ఖమేనీ హత్యకు ఇలా ప్లాన్‌.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి | Israel Says Netanyahu set goal in November to kill Khamenei | Sakshi
Sakshi News home page

ఖమేనీ హత్యకు ఇలా ప్లాన్‌.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి

Mar 6 2026 10:55 AM | Updated on Mar 6 2026 11:06 AM

Israel Says Netanyahu set goal in November to kill Khamenei

టెలీ అవీవ్‌: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. ఇరాన్‌ సైతం ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేశాలను టార్గెట్‌ చేసి బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీకి హత్య ప్లాన్‌కు సంబంధించిన కీలక వివరాలను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వెల్లడించారు. ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్‌లోనే నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్‌ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చే లక్ష్యాన్ని గత ఏడాది నవంబర్‌లోనే నిర్ణయించుకున్నాం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో కలిసి జరిగిన అత్యంత రహస్య భద్రతా సమావేశంలో ఆ లక్ష్యాన్ని నిర్ణయించాము. మొదట ఆ ఆపరేషన్‌ను 2026 మధ్యలో అమలు చేయాలని భావించినప్పటికీ, ఇరాన్‌లో నెలకొన్న అంతర్గత అస్థిరత కారణంగా దాడి సమయాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వ్యూహాన్ని అమెరికాకు కూడా వెల్లడించాం’ అని తెలిపారు.

అలాగే.. ఇరాన్‌లో మతపెద్దల పాలనపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో వారు ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలపై దాడులకు దిగే అవకాశముందని భావించి ముందస్తు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్, ఎపిక్ ఫ్యూరీ ప్రారంభ దశలోనే ఈ లక్ష్యాన్ని అమలు చేసినట్లు సమాచారం. ఒక సార్వభౌమ దేశ అత్యున్నత నాయకుడిని వైమానిక దాడి ద్వారా హతమార్చడం ఇదే మొదటిసారి అని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఈ చర్యను సమర్థించుకుంటోంది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, అణు కార్యక్రమం తమ దేశానికి అస్తిత్వ ముప్పుగా మారిందని చెబుతోంది. అందుకే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా బలహీనపరచడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement