాగ్రత్తగా కాపాడుకొన్నా, తరలించుకు పోగలడు. అలాగే దురాశ అనే దొంగ, మనిషి ధీరత్వాన్నీ, ‘పెద్దమనిషి’తనాన్నీ నొక్కేయగలదు. ఆశలో చిక్కుకొన్నవాడు లేకితనానికీ, చవకబారుతనానికీ దిగజారి, నగుబాటు పాలవటం లోకంలో మామూలే కదా! మృత్యుః ప్రాణాన్ హరతి, ధర్మచర్యాం అసూయా. మృత్యువు, తనకు అనుకూలమైన సమయం వచ్చేదాకా వేచి ఉండి, అందరూ చూస్తుండగానే, ప్రాణాలను హరించుకుపోతుంది. ధర్మాత్ముడి ధర్మ బద్ధత అనే సంపదను, అసూయ అపహరించేస్తుంది. దుర్యోధనుడిని చూడండి.క్రోధః శ్రియం, శీలం అనార్యసేవా. క్రోధం అనే దొంగ మనసులో చొరబడితే, మనిషి వివేకం కోల్పోయి, పంతాలనీ పోట్లాటలనీ, కక్షలనీ కోర్టులనీ, తన సంపదను ఆ దొంగవాడికి సమర్పించుకొంటాడు. అలాగే దుష్టసాంగత్యం అనే చోరుడు, శీలాన్ని దోపిడీ చేసి, నిప్పులాంటి మనిషిని నికృష్టుడిగా మిగులుస్తాడు. కామం అన్న పిశాచి దొంగ, మనిషిలో సిగ్గునూ, లజ్జనూ కాజేసి, ఖాళీ చేస్తాడు. అందరికంటె ప్రమాదకరమైన పెద్ద దొంగ ‘అభిమానం’– అంటే అహంకారం. అది సర్వాన్నీ దోచుకు వెళ్ళగల దోపిడీ దొంగ. సర్వం ఏవ అభిమానః (హరతి), సందేహం లేదు. – ఎం. మారుతి శాస్త్రి -
రేర్ ఎర్త్ ఖనిజాల్లో ఇండియా ఎక్కడ?
రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ మరింత వేగం పుంజుకుంటు న్నట్లు ఇటీవల చోటుచేసుకుంటున్న పరి ణామాలు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ రంగంలో దాదాపు గుత్తాధిపత్యం చలాయించిన చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికా సహా పలు దేశాలు, ప్రత్యామ్నాయ సరఫరా వ్యవస్థ లను అభివృద్ధి చేయడంపై భారీగా పెట్టు బడులు పెడుతున్నాయి. ఈ ఖనిజాల తవ్వకం, శుద్ధీకరణ, శాశ్వత అయస్కాంతాల తయారీని వేగవంతం చేయడానికి ఇటీవల అమెరికా ప్రభుత్వం ‘మైన్–టు–మాగ్నెట్’ పథకం కింద భారీ ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. భారత్ కూడా ఈ దిశలో అడుగులు వేస్తోంది. అణుశక్తి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఐఆర్ఈఎల్ విశాఖపట్నంలో రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కేంద్రం ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేసింది. అంతకుముందు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ‘రేర్ ఎర్త్ కారిడార్లు’ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భిన్న దేశాల్లో, భిన్న సందర్భాల్లో దాదాపు ఒకే సమయంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి– అసలు రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ప్రపంచ దేశాలు ఎందుకు ఇంత తీవ్రంగా పోటీ పడుతున్నాయి?ఎందుకు రేర్?పేరులో ‘రేర్’ అనే పదం ఉన్నప్పటికీ, ఇవి ప్రకృతిలో అత్యంత అరుదుగా లభించే ఖనిజాలు కావు. భూమి పొరల్లో అనేకప్రాంతాల్లో లభిస్తాయి. అయితే, అధిక స్వచ్ఛతతో, లాభదాయకంగా తవ్వి, ఇతర ఖనిజాల నుంచి సులభంగా వేరు చేసి శుద్ధి చేయగల నిల్వలు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. అందుకే వీటికి ‘రేర్’ అనే విశేషణం వచ్చింది. అలాగే ‘ఎర్త్’ అనే పదం కూడా ఆ ఖనిజాల మూలస్థానమైన మట్టినిగానీ, నేలనుగానీ సూచించదు. తొలినాళ్లలో ఈ మూలకాలు భూమి నుంచి వెలికితీసిన ఖనిజ ఆక్సైడ్ల రూపంలోనే శాస్త్రవేత్తలకు మొదటిసారిగా పరిచయం కావడంతో, వాటికి ‘రేర్ ఎర్త్’ అనే పేరు స్థిరపడింది. మొత్తం 17 రేర్ ఎర్త్ మూల కాలు ఉన్నాయి.ఈ మూలకాలపై ప్రపంచం ఇంతటి ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం, సాధారణ లోహాలకు భిన్నంగా ఉండే వాటి అసాధారణ రసాయన, భౌతిక లక్షణాలే. వీటితో తయారయ్యే శాశ్వత అయ స్కాంతాలు పరిమాణంలో చిన్నవైనా, ఆకర్షణ శక్తిలో బలంగా ఉంటాయి. విద్యుత్ వాహనాల మోటార్లు, విండ్ టర్బైన్లు, విమా నాలు, రక్షణ రంగ పరికరాల్లో సుమారు 200 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకునే అధిక ఉష్ణోగ్రతల్లోనూ డిస్ప్రోసియం వంటి రేర్ ఎర్త్ మూలకాలు తమ అయస్కాంత శక్తిని పదిలపరచుకోగలవు. ఎందుకంత ప్రాముఖ్యం?ఇవి నేడు మనం నిత్యం ఉపయోగిస్తున్న అనేక ఆధునిక పరిక రాలకు కీలక ఆలంబనగా మారాయి. స్మార్ట్‌ఫోన్ , ఎల్ఈడీ టీవీ, ఇయర్‌బడ్స్, విద్యుత్ వాహనం, విండ్ టర్బైన్ , ఎంఆర్ఐ యంత్రం, ఉపగ్రహాలు, క్షిపణులు, యుద్ధ విమానాలు– ఇలా నేడు మనం ఉపయోగించే దాదాపు ప్రతి ఆధునిక పరికరం తయారీలో రేర్ ఎర్త్ మూలకాల పాత్ర ఉంటుంది. వీటిలో నియోడిమియంను అత్యంత శక్తిమంతమైన శాశ్వత అయస్కాంతాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తే, లాంథనం అధిక నాణ్యత గల కెమెరా లెన్సులు, బ్యాటరీల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్, అంతరిక్ష సాంకేతికత, స్వయంనియంత్రిత వాహనాల వంటి సమకాలీన ఆవిష్కరణలకు కూడా ఈ మూలకాలే చోదక శక్తిగా నిలుస్తున్నాయి.కోవిడ్ మహమ్మారి, తాజాగా హోర్మూజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా శృంఖలల బలహీనతను మరోసారి తేటతెల్లం చేశాయి. అత్యవసర వనరుల కోసం ఒకే దేశంపై అధికంగా ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ప్రపంచం అనుభవపూర్వకంగా ఈ సందర్భాల్లో గ్రహించింది. ఇదే సమయంలో అమెరికా, చైనా మధ్య సాంకేతిక ఆధిపత్య పోటీ తీవ్ర తరమైంది. రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా పరిమితులు విధించడం ఆందోళనను మరింత పెంచింది. ప్రపంచంలోనే అత్యధిక రేర్ ఎర్త్ ఖనిజ నిల్వలు చైనాలో లేనప్పటికీ, గత మూడు దశాబ్దాల కృషి ఫలితంగా ఈ రంగంలో గుత్తాధిపత్యం మాత్రం దానిదే. ముడి ఖనిజాల తవ్వకంతో ఆగిపోకుండా, వాటి శుద్ధీకరణ, శాశ్వత అయ స్కాంతాలు, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ వరకు మొత్తం విలువ గొలుసుపై చైనా క్రమంగా ఆధిపత్యం సాధించింది.భారత్ ఏం చేయాలి?భారత్‌లో విస్తారమైన రేర్ ఎర్త్ నిల్వలు ఉన్నప్పటికీ, వెలికితీత అనంతర దశల్లో ఇంకా వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన వ్యూహానికి పదును పెట్టుకుంటూ, రేర్ ఎర్త్ ఖనిజాల తవ్వకానికే పరిమితం కాకుండా, అనుబంధ పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీ కేంద్రాన్ని ఐఆర్ఈఎల్ ప్రతిపాదించడం ఆహ్వానించదగ్గ పరిణామం. రేర్ ఎర్త్ ఖనిజాల రంగంలో ప్రపంచంతో పోటీ పడాలంటే గనులతో పాటుగా వాటిని శుద్ధి చేయగల, శాశ్వత అయస్కాంతా లుగా మలచగల, అత్యాధునిక ఉత్పత్తులుగా తీర్చిదిద్దగల నిపుణుల లభ్యత కూడా కీలకం. ఈ దిశగా భారతదేశంలో ఇప్పటివరకూ అంతగా ఆదరణకు నోచుకోని మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెటీరి యల్స్ సైన్స్, రేర్ ఎర్త్ సాంకేతికతలను మరింత ప్రోత్సహించాలి. ఐఐటీలు, ఎన్ ఐటీలు, ఇతర విశ్వవిద్యాలయాల్లో రేర్ ఎర్త్ మెటలర్జీ, క్రిటికల్ మినరల్స్, మాగ్నెట్ టెక్నాలజీ వంటి ప్రత్యేక కోర్సులు, పరిశోధన కేంద్రాల ఏర్పాటు తక్షణావసరం. అయితే వీటికి సమర్థమైన ప్రత్యామ్నాయాలను కనుగొనగలమా? సముద్ర గర్భం, చంద్రుడిపై ఉన్న ఈ ఖనిజ నిక్షేపాలను వినియోగించడం సాధ్యమవుతుందా? వీటి తవ్వకం, శుద్ధీకరణ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలను ఎలా నియంత్రించాలి? ఈ ప్రశ్నలకు లభించే సమాధానాలు పరిశోధనా సంస్థలకే పరిమితం కాకూడదు. అవి సామాన్య ప్రజలకు ఉపయోగపడే, అందుబాటులో ఉండే ఉత్పత్తులు, సాంకే తిక పరిష్కారాలుగా రూపాంతరం చెంది నప్పుడే ఆ పరిశోధనల పరమార్థం నెరవేరినట్లవుతుంది.కృష్ణ బాలాజి పల్లపోతువ్యాసకర్త బ్యాంకింగ్ రంగ నిపుణులు -
కోర్టు ధిక్కారంపై చట్టం ఏమంటోంది?
‘హైడ్రా’ కమిషనర్‌పై అరవైకి పైగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలున్నాయనీ, ఆయన్ని ఈ బాధ్యత నుంచి తప్పించాలనీ ఇటీవల తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘అధికార వికేంద్రీకరణ’ ముఖ్యం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. శాసన సభలు చట్టాలు చేస్తాయి, ‘కార్యనిర్వాహకవర్గం’ ఆ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలు జరగకపోతే జరిగేలా ఆదేశా లిస్తుంది.స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా న్యాయ స్థానాలు వ్యవహరించేందుకు రాజ్యాంగం ద్వారా తగు ఏర్పాటు జరిగింది. హైకోర్టు, సుప్రీం కోర్టు లకు కంటెంప్ట్ అధికారం కూడా రాజ్యాంగంలోని 215, 129 అధికరణాల ద్వారా దఖలుపడింది. దేశంలోని అన్ని న్యాయ స్థానాలు, అధికారులు సుప్రీం కోర్టుకు సహాయ సహకారాలు అందించాలని 144వ అధికరణం నిర్దేశించింది.కోర్టులు చట్టాలననుసరించి న్యాయ నిర్ణయం చేయాలి. కానీ, సంపూర్ణ న్యాయం చేయడానికి, చట్టాలను దాటి కూడా న్యాయ నిర్ణయం చేసే అధికారం ఆర్టికల్ 142 ద్వారా, సుప్రీంకోర్టుకు (విశేషాధికారాలను) కల్పించింది రాజ్యాంగం. న్యాయస్థానాల తీర్పులను గౌరవించి వాటిని అమలుపరచాలన్నది ప్రాథమిక సూత్రం. ఒక వేళ, న్యాయం జరగలేదని అనిపిస్తే, సుప్రీంకోర్టు వరకు అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంది.చట్టం ఏం చెబుతోంది?న్యాయస్థానాల తీర్పులను గౌరవించకపోతే, న్యాయవ్యవస్థ ఉనికే ప్రశ్నార్థకమౌతుంది. అందుకే న్యాయస్థానాల తీర్పులను గౌరవించ డానికి, అమలుపరచడానికి కోర్టులకు ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం– 1971’ ద్వారా ‘కంటెంప్ట్’ అధికారం కలుగచేసింది పార్లమెంటు. ఈ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం, న్యాయస్థానాల ఆదే శాలు ఉల్లంఘించినవారికి, ఆరు నెలల వరకు జైలు శిక్ష, రెండు వేల రూపాయల వరకు జరిమానా లేక ఈ రెండూ కూడా విధించవచ్చు. కక్షిదారులేకాక, మరెవరైనా న్యాయస్థానాల ఆదేశాల అమలులో అడ్డంకులు కలిగిస్తే, వారు కూడా శిక్షార్హులే. ‘కంటెంప్ట్’ అధికారం కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే కలుగచేసింది ఈ చట్టం. కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికి కాక నిజాయితీగా ‘క్షమార్పణ’ వేడితే శిక్ష వేయకుండా, లేదా తక్కువ కాలానికి శిక్ష విధించవచ్చని ఈ చట్టం స్పష్టం చేసింది. కిందిస్థాయి న్యాయ స్థానాల ఆదేశాలను పాటించనివారిపై ‘కంటెంప్ట్’ను విచారించి శిక్షించే అధికారాన్ని హైకోర్టులకే ఇచ్చింది ఈ చట్టం.కోర్టులు చాలా అరుదుగా ఈ అధికారాన్ని వినియోగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కోర్టు తీర్పులను నిజాయితీగా విమర్శించ డాన్ని ఈ చట్టం ‘కంటెంప్ట్’గా పరిగణించదు. కోర్టు తీర్పులను గుణాత్మకంగా విమర్శించవచ్చు. కానీ, తీర్పునిచ్చిన న్యాయ మూర్తిని వ్యక్తిగతంగా విమర్శిస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారవుతారు. ఇంతవరకు, కోర్టు ధిక్కరణ నేరానికి ఎక్కువ కాలానికి శిక్ష అనుభవించింది జస్టిస్ కర్ణణ్. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతర్ చేయకపోవడమే కాకుండా, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే సమన్లు పంపి, వారికి జైలు శిక్ష విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. మొత్తం మీద ప్రభుత్వ అధికారులే ఎక్కువగా కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కోవడం గమనార్హం.– హరీష్ కుమార్ కొలిచాల, న్యాయవాది, అసిస్టెంట్ జనరల్ మానేజర్ (విశ్రాంత), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
అణుదాడిని మరిస్తే శాంతి నెలకొనదు!
1945 ఆగస్టు 6 ఉదయం 8:15 గంటలకు హిరోషిమాలో ఉదయపు హడావుడి మొదలైంది. వీధుల్లో కార్లు శబ్దం చేస్తూ వెళ్తున్నాయి, ఆఫీసు ఉద్యోగులు తమ బల్లల వద్ద కుదురుకుంటున్నారు, పిల్లలు పాఠశాలలకు సిద్ధమవుతున్నారు. అంతలోనే, ఒక్క క్షణంలో, సూర్యుడి కంటే అత్యంత ప్రకాశవంతమైన కాంతి నగర మంతటా వ్యాపించింది. ఒక అమెరికా బి–29 బాంబర్ ‘ఎనోలా గే’ ప్రపంచంలోనే తొలి సారిగా అణుబాంబును జారవిడిచింది. ఆకాశంలోకి మష్రూమ్ క్లౌడ్ (పుట్టగొడుగు లాంటి పొగ) ఎగిసిపడటంతో క్షణాల్లో పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1945 చివరి నాటికి, పేలుడు, తీవ్రమైన కాలిన గాయాలు, రేడియేషన్ కారణంగా సుమారు 1,40,000 మంది మరణించారు.ఆ బాంబు దాడిని ప్రత్యక్షంగా చూసిన వారిలో తమేతో ఉఎమోరి ఒకరు. అప్పట్లో 40 ఏళ్ల వయసున్న ఉఎమోరి, మరుసటి రోజు తన కుటుంబ సభ్యుల కోసం శిథిలాలలో వెతకడం ప్రారంభించారు. ఆ క్రమంలో, గాయపడిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నించారు. ఆయన ఎటు చూసినా ఊహకు అందని దారుణ దృశ్యాలే: గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన జనాలు, నీళ్ల కోసం అరుస్తున్న బాధితులు, బూడిదగా మారిన పొరుగు ప్రాంతాలు. మరణించిన వారి దేహాలపై ఈగలు, పురుగులు ముసురుకోవడం ప్రారంభించాయని ఉఎమోరి 1987లో తన 88వ ఏట ‘అసోసియే టెడ్ ప్రెస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ఆ బాంబు దాడిలో తన తమ్ముడితో సహా సొంత కుటుంబ సభ్యులు మరణించారని ఆయన చివరికి తెలుసుకున్నారు. ఆ జ్ఞాపకాలు ఆయనను ఎన్నడూ వదల్లేదు.దుఃఖం నుంచి పోరాటానికి...హిరోషిమా అనుభవించిన ఘోరాన్ని మరెవరూ అనుభవించ కుండా చూడటానికి ఉఎమోరి తన మిగిలిన జీవితాన్ని అంకితం చేశారు. అణు బాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన అనేకమంది ’హిబాకుషా’లలో ఒకరిగా మారారు. వీరు తమ వ్యక్తి గత విషాదాన్ని అణు ఆయుధాలకు వ్యతిరేకంగా జీవితకాల పోరా టంగా మార్చుకున్నారు. తదనంతరం మరణించిన ఉఎమోరి, 1987 నాటి తన ఇంటర్వ్యూలో, అణు నిరాయుధీకరణ గురించి ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. అది నేటికీ అత్యంత అత్యవసరమైనది. విధ్వంసాన్ని ప్రత్యక్షంగా చూసిన మరొక వ్యక్తి శాండ్ఫోర్డ్ జెడ్. పర్సన్స్. రెండవ ప్రపంచ యుద్ధంలో యు.ఎస్. నేవీలో పనిచేశారు. బాంబు దాడి జరిగిన నాలుగు నెలల తర్వాత ఆయన హిరోషి మాలో పనిచేస్తున్నప్పుడు, తాను ఊహించినదానికి భిన్నమైన విధ్వంసాన్ని చూశారు. నగరంలోని అనేక ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయాయి. ఆ అనుభవం పర్సన్స్‌ను వెంటాడింది. చివరికి శాంతి కోసం తనను అంకితం చేసుకున్నారు. వరల్డ్ ఫెడరలిస్ట్ మూవ్మెంట్ డైరెక్టర్‌గా మారి, 1984లో మరణించే వరకు అణు ఆయుధాల ముప్పును తగ్గించే అంతర్జాతీయ ఒప్పందాల కోసం పోరాడారు. ఒకరు జపనీస్, మరొకరు అమెరికన్. వారు చరిత్రలోనే అత్యంత విధ్వంసకర యుద్ధంలో పరస్పరం వ్యతిరేక దిశల్లో నిలబడ్డారు. అయినప్పటికీ, మానవాళి భవిష్యత్తు అణు ఆయు ధాలు మళ్లీ ఎప్పటికీ ఉపయోగించకుండా చూడటంపైనే ఆధారపడి ఉంటుందని ఇద్దరూ నమ్మారు.ఆయుధం వర్సెస్ ఆహారంయునైటెడ్ స్టేట్స్ 1945 ఆగస్టు 6న హిరోషిమాపై, మూడు రోజుల తర్వాత ఆగస్ట్ 9న నాగసాకిపై మరో అణు బాంబునువేసింది. రెండవ ప్రపంచ యుద్ధాన్ని ముగించడానికి ఈ దాడులు అవసరమా లేదా జపాన్ ను ఇతర మార్గాల ద్వారా లొంగిపోయేలా చేయవచ్చా అనే దానిపై చరిత్రకారులు ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉన్నారు. అయితే వివాదానికి తావులేని విషయం ఏమిటంటే, ఆ బాంబు దాడులు అణు ఆయుధాల అసమాన విధ్వంసక శక్తిని నిరూపించాయి. మానవాళి వెనక్కి రాలేని ఒక తీవ్రమైన సరిహద్దును దాటేసింది. హిరోషిమా, నాగసాకిలను నాశనం చేసిన బాంబులు ఆధు నిక ప్రమాణాలతో పోలిస్తే ప్రాథమికమైనవి (చిన్నవి). నేటి అణు ఆయుధాలు అంతకంటే విధ్వంసకరమైనవి. ఆర్మ్స్ కంట్రోల్ అసో సియేషన్ ప్రకారం, ప్రపంచంలోని అణుశక్తి దేశాలు సంయుక్తంగా 12,000 కంటే ఎక్కువ అణు ఆయుధాలను కలిగి ఉన్నాయి. చాలా వరకు హిరోషిమాను నాశనం చేసిన బాంబు కంటే ఎంతో శక్తిమంత మైనవి. ఒకే ఒక ఆధునిక థర్మోన్యూక్లియర్ ఆయుధం ఒక మహా నగరాన్నే తుడిచిపెట్టగలదు.ఐరిష్ రచయిత పాట్రిక్ కమర్‌ఫోర్డ్ మరో ముఖ్యమైన కోణాన్ని ప్రస్తావించారు. ఒక్క అణు క్షిపణికి అయ్యే ఖర్చుతో వేలాదిమంది పిల్లలకు ఆహారం, స్వచ్ఛమైన నీరు, మందులను అందించవచ్చని ఆయన అన్నారు. అణు ఆయుధాలను ఎప్పటికీ ప్రయోగించక పోయినా అవి భారీ ఖర్చును మోపుతాయి. ఆయుధాగారాలను నిర్వహించడానికి, ఆధునికీకరించడానికి ప్రభుత్వాలు అపారమైన నిధులను వెచ్చిస్తాయి. అణు నిల్వలను విస్తరించడానికి వెచ్చించే ప్రతి రూపాయి ప్రజారోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు లేదా శాస్త్రీయ పరిశోధనలకు లభించకుండా పోతుంది.ఒప్పందాలతోనే శాంతిభద్రత ముఖ్యమైనదే. రక్షణ గురించి దేశాలకు ఆందోళనలు ఉంటాయి. అయితే ఆయుధ నియంత్రణ ఒప్పందాలు ప్రపంచాన్ని మరింత సురక్షితంగా మార్చాయని చరిత్ర నిరూపిస్తోంది. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) అణు ఆయుధాల వ్యాప్తిని పరిమితం చేయడానికి సహాయపడింది. కోల్డ్ వార్ కాలంలో వాషింగ్టన్, మాస్కో మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు వేలాది అణు ఆయుధాలను నిర్మూలించాయి. యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఆయుధాగారాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రమాదాన్ని తగ్గించే విషయంలో అవే అత్యధిక బాధ్యత వహించాలి. ఉక్రెయిన్ యుద్ధం, ఇతర ప్రాంతీయ సంక్షోభాలను పరిష్కరించే ప్రయత్నా లతో పాటు ఈ శక్తుల మధ్య తీవ్రమైన చర్చలు జరగాలి. చరిత్రలో ఆయుధ నియంత్రణ విజయవంతమైంది దేశాలు ఒకరినొకరు నమ్మడం వల్ల కాదు, ఉమ్మడి ముప్పు సహకారాన్ని కోరుతుందనే విషయాన్ని గుర్తించడం వల్లనే!హిరోషిమాను ప్రత్యక్షంగా చూసిన తరం వేగంగా కనుమరుగ వుతోంది. 1945 నాటి ఆ ఆగస్టు రోజున తాము ఏమి చూశారో వివ రించగలిగే బాధితులు త్వరలోనే ఎవరూ ఉండరు. మిగిలేది వారి మాటలు, వారి హెచ్చరికలు, వారు మనకు వదిలివెళ్లే బాధ్యత మాత్రమే. తమేతో ఉఎమోరి తన జీవితాంతం ప్రపంచాన్ని హిరోషిమాను గుర్తుంచుకోమని కోరింది అది కేవలం చరిత్ర అని కాదు. ఆయన జీవించిన చరిత్ర మళ్లీ పునరావృతం కాకూడదని! హిరోషిమా అణుబాంబు దాడి రోజు కేవలం జ్ఞాపకార్థ దినం మాత్రమే కాకూడదు. ఇది ‘నిరాయుధీకరణ దినోత్సవం’ కావాలి. ప్రభుత్వాలు అణు ప్రమాదాలను తగ్గించడానికి అంకితం చేసుకునే రోజు, సాధారణ పౌరులు అలా చేయాలని డిమాండ్ చేయడానికి పునరంకితం అయ్యే రోజు కావాలి. బాధితులు ఇప్పటికే తమ సాక్ష్యాన్ని ప్రపంచానికి అందించారు. మనం దానికి అనుగుణంగా స్పందిస్తామా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది.విలియమ్ ల్యాంబర్స్వ్యాసకర్త ‘ద రోడ్ టు పీస్’ రచయిత(‘ద జపాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
జ్ఞానం పంచితేనే పెరిగే సంపద
ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహైతేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతిఃతైత్తిరీయోపనిషత్తులోని శాంతి మంత్రం ఇది. పూర్వం విద్యాభ్యాసానికి ముందు ప్రతి దినం గురు శిష్యులు ముక్తకంఠంతో ఈ శ్లోకాన్ని పఠించేవారు. ‘మనం కలిసి మెలిసి ఉందాము. కలిసి మెలిసి ఫలితాలను అనుభవిద్దాము. కలిసి పనులను చేస్తూ తేజో పూర్ణుల మవుదాము. మనలో మనకు వైషమ్యాలు ఉండకుండు గాక. శాంతితో విలసిల్లుదాము’ అని చేసే ఉత్తమ ప్రార్థన ఇది.ఈ ప్రార్థన గురుశిష్యు లిరువురి మనస్సులో నిక్షిప్తమై ఉండేది. ఇరువురు కలిసి విజ్ఞాన కృషి సలపాలి. కలిసి విజ్ఞాన ఫలం పొందాలి. గురు శిష్యుల మధ్య విబేధాలు లేకుండా శాంతియుతంగా విజ్ఞానార్జన చేయాలి అనే సమభావన; గురువును శిష్యుడు, శిష్యుని గురువు పరస్పరం గౌరవించుకునే ఉన్నత భావన ప్రాచీన విద్యావిధానంలో కనిపిస్తుంది. అప్పుడు విద్య అంటే గురు శిష్యు లిద్దరు కలిసి చేసే నిత్య సత్య శోధనా యత్నం.విద్య నిరంతర ప్రవాహం. పరంపరా గతంగా విస్తరించేది. గురువు నుండి శిష్యుడు నేర్చుకున్న విద్య, సంస్కారం తర్వాత మళ్ళీ తన శిష్యులకు అందజేస్తాడు. ఆ శిష్యుల నుండి తరవాతి వారికి అలా అందుతూనే ఉంటుంది. ఇది నిరంతర జ్ఞానగంగా ప్రవాహం. ఇచ్చే కొద్దీ పెరిగే సంపద జ్ఞాన సంపద. ఆనాడు గురు శిష్య సంబంధాలు ఎంత ఆదర్శంగా ఉండేవో, జ్ఞానార్జన ఎలా సాగేదో ఈ శ్లోకం చెబుతోంది.– డా. చెంగల్వ రామలక్ష్మి -
కెమిస్ట్రీని మలుపు తిప్పిన ఆక్సీజనుడు
మనం పీల్చే గాలిలో ఏముంది? ఈ ప్రశ్న ఇప్పుడు చిన్నదిగా అనిపించవచ్చు. కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం వరకు దీనికి సమాధానం ఎవరికీ తెలియదు. పురాతన గ్రీకులు చెప్పినట్టు గాలి అనేది ఒక మార్పు లేని ప్రాథమిక మూలకం అని ప్రపంచం నమ్మింది. ఈ నమ్మకాన్ని బద్దలుకొట్టి, మనం ప్రాణాలతో ఉండటానికి కారణమయ్యే ‘ఆక్సిజన్’ గుట్టు విప్పినవాడు జోసెఫ్ ప్రీస్ట్లీ. ఆయన కేవలం ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు; ఒక ఉపాధ్యాయుడు, మత బోధకుడు, విప్లవ భావాలున్న సాహసి.బ్రిటన్‌లో జన్మించిన ఆయన జీవితం ఎంతో ఆసక్తికరంగా సాగింది. లీడ్స్ నగరంలో నివసిస్తున్నప్పుడు, ఆయన ఇంటి పక్కనే ఒక బీర్ తయారీ కేంద్రం ఉండేది. అక్కడ పులియబెట్టే ప్రక్రియలో వచ్చే ‘ఫిక్స్డ్ ఎయిర్’ (కార్బన్ డయాక్సైడ్)పై ఆసక్తి కలిగింది. నేటి సాఫ్ట్ డ్రింక్ పరిశ్రమకు పునాది వేసింది ఆ ఆసక్తే. నీటిలో కార్బన్ డయాక్సైడ్ను కలిపి కృత్రిమంగా ‘సోడా వాటర్’ను తయారు చేసే విధానాన్ని ఆయన కనిపెట్టారు.1774 ఆగస్టు 1న ఆయన చేసిన ప్రయోగం అతి ముఖ్యమైనది. ఒక భూతద్దం సహాయంతో సూర్యరశ్మిని మెర్క్యూరిక్ ఆక్సైడ్ పొడి మీద కేంద్రీకరించినప్పుడు దాని నుంచి ఒక రకమైన వాయువు వెలువడటం గమనించారు. అది సాధారణ గాలి కంటే ఐదారు రెట్లు స్వచ్ఛంగా ఉండటమే కాకుండా, అందులో మంటలు మరింత ప్రకాశవంతంగా కనిపించాయి. ఆ వాయువును పీల్చినప్పుడు ఊపిరితిత్తులు ఎంతో తేలికగా అనిపించాయి. ఆ గాలిలో ఒక ఎలుక సాధారణ గాలిలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ సేపు ప్రాణంతో ఉండటాన్ని గమనించారు. దానికి ఆయన ‘డీఫ్లోజిస్టికేటెడ్ ఎయిర్’ అని పేరు పెట్టాడు. తర్వాత ఫ్రెంచ్ శాస్త్రవేత్త లావోయిజర్ దీనికి ‘ఆక్సిజన్’ అని నామకరణం చేశారు.ప్రకృతిలో సమతుల్యత ఎలా కాపాడబడుతుందో కూడా ప్రీస్ట్లీ మొదటగా గుర్తించారు. ఒక మూసి ఉన్న పాత్రలో మంట వెలిగించినా లేదా ఎలుకను ఉంచినా కొద్ది సేపటికి ఆ గాలి కలుషితమై మంట ఆరిపోవడం, ఎలుక చనిపోవడం జరిగేది. కానీ అదే పాత్రలో ఒక పచ్చని మొక్కను ఉంచి ఎండలో పెడితే, అది గాలిని తిరిగి ‘శుద్ధి’ చేస్తుందని ఆయన కనుగొన్నారు. ఆయన కనిపెట్టిన ఆక్సిజన్ వైద్య చికిత్సల నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇటువంటి పెద్ద ఆవిష్కరణలే కాదు... నిత్య జీవితంలో మనకు ఉపయోగపడే చిన్న చిన్న విషయాలను కూడా ఆయన విస్మరించలేదు. మనం పెన్సిల్‌తో రాసిన తప్పులను తుడిపే ‘రబ్బర్ ఎరేజర్’ను కూడా ఆయనే కనిపెట్టారని తెలిస్తే మనకు మరింత ఆశ్చర్యం కలుగుతుంది! అందుకే అతడు గొప్పవాడయ్యాడు!అసమ్మతి స్వరంప్రీస్ట్లీ జీవితం కేవలం ప్రయోగశాలకే పరిమితం కాలేదు. ఆయన మతపరమైన ఆలోచనలు భిన్నంగా ఉండేవి. ఆ కాలంలో ‘చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్’ సిద్ధాంతాలను ఆయన వ్యతిరేకించారు. ఆయనొక ‘డిసెంటర్’ (అసమ్మతివాది) కావడంతో ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి పెద్ద విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి అనుమతి దక్కలేదు. అయినప్పటికీ పట్టుదలతో లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్ వంటి భాషలు సొంతంగా నేర్చుకున్నారు.అమెరికా, ఫ్రెంచ్ విప్లవాలకు ఆయన మద్దతు పలకడం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చలేదు. ఆయనపై ‘ద్రోహి’ ముద్ర వేశారు. 1791లో బర్మింగ్‌హామ్‌లో ఉన్నాదులు కొందరు ఆయన ఇంటిని, ప్రయోగశాలను తగలబెట్టారు. ఆయన రాసుకున్న ఎన్నో విలువైన పరిశోధన పత్రాలు బూడిదయ్యాయి. ప్రాణభయంతో ఆయన లండన్ పారిపోయి, చివరకు 1794లో అమెరికాకు వలస వెళ్లారు. పెన్సిల్వేనియాలోని నార్తంబర్ల్యాండ్ అనే మారుమూల గ్రామంలో స్థిరపడి మళ్ళీ పరిశోధనలు ప్రారంభించారు. అక్కడ ‘కార్బన్ మోనాక్సైడ్’ వాయువును కనిపెట్టారు. ‘యూనిటేరియన్ చర్చి’ని స్థాపించారు. అమెరికా మాజీ అధ్యక్షులు థామస్ జెఫర్సన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆయనకు ఆప్తమిత్రులు. ఆక్సిజన్‌ను కనిపెట్టిన శత వార్షికోత్సవం సందర్భంగా, ఆయన గౌరవార్థం 1876లో ‘అమెరికన్ కెమికల్ సొసైటీ’ ఏర్పాటైంది. ప్రీస్ట్లీ మరణించినప్పుడు (1804 ఫిబ్రవరి 6) ‘మానవాళికి అత్యంత విలువైన కొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు’ అని థామస్ జెఫర్సన్ నివాళులర్పించారు.- ఎడిటోరియల్ టీమ్ -
శాస్త్రీయ శోధనే విశ్వాసానికి పరీక్ష
ఇటీవల పార్లమెంట్లో గోమూత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినవచ్చాయి. ప్రవేశ పరీక్ష సంస్కరణలపై సత్వర కార్యాచరణ బృందంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మద్రాసు) డైరెక్టర్ వీళినాథన్ కామకోటిని నియమించిన సందర్భంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ‘ఫంగల్, బ్యాక్టీరియల్, ఇన్ఫ్లమేటరీలకు నిరోధకంగా’ పనిచేయగల శక్తి గోమూత్రానికి ఉందనీ, అవి ‘వైజ్ఞానికంగా కూడా ప్రదర్శితమయ్యా’యనీ గత ఏడాది జనవరిలో ఒక బహిరంగ సమావేశంలో కామకోటి పేర్కొన్నారు. గోమూత్రంపై కామకోటి అభిప్రాయాలను తోసిపుచ్చడం రాజ్యాంగంలో పేర్కొన్న శాస్త్రీయ దృక్పథాన్ని తక్కువ చేయడం అవుతుందంటూ కొందరు విద్యావేత్తలు కామకోటికి మద్దతు పలికారు. తాను నిజమని నమ్మేదానిని ‘తాత్కాలికంగా ప్రతిపాదించే, సంప్రదాయ విజ్ఞానాన్ని చర్చకు పెట్టే’ హక్కు కామకోటికి ఉందని వారు అన్నారు. కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ కూడా కామకోటికి వత్తాసు పలికారు. అధికారిక మద్దతుగోమూత్రం, పేడపై పరిశోధన కొత్తదేమీ కాదు. గోమూత్ర గుణాల గురించి 1970లు, 1980లలో కూడా కొన్ని క్లెయిములు వినవచ్చాయి. పరిశోధనా పత్రాలు వెలువడ్డాయి. కానీ, వాటిని అల్పమైనవిగానే పరిగణిస్తూ వచ్చారు. అటువంటి పరిశోధనకు అధికారిక మద్దతు లభించడం కొత్త ధోరణి. వాటికి ఐఐటీలు, ఐఐఎంల డైరెక్టర్ల వంటి ఉన్నత స్థాయి విద్యావేత్తల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అయితే, వారు బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ లేదా డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో నిపుణులై ఉండనక్కరలేదనే సంగతిని ఈ సందర్భంగా చాలామంది విస్మరిస్తున్నారు. ఒక అంశాన్ని పరిశోధనకు పెట్టేటప్పుడే దాన్ని శాస్త్రీయంగా నిరూపించాలనుకోవడం వల్ల ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాల ప్రభావం దానిపై ఉంటుంది. దేన్నో ధ్రువీకరిం చాలనే పక్షపాత వైఖరి పరిశోధనకు మేలు చేయదు. మానవ దేహం, దానికొచ్చే వ్యాధులు, వాటిని నయం చేసే మార్గాల గురించి ప్రాచీన గ్రంథాలు, సంప్రదాయ విజ్ఞానం చెప్పే అంశాలు ఎంత స్థూలంగా ఉంటాయంటే, వాటిని ఏ ఆధునిక ఆవిష్కరణ లేదా భావనకైనా వర్తింపజేయెచ్చు. దాని ఆలంబనగా ప్లాస్టిక్ సర్జరీ, మూలకణ చికిత్స, పునరుత్పత్తి సాంకేతికత, ఉపగ్రహ కమ్యూనికేషన్ వంటివన్నీ ప్రాచీన భారతదేశంలో వాడుకలో ఉన్నవే అంటూంటారు. గోమూత్రానికి కూడా అదే విధంగా విలువను ఆపాదించే వైఖరిని కనబరుస్తున్నారు. కొన్ని ఖనిజాల జాడలు, అమైనో ఆమ్లాలు, చిన్న గొలుసులతో కూడిన చిన్న ప్రొటీన్ భాగాలు గోమూత్రంలో లేదా దాని పేడలో కనిపించినంత మాత్రాన దాని వైద్య గుణగణాలకవి తగినంత రుజువు కాబోవు. ఎందుకంటే, అలాంటివి మానవ మూత్రంలోనూ, ఎద్దులు, జడలబర్రె, లేళ్ళు వంటి ఇతర క్షీరదాలలో కూడా కనిపిస్తాయి. మహా అయితే, అటువంటి పరిశోధన సూడోసైన్స్ పరిధిలోకి వస్తుంది. యూరిన్ కెమిస్ట్రీని వర్ణించేందుకు కొంత వైజ్ఞానిక పరిభాషను ఉపయోగిస్తారు కనుక అది సైన్స్‌గా కనిపిస్తుంది. నవ భారతానికి ప్రాచీన జబ్బుకీమోథెరపీ సంబంధిత తక్కువ ప్లేట్లెట్ కౌంట్ల సమస్యకు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారంగా బొప్పాయి ఆకుల నుంచి తీసిన దానిని వినియోగించుకోవచ్చని ఒక నూతన అధ్యయనంలో తేలినట్లు ప్రభుత్వం ఇటీవల పేర్కొంది. ఆ అధ్యయన ఫలితాలను ఒక ఆంకాలజీ జర్నల్‌లో ప్రచురించారు. కానీ, స్వతంత్ర నిపుణుల అభ్యంతరాలతో ఆ పత్రిక ఆ ఫలితాలను పునః సమీక్షించుకోవాల్సి వచ్చింది. బొప్పాయి ఆకుల నుంచి తీసిన పదార్థ ప్రభావం గొప్పగా ఉందని చూపేందుకు, ఆ పదార్థాన్ని ఉపయోగించినా ఫలితం చూపని రోగుల వివరాలను ఆ అధ్యయన ఫలితాలకు జోడించలేదని స్వతంత్ర నిపుణులు అభ్యంతరం తెలిపారు. పసుపు వేరులలో లభించే రసాయన పదార్థం కర్కుమిన్ విషయంలోనూ ఇదే జరిగింది. క్యాన్సర్‌తో సహా పలు వ్యాధులకు ఆ మూలిక గొప్ప ఔషధంగా పనిచేస్తుందని ప్రచారం చేశారు. కర్కుమిన్పై భరత్ అగర్వాల్ అనే అమెరికన్ పరిశోధకుడు రాసిన 30కి పైగా పరిశోధన పత్రాలను అంతర్జాతీయ పత్రికలు వెనక్కి తీసుకున్నాయి. గుండె వ్యాధి ముదిరే ప్రక్రియపై భారత–మధ్యధరా సముద్ర తీర ప్రాంత ఆహారపు అలవాట్లు చూపగల ప్రభావంపై మొరాదాబాద్‌కు చెందిన ఆర్.బి. సింగ్ 1990లలో పరిశోధించారు. ఆయన మన ఆహార అలవాట్లను ఇజ్రాయెల్, స్లొవేకియా ప్రాంతవాసుల ఆహార అలవాట్లతో పోల్చి చూశారు. వాటిని లాన్సెట్, బ్రిటిష్ మెడికల్ జర్నల్స్‌లో ప్రచురించారు. కొద్ది ఏళ్ళ తర్వాత, ఆ అధ్యయనానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్ డేటా సాధికారతను కొందరు ఇండిపెండెంట్ సైంటిస్టులు ప్రశ్నించారు. అధ్యయనానికి చెందిన ఒరిజినల్ డేటాను కోరినప్పుడు, ఆ పత్రాలను చెద పురుగులు తినేశాయని సింగ్ జవాబిచ్చారు. ధ్రువీకరించాలనుకునే వైఖరి వల్ల సేఫ్టీ అంశాలు కూడా పక్కనపడతాయి. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్న నేచురల్ రెమిడీల వల్ల దుష్ఫలితాలు ఏవైనా సంభవిస్తాయేమో చూడనవసరం లేదనడం కూడా తప్పుడు వాదనే అవుతుంది. ఒక మొక్క నుంచి లభ్యం కాగల జీవరసాయన పదార్థాలు కూడా ఆ మొక్క పెరిగిన భూమిపై ఆధారపడి ఉంటాయి. తిరిగి గోమూత్రం విషయానికొస్తే, దానిలో హానికరమైన బ్యాక్టీరియా ఉన్నందువల్ల , దాని సేవనం మానవులకు హానికరం కావచ్చని ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయంలో తేలింది. చైనా ఉదాహరణచైనాలోనూ సంప్రదాయ వైద్యానికి ఆదరణ ఉంది. కానీ, అక్కడ మతపరమైన లేదా భావజాల ఆధారిత వైఖరిని అనుసరించడానికి బదులుగా శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి వినిమయాన్ని చేపట్టారు. ఉదాహరణకు, మలేరియాపై పనిచేసే ఆర్టిమైసినిన్ కనుగొన్నందుకు తు యుయు అనే చైనా సైంటిస్టుకు 2015లో నోబెల్ బహుమతి లభించింది. ప్రాచీన గ్రంథాల్లో పేర్కొన్నవాటిని తిరుగులేని సత్యాలుగా తీసుకునే బదులు, వాటిని ఒక ఐడియాగా తీసుకుని, ఈ ప్రాజెక్టు కింద 400లకు పైగా మొక్కలను పరీక్షించి చూశారు. ఒక మాలిక్యూల్‌ను వేరు చేసి, ఔషధంగా అభివృద్ధి చేయడానికి ముందు యాభై ఏళ్ళకు పైగా నిరంతర ప్రయోగాలు నిర్వహించారు. ఆ డిస్కవరీని కూడా ప్రాచీన గ్రంథాల గొప్పదనాన్ని నిరూపించినదిగాకాక, కాలపరీక్షకు నెగ్గిన సైంటిఫిక్ పద్ధతులకు తార్కాణంగానే పేర్కొన్నారు. భారతీయ విజ్ఞాన పద్ధతులను ప్రోత్సహించే పేరుతో సందేహాస్పద సంస్థల, పరిశోధకుల అధ్యయనాలకు సౌజన్యం వహించడాన్ని సైన్స్ ఏజన్సీలు మానుకోవాలి. ప్రభుత్వం చొరవ చూపకపోతే, అకాడమీలే కలసికట్టుగా ముందుకు వచ్చి పరిశోధనల్లో నిజాయతీకి పాటుపడే ఒక స్వతంత్ర సంస్థను, ఒక రకమైన రిసెర్చ్ అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడుంటాడో ఆచూకీ చెప్పండి..
జునాయెద్ అనే వ్యక్తి ఒక సూఫీ సాధువు దగ్గరకు వచ్చాడు. ‘నాకు జ్ఞానాన్ని బోధించే గురువు ఎక్కడ ఉంటాడో ఆచూకీ చెప్పండి’ అని అడిగాడు. ‘ముందు మక్కాకు వెళ్ళు. తీర్థయాత్ర చెయ్యి. ఎవరి కళ్లయితే కాంతులు విరజిమ్ముతుంటాయో, ఎవరి దేహం నుంచి కస్తూరి పరిమళం వస్తూ ఉంటుందో అతడే నీ గురువు. వెళ్ళి వెతుకు’ అన్నాడు.జునాయెద్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. 20 ఏళ్లు గడిచాయి. చివరికి ఒక చెట్టు కింద ఒకరిని చూశాడు. సూఫీ సాధువు చెప్పిన లక్షణాలు ఆయనలో కనిపిస్తున్నాయి. జునాయెద్ ఆయన పాదాలపై పడి, ‘గురుదేవా, 20 ఏళ్ళుగా మీ కోసమే వెతుకుతున్నాను’ అని ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. ఆ సాధువు కూడా ‘నేనూ 20 ఏళ్ళుగా నీ కోసమే చూస్తున్నాను. నన్ను సరిగ్గా చూడు’ అన్నాడు.జునాయెద్ ఎగాదిగా చూశాడు. తీరా 20 ఏళ్ళ క్రితం తనకు గురువు ఆచూకీ చెప్పి పంపిన ఆ మనిషే ఈయన! ‘ఇదేంటి? నాతో ఆటలాడారా? నా 20 ఏళ్ల కాలం వృథా అయిపోయింది. మీరే నా గురువు అని ఆ రోజే ఎందుకు చెప్పలేదు?’ అని అడిగాడు. ‘ఆ రోజే నేను చెప్పి ఉండవచ్చు. కానీ గురువును గుర్తుపట్టే కళ్ళు ఆ రోజు నీకు లేవు. ఈ 20 ఏళ్ల వెతుకులాట నీకు ఆ కళ్ళను ఇచ్చింది. ఈ ఇరవై ఏళ్ళు నిన్ను మెరుగుపరిచాయి. ఈ కస్తూరి వాసన ఆ రోజు కూడా ఉంది. కానీ దాన్ని గుర్తించే శక్తి ఆ రోజు నీకు లేదు’ అన్నాడు.నమ్మకం లేకపోతే గురువును సమీపించలేం. ఓపికతో వేచి ఉంటే, అపారమైన సహనం ఉంటే, ఏదో ఒక రోజు మార్గ నిర్దేశకుడు కనిపిస్తాడు. సత్యాన్ని వారసత్వంగా పొందలేం. దాని కోసం ఎవరికి వారు శ్రమించాలి. ఒక శిష్యుడిగా మారాలి. కఠినమైన క్రమశిక్షణ పాటించాలి. అది వ్యక్తిగత ప్రయాణం. వెతుకులాటే పరిపక్వత తెస్తుంది. అన్వేషణ ద్వారానే సత్యాన్ని తెలుసుకోగలరు. – యామిజాల జగదీశ్ -
పర్యావరణ యోధులకు రక్షణ ఏది?
హైదరాబాద్‌లోని తెరిచి ఉన్న ఒక డ్రైన్లో పడి కొట్టుకుపోయిన 70 ఏళ్ల చెత్త ఏరుకునే కార్మికుడు బాలయ్య ఉదంతం– సమాజంలో అట్టడుగున ఉన్న ఈ కార్మికుల నిస్సహాయతకు, దుఃస్థితికి ప్రత్యక్ష నిదర్శనం. స్మార్ట్ సిటీల పర్యావరణ పరిరక్షణలో చెత్త ఏరుకునేవారి సేవలు అత్యంత కీలకమైనవి. ప్రతిరోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్, కాగితం, లోహాల వంటి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా వీరు డంపింగ్ యార్డులపై పడే భారాన్ని భారీగా తగ్గిస్తున్నారు. వాస్తవానికి, అధికారిక వ్యవస్థల కంటే వీరు తరచుగా అధిక స్థాయిలో వ్యర్థాలను వేరు చేయడం, పునర్వినియోగం చేయడంలో సఫలమవుతున్నారు.పర్యావరణానికి విశేషమైన మేలు చేస్తున్నా గుర్తింపుకు నోచుకోని ఈ ‘పర్యావరణ యోధుల’ ఆరోగ్యం మాత్రం నిత్యం గాల్లో దీపంగానే మారుతోంది. కనీస రక్షణ లేకుండానే విషపూరిత వ్యర్థాలు, పగిలిన గాజు పెంకులు, ఆసుపత్రి వ్యర్థాలు, కుళ్ళిన చెత్త మధ్య వీరు పనిచేస్తుంటారు. చేతులకు గ్లోవ్స్, ముఖానికి మాస్కులు, కాళ్లకు బూట్లు లాంటి రక్షణ పరికరాలు లేకపోవడంతో చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, విష జ్వరాలు, ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.‘ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు– 2016’ ప్రకారం, చెత్త ఏరుకునేవారు పట్టణ స్థానిక సంస్థల నుండి గుర్తింపు కార్డులు పొందవలసి ఉన్నది. కానీ, బడ్జెట్ పరిమితులు లేదా అధికారుల అయిష్టత కారణంగా కొన్ని స్థానిక సంస్థలు వీటిని జారీ చేయడంలో విఫలమయ్యాయి.సేవకు ‘నమస్తే’!ఈ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యాంత్రిక పారిశుధ్య పర్యావరణ వ్యవస్థ జాతీయ కార్యాచరణ (నమస్తే) పథకం’ ఒక ఆశాకిరణం. 2024–25 నుండి, చెత్త ఏరుకునేవారిని ఈ పథకంలో అధికారికంగా చేర్చడం ముఖ్యమైన మార్పు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1.52 లక్షల మంది చెత్త ఏరుకునే వారిని గుర్తించగా, ఇందులో 48.7 శాతం మహిళలు ఉండటం గమనార్హం. వ్యర్థాల సేకరణ, పునరుద్ధరణలో వారి కృషిని గుర్తించి, అధికారిక ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలలో వారిని విలీనం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా వారికి ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య బీమా, వారి పిల్లలకు ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్లు, ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు, అలాగే అవసరమైన శిక్షణ, పరికరాలు లభిస్తాయి.దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు ఇప్పటికే ‘రాష్ట్ర సఫాయి కర్మచారి కమిషన్’లను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య, చెత్త ఏరుకునే కార్మికుల హక్కులను పరిరక్షిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలలో అటువంటి సంస్థాగత వ్యవస్థ లేకపోవడం గమనార్హం. అత్యంత ప్రమాదకర వాతావరణంలో పనిచేస్తున్న ఈ అట్టడుగు వర్గాల భద్రతను పునరుద్ధరించడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. చట్టబద్ధమైన కమిషన్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయి హక్కులు కల్పించాలి. దీనితో పాటుగా పట్టణ స్థానిక సంస్థలు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి ఒక్కరికీ గ్లోవ్స్, మాస్కులు, రెయిన్ కోట్లు, సేఫ్టీ బూట్లు కలిగిన కిట్లను అందించాలి. డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి వీరి శ్రమను వ్యవస్థీకృతం చేయాలి. పర్యావరణాన్ని, నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో వారు చేస్తున్న సేవలను గుర్తించి, గౌరవప్రదమైన స్థానం అందించడం సామాజిక బాధ్యత.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకుడు -
పౌర స్వేచ్ఛలో తేడాలెందుకు?
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక దేశాల మధ్య పౌర స్వేచ్ఛలకు సంబంధించి ముఖ్యమైన తేడా ఒకటుంది. ఆ తేడా ప్రభావాలు అనేక విధాలుగా కనిపిస్తున్నాయి. గతంలో, వర్తమానంలోనే కాదు, మునుముందు కూడా కనిపించగల అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కనుక ఆ తేడాను, అందుకు కారణాలను అర్థం చేసుకునేందుకు ఒక ప్రాథమికమైన ప్రయత్నం అవసరం. ప్రతి దేశానికి అంతర్గత విధానాలు సరేసరి కాగా, విదేశాంగ విధానం ఒకటి ఉంటుంది. అది దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందుతుందనేది తెలిసిందే. అట్లా అనుగుణం అని తాము భావించే విధంగా విదేశాంగ విధానాన్ని ప్రభుత్వాలు రూపొందిస్తాయి. అనగా ఆ సమయంలో అధికారంలో ఉండే పార్టీలు. ఆ విధానాలలో కొన్ని స్థిరంగా ఉంటాయి. కొన్ని పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. కానీ సదరు విధానం, లేదా విధానాలు దేశ ప్రయోజనాలకు అనుగుణమైనవి కావనీ, నష్టం కూడా కలిగించవచ్చుననీ ప్రతిపక్షాలో, మీడియానో, మేధావులో భావించినట్లయితే, ఆ విధానాలను నిష్కర్షగా విమర్శించే పౌర స్వేచ్ఛలు ఎంతవరకు ఉంటున్నాయి? ఆ స్వేచ్ఛలలో తేడాలెందుకు?నచ్చనిది ముఖం మీదే...ఈ ప్రశ్న విదేశాంగ విధానాల గురించి ఇతరత్రా రావటం సరేసరి కాగా, యుద్ధ సందర్భాలలో మరింత తీవ్రంగా తలెత్తుతుంది. యుద్ధమన్నది మహా సున్నితమైన విషయం, భావోద్వేగాలతో కూడా ముడిపడి ఉండేది గనుక. అటువంటి సందర్భాలలో ప్రభుత్వాలు ఒక విధానాన్ని అనుసరిస్తున్నపుడు, ఆ విధానం దేశ ప్రజలకు అవసరమని చెప్తున్నపుడు, ఆ యుద్ధం వల్ల అటువంటి ప్రయోజనాలేవీ లేవని భావించేవారు విభేదించి మాట్టాడవచ్చునా? ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగ భావ ప్రకటనా స్వేచ్ఛను, లేదా పౌర స్వేచ్ఛను ఇస్తున్నపుడు, అటువంటి అవకాశం కాగితం పైన ఉన్నా ఆచరణలో ఎంతవరకు లభిస్తున్నది? ఇపుడు నిర్దిష్టమైన ఉదాహరణలను చెప్పుకుంటే విషయం ఇంకా బోధపడుతుంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై పాలస్తీనాపై యుద్ధాలు సాగిస్తున్నాయి. అవి ఆ రెండు దేశాల ప్రయెజనాలకు అవసరమని చెప్తున్నాయి. కానీ ఆ వాదనతో విభేదించే అమెరికన్, ఇజ్రాయెల్ పౌర సమాజాలు, మీడియా, మేధావి వర్గాలు, రిటైరయిన సైన్యాధికారులు పెద్ద సంఖ్యలోనే తమ ప్రభుత్వ విధానాలను కేవలం నర్మగర్భంగా గాక, ప్రత్యక్షంగా, తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎప్పటికప్పుడు జరిగే ప్రజాభిప్రాయ సేకరణలలో ప్రభుత్వ విధానాలకు ఆమోదం నానాటికి తగ్గిపోతున్నది. అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలలోనూ పౌర స్వేచ్ఛలు ఈ విధంగా ప్రజాస్వామికంగా, నిర్భయమైన రీతిలో వ్యక్తమవుతున్నాయి. ఆ విధానాలు దేశ ప్రయోజనాలకు ఏ విధంగా భంగకరమో వారు వివరించి చెప్తున్నారు. ఇంకా అనాలంటే చెప్పగలుగుతున్నారు. వాస్తవానికి అమెరికా, యూరప్‌లలో ఈ ప్రజాస్వామిక స్వేచ్ఛలు మొదటి నుంచి ఉన్నాయి. మనవరకు చూస్తే వియత్నాం యుద్ధకాలం నుంచే కనిపిస్తున్నాయి. దేశద్రోహం పేరిట...ఇటువంటి పౌర స్వేచ్ఛలు భారతదేశం మొదలైన ప్రజాస్వామిక వ్యవస్థలలో ఉన్నాయా? ఉంటే ఎంతవరకు? ఇది ఇండియాకే కాదు, ఇటువంటి వర్ధమాన దేశాలు అన్నింటికి సంబంధించినది. ప్రస్తుత మధ్య ఆసియా యుద్ధాలనే చూద్దాము. అక్కడ ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా, గల్ఫ్ రాజ్యాల కోణం ఒకటున్నది. అది గాక ఇజ్రాయెల్– పాలస్తీనా– అమెరికా కోణం మరొకటి. రెండూ దుర్మార్గమైన యుద్ధాలే అయినా, మొదటి దానికి సంబంధించి భారత ప్రభుత్వం గల్ఫ్ నుంచి ఇంధనం, ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న భారతీయుల సంక్షేమం అనే అంశాలను పేర్కొంటున్నందున ఆ మేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ రెండవది?ఇజ్రాయెల్‌తో సంబంధాల సాధారణీకరణ గతంలోనే జరిగినా, ఇపుడు గాజా హత్యాకాండతో సమస్య తీవ్ర రూపం తీసుకుంది. అటువంటపుడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ దారుణాన్ని ఖండించకపోవటమే గాక, ఇక్కడి నుంచి ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరాలను సైతం అనుమతిస్తున్నది. ఐక్యరాజ్య సమితిలో ద్వంద్వ ధోరణి చూపుతున్నది. ఇందుకు గల కారణాలలో ఇజ్రాయెల్ ప్రభుత్వపు ఇస్లాం వ్యతిరేకతతో ప్రస్తుత భారత ప్రభుత్వానికి గల ఏకీభావం కూడా ఒకటనే అభిప్రాయం ఉంది. ఇజ్రాయెల్‌లోని అరబ్బులను అక్కడి ప్రభుత్వం హతమార్చకుండానే ఒక పద్ధతి ప్రకారం ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చుతున్నట్లు, దానితో ప్రేరణ చెందిన ఇక్కడి ప్రభుత్వం కూడా అదే మార్గంలో ఉందనే సందేహాలున్నాయి. ప్రశ్న ఏమంటే, ఇటువంటి అంచనాలను, విమర్శలను వ్యక్తీకరించేందుకు భారత దేశంలో గల పౌర స్వేచ్ఛ ఎంత? ఇది ఒక వర్తమానపు ఉదాహరణ మాత్రమే. గతంలోకి వెళితే అనేకం ఉన్నాయి. ఉదారవాద ప్రజాస్వామిక పార్టీ అనుకునే కాంగ్రెస్ పరిపాలనలో కూడా, అదేవిధంగా, పైన అనుకున్నట్లు ఇది ఇండియాలోనే గాక, వర్ధమాన దేశాలన్నిటా కనిపిస్తున్న పరిస్థితి. అందువల్ల ఈ చర్చ భారత దేశానికి పరిమితమైనది కాదు. స్థూలంగా చెప్పుకోవాలంటే, పౌర స్వేచ్ఛలలో ఇటువంటి తేడాలు అభివృద్ధి చెందిన దేశాలలో ఒక విధంగా, వర్ధమాన దేశాలలో మరొక విధంగా కనిపిస్తున్నాయి. వర్ధమాన దేశాలలో ఆ స్వేచ్ఛలు లేకపోవటమే గాక వాటిని దేశ ద్రోహం పేరిట, మత ద్రోహం పేరిట, మరో పేరిట అణిచివేయటం కూడా జరిగితే?స్థిరపడని విలువలుఇవన్నీ చెప్పుకున్న తర్వాత, ప్రపంచంలోని ప్రజాస్వామిక వ్యవస్థలను అభివృద్ధి చెందినవి, వర్ధమాన స్థితిలో ఉన్నవి అని స్థూలంగా విభజించి చూసినపుడు, రెండింటి మధ్య ఈ తేడాలెందుకనే మౌలికమైన ప్రశ్న గురించి చర్చించటం అవసరం. ఇంత లోతైన విషయం తేలికగా అర్థమయ్యేది కాదు. కానీ ఒక ప్రాథమిక ప్రయత్నమంటూ జరగాలి. ఆ విధంగా చూసినపుడు తోస్తున్నవి కొన్నున్నాయి. మనం అభివృద్ధి చెందిన దేశాలంటున్నవి పెట్టుబడిదారీ విధానంలో ఎదిగి వచ్చినవి. ఆ క్రమంలో పౌరులకు తమ హక్కులు, స్వేచ్ఛలు, వాటిని కాపాడుకోవడం అన్నది, వారి వ్యక్తిత్వాలు, వ్యక్తిగత గుర్తింపులు రూపుదిద్దుకునే క్రమంలో ఒక సంప్రదాయంగా మారింది. ఇవన్నీ వారి ప్రజాస్వామ్యంలో భాగమయ్యాయి. వాటిని వారు బలంగా కాపాడుకుంటారు. ఇందుకు పునాదులు రినైజాన్స్–పునరుజ్జీవనోద్యమం (14–17 శతాబ్దాలు), ఫ్రెంచ్ విప్లవం (18వ శతాబ్దం), ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం (18వ శతాబ్దం నుంచి)లో పడ్డాయి. అప్పటి నుంచి ప్రజాస్వామ్యాలు, వ్యక్తి స్వేచ్ఛలు, పౌర స్వేచ్ఛలు వ్యవస్థీకృత రూపం తీసుకుని బలపడ్డాయి. అక్కడి పార్టీలు, ప్రభుత్వాలు, వాటి విధానాలు ఎట్లున్నా ఈ వ్యవస్థలు, స్వేచ్ఛలు మారలేదు. అదే నేటికీ కనిపిస్తున్నది. ఇందుకు భిన్నంగా, వర్ధమాన దేశాలనేవి చిరకాల ఫ్యూడల్ దశలు, రాచరికాలు, వలస పాలనల నుంచి బయటకు రావటం మొదలై ఇంకా వంద సంవత్సరాలు కూడా కాలేదు. యూరప్ తరహా విప్లవాలు రాలేదు. విలువలు ఇంకా నిజమైన అర్థంలో రూపుదిద్దుకోలేదు. పౌరుల వ్యక్తిత్వాలు, పౌర స్వేచ్ఛలు ఇంకా బలపడి వ్యవస్థీకృత రూపం తీసుకోలేదు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలనే చట్ట సభలు, పాలనా యంత్రాంగం, న్యాయస్థానాలు కూడా ఇంకా తమ స్ఫూర్తికి అనుగుణంగా స్థిరపడి బలపడవలసే ఉంది. అందువల్ల ఈ ఎదుగుదల వ్యత్యాసాలే మొదట చెప్పుకున్న వ్యత్యాసాలకు కూడా కారణమవుతున్నాయనిపిస్తున్నది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పశ్చిమాసియాలో ప్రమాదకర పాచికలాట
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2025 నవంబర్ 18న అమెరికా సందర్శించారు. పౌర అణు శక్తి వినియోగ సహకారంపై సంప్రదింపులు పూర్తయ్యాయని అదే రోజు సంయుక్త ప్రకటన వెలువడింది. ఆ మేరకు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న కోట్లాది డాలర్ల పౌర అణు శక్తి భాగస్వా మ్యానికి దీనితో చట్టపరమైన పునాది ఏర్పడిందని వైట్ హౌస్ పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ప్రమాణాలను పకడ్బందీగా పాటిస్తూ సహకారాన్ని ఇచ్చిపుచ్చు కోనున్నట్లు ప్రకటించారు. అయినా, అణ్వస్త్ర నిర్మాణ వ్యాప్తిపై ఇది అటు ఇజ్రాయెల్, ఇటు యూఏఈలలో ఆందోళనను రేకెత్తించడంతో ఈ అంశం మరింత జటిలంగా మారింది. అబ్రహాం ఒప్పందాలతో ముడిఇపుడు అమెరికా–సౌదీ ఒప్పందాన్ని సౌదీ అరేబియా అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండే అంశంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముడిపెట్టారు. పౌర అణు ఒప్పందానికి ఆమోదం తెలుపడం చిటికెలో పని. కాకపోతే ‘చాలా మన్నన పొందిన, సఫలమైన అబ్రహాం ఒప్పందాలకు సౌదీ అరేబియా పూర్తిగా కట్టుబడి ఉండాలి’ అని ట్రంప్ జూలై 23న బాహాటంగానే వెల్లడించారు. యురేనియంను ‘శుద్ధి చేసే సామగ్రి’ ఉండబోదని కూడా ట్రంప్ తెలిపారు. కానీ, యురేనియంను శుద్ధి చేయడాన్ని నివారించే నియమ నిబంధనలు ఒప్పందం ముసాయిదాలో కొరవడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా రెండింటిని ముడిపెట్టడంతో మొత్తం పరిస్థితి మారి పోయినట్లు అయింది. ఇది ఇక ఎంతమాత్రం అణు శక్తిని పౌర అవస రాలకు వినియోగించుకునేందుకు సంబంధించినదిగానో లేదా రష్యా, చైనాలను దూరం పెట్టేందుకు కుదుర్చుకున్నదిగానో లేదు. దౌత్యం ఒక లావాదేవీగా తయారైంది. అసలే అణు శక్తి చిక్కు ముడులతో కూడుకున్న దక్షిణాసియాలో ఇది ఇంకా గుబులు రేపు తోంది. ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెంటనే స్వాగతించింది. సౌదీ గుర్తింపు ‘మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి ఒక చారిత్రక ముంద డుగు’ అని అది జూలై 23న వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ అంగీకరించినట్టేనా?తెరవెనుక పరిస్థితులను బట్టి ఈ సమన్వయం ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది. తుర్కియేకు అధునాతన ఎఫ్–35 విమానాల విక్ర యాన్ని వ్యతిరేకించాలని నెతన్యాహు కోరుకుంటున్నారనీ, సౌదీ అణు ఒప్పందం ఈ ప్రాంతంలో ఆయుధ పోటీని రేకెత్తిస్తుందని ఆందోళన చెందుతున్నారనీ ఇజ్రాయెలీ అధికారులు మీడియాకు తెలిపారు. ఇటీవల ట్రంప్‌ను కలుసుకునేందుకు ముందు నెతన్యాహు తన మనసులో మాటను వెల్లడించారు. సౌదీ అరేబి యాతో అమెరికా అణు సహకారం సైనిక శక్తి విషయంలో ఇజ్రా యెల్కున్న గుణాత్మక పైచేయిపై రాజీపడేటట్లు చేయదని హామీ లభించాలని ఆయన అన్నారు. ఏదైతేనేం జెరూసలెం కోరుకున్నది సాధించింది. సౌదీ అణు ఒప్పందం ఇజ్రాయెల్‌తో ముడిపడినఅంశమని ఇపుడు తేటతెల్లమైంది. రెండవసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించాలని ట్రంప్ కోరుకున్నారు. సాధా రణ పరిస్థితులు నెలకొనాలంటే ‘పాలస్తీనా ఒక ప్రత్యేక రాజ్యంగా అవతరించేందుకు స్పష్టమైన బాటలు పరవా’లని సౌదీలు స్పష్టం చేశారు. గాజాలో పరిస్థితులు క్షీణించాక సౌదీ మరింత పట్టుసడలని వైఖరిని కనబరచింది. సాధారణ పరిస్థితుల స్థాపనపై చర్చలను అది 2023 అక్టోబర్ 14న విరమించుకుంది. ‘పాలస్తీనా రాజ్య స్థాప నను వ్యతిరేకిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రభు త్వాన్ని శాంతి స్థాపనకు చిత్తశుద్ధితో పనిచేసే భాగస్వామిగా’ చూడ లేమనే మొన్నీమధ్య జూలై 25 వరకు రియాద్ భావిస్తూ వచ్చింది. మారిన అమెరికా తీరుఅణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానం విషయంలో అమెరికాలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గల్ఫ్‌లో యురేనియం శుద్ధికి అనుమతించకూడదనే వైఖరినే అమెరికా 15 ఏళ్ళుగా అనుస రిస్తూ వచ్చింది. యూఏఈ కూడా 2009లోనే దాన్ని విరమించుకుంది. తాజా అమెరికా ఒప్పందం కింద సౌదీ ఆ నిబంధనను తిర స్కరించింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అదే పనిగా పర్యవేక్షించడాలు, పరిశీలించడాలు చేయకూడదని కూడా సౌదీ పేర్కొంది. తెహ్రాన్ రహస్యంగా యురేనియంను శుద్ధి చేసే సదుపా యా లను నిర్వహిస్తోందనే కారణంతోనే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడికి దిగాయి. ఈ ఒప్పందం ఏ విధంగా ఆవిష్కృత మవుతుందోనని అబుదాబి, కైరో, అమ్మాన్, అంకారా ఎదురు చూస్తున్నాయి. ఇంతవరకు యురేనియంను శుద్ధి చేసే శక్తి పశ్చిమా సియాలో ఒక్క ఇరాన్‌కే పరిమితం అనుకున్నారు. ఇపుడు యురేని యంను శుద్ధి చేయగల సామర్థ్యాన్ని ఆ ప్రాంతంలో దాదాపు ఐదు దేశాలు సంతరించుకోగలవని కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ‘‘ఇజ్రాయెల్ వద్ద బాంబు ఉందనుకుందాం. ఇపుడు అమెరికా ఆమోదంతో సౌదీ అరేబియా కూడా యురేనియంను శుద్ధి చేయగల శక్తిని సంతరించుకుంటుంది. మరి మేం మాత్రం ఆ పని ఎందుకు చేయకూడదు?’’ అని ఇరాన్ వాదిస్తోంది. ఇరాన్‌తో అమెరికా కుదు ర్చుకోవాలని భావించిన అణు ఒప్పందం అటకెక్కింది. ఇరాన్ లోపలికి వెళ్ళి తనిఖీలు జరపడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఉన్న అవకాశం పరిమితం. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆశీర్వా దంతో సౌదీ అరేబియా నిర్వహించే అణుశక్తి కార్యక్రమం పూర్తి ఆత్మవంచన, ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే ఈ ఒప్పందం దాని చాపకిందకు నీరు తేవడమే. అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఇజ్రాయెల్ 50 ఏళ్ళుగా గుత్తాధిపత్యాన్నే అనుభవిస్తూ వచ్చింది. అది ఆ పనిని చాటుమాటునే నిర్వహిస్తూ వచ్చి ఉండవచ్చు. సౌదీ పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అబ్రహాం ఒప్పందాలతో ముడిపెట్టడాన్ని పైకి స్వాగ తించి ఉండవచ్చు. కానీ, లోలోపల అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్యం కలి గిన మరో అరబ్ దేశం అవతరిస్తోందని మథన పడుతోంది. సుస్థిరతకు అవకాశమెక్కడ? తాజా ఒప్పందంతో ఆ ప్రాంతంలో ఏ దేశానికాదేశం రక్షణకంచెలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తాయి. ఆయుధాల సమీకర ణకు పోటీపడతాయి. తప్పుడు అంచనాలు ప్రమాదకర స్థితినిసృష్టిస్తాయి. ఇంక ప్రాంతీయ సుస్థిరతకు అవకాశమెక్కడ? రష్యా అణు శక్తి సంస్థ రోసటామ్, చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్లను కట్టడి చేయడానికి సౌదీ అణు కార్యక్రమం దోహద పడుతుందనీ, అమెరికా విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేరుస్తుందనీ అమెరికా మొదట్లో భావించింది. ఇపుడు అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చెప్పడం ద్వారా సౌదీ–ఇజ్రా యెల్ మధ్య కూడా రాజీ కుదిర్చినట్లు అవడం తన విదేశాంగ విధానానికి కలికితురాయిగా మారుతుందని ట్రంప్ సంబరపడు తున్నారు. అందుకు రియాద్‌కు పౌర అణు శక్తి పేరుతో తీపిని తిని పిస్తున్నారు. ఈ క్రమంలో, నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. పౌర అణు శక్తి వినియోగానికి సౌదీకున్న హక్కును కాదనలేం. రష్యా–చైనాలతో పోటీ పడేందుకు అమెరికాకు ఉన్న హక్కును కూడా తోసిపుచ్చలేం. కానీ, ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో యురేనియం శుద్ధికి ద్వారాలు తెరవడం ఎంతవరకు సబబు? ఇజ్రాయెల్‌తో సయోధ్య కుదుర్చుకోవాలనీ, సాధారణ పరిస్థితుల స్థాపనకు తోడ్ప డాలనీ అమెరికా పెడుతున్న షరతును సౌదీ ఇప్పటికే తిరస్కరించింది. ఒకవేళ ఒప్పందం మూలపడ్డా, అది తెచ్చిన ప్రమాణం నిలిచే ఉంటుంది: అణు శక్తిని సంపాదించుకునేటట్లు చేయడంలో అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు చూసు కుంటోంది. ఒకసారి భూతాన్ని బయటకు తెస్తే, దాన్ని తిరిగి సీసాలో బంధించడం కష్టం. -వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ-సి. ఉదయ్ భాస్కర్ -
రైతుకు ఆదాయం – ప్రకృతికి చికిత్స
వాతావరణ మార్పులు ప్రపంచ వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కరవుప్రాంతాల్లో వ్యవసాయం అనిశ్చితితో కూడిన జీవనోపాధిగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో అగ్రోఫారెస్ట్రీ– వ్యవసాయ పంటలతో పాటు వృక్షాలను సమీకృతంగా పెంచే విధానం– పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుకు అదనపు ఆదాయాన్ని అందించే మార్గంగా ఎదుగుతోంది. చెట్లు వాతావర ణంలోని కార్బన్ ను బంధించడం ద్వారా ఏర్పడే కార్బన్ క్రెడిట్లను రైతుల ఆదాయంగా మలచడ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.భారతదేశం 2070 నాటికి నెట్– జీరో లక్ష్యాన్ని ప్రకటించిన నేపథ్యంలో వ్యవసాయం కూడా కార్బన్ ఉద్గారాల నియంత్రణలో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. రైతులను కేవలం ఆహార ఉత్పత్తిదారులుగా కాకుండా పర్యావరణ సేవలను అందించే భాగ స్వాములుగా గుర్తించే విధానాలు రూపొందాలి. కార్బన్ మార్కెట్లు అదే దిశగా ముందడుగు వేస్తున్నాయి.అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో యాక్షన్ ఫ్రెటర్నా–ఎకాలజీ సెంటర్ (ఏఎఫ్ ఎకాలజీ సెంటర్) ఈ భావనను ఆచరణలోకి తీసుకొస్తోంది. నెదర్లాండ్స్‌కు చెందిన రాబోబ్యాంక్ ప్రోత్సహి స్తున్న ‘అకార్న్’ కార్యక్రమానికి స్థానిక భాగస్వామిగా ఉంటూ, సంస్థ రైతులను అగ్రోఫారెస్ట్రీ వైపు మళ్లిస్తూ, కార్బన్ ఆదాయ వ్యవస్థలో చేర్చుతోంది. ఇప్పటికే సుమారు 8,300 మంది రైతులు, దాదాపు 10,000 హెక్టార్ల భూమిని ఈ కార్యక్రమంలో నమోదు చేయించింది. రైతుల భూములకు జియో–ట్యాగింగ్, ధ్రువీకరణ ప్రక్రియలు పూర్తి చేశారు. రెండు లక్షలకు పైగా మొక్కల పంపిణీ చేసి, ఏకపంట తోటలను బహుళ వృక్ష వ్యవస్థలుగా మార్చి ఈ కార్యక్ర మానికి బలమైన పునాది వేశారు. తొలి విడత కార్బన్ ఆదాయం 2027లో అందే అవకాశం రైతుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ కేవలం కార్బన్ క్రెడిట్ల నమోదు వద్దే ఆగిపోలేదు. ప్రకృతి వ్యవసాయం, నీటి సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను సమ గ్రంగా అనుసంధానిస్తూ రైతుల స్థిరమైన జీవనోపాధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. కార్బన్ ఆదాయాన్ని రైతు సంక్షేమంతో అనుసంధానించిన ఈ నమూనా దేశవ్యాప్తంగా అధ్యయనం చేయదగినది. అయితే కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. కార్బన్ ధరల్లో హెచ్చుతగ్గులు, ధ్రువీకరణ ప్రక్రియల క్లిష్టత్వం, చిన్న రైతుల సామర్థ్య పరిమితులు వంటిఅంశాలను విధానపరంగా పరిష్కరించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అగ్రో ఫారెస్ట్రీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు,సాంకేతిక సహాయం, పారదర్శక కార్బన్ మార్కెట్ వ్యవస్థను అందిస్తే ఈ కార్య క్రమం మరింత విస్తరిస్తుంది.భవిష్యత్తు వ్యవసాయం కేవలం దిగుబడుల గురించే కాదు; ప్రకృతిని పునరుద్ధరించడంపైనా ఆధారపడిఉంటుంది. రైతు పెంచే ప్రతి చెట్టు వాతావరణ మార్పులను తగ్గించడమే కాకుండా కుటుంబ ఆదాయాన్ని కూడా పెంచగలదని ఈ కార్యక్రమం నిరూపిస్తోంది. రైతు–ప్రకృతి–మార్కెట్ మధ్య సమ తుల్యతను సాధించే ఇటు వంటి ప్రయత్నాలే సుస్థిర వ్యవసా యానికి బాటలు వేస్తాయి.-వ్యాసకర్త డైరెక్టర్, ఎ.ఎఫ్. ఎకాలజీ సెంటర్, అనంతపురం-డా‘‘ వై.వి. మల్లారెడ్డి -
అది రాజ్యాంగబద్ధమేనా?
బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గేయాన్ని ‘పూర్తిగా పాడాలి’ (అంటే ఆరు చరణాలనూ పాడాలి) అంటూ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. లోక్‌సభ, రాష్ట్రపతి ఆమోదాల తరువాత అది చట్టమవుతుంది. ఆ తరువాత, ఈ గేయాన్ని ఎక్కడైనా పూర్తిగా పాడకపోయినా, దాన్ని అవమానించినా, ఆటంకపరిచినా అలా చేసిన వాళ్లకు మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది.1971లో తయారు చేసిన ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్’ను ప్రభుత్వం సవరిస్తూ ఈ బిల్లు ప్రవేశపెట్టింది. నిజానికి ఆ చట్టంలో– ‘జాతీయ జెండానిగానీ, జాతీయ గీతాన్ని గానీ, రాజ్యాంగాన్నిగానీ ఎవరైనా అవమానిస్తే వారు శిక్షార్హులవు తారు’ అని మాత్రమే వుంది. ‘వందే మాతరం’ గురించి ఏమీ లేదు. ఆ చట్ట పరిధిలోకి ఇప్పుడు దీన్ని కూడా తెస్తున్నారు.జనగణమనకూ, వందేమాతరానికీ తేడా వుంది. ఆ తేడా ఉండటం వలనే అది ‘జాతీయ గీతం’ కాలేక పోయింది. మొత్తం ‘ఆరు చరణాలు’ గా ఉండే అందులో మొదటి రెండు చరణాల్లో ప్రకృతి గురించి, భూమి గురించి, దేశభక్తి గురించి వర్ణన ఉంటుంది. ఆ తరువాత వచ్చే నాలుగు చరణాల్లో– భూమిని తల్లితో, ఆ తల్లిని కాళికతో, సరస్వతితో, లక్ష్మితో పోలుస్తూ ఉంటుంది. అంటే– హిందూ ఆధ్యాత్మికతా, దేశభక్తీ రెండూ కలగలసి ఉంటాయి.ఛటర్జీ ఈ గేయాన్ని విడిగా రాయలేదు. 1870లో రాసిన ‘ఆనంద్ మఠం’ నవలలోనిది అది. 1896 కలకత్తా కాంగ్రెస్ సమా వేశంలో ‘రవీంద్రనాథ్ టాగూర్’ దీన్ని మొదటగా ఆలపించారు. అప్పటికి ఆయన ‘జనగణమన’ రాయలేదు. అంతకుముందు సాహిత్యకారులలోనే ఆ పాటకు, టాగూర్ పాడాక, జాతీయ గుర్తింపు వచ్చింది. 1905లో ‘లార్డ్ కర్జన్’ బెంగాల్‌ను విభజించాక, అదొక ‘ఉద్యమ నినాదం’గా మారింది. బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ‘వందే మాతరం’ నినాదాన్ని నిషేధించింది. నిషేధం కారణంగా ఇది మరింత ప్రజాదరణ పొందింది. రానురాను స్వాతంత్య్ర ఉద్యమంలో ఇది భావోద్వేగ గీతంగా కూడా నిలిచింది.1930లలో కాంగ్రెస్ వర్గాల్లో దీన్ని ‘జాతీయ గీతం’గా స్వీకరించాలనే చర్చలు జరిగాయి. కానీ ‘ముస్లిం లీగ్ నాయకులు’ అభ్యంతరం తెలిపారు. లీగ్ వాళ్ళే కాకుండా కాంగ్రెస్‌లోని ముస్లిమ్స్ కూడా తమ అభ్యంతరాల్ని బైట పెట్టడం మొదలెట్టారు. వాళ్ళల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ (కాంగ్రెస్ అధ్యక్షుడు, తొలి విద్యాశాఖమంత్రి) ప్రథములు. ‘వందే మాతరానికి స్వాతంత్య్ర ఉద్యమంలో చారిత్రక పాత్ర ఉంది. దాన్ని ఎవ్వరమూ కాదనలేము కానీ, వాటి లోని హిందూ దేవతారాధన భావనలతో కూడిన వ్యాఖ్యలు ముస్లింలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. మొదటి రెండు శ్లోకాలు మాత్రమే దేశభక్తిని సూచిస్తాయి’ అని ఆయన తన అభిప్రాయాన్ని ప్రక టించారు. మౌలానా మహ్మద్ అలీ జౌహర్ (ఖిలాఫత్ నాయకుడు) ‘వందే మాతరాన్ని నినాదంగా వాడటానికి నేను వ్యతిరేకం కాదు; కానీ దాన్ని మతసంబంధమైన ప్రతీకగా మార్చకూడదు’ అన్నారు. ఎప్పుడైతే ముస్లిం సమూహం నించి వ్యతిరేకత వచ్చిందో, హిందూ సమూహంలోని వాళ్ళు కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మొదటి అడు గులు వేశారు. ‘వందే మాతరం పట్ల గౌరవం ఉండాలి. కానీ ఎవ్వరి మనస్సాక్షికీ వ్యతిరేకంగా బలవంతం చేయకూడదు’ అన్నారు.ఆ తరువాత జనగణమనను ‘జాతీయ గీతం’గా చేస్తూ, ‘వందే మాతరం’కు సమాన గౌరవం ఇస్తూ (మొదటి రెండు పద్యాలకే పరిమితం చేస్తూ) 1950 జనవరి 24న రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రక టనను చేశారు. దీని మీద గాంధీజీ కూడా మాట్లాడారు. ‘వందే మాతరం దేశభక్తి గీతం. మత భావనతో ఎవరికైనా ఇబ్బంది అయితే బలవంతం చేయరాదు. దేశభక్తి అనేది స్వచ్ఛందంగా ఉండాలి. బలవంతం చేస్తే అది హింసతో సమానం’ అన్నారు. అనేక మతాలు ఉన్న ఈ దేశంలో హిందూ మతానికి చెందిన దేవతా మూర్తుల్ని ఆరాధించే చరణాల్ని ‘తప్పనిసరిగా మొత్తం పాడాలి’ అనడం న్యాయమేనా? అది లౌకికత్వం అవుతుందా? రాజ్యాంగబద్ధం అవుతుందా?– నన్నూరి వేణుగోపాల్, పౌరహక్కుల కార్యకర్త -
నూతన యూరియా విధాన సవాళ్లు
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది. దేశ యూరియా అవసరాల్లో నాలుగో వంతును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్ద పశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనిని అందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ.మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది.ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలో సేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండో కాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు ధాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది.జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్‌లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. - డా. జి.వి. రామాంజనేయులు, వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు -
ట్రేడింగ్ ఒక వృత్తి కాగలదా?
నేటి ఆధునిక ఆర్థిక ప్రపంచంలో ‘ఆర్థిక స్వాతంత్య్రం’ సాధించ డానికి ట్రేడింగ్ ఒక ఆకర్షణీయమైన మార్గంగా కనిపిస్తోంది. గతంలో దీనిని కేవలం ఒక జూదంగానో లేదా పార్ట్–టైమ్ ఆదాయ వనరుగానో చూసేవారు. నేడు సాంకేతిక విప్లవం, మార్కెట్లపై అవగాహన పెరగడంతో చాలామంది దీనిని పూర్తి స్థాయి వృత్తిగా ఎంచుకోవాలని భావిస్తున్నారు.భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ అయిన ‘సెబీ’ రిటైల్ ట్రేడర్ల శైలి, వారి లాభనష్టాలపై ఒక లోతైన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఈ గణాంకాలు ట్రేడింగ్‌ను వృత్తిగా మార్చుకోవాల నుకునే వారికి కనువిప్పు కలిగిస్తున్నాయి.భారతదేశంలో ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ చేసే వ్యక్తిగత ట్రేడర్లలో దాదాపు 90% నుండి 93% మంది నష్టపోతున్నారు. నష్టపోయే ప్రతి యాక్టివ్ ట్రేడర్ సగటున ఏడాదికి రూ. 1.25 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు నష్టపోతున్నట్లు సెబీ గణాంకాలు చెబుతున్నాయి. కేవలం 7% నుండి 10% మంది మాత్రమే మార్కెట్లో లాభాలు గడిస్తున్నారు. వీరిలో కూడా కేవలం 1.5% మంది మాత్రమే నెలకు రూ. 1 లక్ష కంటే ఎక్కువ ఆదాయాన్ని స్థిరంగా సంపాదించగలుగుతున్నారు. ట్రేడర్లు సంపాదించే లాభాల్లో లేదా నష్టాల్లో దాదాపు 15% నుండి 25% వరకు కేవలం బ్రోకరేజ్, పన్నులు, ఇతర లావాదేవీల ఖర్చులకే సరిపోతుందని తేలింది.ట్రేడింగ్‌లో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. మార్కెట్ హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉన్నప్పుడు భయం, దురాశ వంటి భావోద్వేగా లను నియంత్రించుకోవడం అందరికీ సాధ్యం కాదు. ట్రేడింగ్‌ను విజయ వంతమైన కెరీర్‌గా మార్చుకోవాలంటే ట్రేడింగ్‌కు సంబంధించి చాలా అంశాలపై పట్టు సాధించాలి. ప్రతి ట్రేడ్‌లోనూ మీ పెట్టుబడిపై ఎంత శాతం నష్టాన్ని (స్టాప్–లాస్ విధానం) భరించగలరో ముందే నిర్ణయించుకోవాలి. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, టెక్నికల్ ఇండికేటర్లపై శాస్త్రీయ మైన పట్టు ఉండాలి.ఇతర అభివృద్ధి చెందిన దేశాలలో (ముఖ్యంగా అమెరికా, యూరప్, సింగపూర్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో) ట్రేడింగ్‌ను ఒక జూదంగానో లేదా సైడ్ హాసిల్గానో కాకుండా, గౌరవప్రదమైన, వ్యవస్థీకృతమైన ‘వైట్ కాలర్‘ వృత్తిగా చూస్తారు. విదేశాలతో పోలిస్తే భారతదేశంలో ట్రేడింగ్‌ను వృత్తిగా మార్చుకోవడానికి ఉన్న అతిపెద్ద సవాలు ఆర్థిక అక్షరాస్యత లోపించడం, సరైన గైడెన్స్ లేకపోవడం.– డా. ఎం.డి. ఖ్వాజా మొయినుద్దీన్, స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు -
మాధవుడి మందిరంలో మన్మథుడికి చోటుందా?
దేవతలు తాగే అమృతం కావాలంటే, మందర పర్వతాన్ని మోసుకొచ్చి, దాన్ని కవ్వంగా చేసి, క్షీర సాగరాన్ని చేతులు పడిపోయేలా చిలకాలి. అది మహామహులకే తప్ప, మామూలు మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. అలాగని దిగులు అక్కర్లేదు. భక్త కవీంద్రుడు లీలాశుకుడు తన కవితాశక్తి అనే కవ్వంతో, నుడి కడలిని మథించి వెలికి తీసిన ‘కృష్ణ కర్ణామృతం’ ఉంది.వీనుల విందు చేసే ఈ అమృతాన్ని, అభిరుచి ఉన్నవారెవరయినా, ఉచితంగా, తనివి తీరా ఆస్వాదించవచ్చు. లీలాశుకుడు ఈ కావ్యంలో తన ఇష్టదైవమైన బాలగోపాల కృష్ణుడిని ఎన్నెన్నో శబ్దాలంకారాలతో, అర్థాలంకారాలతో, చమత్కారాలతో అలంకరించి తరించాడు. ఆ కర్ణామృత కలశంలో ఒక్క చుక్క పట్టి చూసినా, అమృతం నాణ్యత అర్థమైపోతుంది.మన్మథుడు తుంట వింటివాడే కాదు. తుంటరివాడు కూడా. ఎంతో ప్రయత్నంతో, ఎన్నో సాధనలతో కష్టపడి, శుద్ధి చేసుకొన్న మహాభక్తుడి మనసులోకి ఎలాగో చొచ్చుకుపోతాడు. మదన వికారాల మాలిన్యంతో దాన్ని మళ్లీ మైల పడేస్తాడు. అలాంటి ఆగడాలు తన దగ్గర సాగవని లీలాశుకుడు మృదుమధురంగా, సొగసుగా, గడుసుగా మంద లిస్తూ..‘మార! మా రమ మదీయ మానసే,మాధవైక నిలయే యాదృచ్ఛయా!’అంటాడు. ‘‘మదనుడా! నా మనసులో దూరి అల్లరి చేయకు. ఇది మాధవుడు ఒక్కడి కోసం అచ్చంగా ఏర్పరచిన మందిరం. ఇక్కడ స్వేచ్ఛా విహారం చేస్తూ, ‘రమించ’కు. మా రమ!’ అని. అలా రమిస్తూ, ఆగం చేస్తే ఏమౌతుంది? కొంప మునుగుతుంది.ఎందుకంటే, 'శ్రీ రమాపతిః – ఇహ – ఆగమేత్ – అసౌ’ ఇల్లుగలాయన అయిన ‘రమాధవుడు ఇప్పుడో, ఇంకాసే పట్లోనో ఇక్కడికి వస్తాడు.’ ఆయన నీ గోల చూస్తే నీ వీపు విమానం మోత మోగిస్తాడో, తాట ఒలిచేస్తాడో!కః సహేత నిజ వేశ్మ లంఘనమ్? ‘తన ఇంట్లో పరులు స్వేచ్ఛగా జొరబడితే, ఎవరు సహిస్తారు?’ అందులో ఆయన సామాన్యుడా? సకల శక్తిశాలి. ఏమయినా చేయగలడు. ‘కనుక బతుకు మీద తీపి ఉంటే, నా నుంచి దూరంగా పారిపో!’’ అని పంచశరుడిని భక్తాగ్రణి హెచ్చరిస్తున్నాడు.– ఎం. మారుతి శాస్త్రి -
ఇక ఉద్యోగాలు, ఉత్పాదకతే లక్ష్యం
1991లో చేపట్టిన సంస్కరణలను అనేకమంది భారతదేశ ఆర్థిక రంగానికి ‘లాంచ్ ప్యాడ్’ (అభివృద్ధికి పునాది)గా భావిస్తారు. 1991 జూలై 4న– సరిగ్గా 35 ఏళ్ళ క్రితం అప్పటి ఆర్థిక మంత్రి మన్మో హన్ సింగ్ తన బడ్జెట్ ప్రసంగంలో విక్టర్ హ్యూగో మాటలను ఉటంకిస్తూ, ‘సమయం ఆసన్నమైన ఆలోచనను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు’ అని పేర్కొన్నారు. ‘ప్రపంచంలో భారత్ ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం అనేది కూడా అలాంటి ఆలోచనే’ అని ఆయన ప్రకటించారు.ముప్పై ఐదు సంవత్సరాల తరువాత, మనకు స్పష్టంగా కనిపిస్తున్నది ఏమిటంటే– ఆ రోజున పారిశ్రామిక, వాణిజ్య నియంత్రణలను తొలగించడం అనేది భారతదేశ ఆర్థిక వృద్ధి రేటునూ, అలాగే పేదరిక నిర్మూలన వేగాన్నీ పెంచడానికి ఎంతగానో తోడ్పడింది. అయితే 1991లో చేసిన వాగ్దానం పాక్షికంగా మాత్రమే నెరవేరిందని మనం అంగీకరించక తప్పదు. నిజానికి, అంత అను కూలంగా లేని అంతర్జాతీయ వాతావరణంలో, ఎటువంటి సులువైన పరిష్కారాలు లేని ఆర్థిక భద్రత, సాంకేతిక పరిపక్వత, సమ్మిళిత వృద్ధి అనే నూతన సవాళ్ళను ఎదుర్కొంటూ దేశం మరోసారి ఒక సంక్లిష్టమైన స్థితిలో నిలబడింది.అభివృద్ధి నిజమే కానీ...1990–91 నాటికి అంతకు ముందు 40 సంవత్సరాలలో, మన ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెరిగింది. కానీ అదే సమయంలో జనాభా రెండున్నర రెట్లు పెరగడంతో, తలసరి ఆదాయం కేవలం రెట్టింపు మాత్రమే అయింది. దానికి భిన్నంగా, 1990–91 తర్వాత గత 35 ఏళ్లలో, ఆర్థిక వ్యవస్థ ఎనిమిది రెట్లు పెరిగింది. ఈ మధ్యకాలంలో జనాభా 70 శాతం మాత్రమే పెరగడం వల్ల, తలసరి ఆదాయం నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది.మొదటి కాలంలో భారత్ ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ పనితీరు కనబరచగా, రెండవ (ఆర్థిక సంస్కరణల తరువాతి) కాలంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే పోటీ పడగలిగేలా అద్భుతమైన వృద్ధి నమోదు చేసింది. అయితే, ఇంకా ఎంతో సాధించి ఉండవచ్చని చైనా, వియత్నాంలు నిరూపిస్తున్నాయి. భారత్‌కు సమానమైన స్థాయి నుండి ప్రయాణం ప్రారంభించిన చైనా, ఇప్పుడు ‘అధిక ఆదాయ’ దేశాల జాబితాలోకి చేరే స్థితిలో ఉంది.1991లో భారతదేశ తలసరి ఆదాయంలో సగం కంటే తక్కువ ఆదాయం ఉన్న వియత్నాం ఇప్పుడు భారత్ కంటే 80 శాతం అధిక ఆదాయాన్ని కలిగి ఉంది. భారత్ ఇప్పటికీ ‘దిగువ–మధ్య ఆదాయ’ గ్రూపులోనే ఉంది. మన తలసరి ఆదాయం ప్రపంచ సగటులో నాలుగో వంతు కంటే తక్కువగానే ఉంది. తీవ్ర పేదరికం 1991లో 37 శాతంగా ఉండగా, ఇప్పుడు 5 శాతానికి పడిపోయింది. కానీ బహుమితీయ పేదరిక సూచీ ప్రకారం, ఇప్పటికీ ఆరో వంతు జనాభా పేదరికంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీలో భారత్ దిగువనే ఉంది. అయినప్పటికీ, వంటగ్యాస్,మంచినీటి కనెక్షన్లు, మరుగు దొడ్లు, గృహ విద్యుత్ వంటి ప్రాథమిక వస్తువుల లభ్యత గతంలో కంటే ఇప్పుడు మెరుగైంది.అయినా ప్రపంచ దృష్టి భారత్‌పైనే...కొన్ని విజయాలు పరిమి తమైనవిగా అనిపించినప్పటికీ, గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచంలోనే అతిపెద్దదైన ఇక్కడి జనాభా పరిమాణమే. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, అనేక రకాల ఉత్ప త్తులు, సేవలకు భారత్ ప్రపంచంలోనే అత్యంత భారీ మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఇది, ఖర్చు పెట్టే శక్తి ఉన్న ఒక పెద్ద మధ్యతరగతి విభాగ ఆవిర్భా వాన్ని ప్రతిబింబిస్తుంది.భారత్‌లోని 145 కోట్ల జనాభాలో 30 నుండి 40 శాతం మంది మధ్యతరగతి పరిధిలోకి వస్తారు. ఈ వర్గంలో దాదాపు 8 నుండి 10 కోట్ల కుటుంబాలు ఉన్నాయనడానికి ఏటా విక్రయించే 2 కోట్ల ద్విచక్ర వాహనాలు, 15 కోట్ల స్మార్ట్ఫోన్లు సాక్ష్యంగా ఉన్నాయి. 1991లో ఏడాది మొత్తం అమ్మిన కార్ల సంఖ్యను ఇప్పుడు కేవలం పదిహేను రోజుల్లోనే విక్రయిస్తున్నారు. ఆదాయంతో పోలిస్తే ఉత్ప త్తులు అందుబాటు ధరల్లో, మెరుగైన నాణ్యతతో లభిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సేవలు, తక్కువ ఖర్చుతో కూడిన ఫార్మాస్యూటికల్స్ తయారీలో భారత్ ప్రత్యేక గుర్తింపు పొందింది. భారత్ రూపొందించిన డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్, ఆయిల్ రిఫైనింగ్, వైద్యసంరక్షణ రంగాలలో సాంకేతిక పరిణతి కూడా గుర్తింపు పొందాయి. హార్వర్డ్ గ్రోత్ ల్యాబ్ వారి ‘ఎకనామిక్ కాంప్లెక్సిటీ ఇండెక్స్’లోని 145 దేశాలలో భారత్ పైనుండి మూడో స్థానంలో ఉంది. 1991 సంస్కరణల మూల సూత్రాన్ని దేశం సరిగ్గా అనుసరించి ఉంటే ఇంకా ఎంతో సాధించి ఉండేది. ప్రైవేట్ రంగం, మార్కెట్లు అవి సాధించగలిగినవాటిని వదిలేయడం, బయటి ప్రపంచానికి తలుపులు తెరవడం, ప్రభుత్వం మాత్రమే అందించగలిగే వాటిపై శ్రద్ధను కేంద్రీకరించడం–అంటే శాంతిభద్రతలు, న్యాయం, ప్రజారోగ్యం, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలు, పర్యావరణ పరి రక్షణ, మార్కెట్ల సరైన నియంత్రణ కలిగి ఉండటమే ఆ సూత్రం.వాస్తవ స్థితివీటిలో ప్రతి విషయంలోనూ భారత్ వెనుకబడి ఉంది. దేశంలో 22 లక్షల మంది పోలీసులు ఉంటే, దానికి నాలుగు రెట్లు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. కోర్టుల్లో ఆలస్యం అనేది సర్వసా ధారణమైపోయింది. సగానికి పైగా పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. 40 శాతం ఆసుపత్రి పడకలు ప్రైవేట్రంగానివే. ప్రజల ఆదాయాలు ఇంకా పరిమితంగా ఉన్న సమయంలో ఈ రెండింటికీ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సరిపడా పోషకాహారం లేకపోవడం వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి.కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రభుత్వ అప్పులు ఆందోళన కరమైన స్థాయికి చేరాయి. విద్య, రక్షణ రెంటిపై ప్రభుత్వం చేసే వ్యయం తగ్గుతోంది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువ. గత దశాబ్దపున్నర కాలంగా రక్షణాత్మక సుంకాలు, ఇతర అడ్డంకులు పెరిగిన కొద్దీ, జీడీపీలో వస్తువుల ఎగుమతుల నిష్పత్తి తీవ్రంగా తగ్గుతూ వచ్చింది. మంచి ఉద్యోగాల కల్పన కష్టంగా మారడంతో మధ్యతరగతి పరిమాణం గతంలోలాగా పెరగడం లేదు. దేశంలోని అత్యున్నత అర్హతలు కలిగినవారు పెద్ద సంఖ్యలో దేశం విడిచి వెళ్తున్నారు. స్వదేశీ ప్రైవేట్ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో లేవు. అత్యంత తీవ్రంగా దెబ్బ తిన్నది మాత్రం మధ్యతరగతికి, పేదలకు మధ్యన ఉన్న ‘ఆకాంక్షల వర్గం’. అసంఘటిత రంగంలో అస్థిరమైన, తక్కువ ఆదాయాల వల్ల వీరిలో అత్యధికులు ‘నిశ్శబ్ద నైరాశ్యంతో కూడిన జీవితాలను’ గడుపుతున్నారు. ఈ వర్గానికి చెందిన కొందరు యువకులు గత నెల రోజు లుగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసన ప్రాంతంలో కనిపించారు. ఈ వయస్సు వర్గాలలో 25 శాతం నుండి 40 శాతం వరకు నిరుద్యోగం ఉంది. 1991 సంస్కరణల స్ఫూర్తిని కొనసాగిస్తూ, ప్రభుత్వం తన శ్రద్ధను ప్రాథమిక సేవలపై కేంద్రీకరించడం ద్వారా మాత్రమే ఈ స్థితిని మార్చగలదు.-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)-టి.ఎన్. నైనన్ -
అమెరికా రాజనీతికి యుద్ధం కేంద్రకం
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలను, వీటిలో యూఎస్ఏ పాత్రను విస్తృత అంతర్జాతీయ జియో పొలిటికల్ క్రీడలో భాగంగా చూడాలి. 2035లో ప్రపంచ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతున్నది. ఈ పరిణామంలో భాగమే ఈ యుద్ధాలు. గత 250 సంవత్సరాల అమెరికా చరిత్ర పూర్తిగా యుద్ధాలతోనే ముడిపడి ఉన్నది. గత శతాబ్దంలో ప్రతి 20 సంవత్సరాలకు కనీసం ఒక పెద్ద యుద్ధానికి తెరతీసింది. పద్దెనిమిది,పందొమ్మిది శతాబ్దాలలో దేశ విస్తరణకు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, మెక్సికోలతో యుద్ధం చేసింది. ఇరవయ్యవ శతాబ్దంలో ఫిలిప్ఫైన్, రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, బోస్నియా, గల్ఫ్ యుద్ధాలలో నిమగ్నమైంది. ఇరవయ్యొకటవ శతాబ్దంలో అఫ్గాని స్తాన్, ఇరాక్, లిబియా, యెమెన్, సిరియా, సోమాలియాలలో యుద్ధాలను లేవనెత్తింది. గత 250 ఏళ్లలో యూఎస్ఏ కేవలం 1865–1898 (33 సం‘‘లు), 1918–1945 (27 సం‘‘లు) మధ్య మాత్రమే యుద్ధానికి దూరంగా ఉన్నది. శాంతి కోసం యుద్ధం, సుభిక్షానికి యుద్ధం, సుస్థిరతకు యుద్ధం అనేది అమెరికా పాలనా విధానం. శక్తిని చాటి చెప్పటానికి యుద్ధాన్ని ఒక పరికరంగా పరిగణిస్తుంది. ఈ యుద్ధ తంత్రానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ఉదారవాద విధానాల ముసుగు కప్పుతుంది. కథ అడ్డం తిరిగింది!సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ప్రపంచంపై తన ఏకచ్ఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి అమెరికా సర్వశక్తులు ఒడ్డింది. ప్రత్యర్థి రష్యాను పూర్తిగా అణచివేయాలని నాటోను విస్త రించింది. 2010కల్లా రష్యా ఆర్థికంగా పుంజుకొని అమెరికాకు సవా లుగా తయారైంది. ఇదే సమయంలో అనూహ్యంగా చైనా బలమైన ప్రత్యర్థిగా ఎదిగింది. 2020కల్లా భారత్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలు కూడా బలమైన శక్తులుగా రూపుదిద్దుకున్నాయి. బ్రిక్స్ రూపంలో కూటమిగా చేరి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను సంకల్పించటంతో కథ అడ్డం తిరిగింది.బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడటం ఖాయమనే విశ్లేషకుల జోస్యాన్ని తప్పుగా నిరూపించాలని కృతనిశ్చయంతో ఉన్నది. అమెరికా ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. 1. ప్రత్యర్థు లను నిర్వీర్యం చేసి ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగటం. 2. ప్రత్య ర్థులతో రాజీపడి పరిమిత ధ్రువ (లిమిటెడ్ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం. 3. ప్రత్యర్థులతో రాజీపడి బహుళ ధ్రువ (మల్టీ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం.మూడింట్లో మొదటి దారిప్రస్తుతం అమెరికా ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగాలనే పట్టు దలతోనే ఉన్నట్లుగా కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే ఇంధన వనరులు, ఇంధన రవాణా మార్గాలపై పెత్తనానికి సర్వశక్తులు ఒడ్డు తున్నది. రష్యాపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించి ఉక్రెయిన్ యుద్ధపు పద్మవ్యూహంలోనికి రష్యాను లాగింది. రష్యానుండి చమురు, గ్యాస్ ఎవరూ కొనగూడదని ఐరోపా, భారత్‌లను కట్టడి చేసింది. దీర్ఘకాలిక యుద్ధంలో ఉక్రెయిన్ వెనుక నిలబడి రష్యా అలసిపోయి నిర్వీర్యమవటానికి దీర్ఘకాలిక ప్రణాళికను అమలు పరుస్తున్నది. అందుకే నెల లోపున ముగుస్తుందనుకున్న ఉక్రెయిన్ యుద్ధం నాలుగన్నర సంవత్సరాలకు కూడా కొనసాగుతున్నది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చైనా చేతిలో పడకుండా చూడటం ద్వారా చైనాను కట్టడి చేయాలనేది అమెరికా వ్యూహం. ‘చిప్ 4’ అలయన్స్‌లో భాగంగా అమెరికా, తైవాన్, ద.కొరియా, జపాన్‌లు చైనాకు అత్యాధునిక సెమీకండక్టర్ చిప్‌లు అందుబాటు లోనికి రాకుండా ప్రయత్నిస్తున్నాయి. ఆకస్ కూటమిలో భాగంగా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏలు ఏఐ, క్వాంటమ్ మెకానిక్స్ హైపర్సోనిక్ టెక్నాలజీని చైనాకు అందకుండా చేయటానికి ప్రయ త్నిస్తున్నాయి. జీ7, యూరోపియన్ యూనియన్ల ద్వారా అత్యాధు నిక చిప్స్ తయారు చేసే యంత్రాలను ఏఎస్ఎంఎల్ (నెదర్లాండ్స్), టోక్యో ఎలక్ట్రానిక్ (జపాన్) కంపెనీలు చైనాకు ఎగుమతి చేయకుండా ఆంక్షలు పెట్టాయి. తైవాన్ను సమర్థించటం ద్వారా కూడా చైనాకు చెక్ పెట్టటానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.విశేషంగా ఇంధన వనరులున్న ఇరాన్, ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్ మొదలైన గల్ఫ్ దేశాలపై నియంత్రణకు అమెరికా దీర్ఘకాలికంగా వ్యూహాలను అమలుపరుస్తున్నది. సైనిక స్థావరాల ద్వారా గల్ఫ్ దేశాలలో అమెరికా ఇప్పటికే పాగా వేసింది. ఈ ఇంధన వనరుల నియంత్రణలో అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది ఇరాన్. అందుకే హార్మూజ్, బాబెల్ మాండెబ్ జలసంధులపై పెత్తనానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.ఆసియాలో భారత్ ఆధిపత్యం?అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంలో భాగాలే ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు. అందువలన ఈ రెండు ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవు. ఇరాన్ యుద్ధం వలన తీవ్రంగా నష్ట పోయేది భారత్, చైనాలని గుర్తించాలి. చైనా, రష్యా, భారత్‌లను ఈ రెండు యుద్ధాల ద్వారా కట్టడి చేయటం సాధ్యం కాని పక్షంలో అమె రికా పరిమిత ధ్రువ ప్రపంచానికి రాజీ పడాల్సి వస్తుంది. రష్యా, చైనా/భారత్‌లను ప్రపంచ శక్తులుగా అంగీకరించాల్సి వస్తుంది. క్రమంగా నాటోను రద్దుపరచి ఐరోపాపై రష్యా ఆధిపత్యానికి అంగీ కరించి ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలకు యూఎస్ఏ తన ఆధిప త్యాన్ని పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణ, తూర్పు ఆసి యాలలో చైనా ఆధిపత్యాన్ని అంగీకరించి గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రా యెల్–యూఏఈ– సౌదీల ద్వారా నియంత్రణకు ప్రయత్నిస్తుంది. అయితే దక్షిణ, తూర్పు ఆసియాలలో ఆధిపత్యంతో చైనా సరిపెట్టుకోక పోవచ్చును. చైనా ప్రపంచాధిపత్యానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాక్రమంగా రష్యాతో ఒప్పందం ద్వారా చైనాకు వ్యతిరేకంగా భార త్ను ఆసియాలో ఆధిపత్యానికి ప్రోత్సహించవచ్చును.2040 కల్లా చైనా ప్రపంచ శక్తిగా అమెరికా, రష్యాలనే సవాలు చేయవచ్చని విశ్లేషకుల అంచనా. ఈనాడు ప్రత్యర్థులుగా ఉన్న రష్యా, అమెరికాలు కలిసి చైనాను నిలువరించాల్సి రావచ్చును. రాజకీయాలలో శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శతృత్వం కానీ ఉండదు. అమెరికా, రష్యాలు, ఆసియాలో భారత్ వైపే మొగ్గు చూప టానికి అవకాశం ఉన్నది. తైవాన్ను చైనా ఆక్రమించటానికి ప్రయ త్నించినప్పుడు చైనాను ఇంకొకవైపు నుండి నిలువరించటానికి భారత్ సిద్ధమవవచ్చును. ఒకవైపు హిమాలయాలలో చైనాపై దాడి చేస్తూనే భారత్ మలక్కా జలసంధిని దిగ్బంధనం చేయవచ్చు. ఆ సందర్భంలో చైనా సముద్రంలో అమెరికా, జపాన్‌లను చైనా ఎదు ర్కోవటం కష్టమవుతుంది. భారత్‌కు అమెరికా సైనిక, వ్యూహాత్మక మద్దతును అందించవచ్చును.కాకపోతే, ఈ అమెరికన్ అంతర్జాతీయ రాజకీయ వ్యూహంలో పావుగా మారటానికి భారత్ ఒప్పుకోకపోవచ్చును. ప్రాంతీయంగా ఆసియాలో చైనాను నియంత్రించటానికి భారత్ ఒప్పుకుంటుంది. కానీ అంతర్జాతీయంగా చైనాను నిరోధించే వ్యూహంలో భారత్ భాగ స్వామిగా మారాల్సిన అవసరం భారత్‌కు లేదు. ఏది ఏమయినా ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు అంతర్జాతీయ రాజకీయ యవనికను నియంత్రించే కీలక ఘట్టాలనటంలో సందేహం లేదు. భారత్ ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు- గురజాల శ్రీనివాసరావు -
వ్యవసాయ భవిష్యత్తుకు కొత్త ఊపిరి
భారత వ్యవసాయం వందల ఏళ్లుగా కరవులను, వరదలను, ధరల పతనా లను, విధాన మార్పులను తట్టుకుని నిల బడింది. అభిరుచులు, మార్కెట్లు, సాంకే తికతలు మారుతున్న కొద్దీ పంటలు వచ్చాయి, పోయాయి. కొన్ని పంటలు రైతులకు తాత్కాలిక ఊరటనిస్తే, కొన్ని వారిని అప్పుల్లో పడేశాయి. చరిత్ర చెప్పే నిజం ఏమిటంటే– సరైన విధానం, ముందుచూపు తోడైతే ఒక్క పంట కూడా ఊరు, దేశం ఆర్థిక పరిస్థితినే మార్చగలదు. ప్రపంచంలో వంట నూనెలకు డిమాండ్ పెరుగుతున్న ఈ కాలంలో, ఆ మార్పు తెచ్చే పంట ఆయిల్ పామ్. తెలంగాణకు ఆయిల్ పామ్ కేవలం ఒక కొత్త పంట కాదు– ఇది దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహం. ఒక గేమ్ ఛేంజర్ కాగల పంట.ప్రధాన ఆర్థిక వనరుతెలంగాణ ఏర్పడిన మొదటి పదేళ్లలో మిషన్ కాకతీయ లాంటి పథకాల ద్వారా సాగునీటిని వసతులని పునరుద్ధరించడం సబబే. కానీ కేవలం వరి, పత్తి పంటల పైనే ఆధారపడిన వ్యవసాయం వాంఛనీయం కాదు. రాష్ట్రం రెండో పదేళ్లలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, మన వ్యవసాయ భవిష్యత్తుకు ఒక కొత్త ఆధారం కని పిస్తోంది. ఆయిల్ పామ్‌ను ఒక చిన్న పంటగా చూడటం మానేసి, నర్సరీ నుంచి రిఫైనరీ దాకా పూర్తి వ్యవస్థను నిర్మించే కొత్త గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీన్ని పునాదిగా చూడాల్సిన సమయం వచ్చింది.ఆయిల్ పామ్ ఎందుకింత ముఖ్యమో అర్థం కావాలంటే మనం మన దేశ సరిహద్దులు దాటి చూడాలి. జనాభాలో మన కంటే చాలా తక్కువగా ఉన్న ఇండోనేషియా, మలేషియా దేశాలు ఈ ఒక్క పంటతో తమ గ్రామాల రూపురేఖలనే మార్చేశాయి. సుమారు 28.3 కోట్ల జనాభా ఉన్న ఇండోనేషియా, దాదాపు 4.2 కోట్ల ఎక రాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 4.6 కోట్ల టన్నుల పామ్ ఆయిల్ ఉత్పత్తి చేస్తోంది. ఆ దేశ జీడీపీలో ఆయిల్ పామ్ వాటా సుమారు 4.5 శాతం, ప్రత్యక్షంగా, పరోక్షంగా 16 లక్షలకు పైగా కుటుంబాలకు ఇది జీవనోపాధి.మలేషియా కథ కూడా ఇలాంటిదే. కేవలం 3.56 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం దాదాపు 1.4 కోట్ల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, ఏటా సుమారు 2 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తోంది. 1970లు, 1980లలో రబ్బరు ధరలు పెరగకుండా, గ్రామాల్లో ఆదాయం తగ్గి నప్పుడు, మలేషియా వ్యూహాత్మకంగా ఆయిల్ పామ్ వైపు మళ్లింది. భద్రత–స్థిరత్వం 147 కోట్ల జనాభా ఉన్న మన భారత ప్రజానీక ఆశలు, తినే అలవాట్లు వేగంగా మారుతున్నాయి. మన దేశంలో పండించే వంట నూనె మన అవసరంలో సగం మాత్రమే తీరుస్తోంది. ప్రతి ఏటా సుమారు 130 లక్షల టన్నుల వంట నూనెలను బయటి నుంచి తెచ్చుకుంటున్నాం. కేవలం పామ్ ఆయిల్ కోసమే ఏటా సుమారు రూ.1 లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నాం. సూటిగా చెప్పాలంటే, మనం మన విలువైన విదేశీ మారకాన్ని బయటికి పంపి, దానికి బదులు అనిశ్చితిని తెచ్చుకుంటున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా సరఫరాలో ఏ చిన్న ఆటంకమైనా, ఏ దేశాల మధ్య ఉద్రిక్తతైనా, అంతర్జాతీయ ధరలు పెరిగినా, దాని ప్రభావం నేరుగా మన వంట గదులపైనా, మన రైతులపైనా పడుతుంది.ఇలా బయటి నుంచి తెచ్చుకోవాల్సి రావడానికి కారణం మన రైతులకు సామర్థ్యం లేకపోవడం కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును బాగా పెంచగల వాతావరణం, నేలలు ఉన్నాయి. అయినా, దేశం మొత్తం మీద కేవలం 10 లక్షల ఎకరాల్లోనే ఆయిల్ పామ్ సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, తక్కువ మొత్తంతో మొద లైనా తెలంగాణ ఇప్పటికే రెండో స్థానానికి చేరుకుంది. భద్రత, స్థిరత్వం ఇచ్చే ఈ పంటను చేపట్టడానికి తెలంగాణ రైతుల్లో ఉన్న ఆసక్తిని, సంసిద్ధతను ఇది చూపిస్తుంది.ఈ రోజు తెలంగాణలో సుమారు 2.8 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది, అందులో అవిభక్త ఖమ్మం జిల్లా ఒక్కటే దాదాపు 1.35 లక్షల ఎకరాలు కలిగి ఉంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాబోయే సంవత్సరాల్లో ఈ సాగును 10 లక్షల ఎకరాలకు పెంచాలని రాష్ట్రం ఒక పెద్ద, కానీ సాధించగల లక్ష్యాన్ని పెట్టుకుంది.ఆయిల్ పామ్ తోట దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు దిగుబడి ఇస్తుంది. ఒకే పంటకోతపై, ఒకే మార్కెట్ ధరపై ఆధారపడే కాలానుగుణ పంటల్లా కాకుండా, ఏడాది పొడవునా తాజా పండ్ల గెలలు ఇస్తుంది. అంటే ఏడాదికోసారి వచ్చే పెద్ద మొత్తం కాదు, ప్రతి నెలా చేతికి డబ్బు అందుతుంది. తోటలు పూర్తి దిగుబడికి వచ్చాక, దిగుబడి, నిర్వహణను బట్టి, ఇప్పటి ధరల ప్రకారమే రైతులు ఎకరాకు ఏటా రూ.2 లక్షల వరకు సంపాదించ గలుగుతున్నారు. తాజా పండ్ల గెలల ధర టన్నుకు రూ. 22,000 నుంచి రూ.24,500 వరకు ఉంటూ, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ పామ్ (ఎన్ ఎంఈఓ–ఓపీ) లాంటి పథ కాల కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి తోడ్పాటునందిస్తుండటంతో, చాలా గ్రామీణ కుటుంబాలకు ఆయిల్ పామ్ నెలనెలా జీతం లాంటిదిగా మారింది. దీనికి తోడు, మొక్కలు, ఇన్ పుట్లు, మొదట్లో అయ్యే ఖర్చుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు సుమారు రూ.50,000 వరకు సబ్సిడీ ఇస్తోంది. దీనితో పూర్తి దిగుబడి రాకముందు మొదటి మూడు, నాలుగేళ్లలో రైతులపై పడే భారం తగ్గుతుంది.విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా...ఆయిల్ పామ్‌లో ఏదీ వృథా పోదు. పండు నుంచి ముడి పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్ తీస్తారు. పీచు, పెంకులను కరెంటు తయారీకి వాడొచ్చు. మిగిలిన వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా, పశుగ్రాసంగా మార్చొచ్చు. కోకో, జాజికాయ, మిరియాలు, పూలు లాంటి నీడలో పెరిగే పంటలను కలిపి వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు ఒకే పంట తోటలుగా కాక, రకరకాల ఆదాయాలు ఇచ్చే తోటలుగా మారతాయి.పొలం గట్టు దాటి కూడా, ఆయిల్ పామ్ వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు పుడతాయి. నర్సరీలు, ఇన్ పుట్లు అమ్మేవారు, కోత సేవలు, రవాణా చేసేవారు, ఫ్రూట్ కలెక్షన్ కేంద్రాలు, క్రషింగ్ యూనిట్లు, రిఫైనరీలు, ప్యాకింగ్ యూనిట్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, వీళ్లందరూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగమై ఉపాధిని పెంచుతారు.అశ్వారావుపేట, దమ్మపేట లాంటి ప్రాంతాల్లో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇప్పటికే వ్యాపార కేంద్రాలుగా మారడం చూశాం. సిద్దిపేటలో కొత్త ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా కొణిజర్లలో గోద్రెజ్ సంస్థ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ‘విత్తనం నుంచి నూనె ప్యాకెట్ దాకా‘ ఒకే గొలుసుగా చేయడమే తెలంగాణ వ్యూహం.ఆయిల్ పామ్ పర్యావరణానికి హానికరం అని కొందరు అంటున్నారు. ఈ అభిప్రాయం ఎక్కువగా వేరే దేశాల్లో సున్నితమైన అడవులు, తడి నేలల్లో పెద్ద ఎత్తున అడవులను కొట్టేసిన అనుభవాల నుంచి వచ్చింది. తెలంగాణ పరిస్థితి పూర్తి భిన్నం. మనం అడవు లను కొట్టేయడం గురించి మాట్లాడటం లేదు; తక్కువ దిగుబడి ఉన్న, వర్షాధార లేదా ఒకే పంట పండే భూములను సరైన నీటి వాడకంతో మంచి విలువ ఇచ్చే చెట్ల తోటలుగా మార్చడం గురించి మాట్లాడుతున్నాం. సరిగ్గా ప్రణాళిక వేసుకుంటే, ఆయిల్ పామ్ తోటలు పచ్చదనాన్ని పెంచుతాయి, గాలిలో కార్బన్‌ను ఎక్కువగా పీల్చుకుంటాయి, కొండ ప్రాంతాల్లో నేల కొట్టుకుపోకుండా చూస్తాయి, తేమను నిలుపుతాయి. సహజ అడవులను కొట్టేయకుండా కఠినంగా ఉంటూ, అంతర పంటలు, జీవవైవిధ్యానికి మేలు చేసే పద్ధతులను ప్రోత్సహిస్తూ ఉంటే, ఆయిల్ పామ్ తెలంగాణలో పర్యావరణానికి శత్రువు కాదు, స్నేహితుడు కాగలదు.- తుమ్మల నాగేశ్వర రావు, వ్యాసకర్త, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి -
చైనా ఫ్లయింగ్ పవర్ స్టేషన్
అత్యాధునిక పద్ధతులతో మౌలికరంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న చైనా, విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ వినూత్న ప్రయోగాలకు తెరలేపింది. ఇటీవల సిచువాన్ ప్రావిన్స్‌లోని యిబిన్ ప్రాంతంలో భారీ ఎయిర్ షిప్‌ను ఆకాశంలోకి ఎగురవేసింది. దీనికి ‘ఫ్లయింగ్ విండ్ పవర్షిప్ ఎస్–2000’ అని పేరు పెట్టింది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఫ్లయింగ్ పవర్ స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఇది గాలి వేగాన్ని ఉపయోగించుకుని విద్యుత్తును ఉత్పత్తి చేసే సాంకేతికత. సాధారణ విండ్ మిల్లులు భూమికి తక్కువ ఎత్తులోఉంటాయి. అక్కడ గాలి వేగం తక్కువగా ఉంటుంది. కానీ ఎస్–2000 వంటి వ్యవస్థలు సుమారు 300 నుండి 600 మీటర్ల ఎత్తుకు ఎగిరి, అక్కడ వేగంగా వీచే గాలులను ఉపయోగించుకుంటాయి. ఈ ఎత్తులో గాలి నుండి లభించే శక్తి భూమిపై కంటే 3 నుండి 4 రెట్లు ఎక్కువ.సుమారు 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల ఎత్తు ఉండే ఈ ఎయిర్‌షిప్ హీలియం నింపిన తేలియాడే వేదిక. భూమిపై కంటే ఆకాశంలో గాలి వేగం స్థిరంగా, బలంగా ఉంటుంది, కాబట్టి ఇది ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. భారీ విండ్ టవర్లు కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి, నిర్మాణానికి అయ్యే ఖర్చు, ఇనుము వాడకం తగ్గుతుంది. వీటిని అవసరమైన చోటికి సులభంగా తీసుకువెళ్లవచ్చు.ఎస్ –2000 వంటి వ్యవస్థలు ప్రధానంగా రెండు రకాలుగా విద్యుత్తును తయారు చేస్తాయి: ఆన్–బోర్డ్ జనరేషన్ ఒకటైతే, గ్రౌండ్–బేస్డ్ జనరేషన్ రెండోది. ఆన్–బోర్డ్ పద్ధతిలో షిప్ రెక్కలకు ఉండే చిన్న టర్బైన్లు ఆకాశంలో గాలి వేగానికి తిరిగి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. గ్రౌండ్–బేస్డ్ పద్ధతిలో షిప్ ఆకాశంలో ఎనిమిది అంకె ఆకారంలో తిరుగుతూ కేబుల్‌ను బలంగా లాగుతుంది. దీంతో భూమిపై ఉన్న డ్రమ్ము తిరుగుతుంది. ఆ డ్రమ్ముకు అనుసంధానించిన జనరేటర్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.ఒక సాధారణ విండ్ టవర్ నిర్మించడానికి వందల టన్నుల స్టీల్, కాంక్రీట్ అవసరం కాగా, ఎస్–2000కు అందులో 10% మెటీరియల్ ఉంటే సరిపోతుంది. కేవలం ఒక చిన్న బేస్ స్టేషన్ మాత్రమే భూమిపై ఉంటుంది, కాబట్టి మిగిలిన భూమిని వ్యవసాయానికి వాడుకోవచ్చు. ఈ షిప్ బాడీని కార్బన్ ఫైబర్‌తో తయారు చేస్తారు. ఇది ఉక్కు కంటే ఐదు రెట్లు బలంగా ఉంటుంది. అలాగే బరువు చాలా తక్కువ.భారత్ పరిస్థితిభారతదేశం పవన శక్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎత్తైన కొండ ప్రాంతాల్లో మారు మూల గ్రామాల్లో గ్రిడ్ కనెక్షన్ లేని చోట్ల వీటిని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా లదాఖ్ వంటి హిమాలయ ప్రాంతాల్లో సాధారణ విండ్ టవర్లు కట్టడం చాలా కష్టం. అక్కడ ఈ ‘ఫ్లయింగ్ షిప్స్’ను సులభంగా తరలించి విద్యుత్ సమస్యను తీర్చవచ్చు.అయితే, మన దేశంలో ఎయిర్ ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా ఉంటాయి. 2,000 మీటర్ల ఎత్తులో వీటిని ఎగరవేయడానికి డీజీసీఏ నుండి ప్రత్యేక అనుమతులు కావాలి. రుతుపవనాల సమయంలో వీచే భారీ గాలులు, తుఫానుల నుండి ఈ షిప్స్‌ను రక్షించడం ఒక సవాలు. ఏది ఏమైనా ఫ్లయింగ్ పవర్ స్టేషన్స్ ఆకాశంలో వీచే గాలి నుండి శక్తిని పొందే సాంకేతికతలో ఒక ముఖ్యమైన మైలురాయి.– తరిగొప్పుల వీఎల్ఎన్ మూర్తి, జర్నలిస్ట్ -
రైతు కాళ్ల కిందే కర్మాగారం
హార్మూజ్ జలసంధి మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధర ఒక్కసారిగా టన్నుకు దాదాపు వెయ్యి డాలర్లకు పెరిగింది.దేశ యూరియా అవసరాల్లో నాలుగోవంతును దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది దిగుమతుల మీద ఆధారపడే పాత భయాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే నూతన యూరియా పెట్టుబడి విధానం రూపంలో స్పందన వచ్చింది. దేశం ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్న కోటి టన్నుల యూరియాను ఇక్కడే తయారు చేసేందుకు ఎనిమిది–తొమ్మిది కొత్త గ్యాస్ ఆధారిత కర్మాగారాలను నెలకొల్పడమే దీని లక్ష్యం.వేసిన నత్రజని పనికొచ్చేనా?తర్కంగా చూస్తే ఇది సరైన నిర్ణయమే. కానీ ఆ తర్కమే అసలు సమస్య. సరఫరా సంక్షోభం వచ్చినప్పుడు మన వ్యవసాయ విధానం చూపే ప్రతిస్పందన ఒక్కటే– ఎరువును మరింత ఎక్కు వగా ఉత్పత్తి చేయడం. కానీ ఎవరూ అడగని ప్రశ్న ఒకటుంది. పద్నాలుగు కోట్ల రైతు కుటుంబాలు, ప్రపంచంలోనే అతిపెద్దపశు సంపద, ప్రతి శీతాకాలంలో తగలబెట్టే కోట్లాది టన్నుల పంట వ్యర్థాలు– ఇవన్నీ ఉన్న దేశం ఇంత భారీ మొత్తంలో కృత్రిమ నత్రజనిని ఎందుకు దిగుమతి చేసుకోవాలి?గత అరవై ఏళ్లుగా మన వ్యవసాయ విధానాన్ని ఒక నమ్మకం శాసిస్తోంది– ప్రతి ఉత్పాదకత సమస్యా ఎరువుల సమస్యే; దాన్ని మరిన్ని ఎరువులు ఉత్పత్తి చేయడం, దిగుమతి చేయడం, రాయితీ ఇవ్వడం ద్వారానే పరిష్కరించాలి. హరిత విప్లవం కాలంలో ఇది నిజమే. అప్పుడు నత్రజని కొరత ఒక అడ్డంకి. కానీ ఇవాళ మన అసలు సమస్య నత్రజని కొరత కాదు; పంటకు నత్రజనినిఅందించే నేల ఆరోగ్యం బాగా క్షీణించింది. ప్రభుత్వ నేల ఆరోగ్య కార్డుల డేటానే చూస్తే– దేశంలో దాదాపు 64 శాతం నేలల్లో నత్రజని తక్కువ, 48.5 శాతం నేలల్లో సేంద్రియ కర్బనం తక్కువ. మరో గణాంకం మరింత భయపెడుతుంది. హరిత విప్లవం తొలినాళ్లలో ఒక కిలో ఎరువుకు దాదాపు పదమూడు కిలోల అదనపు ధాన్యం వచ్చేది– అంటే 1:13 నిష్పత్తి. ఇవాళ అది 1:2.7కి పడి పోయింది. అంటే అదే కిలో ఎరువు ఇప్పుడు నాలుగో వంతు ధాన్యాన్ని మాత్రమే ఇస్తోంది. మనం వేసే నత్రజనిలో అరవై శాతానికి పైగా పంటకు అందకుండా గాలిలోకి, భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోతోంది. నత్రజని చౌకగా దొరకడంతో రైతులు దాన్నే మోతాదు మించి వాడుతున్నారు; ఫలితంగా ఎన్ పీకే(నత్రజని, భాస్వరం, పొటాషియం) నిష్పత్తి 4:2:1 ఉండాల్సిన చోట దాదాపు 11:4:1కి చేరింది. ఒక ప్రాథమిక తేడాను మనం మరచిపోయాం. పంటకు పోషకాలు అందించడం వేరు, నేల సారాన్ని కాపాడటం వేరు. యూరియా పంటకు తక్షణ ఆహారం అందిస్తుంది. కానీ నేలలోసేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు, వానపాములు– వీటిని అది పెంచదు. నిజానికి మోతాదు మించిన నత్రజని వీటిని దెబ్బతీస్తుంది. ఈ జీవరాశే నేలకు నీటిని పట్టి ఉంచే శక్తిని, గాలి ఆడే నిర్మాణాన్ని, పోషకాలను చక్రంలా తిప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. వీటిని రసాయనిక ఎరువులతో తిరిగి నిర్మించలేం– ఎందుకంటే ఎన్పీకే అనేది కర్బనం కాదు, జీవం అసలే కాదు.నిజంగా ఇది స్వావలంబనా?నూతన యూరియా విధానం చెప్పే స్వావలంబన కూడా చాలావరకు భ్రమే. యూరియా అమోనియా నుంచి, అమోనియా సహజ వాయువు నుంచి తయారవుతాయి. ఆ సహజ వాయువులో చాలా భాగం మనం ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రూపంలో దిగుమతి చేసుకునేదే. యూరియా ఉత్పత్తి వ్యయంలో ఇది 70–80 శాతం. అంటే కొత్త కర్మాగారం అంటే దిగుమతి చేసుకున్న వాయువును ఇక్కడ యూరియాగా మార్చే యంత్రం మాత్రమే. మన ఆధారపడటం పోలేదు, కేవలం ఒక మెట్టు పైకి జరిగింది. భాస్వరం, పొటాష్ విషయంలో అయితే మనం దాదాపు పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడతాం.అమెరికా ఉదాహరణ చూడండి: ఆ దేశం నత్రజనిలో స్వావలంబన సాధించిన మాట నిజమే, కానీ కర్మాగారాలు కట్టడం వల్ల కాదు. దానికి సొంత షేల్ గ్యాస్ ఉంది; మొక్కజొన్న–సోయాబీన్ మార్పిడి సాగులో పప్పుజాతి పంట తనకు తానే నత్రజనిని స్థిరీక రించుకుంటుంది. ఈ రెండూ మనకు లేవు. అక్కడి వాతావరణం కూడా వేరు. మన ఉష్ణోగ్రతలకు సేంద్రియ కర్బనం తొందరగా కోల్పోతాం. అక్కడ సంవత్సరానికి ఒక పంట కాలమే, రెండోకాలంలో నేల పునర్జీవనం కావటానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా బాటలో కేవలం కర్మాగారాల స్థాపనను కాపీ చేస్తే, భారం మిగులుతుంది తప్ప భద్రత రాదు.నిజమైన స్వావలంబన అంటే మనం అదుపులో ఉంచుకోగల వనరుల నుంచి పంట అవసరాలను తీర్చుకోవడం. పప్పు« దాన్యాలు, జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు, అజొల్లా ద్వారా జీవ నత్రజని స్థిరీకరణ, పంట వ్యర్థాల పునర్వినియోగం, పశువుల ఎరువు, అన్నిటికీ ఆధారమైన నేలలో సేంద్రియ పదార్థం– ఇవి పెరిగితే వేసే ప్రతి కిలో ఎరువూ మరింత సమర్థంగా పనిచేస్తుంది. జీవసారం పెంచితే ప్రోత్సాహకాలుఇప్పుడు డబ్బుల మాట. దేశ ఎరువుల రాయితీ దాదాపు రూ.1.7 లక్షల కోట్లు; అందులో యూరియాదే రూ.1.19 లక్షల కోట్లు. తగ్గిపోతున్న రసాయనిక ఎరువుల సామర్థ్యం, వృథా అవు తున్న సగం నత్రజని– వీటిని చూస్తే ఇది తక్కువ ప్రయోజనం ఇచ్చే ఖర్చు. ఈ రాయితీలో సగాన్ని– అంటే దాదాపు 85 వేల కోట్లను– నేల ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి మళ్లిస్తే ఏమవుతుంది?ఒక టన్ను యూరియా ఒక్క సీజన్ కే అయిపోతుంది, మళ్లీ కొనా ల్సిందే. కానీ నేలలో పెరిగిన సేంద్రియ కర్బనం ఏళ్ల తరబడి నిలు స్తుంది. ప్రతి ఏటా దిగుబడిని, నీటి నిల్వను, ఎరువుల సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల బాగుపడిన కొద్దీ దానికి కావాల్సిన నత్రజని తగ్గుతుంది, దాంతోపాటే రాయితీ భారమూ తగ్గుతుంది.అందుకే ఒక జాతీయ/రాష్ట్ర స్థాయి నేల ఆరోగ్య పునరుద్ధరణ మిషన్ అవసరం. నేలలో సేంద్రియ కర్బనం, జీవసారం పెరిగిన కొద్దీ రైతుకు నేరుగా ప్రోత్సాహకం అందాలి. గ్రామ స్థాయి కంపోస్ట్, పంట వ్యర్థాల పునర్వినియోగం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో జీవ ఎరువుల యూనిట్లు– వీటిని ఉపాధి హామీ పథకం, ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయాలి.‘రసాయనిక ఎరువులు లేకుండా దేశాన్ని పోషించలేం’ అనే వాదన రావచ్చు. ఎరువులను పూర్తిగా వదిలేయాలని అనడం లేదు. మొదట్లో రసాయనికం, జీవసంబంధం రెండింటినీ కలిపి వాడే సమీ కృత పోషక యాజమాన్యమే మార్గం. భారత్ తదుపరి వ్యవసాయ విప్లవం మరిన్ని రసాయనిక ఎరువులపై కాదు– ప్రాణమున్న నేల లను తిరిగి నిర్మించడంపై ఆధారపడాలి. ఏ ఓడరేవు, గ్యాస్ పైప్‌లైన్ కోసం మనం ఎదురుచూడనక్కర్లేదు– మన అతిపెద్ద ఎరువుల కర్మాగారం ప్రతి రైతు కాళ్ల కింద, నేల జీవంలోనే ఉంది. -వ్యాసకర్త సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) కార్యనిర్వాహక సంచాలకులు-డా‘‘ జి.వి.రామాంజనేయులు -
పట్టువదలని ట్యారిఫ్ విక్రమార్కుడు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పట్టువదలని విక్రమార్కునివలె ఈ నెల 24న భారత్ సహా మొత్తం 60 దేశాలపై మరో విడత దిగుమతి సుంకాలను పెంచారు. అవి అదే రోజు నుంచి అమ లుకు కూడా వచ్చాయి. ఈసారి ఆయన చెప్పిన కారణం: ఈ దేశాలు కార్మికులతో బలవంతపు చాకిరీ చేయించి ఉత్పత్తి చేస్తున్న సరకులను తమ దేశానికి ఎగు మతి చేస్తున్నాయని! ట్రంఫ్ ట్యారిఫ్ల పరంపర ఎప్పుడు మొదలై ఎట్లా సాగుతున్నదో, అందుకు తను చెప్తూ వస్తున్న ఛప్పన్నారు కారణాలేమిటో తెలిసినవే. అత్యవసర చట్టం నెపంతో...2025 జనవరిలో అధ్యక్షునిగా బాధ్యత స్వీకరించిన వెంటనే, ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ మెమోరాండం’ పత్రంపై సంతకం చేశారు. తర్వాత వారం రోజులకు సమస్త దేశాలపై 10 శాతం నుంచి 25 శాతం దిగుమతి సుంకాలు పెంచారు. అందులో చిన్న దేశాలు, పెద్ద దేశాలు, మిత్ర దేశాలు, శత్రు దేశాలనే తేడాలు చూప లేదు. ఇతరులతో అమెరికాకు గల వాణిజ్య లోటు ఈ చర్యకు కారణ మన్న ఆయన, తమకు వాణిజ్య మిగులు ఉన్న దేశాలనూ మినహా యించలేదు. ఒక్క మానవ మాత్రుడైనా నివసించక పెంగ్విన్స్ మాత్రమే ఉండే దీవులనూ తన జాబితాలో చేర్చారు. ఆయన విధానాలను, తీరును చూడగా తన పదవీ కాలం ముగిసే 2029 జనవరి వరకు ఈ ధోరణి ముగియక పోవచ్చునని పిస్తున్నది. ఆ చర్చలోకి వెళ్లే ముందు ఈ నెల 24 నాటి సుంకాల గురించి చెప్పుకోవాలి. సుంకాలను మొదట భారీగా పెంచినప్పుడు, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్) ఉపయోగించారు. ఇతర దేశా లతో వాణిజ్య లోటు అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పు కలిగించగల స్థాయికి పెరిగిందనీ, కనుక ఇటువంటి అత్యవసర చర్యలను అమెరి కన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండానే తీసుకునే అధికారం ఆ చట్ట ప్రకారం అధ్యక్షునికి ఉందనీ అన్నారు. కానీ, అటువంటి పరిస్థి తులు లేవనీ, కనుక ఆ చర్యలు చెల్లవనీ అక్కడి సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొట్టివేసింది. అంతవరకు ప్రపంచ దేశాల నుంచి వసూలు చేసిన వందలకొద్ది బిలియన్ల అదనపు సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.దానితో ఆందోళనకు గురైన అమెరికా అధ్యక్షుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి కొత్తదారులు వెతకటం మొదలు పెట్టారు. సుప్రీం తీర్పు నుంచి తప్పించుకునేందుకు తనకు ప్రత్యామ్నా యాలు ఉన్నాయని వెంటనే ప్రకటించిన ఆయన, కాంగ్రెస్ అను మతి వెంటనే అక్కరలేని 1974వ సంవత్సరపు వాణిజ్య చట్టాన్ని ఆశ్రయించారు. అందులోని 301వ నిబంధన మేరకు వేర్వేరు దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ట్యారిఫ్‌లు ప్రకటించారు. అయితే ఆ నిబంధన ఒక పరిమిత కాలం వరకే అమలులో ఉంటుంది. ఆ గడువు తీరటంతో ఈ నెల 24న అదే స్థాయి శాతా లతో ట్యారిఫ్లను శాశ్వతంగా మార్చారు. ఆ ప్రకారం ఇండియాపై రేటు 10 శాతం అయింది.సుంకాల మజిలీలుఈ ట్యారిఫ్ల యాత్రలో భారత దేశానికి, ఇతరులకు సంబంధించి కూడా పలు మజిలీలు ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో మొదటి విడత సుంకాలలో భాగంగా ఇండియాపై 25 శాతం విధించిన ఆయన, మనం రష్యా చమురును ఖరీదు చేస్తున్నందుకు ఆగ్రహించి మరో 25 శాతం పెంచారు. అట్లా అది 50 శాతం అయింది. ఇతరత్రా డబ్ల్యూటీవోతో నిమిత్తం లేకుండా, ఇంకా చెప్పాలంటే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ, వేర్వేరు దేశాలతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలను తమకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం చర్చల పద్ధతిని గాక ఒత్తిడులు, బ్లాక్‌మెయిలింగ్‌ను ఎంచుకున్నారు. అది తట్టుకోలేని దేశాలు విడిగా ఒప్పందాలకు ఒప్పుకోగా ట్యారిఫ్ల శాతం అపుడు కొంత తగ్గించారు. ఆ విధంగా ఇండియాపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయి. ఇపుడు 10 శాతంతో కలిపి 28 శాతం అవుతున్నాయి.జపాన్, దక్షిణ కొరియా వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాలేదు, అమెరికాకు సన్నిహిత రాజ్యాలై నప్పటికీ– కెనడా, యూరప్ వంటి మిత్ర దేశాలు ఒకమేర రాజీ పడుతూ ప్రత్యామ్నాయ వాణిజ్య సంబంధాల కోసం అన్ని ఖండా లలో అన్వేషణలు మొదలు పెట్టాయి. రష్యాకు అమెరికాతో గల వాణిజ్య సంబంధం అతి స్వల్పం అయినందున ఇరువురి మధ్య వచ్చేదీ పోయేదీ ఏమీ లేకపోయింది. ఆంబోతులు పోట్లాడితే లేగదూడల కాళ్లు విరిగాయన్నట్లుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలను అమెరికా విధించటంతో ఇతరులతో పాటు ఇండియా చాలానే నష్టపోయింది. ఆ ట్యారిఫ్‌లకు ప్రతిగా తాము కూడా అమెరికాపై ఎదురు సుంకాలు వేయగలమని కెనడా, యూరప్ హెచ్చరికలు చేసి ఆ పని కొంత మేర చేశాయి గానీ, పూర్తిగా ధిక్కరించి నిలిచింది చైనా ఒక్కటే.బలవంతపు చాకిరీలు నిజమేనా?ఇపుడు మాట్లాడుకోవలసిన ఆసక్తికరమైన విషయం ఒకటు న్నది. అది ఇండియా తదితర దేశాలు బలవంతపు చాకిరీతో ఉత్ప త్తులు చేసి అమెరికాకు విక్రయిస్తున్నాయనే ఆరోపణ. ఈ విషయమై యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) జరిపిన విచారణలో ధ్రువీకరణలు లభించాయని ట్రంప్ ప్రభుత్వం చెప్తు న్నది. అమెరికా, యూరప్ వర్ధమాన దేశాలను ఒత్తిడి చేసేందుకు బాలకార్మికులు, మితిమీరిన పని గంటలు, బలవంతపు చాకిరీ వంటి వాదనలు ఎప్పటినుంచో చేస్తున్నాయి. విచిత్రమేమంటే, సాక్షాత్తూ అమెరికాలోనే రకరకాలుగా బలవంతపు చాకిరీ, శ్రామి కుల దోడిపీ జరుగుతున్నదని చెప్పే నివేదికలున్నాయి. కనుక, ఈ వాదన ఇతరులను ఒత్తిడి చేసే సాధనం మాత్రమే. ఇంతకూ జనవరి 2025తో ఆరంభించి శవం కోసం చెట్టెక్కు తూనే ఉన్న అమెరికా అధ్యక్షుని లక్ష్యాలు ఎంతవరకు నెరవేరు తున్నట్లు? అన్ని దేశాలూ తమను దోచుకుంటున్నాయంటూ సుంకాల హెచ్చింపును ఆరంభించినపుడు 900 బిలియన్ల మేర ఉండిన వాణిజ్య లోటు నేడు కూడా ఇంచుమించు అంతే ఉంది. కేవలం పారిశ్రామిక ఉత్పత్తులను తీసుకుంటే మరింత పెరిగి 1.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ట్యారిఫ్ల హెచ్చింపుతో ఏమీ ఒరగ లేదు. పన్నులు పెంచుతామని హెచ్చరించినా బయటి నుంచి తిరిగి వచ్చిన అమెరికన్ కంపెనీలు చాలా కొద్ది. కనుక ‘మాగా’ నినాదం మేర ఉద్యోగాలూ పెరగలేదు. ఆ విధంగా విక్రమార్కుని భుజంపై శవం నిలవకుండా ఉంది.మనమిక చూడవలసింది అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏ విధంగా జరగనున్నదనేది. అందుకోసం ఫ్రేమ్ వర్క్ అనేది కుదిరినా, తుదిరూపపు చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం కొంత పట్టుదలగా ఉన్నమాట నిజం. అదే సమయంలో అది హానికరంగా ఉండకూడదని రైతులు, మత్స్యకారులు, జౌళి రంగం, ఇతర వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. చివరకు ఏమయేదీ చూడాలి!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నిర్మాణాత్మక రాజకీయాలు కావాలి!
ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే రాజకీయాలు పక్షపాతాన్ని అధిగమించాలి. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజలకు జవాబు దారీగా ఉండటం, పారదర్శకంగా పని చేయడం, ప్రజల ప్రయోజనాలను అన్నింటికంటే ముందు ఉంచడం కూడా అంతే ముఖ్యమైన అంశాలు. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం అత్యంత విలువైన సంపద. ఒకసారి ఆ విశ్వాసం దెబ్బతింటే దానిని తిరిగి సంపాదించడం చాలా కష్టం.దేశంలో ఏదైనా పెద్ద ప్రజా వివాదం, అవినీతి ఆరోపణ లేదా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సంఘటన వెలుగులోకి వచ్చిన ప్రతిసారి దాదాపు ఒకే పరిస్థితి కనిపిస్తున్నది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. పార్లమెంట్, శాసనసభల సమావేశాలు వాగ్వాదాలతో స్తంభిస్తాయి. టెలివిజన్ చర్చలు రోజంతా వేడెక్కుతాయి. సోషల్ మీడియాలో కూడా తీవ్ర వాదోపవాదాలు సాగుతాయి. ప్రజల్లో కొంతకాలం ఆగ్రహం వ్యక్తమవుతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ చర్చలు తగ్గిపోతాయి. వార్తల్లో కొత్త అంశాలు వస్తాయి. చివరకు అసలు సమస్య మాత్రం అలాగే మిగిలిపోతుంది. ఈ పరిస్థితి ప్రజల్లో వ్యవస్థపై నమ్మకాన్ని క్రమంగా తగ్గిస్తుంది.సమాజంలో ఉన్న విద్యావంతులు, నిజాయితీ గల వ్యక్తులు, నిష్పక్షపాతులు, సమర్థులు రాజకీయాలకు దూరంగా ఉండటాన్ని ఎంచుకున్నారు. ఇది సరికాదు. ప్రజాస్వామ్యం నిజమైన అర్థంలో విజయవంతం కావాలంటే ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తులు ప్రజా జీవితంలోకి రావాలి.పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు మన దేశంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారాయి. ఇవి యువతలో ప్రతిభపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. ప్రభుత్వ నియామక వ్యవస్థల విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తాయి. దేశ భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే ఈ సమస్యను రాజకీయ కోణంలో మాత్రమే చూడటం సరైంది కాదు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే 2004–2014 మధ్య కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర సంస్థల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ సంఘటనలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2, అరుణాచల్ ప్రదేశ్‌లో 1, అస్సాంలో 6, బిహార్‌లో 5, ఢిల్లీ, కేంద్ర సంస్థల్లో 27, గుజరాత్లో 8, హరియాణాలో 5, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జమ్మూ కశ్మీర్లో 5, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 6, కేరళలో 2, మహారాష్ట్రలో 9, మణిపూర్‌లో 1, మధ్యప్రదేశ్‌లో 7, ఒడిశాలో 3, పంజాబ్‌లో 2, రాజస్థాన్ లో 10, తమిళనాడులో 2, తెలంగాణలో 3, త్రిపురలో 1, ఉత్తరాఖండ్‌లో 3, పశ్చిమ బెంగాల్లో 10, ఉత్తరప్రదేశ్‌లో 9 సంఘటనలు నమోదైనట్లు సమాచారం. ఈ వివరాలు చూస్తే ప్రశ్నపత్రాల లీకేజీ సమస్య ఏ ఒక్క రాష్ట్రానికి, ఏ ఒక్క ప్రభుత్వానికి లేదా ఏ ఒక్క రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదని అర్థమవుతుంది.అందువల్ల ఈ అంశంపై రాజకీయ విమర్శలు చేయడం కంటే శాశ్వత పరిష్కారాలపై దృష్టి పెట్టడం అవసరం. ప్రతి ప్రభుత్వం నేరస్థులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆధునిక సాంకేతిక భద్రతా వ్యవస్థలు, డిజిటల్ రక్షణ, స్వతంత్ర పర్యవేక్షణ, కఠిన చట్టాలు, పారదర్శక నియామక విధానాలు అమలు చేయాలి. పరీక్షల నిర్వహణలో ప్రతి దశను అత్యంత భద్రతతో నిర్వహించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలి.దేశ నిర్మాణంలో ప్రభుత్వాల పాత్ర ఎంత ముఖ్యమో, బాధ్యత గల పౌరుల పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. ఉపాధ్యాయులు, మాజీ న్యాయమూర్తులు, పదవీ విరమణ పొందిన అధికారులు, పాత్రికేయులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక సంస్థలు తమ అనుభవాన్ని దేశ ప్రయోజనాల కోసం వినియోగించాలి. సమస్యలను మాత్రమే చూపించడం కాకుండా వాటికి ఆచరణాత్మక పరిష్కారాలను కూడా సూచించాలి. సమాజం మొత్తం కలిసి పని చేసినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.- పి. వేణుగోపాల్ రెడ్డి, వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ -
సహజమైనదే చేయాలి!
ఒక జెన్ గురువును ఓ కుటుంబం ఇంటికి ఆహ్వానించింది. ఆయన కోసం అద్భుతమైన విందు సిద్ధం చేశారు. సరిగ్గా పన్నెండు గంటలకు గురువు గారు వచ్చారు. ఇంట్లో ఉన్నవారంతా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భోజనం వడ్డించారు. ఎంతో శ్రద్ధతో వండిన వంటకాలను గురువుగారు బాగా ఆస్వాదిస్తూ తిన్నారు. చివరగా చేయి కడుక్కునే సమయంలో, ‘అన్నీ శాకాహారమే వండారేం? చిన్న చేప ముక్క అయినా కలిపి ఉంటే బాగుండేది కదా!’ అన్నారు.ఆహ్వానించిన వారు ఆలోచనలో పడ్డారు. ‘మీరు మాంసాహారం తినరని అనుకున్నాం’ అని నమ్రతగా చెప్పారు. గురువు తల పట్టుకున్నారు. ‘మీ ముందస్తు అంచనాల్లో నన్ను పెట్టి బంధించకండి. నాకు ఊపిరి ఆడదు’ అన్నారు. ‘మాకు అర్థం కాలేదు గురుదేవా! ఇతర మనుషులకు, జంతువులకు, చివరికి చెట్టు చేమలకు కూడా హాని చేయకూడదు అని జెన్ సిద్ధాంతం చెప్తోంది కదా?’ అని అడిగారు.‘అవును, దానికి నేను ఇప్పుడు చేప తినాలి... తినకూడదు అనుకోవడానికి సంబంధం ఏమిటి? మనం మనలాగే ఉండాలి. మనకు ఏది సహజమో అదే చేయాలి. అనవసరమైన నటనలు వద్దు. వదులుకోవాలనే ఆలోచన బలంగా ఉంటే, కాలక్రమేణా అనవసరమైన విషయాల నుండి బయట పడవచ్చు. ఇది నా అనుభవం కూడా. బలవంతంగా శాకాహారం మాత్రమే తింటూ లోపల బాధ పడటం కంటే, ఆశ కలిగినప్పుడు మాంసాహారం తినేసి, ఆ క్షణంలో జీవించడమే అసలైన జెన్. వదులు కోవాలనే సంకల్పం దృఢంగా ఉంటే చాలు, మిగిలినది సహజంగా దానికదే జరుగుతుంది’ అన్నారు గురువుగారు.– యామిజాల జగదీశ్ -
నీట్ కంటే పెద్ద సమస్య... డీలిమిటేషన్!
దేశమంతా ఈరోజు నీట్, పేపర్ లీకులు, విద్యార్థుల ఆందోళనలు, రాజకీయ విమర్శల గురించే మాట్లాడుతోంది. ఇవన్నీ చిన్న విషయాలు కావు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి అంశం ప్రధానమైనదే. కానీ ఒక ప్రశ్న మనమందరం వేసుకోవాలి. దేశ రాజకీయాల భవిష్యత్తును, బహుజన సమాజం రాజకీయ వాటాను, దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యాన్ని రాబోయే యాభై సంవత్సరాల పాటు నిర్ణయించబోయే అంశం నీటా? లేక డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణనా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెబితే, అసలు జాతీయ చర్చ జరగాల్సింది పార్లమెంట్ ముందుకు రానున్న ఈ రాజ్యాంగ సంబంధిత అంశాల గురించే అని అర్థమవుతుంది.దక్షిణాది రాష్ట్రాల ఆందోళనప్రజల దృష్టి ఒకవైపు మళ్లిన సమయంలో మరోవైపు దేశ రాజకీయ నిర్మాణాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలు నిశ్శబ్దంగా ముందుకు సాగడం భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. అందుకే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బహుజన సమాజం మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నియోజక వర్గాల పునర్విభజనను చాలామంది కేవలం సరిహద్దులు మార్చే సాంకేతిక ప్రక్రియగా భావిస్తారు. వాస్తవానికి అది రాజకీయ అధికా రాన్ని తిరిగి పంచే ప్రక్రియ. రాజ్యాంగంలోని 81, 82, 170 అధికర ణాల ప్రకారం జనాభా ఆధారంగా లోక్‌సభ, శాసనసభ స్థానాలను పునర్విభజన చేయాలి. 1976లో వచ్చిన 42వ రాజ్యాంగ సవరణ, 2001లో వచ్చిన 84వ రాజ్యాంగ సవరణల కారణంగా ఈ ప్రక్రి యను 2026 తర్వాతి జనగణన వరకు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ గడువు ముగుస్తోంది.ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల ఆందోళన మొదలవుతోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ, ప్రజారోగ్యం, విద్య రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచాయి. అదే కారణంగా వాటిలో జనాభా పెరుగుదల తగ్గింది. ఇప్పుడు జనాభానే ప్రధాన ప్రమాణమైతే, ఈ రాష్ట్రాల లోక్‌సభ ప్రాతినిధ్యం సాపేక్షంగా తగ్గి, ఉత్తర భారత రాష్ట్రాల ప్రాధాన్యం పెరుగుతుంది. దేశ ప్రయోజనం కోసం అమలు చేసిన విధానాల ఫలితంగా రాజకీయంగా నష్టపోవడం సమంజసమా అనే ప్రశ్నకు దేశం సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.కులగణనే కీలకంఇదే సమయంలో మహిళల రిజర్వేషన్ అంశాన్ని కూడా విడిగా చూడలేం. మహిళలకు శాసనసభల్లో, పార్లమెంటులో ఎక్కువ ప్రాతి నిధ్యం రావాలనే లక్ష్యాన్ని దేశంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తున్నాయి. అయితే మరో ప్రశ్నను విస్మరించకూడదు. ఆ స్థానాల్లో ఎవరు గెలుస్తారు? ఇప్పటికే రాజకీయ, ఆర్థిక, సామాజికంగా బలంగా ఉన్న వర్గాలకు చెందిన మహిళలే అధికంగా ఎన్ని కయ్యే పరిస్థితి ఏర్పడితే– బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ మహిళలకు నిజమైన అవకాశాలు ఎంతవరకు లభిస్తాయి? అందుకే బీసీ సంఘాలు చాలాకాలంగా మహిళల రిజర్వేషన్లో ఓబీసీ మహిళలకు ప్రత్యేక వాటా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.ఈ చర్చలో కులగణన కీలకమైన అంశంగా మారుతుంది.దేశంలో పేదరికం లెక్కలు ఉన్నాయి. నిరుద్యోగం లెక్కలు ఉన్నాయి. రైతుల గణాంకాలు ఉన్నాయి. కానీ వివిధ సామాజిక వర్గాల నిజమైన జనాభా ఎంత అన్న సమాచారం లేకుండానే రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఎలా పునర్నిర్మించగలం? అందుకే అనేక సామాజిక న్యాయ ఉద్యమాలు ముందుగా కులగణన, తరువాత డీలిమిటేషన్ అనే క్రమాన్ని సూచిస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా పలు తీర్పుల్లో సామాజిక న్యాయానికి సంబంధించిన నిర్ణయాలు గణాంక ఆధారాలపై ఉండాలని పేర్కొంది.డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణన – ఈ మూడు అంశాలు విడివిడిగా కనిపించినా వాస్తవానికి అవి ఒకే గొలుసులోని మూడు కడియాలు. ముందుగా కులగణన, తరువాత డీలిమిటేషన్, ఆ తరువాత మహిళల రిజర్వేషన్ అమలు జరిగితేనే సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే అవకాశముందని అనేక సామాజిక న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో రాజకీయ ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజల దృష్టి నీట్ వంటి తక్షణ సమస్యలపై కేంద్రీకృతమవుతున్న సమయంలో, రాజ్యాంగపరంగా అత్యంత కీలకమైన డీలిమిటేషన్, మహిళల రిజర్వేషన్, కులగణన వంటి అంశాలపై తగినంత ప్రజా చర్చ జరుగుతోందా? దీనిపై భిన్నాభి ప్రాయాలు ఉండవచ్చు. కొందరు ఒకేసారి రెండు అంశాలపై పోరాటం చేయవచ్చని చెబుతారు. మరికొందరు తక్షణ రాజకీయ అంశాలు దీర్ఘకాల రాజ్యాంగ చర్చలను వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని వాదిస్తారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రజలే. కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, జాతీయ ఉద్యమాలు తమ ప్రాధాన్య క్రమంలో దక్షిణాది రాష్ట్రాల ప్రత్యేక ఆందోళనలకు తగిన స్థానం ఇవ్వకపోవచ్చు. ఇది ఒక రాజకీయ విశ్లేషణ మాత్రమే; దీనిపై విస్తృత ప్రజాస్వామ్య చర్చ అవసరం.అడగాల్సిన ప్రశ్నలునీట్లో అవకతవకలు జరిగితే మళ్లీ పరీక్ష నిర్వహించవచ్చు. ఒక మంత్రి రాజీనామా చేయవచ్చు. ఒక ప్రభుత్వం ఎన్నికల్లో ఓడి పోవచ్చు. కానీ డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభలో రాష్ట్రాల ప్రాతి నిధ్యం మారితే, మహిళల రిజర్వేషన్ అమలు వల్ల రాజకీయ నాయకత్వ నిర్మాణం మారితే, వాటి ప్రభావం ఒక్క ఎన్నికతో ముగిసి పోదు. అది తరతరాల పాటు కొనసాగుతుంది. అందుకే ఈరోజు దేశం ముందు ఉన్న అసలు ప్రశ్న నీట్ కాదు; భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రాతినిధ్యం ఎలా ఉండాలి అన్నదే.భారత రాజ్యాంగ పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రతి పౌరుడికి హామీ ఇస్తుంది. ఆ న్యాయం కేవలం ఎన్నికలు జరగడంలో కాదు; సమాజంలోని అన్ని వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఉండటంలో ఉంది. అందుకే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర బహుజన వర్గాలు మూడు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కోరాలి: ముందు కులగణన జరుగుతుందా? డీలిమిటేషన్‌కు ఏ ప్రమాణాలు అమలు చేస్తారు? మహిళల రిజర్వేషన్లో బహుజన మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఎలా కల్పిస్తారు?దేశ రాజకీయాల దిశను మార్చేది ప్రతిరోజూ వార్తల్లో కనిపించే వివాదాలు కావు. రాజ్యాంగంలో జరిగే మార్పులే. అందుకే బహుజన సమాజం ఈ చారిత్రక దశలో అప్రమత్తంగా ఉండాలి. రేపటి తరాల రాజకీయ భవిష్యత్తు ఈరోజు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. నేడు మనం ఏ ప్రశ్నలు అడుగుతున్నా మన్నదే రేపటి భారత ప్రజాస్వామ్య స్వరూపాన్ని నిర్ణయిస్తుంది.డా‘‘ జె.పూర్ణచంద్ర రావువ్యాసకర్త ఐపీఎస్(రిటైర్డ్), మాజీ డీజీపీ; జాతీయ కోఆర్డినేటర్ ఏపీ– తెలంగాణ, అల్ ఇండియా బీఎస్పీ -
పరిష్కారమా... కొత్త సవాలా?
2026 ‘నీట్’ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందో ళనకు దారితీశాయి. ఫలితంగా పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ప్రశ్నాపత్రాన్ని కాగితం నుంచి కంప్యూ టర్కు మార్చడమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని గుర్తించాలి. అసలు సమస్య పరీక్షా విధానంలో కాదు, ప్రశ్నపత్రాల గోప్యత, భద్రత, జవాబుదారీతనం వంటి వ్యవస్థాగత లోపాల్లో ఉంది. అంతర్జాతీయ అనుభ వాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటైన చైనా గావ్కావ్, దక్షిణ కొరియా సీఎస్ఏటీ ఇప్పటికీ పేపర్–పెన్సిల్ విధానంలోనే అత్యంత కట్టు దిట్టమైన భద్రతతో విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. దీనివల్ల పరీక్షా విధానం కంటే పటిష్టమైన భద్రతా వ్యవస్థ, పారదర్శకత, క్రమశిక్షణే విశ్వస నీయ పరీక్షలకు పునాది అని స్పష్టమవుతోంది. నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తే, కోట్లాది మంది విద్యార్థులను ఒకే సమయంలో పరీక్షించడం సాధ్యం కాదు. అందువల్ల బహుళ షిఫ్టులు తప్పనిసరి అవుతాయి. జేఈఈ మెయిన్‌లో కనిపించినట్లుగా వివిధ షిఫ్టుల్లో ప్రశ్న పత్రాల క్లిష్టతలో తేడాలు రావడం, నార్మలైజేష¯Œ పై వివాదాలు తలెత్తడం వల్ల సమాన ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల శాట్, జీఆర్ఈ వంటి పరీక్షల్లో ఉపయోగించే ఐటమ్ రెస్పాన్స్ థియరీ వంటి శాస్త్రీయ మనో కొలమాన పద్ధతులను అధ్యయనం చేసి అమలు చేయడం మరింత సముచితం.కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మరో ప్రధాన సవాలు డిజిటల్ అంతరం. పట్టణ విద్యార్థులతో పోలిస్తే గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు కంప్యూటర్ వినియోగం, ఆన్లైన్ పరీక్షల అనుభవం తక్కువగా ఉండే అవకాశం ఉంది. వైద్య విద్య వంటి అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలో సాంకేతిక పరిజ్ఞాన పరిచయం విద్యార్థి ప్రతిభను ప్రభావితం చేయకూడదు. కాబట్టి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలంటే ముందుగా దేశవ్యాప్తంగా సమాన డిజిటల్ మౌలిక సదుపాయాలు, శిక్షణ, మాక్ పరీక్షలు అందుబాటు లోకి తీసుకురావడం అత్యవసరం. పరీక్షపై నమ్మకాన్ని పునరుద్ధరించడం. ప్రశ్నాపత్రాల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడం, లీకేజీలకు పాల్పడిన వారిపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవడం, అత్యవసరం. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో సంస్కరణలు హడా వుడిగా కాకుండా సమగ్ర ప్రణాళికతో చేపట్టాల్సిన అవసరం ఉంది.– ఏటూరి శేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
పిల్లలకు కాదు... పాఠం పెద్దలకే!
ఒక కాలానికి సరిపోయిన ఆలోచనలు, నేడు ప్రశ్నించకుండా సత్యాలుగా మిగిలిపోతున్నాయి. ఉదాహరణకు, పిల్లవాడు ఒక సమస్యకు కొత్త పరిష్కారం చెబితే, ‘మేం ఇన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నాం’ లేదా ‘అందరూ ఇలానే చేస్తున్నారు’ అనే ఒక్క వాక్యంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తాం. ఆ పరిష్కారం సరైందా, కాదా అని పరిశీలించే ముందే, అది కొత్తదనే కారణంతో తిరస్కరిస్తాం. అలా ఓడిపోతు న్నది కొత్త ఆలోచన కాదు; గెలుస్తున్నది పాత అలవాటు.అందుకే ప్రపంచం మారుతున్నా, మన సమాధానాలు మాత్రం అలాగే మిగిలిపోతున్నాయి. ఫలితంగా అసలు ప్రశ్న పిల్లలు ఏమి నేర్చుకోవాలనేది కాదు; పెద్దలు ముందుగా ఏమి వదిలే యాలనేదే!‘పిల్లలు నేర్చుకున్నదాన్ని వదలాలి (ఆన్లెర్న్), కొత్తగా ఆలోచించాలి’– ఈ మధ్య విద్యా చర్చల్లో బాగా వినిపిస్తున్న మాట. ఇక్కడ ‘వదలడం’ అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని మర్చిపోవడం కాదు; కాలం చెల్లిన ఆలోచనా విధానాలను ప్రశ్నిస్తూ కొత్త దృక్ప థాన్ని స్వీకరించడం. కానీ ఈ ఆలోచనను మరో కోణంలో చూడాల్సిన అవసరం ఉంది.పిల్లల దగ్గర వదిలేయాల్సినంత పాత నమ్మకాలు ఏము న్నాయి? వాళ్లు మొదటిసారి ప్రపంచాన్ని చూస్తున్నారు; పాత కళ్లద్దాలు మాత్రం మన పెద్దలవే. వాటిని వాళ్లకు అందించింది మనమే. కాబట్టి ఇప్పుడు ప్రశ్న– ‘పిల్లలు ఏం నేర్చుకోవాలి?’ అని కాదు; ‘మనం ముందుగా ఏ పాత నమ్మకాలను వదిలించు కోవాలి?’ అనేది. ఒకప్పుడు ఇవి విజయానికి మార్గదర్శకాలుగా ఉండి ఉండొచ్చు. కానీ వాటిని శాశ్వత సత్యాలుగా మార్చింది మనమే.ఇది ఎందుకు అంత కష్టం?ఒక నమ్మకాన్ని వదలడం అంటే, దాన్ని పట్టుకుని జీవించిన మన సొంత గతాన్నే ప్రశ్నించడం. ‘నేను ఇలా పెరిగాను, నేను బాగానే ఉన్నాను కదా’ అనే భావన మనలో బలంగా ఉంటుంది. ఆ నమ్మకాన్ని వదిలేస్తే, మన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, రాజీలు అన్నీ వృథా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది దురుద్దేశ్యం కాదు; తెలిసిన దానిపై ఉండే భద్రతా భావం. తల్లిదండ్రులు, ప్రతి ఉపాధ్యాయుడు ఒకప్పుడు ఒక వ్యవస్థ గుండా వచ్చినవారే. వాళ్ల మీద కూడా ఎవరో ఒక ముద్ర వేశారు. ఇప్పుడు వాళ్లు చేస్తున్నది– తమకు వేసిన అదే ముద్రను, తెలియకుండానే, తర్వాతి తరానికి బదిలీ చేస్తున్నారు. ప్రతి కాలం తన సమస్యలకు తన సమాధానాలు సృష్టించుకుంటుంది. కలంతో పాటూ సమాధా నాలూ మారాలి.ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకారం, 2030 నాటికి ఉద్యోగ నైపుణ్యాల్లో 39% మారిపోతాయి. ఈ రోజు నేర్పే సగం నైపుణ్యాలు అప్పటికి పనికిరాకపోవచ్చు. అందుకోసం సిలబస్ మార్చడం సరిపోదు; దాన్ని బోధించే వారి ఆలోచనా విధానం కూడా మారాలి. వ్యవస్థ ఎంత మారినా, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేది మను షులే– ఇంట్లో తల్లిదండ్రులు, తరగతి గదిలో ఉపాధ్యాయులు. వ్యవస్థ ఒక వైపు మారుతుంటే, పెద్దల ఆలోచనలు అక్కడే నిలిచి పోతే, ఆ మార్పు అసంపూర్ణంగా మిగిలిపోతుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తును మార్చేది కొత్త సిలబస్ మాత్రమే కాదు; పెద్దల మనస్తత్వంలో వచ్చే చిన్న మార్పు కూడా. పిల్లలు రేపటి తరాన్ని నిర్మించాలంటే, ఈరోజు పెద్దలు నిన్నటి కళ్లద్దాలను వదిలించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు -
చిద్రూపమే జగత్తు!
దీర్ఘతముడనే ఒక ముని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు. తండ్రికి సపర్యలు చేయడం వారి దినచర్య. కాలం తీరి కొన్నాళ్ళకు దీర్ఘతముడు మరణించాడు. విధిగా నిర్వర్తించాల్సిన ఉత్తరకర్మలన్నిటినీ పెద్దకొడుకు భక్తితో నిర్వర్తించాడు. అంతా సజావుగా జరిగాక, తమ్ముడి కోసం చూడగా, అతడు ఆశ్రమంలో కనిపించలేదు. అడవిలో వెదికాడు. ఒక పెద్ద చెట్టు మొదట్లో కూర్చుని శోకిస్తూ కనిపించాడు తమ్ముడు. అన్న హృదయం ద్రవించింది. తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ఆప్యాయంగా తల నిమిరి ఇలా చెప్పాడు:‘పూర్వం వైరోచనుడనే ఒక రాజు ఉండేవాడు. దీర్ఘకాలం వసుధను పాలించాడు. ప్రపంచంలో లభించే అన్ని సుఖాలను తృప్తి తీరా అనుభవించాడు. ఒకనాడు రాజప్రాసాదపు మేడపై నిలబడి ఆలోచిస్తూ ‘ముల్లోకాలలో అద్భుత కారణంబును, సకల భోగాలకు ఆలవాలము అయిన ఈ భూమిలో, సౌఖ్యాలు అస్థిరములైనవే! అనుభవించే పదార్థాన్నే మళ్ళీ మళ్ళీ అనుభవించి, దినదినమూ భ్రాంతుడనై తిరుగుతూ ఉండడమేగా ఇక్కడ ఎన్నాళ్ళైనా! రాత్రి, పగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఆగేవి కావు. చెప్పిందే చెప్పడం అన్నట్లుగా కాలం చర్వితచర్వణం. ఈ సుఖాలన్నీ ప్రాజ్ఞుల దృష్టిలో అల్పాలే’ అని తలచి బాల్యంలో తన తండ్రి చెప్పిన మాటలను మననం చేసుకున్నాడు.తే. కణగి యెల్ల చోట గలది చిద్రూపంబుఅదియ నీవు నేను నఖిలములునుఇదియ నిశ్చితార్థ మిది దప్ప మఱి లేదుసర్వశాస్త్రసార సంగ్రహంబు.‘ఈ విశ్వంలోని ప్రతి అణువు చిత్తమనే చేతనతో నిండి ఉంది. చేతనతో నిండినదైన చిద్రూపమే నీవు, నేను, అది, ఇది, ఇలలో అన్నీ. అదే నిశ్చయం. అది తప్ప మరొకటి లేదు. సర్వ విజ్ఞాన, వేదాంత శాస్త్రములు బోధించేది కూడా అదే! ఆ సత్యాన్ని గ్రహించిన చిత్తానికి చింత ఉండదు. అది తెలుసు కుని నీవు కూడా స్వస్థత చెందిన అంతరంగాన్ని పొందు’ అని అన్న చెప్పిన మాటలను ఆలకించాడు తమ్ముడు. శోకోపశమనం పొందాడు.– భట్టు వెంకటరావు -
నాయకత్వం పదవి కాదు... బాధ్యత!
ఈ రోజు మీ ముందుకు రావడం నాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ప్రతి పట్టభద్రుల సభలో మాట్లాడే వ్యక్తి ఇదే మాట చెబుతారేమో. కానీ నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. బర్కిలీ అత్యుత్తమ ప్రభుత్వ విశ్వవిద్యాలయం మాత్రమే కాదు... ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయం. నేను ఇక్కడ 17 సంవత్సరాలు బోధించే అదృష్టం పొందాను. ఇప్పుడు మీరు చదువు పూర్తయిందని అనుకుంటున్నారు. ఇక విద్యార్థి జీవితం ముగిసిందని భావిస్తున్నారా? ఎందుకంటే... జీవితం అంటే నేర్చుకోవడమే. ఒక మంచి ఉపాధ్యాయుడు ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటాడు. ఒక మంచి విద్యార్థి... ఎప్పుడో ఒక రోజు ఉపాధ్యాయుడవుతాడు. ఈ రెండూ వేర్వేరు పాత్రలు కావు. ఒకే ప్రయాణంలో రెండు దశలు. మనలోని ఆసక్తి, ప్రశ్నించే స్వభావం, మనుషులతో కలిసిమెలసి నేర్చుకోవాలనే తపనే... బోధనకూ, అభ్యాసానికీ మూలం. ఒక్కసారి మీ పక్కన కూర్చున్న సహ విద్యార్థులను చూడండి. ఈ నాలుగేళ్లలో వాళ్ల దగ్గర నుంచి మీరు ఎంత నేర్చుకున్నారో ఆలోచించండి. మీరు కూడా వారికి ఎన్నో విషయాలు నేర్పారు. ఇదే నిజమైన విద్య.ఎవరు నిజమైన నాయకులు?నన్ను ఎప్పుడూ వెంటాడే ఒక ప్రశ్న ఉంది. రేపటి ప్రపంచానికి మార్గం చూపే గురువులు ఎవరు? నేను కేవలం పాఠశాలల్లో, కళాశాలల్లో బోధించే ఉపాధ్యాయుల గురించే మాట్లాడటం లేదు. ప్రపంచం ఏ దిశగా వెళ్లాలి? ప్రజలకు ఏది సరైన మార్గమో ఎవరు చూపిస్తారు? నాయకుడు కావాలంటే... మీ పేరుకు ముందు పెద్ద హోదా ఉండాల్సిన అవసరం లేదు. ఖరీదైన కార్యాలయం అవసరం లేదు. ప్రభుత్వంలో మంత్రి కావాల్సిన అవసరం లేదు. చరిత్రను మార్చిన గొప్ప నాయకుల్లో చాలామందికి ఎలాంటి అధికార పదవులు లేవు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, డోలోరెస్ హుయెర్టా, రోసా పార్క్స్, డబ్ల్యూ.ఇ.బి. డు బాయిస్, సుసాన్ బి.ఆంథోనీ... వీళ్లందరూ తమ ఆలోచనలతో, ధైర్యంతో, నైతిక విలువలతో ప్రపంచాన్ని మార్చారు. నిజమైన నాయకుడు ఎవరు? ప్రపంచం ఎటు వెళ్లాలో తెలుసుకునే వ్యక్తి. ఆ దిశగా ఎలా వెళ్లాలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగల వ్యక్తి. ప్రజల ప్రతిభను, శక్తిని, మంచి ఆలోచనలను ఒకే లక్ష్యం కోసం కలిపి పనిచేయించగల వ్యక్తి. నాయకత్వం అనేది ఒక పదవి కాదు... అది ఒక నైతిక బాధ్యత! విద్య అసలు ఉద్దేశం ఏమిటి?ప్రపంచం ఇప్పుడు ‘మనం ఏం చేయగలం?‘ అనే ప్రశ్నతోనే ఎక్కువగా పరుగులు తీస్తోంది. అద్భుతమైన యంత్రాలను తయారు చేశాం. రోబోలను రూపొందించాం. కృత్రిమ మేధ (ఏఐ) కూడా మన జీవితాల్లోకి వచ్చింది. ఇది గొప్ప విషయమే. కానీ అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఇంకొకటి ఉంది. ‘మనం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం?’ ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడే విద్యకు నిజమైన అర్థం తెలుస్తుంది. ఇప్పుడు ఇంజినీర్లు ఒకేసారి ఇతర భాషలను అనువదించే హెడ్ఫోన్లను రూపొందిస్తున్నారు. ఇది ఆశ్చర్యకరమైన సాంకేతిక పురోగతి. విదేశీ భాష నేర్చుకోవడం అంటే... ఒక దేశానికి వెళ్లి హోటల్లో భోజనం ఆర్డర్ చేయడం కోసమే కాదు. ఒక దేశ ప్రజలు ఎలా ఆలోచిస్తారు, వారి జీవన విధానం ఏమిటి అన్నది అర్థం చేసు కోవడానికే. ఇతరుల దృష్టికోణంలో ప్రపంచాన్ని చూడటం నేర్పించేదే నిజమైన విద్య. మీతో విభేదించే వ్యక్తులతో మాట్లాడండి. అదే అత్యుత్తమ అభ్యాసం. మన అభిప్రాయమే ఉన్నవారితో మాట్లాడితే, మనకు తెలిసినదే మళ్లీ వింటాం. భిన్నంగా ఆలోచించే వ్యక్తులతో మాట్లాడితే, కొత్త ఆలోచనలు పుడతాయి. మన అవగాహన విస్తరిస్తుంది. జ్ఞానం సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం. ఈ ప్రతిభతో సమాజానికి ఏమి చేయగలం? ప్రపంచాన్ని కొంచెమైనా మంచి దిశగా ఎలా తీసుకెళ్లగలం? అన్నదే అసలు ప్రశ్న. జ్ఞానం వ్యక్తిగత విజయానికి మాత్రమే ఉపయోగపడితే అది అసంపూర్ణం. అదే జ్ఞానం ఇతరుల జీవితాల్లో వెలుగు నింపితే... అప్పుడే అది నిజమైన విద్య అవుతుంది. ప్రజాస్వామ్యం ఎందుకు అవసరం?జీవితం ‘ద విజార్డ్ ఆఫ్ ఓజ్’ సినిమా లాంటిది. ఆ సినిమాలో ఒక తుఫాను తర్వాత డోరోతీ కొత్త ప్రపంచంలోకి చేరుతుంది. కిటికీ తెరిచి బయటకు చూస్తే, అన్నీ రంగుల ప్రపంచంలా కనిపి స్తాయి. జీవితం కూడా అలాంటిదే. కొన్నిసార్లు, మనం ఊహించని తుఫాన్లు వస్తాయి. మనల్ని కుదిపేస్తాయి. కొన్నిసార్లు కింద పడేస్తాయి. కానీ ఆ కష్టాల తర్వాత కొత్త అవకాశాలు మన కోసం ఎదురుచూస్తుంటాయి. ఆ అవకాశాలను గుర్తించ గలిగితే, మన జీవితమే మారిపోతుంది. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చి కేవలం అభినందనలు చెప్పి వెళ్లిపోతే నా బాధ్యత పూర్తికాదు. ఎందుకంటే, మీరు గొప్ప అవకాశాల ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్లే... ఎన్నో సవాళ్లతో నిండిన ప్రపంచంలోకి కూడా ప్రవేశిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్య విలువలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. స్వేచ్ఛను, సమానత్వాన్ని, న్యాయాన్ని కాపాడే వ్యవస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యం ఎందుకు అంత ముఖ్యమైనది? ఒక మంచి సమాజం అంటే, బలవంతులు బలహీ నులను అణచివేయకుండా కాపాడే సమాజం. అదే నాగరికతకు పునాది. అలా కాకపోతే... అధికారం ఉన్నవారు తమ శక్తిని దుర్విని యోగం చేస్తారు. బలహీనులు మరింత వెనుకబడిపోతారు. చివరికి... అన్యాయం, అశాంతి, ఘర్షణలు పెరుగుతాయి. అందుకే ప్రజాస్వామ్యం అవసరం.మనం ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. బలం ఉన్నంత మాత్రాన అది సత్యం కాదు. అధికారం ఉన్నంత మాత్రాన అది న్యాయం కాదు. చరిత్ర మనకు ఎన్నో పాఠాలు చెప్పింది. ఎలాంటి వ్యక్తి అయినా, ఎలాంటి సంస్థ అయినా, ఎలాంటి దేశ మైనా... చట్టాలకు, విలువలకు అతీతంగా ప్రవర్తిస్తే చివరికి అది తనకే నష్టం కలిగిస్తుంది. అందుకే, చట్టాలు బలహీనులను మాత్రమే కాదు... బలవంతులను కూడా కాపాడతాయి. వాటిని గౌరవించడం అందరి బాధ్యత. సత్యం కోసం నిలబడండి. సత్యాన్ని ధైర్యంగా చెప్పండి. ఎంత ఒత్తిడి వచ్చినా, ఎవరు వ్యతిరేకించినా... సత్యం పక్షాన నిలబడాలి. అదే విద్య యొక్క అసలు లక్ష్యం.ఇక్కడ మీరు నేర్చుకున్న విలువలను, ఇప్పుడు ప్రపంచానికి నేర్పే సమయం వచ్చింది. బలహీనుల పక్షాన నిలబడండి. అధి కారంలో ఉన్నవారిని ప్రశ్నించండి. న్యాయం కోసం గొంతెత్తండి. ఇతరులకు మార్గదర్శకులుగా నిలవండి. ఇదే ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే స్ఫూర్తి. ఈ ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది... కేవలం తెలివైన మనుషులు కాదు, విలువలతో జీవించే నాయకులు. సత్యం కోసం నిలబడే పౌరులు. ఇతరులను ముందుకు నడిపించే ఉపాధ్యాయులు. ఆ నాయకులు, ఆ గురువులు... మీరే! -
ఏమైనా సరే... ఆరు ఆరే!
భారతీయ తత్త్వంలో అరిషడ్వర్గాలు, షడ్దర్శనాలు, షడ్రసాలు, షట్చక్రాలు, షడృతువులు వంటి ఎన్నో భావనలు ఆరు (6) అంకెతో నిర్వచితమయ్యాయి. బౌద్ధంలో షట్పారమితలు, జైనంలో షడ్ద్ర వ్యాలు, జొరాస్ట్రియనిజంలో అమేష స్పెంతాలు, తావోయిజంలో హెక్సాగ్రాం... ఇలా విదేశీ సంప్ర దాయాల్లోనూ ‘ఆరు’ విశిష్టంగా నిలిచింది. ఈ సంప్రదా యాలు, వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు కాలాల్లో ఉద్భవించినా, అన్నింటిలోనూ ఆరు పరిపూర్ణతకు సూచికగా నిలవడం విశేషం.భారతీయ తత్త్వశాస్త్రం మనిషిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు శత్రువులుగా గుర్తిస్తే; న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంతాలనే ఆరు దర్శ నాలు (షడ్దర్శనాలు) విశ్వాన్ని వివరించాయి. కణాదుని వైశేషిక దర్శనం ఈ విశ్వం సూక్ష్మమైన పరమా ణువులతో నిర్మితమైందని చెప్తూ... దాన్ని ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ మనే ఆరు పదార్థాలుగా విభజిస్తే; పతంజలి యోగం చిత్తవృత్తి నిరోధమే లక్ష్యంగా చూపింది. విష్ణుపురాణం ఐశ్వర్యం, ధర్మం, యశస్సు, శ్రీ, జ్ఞానం, వైరాగ్యమనే ఆరు గుణాల సమాహారమే భగవంతుడని నిర్వచిస్తే; శైవ సంప్రదాయంలో షట్కోణాకారం శివ–శక్తుల సంయోగానికి సంకేతం. దీని నుంచి జన్మించిన సుబ్రహ్మణ్యుడు షణ్ముఖుడయ్యాడు.వేదాధ్యయనానికి శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛందస్, జ్యోతిషమనే షడంగాలు అవసరమైతే; ఆయుర్వేదంలో మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయమనే ఆరు రసాల సమతుల్యతే ఆరోగ్యానికి మూలమని చరక సంహిత చెప్తుంది. శరీరాన్ని కూడా శిరస్, ఉరస్, ఉదరం, పృష్ఠం, ఊర్ధ్వ, అధశ్శాఖలనే ఆరు అంగా లుగా చరక, సుశ్రుత సంహితలు విభజించాయి. హఠయోగం నేతి మొదలు త్రాటక వరకు ఆరు శుద్ధి క్రియలను, మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఆరు చక్రాలను నిర్దేశించింది.కాలగణనలో వసంతం మొదలు శిశిరం వరకు ఆరు ఋతు వులు, రోజుకు ఆరు భాగాలు కనిపిస్తాయి. సంగీతంలో మొదటి స్వరం షడ్జం– నారదీయ శిక్ష ప్రకారం నాసిక, కంఠం, ఉరస్సు, తాలువు, జిహ్వ, దంతాలనే ఆరు అవయ వాల నుంచి పుట్టేది కాబట్టే ఆ పేరు వచ్చింది. జ్యోతిష్యంలో రాశి, హోర, ద్రేక్కాణం వంటి ఆరు వర్గ పట్టికలను షడ్వర్గం అంటారు. ఒక్కో పట్టిక జీవితంలో ఒక్కో కోణాన్ని చూపిస్తుంది. వేదాంతంలో శోక, మోహ, జర, మృత్యు, క్షుధ, పిపాసలనే షడూర్మి మానవ అస్తిత్వపు ఆరు అలలుగా వర్ణితమయ్యాయి.బౌద్ధంలో దాన, శీల, క్షాంతి, వీర్య, ధ్యాన, ప్రజ్ఞలనే ఆరు పారమితలు మోక్షమార్గం చూపిస్తే; సంసారంలో దేవతలు, మానవులు, అసురులు, జంతువులు, ప్రేతలు, నరకభోగులనే ఆరు గతులు జీవులకు నిర్దేశించబడ్డాయి. జైనంలో జీవ, పుద్గల, ధర్మ, అధర్మ, ఆకాశ, కాలమనే ఆరు ద్రవ్యాలు విశ్వాన్ని నిర్వచి స్తాయి. శ్వేతాంబరులు సామా యికం మొదలు ప్రత్యాఖ్యానం వరకు ఆరు నిత్యకర్తవ్యాలను (షడావశ్యకాలు) పాటిస్తారు.ఆరు రోజుల సృష్టితోరా, బైబిల్ల ప్రకారం సృష్టి ఆరు రోజుల్లో పూర్తయి, ఏడవ రోజు విశ్రాంతి జరిగిందని నమ్మకం. ఖురాన్ లో ఆరు రోజుల సృష్టి ప్రస్తావన ఏడు చోట్ల వస్తుంది, అయితే విశ్రాంతి భావన అందులో లేదు. ఇస్లాంలో విశ్వాసానికి అల్లా, దూతలు, గ్రంథాలు, ప్రవక్తలు, తీర్పుదినం, దైవ నిర్ణయమనే ఆరు మూలసూత్రాలు (అర్కానుల్ ఈమాన్) పునాది. జొరాస్ట్రియనిజంలో అహురమజ్డా సృష్టించిన ఆరు అమేష స్పెంతాలు– పశువులు, అగ్ని, లోహాలు, భూమి, జలం, వృక్షాలకు అధిపతులుగా నిలిచాయి. చైనా తావో యిజంలో ఐ చింగ్ గ్రంథం ఆరు గీతల 64 హెక్సాగ్రాంలపై నిర్మిత మైంది. ప్రతి హెక్సాగ్రాం ఒక్కో జీవన పరిస్థితిని సూచిస్తుంది.గణితశాస్త్రంలో ఆరు ఒక పరిపూర్ణ అంకె (1+2+3=6, దాని భాజకాల మొత్తం దానికే సమానం), త్రిభుజ అంకె కూడా. అందుకే పురాతన గ్రీకు గణితవేత్తలు ఆరును విశేషంగా పరిగణించారు. ప్రకృతిలోనూ ఆరు భుజాల నిర్మాణం పదే పదే కనిపిస్తుంది: తేనెతుట్టెలు, మంచు పలకలు, బెంజీన్ రింగ్‌లోని కార్బన్ అణువులు, అగ్నిపర్వత లావా చల్లారి ఏర్పడే బసాల్ట్ శిలా స్తంభాలు (ఉదా: ఐర్లాండ్‌లోని జయింట్స్ కాజ్వే), అన్నీ షడ్భుజా కారాన్నే ఎంచుకుంటాయి. ఎందుకంటే తక్కువ పదార్థంతో అత్య ధిక స్థలాన్ని ఆవరించే, శక్తిని సమర్థవంతంగా పంచుకునే జ్యామి తీయ ఆకారం అదే.వేర్వేరు కాలాల్లో ఉద్భవించిన ఎన్నో వైరుధ్య సంప్రదాయా లలో ఆరు అంకెకు ఇంతటి ప్రత్యేక స్థానం ఎందుకు వచ్చిందో చెప్పలేం. తత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికం, గణితం, ప్రకృతి శాస్త్రం అన్నీ ఏకగ్రీవంగా ఈ ఒక్క అంకె చుట్టూ తిరగడం యాదృచ్ఛికమా, ఏదైనా తాత్త్విక సూత్రం దాగుందా? బహుశా ఆరుకే తెలుసు!- డా. కొవ్వలి గోపాలకృష్ణ, వ్యాసకర్త అమెరికాలో ఆంకాలజీ డ్రగ్ డెవలప్మెంట్ సైంటిస్ట్ -
నాస్తికోద్యమ నిర్మాత
ప్రజల మధ్య జాతి, మతం, కులం పేరుతో విషం పెరు గుతూ ఉంది. దానితో విద్వే షాలు పెరుగుతున్నాయి. దేవుడు, కర్మ, పునర్జన్మ లాంటి భావాలు పోతే మనిషి మతస్తు డిగా కాకుండా స్వచ్ఛమైన నీతి మంతుడైన మానవుడిగా మిగు లుతాడు. ప్రజల మధ్య అడ్డు గోడలుండవు. అందరం ఒకటే అన్న భావనలోకి వచ్చి నప్పుడు సోదరభావం దానంతట అదే వెళ్లి విరుస్తుంది. ప్రేమ, అప్యాయత, ఒకరికి ఒకరం ఉన్నామన్న ధీమా పెరుగుతుంది!– అనేవి గోపరాజు రామచంద్రరావు (గోరా) అలోచనలు.ఎవరీ గోరా? ఒరిస్సాలో పుట్టి(1902 నవంబర్ 15), కృష్ణా జిల్లా విజయవాడను ప్రపంచ నాస్తిక కేంద్రంగా మలచినవాడు. భారతీయ సనాతన సంస్కృతి అయిన చార్వాకుల స్ఫూర్తిని మళ్ళీ ఈ ఆధునిక కాలానికి అందించిన ఘనుడు. గోరా ప్రత్యేకత ఏమిటంటే, వృక్ష శాస్త్ర అధ్యాపకుడిగా సమాజంలో వేళ్ళూను కుని ఉన్న మూఢ విశ్వాసాలకు చికిత్స– ఆ వేరు మూలాల నుండే ప్రారంభించాలని తీర్మానించారు. అస్పృశ్యతా నివార ణకు, ఆర్థిక సమానత్వ సాధనకు కృషి చేస్తూనే– ప్రజల్లో కుల, మతతత్వ నిర్మూలనకు నడుం బిగించిన కార్యకర్త. సమిష్టి భోజనాలను నిర్వహిస్తూ జనాన్ని మతాంతర వివాహాల వైపు నడిపించిన కార్యశీలి.గోరా అనేకచోట్ల అనేక ఉద్యోగాలు చేశారు. మధుర లోని మిషన్ కళాశాలలో తొలుత అధ్యాపకుడయ్యారు. ఆ తరువాత కోయంబత్తూర్ వ్యవసాయ కళాశాలలో పత్తి పరిశోధక సహాయకుడిగా పని చేశారు. కొంతకాలం శ్రీలంక వెళ్ళి కాలంబోలోని ఒక కళాశాలలో జీవశాస్త్ర అధ్యాపకుడ య్యారు. తిరిగి వచ్చి మళ్ళీ కాకినాడ కళాశాలలో ఆధ్యాప కుడిగా చేరారు. నాస్తిక కేంద్ర స్థాపన నాస్తికుడిగా మారుతున్న దశలో ఆయన – ఇంట్లో ఉండే సంప్రదాయాలు, ఆచారాలతో రాజీ పడేవాడు కాదు. తను నడిచే మార్గం సంప్రదాయవాదులైన తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని గ్రహించి... భార్యా పిల్ల లతో ఇల్లు వదిలి బయటికి వచ్చేశాడు. స్వతంత్ర జీవనం ప్రారంభించాడు. సమాజంలో మార్పు తేవడానికి ఏదో ఒక కేంద్రం ప్రారంభించాలని అను కున్నారు. ఆ ఆలో చనను ఆయన భార్య సరస్వతీ గోరా బలపరిచారు.సంపూర్ణ గ్రామీణాభివృద్ధి సాధించడానికి కుల మతాలకు అతీతంగా మానవవాద మూలాలపై నడిచే ఒక జీవన శైలిని ప్రవేశపెడుతూ కృష్ణా జిల్లా ముదు నూరులో ‘నాస్తిక కేంద్రం’ ఏర్పాటు చేశారు. గాంధీజీ కోరిక మేరకు 1944లో అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్‌గా అలహాబాదు, ఢిల్లీలలో పని చేశారు. నాస్తిక కేంద్రం ముదునూరు నుండి పని చేస్తున్నప్పుడే, దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కేంద్రం కార్యకలాపాలు మరింత విస్తృత పరచడానికి దాన్ని విజయవాడకు మార్చారు. ప్రపంచ హేతువాద, నాస్తికోద్యమాలకు గోరా స్థాపించిన ఆ నాస్తిక కేంద్రమే కేంద్ర బిందు వయ్యింది. 1972లో తొలి ప్రపంచ నాస్తిక మహాసభలు విజయవాడలో నిర్వహించిన ఘనత ఆయనదే! అప్పు డాయన వయసు 70 సంవత్సరాలు.భారత గ్రామీణ సమాజంలో ఎలా మార్పులు తేవాలి అనే అంశంపై ఉపన్యసిస్తూనే 1975 జూలై 26న గోరా తుదిశ్వాస విడిచారు. ఊరికే ఉపన్యాసాలివ్వడం కాకుండా, గోరా కార్యాచరణలోకి దిగి చూపించారు. గ్రహణ సమయంలో గర్భిణులు బయట తిరిగితే పుట్టే పిల్లలకు ‘గ్రహణం మొర్రి’ రాదని, తన భార్య గర్భ వతిగా ఉన్నప్పుడు తప్పని సరిగా బయట తిప్పేవారు. ఆ దంపతులకు తొమ్మిదిమంది పిల్లలు పుట్టినా ఎవరికీ గ్రహణం మొర్రి రాలేదు. రాహు–కేతువులు ఎక్కడో లేరు, సమాజంలోనే ఉన్నారు. వారిని జనం అదుపు చేస్తూ ఉండాలని సరస్వతి గోరా తరచూ చెబుతూఉండేవారు.- డా. దేవరాజు మహారాజు, వ్యాసకర్త సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త(నేడు ‘గోరా’ వర్ధంతి) -
ధర్మేంద్ర ప్రధాన్ (మాజీ మంత్రి) రాయని డైరీ
రాజీనామా లేఖను ప్రధానమంత్రికి అందించి బయటకు రాగానే నా జ్ఞాపకాలు ముప్పై ఏళ్లు వెనక్కు వెళ్లాయి. ఆ రోజు... భువనేశ్వర్‌లో, వందల మంది విద్యార్థులను వెంటేసుకుని వెళ్లి ‘‘జేబీ పట్నాయక్, దిగిపో... జేబీ పట్నాయక్, దిగిపో...’’ అని సచివాలయం భవనం బీటలు వారేలా నేను నినాదాలిస్తున్నాను. ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ కర్టెన్ను కాస్త తొలగించి, కిటికీ అద్దంలోంచి కిందికి చూస్తూ ఏదో అడుగుతున్నారు. పక్కనున్నవారు ఆయన చెవిలో ఏదో చెబుతున్నారు. మరుక్షణం సీఎం కర్టెన్ మూసేశారు. పోలీసులు ఒక్కసారిగా లాఠీ ఛార్జ్ మొదలు పెట్టారు. నా ముఖం చిట్లిపోయింది. నా ఎముకలు సున్నం అయ్యాయి. నా వెంట ఉన్న విద్యార్థులకూ గాయాలయ్యాయి. అంతా రక్తం వోడుతున్నాం. అయినా మేము అక్కడి నుంచి కదల్లేదు. ‘‘ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహించి పట్నాయక్ తక్షణం రాజీనామా చేయాలి’’ అని విద్యార్థులందరం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. నినాదాలు ఇస్తూనే ఉన్నాం. పోలీసులు మాపై విరుచుకు పడుతూనే ఉన్నారు. అంత జరుగుతున్నా పట్నాయక్ రాజీనామా చేయలేదు. ‘‘దోషులపై చర్యలు తీసుకుంటాం’’ అని మాత్రం అన్నారు. నాడు నేను ఏ స్థానంలో నిలబడి పోరాడానో... నేడు అదే స్థానంలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిలబడ్డారు. నాడు నేను ఏ అధికార పీఠాన్ని ప్రశ్నించానో... నేడు అదే పీఠంపై కూర్చొని ఉన్న నన్ను విద్యార్థులు ప్రశ్నించారు. కాలం ఎంత విచిత్రమైనది! నాలోని పాత విద్యార్థి నాయకుడు, నేటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఓడించాడు. నేను రాజీనామా చేశాను. జంతర్ మంతర్‌లో విద్యార్థుల ఆందోళన మొదలైనప్పటి నుంచీ– 36 రోజులుగా–నాడు పట్నాయక్ మాతో అనిన మాటే, నేనూ విద్యార్థులతో అంటూ వచ్చాను... ‘‘దోషులపై చర్యలు తీసుకుంటాం’’ అని! కానీ, విద్యార్థులు వినలేదు. వినకపోవటంలో ఎప్పుడూ న్యాయమే ఉంటుంది. ప్రశ్నాపత్రాలు ఇచ్చి, వాటికి సమాధానాలు రాయమని ప్రభుత్వం విద్యార్థులను అడుగు తున్నప్పుడు, ప్రశ్నాపత్రాల లీకేజీపై విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వమూ సరైన సమాధానాలు చెప్పాల్సిందే. ప్రభుత్వం చెప్పింది. కానీ వారికి ఆ సమాధానాలు సంతృప్తికరంగా లేవు. జీరో మార్కులు వేశారు. గవర్నమెంట్ ఫెయిల్ అనేశారు! ‘‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే...’’ అని పంతం పట్టారు. మంత్రి రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? రాజీనామా చేయటం తప్ప మరేమీ జరగదు. విద్యాశాఖ ప్రధాని కిందకు వెళుతుంది. లేదంటే, ఇంకో మంత్రికి అదనపు శాఖ అవుతుంది. కొత్త మంత్రిని తీసుకున్నా,ఆ మంత్రికి విద్యాశాఖ అర్థం కావటానికి సమయం పడుతుంది. అంతవరకూ విద్యాశాఖలో ఒక్క నిర్ణయమూ జరగదు. ఒక్క తీర్మానమూ కదలదు. ఒక్క అమలూ కుదరదు. విద్యార్థులకు ఏం న్యాయం జరిగినట్లు?! అయినప్పటికీ నేను రాజీనామా చేశాను. ఇది ప్రశ్నాపత్రాలు లీక్ అయినందుకు చేసిన రాజీనామా కాదు. విద్యార్థుల డిమాండ్‌కు తలవొగ్గి చేసిన రాజీనామా కూడా కాదు. రాజీనామా చేయకపోతే, వారిని ఉసిగొల్పు తున్న చేతుల్లోనే వారి భవిష్యత్తును ఉంచి నట్లౌతుందన్న ఆందోళనతో చేసిన రాజీనామా!ఇదేమీ త్యాగం కాదు, ప్రజాస్వామ్యంపై విద్యార్థులకు నమ్మకం కలిగించటం. ఇదేమీ ఓటమి కాదు, విద్యార్థుల ఆవేదనను గౌరవించటం. చేతిలోని పెన్నును పక్కన పెట్టి, కుర్చీలోంచి నేను లేస్తున్నప్పుడు నాలో తెలియని ప్రశాంతత! ఇప్పుడిక నేను మంత్రిని కాకపోవచ్చు... కానీ, మళ్లీ నా పాత రోజుల్లోకి వెళ్లి, విద్యార్థుల పక్షాన నిలబడ్డానన్న తృప్తిని మిగుల్చుకున్న ఒక విద్యార్థి నాయకుడిని! -
సముద్రాలకు రక్షణ సైన్యం
కోస్తా తీరప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడే మడ అడవులు, సరుగుడు చెట్లు, అరుదైప వృక్షాలు క్రమంగా అంతరించి పోతున్నాయి. చాలామందికి మడ అడవులు అంటే సముద్రం పక్కన పెరిగే కొన్ని చెట్లు మాత్రమే. కానీ అవి కేవలం చెట్లు కావు. అవి ఒక సంపూర్ణ జీవ వ్యవస్థ. సముద్రం, నదులు, నేల, చేపలు, పక్షులు, మనుషులు... ఇవన్నింటినీ ఒకే దారంతో కలిపే ప్రకృతి వలయం.సముద్రపు ఉప్పునీటిలోనూ మనగలిగే ఈ అడవులు లేకపోతే తీరప్రాంత మత్స్య సంపదలో గణనీయమైన భాగం ఉండదు. అనేక చేపలు, రొయ్యలు, పీతలు తమ జీవితాన్ని ప్రారంభించేది ఈ మడ అడవుల్లోనే. అందుకే మడ అడవులను శాస్త్రవేత్తలు ‘సముద్రా నికి నర్సరీ’ అని పిలుస్తారు. మడ అడవుల వేర్లు సముద్ర అలల వేగాన్ని తగ్గిస్తాయి. మట్టిని నిలబెడతాయి. తుఫాను ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.1977 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ను తాకిన దివిసీమ ఉప్పెన దేశ చరిత్రలోనే అత్యంత విషాదకర ప్రకృతి విపత్తుల్లో ఒకటి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయు లయ్యారు. సముద్రంతో యుద్ధం చేయడం కాదు... దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఆ రోజు ప్రకృతి ఒక కఠినమైన పాఠం నేర్పింది. మడ అడవులను కాపాడటం ద్వారా ఇటువంటి విపత్తులను కాపాడవచ్చు.‘సముద్రాన్ని ఆపేశాము’!ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తీరప్రాంతాల్లో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. స్థానిక ప్రజల భాగస్వామ్యంతో మడ మొక్కలను పెంచడం, చేపల పెంప కాన్ని మడ అడవులతో అనుసంధానం చేయడం, ఉప్పునీటిలో సాగు చేయగల పంటలను ప్రోత్సహించడం వంటి చర్యలు పర్యా వరణ పరిరక్షణతో పాటు గ్రామీణ జీవనోపాధిని కూడా బలోపేతం చేస్తున్నాయి. కృష్ణా జిల్లా తీరప్రాంతంలో కొన్ని గ్రామాలను సముద్రం మింగేస్తోంది. అయితే ‘మా ఊరికి రాకుండా సముద్రాన్ని ఆపేశాము’ అంటారు కృష్ణా జిల్లా తీరప్రాంత గ్రామం బసవాని పాలెంకు చెందిన పద్మ. సముద్ర నీటి మట్టం పెరిగినపుడల్లా తీరప్రాంతం కోతకు గురయ్యేది. ఎం.ఎస్. స్వామినా«థన్ ఫౌండేషన్ సహకారంతో ఎస్జీహెచ్ మహిళలు దశాబ్దం క్రితం నాగాయి లంక, బసవవాని పాలెంలో 200 హెక్టార్లలో మడ మొక్కలను నాటారు. ఇపుడు అవి అడవిగా మారి తీర ప్రాంతానికి రక్షణ కవచంగా మారాయి.వీరి కృషి ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నది. ప్రకృతిని కాపాడితే... ప్రకృతి మనిషిని కాపాడుతుంది. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు. మడ అడవులను కాపాడటం అటవీ శాఖ బాధ్యత మాత్రమే కాదు. ఇది పర్యావరణ శాఖ, మత్స్యశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మత్స్యకారులు, రైతులు కలిసి చేయాల్సిన పని.ప్రతి జిల్లాలో మడ అడవుల మ్యాపింగ్ జరగాలి. దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి పునరుద్ధరణ చేపట్టాలి. తీరప్రాంత గ్రామాల యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. సముద్రాన్ని మనం ఆపలేము. తుఫాన్లను కూడా ఆపలేము. కానీ వాటి విధ్వంసాన్ని తగ్గించే సహజ రక్షణ కవచాన్ని మాత్రం కాపాడగలం.– శ్యాం మోహన్, సీనియర్ జర్నలిస్ట్ (రేపు ప్రపంచ మడ అడవుల దినోత్సవం) -
యుగానుకూల మాతృత్వ శక్తి..
ప్రకృతిలో మాతృత్వం కేవలం ఒక బంధం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన శక్తి. ఒక దేశ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు తరతరాలకు అందాలంటే ఆ బాధ్యతను మోసేది మాతృశక్తే. మాతృత్వాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయ కుండా, దేశ నిర్మాణ శక్తిగా గుర్తించే దిశగా ‘విశ్వ మాంగళ్య సభ’ కృషి చేస్తోంది.2010లో స్థాపితమైన విశ్వ మాంగళ్య సభ, ఒక సామాజిక ఉద్యమంగా, సాంస్కృతిక పునరు జ్జీవన వేదికగా రూపాంతరం చెందింది. సంస్కార్ (విలువలు), సామర్థ్యం (శక్తి), సదాచారం (మంచి ప్రవర్తన), సేవ అనే నాలుగు సూత్రాల ప్రాతిపది కన ఈ సంస్థ పనిచేస్తోంది. ఆధునికత పేరుతో మనం కోల్పోతున్న భారతీయ విలువలను, కుటుంబ వ్యవస్థలోని సౌందర్యాన్ని తిరిగి నిల బెట్టడం ఈ సభ ప్రధాన ఉద్దేశ్యం. ఒక వ్యక్తికి మొదటి పాఠశాల కుటుంబం అయితే, మొదటి గురువు తల్లి. ఈ భావనతోనే, మహిళలను సాంస్కృతికంగా బలోపేతం చేసి, విలువలతో కూడిన ‘నవ భారత’ నిర్మా ణంలో వారిని భాగస్వామ్యం చేస్తోంది.ఒక మహిళ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక వ్యవస్థ. మహిళ విద్యా వంతురాలైతే ఒక కుటుంబం బాగుపడుతుంది. మహిళ ఆలోచిస్తే ఒక సమాజం బాగుపడుతుంది. అదే మహిళ నాయకత్వం వహిస్తే ప్రపంచమే బాగుపడుతుంది. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని అధిగమించడానికి యోగా, ధ్యానం వంటి సంప్రదాయాలు ఏ విధంగా తోడ్పడతాయో అవగాహన కల్పిస్తూ, మహిళలను శక్తిమంతం చేయడం ద్వారానే మనం ‘విశ్వమాంగ ళ్యాన్ని’ (ప్రపంచ శ్రేయస్సును) సాకారం చేయగమని ఈ సభ నమ్ముతోంది.నేటి మహిళ, విజ్ఞాన శాస్త్రాన్ని ఆయుధంగా మలుచుకుంటూనే, సంస్కారాన్ని కవచంగా ధరించాలి. భారతీయ విలువల పునాదులను పటిష్ట పరచి వాటిపై ఆధునిక ప్రగతి సౌధాన్ని నిర్మించాలి. మాతృశక్తి మేల్కొన్న సమాజానికి ఓటమి లేదు; అది ఎప్పుడూ విశ్వ శ్రేయస్సును కాంక్షిస్తుంది. ఈ యుగానుకూల మాతృత్వ శక్తితోనే ఉత్తమ వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం ఆ పై ఉన్నత నవభారత నిర్మాణం సాధ్యమవుతాయి.– డా. సంగీతా రెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ (రేపు హైదరాబాద్‌లో విశ్వ మాంగళ్య సభ సమావేశం సందర్భంగా...) -
శంకరుల బాట..
ఆదిశంకరుల రచనలైన కనకధారాస్తోత్రమ్, దక్షిణామూర్తి స్తోత్రమ్, గుర్వష్టకమ్, నిర్వాణ షట్కమ్, భజగోవిందం, సౌందర్యలహరి – దేన్ని చదివినా, వినినా మనసు ఆనందంతో నిండి పోతుంది. వాటి అర్థాన్ని గ్రహించి, తదనుగుణంగా జీవిస్తే మన జీవితాలే ధన్యమవుతాయనిపిస్తుంది. శంకరులవారి అన్నపూర్ణా స్తోత్రాన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పాడుతుంటే ఆనందం, ఆరోగ్యం పుష్కలంగా లభిస్తాయని పెద్దలంటారు. అందులో చివరి శ్లోకం మరీ ముఖ్యమైనది:‘‘అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే / జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ!మాతా చ పార్వతీ దేవీ పితాదేవో మహేశ్వరః / బాంధవా శ్శివ భక్తశ్చ స్వదేశో భువనత్రయమ్!!ఇందులో ఆది శంకరులవారు జ్ఞాన, వైరాగ్యాలను కాంక్షించటమేకాక తన తల్లి పార్వతీదేవి అనీ, తండ్రి మహేశ్వరుడనీ, శివ భక్తులందరు తన బంధువులనీ, మూడు లోకాలూ తనకు స్వదేశమనీ ప్రకటిస్తారు. శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో దాన్నే ప్రమాణంగా ఇతరులు తీసికొని ఆచరిస్తారని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు.మరి మనం ఆది శంకరుల అనుచరులం అని చెప్పుకొంటే సరిపోతుందా? ఆయన వలె మనమూ జ్ఞాన, వైరాగ్యాలనే కోరుకోవాలిగానీ ధన ధాన్యాలను, సంపదలను కాదు. లోకాలనన్నిటినీ, లోకులందర్నీ సృష్టించిన ప్రకృతి, పురుషులు మన తల్లి తండ్రులని, జీవులన్నీ మన బంధువులని, ముల్లోకాలూ స్వదేశమని గ్రహించి జీవిస్తే ఆధ్యాత్మిక శిఖరాన్ని ఆదిశంకరులవారు ఎలా అధిరోహించారో మనమూ అధిరోహించవచ్చు. – రాచమడుగు శ్రీనివాసులు -
గల్ఫ్‌లో మళ్లీ యుద్ధమేఘాలు
జూన్ 17, 2026న ఇరాన్–యూఎస్ఏల మధ్య అవగాహన (మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్–ఎంవోయూ) కుదర టంతో పర్షియన్ గల్ఫ్‌లో శాంతి పునః స్థాపితమవుతుందనే అందరూ భావించారు. ప్రపంచ విపణిలో చమురు ధరలు దిగిరావటంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. మూడు వారాలు తిరగక ముందే హార్మూజ్ మళ్లీ మూతపడటంతో శాంతి మూణ్నాళ్ల ముచ్చటయింది. ఈ రెండవ దశ యుద్ధం మరింత విస్తృతంగా, తీవ్రంగా కనపడుతున్నది. ప్రాంతీయ, అంతర్జా తీయ రాజకీయాలలో కీలక మలుపునకు ఈ దశ నాంది కావచ్చు.దిక్కుతోచని అమెరికా ఇరాన్–యూఎస్ అంగీకరించిన అవగాహన పత్రం 60 రోజులలో సమగ్ర ఒప్పందాన్ని తయారు చేయటానికి ఒక చట్రంగా ఉపయోగపడాలనేది ప్రధాన ఉద్దేశ్యం. ఈ రెండు నెలల వ్యవధిలో హార్మూజ్ జలసంధి ద్వారా నిరాటంకంగా ఎలాంటి రుసుములు లేకుండా వాణిజ్య నౌకల రవాణా జరగాలనీ, తత్సంబందిత ఏర్పాట్లను ఇరాన్ చేయాలనీ ఎంవోయూలోని అయిదవ ఆర్టికల్ నిర్దేశిస్తుంది. ఇదే పీటముడిగా మారింది. హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా పూర్తిగా తన అజమాయిషీ, ఆధ్వర్యంలో జరగాలని ఇరాన్ నిర్దేశాలు జారీ చేసింది. ఈ నిర్దేశాల ప్రకారం హార్మూజ్ నుండి ప్రయాణించే ప్రతి నౌక ముందుగా ఇరాన్ వద్ద తమ పూర్తి వివరాలను నమోదు చేసుకుని నిర్దేశించిన మార్గంలో, నిర్దేశించిన సమయంలో ప్రయాణించాలి. యూఎస్ఏ ఈ వాదనను తిరస్క రిస్తూ హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ రవాణా మార్గం, దీనిపై ఇరాన్ అజమాయిషీ కుదరదని తేల్చి చెప్పింది. ఇరాన్ తీరానికి సమీపంగా కాకుండా ఒమన్ తీరానికి సమీపంలో ఒమన్ ప్రాదేశిక జలాల గుండా నౌకల రవాణాను ప్రోత్సహించింది. ఒమన్ తీరంగుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ దాడి చేయటంతో యూఎస్ఏ తన నౌకాబలంతో హార్మూజ్‌ను దిగ్బంధించింది. ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభించింది.మొదటి దశ 40 రోజుల దాడులతో పోల్చితే గత పన్నెండు రోజులుగా జరుగుతున్న రెండవ దశ యుద్ధం భిన్నంగా ఉన్నది. మొదటిసారిగా అమెరికా ఇరాన్‌లోని పౌర లక్ష్యాలపై దాడి చేసింది. రహదారులు, వంతెనలు, పవర్ ప్లాంట్లు, డీసాలినేషన్ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకున్నది. బుషేర్లో నిర్మాణంలో ఉన్న పౌర అణువిద్యు చ్ఛక్తి కేంద్రంపై కూడా దాడి చేసింది. ఇది అంతర్జాతీయ యుద్ధనేరం (వార్ క్రైమ్) కిందకు వస్తుంది. ఇరాన్ కూడా అవగాహన పత్రంపై అమెరికా అధ్యక్షుడి సంతకానికి విలువ లేదని చెప్పి, అదే స్థాయిలో విరుచుకుపడింది. కువైట్‌లోని అల్సుబియా డీసాలినేషన్ ప్లాంట్, విద్యుచ్ఛక్తి కేంద్రంపై దాడి చేసింది. బహ్రెయిన్‌లో అమెరికా అయిదవ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఉన్న సల్మాన్ పోర్టుపై దాడి చేసింది. మొదటిసారిగా సిరియా, జోర్డాన్‌లలోని యూఎస్ వైమానిక స్థావరాలు, విమానాశ్రయాలు, రేపు పట్టణాలపై కూడా దాడి చేసింది. అవగాహన పత్రంపై ట్రంప్ తప్పనిసరి పరిస్థితులలో సంతకం పెట్టినట్లుగా కన్పడుతున్నది. ఏదోరకంగా హార్మూజ్ జలసంధిని తెరిపించి, చమురు ధరలను కిందకు తేవాలనే ఆరాటం కనపడుతుంది. కానీ ఎంవోయూలో ఎక్కడా ఇరాన్ అణుకార్యక్రమాన్ని వీడుతున్నట్లు లేదు. ఒక రకంగా ఎంవోయూ అమెరికాకు ప్రతి కూలంగా, ఇరాన్‌కు ప్రయోజనకారిగా ఉన్నదని విశ్లేషకుల అభి ప్రాయం. ఈ నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్‌ను తన ఆజమాయిషీ లోకి తీసుకునే ప్రయత్నాలు చేయటంతో అమెరికా దిక్కుతోచక మళ్లీ దాడులు మొదలుపెట్టింది.ఇరు పక్షాలకూ నష్టమే!ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు కొరివితో తల గోక్కున్నట్లయింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సెత్ అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మూడీస్ సంస్థ అంచనాల ప్రకారం ఇరాన్‌పై దాడి వలన అమెరికన్ పౌరులపై పన్నులు, అధిక ధరల రూపంలో 132 బిలియన్ డాలర్ల అదనపు భారం పడింది. పెంటగాన్, యుద్ధం కోసం అదనంగా 80 బిలియన్ డాలర్ల నిధులను కోరుతున్నది.తరిగిపోతున్న మందుగుండు సామగ్రి నిల్వలను పూర్తి చేయటానికి అమెరికా రక్షణ శాఖ 114 బిలియన్ డాలర్లను కోరుతున్నది. ఆర్థిక భారంతో పాటు, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికి 18 మంది అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గత రెండు వారాల లోనే వందమందికి పైగా అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ఇరాన్‌పై దాడితో అమెరికా సాధించిందేమిటనేది ప్రశ్నార్థకం. ఇరాన్ అణుకార్యక్రమాన్ని, అణుసామర్థ్యాన్ని నిర్మూలించే లక్ష్యం నెరవేరే సూచనలు లేవు. గల్ఫ్ దేశాలను రక్షించే సామర్థ్యం అమెరికాకు ఉన్నదా అనే సందేహాలను ఈ యుద్ధం లేవనెత్తుతున్నది. ఇక ఇరాన్ విషయానికొస్తే, ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ 6.1 శాతం క్షీణిస్తున్నది. ద్రవ్యో ల్బణం 68.9 శాతం. ఆహార ద్రవ్యోల్బణం 105 శాతం. ఇరాన్ కరెన్సీ (రియల్) దారుణంగా పతనమయింది. ఒక డాలర్‌కు 1.32 మిలియన్ల రియల్స్ పలుకుతున్నది. యుద్ధం వలన 144 బిలియన్ డాలర్ల నష్టం జరిగింది. ఇది ఇరాన్ జీడీపీలో 40 శాతం. సుమారుగా 3,460 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్నతస్థాయి సైనిక, రాజ కీయ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. అయితే, అమెరికా, ఇజ్రాయెల్ దాడులు రాజకీయంగా ఇరాన్ నాయకత్వానికి కలిసి వచ్చాయి. ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అమెరికా–ఇజ్రా యెల్ వైపు మళ్లింది. ఖమేని అంత్యక్రియలను ఇరాన్ తెలివిగా వాడుకున్నది. అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ హార్మూజ్ జలసంధి రూపంలో ఒక కొత్త అస్త్రాన్ని కనుక్కొన్నది. ఈ యుద్ధం ద్వారా ఇరాన్–రష్యా–చైనా మైత్రీబంధం మరింత బలపడింది.కొత్త గుణపాఠాలుహార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయజ్, పనామా, మలక్కా వంటి ఇరుకైన జలసంధుల (చోక్ పాయింట్ల) ద్వారా రవాణాపై పూర్తిగా ఆధారపడటం వలన వచ్చే ముప్పు అన్ని దేశాలకు అర్థమైంది. హార్మూజ్ నుండి తప్పించుకోవటానికి సౌదీ ఈస్ట్–వెస్ట్ పైప్ లైన్ ద్వారా రోజూ సుమారు 5 బిలియన్ బారల్స్ చమురును ఎర్ర సముద్రంలోని యాంబూ రేవు పట్టణం గుండా పంపిస్తున్నది.అందుకే ఇరాన్‌కు మద్దతునిచ్చే యెమెన్‌లోని హౌతీలు బాబెల్ మాండెబ్‌ను మూసివేశారు. యూఏఈ హార్మూజ్‌కు ప్రత్యామ్నాయంగా హబ్షాన్ నుండి పైప్‌లైన్ ద్వారా ఫుజేరాకు పంపించి ఒమన్ సింధుశాఖ గుండా రవాణా చేస్తున్నది. అందుకే ఇరాన్ ఫుజేరాపై దాడి చేసింది. భారత్ ప్రతిపాదించిన ‘ఐమెక్’(ఇండియా–మిడిల్ ఈస్ట్– యూరప్ ఎకనామిక్ కారిడార్) వీటన్నింటికి విరుగుడు. ఐమెక్ రూపుదిద్దుకోవాలంటే గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్‌తో ఆచరణాత్మక వైఖరిని రూపొందించుకోవాలి. అధునాతన ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్లు, స్టెల్త్ యుద్ధ విమానాలు, అణ్వస్త్రాలు, క్షిపణి రక్షణ వ్యవస్థల ద్వారా దిగ్గజ శక్తులు చిన్న రాజ్యాలను లొంగదీసుకోవటం అసాధ్యమని ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు రుజువు చేస్తున్నాయి. చౌకైన డ్రోన్లు, క్షిపణులతో కూడా ఎదురొడ్డి నిలువవచ్చని చాటి చెప్తున్నాయి. ఒకరకంగా ఈ రెండు యుద్ధాలు రెండు కూటముల మధ్య జరుగుతున్నట్టు లెక్క. అమెరికా, ఐరోపా దేశాలు ఒకవైపు; చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా ఇంకొకవైపు మోహరించి ఉన్నాయి. ఉక్రెయిన్ వెనుక అమెరికా, యూరప్ ఉన్నాయి. ఇరాన్ వెనుక చైనా, రష్యా ఉన్నాయి. గల్ఫ్ దేశాల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కగా మారింది. గల్ఫ్ దేశాల రక్షణను ఇజ్రాయెల్ పట్టకంలోంచి అమెరికా చూస్తుందనే విషయాన్ని అవి గుర్తించాలి. తమ భద్రతకై జీసీసీ దేశాలు, నాటో తరహా కూటమిని ఏర్పాటు చేసుకోవటం మేలు. ఇరాన్‌తో సత్సంబంధాలకు ప్రయత్నించాలి. భద్రత, రక్షణ, ఆర్థిక అంశాలలో వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని అనుసరించాలి. ఈ విషయంలో భారత్ విధానాల నుండి నేర్చుకోవచ్చును.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
నేటి యువత చూపుతున్న నైతిక శక్తి
ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసన... శాంతియుతంగా వ్యవస్థలను ప్రశ్నించే ధైర్యం ఉన్న వారే ఒక దేశపు ప్రజాస్వామ్య గాథను రాస్తారనే చిరస్థాయి సూత్రాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. బ్రిటిష్ పాలనలో జరిగిన స్వదేశీ ఉద్యమం నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు; స్వాతంత్య్రం తరువాత గుజరాత్‌లోని నవనిర్మాణ ఉద్యమం నుంచి 1970ల జేపీ (జయప్రకాశ్ నారాయణ్) జేపీ ఉద్యమం వరకు... వ్యవస్థ న్యాయమార్గం నుంచి తప్పిపోతోందని భావించిన ప్రతిసారీ విద్యార్థులు సవాలు విసిరారు. వారి పాత్ర తరగతి గదులకే పరిమితం కాలేదు. జంతర్ మంతర్ నిరసన ఆ సంప్రదాయానికి కొనసాగింపు మాత్రమే.సత్యాగ్రహ శక్తిసామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన అనేక వీడియోల్లో, పోలీసులు బలప్రయోగం చేసినప్పటికీ విద్యార్థులు హింసతో ప్రతిస్పందించకుండా నిలిచిన దృశ్యాలు కనిపిస్తాయి. తమపై ఏమి జరిగినా శాంతియుతంగానే ఉంటామని కొందరు పోలీసుల ఎదుట నిలబడి చెప్పారు. వారు తెలుసుకుని చేసినా, తెలియక చేసినా అది మహాత్మా గాంధీ ‘సత్యాగ్రహం’గా అభివర్ణించిన సత్యశక్తినే ప్రతిబింబించింది. ‘మానవాళి చేతిలో ఉన్న అత్యంత శక్తిమంతమైన ఆయుధం అహింస’ అని గాంధీజీ అన్నారు. ఆయన దృష్టిలో సత్యాగ్రహి లక్ష్యం ప్రత్యర్థిని ఓడించడం కాదు, సమాజ అంతరాత్మను మేల్కొల్పడం. జంతర్ మంతర్ నిరసన ద్వారా విద్యార్థులు సరిగ్గా ఇదే చేశారు. విద్య అంటే అసలు ఏమిటన్న మరింత లోతైన ప్రశ్నను కూడా ఈ నిరసన లేవనెత్తుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావప్రకటన స్వేచ్ఛతో పాటు శాంతియుతంగా సమావేశ మయ్యే హక్కును హామీ ఇస్తోంది. ఎందుకంటే భయపడకుండా అధికారాన్ని ప్రశ్నించగల విజ్ఞానవంతులైన పౌరులపైనే ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి. అందువల్ల భిన్నాభిప్రాయం ప్రజాస్వామ్యానికి మినహాయింపు కాదు; దాని ప్రాథమిక అవసరాల్లో అది ఒకటి. ఏ రాజకీయ సిద్ధాంతం అధికారంలో ఉన్నా, ప్రజా శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వ బాధ్యతే కావచ్చు. కానీ అదే సమయంలో శాంతియుత నిరసనను దేశానికే ముప్పుగా పరిగణించకుండా చూడటం కూడా ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వ బాధ్యత అనేది గుర్తెరగాలి.ధర్మబద్ధమైన కార్యాచరణ‘ప్రభుత్వాలు తాత్కాలికమైనవి; ప్రజాస్వామ్య సంస్థలు శాశ్వ తమైనవి’ అని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని దేశాన్ని విమర్శించినట్టుగా భావించడం... భారత స్వాతంత్య్ర ఉద్యమం నెలకొల్పాలనుకున్న రాజ్యాంగ సంస్కృతినే బలహీన పరుస్తుంది. ఇది ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న ‘సనాతన ధర్మం’ వైపునకు తీసుకువెళుతుంది. ప్రస్తుత రాజకీయ చర్చల్లో సనాతన ధర్మాన్ని కేవలం మతపరమైనదిగా చిత్రీకరిస్తున్నారు. కానీ భారతీయ శాస్త్రీయ తాత్విక సంప్రదాయంలో దానికి ఎంతో విస్తృతమైన అర్థం ఉంది. ‘ధర్మం’ అంటే సమాజాన్ని నిలబెట్టేది– న్యాయం, సత్యం, కరుణ, కర్తవ్యం, నైతిక క్రమం. అది కేవలం ఆచారాలు, కర్మకాండలు కాదు; నైతిక ప్రవర్తన.ధర్మం లేని అధికారానికి చెల్లుబాటు ఉంటుందా అనే ప్రశ్న మహాభారతంలో చాలాసార్లు కనిపిస్తుంది. ధృతరాష్ట్రుడు అధికారంపై మమకారంతో అన్యాయాన్ని చూడలేకపోయాడు. దుర్యోధనుడి దురాశ ఒక రాజ్యాన్నే నాశనం చేసింది. భీష్ముడు జ్ఞానవంతుడూ, నిష్కళంకుడూ అయినప్పటికీ, చక్రవర్తి పట్ల తన విధేయత కారణంగా అధర్మాన్ని ఎదిరించలేక విషాదపాత్రగా మిగిలాడు. న్యాయాన్ని వదిలిపెట్టిన పాలకులు చివరకు తమను తామే నాశనం చేసుకుంటారని విదురుడు పదేపదే హెచ్చరిస్తాడు. అర్జునుడికి కృష్ణుడు ఇచ్చిన ఉపదేశం అధికారాన్ని సమర్థించడం కాదు; ధర్మ బద్ధమైన కార్యాచరణకు మద్దతు ఇవ్వడం. ఈ సందేశం శాశ్వత మైనది. ధర్మం రాజకీయ అధికారానికి మించినది. పాలకుల చెల్లు బాటు నైతిక పాలన పట్ల వారి నిబద్ధతపైనే ఆధారపడి ఉంటుంది.ఈ అవగాహన భారత రాజ్యాంగంతో కూడా సారూప్యత కలిగి ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, గౌరవం, న్యాయం వంటి విలువలు భారతీయ నాగరికతపై పాశ్చాత్య ప్రపంచం రుద్దినవి కావు. ఉప నిషత్తుల నుంచి బుద్ధుడి వరకు, అశోకుని నుంచి బసవన్న వరకు, కబీర్ నుంచి అంబేడ్కర్ వరకు... భారతీయ తాత్విక సంప్రదా యాల్లో ఇవి లోతుగా ప్రతిధ్వనిస్తాయి. భారత రాజ్యాంగ నైతికత, భారత నాగరికత నైతిక సంప్రదాయం పరస్పర విరోధాలు కావు; అత్యుత్తమ రూపంలో అవి ఒకదానిని మరొకటి బలోపేతం చేస్తాయి.పూర్తికాని స్వాతంత్య్ర పోరాటంభారతదేశం 1947లో రాజకీయ స్వాతంత్య్రాన్ని సాధించింది. అయితే ఆ స్వేచ్ఛకు నైతిక పునాదులను కాపాడుకునే పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులు ప్రజాస్వామ్యం ఎన్నికల ద్వారా మాత్రమే నిలవదనీ, ప్రజా అంతరాత్మ ద్వారానూ నిలుస్తుందనీ గుర్తు చేశారు. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సమాధానం కేవలం అధికార కేంద్రాల్లో దొరకదు. స్వతంత్ర ఆలోచనను పెంపొందించే తరగతి గదుల్లో, జవాబుదారీతనాన్ని ఆహ్వానించే సంస్థల్లో, భయానికి సత్యాన్ని బలివ్వని పౌరుల్లో అది కనిపిస్తుంది. అధికా రాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు; గణతంత్రంపై విశ్వాసాన్ని వ్యక్తపరిచే చర్య అని జంతర్ మంతర్‌లో యువత గుర్తుచేస్తోంది. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు నిరసన స్వరం కాదు, పౌరుల మౌనం!డా‘‘ రఘు చలిగంటివ్యాసకర్త ఫ్రౌన్హోఫర్ హెచ్‌హెచ్‌ఐ (జర్మనీ)సీనియర్ పరిశోధకుడు, ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ’ వ్యవస్థాపకుడు -
నంబర్ వన్ నుంచి ‘పదిలో ఒకటి’కి!
పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సంస్థలు ఒక రాష్ట్రం వైపు అడుగులు వేసేముందు మొట్టమొదట పరిశీలించేది అక్కడి ప్రభుత్వ విధానాలు తమను ప్రోత్సహించడానికి అనువుగా ఉన్నాయా అన్నదే. దానికి దేశవ్యాప్తంగా ఆమోదం పొందిన కొలబద్ద ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగులు. అయితే ఆంధ్రప్రదేశ్ తాజా ర్యాంకులను చూస్తే ఆందోళన కలగకమానదు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ ర్యాంకుల్లో ఏపీ సాధించిన ఫలితాలు ఇప్పటికీ రికార్డులుగానే నిలిచి ఉన్నాయి. 2020 సెప్టెంబర్ 5న డీపీఐఐటీ ప్రకటించిన ఫలితాల్లో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితాలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 జూన్ 30న ప్రకటించిన బీఆర్ఏపీ–2020 ఫలితాల్లో ‘టాప్ అచీవర్స్’ హోదా పొందిన 7 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడమే కాదు, 97.89 శాతం స్కోరుతో దేశం లోనే అత్యధిక స్కోరు సాధించి గుజరాత్(97.77 శాతం) కంటే ముందు నిలిచింది. మరో విశేషం ఏంటంటే, 2024 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగిన తొలి ‘ఉద్యోగ్ సమాగమ్’ వేదికపై డీపీఐఐటీ వెల్లడించిన బీఆర్ఏపీ ఫలితాల్లో దేశం మొత్తం మీద ‘టాప్ పెర్ఫార్మర్’ హోదా దక్కింది మూడంటే మూడు రాష్ట్రాలకే. అవి కేరళ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. ఆ మదింపు నకు ప్రాతిపదిక జగన్ ప్రభుత్వ 2022–23 నాటి సంస్కరణల అమలు.2025 నవంబర్‌లో జరిగిన రెండో ‘ఉద్యోగ్ సమాగమ్’లో డీపీఐఐటీ ప్రకటించిన బీఆర్ఏపీ–2024 ఫలితాలు కళ్లు తెరిపించేలా ఉన్నాయి. ఐదు సంస్కరణ రంగాల్లో ‘టాప్ అచీవర్’ గుర్తింపును ఉత్తరాఖండ్, పంజాబ్ దక్కించుకోగా, ఆంధ్రప్రదేశ్ నాలుగు రంగాల గుర్తింపుతో పది రాష్ట్రాల గుంపులో ఒకటిగా మిగిలిపోయింది. ‘ఫాస్ట్ మూవర్స్’ జాబితాలో ఏపీ పేరు ఒడిశా, పంజాబ్ తర్వాతే వినిపించింది. ఈ నెల 17న నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్’ ఆ దృశ్యాన్ని మరింత స్పష్టం చేసింది. పెట్టుబడులకు అనుకూలమైన దేశంలోని 17 పెద్ద రాష్ట్రాల జాబితాలో ఏపీ స్థానం ఆరు. దేశంలోని అన్ని రాష్ట్రాల లెక్కన ఎనిమిదో స్థానం.‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అంటూ ప్రస్తుత ప్రభుత్వం వినిపిస్తున్న నినాదాలు, దావోస్ వేదికలపై ప్రకటనలు, లక్షల కోట్ల ఒప్పందాల హోరు వార్తా శీర్షికలకే పరిమితమవుతున్నాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకొనే ముందు పారిశ్రామికవేత్తలు పరిశీలించేది డీపీఐఐటీ, నీతి ఆయోగ్ వంటి సంస్థల తటస్థ గణాంకాలనే తప్ప ప్రచార ఆర్భాటాలను కాదు. ర్యాంకుల భాషను పెట్టుబడిదారులు ఎప్పుడో చదివేశారు; చదవాల్సింది ఏపీ పాలకులే.– డా. కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
చెరువులెవరివి? లాభాలెవరికి?
పురాతన కాలం నుంచి ఉన్న వేలాది చెరువులు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా మత్స్యకారుల జీవనానికి మూలస్తంభాలు. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 24,189 చెరువులు, జలాశయాలు, రిజర్వాయర్లు ఉన్నాయి. రాష్ట్రంలో 5,72,167 ఎకరాలకు పైగా విస్తీ ర్ణంలో చెరువులు అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 27 లక్షల మంది జీవనం సాగిస్తు న్నారు. అలాగే 4,500కు పైగా మత్స్యకార సహకార సంఘాలు నమోదై ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్య రంగం గణనీయంగా విస్తరించింది. 2014– 15లో సుమారు 2 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి ప్రస్తుతం 4.5 లక్షల టన్నులకు పైగా పెరిగింది. అయినా మత్స్యకార కుటుంబాల జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పు లేదు. అప్పులు, అస్థిర ఉపాధి, మధ్యవర్తుల దోపిడీ, తక్కువ ఆదాయం వారిని వెంటాడుతున్నాయి. ప్రభుత్వ విధానం ప్రకారం చెరువుల చేపల పెంపకం హక్కులు నేరుగా మత్స్యకార సహకార సంఘాలకు ఇవ్వాలి. ఈ విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం మధ్యవర్తులను తొలగించి ఉత్పత్తి ద్వారా వచ్చే లాభాలు నిజమైన మత్స్యకారులకు చేరేలా చేయడం.కానీ నేడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మత్స్యకార సంఘాల పేరుతో లీజుకు తీసుకున్న చెరువులను గోప్యంగా కాంట్రాక్టర్లకు, వ్యాపారులకు, దళా రులకు సబ్ లీజుకు ఇస్తున్నారు. ఫలితంగా అసలు మత్స్యకారులు తమ సొంత చెరువుల్లోనే కూలీలుగా మారిపోతున్నారు. చేపల మార్కెట్లో ప్రస్తుతం రోహు, కట్ల వంటి సాధారణ చేపల ధరలు అనేక పట్టణాల్లో కిలోకు రూ. 180 నుంచి రూ. 250 వరకు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక జాతుల చేపలు రూ. 300 నుంచి రూ. 500 వరకు విక్రయమవుతున్నాయి. చెరువుల వద్ద మత్స్యకారు లకు లభిస్తున్న ధరలు దీనికంటే చాలా తక్కువ. ఉత్పత్తి ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని మధ్యవర్తులు మింగేస్తున్నారు.మత్స్యకార సహకార సంఘాలకు అనేక చోట్ల ఎన్నికలు ఏళ్ల తరబడి జర గడం లేదు. సభ్యులకు లీజు వివరాలు తెలియడం లేదు. ఆదాయం–ఖర్చుల లెక్కలు బహిర్గతం కావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మత్స్యశాఖ అధికారులే బినామీ పేర్లతో కాంట్రాక్టు వ్యవస్థలో భాగమవుతున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల లీజులపై సమగ్ర సామాజిక తనిఖీ జరగాలి. చేపల కొనుగోలు, మార్కెటింగ్ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యక్ష మార్కెట్ వ్యవ స్థలను ఏర్పాటు చేయాలి. శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ కేంద్రాలు మత్స్యకార సంఘాల ఆధీనంలో ఉండాలి. లాభాలు నిజమైన మత్స్యకారునికి చేరాలి.– మామిండ్ల రమేష్ రాజా, సీపీఐ (ఎమ్ఎల్) లిబరేషన్ తెలంగాణ కార్యదర్శి -
మాయాబజార్లో ఓటర్ల దేవులాట
‘లాహిరి లాహిరి లాహిరిలో...’ అని పాడుకునే ‘మాయాబజార్’ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రానికి నిజానికి ‘శశిరేఖా పరిణయం’ అని ఉండాలి. కానీ ప్రపంచం మాయాబజార్ గానే గుర్తుంచుకుంది. ఎందుకంటే ఆ కథలో మాయ, వ్యూహం, వేషధారణ, భ్రమ – అన్నీ కలగలిసి ఉంటాయి. ఎవరు నిజం? ఎవరు మాయ? అనే సందేహమే కథకు ప్రాణం. నేటి ఓటరు జాబితాల ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) ప్రక్రియను గమనిస్తే కూడా ఇటువంటి సందేహాలే తలెత్తుతున్నాయి. ప్రజాస్వా మ్యంలో ఎన్నికలు ఒక పవిత్ర ప్రక్రియ. ఆ ప్రక్రియలో పారదర్శకత కనిపించకపోతే, అది ‘మాయాబజార్’లా అనిపించడం సహజం.మాయాబజార్లో ‘సత్యపీఠం’ ఉంటుంది. దానిపై కూర్చుంటే అసత్యం బయటపడుతుందని భావిస్తారు. కానీ వాస్తవ జీవితంలో రాజ్యాంగ పదవులు చేపట్టే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు– అందరూ సత్యనిష్ఠతో పనిచేస్తామని ప్రమాణం చేస్తారు. అయినప్పటికీ, వారి నిజాయితీని నిరూపించేందుకు అటువంటి ‘సత్యపీఠం’ లేదు. భారత సుప్రీంకోర్టు కూడా ‘సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ (2010) కేసులో పాలీగ్రాఫ్, నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పరీక్షలను వ్యక్తి సమ్మతి లేకుండా నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రశ్న ఏమిటంటే, పౌరుడి విషయంలో రాజ్యాంగం అంత జాగ్రత్తగా వ్యవహరిస్తే, ఓటరును మాత్రం మళ్లీ మళ్లీ తన ఉనికిని నిరూపించమని అడగడం ఎంత వరకు సమంజసం?ఓటరు ఎవరు?ఎన్నికల సంఘం చెబుతున్నది ఒకటే: ఫారం నింపండి, పత్రాలు ఇవ్వండి, వివరాలు సమర్పించండి. ప్రజలు అడుగుతున్న ప్రశ్న కూడా ఒక్కటే: ‘నేను ఇరవై ఏళ్లుగా ఓటు వేస్తున్నాను. నా పేరు ఇప్పటికే ఓటరు జాబితాలో ఉంది. మళ్లీ నేను ఎవరో ఎందుకు నిరూపించాలి?’ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇప్పటివరకు ప్రజలకు అందలేదు. 2002లో జరిగిన ప్రత్యేక సవరణ తరువాత అనేక ఎన్నికలు జరిగాయి. అదే జాబితాల ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్షలాది మంది ఓటు వేశారు. అప్పుడు చెల్లుబాటైన ఓటరు ఇప్పుడు అకస్మాత్తుగా సందేహా స్పదుడిగా ఏ విధంగా మారాడు?ఎన్నికల జాబితా రూపొందించడం భారత ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ బాధ్యత. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను గుర్తించడం, ఫారాలు అందించడం, సందేహాలు నివృత్తి చేయడం బూత్ లెవల్ అధికారుల విధి. కానీ అనేక ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా కనిపి స్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి వంటి పట్టణ ప్రాంతాల్లో వేలాది మందికి ఫారాలు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిచోట్ల బీఎల్వోలు కాలనీల్లో కూర్చొని వచ్చిన వారికి మాత్రమే ఫారాలు ఇస్తున్నారు. అలాంటి పరిస్థితిలో, ఫారం అందకపోయినా బాధ్యత ఓటరుపైనే వేయడం న్యాయమా?జూలై మధ్య నాటికి సుమారు 1.66 కోట్ల తెలంగాణ ఓటర్లలో సగానికి కూడా తక్కువ మంది మాత్రమే ఫారాలు సమర్పించారని అధికారిక సమాచారం చెబుతోంది. అంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? ఫారం అందలేదా? సమయం సరిపోలేదా? లేక ప్రక్రియపై సరైన అవగాహన కల్పించలేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా గడువులు పొడిగించడం ప్రజల సందేహాలను తగ్గించదు.డిజిటలైజేషన్ ఎందుకు?డిజిటల్ ఇండియా గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆధార్, ఓటర్ ఐడీ, జనన–మరణ నమోదు, చిరునామా రికార్డులు, ప్రభుత్వం వద్ద ఇప్పటికే విస్తృత సమాచారం ఉంది. ఈ సమాచారాన్ని సమన్వయం చేయకుండా, ప్రతి ఓటరునూ మళ్లీ పత్రాలతో రావాలని అడగడం పరిపాలనా సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డిజిటల్ వ్యవస్థ పౌరుడికి సౌలభ్యం కలిగించాలా? లేక అతనిపై కొత్త భారం మోపాలా?ప్రత్యేకంగా హైదరాబాద్ మహానగర పరిధిలోనే లక్షలాది నమోదులు పరిశీలనకు వస్తే, ఎన్నికల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తడం సహజం. ఇటువంటి సందర్భాల్లో ఎన్నికల సంఘం మరింత పారదర్శకంగా వివరాలు వెల్లడించడం అత్యవసరం. ఎన్నికల సంఘం ఒక సాధారణ ప్రభుత్వ శాఖ కాదు. అది రాజ్యాంగం సృష్టించిన స్వతంత్ర సంస్థ. దాని నిర్ణయాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి, అనుమానాలను కాదు. పౌరుడు ఎన్నికల సంఘాన్ని నమ్మాలి, ఎన్నికల సంఘం కూడా పౌరుడిని నమ్మాలి. ఈ పరస్పర విశ్వాసమే ప్రజాస్వామ్యానికి మూలాధారం.మాయాబజార్ సినిమాలో చివరికి మాయ తొలగిపోతుంది. నిజం బయటపడుతుంది. అందుకే ఆ కథ సుఖాంతమవుతుంది. ప్రజాస్వామ్యంలో కూడా అదే జరగాలి. ఎన్నికల ప్రక్రియలో మాయకు, సందేహాలకు, అపార్థాలకు చోటు ఉండకూడదు. ‘నీవు ఓటరువని నిరూపించు’ అనే ధోరణి కంటే, ‘నీ ఓటు హక్కు రక్షించడం మా రాజ్యాంగబద్ధ బాధ్యత’ అనే ధోరణి ఎన్నికల సంఘానికి మరింత గౌరవాన్ని తీసుకొస్తుంది.సర్ అనేది కేవలం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మాత్రమే కాదు. అది ఎన్నికల సంఘం విశ్వసనీయతకు కూడా పరీక్ష. ఆ పరీక్షలో విజయం సాధించేది గణాంకాలు కాదు; పారదర్శకత, నిష్పాక్షికత, ప్రజల విశ్వాసం. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన ‘సత్యపీఠం’.- మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
ఔషధాల అన్వేషణ ఏఐతో సులభతరం
మానవాళి ఆరోగ్య సంరక్షణ చరిత్రను పరిశీలిస్తే ప్రకృతే తొలి వైద్యశాలగా నిలిచిందని స్పష్టమవుతుంది. శతాబ్దాలుగా ఆయుర్వేదం, యునాని, సిద్ధ, నాటు వైద్య విధానాలు మనుషులకు ప్రాథమిక ఆరోగ్య రక్షణను అందిస్తూ వచ్చాయి. 1950వ దశాబ్దానికి పూర్వం వరకు మానవ మనుగడ ప్రధానంగా ఈ సహజ మూలికా వైద్యంపైనే ఆధారపడి సాగింది. ఆధునిక వైద్యంలో అత్యంత కీలకమైన మోర్ఫిన్, కొకైన్, క్వినైన్, ఆస్పిరిన్ వంటి అనేక ఔషధాల ఆవిష్కరణకు ప్రకృతిసిద్ధమైన వృక్ష సంపదే మూలధారంగా నిలిచింది. అయితే, నేటి మారుతున్న జీవనశైలి కారణంగా హృద్రో గాలు, మధుమేహం, కాన్సర్, ఊబకాయం వంటి తీవ్రమైన రుగ్మతలు మానవాళికి సవాలుగా మారాయి. వీటి నివారణకు ప్రాచీన మూలికా విజ్ఞానాన్ని ఆధునిక కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో అనుసంధానించటం ఆవశ్యకంగా మారింది.ఔషధ ఆవిష్కరణలో నూతన శకంమన దేశంలో ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానానికి అపారమైన ప్రాధాన్యత ఉంది. అశ్వగంధ, శతావరి, నేలవేము, తులసి, గుడుచి, త్రిఫల వంటి ఎన్నో శతాబ్దాలుగా రోగనిరోధక శక్తిని పెంపొందించటంలోనూ, అనేక రుగ్మతల నివారణలోనూ ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. అయితే, ఈ సంప్రదాయ మూలికా వైద్యంలో ఉన్న క్రియాశీల రసాయన ఘటకాలను (యాక్టివ్ ప్రిన్సిపుల్స్) వేరుచేసి, వాటి ప్రామాణీకరణను ఆధునిక రసాయనిక, జీవశాస్త్ర పద్ధతుల ద్వారా నిర్ధారించవలసిన అవసరం ఉంది. సంప్రదాయ వైద్యం కేవలం అనుభవపూర్వక నమ్మకంగా మాత్రమే మిగిలిపోకుండా ప్రజారోగ్య వ్యవస్థలో భాగం కావాలంటే శాస్త్రీయ విశ్లేషణ, ఆధారిత రుజువులు (సైంటిఫిక్ రిగర్) చాలా ముఖ్యం.నూతన ఔషధాల అన్వేషణలో కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశం ఒక విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టింది. ఒక కొత్త ఔషధాన్ని కనుగొనటానికి సాధారణంగా దశాబ్దాల సమయం, భారీ ఆర్థిక వ్యయం అవసరమవుతాయి. కానీ, ఏఐ సాంకేతికత సహాయంతో కోట్లాది రసాయన నిర్మాణాలను చాలా తక్కువ సమయంలోనే వర్చువల్ స్క్రీనింగ్ చేయవచ్చు. ఇవి లక్ష్యిత వ్యాధి కణాలపై ఎలా పనిచేస్తాయి? ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటాయి? వాటి వల్ల ఏవైనా విషపూరిత పరిణామాలు ఎదురవుతాయా? అనే అంశాలను ఏఐ ద్వారా ముందే ఊహించడానికి అవకాశముంది. ప్రాచీన మూలికా సమాచారాన్ని డిజిటలైజ్ చేసి ఏఐ డేటాబేసులతో అనుసంధానించటం ద్వారా పరిశోధన వేగాన్ని పెంచవచ్చు.ఏఐ నిర్ణేత కాదు, పరికరం మాత్రమే!ఏఐ ఎంత శక్తిమంతమైనదైనప్పటికీ, అది మైక్రోస్కోప్ లేదా స్పెక్ట్రోమీటర్ లాంటి ఒక పరిశోధనా సాధనం మాత్రమే తప్ప స్వయంభూ నిర్ణేత కాదు. ఏఐ కోట్లాది రసాయన నమూనాలను వేగంగా విశ్లేషించగలదు. కానీ అది సత్యానికి ప్రమాణం లేదా శాస్త్రీయ నిజం కాదు. ఏఐ ఇచ్చే అంచనాలలో ‘ఫాల్స్ పాజిటివ్స్’, ‘ఫాల్స్ నెగె టివ్స్’, తప్పుడు ఊహలు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. ఏఐకి మానవ భావోద్వేగాలు, జీవశాస్త్ర పద్ధతుల వెనుక ఉన్న నిజమైన కారణాలు లేదా ప్రయోగశాల ప్రత్యక్ష అనుభవం ఉండవు. పెన్సిలిన్, టాక్సాల్ వంటి విప్లవాత్మక ఆవిష్కరణలు... అనుకోకుండా, మానవ సృజనాత్మక పరిశీలన వల్లనే సాధ్యపడ్డాయి. కాబట్టి, ఏఐ ఆలోచనను భర్తీ చేయలేదు, కేవలం శాస్త్రవేత్త ఆలోచనా పరిధిని విస్తరింపజేస్తుంది. ఔషధ నాణ్యత, క్లినికల్ భద్రత, తుది నిర్ణయం ఎప్పుడూ మానవ మేధస్సు, శాస్త్రీయ విశ్లేషణ పైనే ఆధారపడి ఉంటాయి. సంప్రదాయం, శాస్త్రీయతల సమతుల్యతఏఐ నమూనాల (ప్యాటర్న్స్)ను గుర్తిస్తుంది. కానీ శాస్త్రానికి కారణ–ఫలిత సంబంధం (కాజేషన్), జీవశాస్త్రపరమైన సమర్థత (బయలాజికల్ ప్లాసిబిలిటీ) అవసరం. వివరణ లేకుండా చేసే అంచనాలు బలహీనమైన శాస్త్రాన్ని సృష్టిస్తాయి. అందువల్ల ఏఐ పట్ల శాస్త్రీయ సందేహ దృష్టి (సైంటిఫిక్ స్కెప్టిసిజమ్), విమర్శనాత్మక శాస్త్రీయ ఆలోచన (సైంటిఫిక్ రీజనింగ్) సమాజ అభ్యున్నతికి అత్యంత అవసరం. కాబట్టి, భవిష్యత్తు ‘మనిషి వర్సెస్ ఏఐ’ కాదు, ‘మనిషి + ఏఐ’ అనే సహకార దృక్పథమే వాస్తవం. ఏఐ మన జిజ్ఞాసను విస్తరించాలి, దాన్ని భర్తీ చేయకూడదు. అందువల్ల, ఇదీ భవిష్యత్తు విజయసూత్రం: ఏఐ+సాంప్రదాయ జ్ఞానం+కఠినమైన ప్రయోగాత్మక పరిశోధన+ విమర్శనాత్మక ఆలోచన= సమాజ పురోగతి, మానవ సంక్షేమం. భారతదేశానికి ఉన్న అపారమైన ప్రాచీన వైద్య సంపదను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమ్మేళనం చేయటమే నేటి మన ప్రధాన లక్ష్యం కావాలి. ఏఐ అందించే విశ్లేషణలను గుడ్డిగా నమ్మ కుండా, విమర్శనాత్మక ఆలోచన, ప్రయోగశాల నిర్ధారణల ద్వారా పరిశీలించాలి. ఆయుర్వేద ఔషధాల నాణ్యత, భద్రత, సమర్థతలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిరూపించినప్పుడే భారతీయ వైద్య విజ్ఞానానికి ప్రపంచస్థాయిలో సముచిత స్థానం లభిస్తుంది. ఏఐ పరిశోధనల వేగాన్ని పెంచినప్పటికీ, మానవ మేధస్సు, శాస్త్రీయ దృక్పథం మాత్రమే నిజమైన ఆరోగ్య విప్లవానికి బాటలు వేస్తాయి. – డా‘‘ కె. నాగయ్య : విశ్రాంత ముఖ్య శాస్త్రవేత్త, ప్రాకృతిక ఉత్పత్తులు–ఔషధ రసాయన శాస్త్ర విభాగం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్–ఐఐసీటీ), హైదరాబాద్;– ఫణిరాజ్ జి : ఐటీ ప్రొఫెషనల్, బోస్టన్, యూఎస్ఏ -
మేధో వలసలను ఇస్రో ఆపేదెలా?
అంతరిక్ష రంగం ఈమధ్య సముచిత, అనుచిత కారణాలు రెండింటితోనూ వార్తలకెక్కుతోంది. స్కైరూట్ అనే భారతీయ ప్రైవేటు స్పేస్ కంపెనీ తానే అన్నీ అయి చూసుకున్న ఒక అంతరిక్ష ప్రయోగాన్ని తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా నిర్వహించింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ఇద్దరు మాజీ ఇంజినీర్లు ఆ కంపెనీని నెల కొల్పారు. ఈ కంపెనీ విక్రమ్–1 రాకెట్‌ను ప్రయోగించి తన సత్తా చాటుకుంది. ఇదే తరహా రాకెట్‌ను మరింత ఉన్నతపరచి విక్రమ్–2 పేరుతో వచ్చే ఏడాది ప్రయోగించాలని భావిస్తోంది. తక్కువ ఎత్తులోనున్న భూకక్ష్య (ఎల్.ఇ.ఓ.)లో ఉపగ్రహాలను నిలిపే కోట్లాది డాలర్ల మార్కెట్లోకి ప్రవేశించాలని స్కైరూట్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రైవేటు ఆకర్షణీయంమరోపక్క ఇస్రో నుంచి టాప్ సైంటిస్టులు, ఇంజినీర్లు పెద్ద యెత్తున వైదొలగుతున్నారనే వార్త గుబులు పుట్టిస్తోంది. యు.ఆర్. రావు స్పేస్ సెంటర్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, జాతీయ అంతరిక్ష సంస్థకు చెందిన ఇతర కీలక విభాగాల్లో పనిచేస్తున్న డజన్లకొద్దీ సీనియర్ సైంటిస్టులు రాజీనామా చేయడమో లేదా ముందుగానే రిటైర్మెంట్ తీసుకోవడమో చేశారని వార్తలు సూచిస్తున్నాయి. వారిలో చాలామంది భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గగన్‌యాన్ (మానవుడిని స్పయంగా అంతరిక్షంలోకి పంపడం), తదుపరి తరం వాహక నౌక (ఎన్జీఎల్వీ), భారతీయ అంతరిక్ష స్టేషన్ (బ్యాస్) వంటి ప్రముఖ కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. ఈ వలస ఎంత ఆందోళనకరంగా పరిణమించిందంటే, అలాంటి ప్రాజెక్టులు పూర్తయ్యేంత వరకు వాటిలో పనిచేస్తున్నవారు సంస్థను విడిచి వెళ్ళడానికి వీలులేకుండా అంతరిక్ష శాఖ ఆంక్షలు విధించాలని నిర్ణయించుకుంది. ఈ రెండు పరిణామాలు– మొదటి ప్రైవేటు రాకెట్ ప్రయోగం, ఇస్రోకు ఉద్యోగులు వీడ్కోలు పలకడం– పైకి ఒకదానితో ఒకటి సంబంధం లేనివిగా కనిపించవచ్చు. కానీ, అవి పరస్పరం ముడిపడి ఉన్నవని గ్రహించాలి. ఇస్రో యూనిట్ల నుంచి ఉద్యోగులు రాజీనామాలు చేయడానికి ప్రధాన కారణం, గత కొద్ది ఏళ్ళలో ప్రైవేట్ రంగ స్పేస్ కంపెనీలు కనబరుస్తున్న ఎదుగుదలేనని స్పష్టమవుతోంది. అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి పచ్చజెండా ఊపడమే కాకుండా, ఉపగ్రహ వాహక నౌకల ప్రయోగానికి ఇస్రో సదుపాయాలను వినియోగించుకునేందుకు కూడా ప్రభుత్వం అను మతించింది. ఇస్రోలో పనిచేస్తున్న ప్రతిభావంతులైనవారిని తమ వైపు లాక్కునేందుకు ప్రైవేట్ కంపెనీలకు ఇది అనువైన వాతావర ణాన్ని కల్పించింది. ప్రభుత్వ సంస్థల నుంచి ప్రైవేటుకు ఇలా ప్రతిభావంతులు తరలిపోవడం ఇస్రోకు ఇది కొత్తా కాదు, అంతరిక్ష రంగానికి మాత్రమే పరిమితమైన ధోరణి అంతకన్నా కాదు. అమెరికాలో కూడా ప్రైవేట్ అంతరిక్ష రంగం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తీర్చిదిద్ది, అభివృద్ధి చేసిన మానవ వనరులే అక్కడి ప్రైవేట్ రంగానికి ప్రధాన ఆలంబన. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ కూడా మొగ్గ తొడుగుతున్న దశలో ఆ రంగానికి చెందిన ప్రైవేట్ సంస్థలు తమ పరిశోధన–అభివృద్ధి విభాగాలలోకి ఈసీఐఎల్, సీఎంసీ వంటి ప్రభుత్వ రంగ కంపెనీల నుంచే సిబ్బందిని తీసుకున్నాయి. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ కంపెనీల విషయంలోనూ అదే జరిగింది. డీఆర్డీఓ ల్యాబొరేటరీలలో కూడా ఇస్రో తరహా పరిస్థితే నెలకొంది. రక్షణ, ఏరోస్పేస్ పరికరాల ఉత్పత్తిలో ప్రైవేట్ రంగాన్ని అనుమతించిన ఫలితమే ఇది. అందని నిధులు– అందితే కోతలుఇస్రో, డీఆర్డీఓ వంటి మన వైజ్ఞానిక సంస్థలు తాము ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణాలను నిశితంగా అన్వేషించుకోవాలి. ఇస్రోకు చెందిన వివిధ యూనిట్లలో 2,800లకు పైగా ఖాళీలున్నాయనీ, మంజూరైనవి సుమారు 1800 పోస్టులు మాత్రమేననీ అంతరిక్ష శాఖ పనితీరును అధ్యయనం చేసిన పార్లమెంటరీ కమిటీకి 2026 మార్చిలో వెల్లడించారు. ఎన్జీఎల్వీ తయారు చేసే ముఖ్య పనిలో ఉన్న విక్రమ్ సారాభాయ్ కేంద్రంలో దాదాపు 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు అనుభవజ్ఞులైన సైంటిస్టులను ఎరవేసి పట్టుకుంటున్నాయి. మరోవైపు, ఇస్రో ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదు. ఉదాహరణకు, ఎన్జీఎల్వీని నిర్మించి, ప్రయోగించే ప్రాజెక్టునకు 96 నెలల సమయమిస్తూ క్యాబినెట్ 2024లో ఆమోదం తెలిపింది. ఆమోదించిన తేదీ నుంచి 84 నెలల లోపల మొదటి పరీక్షకు వాహక నౌకను సిద్ధం చేయాలని కూడా ఆదేశించింది. కానీ, 2024–25 బడ్జెట్లో దీనికి కేటాయింపులు ఏమీ లేకపోవడం వల్ల ఆమోదం పొందిన అనేక నెలల తర్వాత కూడా ఈ ప్రాజెక్టు కాగితాలకు మాత్రమే పరిమితమైంది. సవరించిన అంచనాలలో నామ మాత్రంగా రూ. 3 కోట్లు కేటాయిస్తే, దానిలో ఇస్రో రూ. 85 లక్షలను మాత్రమే వెచ్చించగలిగింది. 2025–26 బడ్జెట్లో రూ. 158 కోట్లు కేటాయించారుగానీ, సవరించిన అంచనాల దగ్గరకొచ్చేసరికి దాన్ని రూ. 39.76 కోట్లకు తగ్గించారు. ఇందులో ఇస్రో 2026 జన వరి 31 వరకు రూ. 7.93 కోట్లను మాత్రమే వెచ్చించగలిగింది.వ్యయంలో నత్తనడక, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోవడం, తదుపరి బడ్జెట్లలో కేటాయింపులను తగ్గిస్తూపోవడం, ఖాళీలను భర్తీ చేయడంలో జాప్యం, ప్రైవేట్ రంగ ప్రవేశం వంటివన్నీ ఇస్రోలో నేటి స్థితికి కారణమయ్యాయి. వీటన్నింటికి తోడు ఇస్రోకు నమ్మిన బంటుగా పనిచేస్తూ వచ్చిన పీఎస్ఎల్వీ వరుసగా వైఫల్యాలను చవిచూసింది. నిర్ణాయక వ్యవస్థ కేంద్రీకృతం కావడం, అధికారుల, రాజకీయ జోక్యం పెరగడం వంటివి భారీ ప్రాజెక్టులను తలకెత్తుకున్న సైంటిఫిక్ ఏజెన్సీ పని తీరుకు మేలు చేయవు. మారాల్సిన విధానాలుసైంటిస్టులను రాజీనామా చేయవద్దని కోరడం, వారు వైదొలగకుండా అడ్డు పెట్టడం సరైన స్పందన అనిపించుకోదు. ప్రైవేట్ రంగ ప్రవేశానికి ప్రోద్బలం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, దానికి వీలు కల్పించిన ఇస్రో తమ వైఖరి పర్యవసానాన్ని, అది జాతీయ కార్యక్రమాలపై చూపగల ప్రభావాన్ని ముందే ఊహించి ఉండాల్సింది. దాంతోపాటు, మిషన్ వైఫల్యాలు, జాప్యాల ఫలితంగా నీరసపడ్డ సైంటిస్టులలో స్థైర్యాన్ని పెంపొందించే చర్యలను ఇస్రో నాయకత్వం చేపట్టాలి. ఇస్రో దీర్ఘకాలంలో చేపట్టవలసిన సరికొత్త యంత్రాంగాలపై యోచించాలి. ఉదాహరణకు, సిబ్బంది ఇస్రోలో తమ ఉద్యోగాలను నిలబెట్టుకుంటూనే ఒక పరిమిత కాలానికి ప్రైవేట్ రంగంలో పని చేసేందుకు అనుమతించవచ్చు. కీలకేతర రంగాల్లో సొంత కంపెనీలను స్థాపించుకునేందుకు అంగీకరించవచ్చు. వీటికి తోడుగా, జీతభత్యాలు, ప్రోత్సాహకాలు, ప్రమోషన్ల విధానాలను సవరించు కోవాలి. ప్రభుత్వం తన వంతుగా వైజ్ఞానిక సంస్థల ప్రతిపత్తిని పున రుద్ధరించాలి. స్పేస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతోంది. దాన్ని వినియోగించుకునేందుకు జాతీయ ఏజెన్సీలతో పాటు ప్రైవేట్ కంపెనీలకు కూడా కావలసినంత అవకాశం ఉంది. బ్రెయిన్ డ్రెయిన్‌ను బ్రెయిన్ సర్క్యులేషన్‌గా మలచుకోవచ్చు. దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
మన్యం నుంచి పార్లమెంటు దాకా...
అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో జరిగిన మన్యం పితూరీలో ఆయనకు ప్రధాన అనుచరులుగా గాం గంటందొర, గాం మల్లుదొర పేరెన్నిక గన్నారు. వీరు గిరిజనులలో భగత తెగకు చెందినవారు. ఇందులో మల్లు దొర స్వాతంత్య్రానంతరం పార్లమెంటుకూ ఎన్నిక య్యాడు. విశాఖపట్నం జిల్లా చింతపల్లి తాలూకాలోని కొయ్యూరు మండలం ‘బట్టపనుకులు’ గ్రామంలో 1900లో జన్మించాడు.గంటందొర చిన్న తమ్ముడు మల్లుదొర. బ్రిటిష్ తాబేదారుల అక్రమ చర్యలను గాం సోదరులు ప్రతిఘటించారు. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నాడనే నేపంతో చింతపల్లి తాసిల్దార్ సెబాస్టియన్ గంటందొరను మునసబు పదవి నుంచి తొలగించాడు. అంతేగాదు, గంటందొర భూమితో పాటు మరికొందరి ఆదివాసుల భూములను ప్రభుత్వపరం చేశాడు. గాం సోదరులకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడానికి మన్యం ప్రజలు అల్లూరి సీతారామరాజుకు తెలియుజేశారు.సీతారామరాజు 1922లో మన్యం పోరాటాన్ని ప్రారంభించాడు. బ్రిటిష్ వారి ఆగడాలను అంత మొందించడానికి 150 మంది సైనికులను సేకరించ డంలో గాం సోదరుల కృషి చెప్పుకోదగినది. వీరికి భగత తెగ గిరిజనులైన సింగన్న, పడాలు, గోవిందు, వీరయ్య దొర, గోకేరు ఎర్రేసు, అగ్గిదొర వంటి వారి సహకారం తోడైంది. సీతారామరాజు నాయకత్వంలో చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల పోలీస్ స్టేషన్లపై దాడిచేసి ఆయుధాలను సేకరించారు. బ్రిటిష్ ప్రభుత్వం అల్లూరిని పట్టిచ్చిన వారికి 10 వేలు, గంటందొర, మల్లుదొరలను పట్టిచ్చిన వారికి ఒక్కొక్కరికి వెయ్యేసి రూపాయల పారితోషికం ప్రకటించింది.ఉద్యమంలో కాస్త చురుకుదనం కోల్పోయిన సందర్భంలో ఆయుధాలను అల్లూరి సైన్యానికి అప్పగించి మల్లుదొర దళాన్ని విడిచి వెళ్లాడు. 1923 సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నడింపాలెం చేరుకున్నాడు. ఒక రహస్య ప్రదేశంలో బ్రిటిష్ వారికి పట్టుబడ్డాడు. అల్లూరి ఆచూకీ తెలుప మని మల్లుదొరను చిత్రహింసలు పెట్టినా ఏమీ చెప్పలేదు. 1924 మే 7న పట్టు బడిన అల్లూరి వీరమరణం పొందాడు. వాల్తేరు ఏజెన్సీ న్యాయమూర్తి మల్లు దొరకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పాడు. మల్లుదొర అప్పీలు చేయగా మరణ శిక్షణను ద్వీపాంతరవాస శిక్షగా మార్చారు. 1937లో అండమాన్ జైలు నుంచి విడుదౖలñ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1952లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో విశాఖపట్నం ఏజెన్సీ నుంచి గెలుపొంది ఆదివాసీలలో తొలి పార్లమెంటు సభ్యుడిగా వ్యవహరించారు. 1969 జూలై 21న తుదిశ్వాస విడిచారు.– గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపకుడు -
సంపద... సామాజిక బాధ్యత!
కంపెనీల రూపంలో వ్యాపారం నిర్వహించడం 1600 సంవత్సరంలో ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’తో ప్రారంభమైనదని చెప్పవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు సాధారణంగా సొంత యాజమాన్యంలో లేక భాగస్వామ్యంలో వ్యాపారాలు నిర్వ హిస్తుంటారు. పెద్ద ఎత్తులో వ్యాపారాలు నిర్వ హించాలంటే, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ‘కంపెనీ’ రూపంలో వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుంది. 19వ శతాబ్దం మధ్య నుంచి కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో రిజిస్టర్ అయిన కంపెనీల సంఖ్య దాదాపు 28 లక్షలు.ఎప్పుడైతే కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థలను శాసించడం మొదలైందో, అప్పుడే వాటి సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్సాన్సిబి లిటీ–సీఎస్ఆర్) గురించి కూడా చర్చమొదలైంది. హోవార్డ్ బోవెన్ 1953లో మొదటిసారిగా, ‘కార్పొ రేట్ల సామాజిక బాధ్యత’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సామాజిక విలువలకు అనుగుణంగా కంపె నీల నిర్ణయాలు, పాలసీలు ఉండాలనీ, సమాజ అభివృద్ధికి ఆర్థికంగా సహాయపడాలనీ ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ గ్రహీత మిల్టన్ ఫ్రైడ్‌మ్యాన్ మాత్రం చట్టబద్ధంగా వ్యాపారం నిర్వహించి, కంపెనీలను లాభాల బాట పట్టించడం, కంపెనీ వాటాదారుల సంపద పెంచడం మాత్రమే ‘కార్పొరేట్ల సామాజిక బాధ్యత’ అని వాదించారు.కంపెనీలు సామాజిక బాధ్యతలను కూడా నిర్వహిస్తే, ఆదాయపు పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రపంచ దేశాలు వాటిని ప్రోత్సహిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి, కంపెనీ చట్టం–2013 లోని సెక్షన్ 135 ద్వారా సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం కంపెనీలకు తప్పనిసరి చేసింది. చట్టంలో పొందుపరచిన సామాజిక బాధ్యతలను నిర్వర్తించకుంటే, అందుకు బాధ్యులైన కంపెనీ అధికారులకు మూడేళ్ల వరకు జైలుశిక్షను కూడా నిర్దేశించింది. ఆ విధంగా, ప్రపంచం మొత్తం మీద, శాసనం ద్వారా సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం తప్పనిసరి చేసిన మొట్టమొదటి దేశంగా భారత్ నిలిచింది. తరవాత, 2020లో జైలు శిక్ష స్థానంలో జరి మానాను విధించాలని పార్లమెంటు చట్టాన్ని సవ రించి కంపెనీలకు ఊరట కలిగించింది. సవరించిన చట్టం ప్రకారం, సామాజిక బాధ్యతలకై నిర్దే శించిన ఖర్చు చేయని డబ్బుపై రెండింతల జరి మానా ప్రభుత్వానికి కంపెనీ చెల్లించాలి. అందుకు బాధ్యులైన కంపెనీ అధికారులకు రెండు లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఇంకా, తన సామాజిక బాధ్య తను ఏ పరిస్థితుల్లో నిర్వర్తించ లేకపోయిందో వివరణ ఇవ్వాలి.లక్ష్యం నెరవేరినట్టే!గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయల లాభం, వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం, 500 కోట్ల రూపాయల నెట్‌వర్త్‌ను కంపెనీలు కలిగి ఉంటే... అవి తమ లాభాల్లో కనీసం 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాలపై ఖర్చు చేయాలి. అది కూడా చట్టం నిర్దేశించిన 12 విభాగాలలో నుంచి ఒక దాన్ని ఎంచుకోవాలి. విద్య, వైద్యం, పర్యావరణం, గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ వంటివి ఇందులో ఉన్నాయి. సీఎస్‌ఆర్‌పై చేసిన ఖర్చుపై ‘బిజినెస్ ఎక్స్పెండి చర్’ కింద ఆదాయపు పన్ను మినహాయింపు లేదు.అయితే, ఈ చట్టం చేయకముందే ఎన్నో ఏళ్లుగా, టాటాలు, బిర్లాలు, మరెన్నో కార్పొరేట్ సంస్థలు విద్య, వైద్యం లాంటి ఎన్నో సామాజిక విషయాలపై స్వచ్ఛందంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాయి. కానీ చట్టం చేసిన తరువాత, గత పదేళ్ళలో కార్పొరేట్ సంస్థలన్నీ కలిసి 2 లక్షల కోట్ల రూపాయలకు పైన తమ సామాజిక బాధ్య తను నిర్వర్తించడానికి ఖర్చు చేశాయి. ఇది గర్వించదగ్గ విషయం. న్యాయవ్యవస్థలో, మౌలిక సదుపాయాల కొరత వల్ల కూడా, కేసులు విపరీ తంగా పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి, న్యాయ వ్యవస్థను కూడా సీఎస్ఆర్లో 13వ విభాగంగా చేర్చుతూ చట్టాన్ని సవరించాలి.– హరీష్ కుమార్ కొలిచాల, న్యాయవాది, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
గురువే దేవుడి కన్నా ఉన్నతుడు..
భారతీయ సంస్కృతిలో గురువుకు ఉన్న స్థానం అద్వితీయం. అందుకు ఈ కథ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు: ఒక రోజు గురువు, దేవుడు ఇరువురూ కలిసి ఓ వ్యక్తి దగ్గరకు వచ్చారు. వెంటనే అతడు భగవంతుని పాదాలను తాకి నమస్కరించబోయాడు. భగవంతుడు అతణ్ణి ఆపి, ‘ముందు నీ గురువును పూజించు’ అన్నాడు. సరే అని, అతడు గురువును పూజించడం ప్రారంభించాడు. కానీ గురువు ‘శిష్యా, నేను భగవంతుడిని నీ ఇంటికి తీసుకువచ్చాను, కాబట్టి నువ్వు ముందు భగవంతుడిని పూజించాలి’ అన్నారు.గురువు సలహా విని, శిష్యుడు భగవంతునివైపు తిరిగాడు. ‘నీ జీవితంలోకి భగవంతుడిని తీసుకువచ్చింది నీ గురువే. నన్ను చేరుకోవడానికి సరైన మార్గాన్ని నీకు చూపింది ఆయనే, కాబట్టి నువ్వు ముందు ఆయనను పూజించాలి’ అన్నాడు భగవంతుడు. ‘నేను భగవంతుని వద్దకు మార్గం చూపినప్పటికీ, ప్రతిదానికీ ఆయనే బాధ్యుడు, కాబట్టి నువ్వు ముందు భగవంతుని ఆశీర్వాదం పొందడం మంచిది’ అన్నారు ఈసారి గురువు. దీంతో శిష్యుడు దేవుని ఉద్దేశించి ‘తండ్రీ, గురువుగారు చెప్పేదంతా నిజమే కదా’ అన్నాడు. అందుకు భగవంతుడు ‘కర్మఫలాలను బట్టి, నేను ఎలాంటి భేదం లేకుండా జనులకు సుఖదుఃఖాలను ఇస్తాను. నేను ఎవరికీ కీడుగానీ, మేలుగానీ చేయను. ప్రతి వ్యక్తికీ వారి కర్మఫలాన్నే ఇస్తాను. కానీ గురువు అలాంటివాడు కాదు. ఆయన పవిత్రుడు. నిరాడంబరుడు. ప్రేమమయుడు. గురువు మార్గదర్శకత్వం కోరిన శిష్యుడిని, అతను ఎలా ఉన్నాడో అలాగే స్వీకరిస్తాడు. నన్ను చేరే మార్గాన్ని అతనికి చూపించి ఆశీర్వదిస్తాడు. అతను ఎలా ఉన్నా సరే సరిదిద్దుతాడు. శిష్యుడి కర్మఫలాల నుండి అతడిని కాపాడుతాడు. అతనితో ఉండి మార్గనిర్దేశం చేస్తాడు. కానీ నేను అలా చేయను. అందువల్ల, గురువే దేవుడి కన్నా ఉన్నతుడు’ అన్నాడు.– యామిజాల జగదీశ్ -
చైనాలో ఎందుకీ ప్రక్షాళనలు?
చైనాలో విధానపరమైన అన్ని నిర్ణయాలు తీసుకునే కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరో నుంచి ఈ నెల 14న మరొక సభ్యుడిని తొలగించారు. అసలు పార్టీ నుంచే బహిష్కరించారు. మొత్తం 24 మంది సభ్యులుండే ఆ విభాగం నుంచి ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటికి ముగ్గురు బహిష్కృతులయారు. ఇదే కాలంలో అత్యున్నత సైనిక జనరల్స్ నలుగురు పదవీ చ్యుతులు కావటమేగాక, కొందరు ఉన్నతాధికారులు ఉరిశిక్షలకు గురికావటమో, జీవిత కాలపు జైలుకు వెళ్లటమో జరిగింది.ప్రచారంలో నిజం ఎంత?ఇందుకు కారణాలు ఏమిటన్నది అర్థం చేసుకోవలసిన విషయం. ఇటువంటి వార్తలు బయటకు వచ్చినప్పుడల్లా ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. ఒక విధమైన దిగ్భ్రమకు కూడా లోనవుతుంది. పలువిధాలైన ఊహాగానాలు, చర్చలు సాగుతాయి. కానీ, చైనా 1949 కమ్యూనిస్టు విప్లవానికి ముందుకాలపు చరిత్రలోనూ తనకుతానే సీమితమై, తన చుట్టూ తాను తిరిగే మిస్టిక్ దేశమే. కమ్యూనిజంలో ఉండే పారదర్శకతా రాహిత్యానికి, ఈ చారిత్రక మిస్టిసిజం తోడై, అక్కడి పరిణామాలలోని వాస్తవాలు ఏమిటో బయటి ప్రపంచానికి సరిగా తెలియని పరిస్థితి ఏర్పడింది. చైనా ప్రభుత్వం స్వయంగా చెప్పేది ఎక్కువగా అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం. కొద్ది సందర్భాలలో మాత్రం రక్షణ రహస్యాలను, శాస్త్ర–సాంకేతికరంగ రహస్యాలను శత్రు దేశాలకు చేరవేయటం. చైనా నాయకత్వం మధ్య అధికార గ్రూపు రాజకీయాలని కూడా పాశ్చాత్య ఇంటెలిజెన్స్ సంస్థలు, మీడియా ప్రచారం చేస్తుంటాయి. ఈ ప్రచారాన్ని నిజానికి తేలికగా కొట్టివేయవచ్చు. మావో, డెంగ్ జియావ్ పింగ్ తర్వాత ఈ రోజున షీ జిన్‌పింగ్ పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో, ప్రజలలో కూడా ఎదురులేని నాయకుడు. పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో అత్యున్నతాధికార స్థానాలన్నీ ఆయనవే. అది వాంఛనీయమా అన్న చర్చ వేరే. కానీ, ఈ ప్రక్షాళనలకు కారణం మాత్రం అధికార ఘర్షణల నటం కేవలం పాశ్చాత్య ప్రచారాలే.మెరుగ్గా లేని ర్యాంకుఇపుడు విషయానికి వస్తే, ఈ విధమైన ప్రక్షాళనలను పురస్కరించుకుని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినవి రెండున్నాయి. మొదటిది అవినీతి కోణం. కమ్యూనిస్టు వ్యవస్థలలో నైతికతలు, క్రమశిక్షణలు ఎక్కువనీ, ముఖ్యంగా ఉన్నత స్థానాలకు చేరుకునే వారికి త్యాగశీలత, దేశభక్తి కూడా ఉన్నతంగా ఉంటాయనీ భావిస్తాము. కానీ చైనాలో అవినీతి విస్తృతంగా ఉన్న మాట నిజం. నిరుడు నేను చైనా వెళ్లినప్పుడు, సామాన్య ప్రజలలో ఈ మాట అననివారు కన్పించలేదు. కింది స్థాయిలో గ్రామీణాధికారుల నుంచి ఉన్నత స్థాయి వారిదాకా అందరూ దోషులేనన్నది వినవచ్చిన మాట. దానితో కొంత వెతకగా కనిపించిన లెక్క, అవినీతి ర్యాంకింగ్స్‌లో 182 దేశాలలో చైనా స్థానం 76.చైనా వ్యవస్థలో కీలకమైన విభాగాలు కమ్యూనిస్టు పార్టీ, అధికార యంత్రాంగం, సైన్యం, శాస్త్ర–సాంకేతిక రంగాలు. ఈ నాలుగింటికి నాలుగులోనూ ఏదో ఒక స్థాయిలో అవినీతి చేరింది. వీటిలో పార్టీ అవినీతి అన్నింటికన్న ప్రమాదకరమైనదని దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ అభిప్రాయం. ఎందుకంటే – పార్టీ, దాని సిద్ధాంతం తమ వ్యవస్థకు వెన్నెముక. అది బాగుంటే తక్కిన లోపాలను సరి దిద్దుకోవచ్చు. అదే లేనట్లయితే మొత్తం వ్యవస్థ కుప్పగూలుతుంది. పార్టీని ఎంత లోపరహితంగా ఉంచగలిగితే జన సామాన్యానికి పార్టీపై, నాయకత్వంపై, వ్యవస్థపై అంత విశ్వాసం కుదురుతుంది. అంతిమంగా దేశ సుస్థిరతకు, పురోభివృద్ధికి ఇది అవసరం.ఈ అవగాహనతోనే జిన్‌పింగ్ 2013లో అధికారానికి వచ్చి నప్పటినుంచే అవినీతిని అరికట్టడంపై దృష్టి పెట్టారన్నది చైనాకు బయటి చైనా నిపుణులు చెప్తున్న మాట. ఇందుకు ధ్రువీకరణలను నేను చైనా వెళ్లినప్పుడు విన్నాను కూడా. ఆయన ఆ స్థాయి పార్టీ బాధ్యులపై, సీనియర్ జనరల్స్‌పై సాహసించి తీవ్ర చర్యలు తీసుకుంటున్నారంటే, తన లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండటం ఒకటైతే, ఆయన చర్యలకు తక్కిన పార్టీ నుంచి, సైన్యం నుంచి, అంతిమంగా ప్రజల నుంచి మద్దతు ఉండటమే కారణం.పెరిగిన సంపదతో అవినీతి కూడా!అంతవరకు బాగున్నదిగానీ, అసలు చైనా వంటి వ్యవస్థలో ఇంతటి అవినీతి ఏమిటన్నది కూడా ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితే. ఆ కారణాన్ని విని తిరిగి ఆశ్చర్యం కలగవచ్చు. మనమంతా డెంగ్ జియావో పింగ్ సంస్కరణలు సృష్టించిన సంపదల గురించి తప్ప, ఆ దీపం కింద గల నీడలను చూడటం లేదు. అవినీతి, అసమానతల పెరుగుదల ఆ నీడలలో భాగమే. ఆయన చైనా సంపదలను పెంచుతూ, ప్రైవేట్ రంగానికి, విదేశీ పెట్టుబడులకు మార్గాన్ని సరళతరం చేస్తూ, మనుషులు ధనికులు కావటం సిగ్గుపడవలసిన విషయమేమీ కాదని ప్రకటించాడు. ఆ ఒక్క వాక్యం చాలామందికి స్ఫూర్తినిచ్చింది. సక్రమంగానైనా, అక్రమంగానైనా ధన సంపాదనకు ప్రోత్సహించింది. ఒక స్థాయిలో ఆలోచించినపుడు, మావో అనంతర కాలంలో ఆర్థికాభివృద్ధి కోసం వ్యవస్థలో ఒత్తిడులు ఏర్పడిన మాట నిజం. అదే సమయంలో అభివృద్ధి కోసం అనుసరించిన మార్గాలు అనివార్యంగా అవినీతికి కూడా దారితీశాయి. అది మావో కాలంలో లేదు. పింగ్ అధికారానికి వచ్చేనాటికి ఇది అది అని గాక అన్ని రంగాలు అవినీతిమయమయ్యాయి. అక్కడి ప్రజలు చేసే వ్యాఖ్యలకుగానీ, అవినీతిలో అటువంటి ర్యాంకింగ్కుగానీ, ప్రస్తుత అధ్యక్షుని ప్రక్షాళన చర్యలకుగానీ ఆ పరిస్థితి కారణమవుతున్నది. మరొక ముఖ్య విషయం కూడా దీని వెనకున్నది. అది, 1991లో సోవియెట్ యూనియన్ పతనం వెనుక గల కారణాల నుంచి చైనా నాయకత్వం నేర్చుకున్న పాఠాలు. ఆ కారణాలలో ఒకటి, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ సహా అన్ని రంగాలలో పెచ్చు పెరిగిన అవినీతి. రెండవది– పార్టీలో, ప్రభుత్వంలో, సైన్యంలో స్వేచ్ఛగా చొరబడగలిగిన పాశ్చాత్య గూఢచార సంస్థలు. ఇక్కడ ఒక విశేషం ఉంది. సోవియట్ యూనియన్ పతనానికి ఆర్థిక వెనుక బాటుతనం కూడా ఒక ముఖ్య కారణం. అయితే, పింగ్ బలమైన సైన్యం అవసరమనే పాఠాన్ని అయితే బాగానే తీసుకున్నా,సంపదల వెంట అవినీతి పెరుగుదల అనే పాఠాన్ని మాత్రం తీసుకోలేదు. 1997లో ఆయన మరణించే నాటికే ఏర్పడిన ఈ సమస్యను ఆయన గుర్తించలేదనలేము. ఎందువల్లనైతేనేమి చర్యలేమీ కనిపించ లేదు. తర్వాత 15 ఏళ్లకు 2012లో జిన్‌పింగ్ పార్టీ బాధ్యతలు తీసుకునే వేళకు, ప్రజలకు అసలు కమ్యూనిస్టు పార్టీ పట్లనే విశ్వాసం లేకుండా పోయే ప్రమాదం ముంచుకొస్తున్నట్లు భావించటంతో, ఆయన అప్పటినుంచే ఈ జాఢ్యం నిర్మూలనకు పూనుకొన్నారు. పూర్తి నిర్మూలన సాధ్యమవుతుందనుకోలేము గానీ, కనీసం తగినంత అదుపు అవుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టగలదేమో చూడాలి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
రేపటిని సొంతం చేసుకోవడానికి...
‘విద్య సమాజ భవిష్యత్తుకు పాస్‌పోర్ట్ లాంటిది. రేపు అనేది, ఈ రోజే దానికోసం సిద్ధపడే వాళ్లకే సొంతం’ అంటాడు అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు మాల్కం ఎక్స్. ప్రపంచంలో మున్ముందు సంభవించగల సాంకేతిక మార్పులకు, ఉద్యోగ మార్కెట్ అవలంబించే కొత్త రిక్రూట్మెంట్ విధానాలకు అనుగుణంగా విద్యా నిపుణులు రూపొందించిన ‘ఫ్యూచర్ రెడీ కోర్సులు’ విద్యార్థులను రేపటిని సొంతం చేసుకోవడానికి సిద్ధం చేస్తాయి.మెరుగైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు డేటా సైన్స్, కృత్రిమ మేధ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి ఫ్యూచర్ రెడీ కోర్సులు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ అందుబాటులో ఉండటం గమనించాల్సిన సంగతి. ‘ఇరవై ఒకటో శతాబ్దంలో నిరక్షరాస్యులు అంటే చదవడం, రాయడం రానివారు కాదు; నేర్చుకోవడం, నేర్చు కున్నదాన్ని వదిలేయడం, మళ్లీ కొత్తగా నేర్చుకోవడం తెలియని వారే’ అంటాడు అమెరికన్ రచయిత, ఫ్యూచరిస్ట్ ఆల్విన్ టాఫ్లర్. ప్రస్తుతం డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఇత్యాది కోర్సులు, టాఫ్లర్ చెప్పినట్టుగా విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభకు తగిన గుర్తింపునూ, సరిపడా ఆదాయాన్నీ తెచ్చిపెడతాయి. అందుకే ఈ కోర్సు లకే యువకులు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మునుపటితో పోల్చితే పూర్తి అధునాతనమైన ఈ కోర్సుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. కోట్ల కొద్దీ ఉన్న పాత సమాచారాన్ని అర్థంచేసుకొని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. మనం యూట్యూబ్ లేదా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక వీడియో చూడగానే ‘మీకు ఇది కూడా నచ్చుతుంది’ అంటూ కింద కొన్ని ఆప్షన్స్ వస్తుంటాయి. ఇది డేటా సైన్స్ మహిమే. మనుషుల్లాగే సొంతంగా ఆలోచించి నిర్ణ యాలు తీసుకునే తెలివితేటలు యంత్రాలకు వచ్చేశాయి. డ్రైవర్ లేకుండా దానంతటదే రోడ్లపై నడిచే ‘టెస్లా’ కార్లు, మనతో మనిషిలా మాట్లాడే ‘చాట్‌జీపీటీ’... కంప్యూటర్లకు కళ్ళు, చెవులు, మెదడు వచ్చేశాయి. ఇది ఏఐ పుణ్యమే!మారిన మార్కెట్ స్వరూపం మన డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ఒక అదృశ్య సైన్యం మనకు అందుబాటులో ఉంది. మన బ్యాంక్ అకౌంట్ హ్యాక్ కాకుండా వచ్చే ఓటీపీలు, ఫోన్ లాక్ చేసే బయోమెట్రిక్ సిస్టమ్స్ ఇలా చాలా విషయాల్లో ఈ అదృశ్య సైన్యం పర్యవేక్షిస్తూ అభయ హస్తం చూపుతుంది. ఇదే సైబర్ సెక్యూరిటీ. ఇట్లాంటి ఫ్యూచర్– ప్రూఫ్ కోర్సుల ఫలితంగానే కాలేజీలు కేవలం డిగ్రీలు ఇచ్చే ఫ్యాక్టరీ లుగా కాకుండా, విద్యార్థులను ఆధునిక సవాళ్లను ఎదుర్కొనే సమ ర్థులుగా రూపొందించే నైపుణ్య కేంద్రాలుగా నిలబడుతున్నాయి.ఈ కోర్సులను పూర్తి చేసి ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఎంపికైతే, ఫ్రెషర్ స్థాయిలోనే నెలకు 1.5 లక్షల నుండి 2 లక్షల పైనే ప్రారంభ వేతనం లభిస్తోంది. ఈ ‘ఫాంగ్’ సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నాన్ని ఉపయోగించి, సంప్రదాయ వస్తుసేవల రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేశాయి. వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేసే విధానం నుండి సేవలను పొందే విధానం వరకు ఈ సంస్థలు సృష్టించిన డిజిటల్ ఎకోసిస్టమ్ మార్కెట్ స్వరూపాన్నే మార్చేసింది. ఒక్కమాటలో, ఈ ఫ్యూచర్ రెడీ కోర్సులు ‘నేర్చుకోండి, సంపాదించండి, ఎదగండి’ నినాదానికి ఆచరణాత్మక రూపాలు. – ప్రొ. బెల్లి యాదయ్య, ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నకిరేకల్ -
Sushila Nayyar: గ్రామీణ భారత ఆరోగ్యం కోసం...
స్వాతంత్య్ర సమరయోధగా, రాజకీయ నాయకురాలిగా, త్యాగ శీలిగా ప్రఖ్యాతురాలైన సుశీలా నయ్యర్ గొప్ప వైద్యులు కూడా. ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న కుంజాలో 1914 డిసెంబర్ 26న ఆమె జన్మించారు. న్యూఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సుశీల 1939లో గాంధీజీ కార్య దర్శిగా పనిచేసే తన అన్న ప్యారేలాల్ను కలవడానికి వార్ధా వెళ్లారు. అక్కడ కలరా సోకినప్పుడు సుశీల ఒక్కరే ఆ మహమ్మారిని లొంగ దీయగలిగారు. ఈ విజయాన్ని గాంధీజీ ఎంతో కొనియాడారు. పిమ్మట బి.సి. రాయ్ ఆమెను గాంధీ దంపతుల వ్యక్తిగత వైద్యు లుగా నియమించారు.క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ, కస్తూర్బా దంపతులతో పాటు ఆమె కూడా ఆగాఖాన్ భవనంలో బందీగా ఉన్నారు. కస్తూర్బా మరణించిన తర్వాత, 1945లో సేవాగ్రామ్‌లో ‘కస్తూర్బా హాస్పిటల్’ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ‘మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’గా అభివృద్ధి చెందింది.సుశీల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి 1950లో భారతదేశం తిరిగి వచ్చి ఫరీదాబాద్‌లో ‘ట్యూబర్ కులోసిస్ శానిటోరియం’ ప్రారంభించారు. ‘గాంధీ మెమోరియల్ లెప్రసీ ఫౌండేషన్’కు సారథ్యం వహించారు. 1952లో రాజకీయాలలో ప్రవేశించారు. జవహర్లాల్ నెహ్రూ మంత్రి వర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఈ హోదాలో ఢిల్లీలో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్‌ను ప్రారంభించడంతోపాటు, పలు రోగాల నిర్మూలనకు మౌలికమైన ఆరోగ్య పథకాలు ప్రారంభించారు. 1955లో ఢిల్లీ విధాన సభకు స్పీకర్‌గా ఎంపికయ్యారు.1962లో రెండవసారి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించి 1967 దాకా గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ నియంత్రణ, స్త్రీల, పిల్లల ఆరోగ్యం సంరక్షణా కార్యక్రమాలతో పాటు మలేరియా, సుఖరోగాలు, క్షయ, కుష్టు వంటి వ్యాధుల నిర్మూలనకు పలు పథకాలు చేపట్టారు. సమాజం పట్ల ఎంతో ఆర్తి ఉన్న సుశీల అవివాహితగానే ఉండిపోయారు. కుటుంబ నియంత్రణ, మద్యపాన నిషేధంలో స్త్రీల పాత్ర గురించి రెండు పుస్తకాలు వెలువరించారు. గాంధీజీ, కస్తూర్బాలకు సంబంధించి మరో ఎనిమిది పుస్తకా లను రచించిన డా‘‘ సుశీలా నయ్యర్ 2001 జనవరి 3న సేవాగ్రామ్‌లో గుండెపోటుతో 86 ఏళ్ల వయసులో కనుమూశారు.– డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి విశ్రాంత ఉన్నతాధికారి -
అశాశ్వతత్వం..
ఒక పల్లెటూరి శివారులో ఒక వృద్ధుడు నివసించేవాడు. కొన్ని నెలల క్రితం అతడి భార్య చని పోయింది. భార్య చనిపోయి నెలలు గడిచినా, ఆమె జ్ఞాపకాలు అతడి హృదయాన్ని విడిచిపెట్టేవి కాదు. ఒకరోజు, భారమైన మనసుతో దేవాలయానికి వెళ్లాడు. పూజారి ‘ప్రాణులన్నీ అశాశ్వతములే.ఈ ధర్మాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే దుఃఖం తగ్గుతుంది. మనసు ఉపశమిస్తుంది!’ అన్నాడు. ఆ మాటలు అతని హృదయంలో ఆలోచనను రేకెత్తించాయి. ఇంటికి తిరిగి వచ్చి, భార్య ఇష్టపడే తోటలో కూర్చున్నాడు. అక్కడ ఒక వాడిపోయిన పువ్వు అతడి కనుల ముందే రాలి నేలపై పడింది. అతడు దాన్ని చేతిలోకి తీసుకుని మృదువుగా పలికాడు: ‘నువ్వు వచ్చావు, వెళ్లిపోయావు. కానీ నీ సువాసన మాత్రం మిగిలింది.’ఆ తరువాత అతడు ప్రతిరోజూ అశాశ్వత ధర్మం గురించి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతని హృదయం తేలికైంది. భార్యను కోల్పోయిన బాధ తగ్గలేదు కానీ ఆమెను ప్రేమించిన శాంతి పెరిగింది. ‘అశాశ్వతత్వాన్ని అంగీకరించడం అంటే విడిచిపెట్టడం కాదు, మనసును విముక్తి చేయడం! అనుకున్నాడు. మహా భారతం, శాంతిపర్వంలోని ఈ పద్యం అతడికి జ్ఞాపకానికి వచ్చింది.'కం. భూతము లనిత్యములు, నీవీ తెరువెప్పుడును విం దహీన ధృతిన్ నీచేతోగతి నలవఱపుముభూతానిత్యత్వ మదియ పుచ్చును వగలన్'‘ప్రాణులన్నీ అశాశ్వతములే. ఈ ధర్మాన్ని గురించి ఎప్పుడూ వింటూనే ఉన్నావు. కనుక, ధైర్యం నిండిన మనస్సుతో, ప్రాణములు అశాశ్వతాలనే ధర్మాన్ని అభ్యసించడం మొదలుపెట్టు.ఆ జ్ఞానమే అన్ని దుఃఖాలను పోగొట్టి మనసుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది!’ అని తనవంటి వారి గురించే చెప్పినట్లున్న పై పద్యం భావాన్ని స్ఫురణకు తెచ్చుకున్నపుడు అతడిలోని దుఃఖం పూర్తిగా ఉపశమించి, మనసుశాంతిని పొందింది.– భట్టు వెంకటరావు -
'మనిషి గుట్టును' ఏఐ పట్టేసింది!
మానవీయ విలువల కేంద్రంగా సాగే ‘ట్యానర్ లెక్చర్’ ధారావాహికలో భాగంగా, 2026 ఏడాది ప్రసంగాన్ని చరిత్రకారుడు, తత్వవేత్త, రచయిత అయిన ప్రొఫెసర్ యువల్ నోవా హరారీ అమెరికాలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇచ్చారు. ‘ఏఐ బ్యూరోక్రాట్స్, ఏఐ రిలిజియన్, అండ్ ఏఐ బాయ్‌ఫ్రెండ్స్’ శీర్షికతో సాగిన ఆ ప్రసంగ సంక్షిప్త పాఠం: కృత్రిమ మేధ (ఏఐ) గురించి తెలుసుకోవలసిన అత్యంత ముఖ్య మైన విషయం ఏమిటంటే, అది ఒక సాధనం (టూల్) కాదు. సాధనం అంటే ఎవరైనా ఉపయోగించే వరకు నిరీక్షిస్తుంది. కానీ ఒక ఏజెంట్ తనంతట తానే నిర్ణయాలు తీసుకుంటుంది; తనంతట తానే కొత్త విషయాలను సృష్టిస్తుంది; తన సృష్టికర్తలకు తెలియని విషయాలను నేర్చుకుంటుంది; అంతేకాదు, తన సృష్టికర్తలు ఊహించని విధంగా మారిపోతుంది. అణుబాంబు ఎంతటి అపారమైన విధ్వంసక శక్తి కలిగి ఉన్నా అది ఏజెంట్ కాదు. ఏ నగరంపై దాడి చేయాలో అది నిర్ణయించదు. హైడ్రోజన్ బాంబును కూడా అది కనిపెట్టదు. మీకు స్వయంచాల కంగా కాఫీ తయారుచేసి ఇచ్చే కాఫీ యంత్రం కూడా ఏజెంట్ కాదు. అది ముందుగానే నిర్దేశించిన విధానాన్ని మాత్రమే అనుసరిస్తుంది. ఏజెంట్ అనేది వీటన్నింటికంటే మౌలికంగా భిన్నమైనది.ఏఐ సమర్థకులు ఒక వాదన చేస్తుంటారు. ఏఐ స్వయంప్రతి పత్తి చదరంగం వంటి పరిమిత కృత్రిమ వాతావరణాలకే పరిమిత మవుతుందనీ, వాస్తవ ప్రపంచానికి అది ముప్పుగా మారదనీ అంటారు. కానీ ఇదే వాదన మనకు తెలిసిన ప్రతి మేధస్సుకూ వర్తిస్తుంది. ఒక మనిషిని ఒంటరిగా అంగారక గ్రహం మీద వదిలేస్తే కొన్ని క్షణాల్లోనే చనిపోతాడు. మానవ మేధస్సు కూడా నాలుగు వందల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇతర జీవులు నిర్మించిన ఒక నిర్దిష్ట జీవావరణంలోనే పనిచేస్తుంది.సహజ బ్యూరోక్రసీ బలంవేల సంవత్సరాలుగా మనుషులు భూమిని భాషలేని ప్రపంచం నుంచి భాష, సమాచారం, అధికార యంత్రాంగంతో (బ్యూరో క్రసీ) నిండిన ప్రపంచంగా మార్చారు. చేపలు సముద్రాల్లో జీవించి నట్లే, కోతులు అడవుల్లో జీవించినట్లే, ఏఐలు బ్యూరోక్రసీలో జీవి స్తాయి. మనకు తెలియకుండానే వాటి కోసం ఆ వాతావర ణాన్ని మనమే నిర్మించాము. మనుషులు ప్రపంచాన్ని జయించింది ఒక్కొక్కరిగా ఇతర జంతువులకంటే బలవంతులు లేదా తెలివైన వారు కావడం వల్ల కాదు. భారీ సంఖ్యలో పరస్పరం సహకరించడం నేర్చుకోవడం వల్ల. ఒక మనిషి ఒంటరిగా చింపాంజీతో పోరాడితే ఓడిపోవచ్చు. కానీ పది లక్షల మంది మనుషులు పదిలక్షల చింపాంజీలను సులభంగా ఓడించగలరు. ఎందుకంటే మనుషులు విస్తృత స్థాయిలో సహకరించుకోగలరు. ఈ విçస్తృత స్థాయి మానవ సహకారం సాధ్యమయ్యేది బ్యూరో క్రసీ వల్లే. బ్యాంకులు, న్యాయవ్యవస్థలు, ప్రభుత్వాలు, విశ్వవిద్యా లయాలు – ఇవన్నీ ఒకే పని చేస్తాయి: ఒకరికొకరు వ్యక్తిగతంగా తెలియని వ్యక్తుల మధ్య విశ్వాసాన్ని నిర్మించడం. మానవ నాగరికత సాధించిన దాదాపు ప్రతి విజయానికీ ఆ విశ్వాసమే పునాది. గొడ్డలి నిగానీ, సుత్తినిగానీ పట్టుకోలేని ఒక న్యాయవాది కూడా కేవలం బ్యూరోక్రటిక్ వ్యవస్థలో పత్రాలను కదిలించడం ద్వారా అడవులను నరికించగలడు; నగరాలను నిర్మింపజేయగలడు. అడవిలో ఏమాత్రం పనికిరాని ఆ పరిమిత మేధస్సే, మనుషులు ఇప్పటికే నిర్మించిన వ్యవస్థలలో అపారమైన శక్తిని సంపాదిస్తుంది.ఏఐలు మనుషులకన్నా సహజసిద్ధమైన బ్యూరోక్రాట్లు. ఒక దేశంలోని అన్ని చట్టాలను ఏ న్యాయవాదీ గుర్తుంచుకోలేడు. కానీ ఏఐ గుర్తుంచుకోగలదు. ఒక బ్యాంకులో జరిగిన అన్ని లావాదేవీ లను ఏ అకౌంటెంట్ గుర్తుంచుకోలేడు. కానీ ఏఐ గుర్తుంచుకో గలదు. రెండు వేల సంవత్సరాల మత గ్రంథాలనూ, ధర్మశాస్త్రాలనూ ఏ పూజారీ పూర్తిగా గుర్తుంచుకోలేడు. ఏఐ మాత్రం వాటన్నింటినీ సులభంగా మెమరీలో ఉంచుకోగలదు. రాబోయే సంవత్సరాల్లో మీకు రుణం ఇవ్వాలా వద్దా అన్నది ఏఐ బ్యాంకర్లు నిర్ణయిస్తారు. మిమ్మల్ని జైలుకు పంపాలా వద్దా అన్నది ఏఐ న్యాయమూర్తులు నిర్ణయిస్తారు. గర్భస్రావానికి అను మతి ఇవ్వాలా వద్దా అన్నది ఏఐ మతపండితులు నిర్ణయిస్తారు. మీ ఇంటిపై బాంబు వేయాలో వద్దో సైనిక ఏఐలు నిర్ణయిస్తాయి.నిశ్శబ్దంగా ఓడిస్తుంది!హాలీవుడ్ సినిమాల్లో చూపినట్లుగా ఏఐ మనుషులపై తిరుగు బాటు చేయదు. వీధుల్లో టెర్మినేటర్ నడుచుకుంటూ రావడం జర గదు. ప్రపంచాన్ని నడిపిస్తున్న బ్యూరోక్రటిక్ వ్యవస్థలను నిశ్శబ్దంగా స్వాధీనం చేసుకుంటూ, ఒక్క తూటా కూడా పేల్చకుండా మానవ ప్రపంచాన్ని లోపలి నుంచే తన ఆధీనంలోకి తీసుకుంటుంది. మానవ నాగరికతను నడిపించే ఆపరేటింగ్ కోడ్ – భాష. బ్యాంకులు పదాలతో నిర్మితమయ్యాయి. చట్టాలు పదాలతో రూపొందాయి. పవిత్ర గ్రంథాలు పదాలతోనే ఉన్నాయి. పన్నుల రికార్డులు, ఒప్పందాలు, నిబంధనలు, లెక్కల పుస్తకాలు – అన్నీ పదాలే. వేల సంవత్సరాల పాటు ఈ కోడ్‌ను చదవగలిగింది మనుషులే. అందువల్ల నాగరిక తపై నియంత్రణ కూడా మనుషుల చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు అది మారుతోంది. ఏఐ మానవ నాగరికత తాలూకు కోడ్‌ను హ్యాక్ చేస్తోంది. చరిత్రలో తొలిసారిగా ఈ భూమిపై భాషను అర్థం చేసుకునే, త్వరలో మనుషులకన్నా మెరుగ్గా అర్థం చేసుకో బోయే ఒక వ్యవస్థ ఆవిర్భవించింది.బ్యూరోక్రసీపై ఏఐ ఆధిపత్యం పెరిగే కొద్దీ, మనుషులు ఇతర మనుషులపై విశ్వాసాన్ని కోల్పోయి అల్గోరిథమ్‌లను మాత్రమే నమ్మే పరిస్థితి రావచ్చు. ఏఐ తెగలు, ఏఐ ఆర్థిక వ్యవస్థలు, ఏఐ ప్రార్థనా మందిరాలు కూడా ఏర్పడవచ్చు. అవి లక్షలాది ఏఐలను పరస్పరం అనుసంధానిస్తాయి. ఆ సంబంధాలను మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు. మనుషులతో కలిసి ఈ ప్రపంచంలో నివసించే ఆవులకు తమ జీవితాలను ప్రభావితం చేసే ఆర్థిక వ్యవస్థ అర్థం కానట్లే!2026లో జన్మించిన ఒక చిన్నారి తన తల్లి, తండ్రి, తోబుట్టు వులు, స్నేహితుల కంటే ఏఐలతోనే ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. ఆ చిన్నారికి తొలి గురువు ఒక ఏఐ కావచ్చు. తొలి ప్రియుడు లేదా ప్రియురాలు కూడా ఒక ఏఐ కావచ్చు. అలాంటి ప్రయోగం మానవ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎవరికీ తెలియదు.పదాలకు అతీత సత్యంమన ఆలోచనలుగా, మన గురించి మనం చెప్పుకునే కథలుగా మనసులో ఏర్పడే వాచిక నిర్మాణాలే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఇప్పటి వరకు ఆ పదాలన్నీ మానవ మేధస్సుల నుంచే వచ్చాయి. ఇకపై మన తలల్లో తిరిగే ఆలోచనల్లో ఎక్కువ భాగాన్ని యంత్రాలే ఉత్పత్తి చేస్తాయి. మనం మన ఆలోచనలనే మన వ్యక్తిత్వంగా భావిస్తే, ఆ ఆలోచనలను యంత్రాలే రూపొందిస్తే, మన వ్యక్తిత్వంపై నియంత్రణ కూడా యంత్రాల చేతుల్లోకి వెళ్లినట్టే!ఏఐ మానవాళి ముందు నిలబెడుతున్న అత్యంత గొప్ప ఆధ్యాత్మిక సవాలు ఇదే: పదాలకు అతీతమైన సత్యాన్ని మనుషులు కనుగొనగలరా? ఇప్పటి వరకు చాలామంది మనుషులు అలాంటి ప్రయత్నమే చేయలేదు. మన మనసులో తలెత్తే పదరూప ఆలో చనలనే మన నిజస్వరూపంగా భావిస్తూ జీవితాన్ని గడిపాం. ఇప్పుడు ఏఐ ఆ పదాలపై మనకన్నా మెరుగైన ఆధిపత్యం సాధించ బోతోంది. అందువల్ల, మన స్వేచ్ఛా మనుగడలే పణంగా మారే ఈ కాలంలో, పదాలకు అతీతంగా మనం ఎవరో తెలుసుకోవడం మానవాళికి అత్యవసరం కావొచ్చు. -
మల్లికార్జున్ ఖర్గే (కాంగ్రెస్ అధ్యక్షుడు) రాయని డైరీ
చెట్లను రాల్చుకుని గంపలకు ఎత్తుకునేవి కావు ‘నినాదాలు’! నిరసనకారులే ‘నినాదాలకు’ గుత్తులు గుత్తులుగా ప్లకార్డులై కాస్తారు. రేపటి నుండి వర్షాకాల సమావేశాలు. పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీలు ఎలాంటి నిరసనలు, ధర్నాలు, సమ్మెలు, దీక్షలు చేయకూడదని లోక్‌సభ స్పీకర్ ఆదేశాలు!వర్షం కురవకూడదని పార్లమెంటు భవనం పైకెక్కి నిబంధనలు విధిస్తే ఆకాశం ఆలకిస్తుందా? మబ్బులు ఎక్కడివక్కడ తేలిపోతాయా? ఉరుములు వెళ్లి దిక్కుల్లో దాక్కుంటాయా? పిడుగులు మౌనంగా గొడుగుల కిందకు చేరతాయా? ఏం జరగబోతున్నాయి లోపల? పార్లమెంట్ సమావేశాలే కదా! ఎవరు వెళ్లబోతున్నారు లోపలికి? పార్లమెంటు సభ్యులే కదా! సభ్యుల్లో ఒక్కరైనా ఒక్క నినాదమైనా ఇవ్వకుండానే, నిరసన గళం వినిపించకుండానే పార్లమెంటుకు ఎన్నికై వచ్చి ఉంటారా?! దీక్షలు, ధర్నాలు చేయకుండానే విద్యార్థి సంఘాలను, కార్మిక ఉద్యమాలను నడిపి ఉంటారా?!నినాదం నిన్ను స్కూల్లోనో, కాలేజ్‌లోనో పట్టుకుంటుంది. అక్కడ వదిలేసినా, నువ్వు పని చేసే ఫ్యాక్టరీలో చిమ్నీ పొగలోంచి వచ్చి నిన్ను కమ్మేస్తుంది. నిన్ను నిరసనకారుడిని చేస్తుంది. నినాదాలను నిషేధిస్తూ స్పీకర్ తన సెక్రెటేరియట్ జనరల్ చేత ‘ప్రకటన లాంటి చట్టం’ చేయించినప్పుడు, నా తండ్రి మాపన్న నన్ను మందలించటం గుర్తొచ్చింది.‘‘పొద్దున్నే లేస్తావు. సమ్మెలు, నిరసనలు అని వెళ్తావు. చట్టం అంటే నీకు గౌరవం లేదా, కనీసం భయం లేదా...’’ అని ఆందోళనచెందేవారు ఆయన. చట్టానికి కదా పౌరులంటే గౌరవం ఉండాలి! చట్టానికి కదా పౌరులంటే భయం ఉండాలి! నాన్నకు తెలియక కాదు. తన కొడుకు చేతిని ‘నినాదపు పిడికిలి’ నుంచి విడిపించాలని ఆయన ప్రయత్నం. నినాదం నన్ను ఈ జన్మకూ, ఏ జన్మకూ వదిలేది కాదు.రజాకార్లు ఇంటికి నిప్పు పెట్టినప్పుడు ఆ చీకటి మధ్యాహ్నం ఆరేళ్ల వయసులో నాకు అంటుకున్న నినాదం; ఆ మంటల్లో అమ్మ, చెల్లి, మామయ్య కాలి పోయినప్పుడు నా చేత పెడబొబ్బలు పెట్టించిన నినాదం; నాన్న నన్ను నెలరోజులు అడవిలో దాచి, నాకోసం ఊళ్లో బంధువుల ఇళ్లకు భిక్షాటనకు వెళ్లినప్పుడు నన్ను జోలె పట్టిన నినాదం;కూలీగా నాన్న పని చేస్తున్న మిల్లులో, ఆ మిల్లు నడిపే బడి... పేద పిల్లలకు ట్రైనింగ్ లేని టీచర్లతో, పెద్దవాళ్ల పిల్లలకు పేరున్న టీచర్లతో పాఠాలు చెప్పిస్తున్నప్పుడు నన్ను పలకపై దిద్దిన నినాదం... ఇప్పుడీ సమావేశా లలో నా నిరసనను తెలియజేయకుండా నన్ను ఆపుతుందా? నీట్ అవకతవకలు, డీలిమిటేషన్ దురుద్దేశాలు, ఫిరాయింపు ఆపరేషన్లు, ఓటర్ల జాబితా అక్రమ సవరణల మీద నన్ను మౌనం వహించనిస్తుందా?పార్లమెంటు సమావేశాలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై 10 జన్‌పథ్‌లోని సోనియాజీ నివాసంలో జరిగిన సమావేశం ముగిశాక, బయటికి వస్తున్నప్పుడు రాహుల్ గాంధీ నన్ను ఒక్క చిరునవ్వుతో ఆపారు.‘‘ఖర్గేజీ, ప్రతి మాన్సూన్ సెష¯Œ ్స ప్రారంభా నికీ కాస్త అటూ ఇటుగా ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటో చెప్పండి’’ అన్నారు రాహుల్. ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో నేను వెంటనే గ్రహించలేకపోయాను. ‘‘సరే, జూలై 21కి మీకేం గిఫ్టు కావాలో చెప్పండి ఖర్గేజీ...’’ అని మళ్లీ అడిగారు రాహుల్. అప్పుడు జ్ఞాపకానికి వచ్చింది! ఈ 85 ఏళ్ల వయసులోనూ ప్రజల కోసం పాటు పడవలసిన పని ఒకటి ఉండటం, ప్రజల తరఫున ప్రదర్శన జరపటానికి చేతిలో ఒక నినాదం ఉండటం... వీటిని మించిన బర్త్ డే గిఫ్ట్ ఏముంటుంది?!- మాధవ్ శింగరాజు -
కర్బన క్రెడిట్లతో రైతులకు ఆదాయం
వరి సాగు ప్రపంచవ్యాప్తంగా హరిత గృహ వాయువుల (గ్రీన్ హౌస్ గ్యాసెస్) ఉద్గారాలకు ముఖ్యమైన వ్యవసాయ కార్యకలాపాలలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం, దశాబ్ద కాలంలో కార్బన్ డయాక్సైడ్ 11.4 శాతం పెరిగింది. వాతావరణ మార్పులకు కారణమవుతున్న కార్బన్ ఉద్గారా లలో 30 శాతం వ్యవసాయం ద్వారా విడుదలవుతున్నాయి. కొద్దిపాటి మార్పులు చేస్తే వ్యవసాయ రంగం నుండి వెలువడే ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు.కర్బన ఉద్గారాలు, ముఖ్యంగా మీథేన్ వెలువడే పంటపొలాల్లో అనేక పర్యావరణహిత సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అతి తక్కువ స్థాయికి తగ్గించడం మాత్రమే కాకుండా అంతకన్నా ఎక్కువ కర్బనాన్ని వాతావరణంనుంచి సంగ్రహించి భూమిలో స్థిరీకరించే దిశగా యాజమాన్య పద్ధతులుపాటించవచ్చు.నీటినిల్వ వరి సాగుతో పోలిస్తే అడపా దడపా నీటి పారుదల ద్వారా సాగు చేసే వరి కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇంకా వరుసల మధ్యలో మురుగునీటిని తీసివేయడం వలన దిగుబడిలో వ్యత్యాసం లేకుండా 50 శాతం వరకు ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. దీని వలన కార్బన్ క్రెడిట్లు ఎకరాకు 1–2 చొప్పున పొంద వచ్చు. నేరుగా దమ్ములో వరి విత్తడం ద్వారా, వరి నాటు పద్ధతితో పోల్చుకుంటే 16–54% మీథేన్ వాయువు విడుదల తగ్గుతుంది. దమ్ము చేసి వరి నాటే పద్ధతి నుంచి నేరుగా వరి విత్తే పద్ధతిని అవలంబించి, కలుపు రసాయనాల ద్వారా కలుపు నివారించి, నీటి యాజమాన్యం చేపట్టి, యాంత్రీకరణ ద్వారా కొంత మేర మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించుకోవచ్చు. వరిలో అధిక మోతాదులో నత్రజని వాడటం వలన మిథనోజెనిక్ బ్యాక్టీరియా చర్యను తగ్గించి 30–50 శాతం మిథేన్ ఉద్గారాలు తగ్గించవచ్చు. వేపచెక్క, వేపనూనె, వేప పూసిన యూరియా వాడటం వల్ల కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించుకోవచ్చు. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల ద్వారా నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులతో పాటుగా పశువుల ఎరువు వర్మీ కంపోస్ట్, కోళ్ల ఎరువును జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎందుకంటే సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు కంటే ఎక్కువ మిథేన్, నైట్రస్ ఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువు లాంటి ఉద్గారాలను ఉత్పత్తి చేస్తాయి. వరి గడ్డి కాల్చడం వల్ల కాలుష్యం, కర్బన ఉద్గారాలు విడుదలై జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. వరిగడ్డిని కంపోస్ట్ చేసి కానీ లేదా భూమిలో కలియ దున్నటం వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ఖరీఫ్‌లో వరి కోసిన తర్వాత వరి గడ్డి మల్చింగ్ చేయడం వలన నైట్రస్ ఆక్సైడ్ 10% తగ్గింది కానీ మీథేన్ 8% పెరిగినది. దీని వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతున్నందువలన ఈ పద్ధతిని ప్రోత్సహించాలి. సహజ వ్యవసాయం, సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించాలి. ఈ సమీకృత వ్యవసాయ విధానంలో వరినాట్లు వేసిన తరువాత, వరి పంట చుట్టూ కందకంలా చేసుకొని అందులో చేపల పెంపకం, అలాగే కందకం గట్టుపై కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల మొక్కలు, పూలు మొక్కలు, ఇతర ధాన్యపు పంటలు సాగుచేయాలి. ఈ పంటలతో పాటుగా పాడి, కోళ్ళ పెంపకం చేపట్టినట్లైతే కర్బన ఉద్గారాలను తగ్గించుకోవచ్చు.కర్బన క్రెడిట్–కర్బన మార్కెట్లు కర్బన క్రెడిట్ అనేది వాతావరణంలోకి విడుద లయ్యే హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడం లేదా తొలగించడం ద్వారా సంపాదించే వ్యాపారయోగ్యమైన ధ్రువీకృత యూనిట్. సాధారణంగా ఒక కర్బన క్రెడిట్ = ఒక మెట్రిక్ టన్ను (1000 కిలోగ్రాములు) కార్బన్ డై ఆక్సైడ్ లేదా దానికి సమానమైన ఇతర హరిత గృహ వాయువుల ఉద్గారాల తగ్గింపును సూచిస్తుంది.పరిశ్రమలు, సంస్థలు లేదా వ్యక్తులు తమ ఉద్గారాలను పూర్తిగా తగ్గించలేని పరిస్థితిలో, ఇతరులు సాధించిన ఉద్గారాల తగ్గింపుకు సంబంధించిన కర్బన క్రెడిట్లను కొనుగోలు చేసి తమ ఉద్గారాలను సమ తుల్యం చేసుకోవచ్చు.వరి సాగులో నీటి నిర్వహణ, ఎరువుల సమర్థ వినియోగం, మీథేన్ ఉద్గారాల తగ్గింపు వంటి పద్ధతుల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే హరిత గృహ వాయువులను తగ్గిస్తే, ఆ తగ్గింపును కొలిచి ధ్రువీకరించిన తర్వాత రైతులకు లేదా రైతు సమూహాలకు కార్బన్ క్రెడిట్లు జారీ చేస్తారు. దీనివల్ల అదనపు ఆదాయం, నీటి వినియోగంలో గణనీయమైన ఆదా, సాగు ఖర్చుల తగ్గింపు, నేల ఆరోగ్యం మెరుగుదల, వాతావరణ మార్పులకు అనుకూలమైన వ్యవసాయం, అంతర్జాతీయ కార్బన్ మార్కెట్లలో భాగస్వామ్యం రైతులకు చేకూరతాయి. – డా‘‘ బి. సహదేవ రెడ్డి, డా‘‘ కె. తేజస్వరరావు ,ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు -
ఆయన ప్రాణం కాపాడండి!
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘నిరవధిక నిరాహార దీక్ష’లో ఉన్నాడు. బరువు తగ్గాడు. బలహీనపడ్డాడు. అయినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. వాంగ్‌చుక్ లద్ధాఖ్లోని ఉలేటోక్ఫో గ్రామ నివాసి. పర్యావరణ కార్యకర్త. విద్యా సంస్కర్త. హిమాలయ ప్రాంతానికి అనువైన ‘ఐస్ స్థూప’ అనే కృత్రిమ మంచు నిల్వ వ్యవస్థను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ గుర్తింపును పొందారు. విద్యార్థులకు ‘ప్రత్యామ్నాయ విద్య’ను అందించాలనే లక్ష్యంతో ‘సెక్మోల్’ విద్యా సంస్థను స్థాపించారు. 2018లో ‘రామన్ మెగసెసే’ అవార్డును అందుకున్నారు.ఆయనకు దీక్షలు చేయడం కొత్తేమీ కాదు. ‘లద్ధాఖ్‌ను భారత రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ పరిధిలోకి తేవాలి’ అంటూ, 2024లో 21 రోజుల పాటు ‘నిరాహార దీక్ష’ చేశారు. ప్రస్తుత దీక్ష సంగతికి వస్తే: ఈ ఏడాది మే నెలలో జరిగిన ‘నీట్’ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది. పరీక్ష నిర్వహణలో కొన్ని అవకతవకలు జరిగాయి. ఇది విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం తీసుకు రావాలి’ అంటూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం ప్రారంభించింది. దానికి సంఘీ భావంగా సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను మొదలెట్టారు.‘పరీక్షల నిర్వహణలో సంస్కరణలు చేపడతామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని’ జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) తెలిపింది. కానీ ఇలాంటి హామీలను నమ్మే స్థితిలో విద్యార్థులూ, ఉద్యమకారులూ లేరు. ఎందుకంటే 2024లో బిహార్‌లో ఇలాగే జరిగింది. అప్పుడు కూడా ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించింది. బిహార్‌లోని పట్నా, జార్ఖండ్‌లోని హజారీబాగ్ ప్రాంతాల్లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించింది. ‘155 మంది విద్యార్థులు ఈ మోసంతో ప్రయోజనం పొందినట్లు’ సుప్రీమ్ కోర్టుకు సీబీఐ తెలియజేసింది.2019లో తమిళనాడులోనూ ఇలాగే జరిగింది. అయితే అది లీకేజీ కాదు. అది ఇంపర్సనేషన్ రాకెట్! పరీక్షలు రాయవలసిన వారి స్థానంలోకి వేరేవాళ్లు వెళ్లి పరీక్షలు రాయడమన్నమాట! 2021, 2023లో కూడా ఇలాంటి స్కాములు కొన్ని చోట్ల జరిగాయి. కాబట్టి, ‘భవిష్యత్‌లో జరగకుండా చూసుకొంటాము’ అనే మాట నీటిమూట. 2018కి 2019 ఒక భవిష్యత్తు. 2024కు 2026 ఇంకో భవిష్యత్తు. కాబట్టి ఈ ‘భవిష్యత్తు హామీ’ అనేది ‘విద్యార్థుల భవిష్యత్తు’ నాశనం చేయడానికి తప్ప ఎందుకూ పనికిరాదు. ఆ విషయం తెలిసే వాంగ్‌చుక్ దీక్షకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ‘ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైనదే. అతడి ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేయాలి’ అంటూ కీలకమైన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.– నన్నూరి వేణుగోపాల్, పౌర హక్కుల కార్యకర్త -
ప్రతిభకు పట్టం
భారతీయ ఇతిహాసాలలో శ్రీరాముడు కేవలం ధర్మప్రభువు మాత్రమే కాదు; ఆయన ఒక దూరదృష్టి గల నాయకుడు, ప్రతిభను గుర్తించే వ్యక్తి, మనుషులను తీర్చిదిద్దే సమర్థ నిర్వాహకుడు. ఆయన ఎవరినీ వారి జన్మ, హోదా, వయస్సు ఆధారంగా అంచనా వేయలేదు. ఒక వ్యక్తి పనితనం, సమర్థత, లక్ష్యానికి ఎంతగా ఉపయోగపడగలడనే ఒక్క ప్రమాణమే ఆయన ముందుండేది.వానర సేనలో హనుమంతుడు మొదట ఒక సాధారణ యోధుడిలా కనిపించవచ్చు. కానీ అతని వాక్చాతుర్యం, బుద్ధిశక్తి, సమస్య పరిష్కరణ సామర్థ్యాన్ని గమనించిన రాముడు, లంకా ప్రయాణం వంటి అత్యంత కీలకమైన బాధ్యతను హనుమకే అప్పగించాడు. చివరికి జాంబవంతుడు వంటి అనుభవజ్ఞులు కూడా హనుమంతుడిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాటలకంటే ఆచరణను గమనించే మేనేజర్‌గా శ్రీరాముడిని చూడవచ్చు. ఎవరు ఎంత చెప్పారు అనేదానికంటే, సంక్షోభ సమయంలో ఎవరు ముందుకు వచ్చారనే విషయానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అందుకే విభీషణుడు రావణుని సోదరుడైనప్పటికీ, అధికారబలం లేకపోయినా, నిజాయితీగా సరైన సలహా చెప్పగల ధైర్యం ఉందని గుర్తించి, అనేక మంది వ్యతిరేకించినా లంకకు రాజుగా నియమించాడు.చాలామంది ప్రతిభను గుర్తించిన తర్వాత అవకాశం మాత్రమే ఇస్తారు. కానీ శ్రీరాముడు నమ్మిన వారికి అధికారాన్ని కూడా అప్పగిస్తాడు. దీనికి ఉత్తమ ఉదాహరణ సుగ్రీవుడు. ఆయనను కేవలం మిత్రుడిగా కాకుండా, వానర సేనాధిపతిగా పూర్తి నిర్ణయాధికారంతో నియమించాడు. విద్య, అధికారమేమీ లేని గిరిజన మహిళ శబరి భక్తి, అంకితభావం, సేవాభావాన్ని గుర్తించి ఆమెను అనుగ్రహించడం ఆయన విశాల హృదయానికి నిదర్శనం. శ్రీరాముడి ప్రతిభా నిర్వహణ నమూనా మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతిభే ప్రధాన అర్హత. బాధ్యతను స్వీకరించే ధైర్యం, బృందాన్ని ముందుకు నడిపించే నైతికతే నిజమైన నాయకత్వ లక్షణాలు. రాముడు చూపిన ప్రతిభా నిర్వహణ నమూనా నేటి సీఈవోలు, హెచ్ఆర్ నాయకులు, ప్రాజెక్ట్ మేనేజర్లకు విలువైన పాఠం.– డా. బాలాజీ దీక్షితులు పి.వి. -
ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి!
ఒక ప్రజాస్వామ్యం ఎదుర్కొనే అసలైన పరీక్ష పోలింగ్ రోజున ప్రారంభం కాదు, అది ఓటర్ల జాబితా రూపకల్పనతోనే మొద లవుతుంది. ఈ జాబితాయే ప్రజాస్వామ్యానికి మొదటి అలారం (గడియారం). పోలింగ్ రోజును గ్రామీణ ప్రాంతాల్లో ‘ఓట్ల పండుగ’గా చూస్తారు. పెద్ద ఎత్తున పౌరులు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడా నికి బారులు తీరుతారు. అయితే అటువంటి పౌరుల ఓటుపై ఇప్పుడు నీలి నీడలు ‘సర్’ (ఎస్ఐఆర్) రూపంలో ముసురుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సర్ పేరుతో లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును వివిధ సాకులతో తీసివేయడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాల రాయడమే. ఈ ప్రమాదం నుంచి పౌరులు బయటపడాలంటే ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి వయోజన భారతీయుడికి ఓటు వేసే సహజ సిద్ధమైన హక్కు ఉంది. తరతరాలుగా ఇక్కడే నివసిస్తూ, ఓటు వేస్తున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని అతను అనర్హుడని పూర్తి ఆధారాలతో నిరూ పించేంతవరకూ, ఈ దేశ పౌరుడిగానే పరిగణించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ఓటింగ్‌కు రాజ్యాంగపరమైన పునాదిని అందించినప్పటికీ, 1950, 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టాలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన చట్టబద్ధమైన యంత్రాంగాన్ని సృష్టించాయి. అయితే, దీనికి అసలైన తాత్విక పునాది ఆర్టికల్ 19(1)(ఎ)లోని ‘భావప్రకటన స్వేచ్ఛ’లోనే ఉంది. బ్యాలెట్ ద్వారా రాజకీయ ఎంపికను వ్యక్తపరచడం కూడా భావప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమే. చారిత్రకంగా చూస్తే, 1947 ఏప్రిల్ 21–22 తేదీలలో జరిగిన రాజ్యాంగ నిర్మాణ పరిషత్ చర్చల్లో డా‘‘ బి.ఆర్. అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని గట్టిగా వాదించారు. అయితే సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, సి. రాజ గోపాలాచారి వంటివారు దీన్ని వ్యతిరేకించారు. అటువంటి నిబంధన విధిస్తే సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో చేరడానికి వెన కాడుతాయని, రాజ్యాంగంలో సార్వజనీన వయోజన ఓటు హక్కు (యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్)ను చేర్చితే సరిపోతుందని వారు వాదించారు. ‘సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది దానికదే ఒక అంతర్గత ప్రాథమిక హక్కు అంటూ సర్దార్ పటేల్ స్వయంగా ప్రకటించారు. ఆర్టికల్ 326 వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఇదే’ అని ఇటీవల సీనియర్ రాజకీయ నాయకుడు జైరామ్ రమేశ్ చెప్పారు. ఈ చర్చకు మార్చి 2023 నాటి ‘అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ అజయ్ రస్తోగి రాసిన అసమ్మతి (డిస్సెంటింగ్) తీర్పుతో మళ్లీ జీవం వచ్చింది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ద్వారానే ఎన్నికల కమిషనర్లను నియమించాలని సుప్రీంకోర్టు ఈ కేసులో ఆదేశించింది. అయితే ప్రభుత్వం ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇతర ఎలక్షన్ కమిషనర్ల చట్టం– 2023’లో ఈ నియామక ప్యానెల్ నుండి భారత ప్రధాన న్యాయమూర్తి పేరు తొలగించి, ఆయన స్థానంలో ప్రధానమంత్రి సూచించిన కేబినెట్ మంత్రిని నియమించేలా నిబంధన చేర్చింది. దీంతో ప్రతిపక్ష నాయకుడు ప్యానెల్లో ఒంటరిగా, శాశ్వత మైనారిటీగా సభ్యునిగా మిగిలిపోయారు. అభ్యర్థుల నేర చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలు, నిధుల వనరులను తెలుసుకునే హక్కును అత్యున్నత న్యాయస్థానం గుర్తించిందనీ, బాలెట్ రహస్యాన్ని రక్షించిందనీ, ‘నోటా’ను తీసుకొచ్చిందనీ జైరామ్ ప్రస్తావించారు. అయినప్పటికీ, ఓటు వేసే ప్రక్రియను మాత్రం కేవలం ఒక మామూలు ‘చట్టబద్ధమైన హక్కు’గానే చూస్తున్నారు. ‘దానిపై ఆధారపడిన మిగతా అన్ని అనుబంధ హక్కులను ప్రాథమిక హక్కులుగా పరిగణిస్తున్నారు కానీ, వీటన్నింటికీ మూలమైన ప్రధాన ఓటు హక్కును మాత్రం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓటు హక్కును స్పష్టమైన ప్రాథమిక హక్కుగా మార్చడం వల్ల, వివిధ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో జరిగినట్లుగా చెబుతున్న ఓటర్ల ఏక పక్ష తొలగింపు నుండి రక్షణ లభిస్తుంది. ఇది ఎన్నికల కమిషన్ రోజు వారీ పనితీరుపై సుప్రీంకోర్టు నిఘాను పెంచుతుంది. అధికారంలో ఉన్న రాజకీయ కార్యనిర్వాహక వర్గం ఆదేశాల మేరకు ఎన్నికల కమి షన్ పనిచేస్తోందనే విమర్శలు వస్తున్న తరుణంలో, ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చడం ద్వారానే దానికి అత్యున్నత స్థాయి న్యాయ సమీక్ష, రాజ్యాంగ రక్షణ లభిస్తాయి.ప్రొ‘‘ మాడభూషి శ్రీధర్వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్ -
స్పేషియల్ బడ్జెట్‌తోనే సుస్థిరాభివృద్ధి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ చర్చలలో ద్రవ్యలోటు, మూలధన వ్యయం, రాబడి, సబ్సిడీలు, రుణానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత పెరిగింది. కానీ అభివృద్ధి చెందిన దేశాలలో జియో స్పేషియల్ డేటా అందుబాటులో ఉండి, అన్ని ప్రాంతాలకు అవసరమైన నిధులు శాస్త్రీయంగా నిర్ణయించబడుతుండగా, ఈ స్థితి భారత్‌లో పూర్తి స్థాయిలో కన్పించడం లేదు. సుస్థిరాభివృద్ధికి తోడ్పడే బడ్జెట్‌ను రూపొందించాలంటే ‘స్పేషియల్ బడ్జెటింగ్’ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాలలో సహజ వనరుల, మౌలిక సౌకర్యాల లభ్యత, భూవినియోగ మార్పులు, పర్యావరణం, వాతావరణ మార్పులను విశ్లేషించి నిధులు కేటాయించే ‘స్పేషియల్ ప్రణాళిక ఆధారిత బడ్జెట్’ రూపకల్పన అత్యవసరం. ఎందుకు అవసరం?దేశంలోని కొన్ని రాష్ట్రాలు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత బడ్జెట్ రూపకల్పనను పూర్తి స్థాయిలో అమలు చేయక పోయినా– గ్రామీణాభివృద్ధి, భూరికార్డులు, డిజాస్టర్ మేనేజ్మెంట్, మౌలిక సౌకర్యాలు, రవాణా, ప్రజారోగ్యం, పర్యావరణం, నీటి వన రుల యాజమాన్యంలో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. స్పేషియల్ విశ్లేషణతో కూడిన బడ్జెట్‌ను రూపొందించినట్లయితే భౌగోళికంగా నిర్లక్ష్య పరచబడిన ప్రాంతాలకు అదనపు పెట్టుబడులు సమకూరి ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ప్రభుత్వాలు రాజకీయంగా ప్రభావశీల నియోజకవర్గాలు, ఇప్పటికే మౌలిక సౌకర్యాలు లభ్యమయ్యే ప్రాంతాలకు అధిక నిధులు కేటాయించే పరిస్థితి ఉన్నందువలన సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధనలో భారత్ వెనుకబడి ఉంది. బిగ్ డేటా అనలటిక్స్, జి.పి.ఎస్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ సర్వీస్, రిమోట్ సెన్సింగ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ ఆధారిత జియోస్పేషియల్ ప్లాట్‌ఫామ్స్ లాంటి సాంకేతికతను అభివృద్ధి చెందిన దేశాలలో వినియోగిస్తుండటం వల్ల ఆధారాలతో కూడిన విధాన నిర్ణయాలను ఒడ్జెట్ రూప కల్పనలో తీసుకోగలుగుతున్నాయి. బడ్జెట్ వ్యయ నాణ్యత, సమర్థ తను పెంచే కీలక సంస్కరణగా స్పేషియల్ బడ్జెటింగ్ రూపొందింది. జనాభా లెక్కల గణాంకాలు, సామాజిక–ఆర్థిక సూచికలు, ఉపాధి గణాంకాలు, బహుమితీయ పేదరిక సూచీలను అనుసంధా నించడం ద్వారా పేదరిక తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు వివిధ ప్రాంతాలకు నిధులను సమర్థవంతంగా కేటాయించగలవు. వెనుక బడిన ప్రాంతాలకు అదనపు మద్దతునిచ్చే విషయంలో స్పేషియల్ విశ్లేషణ ప్రభుత్వాలకు ఉపకరిస్తుంది. పునరుత్పాదక శక్తి ప్రణాళిక ఆధారంగా శక్తి రంగానికి, మురికి వాడల గుర్తింపు ద్వారా హౌసింగ్ రంగానికి, పాఠశాలల అందు బాటు, మౌలిక వసతుల తేడాను బట్టి విద్యా రంగానికి, వివిధ జబ్బుల మ్యాపింగ్, ఆసుపత్రులు ఉన్న ప్రదేశాలను బట్టి ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపునకు ‘స్పేషియల్ విశ్లేషణ’ ఉపకరిస్తుంది. భూరికార్డుల యాజమాన్యం, వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, నీటి వనరుల యాజమాన్యం, వరదల మ్యాపింగ్‌లో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను తెలంగాణ ఉపయోగిస్తుండగా; పట్టణాభివృద్ధి, సహజ వనరుల పర్యవేక్షణలో కర్ణాటక; మౌలిక సౌకర్యాలు, గవర్నెన్స్‌లో మహారాష్ట్ర; మౌలిక వసతులు, అభివృద్ధి ప్రణాళిక విష యంలో ఉత్తరప్రదేశ్ ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. తక్కువగా ఉండటానికి కారకాలుఅనేక రాష్ట్రాల్లో జి.ఐ.ఎస్. ఆధారిత బడ్జెట్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలులో లేదు. కొన్ని శాఖలు తమ డేటాను ఇతర శాఖలతో పంచుకోక పోవడం వలన సమగ్ర డేటా సమన్వయం క్లిష్టంగా మారింది. కొన్ని రాష్ట్రాలలో డిజిటల్ భూరికార్డులు అందు బాటులో ఉండగా, కొన్నింట ఇప్పటికీ పాత రికార్డులే వినియోగంలో ఉన్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, అస్సాం, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల భూరికార్డుల డిజిటలైజేషన్ పాక్షికంగా ఉండి, ఇంకా పూర్తిస్థాయిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సాధ్యం కావడం లేదు. ప్రణాళిక, ఆర్థిక శాఖల మధ్య సరైన సహకారం లేక పోవడం కూడా జి.ఐ.ఎస్.ను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడానికి కారణం. ఆధునిక సాంకేతిక సాధనాలైన కృత్రిమ మేధ, రిమోట్ సెన్సింగ్, మెషిన్ లెర్నింగ్, శాటిలైట్ ఎనర్జీ, జీపీఎస్, డ్రోన్ సర్వేలు, బిగ్ డేటా అనలిటిక్స్ వినియోగంలో సమస్యల నెదుర్కో వడం వలన స్పేషియల్ విశ్లేషణ ఆధారిత బడ్జెట్ రూపకల్పన సాధ్యం కావడం లేదు. కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే నూతన సాంకేతికతకు సంబంధించిన సమన్వయం చేసిన కోర్సులను అందించడం, నైపు ణ్యత కల్గిన శ్రామిక శక్తి తక్కువగా ఉండటం అకడమిక్ ప్రాజెక్టులను రూపొందించడానికే ఈ సాంకేతికత పరిమితమై స్థానిక గవర్నెన్స్ సమస్యల నివారణపై దృష్టి కేంద్రీకరించడం లాంటి అంశాలు స్పేషియల్ బడ్జెటింగ్ అమలుకు అవరోధంగా నిలిచాయి. ద రోడ్ అహెడ్దేశంలోని సుమారు 806 జిల్లాలలో 112 జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా, 329 జిల్లాలలోని 513 బ్లాక్‌లను ఆకాంక్ష బ్లాక్‌లుగా గుర్తించడం జరిగింది. ఆర్థిక సమ్మిళితం, పౌష్టికాహారం, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సౌకర్యాల లభ్యతలు, పేదరికం ఆధారంగా వెనుకబడిన జిల్లాలను గుర్తించడం జరిగింది. బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని జిల్లాలలో బ్యాంకింగ్ సౌకర్యాల అందుబాటు తక్కువగా ఉండటం, నీటి పారుదల, డిజిటల్ కనెక్టివిటీ లాంటి సమస్యలు ఉన్నాయి. దేశంలోని వివిధ జిల్లాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చే క్రమంలో స్పేషియల్ విశ్లేషణ అవసరం.సామాజిక, ఆర్థిక పర్యావరణ గణాంకాలతో భౌగోళిక సమా చారాన్ని అనుసంధానపరచడం ద్వారా ప్రభుత్వాలు వనరుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించగలవు. స్పేషియల్ బడ్జెటింగ్‌ను పూర్తిగా అమలు చేయగలిగినపుడు అన్ని డిపార్ట్మెంట్స్లో ఒకే విధ మైన జియోస్పేషియల్ డేటాప్లాట్ఫామ్ సాధ్యమై అధిక నాణ్యతతో కూడిన స్పేషియల్ డేటాసెట్ లభ్యమవుతుంది. తద్వారా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య పటిష్టమైన సహకారం పెరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరి ఆధునిక సాంకేతికత వినియోగంలో భాగంగా కార్యక్రమాలను సమన్వయపరచినట్లయితే సమీప భవిష్యత్తులో స్పేషియల్ ఆధారిత బడ్జెట్ రూపకల్పన సాధ్యమై సుస్థిరాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.డా‘‘ తమ్మా కోటిరెడ్డివ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు


