శ్రీవారి ద్రోహికి శిక్ష తప్పదు! | Sakshi Guest Column On Chandrababu coalition govt and TTD | Sakshi
Sakshi News home page

శ్రీవారి ద్రోహికి శిక్ష తప్పదు!

Jan 18 2026 2:01 AM | Updated on Jan 18 2026 2:01 AM

Sakshi Guest Column On Chandrababu coalition govt and TTD

అభిప్రాయం

ధర్మ ఏవ హతో హన్తి, ధర్మో రక్షతి రక్షితః/తస్మాద్ధర్మో న హంతవ్యో, మా నో ధర్మో హతోవధీత్‌!! ‘ధర్మాన్ని నాశనం చేస్తే, అది చేసిన వాడిని నాశనం చేస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే, అది వారిని రక్షిస్తుంది. అలాగే ధర్మాన్ని ఎప్పుడూ నాశనం చేయకూడదు. ఒకవేళ నాశనం చేస్తే అదే దుర్గతి మనకు సంప్రా ప్తిస్తుంది’ అనేది ఈ శ్లోకం అర్థం. సనాతన ధర్మం (మనుస్మృతి)లో ధర్మ విశిష్టతను చెప్పే శ్లోకం ఇది. ధర్మానికి, న్యాయానికి సర్వలోకమూ నిలువెత్తు కొండగా తిరుమల శ్రీవారిని చూస్తుంది. కష్టమొస్తే, నష్టమొస్తే... ‘కలియుగ దైవమా, పాహిమాం’ అని వేడుకుంటే, ముల్లోకాల్లో శ్రీవారు ఎక్కడున్నా కాపాడుతారని భక్తుల అచంచల విశ్వాసం. అలాంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిపై నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరగణం విషం చిమ్ముతున్నారు. పదివేల శేషుల పడగ లపై ఆసీనులైన శ్రీ మహావిష్ణువుపై తాను విషం చిమ్ముతున్నాననే స్పృహలో లేనంతగా వారికి అహంకారం తలకెక్కిందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

రాజకీయ స్వార్థానికి చివరికి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని సైతం వదిలి పెట్టనంతగా చంద్రబాబులో అవకాశవాదం పెరిగిపోయింది. మా నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, అలాగే ఆయన సైనికులైన మాలాంటి వాళ్లపై రాజకీయ కక్ష తీర్చుకోవ డానికి చంద్రబాబుకు వేరే మార్గాలున్నాయి. కానీ అధికారంలోకి రాక మునుపు, వచ్చిన తర్వాత కూడా తిరుమల శ్రీవారినే చంద్ర బాబు ఎంచుకోవడం తీవ్ర ఆవేదన, ఆందో ళన కలిగిస్తోంది. 

గత ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో తిరుమల శ్రీవారి కేంద్రంగానే దుర్మార్గ రాజకీయాలకు బరి తెగించారని చెప్పడానికి ఆవే దన చెందుతున్నా. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం స్థాయిలో చంద్రబాబు నోరుజారి, స్వామి వారి దృష్టిలో క్షమించరాని నేరానికి పాల్పడ్డారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు శ్రీవారి లడ్డూపై నిందారోపణలు చేయడాన్ని సాక్షాత్తు సర్వోన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టే చీవాట్లు పెట్టింది. ఆ విషయమై నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది.

కల్తీ అయ్యింది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు, చంద్రబాబు మనసు రాజకీంగా కలుషితమైంది. అధికారం కోసం పిల్లనిచ్చిన మామనూ, అలాగే అలవికాని హామీలిచ్చి ప్రజల్నీ వెన్నుపోటు పొడిచారని మాత్రమే ఇంతకాలం చంద్రబాబును విమర్శించే వాళ్లం. కానీ కలియుగ దైవాన్ని కూడా విడిచిపెట్టలేదని లడ్డూ ప్రసాదంపై అత్యంత దుర్మార్గంగా పేద్ద బండలాంటి నింద వేశారని స్పష్టమైంది. ఆ తర్వాత పరకామణిలో చోరీ కేసును కూడా స్వార్థ రాజకీ యాలకు వాడుకుంటున్నారనేది కలియుగ దైవం ఎరిగిన సత్యం. తన అధికారం, మీడియా అండతో లోకం కళ్లు కప్పొచ్చని చంద్రబాబు భావిస్తుండొచ్చు. కానీ సర్వాంతర్యామి అయిన శ్రీవారిని మోసగించలేమని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.

తప్పు జరిగితే వదిలేవారా?
వైసీపీ హయాంలో ఏ తప్పూ జరగకపోయినా, ఏదో జరిగినట్టు ప్రజల్ని మభ్యపెట్టడంలో టీడీపీ, దాని అనుబంధ మీడియా నిమగ్న మైంది. మా హయాంలో తప్పు జరిగి ఉంటే, విడిచిపెట్టే పరిస్థితి ఉంటుందా? అనే ప్రశ్నకు... మాపై నిందలు మోపేవాళ్లు సమా ధానం చెప్పాలి. చిన్న చిన్న తప్పులకే సామాన్య ప్రజలను వీధుల్లో ఊరేగిస్తుండడాన్ని చూస్తున్నాం. అలాంటిది టీటీడీలో మేమే తప్పు చేసి ఉంటే, ఈ పాటికి రాష్ట్రమంతా ఓపెన్‌ టాప్‌ జీపుల్లో ఈ ప్రభుత్వం ఊరేగించి, అవమానించకుండా విడిచిపెట్టేదా?  

టీటీడీలో కొన్ని విభాగాల్లో అధికారుల తీరు వ్యవస్థీకృతమైంది. వాళ్ల తప్పుల్ని కూడా మాపై మోపి, తద్వారా వైసీపీని హిందూమత వ్యతిరేకిగా ముద్ర వేయాలనే అత్యుత్సాహంలో, కోట్లాదిమంది మనోభావాల్ని దెబ్బతీస్తున్నామన్న సంగతిని విస్మరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి తన ఇలవేల్పు అనీ, అపార భక్తిశ్రద్ధలు న్నాయనీ చంద్రబాబు తరచూ చెబుతుంటారు. కానీ మాటలకూ, చేతలకూ పొంతన ఉండదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీటీడీ కేంద్రంగా టీడీపీ తన మీడియాను అడ్డుపెట్టుకుని చేస్తున్న దుష్ప్రచారమంతా, అంతిమంగా హిందువుల మనో భావాల్ని దెబ్బతీసేదే!

అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే, ఆ తర్వాత మా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆయన్ను అవినీతి కేసులో అరెస్ట్‌ చేసింది. అయితే మళ్లీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని, అధికా రుల్ని బెదిరించి, ప్రలోభపెట్టి తప్పుడు నివేదికలతో కేసులన్నీ కొట్టే యించుకుంటున్న చంద్రబాబు, స్వామివారి హుండీ సొమ్మును దొంగిలించడం తప్పని పశ్చాత్తాపం చెంది... కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని శ్రీవారి పేరుతో రాయించిన రవికుమార్‌ తీరులో  ఆలోచించాలి. కనీసం పరకామణి చోరీ నిందితుడిలో కనిపించిన పశ్చాత్తాపం కూడా, ప్రజల సొమ్మును కొల్లగొట్టిన చంద్రబాబులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈ కేసులో చంద్రబాబు రాజకీయ స్వార్థానికి సతీశ్‌కుమార్‌ అనే నిజాయతీ కలిగిన సీఐ బలి అయ్యారు. ఇక్కడ బలి అయ్యింది కేవలం సీఐ మాత్రమే కాదు... ధర్మం, న్యాయం అనే సంగతిని మరిచిపోవద్దు. భార్య, ఇద్దరు చిన్నారులున్న సతీశ్‌కుమార్‌ కుటుంబ సభ్యుల ఉసురు తగలక మానదు. అలాగే చాలామంది అధికారుల్ని మానసికంగా తీవ్రంగా వేధిస్తుండడం బహిరంగ రహస్యమే. అధికారులతో పాటు రాజకీయంగా మాపై వేధింపులు కాస్తా, కక్షగా మారి, సమాజ బహిష్కరణ చేయాలనే బీఆర్‌ నాయుడి అహంకారపూరిత పిలుపు దిగ్భ్రమ కలిగిస్తోంది. ‘ఇలాంటి వాళ్లా అత్యంత ప్రతిష్ఠాత్మక టీటీడీకి చైర్మన్‌?’ అనే ప్రశ్న సమాజం మనసును తొలిచేస్తోంది.

గోశాల గోవుల మరణాలు
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే గోశాలలో వందలాది గోవుల మర ణాలకు చంద్రబాబు, ఆయన నియమించిన బీఆర్‌ నాయుడి నేతృత్వంలోని పాలక మండలి మూల్యం చెల్లించుకోక తప్పదు. శ్రీవారిపై భక్తిశ్రద్ధలతో గోవుల మరణాలను నేను వెలుగులోకి తీసుకొస్తే, తప్పుల్ని సరిదిద్దుకోడానికి బదులు ఎదురు దాడికి దిగడం దివాళాకోరుతనాన్ని చూపుతోంది. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెప్పి, అంతిమంగా నేను చెప్పింది నిజమే అని నిర్ధారించడం వాస్తవం కాదా? అసలు గోవును తల్లిగా భావించి, పూజించే పుణ్య భూమి, కర్మ భూమి మనదనే  వాస్తవం తెలియక పోవడం మన దురదృష్టం.

ఇక టీటీడీలో అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీవారిని దర్శించుకోడానికి క్యూ కాంప్లెక్స్‌లలో ఉన్న భక్తులకు ఉచితంగా అందాల్సిన ప్రసాదాలను, దళారులు అమ్ముకుంటున్నది వాస్తవం కాదా? అలాగే టీటీడీలో టికెట్లను బ్లాక్‌ మార్కెట్‌లో యథేచ్ఛగా విక్రయించే దందా సాగుతోంది. ఇదే మా హయాంలో బ్లాక్‌ మార్కెట్‌లో టికెట్ల విక్రయానికి సంబంధించి ఎమ్మెల్సీని అరెస్ట్‌ చేశాం. అలాగే కొండపై నుంచి బ్లాక్‌ మార్కెట్లో టికెట్ల దళారుల్ని తరిమికొట్టి, స్వామిపై మా భక్తి ఏంటో చేతల్లో చూపాం. మరి మీ హయాంలో చేస్తున్నదేంటో, కొండపై అడుగడుగునా కనిపించే దళారుల దాష్టీకాలే నిదర్శనం.

తిరుమల కొండపై అన్యమత ప్రచారం మాత్రమే అపచారం కాదు. కొండపై అవినీతి కూడా అపచారమే! బీఆర్‌ నాయుడి కార్యా లయం కేంద్రంగా సాగుతున్న అవినీతి అపచారం అంతా ఇంతా కాదు. దళారులంతా సిండికేట్‌గా ఏర్పడి, భక్తుల్ని ఇష్టానుసారం దోచుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చి, ఆనందంగా తిరుగు ప్రయాణం కావాల్సిన భక్తులు... దోపిడీకి గురయ్యామన్న ఆవేదనతో వెనుదిరగడం వాస్తవం కాదా? కంచే చేను మేసిన చందంగా, టీటీడీలో అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యతల్లో ఉంటూ, వాళ్లే దళారులుగా మారితే ఇక చెప్పడానికి ఏముంటుంది?

అలాగే అలిపిరి సమీపంలో రోడ్డుపక్కన 12 అడుగుల విష్ణు మూర్తి విగ్రహం అత్యంత దయనీయ స్థితిలో ప్రత్యక్షం కావడం కోట్లాది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. ఈ వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చిన పాపానికి నాపై కేసు పెట్టడం, అలాగే పోలీసులు విచారించడం దేనికి సంకేతం? సత్యం చెప్పినందుకు చరిత్రలో కళ్లు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లెందరో ఉన్నారు. అందుకే నేనెంతగానో ఇష్టపడే శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠకు భంగం కలిగితే ప్రాణాలు పోయేంత వరకూ నిజాలు మాట్లాడు తూనే ఉంటానని గతంలో చెప్పాను. ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నాను.

కొండపై మద్య మాంసాలు యథేచ్ఛగా దొరుకుతుండడం కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? ఈ మధ్య కాలంలో తిరుమల పోలీస్‌ గెస్ట్‌హౌస్‌ సమీపంలో మద్యం బాటిళ్లు కనిపిస్తే, వాటిని వీడియో తీసిన వ్యక్తిని, అలాగే సాక్షి ఫొటోగ్రాఫర్‌ని నిందితులుగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ దురాగతానికి నిదర్శనం కాదా? ఇదే విషయమై ఆ రోజు తిరుపతి ఎస్పీ పీఆర్వో విడుదల చేసిన ప్రకటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాయంత్రానికి మాట మార్చడాన్ని ఏమనాలి?  

వాస్తవాలు చెప్పడం దేశద్రోహమా?
అత్యంత పవిత్రమైన, హిందువుల ఆధ్మాత్మిక రాజధాని క్షేత్రమైన తిరుమలను మద్యం, మాంసప్రియులు, దళారులకు వది లేసి, వాస్తవాలను చెప్పిన వారిపై దేశద్రోహం కేసు పెట్టడం దుర్మార్గం. అయితే న్యాయదేవత కళ్లు తెరిచి, ఆగ్రహించడంతో ఆ కేసు గాలిలో కలిసిపోయింది. శ్రీవారి విషయంలో ద్రోహి ఎవరో ప్రతి హిందువుకూ తెలుసు. కేవలం తన పార్టీకి ప్రచారకర్తగా పని చేసిన టీవీ ఛానల్‌ అధిపతికి ప్రతిష్ఠాత్మక టీటీడీ చైర్మన్‌ పదవి కట్టబెట్టి, స్వామివారికి చంద్రబాబు మొదటి అపచారం చేశారు. టీటీడీ చైర్మన్‌గా శ్రీవారికి సేవ చేయడానికి బదులు, ఇంకా తాను చంద్రబాబు భక్తి ఛానల్‌ చైర్మన్‌ అనే మాయలోనే బీఆర్‌ నాయుడు ఉన్నారు.

అందుకే కొండపై నిత్యం స్వామి వారికి అపచారం. అంతెందుకు సీఎంవో నుంచి నిత్యం వచ్చే సిఫార్సు లేఖలెన్ని? టీటీడీ చైర్మన్‌ కార్యాలయం నిత్యం ఇస్తున్న వివిధ రకాల దర్శనాలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తే, స్వామి వారి విషయంలో వ్యాపారం చేసుకుంటున్నదెవరో తేలి పోతుంది. వాటికి సంబంధించి గోప్యత పాటిస్తున్నారంటే, ఏదో తప్పు చేస్తున్నారనే కదా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. స్వామి వారి చెంత దర్శ నాలకు సంబంధించి పారదర్శకత లేక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. టీటీడీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి దాపరికాలు లేవు.

ఏడాదిన్నర చంద్రబాబు పాలనను గమనిస్తే మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. బాబు బ్రాండ్‌తో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువెత్తుతున్నాయని, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయని... లేనివి ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని కూటమి సర్కార్‌ చూపుతోంది. మూడో విషయానికి వస్తే, తిరుమల కేంద్రంగా, అలాగే వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు, ఆయన్ను మోసే మీడియా ఒక తప్పుడు ఎజెండాతో ముందుకెళు తోంది. ఈ కుట్రల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం.

సంస్కరణలా? ఇబ్బందులా?
సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, మొట్టమొదట శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఆ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్‌లో సంస్కరణలకు తిరుమల నుంచే శ్రీకారం చుడుతున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. మా హయాంలో తిరుమ లలో అన్యమత ప్రచారం జరిగిందని, ఇంకా లేనిపోని నిందలన్నీ వేసి రాజకీయ లబ్ధి పొందారు. కానీ సంస్కరణలు కాదు కదా భక్తులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వైకుంఠద్వార దర్శనం రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నారు. 

తిరుమల అంటే భక్తుల్లో భయాన్ని కలిగించి, ఏడుకొండలపైకి వెళ్లకుండా చేయడంలో టీటీడీ చైర్మన్, ఇతర అధికారులు విజయవంతం అయ్యారంటే అతిశయోక్తి కాదు. గత వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోని కారణంగా... ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టీటీడీ చరిత్రలో ఇదో మాయని మచ్చ. ఇదంతా చంద్రబాబు నియమించిన టీటీడీ పాలక మండలి, అధికారుల చేతకానితనం వల్ల ఏర్ప డిన విపత్తు. అంతే కాదు, టీటీడీ చైర్మన్‌ చిన్నపిల్లాడిలా ఉన్నతాధి కారులతో గొడవ పడుతూ, పరిపాలన సవ్యంగా సాగనివ్వని పరిస్థితిని సృష్టించడం నిజం కాదా? 

‘ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు’ అని చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తుంటారు. బహుశా ఆయన ఈ హెచ్చరిక తనకు వర్తించదని అనుకుంటున్నారేమో! కలియుగ దైవమైన శ్రీవారికి అపచారం చేయడంలోనూ, అప్రతిష్ఠ కలిగేలా వ్యవహరించడంలోనూ చంద్రబాబు తర్వాతే ఎవరైనా, ఏమైనా! శ్రీవారి ఆది అంతాల ద్రోహి ఆయనే. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని నాలాంటి వాళ్లు వెలికితీస్తే... అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేశద్రోహం కేసులు పెట్టడానికి అత్యుత్సాహం ప్రదర్శి స్తున్నారు.

కానీ ఆ వైకుంఠవాసుడు తనను ద్రోహిగా చూస్తున్నాడని ఇప్పటికైనా చంద్రబాబు గుర్తించి, భయ భక్తులతో మెలిగితే మంచిది. శిశుపాలుడికి శిక్ష విధించడానికి వంద తప్పుల్ని శ్రీకృష్ణ భగవానుడు లెక్కించారు. టీటీడీ కేంద్రంగా చంద్రబాబు తప్పుల్ని కూడా మహావిష్ణువు లెక్కిస్తుంటారు. బాబు నేతృత్వంలో స్వామి వారికి చేస్తున్న ద్రోహానికి, శిక్షించే సమయం మరెంతో దూరం లేదు. రాజకీయాల్లో అధర్మాన్ని నమ్ముకున్న చంద్రబాబును... చివరికి అదే నాశనం చేస్తుంది. ఇదే ప్రకృతి ధర్మం!


భూమన కరుణాకరరెడ్డి 
వ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement